కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నోవహు, దానియేలు, యోబులాగే యెహోవా గురించి మీకు తెలుసా?

నోవహు, దానియేలు, యోబులాగే యెహోవా గురించి మీకు తెలుసా?

“దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు.”సామె. 28:5.

పాటలు: 126, 150

1-3. (ఎ) చివరి రోజుల్లో యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి నేర్చుకుంటాం?

నేడు మనం చివరి రోజుల ముగింపులో జీవిస్తున్నాం. చెడ్డవాళ్లు కలుపు మొక్కల్లా రోజురోజుకీ ఎక్కువౌతున్నారు. (కీర్త. 92:7) కాబట్టి చాలామంది దేవుని ప్రమాణాలను పట్టించుకోకపోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించదు. పౌలు ఇలా చెప్పాడు, “చెడుతనం విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి; ఆలోచించడం మాత్రం పెద్దవాళ్లలా ఆలోచించండి.” (1 కొరిం. 14:20) అదెలా సాధ్యం?

2 దానికి జవాబు ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనం ఇస్తుంది. అక్కడిలా ఉంది, “యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు.” (సామె. 28:5) అంటే యెహోవాను సంతోషపెట్టడానికి అవసరమైన ప్రతీదాన్ని వాళ్లు అర్థంచేసుకుంటారు. అంతేకాదు సామెతలు 2:7, 9 వచనాలు చెప్తున్నట్లు, యెహోవా నీతిమంతులకు తెలివిని దయచేస్తాడు. ఫలితంగా, వాళ్లు “నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును” తెలుసుకోగలుగుతారు.

3 నోవహు, దానియేలు, యోబులకు దేవుడు అలాంటి తెలివిని ఇచ్చాడు. (యెహె. 14:14) నేడున్న దేవుని ప్రజలకు కూడా అలాంటి తెలివి ఉంది. మరి మీ విషయమేమిటి? మీకు దేవుడిచ్చిన తెలివి ఉందా? యెహోవాను సంతోషపెట్టడానికి అవసరమైన ప్రతీదాన్ని అర్థంచేసుకోవాలంటే, మీకు ఆయన గురించి బాగా తెలిసుండాలి. కాబట్టి ఈ ఆర్టికల్‌లో మూడు ప్రశ్నల్ని పరిశీలిస్తాం: (1) నోవహు, దానియేలు, యోబు దేవుని గురించి ఎలా తెలుసుకోగలిగారు? (2) దేవుని గురించి తెలుసుకోవడం వల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనం పొందారు? (3) వాళ్లలాంటి విశ్వాసాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?

చెడ్డ లోకంలో దేవునితో నడిచిన నోవహు

4. నోవహు యెహోవా గురించి ఎలా తెలుసుకోగలిగాడు? దానివల్ల ఎలాంటి ఫలితం పొందాడు?

4 నోవహు యెహోవా గురించి ఎలా తెలుసుకోగలిగాడు? ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టినప్పటి నుండి ప్రజలు యెహోవా గురించి మూడు విధానాల్లో తెలుసుకున్నారు: సృష్టి నుండి, నమ్మకమైన సేవకుల నుండి, దేవునికి విధేయత చూపించడంవల్ల పొందిన ఆశీర్వాదాల నుండి. (యెష. 48:18) నోవహు సృష్టిని బాగా గమనించడం ద్వారా దేవుడు ఉన్నాడనేందుకు రుజువులను, దేవుని లక్షణాలను తెలుసుకోగలిగాడు. ఫలితంగా యెహోవా శక్తిమంతుడని, ఆయన మాత్రమే నిజమైన దేవుడని అర్థంచేసుకున్నాడు. (రోమా. 1:20) అందుకే నోవహు, దేవుడు ఉన్నాడని కేవలం నమ్మడమే కాదుగానీ ఆయనపై బలమైన విశ్వాసాన్ని పెంచుకున్నాడు.

5. మనుషుల విషయంలో దేవుని సంకల్పం గురించి నోవహు ఎలా తెలుసుకున్నాడు?

5 “సందేశం విన్న తర్వాతే విశ్వాసం కలుగుతుంది” అని బైబిలు చెప్తుంది. అంటే ఇతరులు చెప్పేది వినడంవల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. (రోమా. 10:17) బహుశా నోవహు, తన బంధువుల ద్వారా యెహోవా గురించి వినివుంటాడు. ఆ బంధువుల్లో, దేవుని మీద విశ్వాసం ఉంచిన నోవహు తండ్రి లెమెకు ఒకడు. లెమెకు ఆదాము చనిపోకముందు పుట్టాడు. (ప్రారంభ చిత్రం చూడండి.) అంతేకాదు ఆ బంధువుల్లో నోవహు తాత మెతూషెల, ముత్తాత యెరెదు ఉన్నారు. నోవహు పుట్టిన 366 సంవత్సరాలకు యెరెదు చనిపోయాడు. * (లూకా 3:36, 37) మనుషుల్ని యెహోవా సృష్టించాడని, వాళ్లు పిల్లలతో భూమిని నింపి, తనను ఆరాధించాలనేదే దేవుని సంకల్పమని బహుశా వీళ్ల కుటుంబాల ద్వారానే నోవహుకు తెలిసివుంటుంది. అంతేకాదు, ఆదాముహవ్వలు యెహోవాకు అవిధేయత చూపించారని నోవహు తెలుసుకొని ఉంటాడు. వాళ్లు తీసుకున్న నిర్ణయంవల్ల వచ్చిన చెడు ఫలితాలను ఆయన కళ్లారా చూశాడు. (ఆది. 1:28; 3:16-19, 24) నేర్చుకున్న విషయాల్ని నోవహు ఎంతో ప్రేమించాడు. దానివల్ల యెహోవాను సేవించాలనే ప్రోత్సాహాన్ని పొందాడు.—ఆది. 6:9.

6, 7. నిరీక్షణ వల్ల నోవహు విశ్వాసం ఎలా బలపడింది?

6 నిరీక్షణ విశ్వాసాన్ని బలపరుస్తుంది. నోవహు పేరుకు, “నెమ్మది” లేదా ఊరట అని అర్థం. అది నిరీక్షణకు సంబంధించినదని తెలుసుకున్నప్పుడు నోవహు విశ్వాసం ఎంత బలపడివుంటుందో ఊహించండి. (ఆది. 5:29, అధస్సూచి) లెమెకు తన కొడుకైన నోవహు గురించి దేవుని ప్రేరణతో ఇలా చెప్పాడు, “భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును.” కాబట్టి పరిస్థితుల్ని యెహోవా చక్కదిద్దుతాడనే నిరీక్షణతో నోవహు జీవించాడు. హేబెలు, హనోకులాగే నోవహు కూడా, సర్పం తలను చితగ్గొట్టే “సంతానము” వస్తాడని నమ్మాడు.—ఆది. 3:15.

7 నిజానికి ఆదికాండము 3:15⁠లోని వాగ్దానం నోవహుకు పూర్తిగా అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రవచనం భవిష్యత్తు గురించిన నిరీక్షణను ఇస్తుందని మాత్రం అర్థంచేసుకున్నాడు. హనోకు కూడా అలాంటి ఒక నిరీక్షణా సందేశాన్నే, అంటే యెహోవా చెడ్డవాళ్లను నాశనం చేస్తాడని ఆయన ప్రకటించాడు. (యూదా 14, 15) ఆ సందేశం నోవహు విశ్వాసాన్ని, నిరీక్షణను ఖచ్చితంగా బలపర్చివుంటుంది. హనోకు ప్రకటించిన సందేశం హార్‌మెగిద్దోను సమయంలో పూర్తిగా నెరవేరుతుంది.

8. దేవున్ని బాగా తెలుసుకోవడం వల్ల నోవహు ఎలా కాపాడబడ్డాడు?

8 దేవుని గురించిన జ్ఞానం నోవహుకు ఎలా సహాయం చేసింది? నోవహు యెహోవా గురించి తెలుసుకున్నాడు కాబట్టి విశ్వాసాన్ని, దేవుడు ఇచ్చిన తెలివిని సంపాదించుకున్నాడు. యెహోవాను బాధపెట్టే ఏ పనీ చేయకుండా ఆ తెలివి ఆయన్ను కాపాడింది. ఎలా? నోవహు దేవుని స్నేహితునిగా ఉండాలనుకున్నాడు కాబట్టి యెహోవాను నమ్మనివాళ్లతో, ఆయన్ను పట్టించుకోనివాళ్లతో స్నేహం చేయలేదు. అంతేకాదు భూమ్మీదకు వచ్చిన చెడ్డదూతల చేతుల్లో మిగతావాళ్లలా మోసపోలేదు. కానీ ప్రజలు ఆ చెడ్డదూతల శక్తికి ముగ్ధులై వాళ్లను ఆరాధించడానికి కూడా ప్రయత్నించివుంటారు. (ఆది. 6:1-4, 9) మనుషులు పిల్లల్ని కని భూమిని నింపాలనే యెహోవా కోరిక గురించి నోవహుకు తెలుసు. (ఆది. 1:27, 28) అందుకే, చెడ్డదూతలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నప్పుడు, అది తప్పని నోవహుకు అర్థమైంది. వాళ్లకు పుట్టిన పిల్లలు మిగతా పిల్లలకన్నా చాలా పొడుగ్గా, బలంగా తయారైనప్పుడు నోవహుకు ఆ విషయం మరింత స్పష్టంగా అర్థమైంది. కొంతకాలానికి, భూమ్మీదున్న చెడ్డ ప్రజలందర్నీ జలప్రళయం ద్వారా నాశనం చేయబోతున్నానని యెహోవా నోవహుకు చెప్పాడు. యెహోవా చెప్పిన ఆ మాట మీద నోవహుకు విశ్వాసం ఉంది కాబట్టే ఆయన ఓడను కట్టాడు. తననూ తన కుటుంబాన్నీ రక్షించుకున్నాడు.—హెబ్రీ. 11:7.

9, 10. నోవహులాంటి విశ్వాసాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?

9 నోవహు లాంటి విశ్వాసాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? దానికోసం మనం బైబిల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, నేర్చుకున్న వాటిని ప్రేమించాలి, వాటి సహాయంతో జీవితంలో మార్పులు చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోవాలి. (1 పేతు. 1:13-15) అప్పుడు మన విశ్వాసం, దేవుడిచ్చిన తెలివి మనల్ని సాతాను కుతంత్రాల నుండి, లోక ప్రభావాల నుండి కాపాడతాయి. (2 కొరిం. 2:11) లోకంలోని చాలామంది హింసను, అనైతికతను ప్రేమిస్తారు, తమ తప్పుడు కోరికల ప్రకారం జీవిస్తారు. (1 యోహా. 2:15, 16) ఈ చెడ్డ లోకం అతిత్వరలో నాశనమౌతుందనే విషయాన్ని వాళ్లు పట్టించుకోరు. బలమైన విశ్వాసం లేకపోతే మనం కూడా వాళ్లలాగే ఆలోచించే ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు మన కాలాన్ని నోవహు కాలంతో పోల్చినప్పుడు, హింస లేదా అనైతికత గురించి ఆయన చెప్పలేదు. బదులుగా, యెహోవా సేవ నుండి పక్కదారి పట్టే ప్రమాదం గురించి చెప్పాడు.—మత్తయి 24:36-39 చదవండి.

10 మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నానని నా జీవన విధానం చూపిస్తుందా? యెహోవా నీతి ప్రమాణాలను పాటిస్తూ, వాటిని ఇతరులకు ప్రకటించేలా నా విశ్వాసం నన్ను ప్రేరేపిస్తుందా?’ నోవహులాగే మీరు కూడా సత్యదేవునితో నడుస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు సహాయం చేస్తాయి.

దేవుడిచ్చిన తెలివిని చూపించిన దానియేలు

11. (ఎ) దానియేలు తల్లిదండ్రుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) దానియేలుకు ఉన్న ఏ లక్షణాన్ని మీరు పెంపొందించుకోవాలని అనుకుంటున్నారు?

11 దానియేలు యెహోవా గురించి ఎలా తెలుసుకోగలిగాడు? యెహోవాను, దేవుని వాక్యాన్ని ప్రేమించడం ఆయన తల్లిదండ్రులే నేర్పించివుంటారు. ఆయన జీవితాంతం యెహోవాను ప్రేమించాడు, వృద్ధాప్యంలో కూడా లేఖనాల్ని జాగ్రత్తగా చదివాడు. (దాని. 9:1, 2) దానియేలుకు యెహోవా గురించి బాగా తెలుసు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఏమేమి చేశాడో కూడా ఆయనకు తెలుసు. దానియేలు 9:3-19 వచనాల్లో ఆయన వినయంగా, హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలో దానిగురించి మనం చదవొచ్చు. ఆ ప్రార్థనను చదివి, దానిగురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తర్వాత మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘ఈ ప్రార్థన దానియేలు గురించి నాకేమి నేర్పిస్తుంది?’

12-14. (ఎ) దానియేలు దేవుడిచ్చిన తెలివిని ఎలా చూపించాడు? (బి) ధైర్యాన్ని, విశ్వసనీయతను చూపించినందుకు దానియేలును యెహోవా ఎలా ఆశీర్వదించాడు?

12 దేవుని గురించిన జ్ఞానం దానియేలుకు ఎలా సహాయం చేసింది? అన్య దేశమైన బబులోనులో యెహోవాను ఆరాధించడం ఒక నమ్మకమైన యూదునికి అంత సులభం కాదు. ఉదాహరణకు, యెహోవా యూదులకు ఇలా చెప్పాడు, ‘నేను మిమ్మల్ని బందీలుగా పంపించిన నగరం శాంతిని కోరుకోండి.’ (యిర్మీ. 29:7, NW) అదే సమయంలో, పూర్ణహృదయంతో తనను మాత్రమే ఆరాధించాలని కూడా యెహోవా ఆజ్ఞాపించాడు. (నిర్గ. 34:14) మరి దానియేలు ఈ రెండు ఆజ్ఞలకు ఎలా లోబడగలిగాడు? మానవ రాజుల కన్నా ఎక్కువగా యెహోవాకే లోబడాలనే విషయాన్ని అర్థంచేసుకోవడానికి దేవుడిచ్చిన తెలివి ఆయనకు సహాయం చేసింది. వందల సంవత్సరాల తర్వాత యేసు అదే సూత్రాన్ని నేర్పించాడు.—లూకా 20:25.

13 ముప్పై రోజులపాటు రాజుకు తప్ప మరే వ్యక్తికి గానీ, దేవునికిగానీ ప్రార్థన చేయకూడదనే ఆజ్ఞ జారీ అయినప్పుడు దానియేలు ఏమి చేశాడో ఆలోచించండి. (దానియేలు 6:7-10 చదవండి.) ‘30 రోజులేగా’ ఫర్వాలేదులే అని దానియేలు అనుకోలేదు. బదులుగా, మానవ నియమాల కన్నా దేవుని ఆరాధననే ప్రాముఖ్యంగా ఎంచాడు. దానియేలు కావాలనుకుంటే, ఎవ్వరికి కనబడకుండా ప్రార్థించవచ్చు. కానీ ఆయన ప్రతీరోజు ప్రార్థన చేయడం చాలామంది చూసేవాళ్లని దానియేలుకు తెలుసు. అందుకే అందరికీ కనిపించేలా ప్రార్థించడం ప్రమాదకరమని తెలిసినా ఆయన ఎప్పటిలాగే ప్రార్థించాడు. ఎందుకంటే, తాను దేవున్ని సేవించడం ఆపేశాడని ప్రజలు అనుకోవడం దానియేలుకు ఇష్టంలేదు.

14 ధైర్యాన్ని, విశ్వసనీయతను చూపించినందుకు యెహోవా ఆయన్ని ఆశీర్వదించాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతరీతిలో కాపాడాడు. ఫలితంగా, మాదీయ పారసీక సామ్రాజ్యమంతటా ఉన్న ప్రజలు యెహోవా గురించి తెలుసుకోగలిగారు.—దాని. 6:25-27.

15. దానియేలు లాంటి విశ్వాసాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?

15 దానియేలు లాంటి విశ్వాసాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? బలమైన విశ్వాసం పెంపొందించుకోవాలంటే, కేవలం బైబిలు చదివితే సరిపోదు. చదివినదాన్ని అర్థంచేసుకోవాలి. (మత్త. 13:23) ఫలానా విషయం గురించి యెహోవా ఎలా ఆలోచిస్తాడో, భావిస్తాడో తెలుసుకోవాలి. కాబట్టి మనం చదివిన వాటిని లోతుగా ఆలోచించాలి. అంతేకాదు క్రమంగా ప్రార్థించడం, ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం. మనం అడిగితే యెహోవా తెలివిని, బలాన్ని ఉదారంగా ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యాకో. 1:5.

అన్నిరకాల పరిస్థితుల్లో దేవుని సూత్రాలు పాటించిన యోబు

16, 17. యోబు యెహోవా గురించి ఎలా తెలుసుకోగలిగాడు?

16 యోబు యెహోవా గురించి ఎలా తెలుసుకోగలిగాడు? యోబు ఇశ్రాయేలీయుడు కాదు. కానీ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఆయనకు దూరపు బంధువులౌతారు. యెహోవా వాళ్లకు తన గురించి, మనుషుల విషయంలో తన సంకల్పం గురించి నేర్పించాడు. ఏదోవిధంగా, ఆ విలువైన సత్యాల్లో చాలా వాటిని యోబు తెలుసుకోగలిగాడు. (యోబు 23:12) అందుకే ఆయన యెహోవాతో ఇలా అన్నాడు, “నిన్నుగూర్చిన వార్త నేను వింటిని.” (యోబు 42:5) నేర్చుకున్న సత్యాన్ని యోబు ఇతరులకు చెప్పాడని యెహోవాయే స్వయంగా అన్నాడు.—యోబు 42:7, 8

సృష్టిని గమనించడం ద్వారా యెహోవా లక్షణాల గురించి ఎక్కువ తెలుసుకున్నప్పుడు మన విశ్వాసం మరింత బలపడుతుంది (17వ పేరా చూడండి)

17 యోబు సృష్టిని గమనించడం ద్వారా కూడా యెహోవా లక్షణాల గురించి తెలుసుకోగలిగాడు. (యోబు 12:7-9, 13) దేవునితో పోలిస్తే మనుషులు ఎంత అల్పులో యోబుకు నేర్పించడానికి ఎలీహు అలాగే యెహోవా సృష్టిని ఉపయోగించారు. (యోబు 37:14; 38:1-4) యెహోవా మాటలు యోబును ఆలోచింపజేశాయి, అందుకే ఆయన వినయంగా ఇలా అన్నాడు, “నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. . . . ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.”—యోబు 42:2, 6.

18, 19. యెహోవా గురించి తనకు నిజంగా తెలుసని యోబు ఎలా చూపించాడు?

18 దేవుని గురించిన జ్ఞానం యోబుకు ఎలా సహాయం చేసింది? యోబు దేవుని సూత్రాల్ని బాగా అర్థంచేసుకున్నాడు. ఆయనకు యెహోవా గురించి నిజంగా తెలుసు కాబట్టే సరైన విధంగా ప్రవర్తించగలిగాడు. ఉదాహరణకు సాటిమనిషిని ప్రేమించని వ్యక్తి, దేవున్ని ప్రేమిస్తున్నానని చెప్పడం సరైనది కాదని యోబుకు తెలుసు. (యోబు 6:14) తాను ఇతరుల కన్నా గొప్పవాడినని యోబు ఎప్పుడూ అనుకోలేదు. బదులుగా, పేద-ధనిక అనే తేడా లేకుండా అందర్నీ తన సొంత కుటుంబసభ్యుల్లా చూశాడు. యోబు ఇలా అన్నాడు, “గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింపలేదా?” (యోబు 31:13-22) యోబుకు డబ్బు, అధికారం ఉన్నప్పుడు కూడా గర్వాన్ని చూపించలేదు, ఇతరుల కన్నా తానే గొప్పవాడినని అనుకోలేదు. నేడున్న చాలామంది ధనవంతులు, అధికారులు చూపించే వైఖరికి యోబు చూపించిన వైఖరికి ఎంత తేడా కదా!

19 యోబు యెహోవా కన్నా వేరే దేన్నీ, ఆఖరికి తన డబ్బును కూడా ప్రాముఖ్యంగా ఎంచలేదు. ఒకవేళ యెహోవాకు మొదటి స్థానం ఇవ్వకపోతే, ఆయన్ను తిరస్కరించినట్టే అవుతుందని యోబు అనుకున్నాడు. (యోబు 31:24-28 చదవండి.) అంతేకాదు పెళ్లి అనేది భార్యాభర్తలు చేసుకునే ఒక పవిత్రమైన ప్రమాణమని యోబు అర్థంచేసుకున్నాడు. పైగా, పర స్త్రీని తప్పుడు దృష్టితో చూడనని కూడా యోబు తన కళ్లతో ఒప్పందం చేసుకున్నాడు. (యోబు 31:1) అది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే, యోబు కాలంలో పురుషులు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి యెహోవా అనుమతించాడు. కాబట్టి కావాలనుకుంటే యోబు కూడా మరో స్త్రీని పెళ్లిచేసుకోవచ్చు. కానీ యెహోవా మొట్టమొదటి వివాహాన్ని చేసినప్పుడు ఒక పురుషునికి, ఒక స్త్రీనే ఇచ్చాడని యోబుకు తెలిసుంటుంది, అందుకే ఆయన ఒక్క స్త్రీనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకొని ఉంటాడు. * (ఆది. 2:18, 24) నిజానికి సెక్స్‌, పెళ్లి గురించి దాదాపు 1,600 సంవత్సరాల తర్వాత యేసు కూడా అదే సూత్రాన్ని చెప్పాడు.—మత్త. 5:28; 19:4, 5.

20. యెహోవాను, ఆయన సూత్రాల్ని బాగా తెలుసుకోవడంవల్ల మంచి స్నేహితుల్ని, వినోదాన్ని ఎలా ఎంపిక చేసుకోగలం?

20 యోబు లాంటి విశ్వాసాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? మళ్లీ అదే సూత్రం. యెహోవాను బాగా తెలుసుకుని, దేవుడిచ్చిన తెలివి ప్రకారం నడుచుకోవాలి. ఉదాహరణకు, హింసను ప్రేమించేవాళ్లను యెహోవా ద్వేషిస్తాడని, “వేషధారులతో” మనం సహవాసం చేయకూడదని బైబిలు చెప్తుంది. (కీర్తన 11:5; 26:4 చదవండి.) మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ రెండు లేఖనాలు యెహోవా ఆలోచనా విధానం గురించి ఏం చెప్తున్నాయి? దాన్నిబట్టి నా జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఇంటర్నెట్‌ వాడడం, స్నేహితుల్ని, వినోదాన్ని ఎంపిక చేసుకోవడం విషయంలో దాన్నెలా పాటించాలి?’ మీ జవాబుల్ని బట్టి యెహోవా మీకెంత బాగా తెలుసో అర్థమౌతుంది. ఈ చెడ్డ లోకం మనపై ప్రభావం చూపించాలని కోరుకోం కాబట్టి, మన వివేచనా సామర్థ్యాలకు శిక్షణ ఇవ్వాలి. అంటే తప్పొప్పుల మధ్య తేడాను, ఏది తెలివైన పనో ఏది తెలివితక్కువ పనో గుర్తించడం నేర్చుకోవాలి.—హెబ్రీ. 5:14; ఎఫె. 5:15.

21. యెహోవాను సంతోషపెట్టడానికి అవసరమైన ప్రతీదాన్ని అర్థంచేసుకునేలా మనకేది సహాయం చేస్తుంది?

21 యెహోవా గురించి బాగా తెలుసుకోవడానికి నోవహు, దానియేలు, యోబు చేయాల్సినదంతా చేశారు. అందుకే, తనను సంతోషపెట్టడానికి అవసరమైన ప్రతీదాన్ని వాళ్లు అర్థంచేసుకునేలా యెహోవా సహాయం చేశాడు. యెహోవా నీతి సూత్రాల్ని పాటిస్తే, జీవితం సంతోషంగా ఉంటుందని వాళ్ల అనుభవాలు నిరూపిస్తున్నాయి. (కీర్త. 1:1-3) కాబట్టి ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘యెహోవా గురించి నోవహు, దానియేలు, యోబు తెలుసుకున్నంత బాగా నేనూ తెలుసుకున్నానా?’ నిజానికి, నేడు మనం యెహోవా గురించి వాళ్లకన్నా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు యెహోవా తన గురించి మనకు ఎంతో సమాచారాన్ని అందిస్తున్నాడు. (సామె. 4:18) కాబట్టి బైబిల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించండి, పవిత్రశక్తి కోసం ప్రార్థించండి. అప్పుడు ఈ చెడ్డ లోక ప్రభావం మీమీద పడదు. బదులుగా, మీరు దేవుడిచ్చిన తెలివిని చూపిస్తూ, మీ పరలోక తండ్రికి మరింత దగ్గరౌతారు.—సామె. 2:4-7.

^ పేరా 5 నోవహు ముత్తాత హనోకు కూడా ‘దేవునితో నడిచాడు.’ కానీ నోవహు పుట్టడానికి 69 సంవత్సరాల ముందు ఆయన చనిపోయాడు.—ఆది. 5:23, 24.

^ పేరా 19 నోవహు కూడా అదే చేశాడు. ఆదాముహవ్వలు దేవునికి అవిధేయత చూపించిన కొంతకాలానికే పురుషులు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టినప్పటికీ నోవహు మాత్రం ఒక్క స్త్రీనే పెళ్లిచేసుకున్నాడు.—ఆది. 4:19.