కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి, దానికి దూరంగా ఉండడం ఎలా?

పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి, దానికి దూరంగా ఉండడం ఎలా?

“మీ పాత వ్యక్తిత్వాన్ని, దాని అలవాట్లతో సహా వదిలేయండి.”కొలొ. 3:9.

పాటలు: 121, 142

1, 2. ప్రజలు యెహోవాసాక్షుల్లో ఎలాంటి ప్రత్యేకతల్ని గమనించారు?

 యెహోవాసాక్షులు ప్రత్యేకమైనవాళ్లని చాలామంది అంటారు. ఉదాహరణకు ఆంటాన్‌ గిల్‌ అనే ఒక రచయిత, జర్మనీలోని నాజీ పరిపాలనలో జీవించిన యెహోవాసాక్షులు మంచి లక్షణాలు చూపించారని మెచ్చుకున్నాడు. అతనిలా రాశాడు, “నాజీలకు యెహోవాసాక్షులతో ప్రత్యేకమైన శత్రుత్వం ఉండేది. . . . 1939 నాటికి (కాన్‌సంట్రేషన్‌ క్యాంపుల్లో) వాళ్ల సంఖ్య 6,000 చేరింది.” యెహోవాసాక్షులు తీవ్రమైన హింసకు గురైనప్పటికీ, వాళ్లు నిజాయితీపరులని, ఒత్తిడి కలిగించే పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటారని, తమ దేవునికి నమ్మకంగా ఉంటారని, కలిసిమెలిసి ఉంటారని పేరు తెచ్చుకున్నారు.

2 ఈ మధ్యే, దక్షిణ ఆఫ్రికాలోని ప్రజలు యెహోవాసాక్షుల మధ్య ఉండే మరొక ప్రత్యేకతను గుర్తించారు. ఒకప్పుడు ఆ దేశంలో, నల్లజాతికి చెందిన సాక్షులు అలాగే తెల్లజాతికి చెందిన సాక్షులు ఒకచోట కలుసుకోవడానికి అనుమతి ఉండేది కాదు. అయితే 2011 డిసెంబరు 18, ఆదివారం రోజున, దక్షిణ ఆఫ్రికాలో అలాగే దాని దగ్గర్లో ఉన్న దేశాల నుండి వేర్వేరు జాతులకు చెందిన 78,000 కన్నా ఎక్కువమంది సాక్షులు ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం జోహాన్నస్‌బర్గ్‌లోని అతిపెద్ద స్టేడియంలో కలుసుకున్నారు. వాళ్లను చూసి స్టేడియం మేనేజర్లలో ఒకతను ఇలా అన్నాడు, “నేను చూసినంతవరకు, ఈ స్టేడియంలో పద్ధతిగా ప్రవర్తించిన గుంపు మీదే. అందరూ చక్కని బట్టలు వేసుకున్నారు, స్టేడియంను చాలా బాగా శుభ్రం చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా, మీరందరూ వేర్వేరు జాతులకు చెందినవాళ్లు.”

3. మన సహోదరత్వంలోని ప్రత్యేకత ఏమిటి?

3 కాబట్టి సాక్షులుకానివాళ్ల ప్రశంసలు, మన అంతర్జాతీయ సహోదరత్వం ప్రత్యేకమైనదనే విషయాన్ని చాటిచెప్తున్నాయి. (1 పేతు. 5:9, అధస్సూచి) ఇతర సంస్థలతో పోలిస్తే మనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మనం బైబిలు అలాగే దేవుని పవిత్రశక్తి సహాయంతో యెహోవాకు నచ్చనివాటిని తీసేసుకోవడానికి తీవ్రంగా కృషిచేస్తాం. మనం ‘పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి’ ‘కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటాం.’—కొలొ. 3:9, 10.

4. ఈ ఆర్టికల్‌లో ఏ విషయాలు తెలుసుకుంటాం? ఎందుకు?

4 మనం పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టేశాక, ఇక దానికి దూరంగా ఉండాలి. ఈ ఆర్టికల్‌లో, మనం పాత వ్యక్తిత్వాన్ని ఎలా వదిలిపెట్టవచ్చో, అలా చేయడం ఎందుకు అంత ప్రాముఖ్యమో మొదట తెలుసుకుంటాం. ఒక వ్యక్తి చెడు అలవాట్లకు బానిస అయిపోయినప్పటికీ వాటినుండి బయటకు రావడం సాధ్యమేననే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అంతేకాదు ఎంతోకాలంగా సత్యంలో ఉన్నవాళ్లు తమ పాత వ్యక్తిత్వానికి దూరంగా ఉండడానికి ఏమి చేయవచ్చో పరిశీలిస్తాం. ఇలాంటి విషయాల్ని పరిశీలించడం ముఖ్యమే అంటారా? అవును ముఖ్యమే. ఎందుకంటే, ఒకప్పుడు యెహోవాను ఆరాధించినవాళ్లు జాగ్రత్తగా లేకపోవడంవల్ల పక్కకు తొలగిపోయారు. అది బాధకలిగించే విషయం. వాళ్లు ఒకప్పటిలా, అంటే యెహోవా గురించి తెలుసుకోకముందు ఆలోచించినట్లు, ప్రవర్తించినట్లు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి మనలో ప్రతీఒక్కరం ఈ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: “తాను నిలబడి ఉన్నానని అనుకునే వ్యక్తి పడిపోకుండా చూసుకోవాలి.”—1 కొరిం. 10:12.

లైంగిక కోరికలన్నిటికి దూరంగా ఉండండి

5. (ఎ) పాత వ్యక్తిత్వాన్ని వీలైనంత త్వరగా ఎందుకు వదిలిపెట్టాలో ఉదాహరణతో వివరించండి. (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) పాత వ్యక్తిత్వానికి సంబంధించిన ఎలాంటి వాటిగురించి కొలొస్సయులు 3:5-9 వచనాల్లో ఉంది?

5 మీరు వేసుకున్న బట్టలు మురికిగా ఉన్నాయని, కంపు కొడుతున్నాయని గుర్తిస్తే మీరేమి చేస్తారు? వీలైనంత త్వరగా వాటిని విప్పేస్తారు కదా! అదే విధంగా, ఒకవేళ మనం యెహోవా అసహ్యించుకునే పనులను చేస్తున్నామని గుర్తిస్తే వెంటనే వాటిని మానేయాలి. అలాంటి తప్పుడు పనుల గురించి మాట్లాడుతూ పౌలు ఇలా అన్నాడు, “మీరు వాటన్నిటినీ వదిలేయాలి.” వాటిలో రెండింటి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. అవి: లైంగిక పాపాలు, అపవిత్రత.—కొలొస్సయులు 3:5-9 చదవండి.

6, 7. (ఎ) పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టడానికి కృషి అవసరమని పౌలు మాటలు ఎలా చూపిస్తున్నాయి? (బి) సాకూరా జీవితం ఎలా ఉండేది? మారడానికి ఆమెకు ఏమి సహాయం చేసింది?

6 లైంగిక పాపాలు. చట్టబద్ధంగా పెళ్లితో ఒక్కటైన భార్యాభర్తల మధ్య కాకుండా, వేరే ఏ ఇద్దరి మధ్య లైంగిక సంబంధమున్నా అది బైబిలు ప్రకారం ‘లైంగిక పాపమే.’ స్వలింగ సంయోగం కూడా ఆ కోవకే చెందుతుంది. లైంగిక పాపాల విషయంలో, క్రైస్తవులు తమ ‘శరీర అవయవాల్ని చంపేసుకోవాలని’ పౌలు చెప్పాడు. అంటే తప్పుడు కోరికల్ని చంపేసుకోవడానికి మనం చాలా తీవ్రంగా కృషిచేయాలని దానర్థం. తప్పుడు కోరికలకు వ్యతిరేకంగా పోరాడడం కష్టమే కావచ్చు, అయినా మనం విజయం సాధించగలం!

7 జపాన్‌లో ఉంటున్న సాకూరా a అనే సహోదరికి ఏమి జరిగిందో ఒకసారి పరిశీలించండి. పెరిగి పెద్దవుతున్న సాకూరా ఒంటరితనంతో, బాధతో సతమతమయ్యేది. ఒంటరితనం నుండి బయటపడడానికి 15 ఏళ్ల వయసు నుండి ఎంతోమందితో సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టింది. మూడుసార్లు అబార్షన్‌ చేయించుకుంది. సాకూరా ఇలా అంటోంది, “వేరేవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకున్న కొత్తలో, నా అవసరం కొంతమందికి ఉందనీ, నన్ను ప్రేమించేవాళ్లు ఉన్నారనీ అనుకోవడం వల్ల నాలో భద్రతా భావం కలిగింది. కానీ ఎక్కువమందితో సంబంధం పెట్టుకునే కొద్దీ, అభద్రతాభావం కూడా పెరిగింది.” ఆమెకు 23 ఏళ్లు వచ్చేవరకు సాకూరా అలాంటి జీవితమే గడిపింది. ఆ తర్వాత ఆమె యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. నేర్చుకుంటున్న విషయాలు ఆమెకు చాలా నచ్చాయి. యెహోవా సహాయంతో పాత జీవితం నుండి, అలాగే తప్పు చేశాననే బాధ, సిగ్గు నుండి బయటపడింది. ఇప్పుడు సాకూరా క్రమపయినీరుగా సేవచేస్తోంది. తాను ఒంటరిదాన్ననే బాధ ఇప్పుడు ఆమెకు అస్సలు లేదు. ఇప్పుడు సాకూరా ఇలా చెప్తోంది, ‘ప్రతీరోజు యెహోవా ప్రేమను ఆనందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.’

అపవిత్రతకు ఎలా దూరంగా ఉండాలి?

8. దేవుడు మనల్ని అసహ్యించుకునేలా చేసే కొన్ని అలవాట్లు ఏమిటి?

8 అపవిత్రత. బైబిలు ప్రకారం, “అపవిత్రత” అంటే కేవలం లైంగిక పాపాలు మాత్రమే కాదు. సిగరెట్‌ తాగడం, ద్వంద్వ అర్థాలిచ్చే జోకులు వేయడం వంటివి కూడా అపవిత్రత కిందకే వస్తాయి. (2 కొరిం. 7:1; ఎఫె. 5:3, 4) అంతేకాదు రహస్యంగా చేసే పనులు, అంటే లైంగిక కోరికలు పుట్టించే పుస్తకాలు చదవడం, అశ్లీల చిత్రాలు చూడడం వంటివి కూడా ఆ కోవకే చెందుతాయి. ఇలాంటివి హస్తప్రయోగం లాంటి చెడు అలవాటుకు దారితీయవచ్చు.—కొలొ. 3:5. b

9. “అదుపులేని లైంగిక వాంఛ” వల్ల ఏమి జరగవచ్చు?

9 అలవాటుగా అశ్లీలచిత్రాలను చూసేవాళ్లలో “అదుపులేని లైంగిక వాంఛ” పెరిగి చివరికి సెక్స్‌కు బానిసలైపోతారు. అశ్లీలచిత్రాలకు బానిసలవ్వడం అనేది మద్యానికి లేదా డ్రగ్స్‌కు బానిసలవ్వడం లాంటిదేనని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి అశ్లీలచిత్రాలు చూడడంవల్ల ఘోరమైన పర్యవసానాలు ఉంటాయని అనడంలో ఆశ్చర్యంలేదు. ఉదాహరణకు తప్పుచేశాననే తలవంపు, ఉద్యోగం సరిగ్గా చేయలేకపోవడం, కుటుంబ జీవితంలో సంతోషం పొందలేకపోవడం, విడాకులు, ఆత్మహత్య వంటి పర్యవసానాలు అనుభవించాల్సి రావచ్చు. ఒకప్పుడు అశ్లీలచిత్రాలు చూడడానికి బానిస అయిన వ్యక్తి, ఆ అలవాటు నుండి బయటపడిన సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్లీ తనలో ఆత్మగౌరవం పెరిగిందని అంటున్నాడు.

10. అశ్లీలచిత్రాలు చూసే అలవాటు నుండి రిబేరో ఎలా బయటపడ్డాడు?

10 అశ్లీలచిత్రాలకు దూరంగా ఉండడానికి చేసే ప్రయత్నం చాలామందికి పెద్ద పోరాటంలా అనిపిస్తుంది. కానీ ఆ పోరాటంలో గెలవడం సాధ్యమే. బ్రెజిల్‌కు చెందిన రిబేరో అనే వ్యక్తి అనుభవాన్ని పరిశీలించండి. అతను టీనేజీలో ఉన్నప్పుడు ఇంట్లో నుండి వచ్చేసి, పేపరును రీసైకిల్‌ చేసే ఫ్యాక్టరీలో పనికి చేరాడు. అక్కడ అతనికి అశ్లీలచిత్రాలు ఉన్న పత్రికలు కనిపించాయి. రిబేరో ఇలా చెప్పాడు, “మెల్లగా వాటికి బానిసైపోయాను. ఎంతగా అంటే, నేను సహజీవనం చేస్తున్న అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్తుందా, ఎప్పుడు ఆ వీడియోలు చూద్దామా అని ఎదురుచూసేవాణ్ణి.” ఒకరోజు పనిలో ఉండగా రీసైకిల్‌ చేయాల్సిన పుస్తకాల కట్టలో కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం రిబేరోకి కనిపించింది. అతను దాన్ని తీసుకుని చదివాడు. దాంతో యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ అశ్లీలచిత్రాలు చూడడం నుండి బయటపడడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఇంతకీ ఆ అలవాటు నుండి బయటపడడానికి అతనికి ఏమి సహాయం చేసింది? రిబేరో ఇలా వివరించాడు, “ప్రార్థన, బైబిలు అధ్యయనం, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం వల్ల దేవుని లక్షణాలపట్ల నా కృతజ్ఞత ఎంతగా పెరిగిందంటే అశ్లీలచిత్రాలకన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను.” బైబిలు, దేవుని పవిత్రశక్తి సహాయంతో రిబేరో తన జీవితంలో మార్పులు చేసుకుని బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు సంఘపెద్దగా సేవచేస్తున్నాడు.

11. అశ్లీలచిత్రాలను చూసే అలవాటు నుండి బయటపడాలంటే ఏమి చేయాలి?

11 గమనించారా, అశ్లీలచిత్రాలు చూసే అలవాటు నుండి బయటపడడానికి రిబేరో కేవలం బైబిలు చదివి ఊరుకోలేదు. చదివిన విషయాలు అతని హృదయానికి చేరేలా వాటిగురించి లోతుగా ఆలోచించాల్సి వచ్చింది. అంతేకాదు అతను సహాయం కోసం వేడుకుంటూ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇవన్నీ దేవునిపట్ల అతనికున్న ప్రేమను మరింత పెంచాయి. ఎంతగా అంటే అశ్లీలచిత్రాలపై అతనికున్న ఇష్టాన్ని చంపుకునేంతగా యెహోవాపై ప్రేమ పెరిగింది. అశ్లీలచిత్రాలను చూసే అలవాటు నుండి బయటపడాలంటే, మనం కూడా యెహోవాను ప్రాణంగా ప్రేమించాలి, చెడును అసహ్యించుకోవాలి.—కీర్తన 97:10 చదవండి.

కోపం, తిట్టడం, అబద్ధాలు చెప్పడం మానేయండి

12. కోపం, తిట్టే స్వభావం ఉన్న స్టీఫెన్‌ ఎలా మారాడు?

12 కొంతమందికి కోపం ముక్కు మీద ఉంటుంది, ఆ కోపంలో కఠినంగా, అవతలి వ్యక్తిని అవమానించేలా మాట్లాడతారు. ఇలాంటివి జరిగినప్పుడు కుటుంబమంతా బాధపడుతుంది. ఆస్ట్రేలియాలో ఉంటున్న స్టీఫెన్‌ అనే తండ్రి గురించి పరిశీలిద్దాం. అతనికి బాగా తిట్టే అలవాటు ఉండేది, చీటికిమాటికి కోప్పడేవాడు కూడా. అతనిలా చెప్తున్నాడు, “నేనూ, నా భార్య మూడుసార్లు వేరైపోయాం, విడాకులు తీసుకునేదాకా కూడా వెళ్లాం.” అప్పుడే యెహోవాసాక్షుల దగ్గర వాళ్లు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు, స్టీఫెన్‌ తాను నేర్చుకుంటున్న విషయాల్ని పాటించడానికి ప్రయత్నించాడు. యెహోవా గురించి తెలుసుకోకముందు, అతనికి ఏదైనా నచ్చనప్పుడు ఎంత కోపం వచ్చేదంటే, కాసేపట్లో పేలే బాంబులా ఉండేవాడినని వివరించాడు. కానీ బైబిలు సలహాను పాటించడం మొదలుపెట్టాక పరిస్థితులు చక్కబడ్డాయి. స్టీఫెన్‌ ఇలా అంటున్నాడు, “అనుకోని రీతిలో మా జీవితాలు మారిపోయాయి. యెహోవా సహాయం వల్ల, ఇప్పుడు నాలో ప్రశాంతత, నెమ్మది కలిగాయి.” ప్రస్తుతం స్టీఫెన్‌ సంఘ పరిచారకునిగా, అతని భార్య ఎన్నో ఏళ్ల నుండి క్రమపయినీరుగా సేవ చేస్తున్నారు. స్టీఫెన్‌ గురించి అతని సంఘపెద్దలు ఏమంటున్నారో తెలుసా? “స్టీఫెన్‌ నెమ్మదస్థుడు, కష్టపడి పనిచేసే సహోదరుడు, వినయస్థుడు.” అంతేకాదు, అతను కోపంగా ఉండడం ఎప్పుడూ చూడలేదని వాళ్లు చెప్పారు. ఇంత మార్పు వచ్చిందంటే, ఆ గొప్పతనం తనది కాదని చెప్తూ స్టీఫెన్‌ ఇలా అన్నాడు, “నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకునే విషయంలో యెహోవా చేసిన సహాయాన్ని స్వీకరించకపోయుంటే, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఏ ఒక్క అద్భుతమైన దీవెనను కూడా నా జీవితంలో ఆనందించేవాణ్ణి కాదు.”

13. కోపం ఎందుకు ప్రమాదకరమైనది? బైబిలు ఏమని హెచ్చరిస్తోంది?

13 కోప్పడడం, ఎదుటివాళ్లమీద అరవడం, తిట్టడం వంటివి చేయవద్దని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. (ఎఫె. 4:31) ఇలాంటివి తరచుగా హింసకు పాల్పడేలా చేస్తాయి. ప్రస్తుతం ఉన్న లోకంలో కోప్పడడం, హింసకు పాల్పడడం మామూలు విషయాలేనని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి ప్రవర్తన మన సృష్టికర్తకు చెడ్డపేరు తెస్తుంది. అందుకే మన సహోదరుల్లో చాలామంది మార్పులు చేసుకుని కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారు.—కీర్తన 37:8-11 చదవండి.

14. కోపిష్ఠిగా ఉన్న వ్యక్తి వినయస్థునిగా మారే అవకాశం ఉందా?

14 హాన్స్‌ అనే సహోదరుడు ఆస్ట్రియాలోని ఒక సంఘంలో పెద్దగా సేవచేస్తున్నాడు. ఆ సంఘంలోని పెద్దల సభ సమన్వయకర్త ఇలా చెప్పాడు, ‘అతను చాలా వినయస్థుడు. అలాంటివాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.’ నిజానికి హాన్స్‌ ఒకప్పుడు అలా ఉండేవాడు కాదు. అతను టీనేజీలో ఉండగా మద్యానికి బానిసయ్యాడు, విపరీతమైన కోపిష్ఠిగా మారాడు. ఒకసారి తాగిన మైకంలో అతనికి ఎంత కోపం వచ్చిందంటే తన గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేశాడు. ఫలితంగా 20 ఏళ్లు జైళ్లో ఉన్నాడు, కానీ అతనిలో మార్పు రాలేదు. ఆ తర్వాత హాన్స్‌ వాళ్ల అమ్మ, ఒక సంఘపెద్దను కలిసి హాన్స్‌తో మాట్లాడమని చెప్పింది. తర్వాత అతను బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. హాన్స్‌ ఇలా చెప్పాడు, “నా పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. నన్ను ప్రోత్సహించిన లేఖనాల్లో మొదటిది యెషయా 55:7. అక్కడిలా ఉంది, ‘భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి.’ మరో లేఖనం 1 కొరింథీయులు 6:11. చెడ్డ అలవాట్ల నుండి బయటపడినవాళ్ల గురించి ఆ లేఖనంలో ఇలా ఉంది, ‘మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే.’ యెహోవా తన పవిత్రశక్తిని ఇస్తూ, నేను కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకునేందుకు ఎన్నో ఏళ్లపాటు ఓపిగ్గా సహాయం చేశాడు.” జైల్లో ఉండగానే హాన్స్‌ బాప్తిస్మం తీసుకున్నాడు. పదిహేడున్నర సంవత్సరాలు జైల్లో గడిపాక హాన్స్‌ విడుదలయ్యాడు. అతనిలా చెప్పాడు, “యెహోవా నాపై చూపించిన అపారమైన కనికరానికి, క్షమాగుణానికి నేను కృతజ్ఞుణ్ణి.”

15. పాత వ్యక్తిత్వంలో మరో భాగం ఏమిటి? దానిగురించి బైబిలు ఏమి చెప్తోంది?

15 అబద్ధాలు చెప్పడం కూడా పాత వ్యక్తిత్వంలో భాగమే. ఉదాహరణకు, పన్నులు కట్టకుండా తప్పించుకోవడానికి, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చాలామంది అబద్ధాలాడతారు. కానీ యెహోవా ‘సత్యదేవుడు.’ (కీర్త. 31:5) కాబట్టి తనను ఆరాధించేవాళ్లందరూ ‘నిజమే మాట్లాడాలని,’ ‘అబద్ధమాడకూడదని’ ఆయన కోరుకుంటున్నాడు. (ఎఫె. 4:25; కొలొ. 3:9) నిజం చెప్పడం వల్ల సిగ్గుపడాల్సిన లేదా కష్టాలు పాలవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుటికీ మనం నిజమే చెప్పాలి.—సామె. 6:16-19.

వాళ్లు ఎలా విజయం సాధించారు?

16. పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టడానికి మనకు ఏవి సహాయం చేస్తాయి?

16 సొంత శక్తితో పాత వ్యక్తిత్వాన్ని వదిలేయడం అసాధ్యం. సాకూరా, రిబేరో, స్టీఫెన్‌, హాన్స్‌ అందరూ తమ పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టడానికి తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. బైబిలు అలాగే దేవుని పవిత్రశక్తి సహాయంతోనే వాళ్లు విజయం సాధించగలిగారు. (లూకా 11:13; హెబ్రీ. 4:12) మనం కూడా వాటినుండి ప్రయోజనం పొందాలంటే ప్రతీరోజు బైబిలు చదవాలి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించాలి, నేర్చుకున్న వాటిని పాటించే జ్ఞానం, శక్తి ఇవ్వమని క్రమం తప్పకుండా ప్రార్థించాలి. (యెహో. 1:8; కీర్త. 119:97; 1 థెస్స. 5:17) అంతేకాదు మీటింగ్స్‌కి సిద్ధపడి, వాటికి హాజరైనప్పుడు కూడా మనం బైబిలు, దేవుని పవిత్రశక్తి నుండి ప్రయోజనం పొందుతాం. (హెబ్రీ. 10:24, 25) యెహోవా సంస్థ చేసిన ఎన్నో ఇతర ఏర్పాట్లను అంటే పత్రికలు, JW బ్రాడ్‌కాస్టింగ్‌, JW లైబ్రరీ, jw.org వెబ్‌సైట్‌ వంటివి కూడా ఉపయోగించాలని కోరుకుంటాం.—లూకా 12:42.

పాత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టడంలో మనమెలా విజయం సాధించవచ్చు? (16వ పేరా చూడండి)

17. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి నేర్చుకుంటాం?

17 క్రైస్తవులు వదిలిపెట్టాల్సిన, దూరంగా ఉండాల్సిన ఎన్నో చెడు అలవాట్ల గురించి మనం పరిశీలించాం. అయితే యెహోవాను సంతోషపెట్టడానికి మనం చేయాల్సింది ఇంకా ఉంది. కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని, దాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. అదెలా చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

a ఈ ఆర్టికల్‌లోని కొన్ని పేర్లు అసలు పేర్లు కావు.

b ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకంలోని అనుబంధంలో 249-251 పేజీల్లో ఉన్న హస్తప్రయోగం చేసే అలవాటును మానుకోవచ్చు అనే అంశాన్ని చూడండి.