కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గాయు సహోదరులకు ఎలా సహాయం చేశాడు?

గాయు సహోదరులకు ఎలా సహాయం చేశాడు?

మొదటి శతాబ్దం చివర్లో జీవించిన గాయు, అలాగే ఇతర క్రైస్తవులు సవాళ్లు ఎదుర్కొన్నారు. అబద్ధ బోధల్ని వ్యాప్తి చేస్తున్నవాళ్లు సంఘాల్ని బలహీనపర్చి, విడదీయాలని చూశారు. (1 యోహా. 2:18, 19; 2 యోహా. 7, 8) దియొత్రెఫే అనే వ్యక్తి అపొస్తలుడైన యోహాను గురించి, ఇతరుల గురించి “చెడు ప్రచారం” చేస్తున్నాడు. అంతేకాదు అతను ప్రయాణ పర్యవేక్షకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకోకపోగా, ఇతరుల్ని కూడా తనలాగే చేయమని బలవంతపెడుతున్నాడు. (3 యోహా. 9, 10) యోహాను గాయుకు ఉత్తరం రాసే సమయానికి పరిస్థితి అలా ఉంది. దాదాపు సా.శ. 98⁠లో అపొస్తలుడైన యోహాను రాసిన ఈ ఉత్తరం “యోహాను రాసిన మూడవ పత్రిక” పేరుతో క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో నమోదు చేయబడింది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ గాయు ఎలా యెహోవాకు నమ్మకంగా సేవచేస్తూ వచ్చాడు? నేడు మనం గాయును ఎందుకు అనుకరించాలనుకుంటాం? అలా అనుకరించడానికి యోహాను రాసిన పత్రిక ఎలా సహాయం చేస్తుంది?

ప్రియమైన స్నేహితునికి రాసిన ఉత్తరం

యోహాను 3వ పత్రికను రాసిన వ్యక్తి తనను తాను ‘వృద్ధునిగా’ పరిచయం చేసుకున్నాడు. తనకు ఉత్తరం రాసిన వ్యక్తి యోహానే అని గుర్తుపట్టడానికి గాయుకు ఆ ఒక్క మాట చాలు. ఎంతైనా గాయు యోహానుకు ఎంతో ఇష్టమైన ఆధ్యాత్మిక కొడుకు కదా! అందుకే యోహాను అతన్ని ‘ప్రియమైన గాయు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను’ అని చెప్తూ ఉత్తరం ప్రారంభించాడు. గాయు ఆధ్యాత్మికంగా ఎంత బలంగా ఉన్నాడో, అతని ఆరోగ్యం కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నట్లు యోహాను ఆ ఉత్తరంలో రాశాడు. భావోద్వేగం, ప్రశంస మిళితమై ఉన్న ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయో కదా!—3 యోహా.1, 2, 4.

గాయు బహుశా సంఘ పర్యవేక్షకుడు అయ్యుంటాడు. కానీ యోహాను రాసిన పత్రికలో మాత్రం ఆ విషయం లేదు. సంఘానికి వచ్చిన పరిచయంలేని సహోదరులకు చక్కని ఆతిథ్యం ఇచ్చినందుకు యోహాను గాయును మెచ్చుకున్నాడు. ఆతిథ్యం ఇవ్వడమనేది దేవుని సేవకులకు ఉన్న గుర్తింపు కాబట్టి గాయు నమ్మకమైన వాడని గుర్తించడానికి అతని ఆతిథ్యమిచ్చే స్ఫూర్తి యోహానుకు సహాయం చేసింది.—ఆది. 18:1-8; 1 తిమో. 3:2; 3 యోహా. 5.

చక్కని ఆతిథ్యమిస్తున్నాడని యోహాను గాయును మెచ్చుకోవడాన్ని బట్టి, యోహాను ఉన్న ప్రాంతం నుండి ఇతర సంఘాలకు సహోదరులు తరచుగా వెళ్లేవాళ్లని అర్థమౌతోంది. ఆ సహోదరులే తాము చూసినవాటి గురించి యోహానుకు చెప్పివుంటారు. బహుశా వాళ్ల ద్వారానే ఈ సంఘాల గురించి యోహానుకు తెలిసుంటుంది.

అప్పట్లో వేరే సంఘాల నుండి వచ్చే సహోదరులు తోటి విశ్వాసుల ఇళ్లల్లో ఉండడానికే ఇష్టపడేవాళ్లు. ఎందుకంటే హోటళ్లకు అంత మంచి పేరు ఉండేది కాదు. అక్కడ సరైన సౌకర్యాలు ఉండేవి కావు, దానితోపాటు అవి అనైతిక కార్యకలాపాలకు నిలయాలుగా ఉండేవి. అందుకే సాధ్యమైనంతవరకు వేరే ప్రాంతం నుండి వచ్చినవాళ్లు తమ స్నేహితుల ఇళ్లలో ఉండేవాళ్లు, అలాగే వేరే సంఘాల నుండి వచ్చిన సహోదరులు ఆతిథ్యమిచ్చే సహోదరుల ఇళ్లల్లో ఉండేవాళ్లు.

“దేవుని పేరిట ప్రకటించడానికి బయల్దేరారు”

“దేవుడు ఇష్టపడే విధంగా వాళ్లను [వేరే ప్రాంతం నుండి వచ్చినవాళ్లను] సాగనంపు” అని చెప్పడం ద్వారా ఆతిథ్యం ఇస్తూ ఉండమని యోహాను గాయును ప్రోత్సహించాడు. ఈ సందర్భంలో, సాగనంపడం అంటే ఏమిటి? అంటే వాళ్లు అక్కడినుండి వేరే ప్రాంతానికి వెళ్తుండగా, వాళ్లు గమ్యాన్ని చేరేవరకు ప్రయాణమంతటిలో అవసరమయ్యే వాటన్నిటిని సమకూర్చమని అర్థం. ఇంతకుముందు వచ్చినవాళ్ల విషయంలో కూడా గాయు ఆ విధంగానే చేశాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గాయు చూపించిన ప్రేమ, విశ్వాసం గురించి వాళ్లు యోహానుకు చెప్పారు.—3 యోహా. 3, 6.

గాయు ఆతిథ్యం ఇచ్చినవాళ్లు బహుశా మిషనరీలు, యోహాను తరఫున వచ్చినవాళ్లు, లేదా ప్రయాణ పర్యవేక్షకులు అయ్యుండవచ్చు. వాళ్లు ఎవరైనప్పటికీ, వాళ్లు మంచివార్త కోసం వచ్చారు. యోహాను ఇలా అన్నాడు, “వాళ్లు దేవుని పేరిట ప్రకటించడానికి బయల్దేరారు.” (3 యోహా. 7) కాబట్టి ఆ సహోదరుల్ని క్రైస్తవ సంఘంలో ఒకరిగా చూస్తూ, ఆప్యాయంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అందుకే యోహాను ఇలా రాశాడు, “అలాంటివాళ్లకు అతిథిమర్యాదలు చేయాల్సిన బాధ్యత మనమీద ఉంది. అలా చేసినప్పుడు సత్యాన్ని వ్యాప్తిచేసే విషయంలో మనం వాళ్ల తోటి పనివాళ్లం అవ్వగలుగుతాం.”—3 యోహా. 8.

సమస్య వచ్చినప్పుడు సహాయం

కేవలం కృతజ్ఞతలు చెప్పడానికే యోహాను గాయుకు ఉత్తరం రాయలేదు. ఒక పెద్ద సమస్యను అధిగమించేందుకు అతనికి సహాయం చేయాలని కూడా యోహాను అనుకున్నాడు. దియొత్రెఫే అనే పేరుగల ఒక సహోదరుడు వేరే ప్రాంతం నుండి వచ్చే సహోదరులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో కారణమైతే తెలీదు. అయితే మిగిలినవాళ్లు కూడా ఆతిథ్యం ఇవ్వకుండా చేయాలని అతను చూశాడు.—3 యోహా. 9, 10.

ఒకవేళ దియొత్రెఫే ఆతిథ్యం ఇచ్చినా సహోదరులెవ్వరూ అతని ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవాళ్లు కాదని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే, అతను సంఘంలో ప్రముఖ స్థానం కావాలని కోరుకున్నాడు, యోహాను నుండి అతను ఎలాంటి గౌరవం పొందలేదు, పైగా అపొస్తలుల గురించీ ఇతరుల గురించీ చెడుగా ప్రచారం చేసేవాడు. అతను అబద్ధ బోధకుడు కాదుగానీ అపొస్తలుల అధికారాన్ని మాత్రం ఎదిరించేవాడు. ప్రముఖ స్థానం సంపాదించాలనే అతని కోరిక, క్రైస్తవులకు తగని ప్రవర్తన బట్టి అతను అసలు విశ్వాసేనా అనే ప్రశ్న తలెత్తింది. అధికార దాహం, విపరీతమైన కోపం ఉన్నవాళ్లు సంఘం విడిపోయేలా చేయగలరని చెప్పడానికి దియొత్రెఫే ఒక ఉదాహరణ. అందుకే యోహాను గాయుకు ఇలా రాశాడు, “చెడ్డవాళ్లను అనుసరించకు.” ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయి.—3 యోహా. 11.

మంచి చేయడానికి అద్భుతమైన కారణం

దేమేత్రి అనే క్రైస్తవుడు చక్కని ఆదర్శం ఉంచాడని యోహాను మెచ్చుకున్నాడు. అతను దియొత్రెఫేలా కాదు. దేమేత్రి గురించి యోహాను ఇలా రాశాడు, “సోదరులందరూ దేమేత్రి గురించి మంచిగా చెప్పారు. . . . నిజానికి, మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. మేము ఇచ్చే సాక్ష్యం నిజమని నీకు తెలుసు.” (3 యోహా. 12) బహుశా దేమేత్రికి గాయు సహాయం అవసరమై ఉంటుంది. అందుకే దేమేత్రిని పరిచయం చేస్తూ, అతను మంచివాడని చెప్తూ యోహాను గాయుకు ఆ ఉత్తరం రాసివుంటాడు. ఆ ఉత్తరాన్ని దేమేత్రియే స్వయంగా గాయుకు తీసుకెళ్లి ఇచ్చివుండచ్చు. యోహాను తరఫున వచ్చినవానిగా లేదా ప్రయాణ పర్యవేక్షకునిగా వెళ్లిన దేమేత్రి యోహాను రాసిన మాటలను మరింత స్పష్టంగా వివరించి ఉంటాడు.

అప్పటికే చక్కని ఆతిథ్య స్ఫూర్తి చూపిస్తున్న గాయును ఆతిథ్యం ఇస్తూ ఉండమని యోహాను ఎందుకు ప్రోత్సహించాడు? గాయును మరింతగా ధైర్యపర్చాల్సిన అవసరముందని యోహానుకు అనిపించిందా? ఆతిథ్యం ఇస్తున్నవాళ్లను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న దియొత్రెఫే వల్ల గాయు ఆతిథ్య స్ఫూర్తి దెబ్బతింటుందని యోహాను భయపడ్డాడా? ఏదేమైనా యోహాను గాయును ఇలా ప్రోత్సహించాడు, “మంచి చేసేవాళ్లు దేవుని సంబంధులు.” (3 యోహా. 11) మంచి చేయడానికి, అలానే చేస్తూ ఉండడానికి అది అద్భుతమైన కారణం.

ఆతిథ్యస్ఫూర్తి చూపిస్తూ ఉండేలా యోహాను ఉత్తరం గాయును ప్రోత్సహించిందా? ‘మంచివాళ్లను అనుసరించమని’ చెప్తూ యోహాను రాసిన మూడవ పత్రిక గాయును ఖచ్చితంగా ప్రోత్సహించివుంటుంది. బైబిల్లో భద్రపర్చబడిన ఆ పత్రిక నుండి మనం కూడా అలాంటి ప్రోత్సాహమే పొందుతాం.

యోహాను మూడవ పత్రిక నేర్పే పాఠాలు

ప్రాచీన కాలంలోని మన ప్రియమైన సహోదరుడు గాయు గురించి ఎక్కువ విషయాలు బైబిల్లో లేవు. కానీ తెలిసిన కొన్ని విషయాల నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.

నేడు మనం ఏయే విధాలుగా “ఆతిథ్యం” ఇస్తూ ఉండవచ్చు?

మొదటిగా, మంచివార్త ప్రకటించడానికి వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణించేందుకు ముందుకొచ్చిన సహోదరులకు మనం ఎంతో కృతజ్ఞులం. మనలో చాలామందిమి అలాంటి వాళ్లనుండే సత్యం నేర్చుకున్నాం. నిజమే ప్రస్తుతమున్న క్రైస్తవ సంఘాల్లోని అందరూ మంచివార్త ప్రకటించడానికి ఎక్కువ దూరాలు ప్రయాణించలేకపోవచ్చు. అయితే అలా ప్రయాణిస్తున్న వాళ్లకు అంటే ప్రాంతీయ పర్యవేక్షకుడు, అతని భార్య లాంటి వాళ్లకు మనం గాయులా ఏదోక విధంగా మద్దతివ్వవచ్చు, ప్రోత్సహించవచ్చు. లేదా తమ దేశంలోగానీ, వేరే దేశంలోగానీ ప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లేవాళ్లకు మనం చేతనైనంత సహాయం చేయవచ్చు. కాబట్టి మనం ‘ఆతిథ్యం ఇవ్వడం అలవాటు చేసుకుందాం.’—రోమా. 12:13; 1 తిమో. 5:9, 10.

రెండవదిగా, నేడు సంఘాల్లో అధికారంలో ఉన్నవాళ్లకు ఎవరైనా ఎదురుతిరిగితే మనం ఆశ్చర్యపోకూడదు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఉదాహరణకు యోహాను, పౌలు వంటివాళ్లకు సంఘంలోని కొంతమంది ఎదురుతిరిగారు. (2 కొరిం. 10:7-12; 12:11-13) మన సంఘంలో అలాంటి సమస్య ఎదురైతే ఏమి చేయాలి? పౌలు తిమోతికి ఈ సలహా ఇచ్చాడు, “ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా వ్యవహరించాలి; అతనికి బోధించే సామర్థ్యం ఉండాలి; తనకు ఎవరైనా హాని చేస్తే అతను నిగ్రహం పాటించాలి. వ్యతిరేకించేవాళ్లకు అతను సౌమ్యంగా ఉపదేశించాలి.” మనపై ఎదురుతిరిగినప్పటికీ మనం సౌమ్యంగా ఉంటే వాళ్లు తమ ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంది. అందుకు ఫలితంగా “సత్యం గురించిన సరైన జ్ఞానం కలిగివుండేలా దేవుడు వాళ్లలో పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు.”—2 తిమో. 2:24, 25.

మూడవదిగా, వ్యతిరేకత ఉన్నప్పటికీ యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న తోటి విశ్వాసుల్ని గుర్తించి, వాళ్లను మనం మెచ్చుకోవాలి. అపొస్తలుడైన యోహాను గాయును ప్రోత్సహించి, అతను సరైనదాన్ని చేస్తున్నాడని ధైర్యం చెప్పాడు. అదేవిధంగా, నేడు సంఘపెద్దలు యోహాను ఆదర్శాన్ని అనుకరిస్తూ తమ తోటి సహోదరసహోదరీల్ని ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్లు ‘అలయకుండా పరుగెత్తుతారు.’—యెష. 40:31; 1 థెస్స. 5:11.

గ్రీకు భాషలో రాయబడిన యోహాను మూడవ పత్రికలో కేవలం 219 పదాలు ఉన్నాయి. అపొస్తలుడైన యోహాను గాయుకు రాసిన ఈ పత్రిక బైబిల్లో అన్నిటికన్నా చిన్న పుస్తకం. కానీ క్రైస్తవులైన మనకు ఎంతో ఉపయోగపడే విషయాలు అందులో ఉన్నాయి.