కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వండి

ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వండి

“పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకోండి.”గల. 5:16.

పాటలు: 22, 75

1, 2. ఒక సహోదరుడు ఏమి గ్రహించాడు? తన పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి ఏమి చేశాడు?

రాబర్ట్‌ టీనేజీలో బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ ఆయన జీవితంలో సత్యానికి అంత ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వలేదు. ఆయనిలా చెప్తున్నాడు, “నేను ఎలాంటి తప్పు చేయలేదుగానీ, క్రైస్తవ కార్యకలాపాల్ని ఏదో యాంత్రికంగా చేస్తున్నట్లు అనిపించింది. అన్నీ కూటాలకు హాజరౌతూ, సంవత్సరంలో కొన్నిసార్లు సహాయ పయినీరు సేవ చేస్తూ పైకి ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉన్నట్లు కనిపించాను. నిజానికి నా జీవితంలో ఏదో వెలితి ఉంది.”

2 ఆ వెలితి ఏమిటో పెళ్లయ్యాక రాబర్ట్‌ గ్రహించాడు. ఆయనా, ఆయన భార్య కాలక్షేపం కోసం సరదాగా బైబిల్‌ క్విజ్‌ ఆడుకునేవాళ్లు. ఆయన భార్య ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం వల్ల ప్రశ్నలకు చాలా తేలిగ్గా జవాబులు చెప్పేది. కానీ రాబర్ట్‌ మాత్రం సరైన బైబిలు జ్ఞానంలేక జవాబులు చెప్పడానికి ఇబ్బందిపడేవాడు. ఆయనిలా అంటున్నాడు, “నాకు బైబిలు గురించి ఏమీ తెలీదు అనిపించింది. నాలో నేను ఇలా అనుకున్నాను, ‘నా భార్యకు శిరస్సుగా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేయాలి.’” రాబర్ట్‌ అనుకున్నట్లుగానే చేశాడు. ఆయనింకా ఇలా చెప్తున్నాడు, “నేను బైబిల్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టి, అలా చేస్తూనే, చేస్తూనే ఉన్నాను. మెల్లమెల్లగా బైబిలు గురించిన జ్ఞానం సంపాదించుకోగలిగాను. నా అవగాహన పెరిగింది, అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాతో దగ్గరి సంబంధాన్ని సంపాదించుకున్నాను.”

3. (ఎ) రాబర్ట్‌ అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) ఏ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 రాబర్ట్‌ అనుభవం మనకు ప్రాముఖ్యమైన పాఠాల్ని నేర్పిస్తుంది. కాస్త బైబిలు జ్ఞానం సంపాదించి మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి క్రమంగా వెళ్లినంత మాత్రాన మనం ఆధ్యాత్మిక వ్యక్తులమని కాదు. అంతేకాదు, మనం ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడానికి కృషిచేశాక కూడా మనలో మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు కొన్ని కనిపించవచ్చు. (ఫిలి. 3:16) ఈ ఆర్టికల్‌లో మూడు ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. (1) మనం ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉన్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు? (2) ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వాలంటే మనమేమి చేయాలి? (3) ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం వల్ల మన రోజూవారి జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మీ ఆధ్యాత్మికతను పరిశీలించుకోండి

4. ఎఫెసీయులు 4:23, 24 వచనాల్లో ఉన్న సలహా ఎవరికి వర్తిస్తుంది?

4 దేవున్ని సేవించడం మొదలుపెట్టినప్పుడు మన జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఇంకా మార్పులు చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే బైబిలు ఇలా చెప్తుంది, “మీరు కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. (ఎఫె. 4:23, 24) అవును, మనందరం అపరిపూర్ణులం కాబట్టి మార్పులు చేసుకుంటూనే ఉండాలి. ఎంతోకాలంగా యెహోవా సేవ చేస్తున్నవాళ్లు కూడా ఆయనతో ఉన్న సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి కృషిచేస్తూనే ఉండాలి.—ఫిలి. 3:12, 13.

5. ఆధ్యాత్మికంగా ఎంత ప్రగతి సాధించామో తెలుసుకోవడానికి ఏ ప్రశ్నలు సహాయం చేస్తాయి?

5 యౌవనులమైనా, వృద్ధులమైనా మనందరం నిజాయితీగా పరిశీలించుకోవాలి. మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఆధ్యాత్మికంగా బలంగా తయారౌతున్నట్లు నాలో వస్తున్న మార్పులు చూపిస్తున్నాయా? నేను క్రీస్తు మనసును అలవర్చుకుంటున్నానా? నా ఆలోచనా విధానం, మీటింగ్స్‌లో నా ప్రవర్తన నేను ఎలాంటి వ్యక్తినని చూపిస్తున్నాయి? నా సంభాషణ నేను ఎలాంటి వ్యక్తిగా తయారవ్వాలని కోరుకుంటున్నట్లు చూపిస్తుంది? నా అధ్యయన అలవాట్లు, బట్టలు, కనబడేతీరు, సలహా ఇచ్చినప్పుడు స్పందించే తీరు నేను ఎలాంటి వ్యక్తినని చూపిస్తున్నాయి? ఏదైనా తప్పు చేయాలనే శోధన ఎదురైనప్పుడు నేనెలా స్పందిస్తున్నాను? నేనొక పరిణతిగల క్రైస్తవునిగా తయారయ్యానా?’ (ఎఫె. 4:13) ఆధ్యాత్మికంగా మనమెంత ప్రగతి సాధించామో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు సహాయం చేస్తాయి.

6. ఆధ్యాత్మికతను పరిశీలించుకునే విషయంలో మనకు ఎవరి సహాయం అవసరం కావచ్చు?

6 కొన్నిసార్లు, ఆధ్యాత్మికతను పరిశీలించుకునే విషయంలో మనకు ఇతరుల సహాయం అవసరం కావచ్చు. సాధారణంగా, ఆధ్యాత్మిక వ్యక్తి దేవుని ఆలోచనల్ని అర్థంచేసుకుంటాడు. సొంత కోరికల ప్రకారం జీవించడాన్ని యెహోవా ఇష్టపడడని అతనికి తెలుసు. కానీ సొంత కోరికల ప్రకారం జీవించే వ్యక్తి, తన జీవన విధానం దేవున్ని సంతోషపెట్టడం లేదనే విషయాన్ని అర్థంచేసుకోడని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (1 కొరిం. 2:14-16; 3:1-3) కాబట్టి సహోదరులు ఎవరైనా శారీరక కోరికల ప్రకారం ప్రవర్తించడం మొదలుపెడితే, అలాంటివాళ్లను గుర్తించి వాళ్లకు సహాయం చేయడానికి క్రీస్తు మనసు కలిగివున్న సంఘపెద్దలు ప్రయత్నిస్తారు. సంఘపెద్దలు మనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే, వాళ్లిచ్చే సలహాను పాటించి అవసరమైన మార్పులు చేసుకుంటామా? ఒకవేళ చేసుకుంటే, మనం ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వాలని నిజంగా కోరుకుంటున్నట్లు చూపిస్తాం.—ప్రసం. 7:5, 9.

ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వండి

7. ఆధ్యాత్మిక వ్యక్తిగా తయారవ్వాలంటే బైబిలు జ్ఞానం ఉంటే సరిపోదని ఎలా చెప్పవచ్చు?

7 ఆధ్యాత్మిక వ్యక్తిగా తయారవ్వాలంటే బైబిలు జ్ఞానం ఉంటే సరిపోదు. రాజైన సొలొమోను విషయమే తీసుకోండి. ఆయనకు యెహోవా గురించి ఎన్నో విషయాలు తెలుసు, సొలొమోను చెప్పిన మాటల్లో కొన్ని బైబిల్లో కూడా నమోదు చేయబడ్డాయి. కానీ కొంతకాలానికి, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా యెహోవాకు నమ్మకంగా ఉండడంలో ఆయన విఫలమయ్యాడు. (1 రాజు. 4:29, 30; 11:4-6) కాబట్టి మనం బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకోవడంతోపాటు, ఆధ్యాత్మికంగా బలంగా తయారౌతూ ఉండాలి. (కొలొ. 2:6, 7) ఎలా?

8, 9. (ఎ) ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి మనకేమి సహాయం చేస్తాయి? (బి) అధ్యయనం చేసి, ధ్యానించేటప్పుడు మన లక్ష్యం ఏమై ఉండాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

8 ‘పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోమని’ పౌలు మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (హెబ్రీ. 6:1) ఆ సలహాను నేడు మనం పాటించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఒక ప్రాముఖ్యమైన చర్య ఏమిటంటే, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి అనే పుస్తకాన్ని అధ్యయనం చేయడం. బైబిలు సూత్రాల్ని మీ జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో అర్థంచేసుకోవడానికి ఆ పుస్తకం సహాయం చేస్తుంది. మీరు ఇప్పటికే దాన్ని అధ్యయనం చేసుంటే, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలంగా తయారుచేసే ప్రచురణలు మరికొన్ని ఉన్నాయి. (కొలొ. 1:23) అయితే మనం నేర్చుకుంటున్న విషయాల్ని ధ్యానించాలి. అంతేకాదు వాటిని జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగాలి.

9 మనం అధ్యయనం చేసి ధ్యానించేటప్పుడు యెహోవాను సంతోషపెట్టాలనే, ఆయనకు లోబడాలనే ప్రగాఢమైన కోరికను వృద్ధిచేసుకోవడం మన లక్ష్యమై ఉండాలి. (కీర్త. 40:8; 119:97) అంతేకాదు మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా చేసే వేటికైనా దూరంగా ఉండడానికి కృషిచేయాలి.—తీతు 2:11, 12.

10. ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి యౌవనస్థులు ఏమి చేయవచ్చు?

10 యౌవనస్థులారా మీకు ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయా? బెతెల్‌లో సేవచేస్తున్న ఒక సహోదరుడు, ప్రాంతీయ సమావేశాలకు హాజరైనప్పుడు, బాప్తిస్మం తీసుకోబోతున్న యౌవనస్థుల్ని కలిసి వాళ్ల ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమిటో అడుగుతుంటాడు. వాళ్లలో చాలామంది భవిష్యత్తులో యెహోవా సేవను ఏవిధంగా చేయాలో ఆలోచించి పెట్టుకున్నారు. కొంతమంది పూర్తికాల సేవ చేయాలని లేదా అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం సహోదరుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. దానర్థం, ఆధ్యాత్మిక లక్ష్యాలు తమకు అవసరం లేదని వాళ్లు భావిస్తున్నట్లా? మీరు యౌవనస్థులైతే ఇలా ప్రశ్నించుకోండి: ‘మా అమ్మానాన్నలు చెప్తున్నారనే నేను మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్తున్నానా? లేక దేవునితో నాకు వ్యక్తిగత సంబంధం ఉందా?’ అయితే ఆధ్యాత్మిక లక్ష్యాలు కేవలం యౌవనస్థులకే కాదు, పెద్దవాళ్లకు కూడా ఉండాలి. ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి అవి మనకు సహాయం చేస్తాయి.—ప్రసం. 12:1, 13.

11. (ఎ) ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వాలంటే ఏమి చేయాలి? (బి) ఆ విషయంలో మనం ఎవరిలా ఉండాలి?

11 మనం ఏ విషయాల్లో మార్పులు చేసుకోవాలో గ్రహించాక వాటిని మార్చుకోవడం మొదలుపెట్టాలి. అది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే దానిమీదే మన జీవం ఆధారపడి ఉంది. (రోమా. 8:6-8) యెహోవా మన నుండి పరిపూర్ణత ఆశించడంలేదు. మనం మార్పులు చేసుకునేలా సహాయం చేయడానికి ఆయన తన పవిత్రశక్తిని ఇస్తున్నాడు. అయినప్పటికీ మన వైపు నుండి మనం కష్టపడి పనిచేయాలి. పరిపాలక సభ సభ్యుడిగా సేవచేసిన సహోదరుడు జాన్‌ బార్‌, ఒక సందర్భంలో లూకా 13:24 గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి చేయాల్సిన కృషిని చేయకపోవడం వల్లే చాలామంది ఇరుకు ద్వారంలో ప్రవేశించలేకపోతున్నారు.” కాబట్టి మనం, దీవెన కోసం దూతతో పెనుగులాడిన యాకోబులా ఉండాలి. (ఆది. 32:26-28) బైబిలు అధ్యయనం నుండి మనం ఆనందాన్ని పొందగలం. కానీ కేవలం సరదా కోసం నవల చదివినట్లు దాన్ని చదవకూడదు. బదులుగా మనకు సహాయపడే విలువైన సత్యాల్ని కనుగొనడానికి కృషిచేయాలి.

12, 13. (ఎ) రోమీయులు 15:5లో ఉన్న సలహాను పాటించడానికి మనకేమి సహాయం చేస్తుంది? (బి) పేతురు ఉదాహరణ, ఆయనిచ్చిన సలహా మనకెలా సహాయం చేస్తాయి? (సి) ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి సహాయం చేసే చర్యలు ఏమిటి? (“ ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి తీసుకోవాల్సిన చర్యలు” అనే బాక్సు చూడండి.)

12 ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి మనం కృషిచేసినప్పుడు, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి పవిత్రశక్తి సహాయం చేస్తుంది. అప్పుడు మెల్లమెల్లగా మనం క్రీస్తులా ఆలోచించడం నేర్చుకోగలుగుతాం. (రోమా. 15:5) అంతేకాదు తప్పుడు కోరికల నుండి బయటపడడానికి, దేవుడు ఇష్టపడే లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి కూడా పవిత్రశక్తి సహాయం చేస్తుంది. (గల. 5:16, 22, 23) ఒకవేళ మనం వస్తుసంపదల మీద లేదా సుఖాల మీద మనసు పెడుతున్నట్లు గ్రహిస్తే తేలిగ్గా తీసుకోకూడదు. సరైన విషయాల మీద మనసుపెట్టడానికి పవిత్రశక్తిని సహాయంగా ఇవ్వమని యెహోవాను అడుగుతూ ఉండాలి. (లూకా 11:13) అపొస్తలుడైన పేతురు విషయమే తీసుకోండి. ఆయన అన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక వ్యక్తిలా ఆలోచించలేదు. (మత్త. 16:22, 23; లూకా 22:34, 54-62; గల. 2:11-14) కానీ ఆయన అలానే ఉండిపోలేదు. యెహోవా సహాయంతో క్రీస్తులా ఆలోచించడం మెల్లమెల్లగా నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోగలం.

13 అయితే మనకు ఉపయోగపడే కొన్ని లక్షణాల్ని పేతురు కొంతకాలం తర్వాత ప్రస్తావించాడు. (2 పేతురు 1:5-8 చదవండి.) ఆత్మనిగ్రహం, సహనం, సోదరప్రేమ, ఇంకా ఇతర మంచి లక్షణాల్ని అలవర్చుకోవడానికి మనం తీవ్రంగా కృషిచేయాలి. ప్రతీరోజు మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నన్ను ఆధ్యాత్మికంగా బలంగా చేసే ఏ లక్షణాన్ని అలవర్చుకోవడానికి ఈరోజు నేను కృషిచేయాలి?’

రోజూవారి జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోండి

14. ఆధ్యాత్మికత మనకెలా సహాయం చేస్తుంది?

14 మనం క్రీస్తులా ఆలోచిస్తే, ఆ ప్రభావం ఉద్యోగస్థలంలో లేదా స్కూల్‌లో మన ప్రవర్తన మీద, మాట్లాడే విధానం మీద, ప్రతీరోజు తీసుకునే నిర్ణయాల మీద పడుతుంది. మనం క్రీస్తును అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామని ఆ నిర్ణయాలు రుజువు చేస్తాయి. ఆధ్యాత్మిక వ్యక్తులముగా, యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయడానికి దేన్నీ అనుమతించం. తప్పు చేయాలనే శోధన ఎదురైనప్పుడు దాన్ని తిప్పికొట్టడానికి ఆధ్యాత్మికత మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనం సమయం తీసుకుని ఇలా ఆలోచిస్తాం: ‘ఈ పరిస్థితిలో ఏ బైబిలు సూత్రాలు నాకు సహాయం చేస్తాయి? నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏమి చేస్తాడు? ఏమి చేస్తే యెహోవా సంతోషిస్తాడు?’ మనం ఈ విధంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు, మనకు ఎదురుకాగల కొన్ని పరిస్థితుల్ని చర్చిద్దాం. ఆ పరిస్థితుల్లో తెలివైన నిర్ణయం తీసుకోవడానికి మనకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయో తెలుసుకుందాం.

15, 16. క్రీస్తులా ఆలోచించడం వల్ల ఈ విషయాల్లో మీరెలా తెలివైన నిర్ణయం తీసుకోగలరు? (ఎ) వివాహజతను ఎంపిక చేసుకోవడం, (బి) స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడం.

15 వివాహజతను ఎంపిక చేసుకోవడం. 2 కొరింథీయులు 6:14, 15 వచనాల్లో ఉన్న బైబిలు సూత్రం ఉపయోగపడుతుంది. (చదవండి.) సొంత కోరికల ప్రకారం జీవించే వ్యక్తికీ, ఆధ్యాత్మిక వ్యక్తికీ చాలా తేడా ఉంటుందని పౌలు స్పష్టంగా చెప్పాడు. వాళ్లు విషయాల్ని చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. వివాహజతను ఎంపిక చేసుకునే విషయంలో ఈ సూత్రం మీకెలా సహాయం చేస్తుంది?

16 స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడం. 1 కొరింథీయులు 15:33 లో ఉన్న బైబిలు సూత్రం ఉపయోగపడుతుంది. (చదవండి.) తన విశ్వాసాన్ని బలహీనపర్చగల వాళ్లతో ఆధ్యాత్మిక వ్యక్తి స్నేహం చేయడు. ఈ సూత్రాన్ని వేర్వేరు సందర్భాల్లో మీరెలా అన్వయించుకోవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈ సూత్రం మీకెలా సహాయం చేస్తుంది? పరిచయంలేని వ్యక్తులతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడవచ్చో లేదో నిర్ణయించుకోవడానికి ఇది మీకెలా సహాయం చేస్తుంది?

ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వడానికి నా నిర్ణయాలు సహాయం చేస్తాయా? (17 పేరా చూడండి)

17-19. ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం ఈ విషయాల్లో మీకెలా ఉపయోగపడుతుంది: (ఎ) పనికిరాని పనులకు దూరంగా ఉండడానికి, (బి) మంచి లక్ష్యాలు కలిగివుండడానికి, (సి) అభిప్రాయభేదాలు పరిష్కరించుకోవడానికి.

17 మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా చేసే పనులు. హెబ్రీయులు 6:1 లో ప్రాముఖ్యమైన హెచ్చరిక ఉంది. (చదవండి.) మనం దూరంగా ఉండాల్సిన ‘పనికిరాని పనులు’ ఏమిటి? ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి మనకు సహాయం చేయని పనులే ‘పనికిరాని పనులు.’ ఈ హెచ్చరిక ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది: ‘ఇది ఉపయోగపడే పనా లేక పనికిరాని పనా? ఈ వ్యాపారంలో నేను భాగస్వామిగా ఉండవచ్చా? లోక పరిస్థితుల్ని మార్చాలనుకునే గుంపులో నేనెందుకు చేరకూడదు?’

ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడానికి నా నిర్ణయాలు సహాయం చేస్తాయా?(18 పేరా చూడండి)

18 ఆధ్యాత్మిక లక్ష్యాలు. యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో లక్ష్యాలకు సంబంధించి మంచి సలహా ఇచ్చాడు. (మత్త. 6:33) ఆధ్యాత్మిక వ్యక్తి తన జీవితంలో రాజ్యానికి మొదటిస్థానం ఇస్తాడు. ఈ సూత్రం మనకు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది: ‘ప్రాథమిక విద్యను పూర్తి చేశాక నేను ఉన్నత విద్య చదవాలా? ఫలానా ఉద్యోగంలో నేను చేరవచ్చా?’

ఇతరులతో శాంతిగా మెలగడానికి నా నిర్ణయాలు సహాయం చేస్తాయా? (19 పేరా చూడండి)

19 అభిప్రాయభేదాలు. రోములోని క్రైస్తవులకు పౌలు ఇచ్చిన సలహా, మనకు ఇతరులతో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. (రోమా. 12:18) మనం క్రీస్తును అనుకరిస్తాం కాబట్టి “మనుషులందరితో శాంతిగా” ఉంటాం. ఇతరులతో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు మనమెలా స్పందిస్తాం? ఇతరుల అభిప్రాయాన్ని ఒప్పుకోవడం మనకు కష్టంగా ఉంటుందా? అందరితో శాంతిగా ఉండే వ్యక్తి అనే పేరు మనకు ఉందా?—యాకో. 3:18.

20. మీరెందుకు ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వాలని అనుకుంటున్నారు?

20 మనం ఆధ్యాత్మిక వ్యక్తులమని నిరూపించే నిర్ణయాలు తీసుకోవడానికి బైబిలు సూత్రాలు మనకెలా సహాయం చేస్తాయో ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. ఆధ్యాత్మిక వ్యక్తులముగా ఉంటే మన జీవితం ఆనందంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఈ ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించబడిన రాబర్ట్‌ ఇలా అంటున్నాడు, “యెహోవాతో నిజమైన సంబంధాన్ని ఏర్పర్చుకున్నాక మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉండగలిగాను. నాకు తృప్తిగా, ఆనందంగా అనిపించింది.” ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వడానికి చేయగలిగినదంతా చేస్తే ఎన్నో ప్రయోజనాల్ని కూడా పొందుతాం. అంతేకాదు ఇప్పుడు సంతోషంగా జీవించగలుగుతాం, భవిష్యత్తులో ‘వాస్తవమైన జీవితాన్ని’ సొంతం చేసుకుంటాం.—1 తిమో. 6:19.