కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ప్రేమను చల్లారనివ్వకండి

మీ ప్రేమను చల్లారనివ్వకండి

“చెడుతనం పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రేమ చల్లారిపోతుంది.”మత్త. 24:12.

పాటలు: 23, 24

1, 2. (ఎ) మత్తయి 24:12 లోని యేసు మాటలు మొదటిగా ఎవరికి వర్తిస్తాయి? (బి) మొదటి శతాబ్దంలోని చాలామంది క్రైస్తవులు తమ ప్రేమను చల్లారిపోకుండా చూసుకున్నారని అపొస్తలుల కార్యముల పుస్తకం బట్టి ఎలా చెప్పవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 “ఈ వ్యవస్థ ముగింపు” దగ్గరపడిందని ప్రజలు గుర్తించడానికి సహాయపడే సూచనను యేసు భూమ్మీదున్నప్పుడు ఇచ్చాడు. ఆ సూచనలో ఒక భాగమేమిటంటే, ‘చాలామంది ప్రేమ చల్లారిపోవడం.’ (మత్త. 24:3, 12) మొదటి శతాబ్దంలోని యూదులు తాము దేవుని ప్రజలమని చెప్పుకున్నారు. కానీ నిజానికి దేవునిపై వాళ్లకున్న ప్రేమ చల్లారిపోయింది.

2 అయితే ఆ కాలంలోని చాలామంది క్రైస్తవులు మాత్రం ఉత్సాహంగా “యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ” ఉన్నారు. ఆ విధంగా వాళ్లు దేవునిపై, తోటి సహోదరులపై, చివరికి సత్యం తెలియని వాళ్లపై కూడా తమకు ప్రేమ ఉందని చాటిచెప్పారు. ఆ క్రైస్తవులు దేవునిపై తమకున్న ప్రేమ చల్లారిపోకుండా చూసుకున్నారని చెప్పవచ్చు. (అపొ. 2:44-47; 5:42) కానీ విచారకరంగా, ఆ కాలంలోని కొంతమంది క్రైస్తవులకు దేవునిపై ఉన్న ప్రేమ చల్లారిపోయింది. అలాగని మనకెలా తెలుసు?

3. ఎఫెసులోని క్రైస్తవుల్లో ఏ కారణంవల్ల ప్రేమ చల్లారిపోయి ఉండవచ్చు?

3 ఎఫెసులోని తొలి క్రైస్తవులతో యేసు ఇలా అన్నాడు, “మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలేశావు.” (ప్రక. 2:4) ఎఫెసులోని ప్రజలు ఎక్కువగా తమ సుఖాల మీదే మనసుపెట్టి ఉండవచ్చు. బహుశా అలాంటి ప్రజల ప్రభావం పడి ఎఫెసులోని క్రైస్తవుల్లో ప్రేమ చల్లారిపోయి ఉంటుంది. (ఎఫె. 2:2, 3) అప్పట్లో ఎఫెసు సంపన్న నగరం. అక్కడి ప్రజలు తమ సుఖాలకు, సౌకర్యాలకు తప్ప దేనికీ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు కాదు. అంతేకాదు ఆ నగరంలోని చాలామంది విచ్చలవిడిగా జీవిస్తూ దేవుని నియమాల్ని గౌరవించేవాళ్లు కాదు. వాళ్లు ఎప్పుడూ తమ సరదాల గురించే ఆలోచించేవాళ్లు. అంతేగానీ దేవునిపై, ఇతరులపై నిస్వార్థమైన ప్రేమ చూపించాలనే ఆలోచనే వాళ్లకు ఉండేది కాదు.

4. (ఎ) మనకాలంలోని ప్రజల్లో కూడా ప్రేమ చల్లారిపోయిందని ఎలా చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో దేనిగురించి చర్చిస్తాం?

4 ప్రేమ చల్లారిపోవడం గురించి యేసు చెప్పిన మాటలు మనకాలానికి కూడా వర్తిస్తాయి. ప్రజలకు దేవునిపై ఉన్న ప్రేమ రోజురోజుకూ అడుగంటిపోతోంది. నేడు లక్షలాదిమంది, లోకంలోని సమస్యల పరిష్కారం కోసం దేవుని వైపు చూసే బదులు మానవ సంస్థల వైపు చూస్తున్నారు. అవును, ప్రేమ చల్లారిపోతోంది. ఒకప్పుడు ఎఫెసులోని క్రైస్తవుల్లో ప్రేమ తగ్గిపోయినట్లే ఇప్పుడున్న యెహోవా సేవకుల్లో కూడా ప్రేమ తగ్గిపోవచ్చు. కాబట్టి (1) యెహోవాపట్ల, (2) బైబిలు సత్యంపట్ల, (3) తోటి సహోదరసహోదరీల పట్ల మనకున్న ప్రేమను ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవాపట్ల ప్రేమ

5. మనం దేవున్ని ఎందుకు ప్రేమించాలి?

5 మనం ఎవర్ని ఎక్కువగా ప్రేమించాలి? యేసు ఇలా చెప్పాడు, “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.’ ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా.” (మత్త. 22:37, 38) దేవునిపై మనకు ప్రేమ ఉంటేనే, ఆయనిచ్చిన ఆజ్ఞల్ని పాటించగలుగుతాం, కష్టాల్ని సహించగలుగుతాం, చెడును ద్వేషించగలుగుతాం. (కీర్తన 97:10 చదవండి.) కానీ దేవునిపై మనకున్న ప్రేమ తగ్గిపోయేలా చేయడానికి సాతాను, అతని ప్రజలు ప్రయత్నిస్తుంటారు.

6. స్వార్థానికి మొదటి స్థానమిస్తే ఏమి జరుగుతుంది?

6 లోకంలోని ప్రజలు వేరే విషయాలపై ప్రేమ పెంచుకుంటున్నారు. వాళ్లు దేవున్ని ప్రేమించే బదులు ‘స్వార్థపరులుగా’ ఉంటున్నారు. (2 తిమో. 3:2) ‘శరీరాశ, నేత్రాశ, వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం’ వంటి వాటిపైనే మనసుపెడుతున్నారు. (1 యోహా. 2:16) అయితే మన స్వార్థానికే మొదటి స్థానమిస్తే ఏమి జరగవచ్చో అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. అతనిలా చెప్పాడు, “శరీర కోరికల మీద మనసుపెడితే మరణాన్ని పొందుతాం.” ఎందుకు? ఎందుకంటే అలాంటివాళ్లు దేవునికి శత్రువులౌతారు. (రోమా. 8:6, 7) డబ్బు సంపాదించడం లేదా శరీర కోరికలు తీర్చుకోవడం పైనే మనసుపెట్టిన వాళ్లకు చివరికి బాధ, నిరాశే మిగిలాయి.—1 కొరిం. 6:18; 1 తిమో. 6:9, 10.

7. ఈ రోజుల్లో క్రైస్తవులపై ఎలాంటి ప్రభావం పడవచ్చు?

7 దేవుడు లేడని నమ్మేవాళ్లు, దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకోవడం అసాధ్యమని నమ్మేవాళ్లు, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వీళ్లు తమ బోధల ద్వారా, ప్రజలు దేవున్ని ప్రేమించకుండా చేయాలని లేదా ఆయన ఉన్నాడని నమ్మకుండా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు కేవలం తెలివితక్కువవాళ్లు లేదా చదువులేనివాళ్లే దేవుడున్నాడని నమ్ముతారని చెప్తుంటారు. పైగా చాలామంది సృష్టికర్త కన్నా శాస్త్రవేత్తలనే ఎక్కువగా గౌరవిస్తారు. (రోమా. 1:25) వీళ్లందరి ప్రభావం క్రైస్తవులమైన మనపై కూడా పడవచ్చు. అలా జరిగితే, యెహోవాతో మన స్నేహం పాడవ్వవచ్చు, ఆయనపై మనకున్న ప్రేమ తగ్గిపోవచ్చు.

8. (ఎ) ఎలాంటి పరిస్థితులవల్ల యెహోవా ప్రజలు నిరాశపడే అవకాశం ఉంది? (బి) 136వ కీర్తన మనకు ఎలాంటి ఓదార్పునిస్తుంది?

8 మనం సాతాను దుష్టలోకంలో జీవిస్తున్నాం కాబట్టి నిరాశపడే సందర్భాలు మనకు ఎన్నో ఎదురౌతుంటాయి. (1 యోహా. 5:19) ఒకవేళ మనం ఆ నిరాశలో పూర్తిగా కూరుకుపోతే, మన విశ్వాసం బలహీనపడవచ్చు, దేవునిపై మన ప్రేమ తగ్గిపోవచ్చు. ఉదాహరణకు వయసు పైబడడం వల్లో, అనారోగ్యం వల్లో, ఆర్థిక ఇబ్బందుల వల్లో మనకు సమస్యలు రావచ్చు. లేదా కొన్ని పనుల్ని మనం అనుకున్నంత బాగా చేయలేకపోతున్నందుకు బాధపడవచ్చు. జీవితంలో కొన్ని మనం అనుకున్నట్లుగా జరగనందుకు నిరాశపడవచ్చు. సమస్య ఏదైనప్పటికీ, యెహోవా మనల్ని విడిచిపెట్టేశాడని ఎన్నడూ అనుకోకూడదు. కీర్తన 136:23⁠లో ఉన్న ఓదార్పుకరమైన ఈ మాటల గురించి ఆలోచించండి: “మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును.” కాబట్టి యెహోవా మన ‘విన్నపాలను’ వింటాడని, మనకు జవాబిస్తాడని పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 116:1; 136:24-26.

9. దేవునిపై తనకున్న ప్రేమను పెంచుకోవడానికి పౌలుకు ఏది సహాయం చేసింది?

9 దేవుని సేవకుడైన అపొస్తలుడైన పౌలు యెహోవా తనకెలా అండగా నిలిచాడో లోతుగా ఆలోచించేవాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బలంగా ఉండడానికి అదే అతనికి సహాయం చేసింది. అతనిలా రాశాడు, “నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?” (హెబ్రీ. 13:6) యెహోవాపై నమ్మకం ఉండడం వల్లే జీవితంలో ఎదురైన సవాళ్లన్నిటినీ అతను ఎదుర్కోగలిగాడు. కష్టాలు వచ్చినప్పుడు యెహోవాపై ఉన్న నమ్మకాన్ని పౌలు వదులుకోలేదు. జైల్లో ఉన్నప్పుడు కూడా అతను తన పత్రికల ద్వారా తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (ఎఫె. 4:1; ఫిలి. 1:7; ఫిలే. 1) వచ్చిన కష్టం ఎలాంటిదైనా యెహోవాపై తనకున్న ప్రేమను పౌలు పెంచుకుంటూనే ఉన్నాడు. ‘మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదార్చే’ దేవునిపై పౌలు ఆధారపడ్డాడు. (2 కొరిం. 1:3, 4) మరి పౌలును మనమెలా అనుకరించవచ్చు?

యెహోవాపట్ల ప్రేమ పెంచుకోండి (10వ పేరా చూడండి)

10. యెహోవాపట్ల మనకున్న ప్రేమ తగ్గిపోకుండా కాపాడుకోవడానికి సహాయం చేసే ఒక మార్గం ఏమిటి?

10 దేవునిపై మనకున్న ప్రేమ తగ్గిపోకుండా కాపాడుకోవడానికి సహాయం చేసే ఒక మార్గం గురించి పౌలు వివరించాడు. అతనిలా రాశాడు, “ఎప్పుడూ ప్రార్థించండి.” తర్వాత ఇలా కూడా రాశాడు, “పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి.” (1 థెస్స. 5:17; రోమా. 12:12) ప్రార్థన ఎలా మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది? ప్రార్థన చేయడమంటే మనం యెహోవాతో మాట్లాడుతున్నట్లు. ఆయనతో మంచి సంబంధం కలిగివుండడానికి అది మనకు సహాయం చేస్తుంది. (కీర్త. 86:3) మన హృదయలోతుల్లో ఉన్న ఆలోచనల్ని, భావాల్ని మన పరలోక తండ్రికి చెప్పుకున్నప్పుడు ఆయనకు మరింత దగ్గరౌతాం. (కీర్త. 65:2) అంతేకాదు మన ప్రార్థనలకు యెహోవా జవాబివ్వడాన్ని చూసినప్పుడు ఆయనపై మనకున్న ప్రేమ ఇంకా పెరుగుతుంది. “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి” యెహోవా దగ్గరగా ఉన్నాడనే నమ్మకం మనకుంది. (కీర్త. 145:18) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనకు అండగా ఉంటాడని మనం నమ్మాలి. అలా నమ్మితే ఇప్పుడూ అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం.

బైబిలు సత్యంపట్ల ప్రేమ

11, 12. బైబిలు సత్యంపట్ల మన ప్రేమ ఎలా పెంచుకోవచ్చు?

11 క్రైస్తవులముగా మనం సత్యాన్ని ప్రేమిస్తాం. ఆ సత్యం మనకు దేవుని వాక్యంలో దొరుకుతుంది. యేసు తన తండ్రితో ఇలా అన్నాడు, “నీ వాక్యమే సత్యం.” (యోహా. 17:17) బైబిలు సత్యాన్ని ప్రేమించగలగాలంటే, బైబిల్లో ఏముందో మనకు తెలియాలి. (కొలొ. 1:10) అది మాత్రమే సరిపోదు. మనం ఇంకా ఏమి చేయాలో అర్థంచేసుకోవడానికి 119వ కీర్తన రచయిత ఎలా సహాయం చేస్తున్నాడో గమనించండి. (కీర్తన 119:97-100 చదవండి.) అవును, బైబిల్లో చదివిన వాటిగురించి మనం రోజంతా లోతుగా ఆలోచించాలి. బైబిలు సత్యాన్ని మన జీవితంలో ఎలా పాటించవచ్చో ఆలోచించినప్పుడు ఆ సత్యంపట్ల మన ప్రేమ మరింత ఎక్కువౌతుంది.

12 కీర్తనకర్త ఇంకా ఇలా అన్నాడు, “నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.” (కీర్త. 119:103) దేవుని సంస్థ తయారుచేసే బైబిలు ఆధారిత ప్రచురణలు రుచికరమైన ఆహారం లాంటివి. మనకు ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు దాన్ని గబగబా తినేయకుండా సమయం తీసుకుని ఆస్వాదిస్తూ మెల్లగా తింటాం. అదేవిధంగా అధ్యయనం చేయడానికి మనం సమయం తీసుకోవాలి. అలా చేస్తే, సత్యంలోని ‘ఇంపైన మాటల్ని’ ఆనందించగలుగుతాం. అంతేకాదు చదివిన వాటిని గుర్తుంచుకొని, ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించగలుగుతాం.—ప్రసం. 12:10.

13. దేవుని వాక్యంలోని సత్యాన్ని ప్రేమించడానికి యిర్మీయాకు ఏమి సహాయం చేసింది? దానివల్ల ఏమి జరిగింది?

13 యిర్మీయా ప్రవక్త దేవుని వాక్యంలోని సత్యాన్ని ప్రేమించాడు. అతనిలా అన్నాడు, “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.” (యిర్మీ. 15:16) యిర్మీయా విలువైన దేవుని మాటల గురించి లోతుగా ఆలోచించాడు, వాటిని ప్రేమించాడు. అందుకే దేవుని ప్రతినిధిగా ఉండడాన్ని, ఆయన సందేశాన్ని ప్రకటించడాన్ని తనకు దొరికిన గొప్ప అవకాశంగా భావించాడు. మనం కూడా బైబిలు సత్యాన్ని ప్రేమిస్తే, యెహోవాసాక్షిగా ఉండడాన్ని, ఈ చివరిరోజుల్లో రాజ్యం గురించి ప్రకటించడాన్ని గొప్ప అవకాశంగా ఎంచుతాం.

బైబిలు సత్యంపట్ల ప్రేమ పెంచుకోండి (14వ పేరా చూడండి)

14 బైబిలు సత్యంపట్ల ప్రేమను ఇంకా ఏవిధంగా పెంచుకోవచ్చు?

14 బైబిలు సత్యంపట్ల ప్రేమను ఇంకా ఏ విధంగా పెంచుకోవచ్చు? మీటింగ్స్‌కు క్రమంగా హాజరవ్వడం ద్వారా. అక్కడ యెహోవాయే మనకు బోధిస్తాడు. ముఖ్యంగా, బైబిల్ని అధ్యయనం చేయడానికి మనం ప్రతీవారం ఉపయోగించే కావలికోట ద్వారా ఆయన మనకు బోధిస్తున్నాడు. దాన్నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే ముందే సిద్ధపడి మీటింగ్‌కు రావాలి. ఉదాహరణకు ఆర్టికల్‌లో ఇవ్వబడిన లేఖనాలన్నిటిని చదివి రావాలి. ఇప్పుడు కావలికోట ప్రతుల్ని ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లలో తేలిగ్గా చదువుకోవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పత్రిక jw.org వెబ్‌సైట్‌లో, JW లైబ్రరీ యాప్‌లో ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. కొన్ని ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లలో లేఖనాల్ని తెరవడం చాలా తేలిగ్గా ఉంటుంది. అయితే కావలికోటలోని ఆర్టికల్స్‌ని ఏ ఫార్మాట్‌లో చదివినప్పటికీ, లేఖనాల్ని చదివి, వాటిగురించి లోతుగా ఆలోచించినప్పుడు బైబిలు సత్యంపట్ల మన ప్రేమ పెరుగుతుంది.—కీర్తన 1:2 చదవండి.

తోటి సహోదరసహోదరీల పట్ల ప్రేమ

15, 16. (ఎ) యోహాను 13:34, 35 ప్రకారం యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? (బి) దేవున్ని, బైబిల్ని ప్రేమించడానికీ, తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించడానికీ మధ్య ఉన్న సంబంధమేమిటి?

15 భూమ్మీద తన చివరి రాత్రి యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, “నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహా. 13:34, 35.

16 తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించడానికి, యెహోవాను ప్రేమించడానికి మధ్య సంబంధం ఉంది. దేవున్ని ప్రేమించకపోతే, మన తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించలేం. ఒకవేళ తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించకపోతే, దేవున్ని ప్రేమించలేం. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “కళ్ల ముందు ఉన్న సోదరుణ్ణి ప్రేమించని వ్యక్తి, కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు.” (1 యోహా. 4:20) యెహోవాను, తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించడానికీ, బైబిల్ని ప్రేమించడానికీ మధ్య కూడా సంబంధం ఉంది. ఎందుకు? బైబిలు నుండి మనం నేర్చుకుంటున్న విషయాలపట్ల మనకు ప్రేమ ఉంటే, దేవున్ని, తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించాలనే బైబిల్లోని ఆజ్ఞల్ని పాటిస్తాం.—1 పేతు. 1:22; 1 యోహా. 4:21.

తోటి సహోదరసహోదరీల పట్ల ప్రేమ చూపించండి (17వ పేరా చూడండి)

17. ప్రేమ చూపించడానికి ఉన్న కొన్ని మార్గాలేమిటి?

17 1 థెస్సలొనీకయులు 4:9, 10 చదవండి. సంఘంలోని వాళ్లపై ప్రేమ చూపించడానికి ఉన్న కొన్ని మార్గాలేమిటి? వయసుపైబడిన సహోదరున్ని లేదా సహోదరిని మీటింగ్స్‌కు తీసుకెళ్లి, తీసుకురావచ్చు. ఇంటిని బాగుచేసుకోవడంలో మద్దతు అవసరమైన విధవరాళ్లకు సహాయం చేయవచ్చు. (యాకో. 1:27) అవును నిరాశతో, కృంగుదలతో, ఇతర సమస్యలతో బాధపడుతున్న మన సహోదరసహోదరీలకు మనం చూపించే శ్రద్ధ, ఇచ్చే ప్రోత్సాహం, ఓదార్పు అవసరం. (సామె. 12:25; కొలొ. 4:11) మనకు ‘తోటి విశ్వాసుల’ పై ప్రేమ ఉందని మన మాటల ద్వారా, పనుల ద్వారా చూపిస్తాం.—గల. 6:10.

18. తోటి సహోదరసహోదరీలతో ఉన్న అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

18 ఈ దుష్టలోకంలోని “చివరి రోజుల్లో” చాలామంది స్వార్థపరులుగా, అత్యాశపరులుగా ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమో. 3:1, 2) క్రైస్తవులముగా యెహోవాపట్ల, ఆయన వాక్యంపట్ల, అలాగే ఒకరిపట్ల ఒకరు ప్రేమను పెంచుకోవడానికి కృషిచేయాలి. అయితే మనమందరం అపరిపూర్ణులం కాబట్టి అప్పుడప్పుడు తోటి సహోదరసహోదరీలతో అభిప్రాయభేదాలు వస్తుంటాయి. కానీ మనకు ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి వాటిని వీలైనంత దయగా, త్వరగా పరిష్కరించుకుంటాం. (ఎఫె. 4:32; కొలొ. 3:14) మన ప్రేమ ఎన్నడూ చల్లారిపోకుండా చూసుకుందాం. యెహోవాపట్ల, ఆయన వాక్యంపట్ల, తోటి సహోదరసహోదరీల పట్ల ప్రగాఢమైన ప్రేమ పెంచుకుంటూ ఉందాం.