కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు గొడవల్ని పరిష్కరించుకొని సమాధానాన్ని కాపాడగలరా?

మీరు గొడవల్ని పరిష్కరించుకొని సమాధానాన్ని కాపాడగలరా?

తనను ఆరాధించేవాళ్లు ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటూ సంతోషంగా ఉండాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటే క్రైస్తవ సంఘంలో సమాధానం ఉంటుంది. దాన్ని చూసి ఇతరులు కూడా క్రైస్తవ సంఘానికి రావడానికి ఇష్టపడతారు.

ఉదాహరణకు, మడగాస్కర్‌లో ఉండే ఒక మాంత్రికుడు యెహోవా సేవకుల మధ్య ఉన్న సమాధానాన్ని చూసి, ‘ఒకవేళ నేను ఏదైనా మతంలో చేరాలనుకుంటే ఈ మతంలోనే చేరతాను’ అని అనుకున్నాడు. కొంతకాలానికి, అతను చెడ్డ దూతలను ఆరాధించడం మానేశాడు, తన వివాహ జీవితంలో మార్పులు చేసుకున్నాడు. అంతేకాదు సమాధానంగల దేవుడైన యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టాడు.

ఆ మాంత్రికునిలాగే, ప్రతీ సంవత్సరం వేలమంది క్రైస్తవ సంఘంలోకి వస్తున్నారు. వాళ్లు ఎంతగానో కోరుకున్న సమాధానాన్ని కూడా పొందుతున్నారు. అయితే సంఘంలోని వాళ్లలో “మితిమీరిన అసూయ, గొడవలకు దిగే మనస్తత్వం” ఉంటే స్నేహాలు పాడౌతాయని, సమస్యలు తలెత్తుతాయని బైబిలు చెప్తోంది. (యాకో. 3:14-16) కానీ అలాంటి సమస్యలను పరిష్కరించుకొని సహోదరసహోదరీలతో ఎప్పుడూ సమాధానంగా ఉండడానికి సహాయం చేసే మంచి సలహాలు బైబిల్లో ఉన్నాయి. కొంతమందికి అవి ఎలా ఉపయోగపడ్డాయో ఇప్పుడు చూద్దాం.

సమస్యలు, పరిష్కారాలు

“నాతో కలిసి పనిచేసిన ఒక సహోదరునితో స్నేహంగా ఉండడం కష్టంగా ఉండేది. ఒకసారి మేమిద్దరం అరుచుకుంటుంటే, ఆ అరుపులకు ఇద్దరు వ్యక్తులు వచ్చి మా మధ్య జరుగుతున్న గొడవను చూశారు.”—క్రిస్‌.

“నాతో ఎక్కువగా ప్రీచింగ్‌కు వచ్చే ఒక సహోదరి ఉన్నట్టుండి నాతో ప్రీచింగ్‌కు రావడం మానేసింది. కొన్ని రోజులకు నాతో మాట్లాడడం కూడా పూర్తిగా మానేసింది. కానీ ఎందుకలా చేసిందో నాకు అస్సలు అర్థంకాలేదు.”—జ్యానట్‌.

“ఓ రోజు నేను ముగ్గురితో కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఉన్నాను. వాళ్లలో ఒకరు నాకు బాయ్‌ చెప్పారు, ఇక ఆ వ్యక్తి ఫోన్‌ పెట్టేశాడనుకుని అతని గురించి మరో వ్యక్తితో చెడుగా మాట్లాడాను. తీరా చూస్తే ఆ మొదటి వ్యక్తి ఇంకా లైన్‌లోనే ఉన్నాడు.”—మైఖేల్‌.

“మా సంఘంలో ఇద్దరు పయినీర్ల మధ్య సమస్యలు వచ్చాయి. వాళ్లిద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. చిన్నచిన్న విషయాలకు అలా గొడవపడడం చూసి ఇతరులు బాధపడ్డారు.”—గ్యారీ.

పైన చెప్పినవి పెద్ద సమస్యలుగా అనిపించకపోవచ్చు. కానీ చర్య తీసుకోకపోయుంటే, వాటిని ఎదుర్కొన్న వాళ్లకు అవి తీరని బాధను కలిగించివుండేవి, అలాగే సంఘంలో సమాధానాన్ని పాడుచేసి ఉండేవి. సంతోషకరమైన విషయమేమిటంటే, ఆ సహోదరసహోదరీలు బైబిలు సలహాలు పాటించి సమాధానపడ్డారు. మరి వాళ్లకు ఏ బైబిలు సలహాలు ఉపయోగపడ్డాయో తెలుసా?

‘దారిలో ఒకరితో ఒకరు గొడవ పడకండి.’ (ఆది. 45:24, NW) తన అన్నలు తమ తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నప్పుడు యోసేపు వాళ్లకు ఆ సలహా ఇచ్చాడు. ఒకవ్యక్తి తన భావాలను అదుపు చేసుకోకుండా త్వరగా కోపం తెచ్చుకుంటే పరిస్థితి ఘోరంగా తయారౌతుంది. ఇతరులకు కూడా కోపం రావచ్చు. అయితే, వినయంగా ఉంటూ ఇతరులు ఇచ్చిన నిర్దేశాలను పాటించడం కొన్నిసార్లు తనకు కష్టంగా ఉండేదని క్రిస్‌ గుర్తించాడు. అతను మార్పులు చేసుకోవాలనుకున్నాడు. అందుకే తాను గొడవపడ్డ సహోదరుని దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత నుండి క్రిస్‌ తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి చాలా కృషిచేశాడు. మార్పులు చేసుకోవడానికి క్రిస్‌ చేస్తున్న కృషిని చూసి ఆ సహోదరుడు కూడా మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ సమాధానంగా ఉంటూ యెహోవాను కలిసి సేవిస్తున్నారు.

“ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును.” (సామె. 15:22) జ్యానట్‌ స్నేహితురాలు ఆమెతో మాట్లాడడం మానేసినప్పుడు, జ్యానట్‌ ఈ లేఖనంలో ఉన్న విషయాన్ని పాటించాలని నిర్ణయించుకుంది. ఆమె ఆ సహోదరితో మాట్లాడడానికి వెళ్లింది. ఆమెను బాధపెట్టే పని ఏమైనా చేశానానని జ్యానట్‌ ఆ సహోదరిని అడిగింది. మొదట్లో, వాళ్లిద్దరికీ కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ వాళ్లు ప్రశాంతంగా మాట్లాడుకుంటుండగా ఆ ఇబ్బంది పోయింది. ఆ సహోదరి, గతంలో జరిగిన ఒక విషయాన్ని తానే అపార్థం చేసుకున్నానని, జ్యానట్‌ తనను బాధపెట్టే పని ఏమీ చేయలేదని అర్థంచేసుకుంది. ఆ సహోదరి జ్యానట్‌ను క్షమించమని అడిగింది. ఇప్పుడు వాళ్లిద్దరూ మళ్లీ స్నేహితులయ్యారు, యెహోవాను కలిసి సేవిస్తున్నారు.

“కాబట్టి, నువ్వు బలిపీఠం దగ్గరకు నీ అర్పణను తెస్తున్నప్పుడు, నీ సోదరుడు నీవల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి, ముందు నీ సోదరునితో సఖ్యత కుదుర్చుకో.” (మత్త. 5:23, 24) యేసు ఈ సలహాను కొండమీది ప్రసంగంలో ఇచ్చాడు. మైఖేల్‌ ఆ సహోదరుని గురించి చెడుగా మాట్లాడిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఏమి చేసైనాసరే పరిస్థితిని చక్కదిద్దాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకే అతను ఆ సహోదరుని దగ్గరకు వెళ్లి జరిగినదానికి తాను ఎంత బాధపడుతున్నాడో చెప్పాడు. అప్పుడు ఏమైంది? “నా సహోదరుడు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాడు” అని మైఖేల్‌ అంటున్నాడు. వాళ్లు ఇప్పుడు మళ్లీ స్నేహితులయ్యారు.

“ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి.” (కొలొ. 3:12-14) గొడవపడ్డ ఆ ఇద్దరు పయినీర్లు మీకు గుర్తున్నారా? వాళ్ల ప్రవర్తన ఇతరులను బాధపెడుతోందని, ఇబ్బంది కలిగిస్తోందని అర్థంచేసుకునేలా ఒక సంఘపెద్ద వాళ్లకు సహాయం చేశాడు. వాళ్లు ఒకరిపట్ల ఒకరు సహనం చూపిస్తూ సంఘంలో సమాధానాన్ని కాపాడేందుకు సహాయపడాలని ఆ సంఘపెద్ద చెప్పాడు. వాళ్లు అతనిచ్చిన సలహాను విని దాన్ని పాటించారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి మంచివార్త ప్రకటిస్తున్నారు.

మిమ్మల్ని ఎవరైనా బాధపెడితే, మీరు వినయం చూపించడానికి, ఆ వ్యక్తిని క్షమించడానికి, ఆ విషయాన్ని ఇక మర్చిపోవడానికి కొలొస్సయులు 3:12-14⁠లో ఉన్న అదే సలహా మీకు ఉపయోగపడుతుంది. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని క్షమించలేకపోతుంటే ఏమి చేయాలి? మనకు సహాయపడే ఒక బైబిలు సూత్రం మత్తయి 18:15⁠లో ఉంది. ఆ లేఖనంలో, ఘోరమైన పాపం చేసిన వ్యక్తితోనే కాదు, ఒక సహోదరుడు లేదా సహోదరితో సమస్య వచ్చినప్పుడు పాటించాల్సిన పద్ధతి గురించి కూడా యేసు వివరించాడు. మనం ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి దయగా, వినయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.

మనకు ఉపయోగపడే వేరే సలహాలు కూడా బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఆ సలహాల నుండి ప్రయోజనం పొందాలంటే మనం ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని’ చూపించాలి. అవి ఏమిటంటే: “ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం.” (గల. 5:22, 23) ఒకసారి ఆలోచించండి, ఒక మెషీన్‌ బాగా పనిచేయాలంటే దానిలో ఆయిల్‌ వేయాలి. అదేవిధంగా, గొడవల్ని త్వరగా పరిష్కరించుకోవాలన్నా, ఇతరులతో మంచి స్నేహాలు కలిగివుండాలన్నా యెహోవా పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని మనం చూపించాలి.

వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నవాళ్లతో సంఘంలో సంతోషం రెట్టింపౌతుంది

ఒక్కో వ్యక్తికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. మన లక్షణాలు, విషయాల్ని చూసే విధానం, మాట్లాడే విధానం వేరుగా ఉంటాయి. ఈ వైవిధ్యం వల్ల మనకు ఇతరులతో ఏర్పడే స్నేహాలు సంతోషంగా, ఆసక్తికరంగా ఉంటాయి. కానీ వేర్వేరు వ్యక్తిత్వాలవల్ల మనస్పర్థలు, అభిప్రాయభేదాలు కూడా వస్తాయి. అవి ఎలా వస్తాయో అనుభవం ఉన్న సంఘపెద్ద ఇలా చెప్పాడు, “సిగ్గు ఎక్కువున్న వ్యక్తికి, ఎక్కువ కలుపుగోలుగా ఉండే వ్యక్తితో ఉండడం కష్టంగా అనిపించవచ్చు. వాళ్ల మధ్య ఉన్న తేడా పట్టించుకునేంత పెద్దది కాదనిపించవచ్చు. కానీ, దానివల్ల పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది.” వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎప్పటికీ స్నేహితులుగా ఉండలేరని మీరనుకుంటున్నారా? ఇద్దరు అపొస్తలుల ఉదాహరణల్ని మనం పరిశీలిద్దాం. పేతురు అనగానే, ఏమనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి మనకు గుర్తుకురావచ్చు. యోహాను అనగానే, ఏదైన మాట్లాడే ముందే లేదా చేసే ముందు ఆలోచించే ప్రేమగల వ్యక్తి గుర్తుకురావచ్చు. పేతురు, యోహానులకు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నాయి. కానీ వాళ్లు యెహోవా సేవలో కలిసిమెలిసి పనిచేశారు. (అపొ. 8:14; గల. 2:9) నేడు మన విషయంలో కూడా అంతే. వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న క్రైస్తవులు కూడా కలిసిమెలిసి పనిచేయవచ్చు.

కానీ ఒకవేళ సంఘంలోని ఒక సహోదరుడు మీకు కోపం తెప్పించేలా మాట్లాడితే లేదా ప్రవర్తిస్తే? అప్పుడు, క్రీస్తు మీకోసం ఎలాగైతే చనిపోయాడో ఆ సహోదరుని కోసం కూడా చనిపోయాడని గుర్తుచేసుకోవడం మంచిది. అంతేకాదు మీరు అతనిపట్ల ప్రేమ చూపించాలని యేసు కోరుకుంటున్నాడు. (యోహా. 13:34, 35; రోమా. 5:6-8) అంతేగానీ అతనితో స్నేహం చేయకూడదని లేదా అతన్ని దూరం పెట్టాలని అనుకోవడం సరైనది కాదు. బదులుగా ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘ఆ సహోదరుడు యెహోవా నియమాలను ఏమైనా ఉల్లంఘిస్తున్నాడా? అతను కావాలనే నన్ను బాధపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? లేదా కేవలం మాకు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నాయా? మరిముఖ్యంగా, అతనిలో ఉన్న ఏ మంచి లక్షణాలు నేను నేర్చుకోవచ్చు?’

ఉదాహరణకు, ఎదుటి వ్యక్తికి ఎక్కువ మాట్లాడడమంటే ఇష్టం కానీ మీకు మౌనంగా ఉండడం ఇష్టమైతే మీరిద్దరూ ఎందుకు కలిసి ప్రీచింగ్‌ చేయకూడదు? అలా చేస్తున్నప్పుడు వాళ్లనుండి మీరేమి నేర్చుకోవచ్చో చూడండి. లేదా ఒకవేళ ఎదుటి వ్యక్తికి మీకన్నా ఉదారస్వభావం ఎక్కువ ఉంటే? వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, అవసరంలో ఉన్నవాళ్లకు చేయూతను ఇవ్వడం ద్వారా వచ్చే సంతోషాన్ని మీరు గుర్తించారా? ఉదారంగా ఉండే విషయంలో ఆ వ్యక్తి నుండి మీరు ఏమైనా నేర్చుకోగలరా? విషయమేమిటంటే మీ వ్యక్తిత్వం, మీ సహోదరుని వ్యక్తిత్వం వేరైనా అతనిలో ఉన్న మంచి లక్షణాల మీదే దృష్టిపెట్టండి. బహుశా మీరు ప్రాణ స్నేహితులు అవ్వలేకపోయినా, ఒకరికొకరు మాత్రం మరింత దగ్గరౌతారు. దానివల్ల మీ ఇద్దరి మధ్య అలాగే సంఘంలో సమాధానం ఉంటుంది.

మొదటి శతాబ్దంలో యువొదియ, సుంటుకే అనే ఇద్దరు సహోదరీలు ఉండేవాళ్లు. వాళ్లిద్దరికీ వేర్వేరు వ్యక్తిత్వాలు ఉండివుంటాయి. అయినప్పటికీ అపొస్తలుడైన పౌలు, “ప్రభువు సేవలో ఒకే ఆలోచనతో ఉండమని” వాళ్లను ప్రోత్సహించాడు. (ఫిలి. 4:2) మనం కూడా మన సహోదరసహోదరీలతో కలిసిమెలిసి యెహోవాను ఆరాధించాలని, సంఘంలో సమాధానాన్ని కాపాడాలని కోరుకుంటాం.

అభిప్రాయభేదాల్ని త్వరగా పరిష్కరించుకోండి

మనకు ఇతరులమీద ఏదైనా చెడు అభిప్రాయం కలిగితే దాన్ని ఎందుకు త్వరగా తీసేసుకోవాలి? అలాంటి అభిప్రాయాల్ని, అందమైన పూల తోటలో అక్కడక్కడ పెరిగే కలుపు మొక్కలతో పోల్చవచ్చు. ఆ కలుపు మొక్కల్ని పీకి పారేయకపోతే, పూల తోటంతా కలుపు మొక్కలతో నిండిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా, ఒకవేళ ఇతరులమీద మనకున్న చెడు అభిప్రాయాలు బలపడితే, అది సంఘమంతటిపై ప్రభావం చూపించవచ్చు. కానీ మనకు యెహోవా మీద, సహోదరుల మీద ప్రేమ ఉంటే సంఘంలో సమాధానాన్ని కాపాడడానికి చేయగలిగినదంతా చేస్తాం.

మీరు వినయంగా ఇతరులతో సమాధానపడడానికి ప్రయత్నిస్తే వచ్చే మంచి ఫలితాల్ని చూసి ఆశ్చర్యపోతారు

ఇతరులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు వచ్చే మంచి ఫలితాల్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. ఒక సహోదరికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె ఇలా చెప్పింది, “ఒక సహోదరి నన్ను చిన్నపిల్లని చూసినట్లు చూసేదని అనిపించింది. నాకు అది నచ్చేది కాదు. నాకు చిరాకు వచ్చినప్పుడు, ఆమెతో దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టాను. ‘ఆమె నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వనప్పుడు నేనెందుకు ఆమెను గౌరవించాలి’ అని నాకనిపించింది.”

కానీ ఆమె ఒకసారి తన ఆలోచనా విధానాన్ని పరిశీలించుకుంది. ఆ సహోదరి ఇంకా ఇలా చెప్పింది, “నాలో ఉన్న లోపాల్ని చూసుకున్నాక నాకు చాలా బాధనిపించింది. నేను నా ఆలోచన మార్చుకోవాలని గుర్తించాను. ఆ విషయం గురించి యెహోవాకు ప్రార్థించాక, ఆ సహోదరి కోసం ఒక చిన్న గిఫ్ట్‌ కొని ఆమెను సరిగ్గా అర్థం చేసుకోనందుకు క్షమించమని ఒక కార్డు మీద రాసిచ్చాను. మేమిద్దరం ఒకరినొకరం కౌగలించుకొని జరిగినదాన్ని మర్చిపోవాలనుకున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు.”

ప్రతీఒక్కరికి సమాధానం అవసరం. కానీ కొంతమంది అభద్రతా భావాలు, గర్వం వల్ల సమాధానాన్ని పాడుచేసేలా ప్రవర్తించవచ్చు. ఈ లోకంలో ఇది సర్వసాధారణం కావచ్చు కానీ తన ఆరాధకులు అలా ఉండాలని యెహోవా కోరుకోవట్లేదు. యెహోవాసాక్షుల మధ్య సమాధానం, ఐక్యత ఉండాలి. క్రైస్తవులు తాము అందుకున్న ‘పిలుపుకు తగ్గట్టు నడుచుకోవాలని’ పవిత్రశక్తి ప్రేరణతో పౌలు రాశాడు. “వినయంగా సౌమ్యంగా ఉంటూ, ఓర్పు చూపిస్తూ, ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగే ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండమని” పౌలు ప్రోత్సహించాడు. (ఎఫె. 4:1-3) యెహోవా ప్రజలు ఆనందించే సమాధానం, ఐక్యత చాలా విలువైనవి. కాబట్టి వాటిని మరింత బలపర్చుకోవడానికి, మన సహోదరసహోదరీలతో ఉండే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.