కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రథాలు, కిరీటం మిమ్మల్ని కాపాడతాయి

రథాలు, కిరీటం మిమ్మల్ని కాపాడతాయి

“మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.”జెక. 6:15.

పాటలు: 61, 22

1, 2. జెకర్యా ఏడవ దర్శనం చూసిన సమయానికి యెరూషలేములోని యూదుల పరిస్థితి ఎలా ఉంది?

 ఏడవ దర్శనం చూసిన తర్వాత జెకర్యా మదిలో ఎన్నో విషయాలు మెదిలివుంటాయి. దుష్టులను నాశనం చేస్తానని యెహోవా ఇచ్చిన మాటనుబట్టి అతను ఎంతో బలం పొందివుంటాడు. కాకపోతే ఆ మాట ఇంకా నెరవేరలేదు. చాలామంది చెడుపనులు చేస్తూ అవినీతిపరులుగానే ఉన్నారు, యెరూషలేము ఆలయాన్ని తిరిగి కట్టే పని కూడా ఇంకా పూర్తికాలేదు. మరి ఆలయాన్ని తిరిగి కట్టమని యెహోవా చెప్పిన పనిని యూదులు అంతలోనే ఎందుకు ఆపేశారు? కేవలం తమ జీవితాల్ని బాగు చేసుకోవడానికే వాళ్లు యెరూషలేముకు తిరిగొచ్చారా?

2 యెరూషలేముకు తిరిగివచ్చిన యూదులు యెహోవా ఆరాధకులేనని జెకర్యాకు తెలుసు. వాళ్లు బబులోనులో ఉన్న తమ ఇళ్లను, వ్యాపారాల్ని విడిచిపెట్టేలా వాళ్ల ‘మనస్సును దేవుడు ప్రేరేపించాడు.’ (ఎజ్రా 1:2, 3, 5) అందుకే, బాగా తెలిసిన ప్రాంతాన్ని వాళ్లు విడిచిపెట్టి వచ్చేశారు. పైగా వాళ్లలో చాలామంది ముందెప్పుడూ యెరూషలేమును చూడలేదు. అవును యెహోవా ఆలయాన్ని తిరిగి నిర్మించడాన్ని ఆ యూదులు ఎంత ప్రాముఖ్యంగా ఎంచారంటే, వాళ్లు అస్తవ్యస్తంగా ఉన్న దారిలో దాదాపు 1,600 కి.మీ. ప్రయాణించడానికి కూడా ఇష్టపడ్డారు.

3, 4. యెరూషలేముకు తిరిగొచ్చిన యూదులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

3 బబులోను నుండి యెరూషలేముకు చేసిన ఆ సుదూర ప్రయాణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. తాము వెళ్లబోతున్న ప్రాంతం గురించి ఆలోచించడానికి, మాట్లాడుకోవడానికి ప్రజలకు ఎన్నో గంటల సమయం ఉంది. ఒకప్పుడు యెరూషలేము, అక్కడి ఆలయం ఎంత అందంగా ఉండేవో వాళ్ల మధ్యున్న వృద్ధులు చెప్పారు. (ఎజ్రా 3:12) ఒకవేళ మీరు వాళ్లతో ప్రయాణం చేసివుంటే, యెరూషలేమును మొట్టమొదటిసారి చూసినప్పుడు మీకెలా అనిపించివుండేది? పిచ్చి మొక్కలతో నిండిపోయిన ఆ పాడుబడ్డ భవనాల్ని, కూలిపోయిన గోడల్ని చూసి మీరు బాధపడివుండేవాళ్లా? బహుశా పెద్దపెద్ద రంధ్రాలు ఉన్న ఆ గోడలను, ఎత్తుగా-బలంగా ఉన్న బబులోను గోడలతో మీరు పోల్చుకుని ఉండేవాళ్లు. కానీ అదంతా చూసి యూదులు నిరుత్సాహపడలేదు. ఎందుకంటే, ప్రయాణమంతటిలో యెహోవా వాళ్లను కాపాడాడు, సహాయం చేశాడు. వాళ్లు యెరూషలేములో అడుగుపెట్టిన వెంటనే ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టి, ప్రతీరోజు యెహోవాకు బలులు అర్పించడం మొదలుపెట్టారు. (ఎజ్రా 3:1, 2) వాళ్లు ఉత్సాహంతో, ఆలయ నిర్మాణ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వాళ్లను ఏదీ ఆపలేదన్నట్లు అనిపించింది.

4 ఆలయాన్ని తిరిగి నిర్మించడంతోపాటు యూదులు తమ పట్టణాల్ని, ఇళ్లను కూడా తిరిగి కట్టుకోవాలి. తమ కుటుంబాల్ని పోషించుకోవడానికి పంటలు పండించుకోవాలి. (ఎజ్రా 2:70) వాళ్లకు ఊపిరాడనంత పని ఉంది. కానీ ఎంతో సమయం గడవకముందే శత్రువులు వాళ్ల పనిని ఆపడానికి ప్రయత్నించారు. 15 ఏళ్లపాటు వాళ్ల పనికి వ్యతిరేకత ఎదురైంది, యూదుల ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారిపోయింది. (ఎజ్రా 4:1-4) క్రీ.పూ. 522⁠లో వాళ్లకు మరో సవాలు ఎదురైంది. యెరూషలేములో జరుగుతున్న నిర్మాణ పనులన్నీ ఆపేయాలని పారసీక రాజు ఆజ్ఞాపించాడు. యెరూషలేము పట్టణం ఇక ఎన్నడూ తిరిగి కట్టబడదన్నట్లు అనిపించింది.—ఎజ్రా 4:21-24.

5. యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేశాడు?

5 తన ప్రజలకు బలం, ధైర్యం అవసరమని యెహోవా దేవునికి తెలుసు. అందుకే వాళ్లను ప్రేమిస్తున్నానని, తనను సేవించడానికి వాళ్లు చేస్తున్న కృషిని మెచ్చుకుంటున్నానని చూపించడానికి జెకర్యాకు చివరి దర్శనం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పనిని మళ్లీ మొదలుపెడితే వాళ్లను కాపాడతానని యెహోవా మాటిచ్చాడు. ఆలయాన్ని తిరిగి నిర్మించడం గురించి ఆయనిలా చెప్పాడు, “మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.”—జెక. 6:15.

దూతల సైన్యం

6. (ఎ) జెకర్యాకు వచ్చిన ఎనిమిదవ దర్శనం ఎలా మొదలైంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) గుర్రాలు ఎందుకు వేర్వేరు రంగుల్లో ఉన్నాయి?

6 జెకర్యా చూసిన మిగతా దర్శనాలన్నిటికన్నా ఎనిమిదవ దర్శనమే అతని విశ్వాసాన్ని ఎంతగానో బలపర్చివుంటుంది. అదే అతనికి వచ్చిన చివరి దర్శనం కూడా. (జెకర్యా 6:1-3 చదవండి.) జెకర్యా చూసిన దాన్ని ఊహించుకోండి. ఇత్తడివైన “రెండు పర్వతముల మధ్య నుండి” నాలుగు రథాలను లాక్కెళ్తున్న గుర్రాలను అతను చూశాడు. గుర్రపు రౌతులను తేలిగ్గా గుర్తుపట్టడానికి వీలుగా గుర్రాలు వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. ‘ఇవి ఏమిటి’ అని జెకర్యా అడిగాడు. (జెక. 6:4) మనం కూడా అవేమిటో తెలుసుకోవాలి, ఎందుకంటే అవి మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తాయి.

తన ప్రజల్ని కాపాడడానికి, బలపర్చడానికి యెహోవా ఇప్పటికీ తన దూతల్ని ఉపయోగిస్తున్నాడు

7, 8. (ఎ) రెండు పర్వతాలు దేన్ని సూచిస్తున్నాయి? (బి) పర్వతాలు ఇత్తడితో ఎందుకు చేయబడ్డాయి?

7 బైబిల్లో ప్రస్తావించబడిన పర్వతాలు, రాజ్యాలను లేదా ప్రభుత్వాలను సూచిస్తాయి. జెకర్యా చూసిన పర్వతాలు, దానియేలు ప్రవచనంలో ప్రస్తావించబడిన రెండు పర్వతాలు ఒకేలాంటివి. అందులో ఒక పర్వతం విశ్వవ్యాప్తంగా, శాశ్వతకాలం ఉండే యెహోవా పరిపాలనను సూచిస్తుంది. మరొకటి, యేసు రాజుగా పరిపాలించే మెస్సీయ రాజ్యాన్ని సూచిస్తుంది. (దాని. 2:35, 45) 1914వ సంవత్సరం, శరదృతువులో యేసు రాజైనప్పటి నుండి ఈ రెండు పర్వతాలు భూమిపట్ల దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

8 అయితే పర్వతాలు ఇత్తడితో ఎందుకు చేయబడ్డాయి? ఇత్తడి చాలా విలువైన, కాంతివంతమైన లోహం. నిజానికి గుడారాన్ని, ఆ తర్వాత యెరూషలేము ఆలయాన్ని కడుతున్నప్పుడు ఇత్తడిని ఉపయోగించమని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (నిర్గ. 27:1-3; 1 రాజు. 7:13-16) ఈ పర్వతాల్లో ఉన్న ఇత్తడి యెహోవా విశ్వసర్వాధిపత్యం గొప్పతనాన్ని ఉన్నతపరుస్తుంది. అంతేకాదు మనుషులు సురక్షితంగా ఉంటూ, ఎన్నో దీవెనలు పొందే మెస్సీయ రాజ్యం గొప్పతనాన్ని ఉన్నతపరుస్తుంది.

9. రథాలు, గుర్రపు రౌతులు ఎవర్ని సూచిస్తున్నారు? వాళ్ల నియామకం ఏమిటి?

9 రథాలు, గుర్రపు రౌతులు ఎవర్ని సూచిస్తున్నారు? దూతలను, బహుశా వివిధ గుంపులకు చెందిన దూతలను సూచిస్తుండవచ్చు. (జెకర్యా 6:5-8 చదవండి.) ఆ దూతలు ఒక ప్రత్యేక నియామకం తీసుకుని “సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధి” నుండి వెళ్తున్నారు. దేవుని ప్రజల్ని కాపాడడానికి నిర్దిష్టమైన ప్రాంతాలకు ఆ దూతలు పంపించబడుతున్నారు. ముఖ్యంగా ‘ఉత్తర దేశమైన’ బబులోను నుండి వాళ్లను కాపాడడానికి వెళ్తున్నారు. తన ప్రజలు ఇక ఎన్నడూ బబులోనుకు బానిసలుగా ఉండరని తెలియజేయడానికి యెహోవా ఈ దర్శనాన్ని ఇచ్చాడు. జెకర్యా కాలంలో ఆలయాన్ని తిరిగి నిర్మించే వాళ్లకు ఇది ఎంత ఓదార్పునిచ్చి ఉంటుందో ఊహించండి. శత్రువుల గురించి వాళ్లు ఇక భయపడాల్సిన అవసరం లేదు.

10. రథాలు, గుర్రపు రౌతులు గురించిన జెకర్యా ప్రవచనం నేడు మనకెలా సహాయం చేస్తుంది?

10 నేడు కూడా తన ప్రజల్ని కాపాడడానికి, బలపర్చడానికి యెహోవా దూతల్ని ఉపయోగించుకుంటున్నాడు. (మలా. 3:6; హెబ్రీ. 1:7, 14) యెహోవా ప్రజలు సూచనార్థకంగా మహాబబులోను చెర నుండి విడుదల పొందినప్పటి నుండి అంటే 1919 నుండి సత్యారాధన వృద్ధిచెందకుండా, విస్తరించకుండా చేయాలని శత్రువులు చాలా ప్రయత్నించారు. (ప్రక. 18:4) కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. యెహోవా సంస్థను దూతలు కాపాడుతున్నారు కాబట్టి దేవుని సేవకులు మళ్లీ అబద్ధమత చెరలోకి వెళ్తారేమోనని మనం భయపడాల్సిన అవసరం లేదు. (కీర్త. 34:7) బదులుగా యెహోవా ఆరాధనలో సంతోషంగా, బిజీగా కొనసాగుతాం. మనం రెండు పర్వతాల ద్వారా సురక్షితంగా కాపాడబడుతున్నామని అర్థంచేసుకోవడానికి జెకర్యా ప్రవచనం సహాయం చేస్తుంది.

11. దేవుని ప్రజలపై జరగబోయే దాడి గురించి మనమెందుకు భయపడాల్సిన అవసరం లేదు?

11 అతిత్వరలోనే సాతాను లోకంలోని రాజకీయ శక్తులు ఏకమై దేవుని ప్రజల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తాయి. (యెహె. 38:2, 10-12; దాని. 11:40, 44, 45; ప్రక. 19:19) వాళ్లు భూమంతటిని మేఘంలా కమ్ముతున్నారని యెహెజ్కేలు ప్రవచనంలో చదువుతాం. వాళ్లు దేవుని ప్రజలపై దాడిచేయడానికి కోపంతో గుర్రాలపై వస్తున్నారు. (యెహె. 38:15, 16) a అయితే మనం వాళ్లకు భయపడాలా? అవసరం లేదు. యెహోవా సైన్యం మన వైపు ఉంది. మహాశ్రమ కాలంలో దేవుని దూతలు ఆయన ప్రజల్ని కాపాడతారు, ఆయన పరిపాలనను తిరస్కరించే వాళ్లందర్నీ నాశనం చేస్తారు. (2 థెస్స. 1:7, 8) ఆరోజు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! అయితే యెహోవా పరలోక సైన్యానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?

యెహోవా ఒక యాజకునికి కిరీటం పెట్టి రాజును చేస్తాడు

12, 13. (ఎ) జెకర్యాకు ఏమి చేయమని యెహోవా చెప్పాడు? (బి) “చిగురు” యేసుక్రీస్తును సూచిస్తుందని మనకెలా తెలుసు?

12 ఆ ఎనిమిది దర్శనాలను జెకర్యా మాత్రమే చూశాడు. కానీ ఆ తర్వాత జెకర్యా అందరికీ కనిపించే ఒక పని చేశాడు, ఆ పని వల్ల దేవుని ఆలయాన్ని తిరిగి కడుతున్న వాళ్లందరూ ఎంతో ప్రోత్సాహాన్ని పొందారు. (జెకర్యా 6:9-12 చదవండి.) హెల్దయి, టోబీయా, యెదాయాలు అనే ముగ్గురు వ్యక్తులు బబులోను నుండి యెరూషలేముకు వచ్చారు. వాళ్ల దగ్గర నుండి వెండిని, బంగారాన్ని తీసుకుని వాటితో ఒక “కిరీటము” చేయమని యెహోవా జెకర్యాకు చెప్పాడు. (జెక. 6:11) ఆ కిరీటం యూదా గోత్రానికి చెందిన దావీదు వంశం నుండి వచ్చిన అధిపతియైన జెరుబ్బాబెలు కోసమా? కాదు. ఆ కిరీటాన్ని ప్రధాన యాజకుడైన యెహోషువ తలకు పెట్టమని యెహోవా జెకర్యాకు చెప్పాడు. చూసే వాళ్లందరికీ ఇది ఆశ్చర్యాన్ని కలిగించివుంటుంది.

13 ప్రధాన యాజకుడైన యెహోషువకు కిరీటాన్ని పెట్టడం వల్ల అతను రాజు అయ్యాడా? లేదు. యెహోషువ దావీదు వంశస్థుడు కాడు కాబట్టి రాజు అయ్యే అర్హత అతనికి లేదు. భవిష్యత్తులో అలాగే శాశ్వత కాలం రాజుగా, యాజకునిగా ఉండే ‘చిగురుకు’ జరగబోయే దాన్ని సూచించడానికి యెహోవా అలా చేయమని చెప్పాడు. ఆ “చిగురు” యేసుక్రీస్తు అని బైబిలు చెప్తుంది.—యెష. 11:1; మత్త. 2:23.

14. రాజుగా, ప్రధాన యాజకుడిగా యేసు ఏమి చేస్తాడు?

14 యేసు రాజుగా, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన యెహోవా దూతల సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడు, ఈ క్రూరమైన లోకంలో దేవుని ప్రజల్ని సురక్షితంగా ఉంచేందుకు ఆయన చాలా కష్టపడుతున్నాడు. (యిర్మీ. 23:5, 6) దేవుని పరిపాలనకు మద్దతిస్తూ, దేవుని ప్రజల్ని కాపాడుతున్న క్రీస్తు అతిత్వరలోనే దేశాలను జయిస్తాడు. (ప్రక. 17:12-14; 19:11, 14, 15) కానీ ఆరోజు రావడానికి ముందు యేసు లేదా “చిగురు” చేయాల్సిన పని ఎంతో ఉంది.

ఆయన ఆలయాన్ని కడతాడు

15, 16. (ఎ) దేవుని ప్రజలు ఎలా పునరుద్ధరించబడి, శుద్ధీకరించబడ్డారు? ఆ పనిని ఎవరు చేశారు? (బి) క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగిసేనాటికి భూమి ఎలా ఉంటుంది?

15 యేసు రాజుగా, ప్రధాన యాజకునిగా ఉండడంతోపాటు, ‘యెహోవా ఆలయం కట్టే’ నియామకాన్ని కూడా పొందాడు. (జెకర్యా 6:13 చదవండి.) అబద్ధమతానికి సూచనగా ఉన్న మహాబబులోను నుండి దేవుని ప్రజల్ని 1919⁠లో విడిపించడం ద్వారా ఆ నిర్మాణ పనిని పూర్తిచేశాడు. యేసు సంఘాన్ని పునరుద్ధరించి, ‘నమ్మకమైన, బుద్ధిగల దాసున్ని’ నియమించాడు. ఆ దాసుడు ప్రస్తుతం గొప్ప ఆధ్యాత్మిక ఆలయపు భూభాగంలో జరిగే ప్రాముఖ్యమైన పనిని నిర్దేశిస్తున్నాడు. (మత్త. 24:45) యేసు దేవుని ప్రజల్ని శుద్ధీకరిస్తూ, వాళ్లు దేవుడు ఇష్టపడే విధంగా ఆరాధించేలా సహాయం చేస్తున్నాడు.—మలా. 3:1-3.

16 యేసు అలాగే ఆయన తోటి రాజులూ, యాజకులైన 1,44,000 మంది వెయ్యేళ్లు భూమిని పరిపాలిస్తారు. ఆ సమయంలో, నమ్మకమైన మనుషులందరూ పరిపూర్ణులయ్యేందుకు వాళ్లు సహాయం చేస్తారు. ఆ రాజులు, యాజకులు తమ పనిని పూర్తిచేసే సమయానికి, యెహోవాను నిజంగా ఆరాధించేవాళ్లు మాత్రమే భూమ్మీద మిగిలి వుంటారు. చివరిగా, సత్యారాధన పూర్తిగా పునరుద్ధరించబడుతుంది.

నిర్మాణ పనిలో పాల్గొనండి

17. యూదులకు ధైర్యాన్నిచ్చే ఏ మాటలు యెహోవా చెప్పాడు? ఆ మాటలు వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

17 జెకర్యా సందేశం అప్పటి యూదులపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఆలయ నిర్మాణ పని పూర్తి చేసేలా వాళ్లకు సహాయం చేస్తానని, కాపాడతానని యెహోవా మాటిచ్చాడు. ఆ మాట వాళ్లకు నిరీక్షణను ఇచ్చింది. కానీ ఇంత తక్కువమందిమి అంత గొప్ప పనిని ఎలా చేయగలమని వాళ్లు భయపడివుంటారు. అందుకే వాళ్ల భయాలను, అనుమానాలను తీసేయడానికి జెకర్యా ఒక మాట చెప్పాడు. తమకు సహాయం చేయడానికి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయాలు వంటి వాళ్లతోపాటు ఇంకా చాలామంది “వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు” అని యెహోవా చెప్పాడు. (జెకర్యా 6:15 చదవండి.) యెహోవా తమ పనికి మద్దతిస్తున్నాడని యూదులు బలంగా నమ్మారు. అందుకే పారసీక రాజు అధికారికంగా నిషేధం విధించినప్పటికీ వాళ్లు ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి ధైర్యంగా వెళ్లారు. ఆ నిషేధం వాళ్ల పనికి ఓ పెద్ద పర్వతంలా అడ్డుగా ఉంది, కానీ కొద్ది సమయంలోనే యెహోవా దాన్ని తొలగించాడు. ఆఖరికి, క్రీ.పూ. 515⁠లో ఆలయ నిర్మాణం పూర్తయింది. (ఎజ్రా 6:22; జెక. 4:6, 7) అయితే యెహోవా చెప్పిన ఆ మాటలు నేడు జరుగుతున్న మరింత గొప్ప పనిని కూడా సూచిస్తున్నాయి.

తనపట్ల చూపించే ప్రేమను యెహోవా ఎన్నడూ మర్చిపోడు! (18, 19 పేరాలు చూడండి)

18. జెకర్యా 6:15 నేడు ఎలా నెరవేరుతోంది?

18 నేడు లక్షలమంది యెహోవాను ఆరాధిస్తున్నారు. వాళ్లు తమ దగ్గరున్న ‘విలువైన వాటిని’ అంటే వాళ్ల సమయాన్ని, శక్తిని, వస్తుసంపదలను సంతోషంగా ఇస్తున్నారు. అలా చేయడంవల్ల వాళ్లు యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి మద్దతిస్తున్నారు. (సామె. 3:9, NW) మనం నమ్మకంగా ఇచ్చే మద్దతును యెహోవా విలువైనదిగా చూస్తాడనే ధైర్యంతో ఉండవచ్చు. హెల్దయి, టోబీయా, యెదాయాలు వెండిని, బంగారాన్ని తీసుకొచ్చారనీ, వాటితో జెకర్యా ఒక కిరీటాన్ని తయారు చేశాడనీ గుర్తుంచుకోండి. ఆ కిరీటం సత్యారాధన కోసం వాళ్లు ఇచ్చిన విరాళాలకు గుర్తుగా లేదా “జ్ఞాపకార్థముగా” ఉంది. (జెక. 6:14) మనం చేసే పనిని, ఆయనపట్ల చూపించే ప్రేమను యెహోవా ఎన్నడూ మర్చిపోడు.—హెబ్రీ. 6:10.

19. జెకర్యాకు వచ్చిన దర్శనాల వల్ల మనమెలా ప్రయోజనం పొందుతున్నాం?

19 ఈ చివరిరోజుల్లో సత్యారాధన విషయంలో యెహోవా ప్రజలు గొప్ప పని చేయగలుగుతున్నారు. యెహోవా దీవెన అలాగే క్రీస్తు నాయకత్వం వల్ల మాత్రమే ఇది జరుగుతోంది. దేవుని సంస్థ స్థిరమైనది, సురక్షితమైనది, శాశ్వతమైనది. అలాంటి సంస్థలో ఉంటున్నందుకు మనం సంతోషిస్తున్నాం. సత్యారాధనకు సంబంధించి యెహోవా సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని మనకు తెలుసు. కాబట్టి యెహోవా ప్రజల్లో మీకున్న స్థానాన్ని బట్టి కృతజ్ఞత కలిగివుంటూ, “మీ దేవుడైన యెహోవా మాట” వినండి. అప్పుడు మన రాజు, ప్రధాన యాజకుడు అయిన యేసు అలాగే దూతలు మిమ్మల్ని కాపాడతారు. సత్యారాధనకు మద్దతివ్వడానికి మీరు చేయగలిగినదంతా చేయండి. ఈ వ్యవస్థకు మిగిలిన సమయమంతటిలో అలాగే శాశ్వతంగా యెహోవా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు.

a మరింత సమాచారం కోసం 2015, మే 15 కావలికోట సంచికలోని 29-30 పేజీల్లో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.