కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏశావు నుండి జ్యేష్ఠత్వపు హక్కును కొనుక్కోవడం వల్లే యాకోబు మెస్సీయకు పూర్వీకుడు అయ్యాడా?

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో, మెస్సీయకు పూర్వీకులు అయ్యే అవకాశం కేవలం జ్యేష్ఠ కుమారులకే దక్కిందా?

అవుననే కొన్ని సందర్భాల్లో అనుకున్నాం. నిజానికి అది హెబ్రీయులు 12:16 లో ఉన్న విషయానికి సరిపోతున్నట్లు ఒకప్పుడు అనిపించింది. ఆ వచనాన్ని గమనిస్తే, ఏశావు ‘పవిత్రమైన విషయాల పట్ల మెప్పుదల చూపించలేదని,’ ‘ఒక్కపూట భోజనం కోసం పెద్ద కొడుకుగా తనకున్న హక్కుల్ని’ యాకోబుకు ఇచ్చేశాడని చూస్తాం. ఆ విధంగా జ్యేష్ఠత్వపు హక్కును పొందడం ద్వారా యాకోబు మెస్సీయకు పూర్వీకుడు అయ్యాడని అనుకున్నాం.—మత్త. 1:2, 16; లూకా 3:23, 34.

అయితే, బైబిలు వృత్తాంతాల్ని పునఃపరిశీలించడం వల్ల తెలిసిన విషయమేమిటంటే, మెస్సీయకు పూర్వీకులయ్యే అవకాశం కేవలం జ్యేష్ఠ కుమారులకే దొరికిందని అనుకోవడం సరికాదు. అందుకు సంబంధించిన కొన్ని రుజువుల్ని పరిశీలించండి:

యాకోబుకు (ఇశ్రాయేలుకు) లేయా ద్వారా పుట్టిన మొదటి కుమారుడు రూబేను. రెండవ భార్యయైన రాహేలు ద్వారా ఆయనకు పుట్టిన మొదటి కుమారుడు యోసేపు. అయితే ఒక తప్పుడు పనివల్ల రూబేను తన జ్యేష్ఠత్వపు హక్కును చేజార్చుకున్నాడు. ఆయనకు బదులు యోసేపు ఆ హక్కును పొందాడు. (ఆది. 29:31-35; 30:22-25; 35:22-26; 49:22-26; 1 దిన. 5:1, 2) కానీ మెస్సీయ వంశావళి రూబేను నుండిగానీ, యోసేపు నుండిగానీ రాలేదు. బదులుగా, యాకోబుకు లేయా ద్వారా పుట్టిన నాల్గవ కుమారుడైన యూదా నుండి వచ్చింది.—ఆది. 49:10.

మెస్సీయ వంశావళిలోని నలుగురు వ్యక్తుల పేర్లను మత్తయి 1:5 వ వచనంలో గమనించవచ్చు. వాళ్లందరూ జ్యేష్ఠ కుమారులేనని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే బోయజుకు ఓబెదు మొదటి కుమారుడు. ఓబెదుకు యెష్షయి మొదటి కుమారుడు.—రూతు 4:17, 20-21; 1 దిన. 2:10-12.

కానీ యెష్షయికి దావీదు మొదటి కుమారుడు కాదు, ఎనిమిదవ కుమారుడు. అయినప్పటికీ ఆయన మెస్సీయకు పూర్వీకుడు అయ్యాడు. (1 సమూ. 16:10, 11; 17:12; మత్త. 1:5, 6) అదేవిధంగా ఆ వంశావళిలోని తర్వాతి వ్యక్తి సొలొమోను. ఆయన కూడా దావీదుకు మొదటి కుమారుడు కాదు.—2 సమూ. 3:2-5.

దానర్థం జ్యేష్ఠత్వపు హక్కు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కాదు. మొదటి కుమారునికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉండేది, సాధారణంగా ఆయనే తండ్రి తర్వాతి స్థానంలో ఉండేవాడు. ఆస్తిలో కూడా ఆయనకు రెండు భాగాలు వచ్చేవి.—ఆది. 43:33; ద్వితీ. 21:17; యెహో. 17:1.

అయితే జ్యేష్ఠత్వపు హక్కును వేరొకరికి ఇచ్చే వీలు ఉండేది. ఉదాహరణకు అబ్రాహాము ఆ హక్కును ఇష్మాయేలుకు బదులు ఇస్సాకుకు ఇచ్చాడు. (ఆది. 21:14–21; 22:2) అలాగే పై పేరాల్లో గమనించినట్లు, ఆ హక్కు రూబేనుకు బదులు యోసేపు పొందాడు.

ఇప్పుడు మళ్లీ మనం హెబ్రీయులు 12:16 ను పరిశీలిద్దాం. అక్కడిలా ఉంది, “మీలో ఎవ్వరూ లైంగిక పాపిగా గానీ, ఏశావులా పవిత్రమైన విషయాల పట్ల మెప్పుదల చూపించని వ్యక్తిగా గానీ ఉండకుండా చూసుకోండి. ఏశావు ఒక్కపూట భోజనం కోసం పెద్ద కొడుకుగా తనకున్న హక్కులు వదులుకున్నాడు.” ఈ వచనం దేనిగురించి మాట్లాడుతుంది?

ఇక్కడ అపొస్తలుడైన పౌలు మెస్సీయ వంశావళి గురించి మాట్లాడడం లేదు. క్రైస్తవులు తమ ‘పాదాల కిందవున్న దారుల్ని చదును’ చేసుకోవాలని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. అలా చేస్తే వాళ్లు లైంగిక పాపాలకు పాల్పడకుండా, ‘దేవుని అపారదయను పొందే విషయంలో విఫలం కాకుండా’ ఉంటారు. (హెబ్రీ. 12:12-16) ఒకవేళ లైంగిక పాపాలకు పాల్పడితే వాళ్లు, “పవిత్రమైన విషయాల పట్ల మెప్పుదల” చూపించని ఏశావులా ఉంటారు. ఆయన నిజంగా అపవిత్రమైనవాటికి లొంగిపోయాడు.

పూర్వకాలంలో జీవించిన ఏశావుకు, బలులు అర్పించే గొప్ప అవకాశం అప్పుడప్పుడు దొరికేవుంటుంది. (ఆది. 8:20, 21; 12:7, 8; యోబు 1:4, 5) కానీ అపరిపూర్ణ మనసు కలిగివుండడం వల్ల, కేవలం ఒక్క గిన్నెడు చిక్కుడుకాయల కూర కోసం అలాంటి గొప్ప అవకాశాలన్నిటినీ చేజార్చుకున్నాడు. బహుశా ఆయన అబ్రాహాము సంతానం మీదికి రాబోయే కష్టాన్ని తప్పించుకోవాలని అనుకుని ఉంటాడు. (ఆది. 15:13, 14) అంతేకాదు, ఆయన అపవిత్రమైన పనుల్ని చేయడానికే మొగ్గుచూపాడే తప్ప పవిత్రమైన విషయాల పట్ల కృతజ్ఞత చూపించలేదు. అందుకే, ఆయన ఇద్దరు అన్య స్త్రీలను పెళ్లిచేసుకుని తన అమ్మానాన్నల మనసును గాయపర్చాడు. (ఆది. 26:34, 35) కానీ యాకోబు మాత్రం సత్యదేవుని ఆరాధకురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఏశావుకూ, యాకోబుకూ ఎంత తేడా కదా!—ఆది. 28:6, 7; 29:10-12, 18.

మెస్సీయ వంశావళిని పరిశీలించాక మనం ఏ నిర్ధారణకు రావచ్చు? మెస్సీయకు పూర్వీకులయ్యే అవకాశాన్ని కేవలం జ్యేష్ఠ కుమారులే పొందలేదు. యూదులు కూడా ఈ విషయాన్ని గ్రహించారు, దాన్ని అంగీకరించారు. అలాగని ఎలా చెప్పవచ్చు? యెష్షయి చివరి కుమారుడైన దావీదు వంశం నుండి క్రీస్తు వస్తాడనే వాస్తవాన్ని యూదులు అంగీకరించడాన్ని బట్టి మనం ఆ విషయాన్ని అర్థంచేసుకోవచ్చు.—మత్త. 22:42.