కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు, మీ భవిష్యత్తు

బైబిలు, మీ భవిష్యత్తు

ఊహించుకోండి, మీరు బాగా చీకటి పడ్డాక ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సూర్యుడు అస్తమించి చాలాసేపు అయింది, కానీ మీరు దారి తప్పిపోయారని మీకు అస్సలు అనిపించడం లేదు. ఎందుకంటే మీ చేతిలో బాగా వెలుగు ఇచ్చే ఒక టార్చ్‌లైట్‌ ఉంది. మీరు దాన్ని కిందకు చూపించినప్పుడు మీ ఎదురుగా ఉన్నవాటిని మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారు. మీరు దాన్ని ముందుకు చూపించినప్పుడు ఆ లైట్‌ చాలాదూరం వరకు మీరు వెళ్లే దారిని చూపిస్తుంది.

చాలా విధాలుగా బైబిలు కూడా ఆ టార్చ్‌లైట్‌ లాంటిదే. ముందు ఆర్టికల్స్‌లో మనం పరిశీలించినట్లు, దేవుని వాక్యం మన ఎదురుగా ఉన్నవాటి విషయంలో మనకు సహాయం చేస్తుంది. అంటే నిలకడ లేని ఈ లోకంలో ప్రతీ రోజూ మనందరికీ వచ్చే సమస్యల విషయంలో సహాయం చేస్తుంది. అంతేకాదు బైబిలు అంతకన్నా ఎక్కువ కూడా చేస్తుంది. మన భవిష్యత్తు మీద కూడా వెలుగు చూపించి మనకు శాశ్వతంగా సంతోషాన్ని, సంతృప్తిని తీసుకొచ్చే మార్గంలో వెళ్లడానికి సహాయం చేస్తుంది. (కీర్తన 119:105) ఎలా?

భవిష్యత్తు కోసం ఎదురు చూడడానికి బైబిలు రెండు విధాలుగా మనకు ఎలా సహాయం చేస్తుందో పరిశీలిద్దాం: 1 మన జీవితానికున్న అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది, 2 దేవునితో శాశ్వతంగా ఉండే స్నేహాన్ని ఎలా పెంచుకోవాలో నేర్పిస్తుంది.

1 జీవితానికున్న ఉద్దేశం

మన సమస్యల్లో ఏమి చేయాలో కావాల్సిన నమ్మదగిన సలహాలు బైబిలు మనకు ఇస్తుంది, కానీ అది మనకు మనం సొంతగా సహాయం చేసుకోవడానికి ఉన్న పుస్తకం మాత్రమే కాదు. మన సొంత విషయాల గురించి మాత్రమే ఆలోచించుకునేలా ప్రోత్సహించకుండా, ఒక పెద్ద అంశంలో మనం ఎలా భాగమై ఉన్నామో చూడాలని బైబిలు నేర్పిస్తుంది. అప్పుడు మాత్రమే మన జీవితాలకు నిజమైన అర్థం ఉంటుంది.

ఉదాహరణకు ఈ బైబిలు సలహా గురించి ఆలోచించండి: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొస్తలుల కార్యాలు 20:35) మీరు అవసరంలో ఉన్న వాళ్లకు వస్తుపరంగా చేసిన సహాయాన్ని గుర్తుచేసుకోండి? లేదా మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు తన మనసు విప్పి లోపల ఉన్నదంతా బయటపెట్టినప్పుడు మీరు శ్రద్ధగా విన్న సమయాన్ని గుర్తుచేసుకోండి? వేరే వాళ్లు సంతోషంగా ఉండేలా చేసినందుకు మీకు సంతృప్తిగా అనిపించలేదా?

మనం తిరిగి ఏదీ ఆశించకుండా ఏమైనా ఇచ్చినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఒక రచయిత ఇలా అన్నాడు: “మిమ్మల్ని మీరు ఇచ్చినప్పుడు తిరిగి అంతకన్నా ఎక్కువ పొందకుండా ఉండడం అసలు జరగదు. కాకపోతే ఇచ్చేటప్పుడు మీరు నాకు తిరిగి ఏమి వస్తుంది అనే ఆలోచన లేకుండా ఇచ్చి ఉండాలి.” మనం చేసినదానికి తిరిగి ఏమీ ఇవ్వలేని వాళ్లకి మనం ఏదైనా ఇచ్చినా కూడా మనకు ఫలితం దొరుకుతుంది. మనం ఒక పెద్ద అంశంలో భాగం అవుతాం. అంటే నిజానికి మనం సృష్టికర్తతోనే చేయిచేయి కలిపి పనిచేసిన వాళ్లం అవుతాం. ఆయన ఇలాంటి మంచి పనుల్ని ఆయనకు అప్పు ఇచ్చినట్లుగా చూస్తాడు. (సామెతలు 19:17) మనం బీదవాళ్లకు చేసే సహాయాన్ని ఆయన ఎంతో విలువైనదిగా చూస్తాడు. ఆయన మనకు భూమి మీద పరదైసులో శాశ్వత జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు. భవిష్యత్తు విషయంలో అది మనకు ఎంతో మంచి నిరీక్షణ కదా.—కీర్తన 37:29; లూకా 14:12-14. *

అన్నిటికన్నా ముఖ్యంగా నిజమైన దేవుడు యెహోవాను ఆరాధించడం ద్వారా మన జీవితానికున్న అసలు అర్థాన్ని తెలుసుకోగలమని బైబిలు నేర్పిస్తుంది. ఆయన వాక్యం ఆయనను స్తుతించమని, మహిమపరచమని ఆయనకు చూపించాల్సిన విధేయతను చూపించమని ప్రోత్సహిస్తుంది. (ప్రసంగి 12:13; ప్రకటన 4:11) అలా చేసినప్పుడు, మనం ఒక గొప్ప విషయాన్ని సాధించిన వాళ్లం అవుతాము: మన సృష్టికర్తలో మంచి అనుభూతిని కలిగిస్తాము. ఆయన ఇలా బ్రతిమాలుతున్నాడు: “జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము.” (సామెతలు 27:11) ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఉన్న సలహాల ప్రకారం మనం తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మనం మన పరలోక తండ్రి హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాము. ఎందుకు? ఎందుకంటే ఆయన మన గురించి పట్టించుకుంటాడు, ఆయనిచ్చే మార్గనిర్దేశాన్ని పాటించి మనకు మనం ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాడు. (యెషయా 48:17, 18) నిజంగా ఈ విశ్వంలోనే ఉన్నతుడిని ఆరాధిస్తూ, ఆయన హృదయానికి ఆనందం కలిగించే విధంగా జీవించడం కన్నా మన జీవితానికి గొప్ప ఉద్దేశం ఉంటుందా?

2 మన సృష్టికర్తతో స్నేహం

మన సృష్టికర్తతో స్నేహాన్ని పెంచుకోమని బైబిలు మనకు నేర్పిస్తుంది. “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు” అని లేఖనాలు చెప్తున్నాయి. (యాకోబు 4:8) కొన్నిసార్లు సర్వశక్తిమంతుడైన సృష్టికర్తకు స్నేహితులుగా ఉండడం సాధ్యమేనా అనే సందేహం మనకు రావచ్చు. కానీ మనం ఆయన కోసం వెతికితే ఆయనను కనుక్కోగలుగుతామని బైబిలు మనకు భరోసా ఇస్తుంది. ఎందుకంటే “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.” (అపొస్తలుల కార్యాలు 17:27) బైబిలు సలహా ఇస్తున్నట్లు దేవునితో స్నేహం మన భవిష్యత్తుకు చాలా ప్రయోజనకరం. ఎలా?

ఆలోచించండి: ఎంత ప్రయత్నించినా మనం ఎవ్వరం మన సొంతగా మరణమనే ఆఖరి శత్రువుని తప్పించుకోలేము. (1 కొరింథీయులు 15:26) కానీ దేవుడు నిత్యం ఉన్నాడు. ఆయన అస్సలు చనిపోడు, ఆయన స్నేహితులు కూడా శాశ్వతంగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. “మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.” (కీర్తన 22:26) ఈ మాటలు చిన్నవే అయినా ఎంతో అందమైనవి. వీటి ద్వారా యెహోవా తనను వెదికే వారికోసం ఏమి కోరుకుంటున్నాడో బైబిలు చెప్తుంది.

మరి దేవునితో అలాంటి నిరంతర స్నేహాన్ని మీరు ఎలా పెంచుకోవచ్చు? ఆయన వాక్యమైన బైబిలు ద్వారా దేవుని గురించి నేర్చుకుంటూ ఉండండి. (యోహాను 17:3; 2 తిమోతి 3:16) లేఖనాలను అర్థం చేసుకోవడానికి ఆయన సహాయాన్ని అడగండి. మనం నిజాయితీగా “దేవుణ్ణి అడుగుతూ ఉండాలి.” అప్పుడు ఆయన తెలివి ఇస్తాడనే నమ్మకాన్ని బైబిలు మనకు ఇస్తుంది. * (యాకోబు 1:5) చివరిగా మీరు నేర్చుకున్నవాటిని పాటించడానికి కష్టపడండి. దేవుని వాక్యాన్ని ఇప్పుడు, నిరంతరం, మీ పాదానికి దీపంలా, మీ త్రోవకు వెలుగుగా సహాయం చేయనివ్వండి.—కీర్తన 119:105.

^ పేరా 8 పరదైసులో శాశ్వత జీవితం అనే దేవుని వాగ్దానం గురించి ఎక్కువ సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే పుస్తకంలో 3వ అధ్యాయం చూడండి.

^ పేరా 13 యెహోవాసాక్షులు ఉచితంగా ఒక బైబిలు కోర్స్‌ ఇస్తారు. అది లేఖనాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ కోర్స్‌ గురించి తెలుసుకోవడానికి బైబిలు అధ్యయనం అంటే ఏంటి? అనే వీడియో చూడండి. మీరు దానిని jw.orgలోకి వెళ్లి, వెతుకు బటన్‌ నొక్కి, పేరు టైప్‌ చేసి చూడవచ్చు.

దేవుడు నిత్యం ఉన్నాడు, ఆయన తన స్నేహితులు కూడా నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాడు