కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యం “శాంతిని కాదు, కత్తిని” తీసుకొస్తుంది

సత్యం “శాంతిని కాదు, కత్తిని” తీసుకొస్తుంది

“నేను భూమ్మీదికి శాంతిని తీసుకురావడం కోసం వచ్చానని అనుకోకండి; శాంతిని కాదు, కత్తిని తీసుకురావడం కోసమే నేను వచ్చాను.”మత్త. 10:34.

పాటలు: 123, 128

1, 2. (ఎ) మనమిప్పుడు ఎలాంటి శాంతి కలిగివుండవచ్చు? (బి) మనం శాంతిని ఎందుకు పూర్తిస్థాయిలో అనుభవించలేకపోతున్నాం? (ప్రారంభ చిత్రం చూడండి.)

 మనందరం ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా బ్రతకాలనుకుంటాం. మనకు ‘దేవుని శాంతిని’ ఇచ్చినందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. ఎందుకంటే అది మనల్ని బాధకలిగించే ఆలోచనలు, భావాలు నుండి కాపాడి, ప్రశాంతతను ఇస్తుంది. (ఫిలి. 4:6, 7) మనం యెహోవాకు సమర్పించుకున్నాం కాబట్టి “దేవునితో శాంతియుత సంబంధాన్ని” కూడా ఆస్వాదిస్తున్నాం. అంటే మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగివున్నామని అర్థం.—రోమా. 5:1.

2 అయితే, దేవుడు ఈ భూమ్మీద పూర్తిస్థాయిలో శాంతిని తీసుకొచ్చే సమయం ఇంకా రాలేదు. మనం చివరిరోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి ఆందోళనలు కలిగించే ఎన్నో సమస్యలు ఎదురౌతాయి. పైగా మనం క్రూరుల మధ్య జీవిస్తున్నాం. (2 తిమో. 3:1-4) అంతేకాదు సాతానుతో, అతను వ్యాప్తిచేసే తప్పుడు బోధలతో మనం పోరాడాలి. (2 కొరిం. 10:4, 5) అయితే అన్నిటికన్నా ఎక్కువ ఆందోళన కలిగించే విషయమేమిటంటే, యెహోవాను సేవించని మన బంధువుల నుండి వచ్చే వ్యతిరేకత. కొంతమంది బంధువులు మన నమ్మకాల్ని ఎగతాళి చేయవచ్చు లేదా కుటుంబాన్ని విడగొడుతున్నామని మనల్ని నిందించవచ్చు. యెహోవా సేవ ఆపకపోతే ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సి వస్తుందని కూడా చెప్పవచ్చు. కుటుంబం నుండి ఇలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు మనమేమి చేయాలి? మన శాంతిని ఎలా కాపాడుకోవచ్చు?

కుటుంబం నుండి వచ్చే వ్యతిరేకత

3, 4. (ఎ) యేసుకు ఏ విషయాలు తెలుసు? (బి) యేసును అనుసరించడం ఎప్పుడు మరింత కష్టంగా ఉండవచ్చు?

3 తన బోధల్ని అంగీకరించని వాళ్లు కూడా ఉంటారని యేసుకు తెలుసు. అంతేకాదు తన శిష్యుల్ని కొంతమంది వ్యతిరేకిస్తారని, దాన్ని తట్టుకోవడానికి వాళ్లకు ధైర్యం అవసరమని కూడా ఆయనకు తెలుసు. అలాంటి వ్యతిరేకత శిష్యుల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తుంది. అందుకే యేసు ఇలా అన్నాడు, “నేను భూమ్మీదికి శాంతిని తీసుకురావడం కోసం వచ్చానని అనుకోకండి; శాంతిని కాదు, కత్తిని తీసుకురావడం కోసమే నేను వచ్చాను. ఎందుకంటే కొడుకుకు తండ్రికి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి మధ్య విరోధం పెట్టడానికే నేను వచ్చాను. నిజానికి, ఒక మనిషి ఇంటివాళ్లే అతనికి శత్రువులు అవుతారు.”—మత్త. 10:34-36.

4 “నేను భూమ్మీదికి శాంతిని తీసుకురావడం కోసం వచ్చానని అనుకోకండి” అనే యేసు మాటలకు అర్థమేమిటి? తనకు శిష్యులయ్యేవాళ్లు దానివల్ల వచ్చే కొన్ని పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుందనే విషయం ప్రజలు తెలుసుకోవాలని యేసు కోరుకున్నాడు. నిజానికి, ప్రజలకు దేవుని గురించిన సత్యాన్ని బోధించాలనేదే యేసు ఉద్దేశం, అంతేగానీ కుటుంబాల్ని విడగొట్టాలని కాదు. (యోహా. 18:37) కానీ తనను అనుసరించడం అన్నిసార్లు సులభం కాదని, ముఖ్యంగా సత్యంలోలేని కుటుంబసభ్యులు లేదా స్నేహితులు ఉన్నప్పుడు అది మరింత కష్టమని శిష్యులు తెలుసుకోవాల్సి ఉంది.

5. యేసు శిష్యులు ఏ ఫలితం పొందారు?

5 తన అనుచరులు, కుటుంబం నుండి వచ్చే వ్యతిరేకతను కూడా సహించడానికి సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు. (మత్త. 10:38) కుటుంబ సభ్యులు ఎగతాళి చేసినా లేదా తిరస్కరించినా శిష్యులు యేసును సంతోషపెట్టడానికి ప్రయత్నించారు. అయితే అలా చేసినందుకు వాళ్లు కోల్పోయిన దానికన్నా ఎక్కువ దీవెనల్ని పొందారు.—మార్కు 10:29, 30 చదవండి.

6. బంధువులు మనల్ని వ్యతిరేకించినప్పుడు మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

6 యెహోవాను ఆరాధిస్తున్నందుకు బంధువులు మనల్ని వ్యతిరేకించినా మనం వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాం. అయితే వేరే ఎవ్వరి కన్నా ఎక్కువగా దేవున్ని, క్రీస్తును ప్రేమించాలని మనం గుర్తుంచుకోవాలి. (మత్త. 10:37) అంతేకాదు, మనల్ని యెహోవా నుండి దూరం చేయడానికి కుటుంబసభ్యులపై మనకున్న ప్రేమను సాతాను ఉపయోగించగలడని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు కొన్ని కష్టమైన పరిస్థితుల్ని పరిశీలించి, అలాంటి సందర్భాల్ని మనమెలా సహించవచ్చో చూద్దాం.

భర్త లేదా భార్య యెహోవాసాక్షి కాకపోతే . . .

7. యెహోవాసాక్షికాని వివాహజతతో ఎలా వ్యవహరించాలి?

7 పెళ్లి చేసుకున్నవాళ్లకు “శరీర సంబంధమైన శ్రమలు” లేదా సమస్యలు వస్తాయని బైబిలు హెచ్చరిస్తోంది. (1 కొరిం. 7:28) యెహోవాసాక్షికాని వివాహజత ఉంటే మీరు మరింత ఒత్తిడిని, ఆందోళనను అనుభవించాల్సి ఉంటుంది. కానీ మీ పరిస్థితిని యెహోవా చూసినట్లు చూడడం ప్రాముఖ్యం. కేవలం యెహోవాను ఆరాధించట్లేదనే కారణంతో వివాహజత నుండి వేరుగా ఉండడంగానీ, విడాకులు ఇవ్వడంగానీ చేయకూడదని ఆయన చెప్తున్నాడు. (1 కొరిం. 7:12-16) భర్త యెహోవాను ఆరాధించకపోయినా, సత్యారాధన విషయంలో ముందుండి నడిపించకపోయినా అతను కుటుంబ శిరస్సు కాబట్టి భార్య అతన్ని గౌరవించాలి. ఒకవేళ భార్య యెహోవాను ఆరాధించకపోయినా భర్త ఆమెను ప్రేమించాలి, శ్రద్ధగా చూసుకోవాలి.—ఎఫె. 5:22, 23, 28, 29.

8. యెహోవాను ఆరాధించే విషయంలో మీ వివాహజత హద్దులు పెట్టడానికి ప్రయత్నిస్తే మీరు ఏ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు?

8 యెహోవాను ఆరాధించే విషయంలో మీ వివాహజత హద్దులు పెట్టడానికి ప్రయత్నిస్తే ఏమి చేయాలి? ఉదాహరణకు, ఒక సహోదరికి సత్యంలోలేని భర్త ఉన్నాడు. అతను ఆ సహోదరిని ఫలానా రోజుల్లోనే ప్రీచింగ్‌కు వెళ్లమని చెప్పాడు. మీకు ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఇలా ప్రశ్నించుకోండి, ‘నా భర్త యెహోవాను ఆరాధించడం పూర్తిగా మానేయమని చెప్తున్నాడా? ఒకవేళ అలా కాకపోతే, నా భర్త చెప్పినట్లు నేను చేయగలనా?’ మీరు సహేతుకంగా ఆలోచిస్తే మీ వివాహ జీవితంలో తక్కువ సమస్యలు ఉంటాయి.—ఫిలి. 4:5.

9. యెహోవాసాక్షికాని తల్లిని లేదా తండ్రిని గౌరవించడం క్రైస్తవులు తమ పిల్లలకు ఎలా నేర్పించవచ్చు?

9 వివాహజత యెహోవాసాక్షి కానట్లయితే పిల్లల్ని పెంచడం కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు, “అమ్మానాన్నల మాట వినండి” అనే బైబిలు ఆజ్ఞకు లోబడాలని మీ పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మీకుంది. (ఎఫె. 6:1-3) కానీ మీ వివాహజత బైబిలు సూత్రాల్ని పాటించని వ్యక్తి అయితే మీరేమి చేయాలి? మీ వివాహజతకు తగిన గౌరవం ఇవ్వడం ద్వారా మీ పిల్లలకు చక్కని ఆదర్శం ఉంచవచ్చు. అతనిలోని లేదా ఆమెలోని మంచి లక్షణాల గురించి ఆలోచించండి, అతను లేదా ఆమె చేసే మంచి పనులన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. పిల్లల ముందు మీ వివాహజత గురించి చెడుగా మాట్లాడకండి. బదులుగా యెహోవాను సేవించాలో వద్దో ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలని వివరించండి. బహుశా మీ పిల్లల మంచి ప్రవర్తన చూసి మీ వివాహజత యెహోవా గురించి నేర్చుకోవాలని కోరుకోవచ్చు.

అవకాశం దొరికినప్పుడల్లా మీ పిల్లలకు బైబిలు సత్యాన్ని బోధించండి (10వ పేరా చూడండి)

10. తమ పిల్లలు యెహోవాను ప్రేమించేలా క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా శిక్షణనివ్వవచ్చు?

10 తమ పిల్లలు అన్యమత పండుగలు జరుపుకోవాలని లేదా అబద్ధమత బోధలు నేర్చుకోవాలని యెహోవాసాక్షికాని భర్త లేదా భార్య కోరుకోవచ్చు. కొంతమంది భర్తలైతే, పిల్లలకు బైబిలు గురించి నేర్పించవద్దని యెహోవాసాక్షులైన భార్యలకు చెప్తారు. కానీ అలాంటి సందర్భంలో కూడా భార్యలు తమ పిల్లలకు సత్యం నేర్పించడానికి చేయగలిగినదంతా చేస్తారు. (అపొ. 16:1; 2 తిమో. 3:14, 15) ఉదాహరణకు, పిల్లలకు స్టడీ చేయడానికి లేదా వాళ్లను మీటింగ్స్‌కు తీసుకెళ్లడానికి యెహోవాసాక్షికాని భర్త ఒప్పుకోకపోవచ్చు. ఆమె తన భర్త నిర్ణయాన్ని గౌరవిస్తూనే అవకాశం దొరికిన ప్రతీసారి తన నమ్మకాల గురించి పిల్లలతో మాట్లాడవచ్చు. ఆ విధంగా పిల్లలు యెహోవా గురించి, తప్పొప్పుల విషయంలో ఆయనకున్న ప్రమాణాల గురించి నేర్చుకోగలుగుతారు. (అపొ. 4:19, 20) కానీ చివరికి, యెహోవాను ఆరాధించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది పిల్లలే. aద్వితీ. 30:19, 20.

బంధువులు మన ఆరాధనను వ్యతిరేకిస్తే . . .

11. బంధువులతో ఎందుకు సమస్య రావచ్చు?

11 యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, ఆ విషయాన్ని మనం ఇంట్లోవాళ్లకు చెప్పివుండకపోవచ్చు. కానీ విశ్వాసంలో బలపడుతున్న కొద్దీ యెహోవా సేవ చేయాలనే మన కోరికను వాళ్లకు చెప్పాలని గుర్తించాం. (మార్కు 8:38) దేవునికి నమ్మకంగా ఉన్నందుకు మీకు బంధువులతో సమస్యలు వచ్చివుండవచ్చు. అయితే వాళ్లతో శాంతిగా ఉంటూనే యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఏమి చేయవచ్చో ఇప్పుడు చర్చించుకుందాం.

12. మన బంధువులు మనల్ని ఎందుకు వ్యతిరేకించవచ్చు? కానీ వాళ్ల భావాల్ని అర్థం చేసుకుంటున్నామని మనమెలా చూపించవచ్చు?

12 యెహోవాసాక్షులుకాని బంధువుల భావాల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు బైబిలు సత్యం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మన బంధువులకు మాత్రం మనం మోసపోయామని లేదా ఏదో వింత మతంలో చేరామని అనిపించవచ్చు. వాళ్లతో కలిసి పండుగలు జరుపుకోం కాబట్టి మనకు వాళ్లమీద ప్రేమలేదని వాళ్లు అనుకోవచ్చు. చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని శిక్షిస్తాడని వాళ్లు భయపడుతుండవచ్చు. వాళ్లు మన గురించి ఎందుకు ఆందోళన పడుతున్నారో తెలుసుకోవాలంటే వాళ్ల భావాల్ని అర్థంచేసుకోవాలి, వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినాలి. (సామె. 20:5) అపొస్తలుడైన పౌలు “అన్నిరకాల ప్రజలకు” మంచివార్త ప్రకటించాలనే ఉద్దేశంతో వాళ్లను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాడు. మనం కూడా కుటుంబసభ్యుల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్లకు సత్యాన్ని ఎలా బోధించాలో తెలుస్తుంది.—1 కొరిం. 9:19-23.

13. సత్యంలోలేని బంధువులతో మనమెలా మాట్లాడాలి?

13 సౌమ్యంగా మాట్లాడండి. “ఎప్పుడూ మంచితనం ఉట్టిపడేలా మాట్లాడండి” అని బైబిలు చెప్తోంది. (కొలొ. 4:6) అది అంత సులభం కాకపోవచ్చు. కాబట్టి మన బంధువులతో దయగా, సౌమ్యంగా మాట్లాడేందుకు పవిత్రశక్తిని సహాయంగా ఇవ్వమని యెహోవాను అడగండి. మన బంధువులు నమ్మే తప్పుడు సిద్ధాంతాలన్నిటి గురించి మనం వాదించకూడదు. వాళ్ల మాటలవల్ల లేదా పనులవల్ల మనకు బాధ కలిగితే, అపొస్తలులను ఆదర్శంగా తీసుకోవచ్చు. పౌలు ఇలా అన్నాడు, “మమ్మల్ని అవమానించిన వాళ్లను దీవిస్తున్నాం; ఎవరైనా హింసిస్తే ఓర్పుతో సహిస్తున్నాం; మా గురించి లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లతో సౌమ్యంగా మాట్లాడుతున్నాం.”—1 కొరిం. 4:12, 13.

14. మంచి ప్రవర్తన వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

14 మంచి ప్రవర్తన కలిగివుండండి. అది ఎందుకంత ప్రాముఖ్యం? మన బంధువులతో సౌమ్యంగా మాట్లాడడం వల్ల వాళ్లతో మంచి సంబంధం కలిగి ఉండగలుగుతాం. కానీ మన మంచి ప్రవర్తన అంతకన్నా ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. (1 పేతురు 3:1, 2, 16 చదవండి.) యెహోవాసాక్షుల వివాహ జీవితం సంతోషంగా సాగుతుందని, వాళ్లు పిల్లల్ని శ్రద్ధగా చూసుకుంటారని, బైబిలు సూత్రాల ప్రకారం జీవిస్తారని, అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారని మిమ్మల్ని చూసి మీ బంధువులు తెలుసుకునేలా చేయండి. ఒకవేళ వాళ్లు సత్యంలోకి రాకపోయినా, మన మంచి ప్రవర్తనతో యెహోవాను సంతోషపెడుతున్నామనే తృప్తితో ఉండవచ్చు.

15. మీ బంధువులతో వాదనలకు దారితీసే సందర్భాలకు దూరంగా ఉండేందుకు ముందుగానే ఏమి చేయాలి?

15 ముందే ఆలోచించి పెట్టుకోండి. ఎలాంటి సందర్భాలు మీ బంధువులతో వాదనలకు దారితీయవచ్చో ఆలోచించండి. తర్వాత ఆ పరిస్థితిలో ఏమి చేయాలో నిర్ణయించుకోండి. (సామె. 12:16, 23) ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక సహోదరి అదే చేసింది. ఆ సహోదరి వాళ్ల మామయ్య సత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు, కొన్నిసార్లు కోప్పడేవాడు. కాబట్టి అతనికి ఫోన్‌ చేసే ముందు ఆ సహోదరి, ఆమె భర్త కలిసి వాళ్ల మామయ్యతో సౌమ్యంగా మాట్లాడేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించేవాళ్లు. అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ఎలాంటి విషయాలైతే బాగుంటాయో ఆలోచించి పెట్టుకుని వాటిగురించే మాట్లాడేవాళ్లు. అంతేకాదు మతం గురించి వాదనకు దిగకుండా ఉండేందుకు అతనితో తక్కువసేపు మాట్లాడేవాళ్లు.

16. మీ బంధువుల్ని బాధపెట్టారనే అపరాధ భావాల నుండి మీరెలా బయటపడవచ్చు?

16 నిజమే, యెహోవాసాక్షులుకాని మీ బంధువులతో అభిప్రాయభేదాలు వస్తూనే ఉంటాయి. అయితే మీరు బంధువుల్ని ప్రేమిస్తారు, వాళ్లను సంతోషపెట్టాలని కోరుకుంటారు కాబట్టి వాళ్లతో ఏదైనా అభిప్రాయభేదం వస్తే ఏదో తప్పుచేశామనే అపరాధ భావం మీలో కలుగవచ్చు. కానీ మీ బంధువులపట్ల మీకున్న ప్రేమ కన్నా యెహోవాకు మీరు చూపించే యథార్థత బలంగా ఉండాలి. ఆ విషయాన్ని మీ బంధువులు గుర్తించినప్పుడు యెహోవాను సేవించడం ఎంత ప్రాముఖ్యమో వాళ్లు అర్థంచేసుకుంటారు. సత్యాన్ని అంగీకరించమని ఎవ్వర్నీ బలవంతపెట్టలేం. కానీ యెహోవా ప్రమాణాల్ని పాటించడం ద్వారా మీరెలా ప్రయోజనం పొందారో గుర్తించడానికి ఇతరులకు సహాయం చేయవచ్చు. తనకు సేవచేసే అవకాశాన్ని యెహోవా మనకిచ్చినట్లే వాళ్లకు కూడా ఇస్తున్నాడు.—యెష. 48:17, 18.

కుటుంబసభ్యుల్లో ఎవరైనాయెహోవాకు దూరమైతే . . .

17, 18. మీ కుటుంబసభ్యుల్లో ఎవరైనా యెహోవాను విడిచిపెడితే ఆ బాధను తట్టుకోవడానికి మీకేది సహాయం చేస్తుంది?

17 మీ కుటుంబసభ్యుల్లో ఎవరైనా బహిష్కరించబడితే లేదా యెహోవాసాక్షులతో సహవసించడం మానేస్తే దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. ఎవరో మిమ్మల్ని కత్తితో పొడిచినంత బాధ కలుగవచ్చు. మరి ఆ బాధను తట్టుకోవడానికి మీరేమి చేయవచ్చు?

18 యెహోవా సేవ మీదే మనసుపెట్టండి. అలాంటి బాధ కలిగినప్పుడు, మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడం అవసరం. దానికోసం ప్రతీరోజు బైబిలు చదవండి, మీటింగ్స్‌కు సిద్ధపడి హాజరవ్వండి, ప్రీచింగ్‌కి క్రమంగా వెళ్లండి, సహించడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వమని యెహోవాను అడగండి. (యూదా 20, 21) ఇవన్నీ చేస్తున్నప్పటికీ బాధ తగ్గకపోతే అప్పుడేంటి? వెనకడుగు వేయకండి! యెహోవా సేవ మీదే మనసుపెట్టండి. కాలంగడిచే కొద్దీ మీ ఆలోచనల్ని, భావాల్ని అదుపు చేసుకోగలుగుతారు. 73వ కీర్తనకర్తకు అదే జరిగింది. ఒకానొక సమయంలో ఆలోచనల్ని, భావాల్ని అదుపులో పెట్టుకోవడం అతనికి కష్టమైంది. కానీ యెహోవాను ఆరాధిస్తూ ఉండడం వల్ల అతను విషయాల్ని సరైన దృష్టితో చూడగలిగాడు. (కీర్త. 73:16, 17) మీ విషయంలో కూడా అదే జరగవచ్చు.

19. యెహోవా తన ప్రజలకు ఇచ్చే క్రమశిక్షణను మీరు గౌరవిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

19 యెహోవా ఇచ్చే క్రమశిక్షణను గౌరవించండి. తానిచ్చే క్రమశిక్షణ వల్ల ప్రతీఒక్కరితోపాటు, బహిష్కరించబడిన వాళ్లు కూడా ప్రయోజనం పొందుతారని యెహోవాకు తెలుసు. మనం ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ దొరికినప్పుడు మనకు చాలా బాధ కలుగవచ్చు. కానీ భవిష్యత్తులో అతను లేదా ఆమె యెహోవా దగ్గరకు తిరిగి రావడానికి అది సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 12:11 చదవండి.) అప్పటివరకు బహిష్కరించబడిన వాళ్లతో “సహవాసం మానేయాలి” అని యెహోవా ఇచ్చిన నిర్దేశానికి మనం లోబడాలి. (1 కొరిం. 5:11-13) అది అంత తేలిక కాదు. కానీ మనం అలాంటివాళ్లతో ఫోన్‌, మెసేజ్‌, ఉత్తరాలు, ఈ-మెయిల్స్‌ లేదా సోషల్‌ నెట్‌వర్క్‌ వంటివాటి ద్వారా అనవసరంగా సహవాసం చేయకూడదు.

20. మనం ఏ నిరీక్షణతో ఉండవచ్చు?

20 నిరీక్షణతో ఉండండి. ప్రేమ, “అన్నిటినీ నిరీక్షిస్తుంది” కాబట్టి మనం ప్రేమించేవాళ్లు ఏదోక రోజు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారనే నిరీక్షణతో ఉంటాం. (1 కొరిం. 13:7) మీ కుటుంబ సభ్యుడు ఎవరైనా తన ఆలోచనను లేదా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తే అతని గురించి ప్రార్థించండి. బైబిలు ద్వారా బలాన్ని పొంది, ‘నా దగ్గరికి తిరిగి రా’ అని యెహోవా ఇచ్చే ఆహ్వానాన్ని అంగీకరించాలని ప్రార్థించండి.—యెష. 44:22, NW.

21. యేసును అనుసరిస్తున్నందుకు మీ కుటుంబసభ్యులు మిమ్మల్ని వ్యతిరేకిస్తే ఏమి చేయాలి?

21 వేరే ఎవ్వరి కన్నా తననే ఎక్కువ ప్రేమించాలని యేసు చెప్పాడు. కుటుంబసభ్యులు వ్యతిరేకించినా శిష్యులు ధైర్యం చూపిస్తూ తనకు నమ్మకంగా ఉంటారని యేసుకు తెలుసు. కాబట్టి యేసును అనుసరిస్తున్నందుకు మీ కుటుంబసభ్యులు మిమ్మల్ని వ్యతిరేకిస్తే యెహోవాపై ఆధారపడండి. సహించడానికి సహాయం చేయమని ప్రార్థించండి. (యెష. 41:9-10, 13) యెహోవా, యేసు మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారని, మీరు చూపిస్తున్న యథార్థతకు తగిన ప్రతిఫలం ఇస్తారని ఆనందంగా ఉండండి.

a యెహోవాసాక్షికాని భర్త లేదా భార్య ఉన్న కుటుంబంలో పిల్లల్ని ఎలా పెంచాలో తెలియజేసే మరింత సమాచారం కోసం 2002, ఆగస్టు 15 కావలికోట సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.