కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నమ్మదగిన ప్రవచనానికి నిశ్శబ్దమైన సాక్ష్యం

నమ్మదగిన ప్రవచనానికి నిశ్శబ్దమైన సాక్ష్యం

సెంట్రల్‌ రోమ్‌ ఇటలీలో విజయానికి గుర్తుగా ఉన్న ఒక ఆర్చి ఉంది. అది ప్రపంచ నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది. రోముకు ఇష్టమైన ఒక చక్రవర్తి టైటస్‌కు గౌరవార్థంగా ఆ ఆర్చి ఉంది.

ఆర్క్‌ ఆఫ్‌ టైటస్‌ మీద రెండు పెద్ద చెక్కడాలు ఉన్నాయి. అవి చాలామందికి తెలిసిన ఒక చారిత్రక సంఘటనను చూపిస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ ఆర్చికి బైబిలుకు సంబంధం ఉంది. ఆర్క్‌ ఆఫ్‌ టైటస్‌ బైబిల్లో ఉన్న ఒక గొప్ప ప్రవచనానికి మౌనంగా సాక్ష్యం ఇస్తుంది.

ఖండించబడిన పట్టణం

క్రీస్తు శకం మొదటి శతాబ్దం ఆరంభంలో రోమా సామ్రాజ్యం బ్రిటన్‌, గాల్‌ (ఇప్పుడు ఫ్రాన్స్‌) నుండి ఈజిప్టు వరకు ఉన్న ప్రాంతంలో ఉండేది. ఆ ప్రాంతమంతా ఎప్పుడూ లేనంతగా శాంతిసౌభాగ్యాలతో ఉండేది. కానీ మారుమూల ఉన్న ఒక ప్రాంతం మాత్రం రోమీయులకు ఎప్పుడూ తలనొప్పిగా ఉండేది. అదే ఎప్పుడూ గొడవలతో ఉండే యూదయ.

ది ఎన్‌సైక్లోపీడీయా ఆఫ్‌ ఏన్షియంట్‌ రోమ్‌ ఇలా చెప్తుంది: “రోమా అధికారం క్రింద ఉన్న యూదయ లాంటి కొన్ని ప్రాంతాల విషయంలో రెండు వైపులా చాలా అయిష్టత ఉండేది. యూదుల ఆచారాలను అస్సలు పట్టించుకోని విదేశీ యజమానులంటే యూదులు అయిష్టత చూపించేవాళ్లు. రోమీయులు కూడా యూదుల మొండితనాన్ని సహించడం చాలా కష్టంగా భావించేవాళ్లు.” చాలామంది యూదులు మెస్సీయ వాళ్ల నాయకుడిగా వచ్చి వాళ్లు అసహ్యించుకునే రోమీయులను తరిమేసి, ఇశ్రాయేలుకు బంగారు కాలాన్ని తెస్తాడని అనుకునేవాళ్లు. కానీ యెరూషలేము ఒక పెద్ద విపత్తును భరించాల్సి ఉంటుందని యేసుక్రీస్తు, క్రీస్తు శకం 33⁠లో ప్రకటించాడు.

యేసు ఇలా చెప్పాడు:“నీ శత్రువులు పదునైన కర్రలతో నీ చుట్టూ గోడ కట్టి, అన్నివైపుల నుండి నిన్ను చుట్టుముట్టి, నిన్ను ఆక్రమించుకునే రోజులు రాబోతున్నాయి. వాళ్లు నిన్నూ నీ పిల్లల్నీ నేలకేసి కొడతారు; నీలో రాయి మీద రాయి అనేదే ఉండకుండా చేస్తారు.”లూకా 19:43, 44.

యేసు మాటలు ఆయన శిష్యులకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటాయి. రెండు రోజుల తర్వాత, యెరూషలేము దేవాలయాన్ని చూస్తూ వాళ్లలో ఒకరు గొప్పగా ఇలా అన్నారు: “బోధకుడా, ఓసారి అటు చూడు! ఆ రాళ్లు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా!” నిజంగా ఆ ఆలయంలో కొన్ని రాళ్లు 11 మీటర్లు (36 అడుగులు) కన్నా పొడవు, 5 మీటర్లు (16 అడుగులు) కన్నా వెడల్పు, 3 మీటర్లు (10 అడుగులు) కన్నా ఎత్తు ఉన్నాయి. అయినా యేసు ఇలా జవాబిచ్చాడు: “మీరు వీటిని చూస్తున్నారు కదా, రాయి మీద రాయి ఒక్కటి కూడా ఉండకుండా పడద్రోయబడే రోజులు వస్తాయి.”మార్కు 13:1; లూకా 21:6.

యేసు వాళ్లతో ఇంకా ఇలా చెప్పాడు: “యెరూషలేమును సైన్యాలు చుట్టుముట్టడం మీరు చూసినప్పుడు, దాని నాశనం దగ్గరపడిందని తెలుసుకోండి. అప్పుడు యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి; యెరూషలేము మధ్యలో ఉన్నవాళ్లు అక్కడినుండి వెళ్లిపోవాలి; గ్రామాల్లో ఉన్నవాళ్లు దానిలోకి వెళ్లకూడదు.” (లూకా 21:20, 21) యేసు మాటలు నిజమయ్యాయా?

పట్టణ నాశనం

ముప్పై మూడు సంవత్సరాలు గడిచిపోయాయి, యూదయ ఇంకా రోమా కాడి క్రింద నలుగుతూ ఉంది. కానీ క్రీ.శ 66⁠లో రోమా ప్రోక్యురేటర్‌ గెసియస్‌ ఫ్లోరస్‌ పవిత్రమైన ఆలయ నిధిలో ఉన్న ధనాన్ని స్వాధీనం చేసుకున్నాడని కోపంతో ఉన్న యూదులు సహించలేకపోయారు. వెంటనే యూదా పోరాట యోధులు యెరూషలేములోకి గుంపులు గుంపులుగా వచ్చేశారు. అక్కడున్న రోమా సైనికదళాలను చంపేసి రోము నుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు.

మూడు నెలల తర్వాత దాదాపు 30,000 రోమా సైనికులతో సెస్టీయస్‌ గాలస్‌ ఆ తిరుగుబాటును అణచివేయడానికి యెరూషలేముకు బయలుదేరాడు. రోమీయులు త్వరగా పట్టణంలోకి ప్రవేశించి ఆలయ ప్రాంతం చుట్టూ ఉన్న గోడను బలహీనం చేశారు. కానీ ఎందుకో స్పష్టమైన కారణం లేకుండానే వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు. యూదా తిరుగుబాటుదారులు సంతోషించి వెంటనే వాళ్లను తరుముకుంటూ వెళ్లారు. పోరాడుకుంటున్న ఈ రెండు గుంపులు వెళ్లిపోగానే క్రైస్తవులు యేసు హెచ్చరికను పాటిస్తూ, యెరూషలేము నుండి యొర్దాను అవతలనున్న కొండలకు పారిపోయారు.—మత్తయి 24:15, 16.

ఈ తర్వాత సంవత్సరంలో జనరల్‌ వెస్పేసియన్‌, అతని కొడుకు టైటస్‌ ఆధ్వర్యంలో రోము మళ్లీ యూదయ మీద సైనికచర్యను మొదలుపెట్టింది. కానీ క్రీ.శ 68⁠లో రోమా చక్రవర్తి నీరో చనిపోగానే సింహాసనాన్ని అదిష్టించడానికి వెస్పేసియన్‌ రోముకు తిరిగి వెళ్లాడు. యూదా మీద సైనిక చర్యను 60,000 మంది రోమా సైనికులతోపాటు అతని కొడుకు టైటస్‌కు వదిలేసి వెళ్లిపోయాడు.

క్రీ.శ 70 జూన్‌లో టైటస్‌ యూదయ గ్రామాల్లో ఉన్న చెట్లన్నిటినీ నరికివేయమని తన సైనికులను ఆదేశించాడు. వాటిని పదునుగా చెక్కి 7 కిలోమీటర్ల పొడవైన గోడను యెరూషలేము చుట్టూ కట్టాడు. సెప్టెంబరు నెలకల్లా రోమీయులు పట్టణాన్ని, ఆలయాన్ని కొల్లగొట్టి, కాల్చేసి యేసు ముందే చెప్పినట్లు రాయిమీద రాయి లేకుండా పడేశారు. (లూకా 19:43, 44)జాగ్రత్తగా వేసిన ఒక అంచనా ప్రకారం, “యెరూషలేములో, ఆ దేశంలో ఉన్న మిగతావాళ్లతో కలుపుకుని నశించిన వాళ్లు రెండున్నర లక్షల నుండి ఐదు లక్షల మధ్యలో ఉండి ఉంటారు.”

సామ్రాజ్య విజయం

క్రీ.శ 71లో టైటస్‌ ఇటలీకి తిరిగివెళ్లాక రోమా పౌరులు అతనికి ఘనమైన స్వాగతం ఇచ్చారు. ఆ గొప్ప విజయాన్ని జరుపుకోవడానికి పట్టణమంతా వచ్చారు. అలాంటి ఊరేగింపు రాజధానిలో ఎప్పుడూ జరగలేదు.

రోము వీధుల్లో లెక్కలేనంత సంపదను ఊరేగింపుగా తెస్తుంటే చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. స్వాధీనం చేసుకున్న ఓడల్ని, యుద్ధ దృశ్యాల ప్రదర్శనలను, యెరూషలేము ఆలయాన్ని కొల్లగొట్టి తెచ్చిన వస్తువుల్ని చూడడం ప్రజలకు కన్నుల పండుగగా ఉంది.

టైటస్‌ తన తండ్రి వెస్పేసియన్‌ తర్వాత క్రీ.శ 79లో చక్రవర్తి అయ్యాడు. కానీ రెండు సంవత్సరాలకే అకస్మాత్తుగా చనిపోయాడు. అతని తమ్ముడు డమిషన్‌ సింహాసనం ఎక్కాక, కొంత కాలంలోనే టైటస్‌ విజయానికి గుర్తుగా ఉన్న ఈ ఆర్చిని అతని గౌరవార్థంగా నిర్మించాడు.

ఇప్పుడున్న ఆర్చి

రోములో ఇప్పుడున్న ఆర్క్‌ ఆఫ్‌ టైటస్‌

నేడు ఆర్క్‌ ఆఫ్‌ టైటస్‌ను ప్రతీ సంవత్సరం రోమన్‌ ఫారమ్‌కు వస్తున్న లక్షల ప్రజలు చూసి ఎంతో ఆశ్చర్యపోతుంటారు. కొంతమంది దాన్ని గొప్ప కళాఖండంగా, ఇంకొంతమంది రోమా సామ్రాజ్య గొప్పతనానికి నివాళిగా, మరికొంతమంది ఓడిపోయిన యెరూషలేముకు, అందులో ఉన్న ఆలయానికి గుర్తుగా చూస్తారు.

కానీ బైబిల్ని శ్రద్ధగా చదివేవాళ్లు మాత్రం ఆర్క్‌ ఆఫ్‌ టైటస్‌కు ఇంకా ఎక్కువ విలువ ఇస్తారు. ఎందుకంటే అది బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఎంత నమ్మదగినవో, ఎంత ఖచ్చితమైనవో చూపించే మౌన సాక్ష్యం.—2 పేతురు 1:19-21.