కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ శత్రువు గురించి తెలుసుకోండి

మీ శత్రువు గురించి తెలుసుకోండి

“సాతాను కుయుక్తులు మనకు తెలియనివి కావు.”2 కొరిం. 2:11.

పాటలు: 150, 32

1. ఆదాముహవ్వలు పాపం చేసిన తర్వాత మన శత్రువు గురించి యెహోవా ఏమి వెల్లడిచేశాడు?

పాములు మాట్లాడలేవని ఆదాముకు తెలుసు. అందుకే, పాము హవ్వతో మాట్లాడిందని ఆదాముకు తెలిసినప్పుడు, ఒక అదృశ్యప్రాణి మాట్లాడాడని ఆయన అర్థంచేసుకొనివుంటాడు. (ఆది. 3:1-6) ఆ అదృశ్యప్రాణి ఎవరో ఆదాముహవ్వలకు తెలీదు. అయినప్పటికీ, ఆదాము ఆ అపరిచిత ప్రాణి చెప్పిన మాటలు నమ్మి తన ప్రేమగల పరలోక తండ్రికి ఎదురుతిరిగాడు. (1 తిమో. 2:14) వెంటనే, యెహోవా ఆ దుష్ట శత్రువు గురించిన వివరాల్ని వెల్లడిచేయడం మొదలుపెట్టాడు. ఆ శత్రువును కొంతకాలం తర్వాత నాశనం చేస్తానని కూడా మాటిచ్చాడు. కానీ ఈలోపు ఆ అదృశ్యప్రాణి, దేవున్ని ప్రేమించేవాళ్లందరికీ శత్రువుగా మారతాడని యెహోవా హెచ్చరించాడు.—ఆది. 3:15.

2, 3. మెస్సీయ వచ్చేవరకు సాతాను గురించి ఎక్కువ వివరాలు ఎందుకు వెల్లడికాలేదు?

2 తనకు ఎదురుతిరిగిన దూత పేరేమిటో యెహోవా ఎన్నడూ చెప్పలేదు. * కాకపోతే ఏదెనులో తిరుగుబాటు జరిగిన 2,500 సంవత్సరాల తర్వాత ఆ తిరుగుబాటుదారుని గురించి కొన్ని వివరాలు యెహోవా చెప్పాడు. (యోబు 1:6) అతనికి “సాతాను” అంటే “వ్యతిరేకించేవాడు” అనే బిరుదు ఉంది. ఆదిమ హీబ్రూ భాషలో, 1 దినవృత్తాంతాలు, యోబు, జెకర్యా ఈ మూడు హీబ్రూ పుస్తకాల్లోనే ఆ శత్రువు గురించిన ప్రస్తావన ఉంది. మరి మెస్సీయ వచ్చేవరకు ఈ శత్రువు గురించి ఎక్కువ వివరాలు ఎందుకు వెల్లడికాలేదు?

3 సాతాను గురించి, అతని పనుల గురించి యెహోవా హీబ్రూ లేఖనాల్లో ఎక్కువ వివరాలు రాయించలేదు. ఎందుకంటే ప్రజలు మెస్సీయను గుర్తించి, ఆయన్ను అనుసరించేలా సహాయం చేయడమే హీబ్రూ లేఖనాల ఉద్దేశం. (లూకా 24:44; గల. 3:24) అయితే మెస్సీయ వచ్చాక ఆయన ద్వారా, ఆయన శిష్యుల ద్వారా సాతాను గురించి, అతనితో చేతులు కలిపిన దూతల గురించి యెహోవా మరిన్ని వివరాలు వెల్లడిచేశాడు. * ఇది సరైనదని చెప్పవచ్చు ఎందుకంటే యేసును, ఆయన అభిషిక్తుల్ని ఉపయోగించుకునే సాతానును, అతని అనుచరుల్ని యెహోవా నాశనం చేయబోతున్నాడు.—రోమా. 16:20; ప్రక. 17:14; 20:10.

4. మనం అపవాదికి ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు?

4 అపవాదియైన సాతాను “గర్జించే సింహం” వంటివాడని అపొస్తలుడైన పేతురు వర్ణించాడు. అతన్ని “సర్పం,” “మహాసర్పం” అని యోహాను పిలిచాడు. (1 పేతు. 5:8; ప్రక. 12:9) కానీ ఆ అపవాదికి మనం భయపడాల్సిన అవసరంలేదు. అతనికున్న శక్తి పరిమితమైనది. (యాకోబు 4:7 చదవండి.) అంతేకాదు మనం యెహోవా, యేసు, నమ్మకమైన దూతల సంరక్షణలో ఉన్నాం. వాళ్ల సహాయంతో మన శత్రువును ఎదిరించగలం. అయినప్పటికీ మనం ఈ మూడు ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి: సాతాను ఎంతమేరకు ప్రభావం చూపించగలడు? సాతాను ఇతరుల్ని ఎలా ప్రభావితం చేస్తాడు? అతను చేయలేని పనులు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని, వాటినుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో చూద్దాం.

సాతాను ఎంతమేరకు ప్రభావం చూపించగలడు?

5, 6. మానవ ప్రభుత్వాలు మనుషులకు నిజంగా అవసరమైన మార్పులు ఎందుకు తీసుకురాలేవు?

5 జలప్రళయం రాకముందు, కొంతమంది దూతలు భూమ్మీదున్న స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకునేలా సాతాను ప్రేరేపించాడు. తిరుగుబాటు చేసిన ఆ దూతలందరూ ఇప్పుడు సాతాను ఆధీనంలో ఉన్నారు. ఈ విషయాన్నే బైబిలు సూచనార్థకంగా ఇలా వర్ణించింది, మహాసర్పం “ఆకాశ నక్షత్రాల్లో మూడో భాగాన్ని ఈడ్చి భూమ్మీద పడేసింది.” (ఆది. 6:1-4; యూదా 6; ప్రక. 12:3, 4) ఆ దూతలు దేవుని కుటుంబాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవున్ని తిరస్కరించి సాతానుతో చేతులు కలిపారు. అయితే ఈ తిరుగుబాటుదారులైన దూతలు ఎలాంటి సంస్థీకరణ లేకుండా ఉన్నారని అనుకోకూడదు. సాతాను కూడా దేవుని రాజ్యాన్ని పోలిన ఒక అదృశ్య ప్రభుత్వాన్ని సొంతగా స్థాపించుకున్నాడు. తనను తాను రాజుగా చేసుకున్నాడు, చెడ్డదూతల్ని వివిధ గుంపులుగా ఏర్పాటు చేశాడు, వాళ్లకు శక్తుల్ని ఇచ్చి, లోక పాలకులుగా నియమించాడు.—ఎఫె. 6:12.

6 సాతాను తన అదృశ్య సంస్థ ద్వారా మానవ ప్రభుత్వాలన్నిటిపై అధికారం చెలాయిస్తున్నాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? ఎందుకంటే సాతాను ‘భూలోక రాజ్యాలన్నిటినీ చూపించి’ యేసుతో ఇలా అన్నాడు: “ఈ అధికారం అంతటినీ, వాటి మహిమను నేను నీకు ఇస్తాను. ఎందుకంటే, అది నాకు అప్పగించబడింది. నేను దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాను.” (లూకా 4:5, 6) సాతాను ఆధీనంలో ఉన్నప్పటికీ చాలా ప్రభుత్వాలు తమ పౌరుల కోసం మంచిపనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, కొంతమంది పాలకులు ప్రజలకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కానీ ఏ మానవ పరిపాలకుడు మనకు నిజంగా అవసరమైన మార్పులు తీసుకురాలేడు.—కీర్త. 146:3, 4; ప్రక. 12:12.

7. సాతాను అబద్ధమతాన్ని, వ్యాపార వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటున్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

7 సాతాను అతని చెడ్డదూతలు అబద్ధమతాన్ని, వ్యాపార వ్యవస్థను కూడా ఉపయోగించుకుని “లోకమంతటినీ” లేదా మనుషులందర్నీ మోసం చేస్తున్నారు. (ప్రక. 12:9) యెహోవా గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడానికి సాతాను అబద్ధమతాన్ని ఉపయోగిస్తున్నాడు. అంతేకాదు దేవుని పేరు మరుగునపడేలా చేయడానికి ప్రయత్నించాడు. (యిర్మీ. 23:26, 27) ఫలితంగా, కొంతమంది దైవభయం ఉన్నవాళ్లు దేవున్ని ఆరాధిస్తున్నామని అనుకుని చెడ్డదూతల్ని ఆరాధిస్తున్నారు. (1 కొరిం. 10:20; 2 కొరిం. 11:13-15) కొన్ని రకాల అబద్ధాలు వ్యాప్తి చేయడానికి వ్యాపార వ్యవస్థను కూడా సాతాను ఉపయోగించుకుంటున్నాడు. ఉదాహరణకు డబ్బు, వస్తుసంపదలు మనుషులకు సంతోషాన్నిస్తాయనే అబద్ధాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. (సామె. 18:11) ఆ అబద్ధాన్ని నమ్మే వాళ్లందరూ దేవున్ని కాకుండా ‘డబ్బును’ ఆరాధిస్తున్నారు. (మత్త. 6:24) దానివల్ల ఒకప్పుడు వాళ్లకు దేవుని మీదున్న ప్రేమ కనుమరుగైపోతుంది.—మత్త. 13:22; 1 యోహా. 2:15, 16.

8, 9. (ఎ) ఆదాముహవ్వలు, అలాగే తిరుగుబాటుదారులైన దూతలు చేసిన పనుల నుండి మనం ఏ రెండు పాఠాలు నేర్చుకోవచ్చు? (బి) లోకం సాతాను ఆధీనంలో ఉందని తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది?

8 ఆదాముహవ్వలు అలాగే తిరుగుబాటుదారులైన దూతలు చేసిన పనుల నుండి మనం రెండు ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, మనకు రెండే మార్గాలు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలి. అంటే, మనం యెహోవావైపు ఉండాలో లేదా సాతాను వైపు ఉండాలో నిర్ణయించుకోవాలి. (మత్త. 7:13) రెండవదిగా, సాతాను వైపు ఉండేవాళ్లకు కేవలం కొన్ని ప్రయోజనాలే ఉంటాయి. ఉదాహరణకు ఆదాముహవ్వలకు ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకునే అవకాశం దొరికింది. చెడ్డదూతలకు మానవ ప్రభుత్వాల మీద కొంత అధికారం దక్కింది. (ఆది. 3:22) కానీ సాతాను వైపు ఉంటే ఎప్పుడూ చెడు ఫలితాలే పొందుతాం గానీ శాశ్వత ప్రయోజనాలు పొందలేం.—యోబు 21:7-17; గల. 6:7, 8.

9 లోకం సాతాను ఆధీనంలో ఉందని తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది? దానివల్ల లోక ప్రభుత్వాల్ని సరైన దృష్టితో చూడగలుగుతాం, మంచివార్తను ప్రకటించాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం. మనం మానవ ప్రభుత్వాల్ని గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 పేతు. 2:17) తన ప్రమాణాలకు అడ్డురానంతవరకు ప్రభుత్వ నియమాల్ని పాటించాలని ఆయన ఆశిస్తున్నాడు. (రోమా. 13:1-4) మనం ఏ మానవ నాయకునికి లేదా రాజకీయ పార్టీకి మద్దతివ్వకూడదని మనకు తెలుసు. (యోహా. 17:15, 16; 18:36) సాతాను దేవుని పేరును మరుగునపడేలా చేయాలని, ఆయన పేరుకు మచ్చ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే మన దేవుని గురించిన సత్యాన్ని ప్రజలకు చెప్పడానికి చేయగలిగినదంతా చేస్తాం. ఆయన పేరుతో పిలవబడుతున్నందుకు, ఆయన పేరును ఉపయోగిస్తున్నందుకు మనం గర్వపడుతున్నాం. డబ్బు మీద లేదా వస్తుసంపదల మీద ఉన్న ప్రేమకన్నా దేవుని మీదున్న ప్రేమే ఎంతో విలువైనది.—యెష. 43:10; 1 తిమో. 6:6-10.

సాతాను ఇతరుల్ని ఎలా ప్రభావితం చేస్తాడు?

10-12. (ఎ) సాతాను కొంతమంది దూతల్ని తన వలలో చిక్కించుకోవడానికి ఏమి చేశాడు? (బి) మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

10 సాతాను ఇతరుల్ని ప్రభావితం చేయడానికి శక్తివంతమైన పద్ధతుల్ని ఉపయోగిస్తాడు. వాళ్లను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి కొన్ని ఎరల్ని ఉపయోగిస్తాడు, అప్పుడప్పుడు భయపెడతాడు కూడా.

11 సాతాను వీనైనంత ఎక్కువమంది దూతల్ని తనవైపు లాక్కోవడానికి ఒక ఎర ఉపయోగించాడు. వాళ్లు ఏ ఎరకు చిక్కుకుంటారో తెలుసుకోవడానికి సాతాను వాళ్లను చాలాకాలం గమనించివుంటాడు. కొంతమంది దూతలు ఆ ఎరకు చిక్కి, భూమ్మీదున్న స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్లకు పుట్టిన పిల్లలు భారీకాయులుగా మారి చుట్టూ ఉన్నవాళ్లను హింసించేవాళ్లు. (ఆది. 6:1-4) సాతాను ఆ దూతల్ని ప్రలోభపెట్టడానికి అనైతికతను, అలాగే మనుషులందరి మీద అధికారాన్ని ఎరగా చూపించివుంటాడు. ఆ విధంగా, ‘స్త్రీ సంతానానికి’ సంబంధించి యెహోవా చెప్పిన ప్రవచన నెరవేర్పును అడ్డుకోవడానికి సాతాను ప్రయత్నించివుంటాడు. (ఆది. 3:15) కానీ విజయం సాధించే అవకాశాన్ని యెహోవా అతనికి ఇవ్వలేదు. జలప్రళయం తీసుకొచ్చి సాతాను, చెడ్డదూతలు వేసిన ప్రణాళికల్ని ఆయన విఫలం చేశాడు.

సాతాను మనల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తాడు (12, 13 పేరాలు చూడండి)

12 ఆ సంఘటనల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? అనైతికత, గర్వం చాలా శక్తివంతమైన ఎరలు. సాతానుతో చేతులు కలిపిన దూతలు పరలోకంలో దేవునితో ఎన్నో సంవత్సరాలు గడిపారు. అయినప్పటికీ, వాళ్లలో చాలామంది తప్పుడు కోరికల్ని వృద్ధిచేసుకున్నారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తున్నప్పటికీ మనలో కూడా చెడు కోరికలు మొలకెత్తే అవకాశం ఉందని మర్చిపోకూడదు. (1 కొరిం. 10:12) అందుకే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఒకవేళ చెడు ఆలోచనలు, గర్వం వంటివి కనిపిస్తే తీసేసుకోవాలి.—గల. 5:26; కొలొస్సయులు 3:5 చదవండి.

13. సాతాను ఉపయోగించే మరో ఎర ఏమిటి? దాన్నుండి మనమెలా తప్పించుకోవచ్చు?

13 సాతాను ఉపయోగించే మరో ఎర ఏమిటంటే, మానవాతీత శక్తులపై కుతూహలం. నేడు సాతాను, చెడ్డదూతల మీద ఆసక్తి పెంచడానికి అబద్ధమతాన్ని, వినోదాన్ని ఉపయోగిస్తున్నాడు. సినిమాలు, వీడియో గేములు మరితర వినోద మాధ్యమాలు మానవాతీత శక్తుల మీదున్న ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఆ ఎర నుండి మనమెలా తప్పించుకోవచ్చు? ఏది మంచి వినోదమో, ఏది చెడ్డ వినోదమో తెలిపే ఒక లిస్టు దేవుని సంస్థ ఇవ్వాలని ఆశించకూడదు. కానీ యెహోవా ప్రమాణాలకు తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకునేలా మన మనస్సాక్షికి శిక్షణ ఇచ్చుకోవాలి. (హెబ్రీ. 5:14) అంతేకాదు మనకు దేవునిపట్ల “వేషధారణలేని” ప్రేమ ఉంటే తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. (రోమా. 12:9) వేషధారి ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తాడు. కాబట్టి వినోదాన్ని ఎంచుకునేటప్పుడు మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘ఇతరులకు చెప్పే ప్రమాణాలను నేను పాటిస్తున్నానా? నేను స్టడీ ఇచ్చేవాళ్లు, ప్రీచింగ్‌లో కలిసేవాళ్లు నేను ఎంచుకునే వినోదాన్ని చూస్తే ఏమనుకుంటారు?’ ఇతరులకు చెప్పే ప్రమాణాల్ని మనం పాటిస్తే, సాతాను ఎరల నుండి తేలిగ్గా తప్పించుకోగలం.—1 యోహా. 3:18.

సాతాను మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు (14వ పేరా చూడండి)

14. సాతాను మనపై ఏయే విధాలుగా దాడిచేయవచ్చు? వాటిని మనమెలా తట్టుకోవచ్చు?

14 యెహోవా మీదున్న నమ్మకాన్ని పోగొట్టడానికి సాతాను మనల్ని భయపెడతాడు, బెదిరిస్తాడు. ఉదాహరణకు, మానవ ప్రభుత్వాల్ని ఉపయోగించి ప్రకటనా పనిపై నిషేధం విధించవచ్చు. తోటి ఉద్యోగస్థుల్ని లేదా తోటి విద్యార్థుల్ని ప్రభావితం చేసి బైబిలు ప్రమాణాలు పాటిస్తున్నందుకు మనల్ని ఎగతాళి చేయవచ్చు. (1 పేతు. 4:4) అవిశ్వాసులైన కుటుంబసభ్యుల్ని ప్రేరేపించి మనల్ని మీటింగ్స్‌ మానేయమని బలవంతపెట్టవచ్చు. (మత్త. 10:36) మరి ఆ దాడులను మనమెలా తట్టుకోవచ్చు? సాతాను మనతో యుద్ధం చేస్తున్నాడని మనకు తెలుసు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు. (ప్రక. 2:10; 12:17) అంతేకాదు, ఆ సంఘటనలకు కారణమైన వివాదాంశాన్ని మనం మర్చిపోకూడదు. అదేమిటంటే, మనకు అన్నీ బాగున్నప్పుడే యెహోవాను ఆరాధిస్తాం, కష్టాలు వస్తే ఆయన్ను వదిలేస్తాం అని సాతాను వేసిన నింద. (యోబు 1:9-11; 2:4, 5) వాటన్నిటిని తట్టుకోవడానికి కావాల్సిన బలం ఇవ్వమని యెహోవాను అడుగుతూ ఉండాలి. యెహోవా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడని గుర్తుంచుకోండి.—హెబ్రీ. 13:5.

సాతాను చేయలేని పనులు ఏమిటి?

15. సాతాను ప్రజల చేత ఏ పనినైనా బలవంతంగా చేయించగలడా? వివరించండి.

15 సాతాను ప్రజల చేత ఏ పనినీ బలవంతంగా చేయించలేడు. (యాకో. 1:14) లోకంలో ఉన్న చాలామంది తాము సాతాను వైపు ఉన్నామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కానీ ఒకవ్యక్తి సత్యం నేర్చుకున్నప్పుడు, యెహోవా వైపు ఉండాలో, సాతాను వైపు ఉండాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. (అపొ. 3:17; 17:30) మనం దేవునికి విధేయత చూపించాలని బలంగా కోరుకుంటే, సాతాను మన యథార్థతను పాడుచేయలేడు.—యోబు 2:3; 27:5.

16, 17. (ఎ) సాతాను అలాగే చెడ్డదూతలు చేయలేని మరికొన్ని పనులు ఏమిటి? (బి) బిగ్గరగా ప్రార్థించడానికి మనమెందుకు భయపడకూడదు?

16 సాతాను అలాగే చెడ్డదూతలు చేయలేని మరికొన్ని పనులు ఉన్నాయి. ఉదాహరణకు, మన మనసులో లేదా హృదయంలో ఏముందో వాళ్లు తెలుసుకోగలరని బైబిలు చెప్పట్లేదు. ఆ సామర్థ్యం యెహోవాకు, యేసుకు మాత్రమే ఉంది. (1 సమూ. 16:7; మార్కు 2:8) అయితే, మనం బిగ్గరగా చేసే ప్రార్థనల్ని సాతాను, అతని చెడ్డదూతలు వింటారని భయపడాలా? అవసరంలేదు. దీనిగురించి ఆలోచించండి: సాతాను చూస్తాడేమోనని మనం యెహోవా కోసం చేయాల్సిన మంచిపనులు చేయకుండా ఉంటామా? అదేవిధంగా, సాతాను వింటాడేమోనని బిగ్గరగా ప్రార్థించడానికి భయపడకూడదు. అంతేకాదు దేవుని సేవకులు చాలాసార్లు బిగ్గరగా ప్రార్థనలు చేశారని బైబిల్లో చదువుతాం. సాతాను వింటాడేమోనని వాళ్లు భయపడినట్లు ఎక్కడా లేదు. (1 రాజు. 8:22, 23; యోహా. 11:41, 42; అపొ. 4:23, 24) దేవుని చిత్త ప్రకారం మాట్లాడడానికి, మంచిపనులు చేయడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు, సాతాను మనకు శాశ్వతంగా హానిచేయడానికి యెహోవా ఎన్నడూ అనుమతించడు.—కీర్తన 34:7 చదవండి.

17 మన శత్రువు గురించి మనం తెలుసుకోవాలి గానీ అతనికి భయపడాల్సిన అవసరంలేదు. మనం అపరిపూర్ణులమైనప్పటికీ యెహోవా సహాయంతో సాతానుపై విజయం సాధించగలం. (1 యోహా. 2:14) మనం ఎదిరిస్తే అతను మననుండి పారిపోతాడు. (యాకో. 4:7; 1 పేతు. 5:9) నేడు సాతాను ముఖ్యంగా యౌవనులపై దాడిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి వాళ్లు సాతాను దాడులను ఎలా తిప్పికొట్టవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో దానిగురించి చర్చిస్తాం.

^ పేరా 2 కొంతమంది దూతల పేర్లు బైబిల్లో ఉన్నాయి. (న్యాయా. 13:18; దాని. 8:16; లూకా 1:19; ప్రక. 12:7) యెహోవా ప్రతీ నక్షత్రానికి పేరు పెట్టాడని కూడా బైబిలు చెప్తుంది. (కీర్త. 147:4) దీన్నిబట్టి దూతలందరికీ యెహోవా పేర్లు పెట్టివుంటాడని చెప్పవచ్చు. కాబట్టి సాతానుగా మారిన దూతకు కూడా ఏదో పేరు ఉండేవుంటుంది.

^ పేరా 3 ఆదిమ భాషలో “సాతాను” అనే బిరుదు హీబ్రూ లేఖనాల్లో కేవలం 18 సార్లే ఉంది. కానీ క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో 30 కన్నా ఎక్కువసార్లు ఉంది.