కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

ఐర్లాండ్‌లో మంచివార్తను వ్యాప్తిచేసిన బహిరంగ ప్రసంగాలు

ఐర్లాండ్‌లో మంచివార్తను వ్యాప్తిచేసిన బహిరంగ ప్రసంగాలు

ఓడ బెల్‌ఫాస్ట్‌ లాక్‌ అనే సముద్రపు పాయకు చేరుకుంది. వేకువజాము వెలుగులో పచ్చికతో కప్పివున్న కొండల సుందరదృశ్యం, ఓడ పైభాగంలో ఉన్న ప్రయాణికుల చిన్నగుంపును కనువిందు చేసింది. అది 1910వ సంవత్సరం మే నెల. ఆ ఓడలోని ప్రయాణికుల్లో ఛార్లెస్‌ టి. రస్సెల్‌ కూడా ఉన్నాడు, ఆయన ఐర్లాండ్‌కు రావడం అది ఐదోసారి. సహోదరుడు రస్సెల్‌ కనుచూపుమేరలో నిర్మాణ దశలో ఉన్న రెండు భారీ నౌకలు ఉన్నాయి. అవి, ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని మిగిల్చిన టైటానిక్‌, దానిలాంటి ఆకారంలోనే ఉన్న మరో నౌక ఒలంపిక్‌. * షిప్‌యార్డ్‌ దగ్గరున్న రేవులో దాదాపు 12 మంది బైబిలు విద్యార్థులు రస్సెల్‌ రాక కోసం ఆత్రంగా వేచిచూస్తున్నారు.

సుమారు 20 ఏళ్ల క్రితం, మంచివార్తను వ్యాప్తిచేసే మార్గాల అన్వేషణలో భాగంగా సహోదరుడు రస్సెల్‌ వేరే దేశాలను తరచుగా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన పర్యటించిన మొదటి దేశం ఐర్లాండ్‌, 1891వ సంవత్సరం జూలై నెలలో అక్కడికి వెళ్లాడు. సిటీ ఆఫ్‌ చికాగో ఓడను ఎక్కాక క్వీన్స్‌టౌన్‌ దగ్గరి తీరానికి చేరువౌతుండగా సూర్యాస్తమయం అవుతున్న మనోహరమైన దృశ్యాన్ని ఆయన చూశాడు. చిన్నప్పుడు తమ ఊరు గురించి అమ్మానాన్నలు చెప్పిన విషయాలు ఆయనకు గుర్తొచ్చివుంటాయి. రస్సెల్‌ బృందం పరిశుభ్రమైన పట్టణాల గుండా, అందమైన పల్లెటూళ్ల గుండా వెళ్తున్నప్పుడు, వాళ్లకు ఆ ప్రదేశమంతా “కోతకు సిద్ధంగా ఉన్న” పొలంలా అనిపించింది.

సహోదరుడు రస్సెల్‌ ఐర్లాండ్‌కు మొత్తం ఏడుసార్లు వెళ్లాడు. మొదటిసారి సందర్శించినప్పుడు ప్రజల్లో ఆయన ఎంతో ఆసక్తిని కలిగించాడు. అందుకే తర్వాతి సందర్శనాల్లో ఆయన ప్రసంగాలు వినడానికి వందలమంది, కొన్నిసార్లయితే వేలమంది వచ్చారు. 1903, మే నెలలో ఆయన రెండోసారి ఐర్లాండ్‌ను సందర్శించే నాటికి, బెల్‌ఫాస్ట్‌లో అలాగే డబ్లిన్‌లో జరిగే బహిరంగ కూటాల గురించి స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. అబ్రాహాము విశ్వాసాన్ని, భవిష్యత్తులో మానవజాతి పొందబోయే దీవెనల్ని వివరించే “ప్రమాణంతో కూడిన వాగ్దానం” అనే అంశాన్ని “ప్రేక్షకులు చాలా శ్రద్ధగా విన్నారు” అని రస్సెల్‌ ఒక సందర్భంలో చెప్పాడు.

ఐర్లాండ్‌లో చాలామంది ఆసక్తి చూపించడంతో, ఆయన మూడోసారి యూరప్‌ ఖండాన్ని సందర్శించినప్పుడు ఐర్లాండ్‌కు కూడా వెళ్లాడు. 1908 ఏప్రిల్‌ నెలలో ఒకరోజు ఉదయాన, రస్సెల్‌ బెల్‌ఫాస్ట్‌ రేవులో అడుగుపెట్టగానే ఐదుగురు సహోదరులు ఆయన్ను స్వాగతించారు. “సాతాను సామ్రాజ్యం నాశనమౌతుంది” అనే అంశం మీద ఆరోజు సాయంత్రం ఆయనిచ్చిన ప్రసంగానికి “ఆసక్తివున్న 300 మంది ప్రేక్షకులు” హాజరయ్యారు. ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక ప్రేక్షకుడు, సహోదరుడు నైపుణ్యవంతంగా ఉపయోగించిన లేఖనాల ధాటికి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. డబ్లిన్‌లో జరిగిన ప్రసంగానికి దాదాపు 1,000 కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. అయితే వాళ్లందర్నీ బైబిలు విద్యార్థులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో YMCA క్రైస్తవ సంస్థకు సెక్రటరీగా పనిచేస్తున్న ఓకానర్‌ అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడేమి జరిగింది?

అసలేమి జరిగిందో తెలుసుకోవడానికి మనం ఆ కాలానికి వెళ్దాం. బైబిలు సత్యం పట్ల ఆసక్తివున్న ఒక వ్యక్తి ద ఐరిష్‌ టైమ్స్‌ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన చూసి బహిరంగ ప్రసంగం వినడానికి వచ్చాడు. అప్పటికే జనంతో కిక్కిరిసిపోయిన ఆడిటోరియంలో అతికష్టం మీద ఒక సీటు సంపాదించుకున్నాడు. వేదిక మీద తెల్లజుట్టుతో, గడ్డంతో, పొడవాటి నల్ల కోటు వేసుకుని ఉన్న ప్రసంగీకుడు చెప్తున్న విషయాల్ని అతను పూర్తి అవధానంతో వింటున్నాడు. ప్రసంగీకుడు వేదిక మీద అటూఇటూ తిరుగుతూ చేతులతో సైగలు చేస్తూ, ఒక్కొక్క లేఖనాన్ని స్పష్టంగా వివరిస్తూ ప్రసంగాన్ని ఇస్తున్నాడు. మెల్లమెల్లగా బైబిలు సత్యం ఏమిటో ఆ వ్యక్తికి అర్థమౌతోంది. మైక్‌లు, స్పీకర్‌లు లేకపోయినా ప్రసంగీకుని గొంతు ఆడిటోరియం నలుమూలలా వినిపిస్తోంది, ప్రేక్షకులు గంటన్నరపాటు చాలా శ్రద్ధగా ప్రసంగాన్ని వింటున్నారు. తర్వాత ప్రశ్నా-జవాబుల భాగం మొదలైంది. ఓకానర్‌-అతని స్నేహితులు రస్సెల్‌ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, ఆయన లేఖనాల్ని ఉపయోగిస్తూ ఎంతో సమర్థవంతంగా వాటికి జవాబిస్తున్నాడు. ప్రేక్షకులు చప్పట్లతో తమ సమ్మతి తెలిపారు. కార్యక్రమం ముగిశాక, బైబిలు సత్యం పట్ల ఆసక్తివున్న వ్యక్తి, సహోదరుల దగ్గరకు వెళ్లి తనకు మరిన్ని విషయాలు నేర్పించమని అడిగాడు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాల ప్రకారం, చాలామంది ఈ విధంగానే సత్యం తెలుసుకున్నారు.

1909, మే నెలలో రస్సెల్‌ నాల్గవసారి ఐర్లాండ్‌ను సందర్శించాడు. ఆయన మారటేనీ అనే ఓడలో న్యూయార్క్‌ నుండి ఐర్లాండ్‌కు బయల్దేరాడు. ఈసారి ఆయన తనతోపాటు స్టెనోగ్రాఫర్‌ అయిన సహోదరుడు హస్ట్‌సింగర్‌ను కూడా తీసుకెళ్లాడు. ప్రయాణ సమయంలో సహోదరుడు రస్సెల్‌ వాచ్‌ టవర్‌ ఆర్టికల్స్‌ను చెప్తూ ఉంటే స్టెనోగ్రాఫర్‌ దాన్ని టైప్‌ చేయవచ్చనే ఉద్దేశంతో ఆయన ఆ సహోదరుణ్ణి తీసుకెళ్లాడు. ఈసారి ఆయన బెల్‌ఫాస్ట్‌లో ఇచ్చిన ప్రసంగానికి స్థానికంగా ఉన్న 450 మంది హాజరయ్యారు, వాళ్లలో సుమారు 100 మంది కూర్చోవడానికి చోటులేక నిలబడే ప్రసంగమంతా విన్నారు.

లూసటేనీయ ఓడలో సహోదరుడు సి.టి. రస్సెల్‌

మొదట్లో చెప్పిన ఐదవ సందర్శన సమయంలో కూడా ఎప్పటిలాగే జరిగింది. డబ్లిన్‌లో బహిరంగ ప్రసంగం అయ్యాక, ఓకానర్‌ తీసుకొచ్చిన ఒక పేరుగాంచిన మతపండితుడు ప్రశ్నా జవాబుల కార్యక్రమంలో రస్సెల్‌ను ప్రశ్నించాడు. ఎప్పటిలానే సహోదరుడు లేఖనాలతో ఆయన ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చాడు, ప్రేక్షకులు చాలా ఆనందించారు. తర్వాతి రోజు రస్సెల్‌ బృందం, ఫాస్ట్‌ మెయిల్‌ బోట్‌లో లివర్‌పూల్‌కి వెళ్లి, అక్కడినుండి ప్రసిద్ధి చెందిన లూసటేనీయ ఓడలో న్యూయార్క్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. *

1910, మే 20న ద ఐరిష్‌ టైమ్స్‌లో వచ్చిన బహిరంగ ప్రసంగం ప్రకటన

సహోదరుడు రస్సెల్‌ 1911 లో ఐర్లాండ్‌ను ఆరవసారి, ఏడవసారి సందర్శిస్తున్నప్పుడు కూడా ఆయన ప్రసంగాల గురించి వార్తాపత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. ‘మరణం తర్వాతి జీవితం’ అనే అంశం మీద ఏప్రిల్‌నెల బెల్‌ఫాస్ట్‌లో సహోదరుడు ఇచ్చిన ప్రసంగానికి హాజరైన 2000 మందిని 20 మంది బైబిలు విద్యార్థులు స్వాగతించారు. డబ్లిన్‌లో ప్రసంగం అయిపోయాక ఓకానర్‌ తీసుకొచ్చిన మరొక మతప్రచారకుడు వేసిన ప్రశ్నలకు సహోదరుడు రస్సెల్‌ ఇచ్చిన లేఖనాధారిత జవాబుల్ని ప్రేక్షకులు చప్పట్లతో మెచ్చుకున్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో వేర్వేరు పట్టణాల్లో జరిగిన ప్రసంగాలకు కూడా ఎంతోమంది హాజరయ్యారు. డబ్లిన్‌లో జరుగుతున్న కూటాన్ని ఇంకోసారి ఆటంకపర్చాలని ఓకానర్‌, అలాగే అతను తీసుకొచ్చిన 100 మంది రౌడీలు ప్రయత్నించారు. కానీ ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ప్రసంగీకునికి మద్దతు తెలిపారు.

ఆ కాలంలో బహిరంగ ప్రసంగాల్ని ఇవ్వడానికి సహోదరుడు రస్సెల్‌ సారథ్యం వహించిన మాట వాస్తవమే. కానీ “ఏ మనిషీ ప్రాముఖ్యమైన వాడు కాదు” అని ఆయన గుర్తించాడు. ఎందుకంటే “అది మనుషుల పని కాదు, దేవుని పని.” ఐర్లాండ్‌లో కూటాలు ప్రారంభించడానికి దోహదపడిన బహిరంగ ప్రసంగాలు లేఖనాధారిత సత్యాల్ని వివరించడానికి చాలా చక్కగా సహాయం చేశాయి. దాని ఫలితం? మంచివార్త వ్యాప్తిచెందింది, ఐర్లాండ్‌లోని ఎన్నో నగరాల్లో సంఘాలు ప్రారంభమయ్యాయి.—బ్రిటన్‌ నుండి సేకరించినవి.

^ పేరా 3 రెండేళ్లకే టైటానిక్‌ మునిగిపోయింది.

^ పేరా 9 1915, మే నెలలో ఐర్లాండ్‌ దక్షిణ తీరాన జరిగిన టార్పెడో దాడిలో లూసటేనీయ ధ్వంసమైంది.