కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమ—విలువైన లక్షణం

ప్రేమ—విలువైన లక్షణం

పవిత్రశక్తి సహాయంతో అలవర్చుకునే తొమ్మిది లక్షణాల గురించి రాసేలా యెహోవా అపొస్తలుడైన పౌలును ప్రేరేపించాడు. (గల. 5:22, 23) ఈ చక్కని లక్షణాలన్నిటినీ కలిపి ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు’ అని అంటాం. a ఈ లక్షణాలు కూడా క్రైస్తవులు అలవర్చుకోవాల్సిన ‘కొత్త వ్యక్తిత్వంలో’ భాగమే. (కొలొ. 3:10) ఒక చెట్టుకు క్రమంగా నీళ్లు పోస్తే అది మంచి ఫలాల్ని ఇస్తుంది, అదేవిధంగా ఒక వ్యక్తి జీవితంలో పవిత్రశక్తి పనిచేస్తే అతను ఈ చక్కని లక్షణాల్ని చూపిస్తాడు.—కీర్త. 1:1-3.

పౌలు ప్రస్తావించిన మొట్టమొదటి లక్షణం ప్రేమ. ఈ లక్షణం ఎంత విలువైనది? “ప్రేమ లేకపోతే నేను పనికిరానివాణ్ణే” అని పౌలు అన్నాడు. (1 కొరిం. 13:2) ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? దాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? మనం ప్రతీరోజు ఆ లక్షణాన్ని ఎలా చూపించవచ్చు?

ప్రేమ అంటే ఏమిటి?

ప్రేమ అంటే ఏమిటో ఖచ్చితంగా వివరించడం కష్టమే. అయితే ప్రేమ ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో, ఎలాంటి పనులు చేస్తాడో బైబిలు చెప్తోంది. ఉదాహరణకు, ప్రేమ ఉన్న వ్యక్తి ‘ఓర్పు, దయ’ వంటి లక్షణాల్ని చూపిస్తాడు. అతను, ‘సత్యం విషయంలో సంతోషిస్తాడు.’ అంతేకాదు ‘అన్నిటినీ భరిస్తాడు, అన్నిటినీ నమ్ముతాడు, అన్నిటినీ నిరీక్షిస్తాడు, అన్నిటినీ సహిస్తాడు.’ ఇతరులతో ఆప్యాయంగా వ్యవహరిస్తాడు, వాళ్లపట్ల శ్రద్ధ చూపిస్తాడు, నమ్మకమైన స్నేహితునిగా ఉంటాడు. మరోవైపు ప్రేమలేని వ్యక్తి ఈర్ష్య, గర్వం, అమర్యాద, స్వార్థం, పగ వంటి లక్షణాల్ని చూపిస్తాడు. మనం అలాంటి చెడ్డ లక్షణాల్ని చూపించాలనుకోం, బదులుగా ఇతరులపట్ల నిజమైన, నిస్వార్థమైన ప్రేమను చూపించాలనుకుంటాం.—1 కొరిం. 13:4-8.

ప్రేమ చూపించే విషయంలో యెహోవా, యేసు అత్యుత్తమ ఆదర్శం

“దేవుడు ప్రేమ.” (1 యోహా. 4:8) ఆయన పనులు, చర్యలు అన్నీ ఆ విషయాన్ని నిరూపిస్తాయి. మనకోసం బాధలుపడి, చనిపోయేలా యేసును భూమ్మీదకు పంపించడం ద్వారా యెహోవా మనపై అత్యంత గొప్ప ప్రేమ చూపించాడు. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “దేవుడు తన ఒక్కగానొక్క కొడుకును ఈ లోకంలోకి పంపించి మనమీద తనకున్న ప్రేమను వెల్లడిచేశాడు. మనం ఆ కొడుకు ద్వారా జీవం సంపాదించుకునేలా దేవుడు ఆయన్ని పంపించాడు. మన పాపాల కోసం బలిగా అర్పించబడేలా దేవుడు తన కొడుకును పంపించాడు. ఆ బలి మనకూ, దేవునికీ మధ్య శాంతిని తిరిగి నెలకొల్పుతుంది. మనం దేవుణ్ణి ప్రేమించినందుకు కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి అలా చేశాడు.” (1 యోహా. 4:9, 10) దేవునికున్న ప్రేమను బట్టే మన పాపాలు క్షమించబడతాయి, మనకు నిరీక్షణ, జీవం దొరుకుతాయి.

దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని అర్పించడం ద్వారా మనుషులపట్ల ప్రేమ ఉందని యేసు చూపించాడు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు, “ఈ ‘ఇష్టానికి’ అనుగుణంగా, అన్నికాలాలకు సరిపోయేలా యేసుక్రీస్తు శరీరం ఒక్కసారే అర్పించబడడం వల్ల మనం పవిత్రపర్చబడ్డాం.” (హెబ్రీ. 10:9, 10) వేరే ఏ మనిషీ అంత గొప్ప ప్రేమను చూపించలేడు. యేసు ఇలా అన్నాడు, “స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు.” (యోహా. 15:13) అపరిపూర్ణులమైన మనం యెహోవా, యేసు చూపించినలాంటి ప్రేమను చూపించగలమా? తప్పకుండా చూపించగలం. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం.

“ప్రేమతో నడుచుకోండి”

పౌలు మనల్ని ఇలా ప్రోత్సహిస్తున్నాడు, ‘దేవునికి ఇష్టమైన పిల్లల్లా మీరు ఆయన్ని అనుకరించండి. క్రీస్తు మనల్ని ప్రేమించినట్టే మీరు కూడా ప్రేమతో నడుచుకోండి. ఆయన మనమీద ప్రేమతో, మన కోసం తననుతాను అర్పించుకున్నాడు.’ (ఎఫె. 5:1, 2) ‘ప్రేమతో నడుచుకోవడం’ అంటే ఏమిటి? మనం అన్నీ సమయాల్లో ప్రేమ చూపించాలని అర్థం. మనం ఇతరుల్ని ప్రేమిస్తున్నామని కేవలం నోటితో చెప్పంగానీ దాన్ని పనుల్లో చూపిస్తాం. యోహాను ఇలా రాశాడు, “చిన్నపిల్లలారా, మన ప్రేమను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి.” (1 యోహా. 3:18) ఉదాహరణకు మనం యెహోవాను, పొరుగువాళ్లను ప్రేమిస్తాం కాబట్టే, “రాజ్యం గురించిన మంచివార్త” ప్రకటిస్తాం. (మత్త. 24:14; లూకా 10:27) మనం ఓర్పుగా, దయగా, క్షమించేవాళ్లంగా ఉండడం ద్వారా కూడా ‘ప్రేమతో నడుచుకుంటాం.’ “యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి” అని బైబిలు ఇస్తున్న సలహాను పాటిస్తాం.—కొలొ. 3:13.

మనం ఇతరులకు సలహా ఇస్తే లేదా వాళ్లను సరిదిద్దితే మనకు వాళ్లపట్ల ప్రేమలేదని కాదు. ఉదాహరణకు, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఏడ్పు ఆపడానికి వాళ్లు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. కానీ తమ పిల్లల్ని నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు అవసరమైనప్పుడు కాస్త కఠినంగా ఉంటారు. అదేవిధంగా దేవునికి మనపై ప్రేమ ఉన్నప్పటికీ, “యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు.” (హెబ్రీ. 12:6) కాబట్టి అవసరమైనప్పుడు తగిన క్రమశిక్షణ ఇవ్వడం ప్రేమతో చేసే పనే. (సామె. 3:11, 12) కానీ మనందరం అపరిపూర్ణులం కాబట్టి ప్రేమ చూపించే విషయంలో కొన్నిసార్లు విఫలమౌతుంటాం. కాబట్టి ఆ విషయంలో మనందరం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అలా మెరుగవ్వడానికి సహాయంచేసే మూడు విధానాలు పరిశీలిద్దాం.

మనం ప్రేమను ఎలా పెంపొందించుకోవచ్చు?

మొట్టమొదటిగా, ప్రేమను పుట్టించే పవిత్రశక్తిని మీకు ఇవ్వమని దేవున్ని అడగండి. యెహోవా ‘తనను అడిగేవాళ్లకు పవిత్రశక్తిని ఇస్తాడు’ అని యేసు చెప్పాడు. (లూకా 11:13) కాబట్టి పవిత్రశక్తి కోసం ప్రార్థించి, “పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం” నడుచుకోవడానికి కృషిచేస్తే మనం ఇతరులతో మరింత ప్రేమగా ప్రవర్తించగలుగుతాం. (గల. 5:16) ఉదాహరణకు మీరు ఒక సంఘపెద్దగా సేవచేస్తుంటే, ఇతరులకు లేఖనాల నుండి సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్లతో ప్రేమగా వ్యవహరించేందుకు సహాయం చేసేలా పవిత్రశక్తిని ఇవ్వమని ప్రార్థించండి. ఒకవేళ మీరు తల్లి లేదా తండ్రి అయితే మీ పిల్లలకు కోపంతో కాకుండా ప్రేమతో క్రమశిక్షణ ఇచ్చేలా పవిత్రశక్తిని సహాయంగా ఇవ్వమని అడగవచ్చు.

రెండవదిగా, యేసును ఇతరులు అవమానించినా ఆయన వాళ్లపట్ల ఎలా ప్రేమ చూపించాడో లోతుగా ఆలోచించండి. (1 పేతు. 2:21, 23) ఇతరులు మిమ్మల్ని నొప్పించినప్పుడు లేదా మీకు అన్యాయం జరిగినప్పుడు ఇలా ప్రశ్నించుకోండి, ‘ఈ పరిస్థితుల్లో యేసు ఉంటే ఏమి చేస్తాడు?’ అలా ప్రశ్నించుకోవడం, ఏదైనా పనిచేసే ముందు జాగ్రత్తగా ఆలోచించడానికి సహాయం చేసిందని లీ అనే సహోదరి చెప్పింది. ఆమె ఇలా అంటోంది, “ఓసారి నాతోపాటు పనిచేసే ఒకావిడ మా ఆఫీస్‌లో పనిచేసే వాళ్లందరికీ నా గురించి ఒక మెయిల్‌ పంపించింది. అందులో నా గురించి, నా పని గురించి లేనిపోనివి రాసింది. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. కానీ నేను ఇలా ప్రశ్నించుకున్నాను, ‘ఈమెతో వ్యవహరించే విషయంలో నేను యేసును ఎలా అనుకరించవచ్చు?’ నా స్థానంలో యేసు ఉంటే ఏమి చేసేవాడో ఆలోచించాక, ఆ విషయం గురించి రాద్ధాంతం చేయకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాను. కొంతకాలం తర్వాత, అలా మెయిల్‌ పంపిన ఆమె ఒక పెద్ద అనారోగ్యంతో బాధపడుతోందని, చాలా ఒత్తిడిలో ఉందని తెలిసింది. ఆరోజు ఆమె కావాలని చేయలేదని అర్థమైంది. ఇతరులు మనల్ని బాధపెట్టినా ప్రేమ చూపించే విషయంలో యేసు ఉంచిన ఆదర్శం గురించి ధ్యానించడం ద్వారా నాతోపాటు పనిచేసే వాళ్లపట్ల నేనూ అలాంటి ప్రేమనే చూపించగలిగాను.” మనం యేసును అనుకరిస్తే ఎల్లప్పుడూ ఇతరులపట్ల ప్రేమ చూపిస్తాం.

మూడవదిగా, స్వయంత్యాగ ప్రేమ చూపించడం నేర్చుకోండి. అలాంటి ప్రేమే యేసు నిజ అనుచరుల గుర్తింపు. (యోహా. 13:34, 35) యేసు అలాంటి ప్రేమే చూపించి మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయన దాన్నెలా చూపించాడు? పరలోకాన్ని వదిలి వచ్చినప్పుడు, మనకోసం ‘ఆయన అన్నీ వదులుకున్నాడు.’ ఆఖరికి చనిపోవడానికి కూడా వెనకాడలేదు. (ఫిలి. 2:5-8) యేసు చూపించినలాంటి స్వయంత్యాగ ప్రేమను మనమూ చూపిస్తే, మరింతగా ఆయనలా ఆలోచించగలుగుతాం, భావించగలుగుతాం. అంతేకాదు మన అవసరాలకన్నా ఎదుటివాళ్ల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. ప్రేమ చూపించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

ప్రేమ చూపించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ప్రేమ చూపించడం వల్ల మనం చాలా ప్రయోజనాలు పొందుతాం. అందులో రెండింటిని పరిశీలించండి.

ప్రేమ చూపించడం వల్ల మనమెలాంటి ప్రయోజనాలు పొందుతాం?

  • అంతర్జాతీయ సహోదరత్వం: మనం ఒకరిపట్ల ఒకరం చూపించుకునే ప్రేమను బట్టి, ప్రపంచంలో ఏ సంఘానికి వెళ్లినా మన సహోదరసహోదరీలు ఆప్యాయంగా ఆహ్వానిస్తారని మనకు తెలుసు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సోదరులందరూ” మిమ్మల్ని ప్రేమించడం ఎంత దీవెనో కదా! (1 పేతు. 5:9) కేవలం దేవుని ప్రజల మధ్యే అలాంటి ప్రేమ కనిపిస్తుంది.

  • శాంతి: “ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ” ఉంటే “ఒకరితో ఒకరు శాంతియుతంగా” వ్యవహరించగలుగుతాం. (ఎఫె. 4:2, 3) అలాంటి శాంతిని మన మీటింగ్స్‌లో, సమావేశాల్లో రుచి చూస్తాం. నేడున్న విభాగిత లోకంలో అలాంటి శాంతియుతమైన వాతావరణం నిజంగా ప్రత్యేకమైనదని మీరు ఒప్పుకోరా? (కీర్త. 119:165; యెష. 54:13) మనం ఇతరులతో శాంతిగా ఉంటే వాళ్లను నిజంగా ప్రేమిస్తున్నామని చూపిస్తాం, అది చూసి మన పరలోక తండ్రైన యెహోవా సంతోషిస్తాడు.—కీర్త. 133:1-3; మత్త. 5:9.

“ప్రేమ బలపరుస్తుంది”

“ప్రేమ బలపరుస్తుంది” అని పౌలు రాశాడు. (1 కొరిం. 8:1) దానర్థం ఏమిటి? “ప్రేమ కీర్తన” అని కొంతమంది పిలిచే 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమ ఎలా బలపరుస్తుందో పౌలు వివరిస్తున్నాడు. ప్రేమ ఎదుటి వ్యక్తి ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. ప్రేమ ఇతరుల అవసరాలను పట్టించుకుంటుంది. (1 కొరిం. 10:24; 13:5) ప్రేమ ఆలోచిస్తుంది, శ్రద్ధ చూపిస్తుంది, ఓర్పు చూపిస్తుంది, దయగా ఉంటుంది కాబట్టి ప్రేమవల్ల కుటుంబాలు బలపడతాయి, సంఘాలు ఐక్యంగా ఉంటాయి.—కొలొ. 3:14.

ఇతరులపట్ల ప్రేమ చూపించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ వేరే దేనికన్నా దేవుని మీద ఉన్న ప్రేమే చాలా విలువైనది, బలపర్చేది. ఎందుకంటే దేవుని మీదున్న ప్రేమ మనందర్నీ ఐక్యం చేస్తుంది. అన్నిరకాల నేపథ్యాల నుండి, తెగల నుండి, భాషల నుండి వచ్చిన ప్రజలు యెహోవాను ఐక్యంగా ఆరాధిస్తున్నారు. (జెఫ. 3:9) కాబట్టి దేవుని పవిత్రశక్తి పుట్టించే ఈ విలువైన లక్షణాన్ని ప్రతీరోజు చూపించాలని తీర్మానించుకుందాం.

a పవిత్రశక్తి పుట్టించే లక్షణాల గురించి చర్చించే తొమ్మిది ఆర్టికల్స్‌లో ఇది మొదటిది.