కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”

“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”

‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి మీ హృదయాలకు కాపలా ఉంటుంది.’ఫిలి. 4:7.

పాటలు: 112, 58

1, 2. ఫిలిప్పీలో పౌలుకు, సీలకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

 ఒకసారి దీన్ని ఊహించుకోండి. అర్ధరాత్రి కావస్తోంది. మిషనరీలైన పౌలు, సీల ఫిలిప్పీ నగరంలోని జైల్లో ఒక మూలన ఉన్న చీకటి గదిలో ఉన్నారు. వాళ్ల కాళ్లను బొండలో బిగించడం వల్ల ఎటూ కదల్లేకపోతున్నారు, అంతేకాదు తీవ్రంగా కొట్టడం వల్ల వాళ్లు నడుము నొప్పితో విలవిలలాడుతున్నారు. (అపొ. 16:23, 24) అసలేమైందంటే ఆ రోజు, ఉన్నట్టుండి ఒక గుంపు వచ్చి పౌలును, సీలను సంతవీధిలోకి ఈడ్చుకెళ్లి, అక్కడున్న కోర్టులో హాజరుపర్చారు. అక్కడ వాళ్ల బట్టలు చింపేసి, కర్రలతో దారుణంగా కొట్టారు. (అపొ. 16:16-22) ఎంత అన్యాయం! నిజానికి పౌలు రోమా పౌరుడు కాబట్టి విచారణ సరైన రీతిలో జరపాలి. a

2 జైల్లో ఉన్న పౌలు ఆ రోజు జరిగిన విషయాల గురించి, ఫిలిప్పీ నగరంలో ఉంటున్న ప్రజల గురించి ఆలోచించివుంటాడు. పౌలు వెళ్లిన మిగతా నగరాల్లో ఉన్నట్టు ఫిలిప్పీ నగరంలో సభామందిరం లేదు. దానివల్ల యూదులు ఆరాధన కోసం నగర ద్వారాల బయట ఒక నది దగ్గర కలుసుకునేవాళ్లు. (అపొ. 16:13, 14) సాధారణంగా ఒక సభామందిరం కట్టాలంటే ఆ ఊరిలో కనీసం పదిమంది యూదులైనా ఉండాలి. మరి ఆ నగరంలో కనీసం పదిమంది యూదులు కూడా లేరా? ఫిలిప్పీ ప్రజలకు తాము రోమా పౌరులమనే గర్వం ఉండేది. (అపొ. 16:21) అందువల్లేనేమో యూదులైన పౌలు, సీల కూడా రోమా పౌరులు అయ్యుంటారని వాళ్లు ఊహించలేదు. వాస్తవమేంటో మనకు ఖచ్చితంగా తెలీదు, కానీ పౌలు, సీలను వాళ్లు అన్యాయంగా జైల్లో వేశారని మాత్రం మనకు తెలుసు.

3. తనను జైల్లో వేసినప్పుడు పౌలు ఎందుకు అయోమయంలో పడివుంటాడు? అయినా అతను ఎలాంటి వైఖరి చూపించాడు?

3 అసలు తాను ఫిలిప్పీకి ఎలా వచ్చాననే దానిగురించి కూడా పౌలు ఆలోచించివుంటాడు. కొన్ని నెలల క్రితం పౌలు ఏజియన్‌ సముద్రానికి అవతలి వైపున ఉన్న ఆసియా మైనరులో ఉన్నాడు. అక్కడున్న కొన్ని ప్రాంతాల్లో ప్రకటించకుండా పవిత్రశక్తి అతన్ని పదేపదే అడ్డుకుంది. ఒకవిధంగా పవిత్రశక్తి తనను వేరేచోటికి నడిపిస్తున్నట్లు అతనికి అనిపించింది. (అపొ. 16:6, 7) కానీ ఎక్కడికి? త్రోయలో ఉన్నప్పుడు పౌలుకు వచ్చిన ఒక దర్శనంలో, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి” అనే నిర్దేశం అందింది. యెహోవా చిత్తం ఏమిటో స్పష్టమైంది! పౌలు వెంటనే మాసిదోనియకు వెళ్లాడు. (అపొస్తలుల కార్యములు 16:8-10 చదవండి.) మరి తర్వాత ఏమి జరిగింది? మాసిదోనియకు వచ్చీరాగానే అతను జైలు పాలయ్యాడు! అలా జరగడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు? జైల్లో ఎంతకాలం ఉండాలి? అనే విషయాల గురించి కూడా పౌలు ఆలోచించివుండవచ్చు. అయినా అతను తన విశ్వాసాన్ని, సంతోషాన్ని కోల్పోలేదు. పౌలు, సీల ‘ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించడం’ మొదలుపెట్టారు. (అపొ. 16:25) దేవుని శాంతి వాళ్ల హృదయాలకు, మనసులకు నెమ్మదినిచ్చింది.

4, 5. (ఎ) పౌలులాంటి పరిస్థితి మనకు ఎప్పుడు ఎదురవ్వవచ్చు? (బి) అనుకోకుండా పౌలు పరిస్థితి ఎలా మారిపోయింది?

4 మీకు ఎప్పుడైనా పౌలులా అనిపించిందా? బహుశా ఏదైనా నిర్ణయాన్ని పవిత్రశక్తి సహాయంతోనే తీసుకున్నామని అనిపించిన సందర్భాలు మీ జీవితంలో ఉండేవుంటాయి. కానీ ఆ నిర్ణయం వల్ల మీరు సవాళ్లు ఎదుర్కొనివుంటారు లేదా మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు చేసుకునివుండవచ్చు. (ప్రసం. 9:11) ఆ పరిస్థితుల గురించి ఆలోచించినప్పుడు, యెహోవా ఎందుకు అలాంటివి అనుమతించాడని మీకు అనిపించివుండవచ్చు. ఒకవేళ అలా అనిపించివుంటే యెహోవా మీద పూర్తి నమ్మకంతో సహిస్తూ ఉండడానికి మీకేది సహాయం చేస్తుంది? జవాబు తెలుసుకోవడానికి పౌలుకు, సీలకు ఎదురైన అనుభవాల్ని పరిశీలిద్దాం.

5 పౌలు, సీల పాడుతూ ఉండగా ఊహించని ఎన్నో సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ముందు, అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చింది. వెంటనే జైలు తలుపులు తెరుచుకున్నాయి, ఖైదీలందరికీ బిగించిన బొండలు ఊడిపోయాయి. తర్వాత ఆత్మహత్య చేసుకోబోతున్న జైలు అధికారిని పౌలు ఆపాడు, ఆ తర్వాత ఆ అధికారితో సహా అతని కుటుంబమంతా బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాతి రోజు తెల్లవారుజామున నగర పాలకులు రక్షకభటుల్ని పంపించి పౌలు, సీలను విడుదల చేసి, వాళ్లను శాంతియుతంగా పంపించే ఏర్పాటు చేశారు. పౌలు, సీల రోమా పౌరులని తెలుసుకున్న నగర పాలకులకు తాము చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. దాంతో వాళ్లిద్దర్ని సురక్షితంగా పంపించడానికి స్వయంగా వాళ్లే వచ్చారు. కానీ పౌలు, సీల అలా వెళ్లిపోవడానికి ముందు, కొత్తగా బాప్తిస్మం తీసుకున్న తమ సహోదరి లూదియను చూసి వెళ్లాలని అనుకున్నారు. అంతేకాదు ఫిలిప్పీలో ఉన్న సహోదరుల్ని కూడా బలపర్చడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. (అపొ. 16:26-40) నిమిషాల్లో పరిస్థితులు ఎలా మారిపోయాయో కదా!

‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది’

6. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

6 మనం ఆ సంఘటనల నుండి ఏమి నేర్చుకోవచ్చు? యెహోవా మనం ఊహించని వాటిని చేయగలడు, కాబట్టి మనకు పరీక్షలు ఎదురైనప్పుడు ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం పౌలు హృదయంలో బలంగా నాటుకుపోయిందని అతను కొంతకాలం తర్వాత ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరాన్ని బట్టి చెప్పవచ్చు. అతను ఆ ఉత్తరంలో ఆందోళన గురించి, దేవుని శాంతి గురించి రాశాడు. ఫిలిప్పీయులు 4:6, 7 వచనాల్లో పౌలు రాసిన మాటల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. (చదవండి.) అలాగే, తన సేవకులు ఊహించని వాటిని యెహోవా చేసిన మరికొన్ని పనుల్ని పరిశీలిస్తాం. చివరిగా, యెహోవా మీద పూర్తి నమ్మకంతో కష్టాల్ని సహిస్తూ ఉండడానికి “దేవుని శాంతి” మనకెలా సహాయం చేస్తుందో కూడా పరిశీలిస్తాం.

7. పౌలు తన ఉత్తరం ద్వారా ఫిలిప్పీలోని సహోదరులకు ఏ విషయం నేర్పించాడు? దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

7 ఫిలిప్పీలోని సహోదరులు పౌలు రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించినప్పుడు సంఘంలోని వాళ్లకు ఏ విషయాలు గుర్తొచ్చి ఉంటాయి? చాలామందికి పౌలు–సీలను జైల్లో వేయడం, తర్వాత ఊహించని రీతిలో యెహోవా వాళ్లను కాపాడడం గుర్తొచ్చి ఉంటాయి. తన ఉత్తరం ద్వారా పౌలు వాళ్లకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, ‘ఆందోళన పడకండి, ప్రార్థించండి. అప్పుడు మీరు దేవుని శాంతిని పొందుతారు.’ దేవుని శాంతి ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది’ అని పౌలు వాళ్లకు చెప్పాడు. దానర్థమేమిటి? దేవుని శాంతి, ‘మన కలలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది’ లేదా ‘మనుషుల ప్రణాళికలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది’ అని కొన్ని బైబిలు అనువాదాలు చెప్తున్నాయి. కాబట్టి, “దేవుని శాంతి” మనం ఊహించగలిగే దానికన్నా ఎంతో అద్భుతమైనదని పౌలు చెప్తున్నాడు. కొన్నిసార్లు మన సమస్యలకు పరిష్కారం ఏమిటో మనకు తెలియకపోవచ్చు, కానీ యెహోవాకు తెలుసు. అంతేకాదు మన ఊహకందని దాన్ని ఆయన చేయగలడు.2 పేతురు 2:9 చదవండి.

8, 9. (ఎ) ఫిలిప్పీలో పౌలుకు అన్యాయం జరిగినా, ఆ సంఘటనల వల్ల ఏ మంచి జరిగింది? (బి) ఫిలిప్పీలోని సహోదరులు పౌలు మాటలపై పూర్తి నమ్మకం ఎందుకు ఉంచగలిగారు?

8 గత పదేళ్లుగా యెహోవా తమకు చేస్తున్న సహాయాన్ని ఫిలిప్పీలోని సహోదరులు గుర్తుచేసుకున్నప్పుడు పౌలు రాసిన ఉత్తరం ఖచ్చితంగా వాళ్లను బలపర్చివుంటుంది. పౌలు, సీల అన్యాయానికి గురయ్యేలా యెహోవా అనుమతించినా, ఆ సంఘటనలు “మంచివార్త తరఫున వాదించడానికి, దాన్ని ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించడానికి” బాటలు వేశాయి. (ఫిలి. 1:7) ఇక ఫిలిప్పీ నగర పాలకులు కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘాన్ని హింసించే ధైర్యం చేయలేదు. అంతేకాదు బహుశా పౌలు తన రోమా పౌరసత్వం గురించి తెలియజేయడం వల్లే, పౌలు సీలలు వెళ్లిపోయిన తర్వాత కూడా లూకా అక్కడే ఉండగలిగాడు. దానివల్ల లూకా, ఫిలిప్పీలో కొత్తగా క్రైస్తవులు అయినవాళ్లకు కావాల్సిన అదనపు సహాయాన్ని చేయగలిగాడు.

9 పౌలు రాసిన ఉత్తరంలోని మాటలు కేవలం అతని సొంత ఆలోచనలు కావని ఆ సహోదరులకు తెలుసు. పౌలు ఎన్నో తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొన్నాడు. అంతెందుకు పౌలు వాళ్లకు ఆ ఉత్తరం రాసే సమయంలో కూడా రోమాలోని తన ఇంట్లో ఖైదీగా ఉన్నాడు. ఆ పరిస్థితిలో కూడా తనకు “దేవుని శాంతి” తోడుగా ఉందని పౌలు చూపించాడు.—ఫిలి. 1:12-14; 4:7, 11, 22.

“ఏ విషయంలోనూ ఆందోళన పడకండి”

10, 11. మనం దేని గురించైనా ఆందోళన పడుతున్నప్పుడు ఏమి చేయాలి? మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

10 ‘ఏ విషయంలోనూ ఆందోళన పడకుండా’ “దేవుని శాంతి” కలిగివుండేలా ఏది మనకు సహాయం చేస్తుంది? మనం దేని గురించైనా ఆందోళన పడుతుంటే దానికి సరైన పరిష్కారం ప్రార్థనే అని పౌలు ఫిలిప్పీయులకు రాసిన మాటలు చూపిస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఆందోళనలతో సతమతమౌతుంటే, వాటి గురించి యెహోవాకు ప్రార్థించాలి. (1 పేతురు 5:6, 7 చదవండి.) అయితే అలా ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన మీపై శ్రద్ధ చూపిస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండండి. మీరు పొందే ప్రతీ దీవెన బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. మరిముఖ్యంగా, యెహోవా “మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు” అని ఎన్నడూ మర్చిపోకండి.—ఎఫె. 3:20.

11 యెహోవా మనకు చేసే సహాయాన్ని చూసినప్పుడు పౌలు, సీలల్లాగే మనం కూడా ఆశ్చర్యపోతాం. యెహోవా మన కోసం అద్భుతాలు చేయకపోవచ్చు కానీ ఎప్పుడూ సరిగ్గా మనకు అవసరమైనవే చేస్తాడు. (1 కొరిం. 10:13) దానర్థం యెహోవా పరిస్థితిని సరిదిద్దేవరకు లేదా సమస్యను పరిష్కరించేవరకు మనం ఏమీ చేయకుండా ఎదురుచూస్తూ కూర్చోవాలని కాదు. బదులుగా మన ప్రార్థనలకు తగ్గట్టు నడుచుకోవాలి. (రోమా. 12:11) అప్పుడు మన పనుల్లో నిజాయితీ కనిపిస్తుంది, యెహోవాకు మనల్ని దీవించాలనిపిస్తుంది. మనం అడిగేవాటికన్నా, ఎదురుచూసేవాటికన్నా ఎంతో గొప్పవాటిని యెహోవా చేయగలడని మర్చిపోకూడదు. కొన్నిసార్లు మనం ఊహించనిది చేయడం ద్వారా యెహోవా మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. అలాంటి కొన్ని ఉదాహరణల్ని ఇప్పుడు పరిశీలిద్దాం, ఆయనపై మనకున్న నమ్మకాన్ని అవి బలపరుస్తాయి.

ఊహించనివి జరిగిన సందర్భాలు

12. (ఎ) సన్హెరీబు బెదిరించినప్పుడు హిజ్కియా ఏమి చేశాడు? (బి) యెహోవా ఆ సమస్యను పరిష్కరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

12 ఎవ్వరూ ఊహించని వాటిని యెహోవా చేసిన ఎన్నో సందర్భాలను మనం బైబిల్లో చూడవచ్చు. ఉదాహరణకు, హిజ్కియా యూదాను పరిపాలిస్తున్న సమయంలో, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా మీదికి దండెత్తి యెరూషలేమును తప్ప మిగతా నగరాలన్నిటినీ జయించాడు. (2 రాజు. 18:1-3, 13) ఆ తర్వాత యెరూషలేమును కూడా చేజిక్కించుకోవడానికి వచ్చాడు. అప్పుడు హిజ్కియా ఏమి చేశాడు? ముందు అతను సహాయం కోసం యెహోవాకు ప్రార్థన చేశాడు, సలహా కోసం యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్లాడు. (2 రాజు. 19:5, 15-20) తర్వాత, సన్హెరీబు విధించిన జరిమానా చెల్లించడం ద్వారా తాను మొండివాడిని కానని చూపించాడు. (2 రాజు. 18:14, 15) చివరిగా, పట్టణం అంత తేలిగ్గా ముట్టడి వేయబడకుండా చర్యలు తీసుకున్నాడు. (2 దిన. 32:2-4) కానీ ఏమైంది? యెహోవా ఒక దూతను పంపించి ఒక్క రాత్రిలోనే సన్హెరీబు సైన్యంలోని 1,85,000 మందిని చంపించాడు. అలా జరుగుతుందని కనీసం హిజ్కియా కూడా ఊహించలేదు!—2 రాజు. 19:35.

యోసేపు జీవితంలో జరిగిన దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?—ఆది. 41:42 (13వ పేరా చూడండి)

13. (ఎ) యోసేపు జీవితంలో జరిగిన దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) శారా జీవితంలో ఏ అద్భుతం జరిగింది?

13 యువకుడైన యోసేపు గురించి కూడా ఆలోచించండి. ఐగుప్తు జైల్లో ఉన్న యోసేపు ఫరోకు తర్వాతి స్థానంలో ఉంటానని లేదా తన కుటుంబాన్ని కరువు నుండి కాపాడడానికి యెహోవా తనను ఉపయోగించుకుంటాడని ఎప్పుడూ ఊహించివుండడు. (ఆది. 40:15; 41:39-43; 50:20) యోసేపు ఊహించిన వాటన్నిటికన్నా గొప్ప పనులు యెహోవా చేశాడు అనడంలో సందేహమే లేదు. యోసేపు బామ్మ శారా గురించి కూడా ఆలోచించండి. తన సేవకురాలి కొడుకే తన కొడుకు అవుతాడని వృద్ధాప్యంలో ఉన్న శారా అనుకుంది. కానీ తానే స్వయంగా ఒక కొడుకును కనేలా యెహోవా దీవిస్తాడని ఊహించిందా? తనకు పిల్లలు పుడతారని శారా ఎప్పుడూ ఊహించలేదు.—ఆది. 21:1-3, 6, 7.

14. మనం యెహోవా మీద ఎలాంటి నమ్మకంతో ఉండవచ్చు?

14 కొత్తలోకం రాకముందే యెహోవా మన కష్టాలన్నీ అద్భుతరీతిలో తీసేయాలని మనం కోరుకోం. అంతేకాదు, మన జీవితంలో అద్భుతాలు చేయమని పట్టుబట్టి యెహోవాను అడగం. అయితే గతంలో యెహోవా తన నమ్మకమైన సేవకులకు అద్భుత రీతుల్లో సహాయం చేశాడని మనకు తెలుసు. ఆయన మారలేదు. (యెషయా 43:10-13 చదవండి.) అది ఆయన మీద మనకున్న నమ్మకాన్ని పెంచుతుంది. తన ఇష్టాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని ఆయన మనకిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (2 కొరిం. 4:7-9) హిజ్కియా, యోసేపు, శారాల ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు.

యెహోవాకు నమ్మకంగా ఉంటే, తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు

15. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం ‘దేవుని శాంతిని’ ఎలా కలిగి ఉండవచ్చు? అది దేనివల్ల సాధ్యమౌతుంది?

15 కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం ‘దేవుని శాంతిని’ ఎలా కలిగి ఉండవచ్చు? అందుకోసం యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలంగా ఉంచుకోవాలి. అయితే యేసుక్రీస్తు చెల్లించిన విమోచన క్రయధనం వల్ల మాత్రమే అది సాధ్యమౌతుంది. విమోచన క్రయధన ఏర్పాటు యెహోవా చేసిన అద్భుతాల్లో ఒకటి. దాని ఆధారంగా యెహోవా మన పాపాల్ని క్షమిస్తున్నాడు. దానివల్ల నిర్మలమైన మనస్సాక్షితో ఆయనకు దగ్గరౌతున్నాం.—యోహా. 14:6; యాకో. 4:8; 1 పేతు. 3:21.

అది మీ హృదయాలకు, మనసులకు కాపలా ఉంటుంది

16. మనం ‘దేవుని శాంతిని’ పొందినప్పుడు ఏమి జరుగుతుంది? వివరించండి.

16 ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతిని’ మనం పొందినప్పుడు ఏమి జరుగుతుంది? అది మన హృదయాలకు, మనసులకు “కాపలా ఉంటుంది” అని బైబిలు చెప్తోంది. (ఫిలి. 4:7) ఆదిమ భాషలో “కాపలా” అనే మాట స్థానంలో, ఒక నగరాన్ని కాపాడడానికి నియమించిన సైనికుల గుంపును సూచించే పదాన్ని ఉపయోగించారు. ఫిలిప్పీ నగరాన్ని అలాంటి ఒక సైనికుల గుంపు కాపలా కాసేది. దాంతో ఆ నగరంలోని ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో రాత్రంతా హాయిగా నిద్రపోయేవాళ్లు. అదేవిధంగా మనం ‘దేవుని శాంతిని’ పొందినప్పుడు ఆందోళనపడం; మన హృదయాలు, మనసులు నెమ్మదితో ఉంటాయి. యెహోవాకు మన మీద శ్రద్ధ ఉందని, మనం విజయం సాధించాలని ఆయన కోరుకుంటున్నాడని మనకు తెలుసు. (1 పేతు. 5:10) ఆందోళన, నిరుత్సాహం వల్ల కృంగిపోకుండా ఉండేలా అది మనల్ని కాపాడుతుంది.

17. మహాశ్రమ సమయంలో యెహోవా మీద నమ్మకముంచేలా ఏది మనకు సహాయం చేస్తుంది?

17 త్వరలోనే మనుషులందరి మీదికి మహాశ్రమ రాబోతుంది. (మత్త. 24:21, 22) వ్యక్తిగతంగా మనకేమి జరుగుతుందో మనకు పూర్తిగా తెలీదు. అయితే, మనం ఆ సమయం గురించి అతిగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. యెహోవా చేయబోతున్నదంతా మనకు తెలియకపోవచ్చు కానీ మన దేవుని గురించి మనకు తెలుసు. గతంలో తన నమ్మకమైన సేవకుల కోసం ఆయన ఏమి చేశాడో మనకు తెలుసు. ఏం జరిగినా సరే, యెహోవా తన సంకల్పం నెరవేరుస్తాడని మనం తెలుసుకున్నాం. ఆయన దాన్ని మనం ఊహించని రీతిలో కూడా చేయవచ్చు! కాబట్టి యెహోవా ఇప్పుడు మన కోసం చేసేదేదైనా, ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతిని’ ఒక కొత్త రీతిలో అనుభవించే అవకాశాన్నిస్తుంది.

a బహుశా సీల కూడా రోమా పౌరుడే అయ్యుంటాడు.—అపొ. 16:37.