కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జెకర్యాకు వచ్చిన దర్శనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

జెకర్యాకు వచ్చిన దర్శనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

“మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదును.”జెక. 1:3.

పాటలు: 89, 86

1-3. (ఎ) జెకర్యా ప్రవచించడం మొదలుపెట్టినప్పుడు, యెహోవా ప్రజల పరిస్థితి ఎలా ఉంది? (బి) యెహోవా తన దగ్గరకు తిరిగి రమ్మని ఇశ్రాయేలీయుల్ని ఎందుకు పిలిచాడు?

 ఎగురుతున్న ఒక గ్రంథపుచుట్ట, ఒక పాత్రలో ఉన్న స్త్రీ, సంకుబుడి కొంగ రెక్కల్లాంటి రెక్కలతో ఎగురుతున్న ఇద్దరు స్త్రీలు. ఆసక్తికరమైన ఈ దర్శనాల్ని జెకర్యా చూశాడు. (జెక. 5:1, 7-9) యెహోవా తన ప్రవక్తకు ఈ అద్భుతమైన దర్శనాల్ని ఎందుకు చూపించాడు? ఆ సమయానికి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉండేది? ఆ దర్శనాల నుండి నేడు మనమేమి నేర్చుకోవచ్చు?

2 అది క్రీ.పూ. 537వ సంవత్సరం, యెహోవా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. 70 ఏళ్లపాటు బబులోనులో ఉన్న వాళ్లకు ఇప్పుడు విడుదల దొరికింది. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు వెళ్లి ఆలయాన్ని తిరిగి కట్టాలని, అక్కడ యెహోవాను ఆరాధించాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్లుగానే ఒక సంవత్సరం తర్వాత ఆలయ పునాది వేశారు. అప్పుడు ప్రజల ఆనందానికి అవధుల్లేవు. వాళ్లు ‘చాలా గట్టిగా అరుస్తుండడంతో ఆ అరుపులు చాలా దూరం వరకు వినిపించాయి.’ (ఎజ్రా 3:10-13, NW) కానీ ఆలయ నిర్మాణ పనికి వ్యతిరేకత అంతకంతకు ఎక్కువౌతోంది. దాంతో ఇశ్రాయేలీయులు నిరుత్సాహపడి, నిర్మాణ పనిని ఆపేశారు. వాళ్లు తమ సొంత ఇళ్లను కట్టుకోవడంలో, పొలాలను సాగుచేయడంలో మునిగిపోయారు. 16 ఏళ్లు గడిచిపోయాయి, ఆలయ నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. కాబట్టి తమ గురించి ఆలోచించుకోవడం మానేసి, యెహోవా దగ్గరకు తిరిగి రమ్మని దేవుని ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. తన ప్రజలు ఉత్సాహంతో, ధైర్యంతో తనను ఆరాధించాలని యెహోవా కోరుకున్నాడు.

3 కాబట్టి యెహోవా క్రీ.పూ. 520⁠లో తన ప్రవక్త అయిన జెకర్యాను వాళ్ల దగ్గరకు పంపించి, వాళ్లను బబులోను నుండి ఎందుకు విడిపించాడో గుర్తుచేశాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, జెకర్యా అనే పేరుకు “యెహోవా గుర్తుంచుకున్నాడు” అని అర్థం. యెహోవా తమకు చేసిన సహాయాన్ని ఇశ్రాయేలీయులు మర్చిపోయినప్పటికీ, ఆయన మాత్రం వాళ్లను ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. (జెకర్యా 1:3, 4 చదవండి.) సత్యారాధనను మళ్లీ స్థాపించేందుకు వాళ్లకు సహాయం చేస్తానని యెహోవా మాటిచ్చాడు. కానీ అదే సమయంలో, పూర్ణహృదయంతో చేసే ఆరాధనను మాత్రమే అంగీకరిస్తానని ఆయన హెచ్చరించాడు. అయితే జెకర్యాకు వచ్చిన ఆరవ, ఏడవ దర్శనాల ద్వారా యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఎలా ప్రోత్సహించాడో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అంతేకాదు, ఆ దర్శనాలు నేడు మనకెలా సహాయం చేస్తాయో తెలుసుకుందాం.

దొంగతనం చేసేవాళ్లకు దేవుడు విధించే శిక్ష

4. ఆరవ దర్శనంలో జెకర్యా ఏమి చూశాడు? గ్రంథపుచుట్టకు రెండువైపులా ఎందుకు రాసివుంది? (1వ ప్రారంభ చిత్రం చూడండి.)

4 జెకర్యా పుస్తకంలోని 5వ అధ్యాయం ఒక అసాధారణమైన దర్శనంతో మొదలౌతుంది. (జెకర్యా 5:1, 2 చదవండి.) ఎగురుతున్న పుస్తకాన్ని లేదా గ్రంథపుచుట్టను జెకర్యా ఆ దర్శనంలో చూశాడు. అది దాదాపు 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉంది. తెరచి ఉన్న ఆ గ్రంథపు చుట్టు మీద ఒక సందేశం రాసివుంది. (జెక. 5:3) అది ఒక తీర్పు సందేశం. ప్రాచీనకాలాల్లో, ఏదైనా సందేశాన్ని సాధారణంగా గ్రంథపుచుట్టకు ఒక వైపే రాసేవాళ్లు. కానీ ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి గ్రంథపుచుట్టకు రెండు వైపుల రాసివుంది.

క్రైస్తవులు దొంగతనం చేయకూడదు (5-7 పేరాలు చూడండి)

5, 6. ఎలాంటి దొంగతనాన్నైనా యెహోవా ఎలా దృష్టిస్తాడు?

5 జెకర్యా 5:3, 4 చదవండి. మనుషులందరూ తమ పనుల విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలి. మరిముఖ్యంగా దేవుని ప్రజలకు ఆ బాధ్యత ఉంది, ఎందుకంటే వాళ్లు ఆయన పేరు పెట్టుకున్నారు. వాళ్లు ఆయన్ను ప్రేమిస్తారు, అంతేకాదు దొంగతనం చేస్తే దేవునికి చెడ్డపేరు వస్తుందని వాళ్లకు తెలుసు. (సామె. 30:8, 9) కానీ ఒక మంచి కారణంతో దొంగతనం చేస్తే తప్పేమీ కాదని కొంతమంది అనుకుంటారు. అయితే ఆ కారణం ఎంత మంచిదైనా దొంగతనం చేస్తే యెహోవాకు, ఆయన పేరుకు, ఆయన నియమానికి ప్రాముఖ్యత ఇవ్వనట్లే. బదులుగా సొంత దురాశకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు అవుతుంది.

6 జెకర్యా 5:3, 4⁠లో ఉన్న ఈ మాటల్ని గమనించండి. శాపం ‘దొంగల ఇళ్లలోను ప్రవేశించి వాళ్ల ఇళ్లలో ఉండి వాటిని నాశనం చేస్తుంది.’ కాబట్టి తన ప్రజల మధ్య జరిగే ఎలాంటి తప్పునైనా యెహోవా బయటపెట్టి, తీర్పు తీర్చగలడు. దొంగతనం చేసిన వ్యక్తి పోలీసుల, పై అధికారుల, సంఘపెద్దల లేదా తల్లిదండ్రుల కళ్లుకప్పి తప్పించుకోవచ్చేమోగానీ యెహోవా నుండి తప్పించుకోలేడు. ఆయన ఎలాంటి దొంగతనాన్నైనా బయటపెట్టగలడు. (హెబ్రీ. 4:13) “అన్ని విషయాల్లో” నిజాయితీగా ఉండేందుకు శాయశక్తులా కృషి చేసే ప్రజలతో ఉండడానికి మనం ఎంతో ఇష్టపడతాం.—హెబ్రీ. 13:18.

7. యెహోవా తీర్పుకు గురికాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

7 ఎలాంటి దొంగతనమైనా యెహోవా అసహ్యించుకుంటాడు. తప్పొప్పుల విషయంలో యెహోవా పెట్టిన సూత్రాలను తెలుసుకొని వాటిని పాటించడం, ఆయనకు చెడ్డపేరు తీసుకురాకుండా జీవించడం మనకు దొరికిన గొప్ప గౌరవంగా భావించాలి. అలా జీవిస్తే, తనకు లోబడని ప్రజలకు యెహోవా తీర్పు తీర్చినప్పుడు మనం కాపాడబడతాం.

‘ప్రతీరోజు’ మీ మాట నిలబెట్టుకోండి

8-10. (ఎ) ప్రమాణం అంటే ఏమిటి? (బి) రాజైన సిద్కియా ఏ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదు?

8 దేవుని పేరుమీద “అబద్ధప్రమాణము” చేసేవాళ్లకు కూడా ఒక హెచ్చరికా సందేశం ఆ ఎగిరే గ్రంథపుచుట్టలో ఉంది. (జెక. 5:4) ప్రమాణం అంటే ఏదైనా ఒక విషయం సత్యమని దృఢపర్చడానికి చెప్పే మాట లేదా ఒక పనిని చేస్తాననిగానీ చేయననిగానీ మాటివ్వడం.

9 యెహోవా పేరుమీద ప్రమాణం చేయడం చాలా గంభీరమైన విషయం. దాన్ని అర్థం చేసుకోవడానికి యెరూషలేమును పరిపాలించిన చివరి రాజైన సిద్కియాకు ఏమి జరిగిందో పరిశీలిద్దాం. అతను బబులోను రాజుకు లొంగిపోతానని యెహోవా పేరుమీద ప్రమాణం చేశాడు. కానీ అతను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఆ కారణాన్ని బట్టే యెహోవా సిద్కియాతో ఇలా అన్నాడు, “ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందును.”—యెహె. 17:16.

10 సిద్కియా ఆ ప్రమాణాన్ని దేవుని పేరుమీద చేశాడు కాబట్టి అతను దాన్ని నిలబెట్టుకోవాలని యెహోవా ఎదురుచూశాడు. (2 దిన. 36:13) కానీ సిద్కియా తన మాటను నిలబెట్టుకోకపోగా బబులోను నుండి తనను విడిపించమని ఐగుప్తును సహాయం అడిగాడు. అయినప్పటికీ ఐగుప్తు అతనికి సహాయం చేయలేకపోయింది.—యెహె. 17:11-15, 17, 18.

11, 12. (ఎ) మనం చేసే అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాణం ఏమిటి? (బి) మనం చేసుకున్న సమర్పణ మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

11 మనం చేసే ప్రమాణాల్ని యెహోవా వింటాడని సిద్కియాకు జరిగినదాన్నిబట్టి అర్థమౌతుంది. మనం యెహోవాను సంతోషపెట్టాలంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. (కీర్త. 76:11) మనం యెహోవాకు చేయగల అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాణం ఏమిటంటే, ఆయనకు సమర్పించుకోవడం. అంటే ఏమి జరిగినాసరే ఆయన్ను సేవిస్తామని మాటివ్వడం.

12 మరి, యెహోవాకు చేసిన ప్రమాణాన్ని మనమెలా నిలబెట్టుకోవచ్చు? మనకు ‘ప్రతీరోజు’ పరీక్షలు ఎదురౌతుంటాయి, అవి చిన్నవి కావచ్చు లేదా పెద్దవి కావచ్చు. అయితే వాటిని ఎలా ఎదుర్కొంటామనే దాన్నిబట్టి యెహోవాతో మనకున్న సంబంధం ఎంత బలంగా ఉందో చూపిస్తాం. (కీర్త. 61:8) ఉదాహరణకు, ఉద్యోగస్థలంలోగానీ స్కూల్‌లోగానీ ఎవరైనా మీతో కాస్త చనువుగా ఉంటూ సరసాలాడడం మొదలుపెడితే ఏమి చేస్తారు? దాన్ని తిరస్కరించి, మీరు యెహోవాకే లోబడుతున్నారని చూపిస్తారా? (సామె. 23:26) ఒకవేళ మీ ఇంట్లో యెహోవాను ఆరాధించేది మీరొక్కరే అయితే అప్పుడేమిటి? ఒక క్రైస్తవునిగా ఎల్లప్పుడూ చక్కని ప్రవర్తనను కలిగివుండేందుకు సహాయం చేయమని యెహోవాను అడుగుతారా? మీరెలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, యెహోవా చూపిస్తున్న ప్రేమకు, ఇస్తున్న నడిపింపుకు ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్తున్నారా? రోజూ బైబిలు చదువుతున్నారా? నిజానికి, ఇవన్నీ చేస్తామని యెహోవాకు మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు మాటిచ్చాం. మనం ఆయనకు లోబడినప్పుడు, ఆయన సేవలో చేయగలిగినదంతా చేసినప్పుడు మనం ఆయన సొత్తనీ ఆయన్ను ప్రేమిస్తున్నామనీ చూపిస్తాం. మనం దేవున్ని ఆరాధిస్తున్నామని మన జీవన విధానంలో చూపించాలి. యెహోవాకు నమ్మకంగా ఉండడం వల్ల ఆయనిచ్చే అద్భుతమైన భవిష్యత్తును పొందుతాం.—ద్వితీ. 10:12, 13.

13. జెకర్యాకు వచ్చిన ఆరవ దర్శనం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

13 మనం యెహోవాను ప్రేమిస్తే, దొంగతనం చేయమనీ చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకుంటామనీ అర్థం చేసుకోవడానికి జెకర్యాకు వచ్చిన ఆరవ దర్శనం సహాయం చేస్తుంది. అంతేకాదు ఇశ్రాయేలీయులు ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ, యెహోవా వాళ్లను విడిచిపెట్టకుండా తన మాట నిలబెట్టుకున్నాడని కూడా మనం నేర్చుకుంటాం. శత్రువుల మధ్య ఉండడంవల్ల వాళ్లు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారని యెహోవా అర్థంచేసుకున్నాడు. యెహోవాయే మనకు ఆదర్శంగా ఉంటూ, చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలని నేర్పిస్తున్నాడు. అలా నిలబెట్టుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. యెహోవా మనకు సహాయం చేస్తున్న ఒక విధానం ఏమిటంటే, భవిష్యత్తు విషయంలో నిరీక్షణ ఇవ్వడం. త్వరలోనే భూమ్మీదున్న దుష్టత్వాన్నంతటినీ ఆయన తీసేస్తాడు. ఈ నిరీక్షణ గురించి జెకర్యాకు వచ్చిన తర్వాతి దర్శనంలో నేర్చుకుంటాం.

యెహోవా దుష్టత్వాన్ని తీసేస్తాడు

14, 15. (ఎ) తనకు వచ్చిన ఏడవ దర్శనంలో జెకర్యా ఏమి చూశాడు? (2వ ప్రారంభ చిత్రం చూడండి.) (బి) పాత్రలో ఉన్న స్త్రీ ఎవరు? ఆ పాత్రమీద దూత ఎందుకు మూత పెట్టాడు?

14 ఎగురుతున్న గ్రంథపుచుట్టను చూసిన జెకర్యాతో ఒక దూత, ‘నిదానించి చూడు’ అన్నాడు. అప్పుడు అతను “కొల తూము” లేదా పాత్రను చూశాడు. (జెకర్యా 5:5-8 చదవండి.) ఆ పాత్రకు సీసంతో చేసిన గుండ్రటి మూత ఉంది. ఆ మూత తీసినప్పుడు, పాత్రలో ‘కూర్చున్న ఒక స్త్రీ’ జెకర్యాకు కనిపించింది. అయితే, ఆ స్త్రీ “దోషమూర్తి” లేదా దుష్టత్వం అని దూత జెకర్యాకు వివరించాడు. పాత్రలో నుండి ఆ స్త్రీ బయటకు రావడానికి ప్రయత్నిస్తుండడం చూసి జెకర్యాకు ఎంత భయమేసివుంటుందో ఊహించండి. కానీ దూత వెంటనే ఆ స్త్రీని మళ్లీ పాత్రలోకి నెట్టేసి దానిమీద బరువైన మూత పెట్టేశాడు. దానర్థమేమిటి?

15 తన ప్రజల మధ్య ఎలాంటి దుష్టత్వం ఉండడానికి యెహోవా అనుమతించడనే నమ్మకాన్ని ఈ దర్శనం కలిగిస్తుంది. యెహోవాకు ఏదైన చెడు కనిపిస్తే, దాన్ని తీసేయడానికి ఆయన వెంటనే చర్య తీసుకుంటాడు. (1 కొరిం. 5:13) దూత వెంటనే ఆ పాత్రమీద బరువైన మూత పెట్టడం ద్వారా ఆ విషయాన్ని చూపించాడు.

తన ఆరాధనను పరిశుద్ధంగా ఉంచుతానని యెహోవా మాటిచ్చాడు (16-18 పేరాలు చూడండి)

16. (ఎ) ఆ పాత్రకు ఏమైంది? (3వ ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఇద్దరు స్త్రీలు పాత్రను తీసుకొని ఎక్కడికి ఎగిరిపోయారు?

16 తర్వాత, సంకుబుడి కొంగ రెక్కల్లాంటి బలమైన రెక్కలతో ఉన్న ఇద్దరు స్త్రీలను జెకర్యా చూశాడు. (జెకర్యా 5:9-11 చదవండి.) ఆ ఇద్దరు స్త్రీలు, దుష్టత్వానికి సూచనగా ఉన్న పాత్రలోని స్త్రీకి పూర్తి భిన్నమైనవాళ్లు. వాళ్లు తమ బలమైన రెక్కలతో “దుష్టత్వం” ఉన్న పాత్రను తీసుకొని ఎగిరిపోయారు. వాళ్లు ఆ పాత్రను ఎక్కడికి తీసుకెళ్లారు? దాన్ని ‘షీనారుదేశమైన’ బబులోనుకు తీసుకెళ్లారు. ఎందుకు?

17, 18. (ఎ) ‘దుష్టత్వానికి’ బబులోను సరైన స్థలమని ఎందుకు చెప్పవచ్చు? (బి) మీరేమి చేయాలని నిర్ణయించుకున్నారు?

17 ‘దుష్టత్వాన్ని’ బబులోనుకు తీసుకెళ్లడం ఎందుకు సరైనదో జెకర్యా కాలంలో జీవించిన ఇశ్రాయేలీయులు అర్థంచేసుకొని ఉంటారు. బబులోను అనైతికతతో, అబద్ధ ఆరాధనతో నిండిపోయిన ఒక చెడ్డ పట్టణమని వాళ్లకు తెలుసు. ఆ పట్టణంలోని అన్యమతాల ప్రభావం తమమీద పడకుండా చూసుకోవడానికి జెకర్యా, ఇతర ఇశ్రాయేలీయులు ప్రతిరోజు చాలా కృషి చేశారు. యెహోవా తన ఆరాధనను కలుషితమవ్వకుండా చూస్తాడనే నమ్మకాన్ని ఆ దర్శనం వాళ్లలో కలిగించింది.

18 ఆరాధనను పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన బాధ్యత తమకూ ఉందని ఆ దర్శనం ఇశ్రాయేలీయులకు గుర్తుచేసింది. దేవుని ప్రజల మధ్య దుష్టత్వం ఉండకూడదు, ఉండదు కూడా. నేడు, యెహోవా మనల్ని తన పరిశుద్ధమైన సంస్థలోకి తీసుకొచ్చాడు, అక్కడే మనం ఆయన ప్రేమను, కాపుదలను పొందుతున్నాం. ఆ సంస్థను పరిశుద్ధంగా ఉంచాల్సిన బాధ్యత మనలో ప్రతీఒక్కరికి ఉంది. యెహోవా ప్రజల మధ్య దుష్టత్వం ఉండకూడదు.

పరిశుద్ధమైన ప్రజలు యెహోవాకు ఘనత తెస్తారు

19. జెకర్యాకు వచ్చిన ఆసక్తికరమైన దర్శనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

19 జెకర్యాకు వచ్చిన ఆరవ, ఏడవ దర్శనాలు చెడు చేసేవాళ్లకు ఒక గంభీరమైన హెచ్చరికగా ఉన్నాయి. యెహోవా దుష్టత్వాన్ని కొనసాగనివ్వడు. ఆయన సేవకులైన మనం దుష్టత్వాన్ని అసహ్యించుకోవాలి. మన ప్రేమగల తండ్రిని సంతోషపెట్టడానికి కృషి చేసినప్పుడు, ఆయన మనల్ని శపించడుగానీ కాపాడి, దీవిస్తాడనే అభయాన్ని ఈ దర్శనాలు ఇస్తున్నాయి. ఈ దుష్టలోకంలో పరిశుద్ధంగా ఉండడం కష్టమే అయినప్పటికీ, యెహోవా సహాయంతో అలా ఉండగలం. సత్యారాధన ఎప్పటికీ నిలిచి ఉంటుందని మనమెలా నమ్మవచ్చు? మహాశ్రమకు దగ్గరౌతుండగా యెహోవా తన సంస్థను కాపాడతాడని మనమెలా తెలుసుకోవచ్చు? ఈ ప్రశ్నల గురించి తర్వాతి ఆర్టికల్‌లో చర్చించుకుంటాం.