కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి!’

‘మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి!’

ఈ మాటలు ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన దావీదు తనకు ఎదురైన ఒక స్త్రీని మెచ్చుకుంటూ అన్నవి. ఆమె పేరు అబీగయీలు. ఇంతకీ దావీదు ఆమెను ఎందుకు మెచ్చుకున్నాడు? ఆమె నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

రాజైన సౌలు నుండి పారిపోతున్న సమయంలో దావీదు అబీగయీలును కలిశాడు. ఆమె భర్త ధనికుడైన నాబాలు, దక్షిణ యూదా కొండ ప్రాంతంలో అతనికి పశు సంపద చాలా ఉండేది. నాబాలుకు చెందిన పశువుల మందలకు, వాటి కాపరులకు దావీదు, అతని మనుషులు ‘రక్షణ గోడలా’ ఉండేవాళ్లు. ఒకసారి దావీదు తన మనుషులను నాబాలు దగ్గరకు పంపించి, ఆహారం రూపంలో ‘నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఇవ్వు’ అని అడిగించాడు. (1 సమూ. 25:8, 15, 16, NW) నిజానికి దావీదు, అతని మనుషులు నాబాలుకు చేసిన మంచితో పోలిస్తే వాళ్లు అడిగిన సహాయం పెద్ద విషయమేమీ కాదు.

నాబాలు అనే పేరుకు ‘మూర్ఖుడు’ అని అర్థం. అతను పేరుకు తగ్గట్టుగానే మూర్ఖుడు. దావీదు మనుషులు సహాయం చేయమని అడిగినప్పుడు నాబాలు వాళ్లను లెక్కచేయకుండా, కఠినంగా మాట్లాడి అవమానించాడు. దాంతో దావీదు అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. నాబాలు చేసిన ఒక తెలివితక్కువ పనికి అతనితోపాటు అతని ఇంట్లోవాళ్లు కూడా బాధపడాల్సి వచ్చేది.—1 సమూ. 25:2-13, 21, 22.

నాబాలు అనాలోచితంగా అన్న మాటలకు ఎలాంటి అనర్థం జరగబోతోందో అబీగయీలు పసిగట్టింది. దాంతో ఆమె ధైర్యంగా ఒక చర్య తీసుకుంది. ఆమె దావీదుకు ఎదురెళ్లి గౌరవంగా మాట్లాడుతూ యెహోవాతో అతనికున్న సంబంధాన్ని గుర్తుచేసింది. అంతేకాదు కాబోయే రాజైన దావీదుకు, అతని మనుషులకు సరిపడేంత ఆహారాన్ని తయారుచేసి ఇచ్చింది. అప్పుడు, తాను దేవునికి ఇష్టంలేని పని చేయకుండా ఆపడానికి యెహోవా ఆమెను ఉపయోగించుకున్నాడని దావీదు గ్రహించాడు. అందుకే అతను అబీగయీలుతో, ‘నువ్వు మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి! రక్తాపరాధం జరగకుండా, నన్ను ఆపినందుకు నువ్వు దీవెన పొందాలి’ అని అన్నాడు.—1 సమూ. 25:18, 19, 23-35, NW.

ఇతరులు చేసిన మంచిని మర్చిపోయే నాబాలులా మనం అస్సలు ఉండాలనుకోం. బదులుగా జరగబోయే తప్పును వివేచనతో ముందుగానే పసిగట్టి, దాన్ని ఆపడానికి ఏదోకటి చేయాలనుకుంటాం. ఒక సందర్భంలో కీర్తనకర్త దేవున్ని ఇలా అడిగాడు, “మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.” మన మనసులో మాట కూడా అదే కదా?—కీర్త. 119:66.

మన పని వెనకున్న వివేచనను లేదా తెలివిని ఇతరులు గుర్తించవచ్చు. అయితే వాళ్లు దాన్ని మనతో చెప్పినా, చెప్పకపోయినా దావీదులా వాళ్లు కూడా ‘మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి!’ అని మన గురించి అనుకుంటారు.