కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెహోవాసాక్షుల ప్రచురణలు వ్యక్తిగత వెబ్‌సైట్‌లో లేదా సోషల్‌ మీడియాలో ఎందుకు పెట్టకూడదు?

మన ప్రచురణల్ని ఉచితంగా అందిస్తాం కాబట్టి వాటిని వేరే వెబ్‌సైట్‌లలో లేదా సోషల్‌ మీడియాలో పెట్టడం తప్పుకాదని కొంతమంది అనుకుంటారు. కానీ అలాచేస్తే మన వెబ్‌సైట్‌ వినియోగంపై షరతులు * ఉల్లంఘించినట్లు అవుతుంది, దానివల్ల తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. మన వెబ్‌సైట్‌ వినియోగంపై షరతుల్లో ఈ మాటలు స్పష్టంగా ఉన్నాయి, “ఈ వెబ్‌సైట్‌లోని చిత్రాల్ని, ఎలక్ట్రానిక్‌ ప్రచురణల్ని, ట్రేడ్‌మార్కుల్ని, సంగీతాన్ని, ఫోటోల్ని, వీడియోల్ని, లేదా ఆర్టికల్స్‌ని ఇంటర్నెట్‌లో (అంటే ఏ వెబ్‌సైట్‌లోనైనా, ఫైళ్లు షేర్‌ చేసే సైట్‌లోనైనా, సోషల్‌ నెట్‌వర్క్‌లోనైనా) పోస్ట్‌ చేయడం” తప్పు. ఇంతకీ అలాంటి ఆంక్షలు ఎందుకు అవసరం?

కాపీరైట్‌ ఉన్న మన ప్రచురణల్ని ఎవ్వరూ ఇతర వెబ్‌సైట్‌లలో పోస్ట్‌ చేయకూడదు

మన వెబ్‌సైట్‌లలో ఉన్న సమాచారమంతటికీ కాపీరైట్‌ ఉంది. మతభ్రష్టులు అలాగే ఇతర వ్యతిరేకులు మన ప్రచురణల్ని వాళ్ల వెబ్‌సైట్‌లలో పెట్టి యెహోవాసాక్షుల్ని, ఇతరుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఆ వెబ్‌సైట్‌లలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి పాఠకుల మనసుల్లో అనుమానాలు సృష్టించడమే వాళ్ల లక్ష్యం. (కీర్త. 26:4; సామె. 22:5) ఇంకొంతమంది మన ప్రచురణల్లో ఉన్న సమాచారాన్ని లేదా jw.org లోగోని వ్యాపార ప్రకటనల్లో, అమ్మకానికి పెట్టిన వస్తువులపై, మొబైల్‌ యాప్‌లలో ఉపయోగించారు. కాపీరైట్‌, ట్రేడ్‌మార్క్‌ కలిగివున్నాం కాబట్టి ఎవరైనా మన వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని దుర్వినియోగపరిస్తే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం మనకు ఉంటుంది. (సామె. 27:12) కాబట్టి ఎవరైనా సరే ఆఖరికి సహోదరులైనా సరే మన వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని వేరే వెబ్‌సైట్‌లలో పోస్ట్‌ చేయకూడదు లేదా jw.org ట్రేడ్‌మార్క్‌ని వ్యాపార సంబంధమైన వాటిలో ఉపయోగించకూడదు. ఒకవేళ అలా చేస్తున్నారని తెలిసి కూడా అనుమతిస్తే, వ్యతిరేకులు అలాగే వ్యాపార సంబంధమైన సంస్థలు మన వెబ్‌సైట్‌ను దుర్వినియోగపర్చకుండా మనం చేసే ప్రయత్నాలకు కోర్టు మద్దతివ్వకపోవచ్చు.

మన ప్రచురణల్ని jw.orgలో కాకుండా వేరే ఎక్కడ నుండి డౌన్‌లోడ్‌ చేసుకున్నా అవి కలుషితం అయ్యుండవచ్చు. ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే బాధ్యత యెహోవా ‘నమ్మకమైన బుద్ధిగల దాసునికి’ మాత్రమే అప్పగించాడు. (మత్త. 24:45) ఆ “దాసుడు” ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టడానికి తమ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగిస్తాడు. అవి ఏమిటంటే: www.pr418.com, tv.pr418.com, wol.pr418.com. అలాగే మనకు కేవలం మూడు అధికారిక మొబైల్‌ యాప్స్‌ మాత్రమే ఉన్నాయి. అవి: JW లాంగ్వేజ్‌ ®,JW లైబ్రరీ ®, అలాగే JW లైబ్రరీ సంజ్ఞా భాష®. వీటిలో ఎలాంటి వ్యాపార ప్రకటనలు లేదా సాతాను లోకానికి సంబంధించిన మలినాలు ఉండవు. వీటి ద్వారా కాకుండా వేరే ఏ మాధ్యమం ద్వారానైనా తీసుకునే ఆధ్యాత్మిక ఆహారం కాస్త కలుషితం అయ్యుండవచ్చు లేదా సమాచారంలో మార్పులు చేర్పులు జరిగివుండవచ్చు.—కీర్త. 18:26; 19:8.

అంతేకాదు, ఇతరులు కామెంట్‌ చేసే వీలున్న వెబ్‌సైట్‌లలో మన ప్రచురణల్ని పోస్ట్‌ చేస్తే, మతభ్రష్టులు అలాగే విమర్శకులు యెహోవా సంస్థపై అనుమానాలు సృష్టించే అవకాశం ఉంది. కొంతమంది సహోదరులు ఆన్‌లైన్‌లో ఇతరులతో వాదించడానికి ప్రయత్నించడం ద్వారా యెహోవాకు మరింత చెడ్డ పేరు తీసుకొచ్చారు. ‘వ్యతిరేకించేవాళ్లకు సౌమ్యంగా ఉపదేశించడానికి’ సోషల్‌ మీడియా సరైన వేదిక కాదు. (2 తిమో. 2:23-25; 1 తిమో. 6:3-5) మరో విషయమేమిటంటే సంస్థ పేరు మీద, పరిపాలక సభ మీద, అందులోని సభ్యుల పేర్ల మీద సోషల్‌ మీడియాలో నకిలీ అకౌంట్‌లు, వెబ్‌సైట్‌లు సృష్టించారని గుర్తించాం. కానీ పరిపాలక సభ సభ్యుల్లో ఎవ్వరికీ వ్యక్తిగత వెబ్‌పేజీ గానీ, సోషల్‌ మీడియాలో వ్యక్తిగత అకౌంట్‌ గానీ లేదు.

ప్రజలకు jw.org వెబ్‌సైట్‌ పరిచయం చేయడం ద్వారా “మంచివార్త” వ్యాప్తిచేయవచ్చు. (మత్త. 24:14) మన పరిచర్యలో ఉపయోగించడానికి వీలుగా డిజిటల్‌ ఉపకరణాలు ఎప్పటికప్పుడు మెరుగౌతూనే ఉన్నాయి. ప్రతీఒక్కరు వాటినుండి ప్రయోజనం పొందాలనేదే మన కోరిక. కాబట్టి వినియోగంపై షరతుల్లో ఉన్నట్లుగా మీరు వెబ్‌సైట్‌లో ఉన్న ప్రచురణల ఎలక్ట్రానిక్‌ కాపీలను గానీ, అందులోవున్న సమాచారానికి సంబంధించిన లింక్‌ను గానీ ఎవ్వరికైనా షేర్‌ చేయవచ్చు. ఆసక్తిగలవాళ్లకు మన అధికారిక వెబ్‌సైట్‌లు పరిచయం చేయడం ద్వారా “నమ్మకమైన బుద్ధిగల దాసుడు” ఆధ్యాత్మిక ఆహారం అందించే అసలైన మాధ్యమానికి నడిపిస్తాం.

^ పేరా 1 jw.org వెబ్‌సైట్‌లోని హోమ్‌ పేజీ చివర్లో వినియోగంపై షరతులు అనే లింక్‌ని చూడండి. ఆ ఆంక్షలు మన వెబ్‌సైట్‌లలో ఉన్న ప్రతీదానికి వర్తిస్తాయి.