కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు బాధలన్నిటినీ త్వరలోనే తీసేస్తాడు

దేవుడు బాధలన్నిటినీ త్వరలోనే తీసేస్తాడు

“యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.” (హబక్కూకు 1:2, 3) దేవుని ఆమోదం ఉన్న ఒక మంచి వ్యక్తి హబక్కూకు చెప్పిన మాటలు ఇవి. ఆయన అడిగిన మాటలను బట్టి ఆయనకు విశ్వాసం లేదని చెప్పవచ్చా? అస్సలు కాదు. బాధలను తీసేయడానికి ఒక సమయాన్ని నియమించానని చెప్పడం ద్వారా దేవుడు హబక్కూకుకు అభయాన్ని ఇచ్చాడు.—హబక్కూకు 2:2, 3.

మీరు గానీ, మీవాళ్లు గానీ బాధపడుతుంటే, దేవుడు వెంటనే చర్య తీసుకోవడం లేదని త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేయవచ్చు, ఆయన ఇప్పటికే ఏదోకటి చేసి ఉండాల్సింది అని కూడా అనుకోవచ్చు. కానీ, బైబిలు ఇలా అభయం ఇస్తుంది: “కొందరు అనుకుంటున్నట్టు యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయడు. కానీ మీ విషయంలో ఆయన ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనం కావడం ఆయనకు ఇష్టంలేదు, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు.”—2 పేతురు 3:9.

దేవుడు ఎప్పుడు చర్య తీసుకుంటాడు?

చాలా త్వరలోనే! ఈ లోకం త్వరలో అంతం అవుతుందని చెప్పడానికి లేదా “ఈ వ్యవస్థ” చివరి రోజుల్లో ఉందని చెప్పడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఒకేసారి చోటుచేసుకుంటాయి. వాటిని ఒక ప్రత్యేక తరం వాళ్లు మాత్రమే చూస్తారని యేసు చెప్పాడు. (మత్తయి 24:3-42) యేసు చెప్పిన ప్రవచనం మన కాలంలో నెరవేరడాన్ని బట్టి, మనుషుల వ్యవహారాల్లో దేవుడు త్వరగా జోక్యం చేసుకుంటాడని నమ్మవచ్చు. *

కానీ దేవుడు బాధలన్నిటినీ ఎలా తీసేస్తాడు? యేసు భూమ్మీద ఉన్నప్పుడు మనుషుల బాధలు తీసేయగల దేవుని శక్తిని చూపించాడు. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం.

ప్రకృతి విపత్తులు: యేసు, ఆయన శిష్యులు గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక పెద్ద తుఫాను వచ్చి పడవ మునిగిపోయేలా చేసింది. కానీ, అప్పుడు యేసు తనకు, తన తండ్రికి ప్రకృతి శక్తుల మీద అధికారం ఉందని చూపించాడు. (కొలొస్సయులు 1:15, 16) యేసు కేవలం “ష్‌! నిశ్శబ్దంగా ఉండు!” అన్నాడు. ఏం జరిగింది? “గాలి సద్దుమణిగింది, అంతా చాలా ప్రశాంతంగా మారిపోయింది.”—మార్కు 4:35-39.

అనారోగ్యం: గుడ్డివాళ్లను, కుంటివాళ్లను అంతేకాదు మూర్చరోగులను, కుష్ఠురోగులను, ఇంకా ఎలాంటి అనారోగ్యంతో ఉన్నవాళ్లనైనా బాగు చేసే సామర్థ్యం యేసుకు ఉందని అప్పట్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆయన “అనారోగ్యంతో ఉన్న వాళ్లందర్నీ బాగుచేశాడు.”—మత్తయి 4:23, 24; 8:16; 11:2-5.

ఆహార కొరత: యేసు తన తండ్రి ఇచ్చిన శక్తితో తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంతోమందికి పెట్టగలిగాడు. ఆయన పరిచర్య చేసిన కాలంలో రెండుసార్లు అలా వేలమందికి ఆహారం పెట్టాడని బైబిలు చెప్తుంది.—మత్తయి 14:14-21; 15:32-38.

మరణం: యేసు ముగ్గురిని పునరుత్థానం చేశాడని రాయబడిన సంఘటనలు యెహోవాకు మరణం లేకుండా చేసే శక్తి ఉందని స్పష్టంగా చూపిస్తాయి. యేసు తిరిగి బ్రతికించిన వాళ్లలో ఒకరు చనిపోయిన నాలుగు రోజులకు పునరుత్థానం చేయబడ్డారు.—మార్కు 5:35-42; లూకా 7:11-16; యోహాను 11:3-44.

^ పేరా 5 చివరి రోజుల గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంలో 32వ పాఠం చూడండి. ఈ పుస్తకాన్ని www.pr418.com/te వెబ్‌సైట్‌ నుండి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.