కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి

ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి

“మీ సంపద ఎక్కడ ఉంటే మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది.”లూకా 12:34.

పాటలు: 153, 9

1, 2. (ఎ) యెహోవా ఇచ్చిన విలువైన సంపదలో కొన్ని ఏమిటి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

 యెహోవాయే విశ్వంలో అందరికన్నా సంపన్నుడు. సమస్తం ఆయనదే. (1 దిన. 29:11, 12) కానీ ఆయన అందరిపట్ల ఎంతో ఉదార స్వభావాన్ని చూపిస్తున్నాడు. ఎన్నో ఆధ్యాత్మిక రత్నాలను మనతో పంచుకున్నాడు, దానికి మనమెంతో కృతజ్ఞులం. ఆయన మనతో పంచుకున్న ఆధ్యాత్మిక సంపదలో కొన్ని ఏమిటి? (1) దేవుని రాజ్యం, (2) పరిచర్య, (3) తన వాక్యంలోని విలువైన సత్యాలు. కానీ మనం జాగ్రత్తగా లేకపోతే, ఆ సంపద ఎంత విలువైనదో మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ సంపద ఎంత విలువైనదో గుర్తుచేసుకుంటూ, వాటిపట్ల మనకున్న ప్రేమను మరింత పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే “మీ సంపద ఎక్కడ ఉంటే మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది” అని యేసు చెప్పాడు.—లూకా 12:34.

2 అయితే దేవుని రాజ్యంపట్ల, పరిచర్యపట్ల, బైబిలు సత్యాలపట్ల మనకున్న ప్రేమనూ కృతజ్ఞతనూ ఎలా బలంగా ఉంచుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తుండగా, ఈ ఆధ్యాత్మిక సంపద పట్ల మీ ప్రేమను ఎలా పెంచుకోవచ్చో లోతుగా ఆలోచించండి.

దేవుని రాజ్యం విలువైన ముత్యం లాంటిది

3. యేసు చెప్పిన ఉపమానంలోని వ్యక్తి ఒక ముత్యం కొనుక్కోవడం కోసం ఏమి చేశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

3 మత్తయి 13:45, 46 చదవండి. ముత్యాల వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఉపమానాన్ని యేసు చెప్పాడు. ఒకరోజు ఆ వ్యాపారస్థునికి ఒక ముత్యం కనిపించింది, అంత విలువైన ముత్యాన్ని అతను ముందెప్పుడూ చూడలేదు. ఆ ముత్యాన్ని సొంతం చేసుకోవాలని అతను ఎంతగా కోరుకున్నాడంటే దాన్ని కొనుక్కోవడం కోసం తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేశాడు. ఆ ముత్యం అతనికి ఎంత విలువైనదో మీరు ఊహించగలరా?

4. దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తే మనమేమి చేయడానికి సిద్ధంగా ఉంటాం?

4 యేసు చెప్పిన ఉపమానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? దేవుని రాజ్యం గురించిన సత్యం ఆ విలువైన ముత్యం లాంటిది. వ్యాపారస్థుడు ఆ ముత్యాన్ని ప్రేమించినంతగా మనం దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తే, ఎప్పటికీ ఆ రాజ్య పౌరులుగా ఉండడం కోసం పెద్దపెద్ద త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. (మార్కు 10:28-30 చదవండి.) దేవుని రాజ్యాన్ని విలువైనదిగా ఎంచిన ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

5. రాజ్యం కోసం జక్కయ్య ఏమి చేశాడు?

5 జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు. ప్రజల దగ్గరనుండి ఎక్కువ పన్ను వసూలు చేసి అతను ధనవంతుడయ్యాడు. (లూకా 19:1-9) కానీ ఒకరోజు దేవుని రాజ్యం గురించి యేసు మాట్లాడుతుండగా జక్కయ్య విన్నాడు. ఆయన మాటలు అతనికి ఎంత నచ్చాయంటే తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకోవాలని అనుకున్నాడు. దాంతో జక్కయ్య ఇలా అన్నాడు, “ఇదిగో! నాకున్న వాటిలో సగం పేదవాళ్లకు ఇస్తాను. అంతేకాదు, ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయంగా లాక్కొని ఉంటే, దానికి నాలుగు రెట్లు తిరిగిస్తాను.” చెప్పినట్లుగానే, ప్రజల దగ్గరనుండి అతను వసూలు చేసిన డబ్బును వాళ్లకు తిరిగిచ్చేశాడు. మళ్లీ ఎప్పుడూ జక్కయ్య అత్యాశగా ప్రవర్తించలేదు.

6. ఒక అమ్మాయి ఎలాంటి మార్పులు చేసుకుంది? ఎందుకు?

6 కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయి దేవుని రాజ్యం గురించి వినింది. అప్పటికి ఆమె వేరే అమ్మాయిలతో లైంగిక సంబంధాలు కలిగివుంది. అంతేకాదు సలింగ సంయోగుల హక్కుల కోసం పోరాడే ఒక సంస్థకు ప్రెసిడెంటుగా కూడా పనిచేస్తోంది. ఆమె బైబిల్లోని విషయాలు నేర్చుకుని దేవుని రాజ్యం ఎంత విలువైనదో అర్థంచేసుకుంది. దాంతో ఆమె జీవితంలో చాలా పెద్ద మార్పులు చేసుకోవాలని గుర్తించింది. (1 కొరిం. 6:9, 10) యెహోవా మీదున్న ప్రేమతో ఆమె పనిచేస్తున్న సంస్థ నుండి బయటికి వచ్చేసింది, అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం కూడా ఆపేసింది. ఆమె 2009⁠లో బాప్తిస్మం తీసుకుని, ఆ తర్వాతి సంవత్సరం క్రమ పయినీరు సేవ చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు తనకున్న చెడు కోరికల కన్నా యెహోవా మీదున్న ప్రేమ బలంగా ఉండడం వల్లే ఆమె ఈ పెద్దపెద్ద మార్పులన్నీ చేసుకోగలిగింది.—మార్కు 12:29, 30.

7. దేవుని రాజ్యంపై మనకున్న ప్రేమ వేటివల్ల తగ్గిపోకుండా చూసుకోవాలి?

7 అవును, దేవుని రాజ్య పౌరులుగా ఉండడం కోసం మనలో చాలామందిమి ఎన్నో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాం. (రోమా. 12:2) అయితే అంతటితో అయిపోలేదు. వస్తుసంపదలు, తప్పుడు కోరికలు వంటి వాటివల్ల రాజ్యంపై మనకున్న ప్రేమ తగ్గిపోకుండా చూసుకోవాలి. (సామె. 4:23; మత్త. 5:27-29) ఆ విషయంలో సహాయం చేసేందుకు యెహోవా మనకు మరో విలువైన సంపదను ఇచ్చాడు.

ప్రాణాల్ని కాపాడే పరిచర్య

8. (ఎ) పౌలు పరిచర్యను మట్టి పాత్రలో ఉంచిన సంపదతో ఎందుకు పోల్చాడు? (బి) పరిచర్యపట్ల తనకున్న ప్రేమను పౌలు ఎలా చూపించాడు?

8 దేవుని రాజ్యం గురించి ప్రకటించి, బోధించాల్సిన బాధ్యతను యేసు మనకిచ్చాడు. (మత్త. 28:19, 20) అపొస్తలుడైన పౌలు, కొత్త ఒప్పందానికి సంబంధించిన పరిచర్యను మట్టి పాత్రలో ఉంచిన సంపదతో పోల్చాడు. (2 కొరిం. 4:7; 1 తిమో. 1:12) అపరిపూర్ణులైన మనం మట్టి పాత్రలు వంటి వాళ్లం. కానీ మనం ప్రకటించే సందేశం మాత్రం విలువైన సంపద లాంటిది. ఎందుకంటే అది మనకు అలాగే దాన్ని వినేవాళ్లకు శాశ్వత జీవితాన్ని ఇస్తుంది. అందుకే పౌలు ఇలా చెప్పాడు, “మంచివార్త కోసం, దాన్ని ఇతరులకు ప్రకటించడం కోసం నేను అన్నీ చేస్తాను.” (1 కొరిం. 9:23) అవును, దేవుని రాజ్యం గురించి ఇతరులకు ప్రకటించడానికి పౌలు చాలా కష్టపడ్డాడు. (రోమీయులు 1:14, 15; 2 తిమోతి 4:2 చదవండి.) తీవ్రమైన హింస ఎదురైనప్పటికీ మంచివార్తను ప్రకటించగలిగాడంటే, పరిచర్యపట్ల అతనికున్న ప్రేమే కారణం. (1 థెస్స. 2:2) పౌలులాగే మనం కూడా పరిచర్య పట్ల ప్రేమను ఎలా పెంచుకోవచ్చు?

9. పరిచర్యపట్ల మనకున్న ప్రేమను చూపించడానికిగల కొన్ని మార్గాలు ఏమిటి?

9 పౌలు పరిచర్యపట్ల తనకున్న ప్రేమను చూపించిన ఒక విధానమేమిటంటే, ఇతరులకు ప్రకటించడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడం. పౌలు, అలాగే మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే మనం కూడా ఇంటింటికి వెళ్తూ, బహిరంగ ప్రదేశాల్లో, ప్రజలు ఎక్కడుంటే అక్కడ మంచివార్త ప్రకటిస్తాం. (అపొ. 5:42; 20:20) వీలైనంత ఎక్కువమందికి మంచివార్త ప్రకటించగల మార్గాల కోసం మనం వెతుకుతూ ఉంటాం. అంతేకాదు ఒకవేళ మన పరిస్థితులు అనుకూలిస్తే సహాయ పయినీరుగా లేదా క్రమ పయినీరుగా సేవచేయవచ్చు. కొత్త భాష నేర్చుకుని మనం ఉంటున్న దేశంలోనే వేరే ప్రాంతానికి వెళ్లి లేదా వేరే దేశానికి వెళ్లి మంచివార్త ప్రకటించవచ్చు.—అపొ. 16:9, 10.

10. మంచివార్త ప్రకటించడానికి చేసిన కృషి వల్ల ఐరీన్‌ ఎలాంటి ఫలితం పొందింది?

10 అమెరికాకు చెందిన ఐరీన్‌ అనే ఒక పెళ్లికాని సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. రష్యా భాష మాట్లాడేవాళ్లకు మంచివార్త ప్రకటించాలనే కోరిక ఆమెకు ఉండేది. దాంతో 1993⁠లో న్యూయార్క్‌ నగరంలో ఉన్న రష్యా భాషా గుంపుతో కలిసి ఆమె ప్రకటనాపని చేయడం మొదలుపెట్టింది. అప్పటికి ఆ గుంపులో సుమారు 20 మంది ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. దాదాపు 20 ఏళ్లపాటు ఆ గుంపుతో కలిసి పనిచేశాక ఐరీన్‌ ఇలా చెప్తోంది, “ఇప్పటికీ నాకు రష్యా భాష పూర్తిగా రాదు.” అయినాసరే ఆ భాషలో ప్రజలకు మంచివార్త ప్రకటించేలా యెహోవా ఆమెకు, ఇతర ప్రచారకులకు సహాయం చేశాడు. దానికి ఫలితంగా, ఇప్పుడు న్యూయార్క్‌ నగరంలో ఆరు రష్యా భాషా సంఘాలు ఉన్నాయి. ఐరీన్‌ బైబిలు విద్యార్థుల్లో 15 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లలో కొంతమంది బెతెల్‌లో పనిచేస్తున్నారు, కొంతమంది పయినీర్లుగా, సంఘపెద్దలుగా సేవచేస్తున్నారు. ఐరీన్‌ ఇలా అంటోంది, “ఒకవేళ నేను వేరే లక్ష్యాలు పెట్టుకొని ఉంటే, ఇంత ఆనందాన్ని పొంది ఉండేదాన్ని కాదు.” అవును, ఆమె పరిచర్యను ఎంతో విలువైనదిగా ఎంచుతోంది.

పరిచర్యను మీరు విలువైనదిగా ఎంచుతున్నారా? దానికోసం ప్రతీవారం కొంత సమయాన్ని వెచ్చిస్తున్నారా? (11, 12 పేరాలు చూడండి)

11. హింస ఎదురైనప్పటికీ పట్టుదలగా ప్రకటించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి?

11 మనం పరిచర్యను విలువైనదిగా ఎంచితే, హింసలు ఎదురైనా అపొస్తలుడైన పౌలులాగే పట్టుదలగా ప్రకటిస్తాం. (అపొ. 14:19-22) ఉదాహరణకు, 1930-1944 మధ్య సంవత్సరాల్లో అమెరికాలో ఉన్న మన సహోదరులకు తీవ్రమైన హింస ఎదురైంది. అయినాసరే వాళ్లు ప్రకటించడం ఆపలేదు. వాళ్లు చేస్తున్న పనిని అధికారులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు, మన సహోదరులు కోర్టులో కేసులు వేశారు, వాటిలో ఎన్నో గెలిచారు కూడా. అమెరికా సుప్రీం కోర్టులో మనం గెలిచినవాటిలో ఒక కేసు గురించి 1943⁠లో సహోదరుడు నార్‌ మాట్లాడాడు. సహోదరులు పట్టుదలగా ప్రకటించారు కాబట్టే కోర్టులో మనపై కేసులు ఉన్నాయని అతను అన్నాడు. అంతేకాదు ఆ కేసులు వల్లే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరులు ఎంతోమంది ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రకటించగలుగుతున్నారని కూడా అన్నాడు. ఇతర దేశాల్లోని సహోదరులు కూడా ఇలాంటి కేసులు గెలిచారు. అవును, పరిచర్యపట్ల ప్రేమ ఉంటే ఎంతటి హింసనైనా తట్టుకుని పట్టుదలగా ప్రకటిస్తాం.

12. మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు?

12 పరిచర్యను విలువైనదిగా ఎంచితే, కేవలం రిపోర్టు చేయడానికి గంటలు సంపాదించడం కోసం ప్రకటించం. బదులుగా ‘మంచివార్త గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వడం’ కోసం చేయగలిగినదంతా చేస్తాం. (అపొ. 20:24; 2 తిమో. 4:5) కానీ ఇతరులకు మనమేమి బోధించాలి? అందుకు సహాయం చేసే మరో సంపదను యెహోవా మనకిచ్చాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

నేర్చుకున్న విలువైన సత్యాలు

13, 14. మత్తయి 13:52⁠లో యేసు చెప్పిన “ఖజానా” ఏమిటి? దాన్ని నింపుకోవాలంటే మనమేమి చేయాలి?

13 యెహోవా మనకిచ్చిన మూడవ సంపద ఏమిటంటే, మనం నేర్చుకున్న బైబిలు సత్యాలు. యెహోవాయే సత్యానికి మూలం. (2 సమూ. 7:28; కీర్త. 31:5) ఆయన ఉదార స్వభావంగల తండ్రి కాబట్టి ఆ సత్యాలను మనతో పంచుకుంటున్నాడు. బైబిలు చదవడం ద్వారా, మన ప్రచురణల ద్వారా, సమావేశాల ద్వారా, మీటింగ్స్‌ ద్వారా ఇప్పటివరకు మనం ఎన్నో సత్యాలను తెలుసుకున్నాం. వాటిని తెలుసుకునే కొద్దీ యేసు చెప్పినట్లుగా మన దగ్గర కొత్త, పాత సత్యాలతో నిండిన “ఖజానా” ఉంటుంది. (మత్తయి 13:52 చదవండి.) దాచబడిన ధనాన్ని వెదికినట్లు మనం సత్యాల్ని వెదికితే మన ‘ఖజానాను’ నింపుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడు. (సామెతలు 2:4-7 చదవండి.) మరి అలా వెదకాలంటే ఏమి చేయాలి?

14 క్రమం తప్పకుండా బైబిల్ని, మన ప్రచురణల్ని చదువుతూ, జాగ్రత్తగా పరిశోధన చేయాలి. అలా చేస్తే, ఇంతకుముందు మనకు తెలియని “కొత్త” సత్యాలు కనుగొంటాం. (యెహో. 1:8, 9; కీర్త. 1:2, 3) 1879 జూలైలో ప్రచురితమైన మొట్టమొదటి కావలికోట సంచిక, సత్యాన్ని కలుపు మొక్కల మధ్య దాగివున్న పువ్వుతో పోల్చింది. ఒక వ్యక్తి అలాంటి పువ్వును కనుగొనాలంటే జాగ్రత్తగా వెతకాలి. అయితే అది దొరికాక అంతటితో తృప్తిపడకుండా అలాంటి మరిన్ని పువ్వుల కోసం వెదుకుతూ ఉండాలి. అదేవిధంగా మనం ఒక్క సత్యాన్ని తెలుసుకోగానే తృప్తి చెందకూడదు. ఇంకా ఎక్కువ సత్యాలు తెలుసుకోవాలనే ఆతురతతో జాగ్రత్తగా పరిశోధించాలి.

15. కొన్ని సత్యాల్ని మనం “పాత” సత్యాలు అని ఎందుకు పిలవవచ్చు? వాటిలో ఏది మీకు ప్రత్యేకమైనది?

15 మనం బైబిల్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాక అద్భుతమైన కొన్ని సత్యాలను తెలుసుకున్నాం. వాటిని మనం మొదట్లో తెలుసుకున్నాం కాబట్టి “పాత” సత్యాలు అని పిలవవచ్చు. ఆ విలువైన పాత సత్యాల్లో కొన్నేమిటి? ఉదాహరణకు సృష్టికర్త యెహోవా అని, మనుషుల విషయంలో ఆయనకు ఒక సంకల్పం ఉందని మొదట్లో తెలుసుకున్నాం. మనల్ని పాపమరణాల నుండి విడిపించడానికి ఆయన తన కుమారుణ్ణి భూమ్మీదకు పంపించి విమోచన క్రయధనంగా అర్పించాడని కూడా తెలుసుకున్నాం. అంతేకాదు దేవుని రాజ్యం మన కష్టాలన్నిటినీ తీసేస్తుందని, అప్పుడు మనం భూమ్మీద శాంతిసంతోషాలతో శాశ్వతంగా జీవించవచ్చని తెలుసుకున్నాం.—యోహా. 3:16; ప్రక. 4:11; 21:3, 4.

16. బైబిలు సత్యాల్ని అర్థంచేసుకోవడంలో సవరణలు వచ్చినప్పుడు మనమేమి చేయాలి?

16 ఏదైనా బైబిలు ప్రవచనాన్ని లేదా లేఖనాన్ని అర్థంచేసుకోవడంలో కొన్నిసార్లు సవరణలు వస్తుంటాయి. అలాంటి సవరణల గురించి సమయం తీసుకుని అధ్యయనం చేయడం, లోతుగా ఆలోచించడం ప్రాముఖ్యం. (అపొ. 17:11; 1 తిమో. 4:15) అలా చేస్తున్నప్పుడు కేవలం పాత అవగాహనకు, కొత్త అవగాహనకు మధ్య ఉన్న తేడాలను అర్థంచేసుకోవడం మాత్రమే సరిపోదు. కొత్త అవగాహనకు సంబంధించిన ప్రతీ వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అలా జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు, బైబిలు సత్యాలతో నిండిన మన ఖజానాలో ఆ కొత్త సత్యం కూడా చేరుతుంది. ఇలా కృషి చేయడం ఎందుకు మంచిది?

17, 18. పవిత్రశక్తి మనకెలా సహాయం చేయగలదు?

17 ఒకప్పుడు మనం నేర్చుకున్న విషయాల్ని గుర్తుతెచ్చుకోవడానికి దేవుని పవిత్రశక్తి సహాయం చేస్తుందని యేసు చెప్పాడు. (యోహా. 14:25, 26) మంచివార్త ప్రకటించేటప్పుడు పవిత్రశక్తి మనకెలా సహాయం చేస్తుంది? పీటర్‌ అనే సహోదరుని అనుభవాన్ని పరిశీలించండి. 1970 నాటికి ఆ సహోదరునికి 19 ఏళ్లు, అప్పుడే బ్రిటన్‌ బెతెల్‌లో సేవచేయడం మొదలుపెట్టాడు. అతనికి ఇంటింటి పరిచర్యలో మధ్య వయస్సున్న ఒక వ్యక్తి కలిశాడు. బైబిలు గురించి నేర్చుకోవడం ఇష్టమేనానని పీటర్‌ ఆ వ్యక్తిని అడిగాడు. అతను యూదా మతానికి చెందిన రబ్బీ. ఒక యువకుడు తనకు బైబిలు నేర్పించగలడా అని ఆ రబ్బీ అవాక్కయ్యాడు. పీటర్‌కు బైబిలు గురించి ఎంతవరకు తెలుసో పరీక్షించడానికి ఆ రబ్బీ ఇలా అడిగాడు, “దానియేలు పుస్తకం ఏ భాషలో రాయబడింది?” దానికి పీటర్‌, “కొంతభాగం అరామిక్‌ భాషలో రాయబడింది” అని జవాబిచ్చాడు. “నేను సరైన జవాబు ఇవ్వడం విని అతను ఆశ్చర్యపోయాడు. కానీ ఆ రబ్బీ కన్నా నేనే ఎక్కువ ఆశ్చర్యపోయాను! అసలు ఆ జవాబు నాకెలా తెలుసని ఆలోచించాను. ఇంటికెళ్లాక పాత కావలికోట, తేజరిల్లు! పత్రికల్ని తిరగేశాను. దానియేలు పుస్తకం అరామిక్‌ భాషలో రాయబడిందని వివరిస్తూ వచ్చిన ఒక ఆర్టికల్‌ నాకు వాటిలో కనిపించింది” అని పీటర్‌ చెప్పాడు. a అవును మనం ఒకప్పుడు చదివి, మన ఖజానాలో నింపుకున్న విషయాల్ని గుర్తుతెచ్చుకోవడానికి పవిత్రశక్తి సహాయం చేయగలదు.—లూకా 12:11, 12; 21:13-15.

18 యెహోవా నేర్పించే సత్యాల్ని మనం ప్రేమిస్తే, వాటిపట్ల మనకు కృతజ్ఞత ఉంటే వీలైనన్ని ఎక్కువ సత్యాలతో మన ఖజానాను నింపుకుంటూ ఉంటాం. దాన్ని ఎంత ఎక్కువగా నింపుకుంటే, ఇతరులకు బోధించడానికి అంత సిద్ధంగా ఉంటాం.

మీ సంపదను కాపాడుకోండి

19. మన ఆధ్యాత్మిక సంపదను ఎందుకు కాపాడుకోవాలి?

19 ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచడం ఎంత ప్రాముఖ్యమో ఈ ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. అయితే ఆ సంపదపట్ల మనకున్న ప్రేమను సాతాను, అతని లోకం తగ్గించకుండా చాలా జాగ్రత్తపడాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం, వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం వంటి విషయాల వల్ల మన మనసు పక్కదారి పట్టవచ్చు. కానీ ఈ లోకం, అలాగే అది చూపించేవన్నీ త్వరలోనే నాశనమైపోతాయని అపొస్తలుడైన యోహాను హెచ్చరించాడు. (1 యోహా. 2:15-17) కాబట్టి మన ఆధ్యాత్మిక సంపదపట్ల కృతజ్ఞత కలిగివుంటూ దాన్ని కాపాడుకోవాలి.

20. ఆధ్యాత్మిక సంపదను కాపాడుకోవడానికి ఏమి చేయాలని మీరు నిర్ణయించుకున్నారు?

20 దేవుని రాజ్యంపట్ల మనకున్న ప్రేమను తగ్గించగల దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఉత్సాహంగా ప్రకటిస్తూ ఉండండి, పరిచర్యపట్ల మీకున్న ప్రేమను ఎన్నడూ తగ్గనివ్వకండి. బైబిలు సత్యాల కోసం వెదుకుతూ ఉండండి. అలా వెదుకుతూ ఉంటే, ‘పరలోకంలో ఎప్పటికీ ఉండే సంపదను కూడబెట్టుకుంటారు. ఏ దొంగా దాని దగ్గరికి రాలేడు, దానికి చెదలు పట్టవు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది.’—లూకా 12:33, 34.

[అధస్సూచి]

a దానియేలు 2:4బి నుండి 7:28 వచనాల వరకు అరామిక్‌ భాషలో రాయబడింది.