కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎవరివైపు చూస్తున్నారు?

మీరు ఎవరివైపు చూస్తున్నారు?

“ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.” కీర్త. 123:1.

పాటలు: 143, 124

1, 2. యెహోవావైపు చూడడమంటే ఏమిటి?

మనందరం “ప్రమాదకరమైన, కష్టమైన” కాలాల్లో జీవిస్తున్నాం. (2 తిమో. 3:1) ఈ దుష్టలోకాన్ని యెహోవా నాశనం చేసి, భూమ్మీదకు నిజమైన శాంతిని తీసుకొచ్చే లోపు మన జీవితం మరింత కష్టంగా మారనుంది. అందుకే మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, ‘సహాయం కోసం, నిర్దేశం కోసం నేను ఎవరివైపు చూస్తాను?’ దానికి జవాబుగా మనం వెంటనే “యెహోవావైపు” అని చెప్తాం. అవును అదే తిరుగులేని జవాబు.

2 ఇంతకీ యెహోవావైపు చూడడమంటే ఏమిటి? సమస్యలు ఎదురైనప్పుడు మనం యెహోవావైపు చూస్తూ ఉండడానికి ఏది సహాయం చేస్తుంది? మనకు సహాయం అవసరమైనప్పుడు యెహోవావైపు ఎంతగా చూస్తూ ఉండాలో ఒక బైబిలు రచయిత చాలాకాలం క్రితం చెప్పాడు. (కీర్తన 123:1-4 చదవండి.) మనం యెహోవావైపు చూడడాన్ని ఒక దాసుడు తన యజమానివైపు చూడడంతో ఆ రచయిత పోల్చాడు. దానర్థమేమిటి? ఒక దాసుడు ఆహారం కోసం, సంరక్షణ కోసం తన యజమానివైపు చూస్తాడు లేదా ఆయనపై ఆధారపడతాడు. అంతేకాదు, యజమాని తన నుండి ఏమి కోరుకుంటున్నాడో అర్థంచేసుకోవడానికి దాసుడు ఆయన్నే చూస్తూ ఉండాలి, ఆయన చెప్పింది చేయాలి. అదేవిధంగా, యెహోవా మన నుండి ఏమి కోరుకుంటున్నాడో అర్థంచేసుకోవడానికి మనం ప్రతీరోజు బైబిల్ని అధ్యయనం చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడు యెహోవా మనకు అవసరమైన సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—ఎఫె. 5:17.

3. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 మనం ఎల్లప్పుడూ యెహోవావైపు చూడాలని తెలిసినా కొన్నిసార్లు మన దృష్టి పక్కకు మళ్లవచ్చు. యేసుకు సన్నిహిత స్నేహితురాలైన మార్త విషయంలో అదే జరిగింది. ఆమె “చాలా పనులు చేస్తూ, వాటిలో మునిగిపోయింది.” (లూకా 10:40-42) యేసు ఆమె కళ్లెదురుగా ఉన్నప్పటికీ విశ్వాసంగల ఆ స్త్రీ దృష్టి పక్కకు మళ్లిందంటే, మన దృష్టి కూడా పక్కకు మళ్లడంలో ఆశ్చర్యంలేదు. అయితే, యెహోవావైపు చూడకుండా మన దృష్టిని ఏది మళ్లించగలదు? ఇతరులు చేసే పనులనుబట్టి మన దృష్టి ఎలా పక్కకు మళ్లగలదో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు యెహోవావైపు చూస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుందో కూడా పరిశీలిస్తాం.

గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్న విశ్వాసంగల వ్యక్తి

4. మోషే వాగ్దాన దేశంలోకి ప్రవేశించే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది?

4 నిర్దేశం కోసం మోషే యెహోవా దేవుని వైపు చూశాడు. “అతను అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్టు విశ్వాసంలో స్థిరంగా కొనసాగాడు” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 11:24-27 చదవండి.) “యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు” అని కూడా బైబిలు చెప్తుంది. (ద్వితీ. 34:12) మోషే యెహోవాకు సన్నిహిత స్నేహితునిగా ఉన్నప్పటికీ వాగ్దాన దేశంలోకి ప్రవేశించే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. (సంఖ్యా. 20:12) ఎందుకు?

5-7. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టిన కొంతకాలానికే ఏమి జరిగింది? అప్పుడు మోషే ఏమి చేశాడు?

5 ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి రెండు నెలలు గడవకముందే అంటే వాళ్లందరూ సీనాయి పర్వతం దగ్గరకు ఇంకా రాకముందే ఒక పెద్ద సమస్య తలెత్తింది. తాగడానికి నీళ్లు లేవని ప్రజలందరూ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. వాళ్లు మోషే మీద సణిగారు, కోపగించుకున్నారు. దాంతో మోషే యెహోవాకు ఇలా మొరపెట్టుకున్నాడు, “ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు.” (నిర్గ. 17:4) అప్పుడు యెహోవా మోషేకు స్పష్టమైన నిర్దేశాలిచ్చాడు. ఆయన చేతిలో ఉన్న కర్రను తీసుకుని, హోరేబులో ఉన్న బండను కొట్టమని యెహోవా చెప్పాడు. “మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను” అని బైబిలు చెప్తుంది. అప్పుడు బండలో నుండి నీళ్లు వచ్చాయి, ఇశ్రాయేలీయులు తృప్తిగా తాగారు, సమస్య పరిష్కారమైంది.—నిర్గ. 17:5, 6.

6 మోషే ఆ ప్రాంతానికి మస్సా, మెరీబా అనే పేర్లు పెట్టాడని బైబిలు చెప్తుంది. మస్సా అంటే “శోధించుట” అని, మెరీబా అంటే “వాదించుకోవడం” అని అర్థం. ఆయన ఆ పేర్లు ఎందుకు పెట్టాడు? “ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు” మోషే ఆ పేర్లు పెట్టాడని బైబిలు చెప్తుంది.—నిర్గ. 17:7.

7 మెరీబా దగ్గర జరిగింది చూసి యెహోవా ఎలా భావించాడు? ఇశ్రాయేలీయులు కేవలం మోషేపై కాదుగానీ తనపై, తన అధికారంపై తిరుగుబాటు చేశారని యెహోవా భావించాడు. (కీర్తన 95:8, 9 చదవండి.) ఇశ్రాయేలీయులు పెద్ద తప్పు చేశారు. కానీ మోషే యెహోవావైపు చూస్తూ ఆయనిచ్చిన నిర్దేశాల్ని జాగ్రత్తగా పాటించి సరైన పనిచేశాడు.

8. ఇశ్రాయేలీయులు తమ అరణ్య ప్రయాణం చివరికి చేరుకున్నప్పుడు ఏమి జరిగింది?

8 కానీ 40 సంవత్సరాల తర్వాత అలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. ఇశ్రాయేలీయులు తమ అరణ్య ప్రయాణం చివరికి చేరుకున్నారు. వాళ్లందరూ వాగ్దాన దేశానికి సమీపాన కాదేషుకు దగ్గర్లో ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతానికి కూడా మెరీబా * అనే పేరు వచ్చింది. ఎందుకంటే, ఇశ్రాయేలీయులు నీళ్లు లేవని మళ్లీ ఫిర్యాదు చేశారు. (సంఖ్యా. 20:1-5) కానీ ఈసారి మోషే పెద్ద పొరపాటు చేశాడు.

9. యెహోవా మోషేకు ఏమి చేయమని చెప్పాడు? కానీ మోషే ఏమి చేశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

9 ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఏమి చేశాడు? నిర్దేశం కోసం ఆయన మళ్లీ యెహోవావైపు చూశాడు. కానీ ఈసారి యెహోవా మోషేకు బండను కొట్టమని చెప్పలేదు. బదులుగా తన కర్రను తీసుకుని, ప్రజలందర్నీ బండ దగ్గరకు సమకూర్చి, బండతో మాట్లాడమని యెహోవా మోషేకు చెప్పాడు. (సంఖ్యా. 20:6-8) మరి మోషే అలా చేశాడా? లేదు. ఆయన ప్రజల మీద ఎంత చిరాకు, కోపం చూపించాడంటే “ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా?” అని అరిచాడు. తర్వాత మోషే ఆ బండను కొట్టాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కొట్టాడు.—సంఖ్యా. 20:10, 11.

10. మోషే చేసిన పనికి యెహోవా ఎలా స్పందించాడు?

10 యెహోవాకు మోషే మీద చాలా కోపం వచ్చింది. (ద్వితీ. 1:37; 3:26) ఎందుకు? ఒక కారణమేమై ఉండవచ్చంటే, యెహోవా ఇచ్చిన కొత్త నిర్దేశాల్ని మోషే పాటించకపోవడం.

11. మోషే బండను కొట్టడం వల్ల అక్కడ యెహోవా అద్భుతం చేయలేదని ఇశ్రాయేలీయులు ఎందుకు అనుకొనివుండవచ్చు?

11 యెహోవాకు కోపం రావడానికి మరొక కారణం కూడా ఉండవచ్చు. మొదటి మెరీబాలో ఉన్న బండ రాళ్లు బలమైన గ్రానైట్‌ రాళ్లు. గ్రానైట్‌ రాళ్లను ఎంత గట్టిగా కొట్టినా వాటిలో నుండి నీళ్లు రావు. కానీ రెండవ మెరీబాలో ఉన్న బండ రాళ్లు పూర్తిగా వేరు. అక్కడ ఎక్కువగా సున్నపురాళ్లు ఉండేవి. అవి చాలా సున్నితమైన రాళ్లు, నీళ్లను పీల్చుకొని, నిలువ చేసుకోగలవు. కాబట్టి ప్రజలు వాటికి రంధ్రం చేసి నీళ్లు తీసుకోవచ్చు. అందుకే, మోషే ఆ బండతో మాట్లాడే బదులు దాన్ని కొట్టినప్పుడు అందులో నుండి నీళ్లు యెహోవా అద్భుతం చేయడంవల్ల రాలేదు గానీ సహజంగానే వచ్చివుంటాయని ఇశ్రాయేలీయులు అనుకొనివుంటారా? * మనం ఖచ్చితంగా చెప్పలేం.

మోషే ఎలా తిరుగుబాటు చేశాడు?

12. యెహోవాకు మోషే, అహరోనుల మీద కోపం రావడానికి ఇంకో కారణం ఏమై ఉండవచ్చు?

12 యెహోవాకు మోషే, అహరోనుల మీద కోపం రావడానికి ఇంకో కారణం ఏమైవుండవచ్చు? మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా?” మోషే ఇక్కడ “మేము” అని అన్నప్పుడు బహుశా ఆయన్ని, అహరోనును కలుపుకుని మాట్లాడివుండవచ్చు. కానీ మోషే చాలా అగౌరవంగా మాట్లాడినట్లే. ఎందుకంటే ఆ అద్భుతానికి మూలమైన యెహోవాను ఆయన ఘనపర్చలేదు. కీర్తన 106:32, 33 ఇలా చెప్తుంది, “మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.” * (సంఖ్యా. 27:14) మోషే యెహోవాకు చెందాల్సిన ఘనతను ఇవ్వలేదు. అందుకే యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు, “మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి.” (సంఖ్యా. 20:24) అది చాలా గంభీరమైన పాపం!

13. యెహోవా మోషేను శిక్షించడం సరైనదేనా, న్యాయమైనదేనా? వివరించండి.

13 మోషే, అహరోనులు ప్రజల్ని నడిపిస్తున్నారు కాబట్టి యెహోవా వాళ్లనుండి ‘ఎక్కువ కోరుకున్నాడు.’ (లూకా 12:48) గతంలో, తనకు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు జనాంగానంతటినీ యెహోవా వాగ్దాన దేశంలోకి వెళ్లనివ్వలేదు. (సంఖ్యా. 14:26-30, 34) కాబట్టి మోషే తిరుగుబాటు చేసినందుకు యెహోవా ఆయన్ని శిక్షించడం సరైనది, న్యాయమైనది. తిరుగుబాటు చేసిన ఇతర ఇశ్రాయేలీయుల్లాగే మోషే కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు.

సమస్యకు కారణం

14, 15. మోషే యెహోవామీద ఎందుకు తిరుగుబాటు చేశాడు?

14 మోషే యెహోవామీద ఎందుకు తిరుగుబాటు చేశాడు? కీర్తన 106:32, 33 వచనాల్లోని మాటల్ని ఇంకోసారి గమనించండి. అక్కడిలా ఉంది, “మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.” ఇశ్రాయేలీయులు యెహోవామీద తిరుగుబాటు చేశారు. కానీ బాధపడింది, కోపం తెచ్చుకున్నది మాత్రం మోషే. ఆయన ఆత్మనిగ్రహం చూపించలేదు, ముందూవెనకా ఆలోచించకుండా మాట్లాడాడు.

15 ఇతరులు చేసిన పనిని బట్టి మోషే యెహోవావైపు చూడడం ఆపేశాడు. మొదటిసారి ప్రజలు నీళ్ల గురించి ఫిర్యాదు చేసినప్పుడు మోషే యెహోవా చెప్పింది చేశాడు. (నిర్గ. 7:6) కానీ బహుశా ఎన్నో సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు చేస్తున్న తిరుగుబాటును చూసి మోషే అలసిపోయి, విసిగిపోయి ఉంటాడు. అందుకే మోషే తన భావాల గురించే ఆలోచించివుంటాడు తప్ప యెహోవాను మహిమపర్చడం గురించి ఆలోచించి ఉండడు.

16. మోషే చేసిన తప్పు గురించి మనమెందుకు ఆలోచించాలి?

16 ఎంతో విశ్వాసంగల ప్రవక్తయైన మోషే దృష్టి పక్కకుమళ్లి తప్పు చేశాడంటే, మన దృష్టి కూడా సులభంగా పక్కకు మళ్లే అవకాశం ఉంది. మోషే తప్పు చేసినప్పుడు వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి చాలా దగ్గర్లో ఉన్నాడు, మనం కూడా కొత్త లోకంలోకి ప్రవేశించడానికి చాలా దగ్గర్లో ఉన్నాం. (2 పేతు. 3:13) ఆ ప్రత్యేకమైన అవకాశాన్ని పోగొట్టుకోవాలని మనలో ఎవ్వరం కోరుకోము. కానీ మనం కొత్త లోకంలోకి ప్రవేశించాలంటే యెహోవావైపు చూస్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన మాట వినాలి. (1 యోహా. 2:17) మోషే చేసిన తప్పు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

ఇతరుల పనుల్నిబట్టి మీ దృష్టి పక్కకు మళ్లనివ్వకండి

17. ఎవరైనా మనకు విసుగు పుట్టించినప్పుడు ఆత్మనిగ్రహం కోల్పోకుండా ఎలా ఉండవచ్చు?

17 మీరు విసిగిపోయినప్పుడు ఆత్మనిగ్రహం కోల్పోకండి. కొన్నిసార్లు మనకు ఒకే రకమైన సమస్యలు పదేపదే ఎదురౌతుంటాయి. కానీ బైబిలు ఇలా చెప్తుంది, “మనం మానకుండా మంచి పనులు చేద్దాం, మనం అలసిపోకుండా ఉంటే సరైన సమయంలో పంట కోస్తాం.” (గల. 6:9; 2 థెస్స. 3:13) ఏదైనా ఒక విషయం లేదా ఎవరైనా ఒకరు మనకు పదేపదే విసుగు పుట్టిస్తే, అనాలోచితంగా మాట్లాడకుండా ఉంటామా? మన భావోద్వేగాల్ని అదుపుచేసుకుంటామా? (సామె. 10:19; 17:27; మత్త. 5:22) ఇతరులు కోపం తెప్పించినప్పుడు, మనం ‘దేవుణ్ణే ఆగ్రహం చూపించనివ్వాలి.’ (రోమీయులు 12:17-21 చదవండి.) దానర్థమేమిటి? మనం కోపం తెచ్చుకునే బదులు, మన సమస్య గురించి యెహోవా సరైన సమయంలో ఏదోకటి చేసే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తాం. అలాంటి సందర్భాల్లో యెహోవావైపు చూడకుండా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే, మనం యెహోవాను అగౌరవపర్చినట్లే.

18. నిర్దేశాల్ని పాటించడం గురించి మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

18 కొత్త నిర్దేశాల్ని జాగ్రత్తగా పాటించండి. యెహోవా మనకిచ్చే కొత్త నిర్దేశాల్ని నమ్మకంగా పాటిస్తున్నామా? ఏదైనా పనిని గతంలో మనకు అలవాటైన పద్ధతిలోనే చేయడానికి ప్రయత్నించకూడదు. బదులుగా, యెహోవా తన సంస్థ ద్వారా ఇచ్చే కొత్త నిర్దేశాల్ని వెంటనే అమలులో పెట్టాలి. (హెబ్రీ. 13:17) అంతేకాదు, “లేఖనాల్లో రాసివున్న వాటిని” మీరకుండా జాగ్రత్తపడాలి. (1 కొరిం. 4:6) యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని జాగ్రత్తగా పాటించినప్పుడు, మనం ఆయన వైపే చూస్తూ ఉండగలుగుతాం.

ఇతరులు చేసిన పొరపాట్లకు మోషే స్పందించిన తీరు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (19వ పేరా చూడండి)

19. ఇతరులు చేసే పొరపాట్లను బట్టి యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడు చేసుకోకుండా ఎలా ఉండవచ్చు?

19 ఇతరులు చేసే పొరపాట్లను బట్టి యెహో వాతో మీకున్న స్నేహాన్ని పాడు చేసుకోకండి. మనం యెహోవావైపు చూస్తూ ఉంటే, ఆయనతో మనకున్న స్నేహాన్ని పాడు చేసుకోం లేదా ఇతరులు చేసే వాటినిబట్టి కోపం తెచ్చుకోం. ముఖ్యంగా, మోషేలా సంస్థలో మనకేమైనా బాధ్యతలు ఉన్నప్పుడు అది చాలా ప్రాముఖ్యం. నిజానికి, మనకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా రక్షణ పొందాలంటే ప్రతీఒక్కరం కష్టపడాలి, యెహోవా మాట వినాలి. (ఫిలి. 2:12) అయితే, మనకు ఎన్ని ఎక్కువ బాధ్యతలు ఉంటే, యెహోవా మన నుండి అంత ఎక్కువ ఆశిస్తాడు. (లూకా 12:48) కానీ మనం యెహోవాను నిజంగా ప్రేమిస్తే, దేనివల్ల కూడా మనం ‘తూలి తొట్రిల్లం.’ అంతేకాదు ఆయన ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదు.—కీర్త. 119:165; రోమా. 8:37-39.

20. మనం ఏమని తీర్మానించుకోవాలి?

20 మనం కష్టమైన, ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నాం. కాబట్టి ‘ఆకాశమందు ఆసీనుడైన’ యెహోవావైపు చూస్తూ ఉండడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు మాత్రమే ఆయన మననుండి ఏమి కోరుకుంటున్నాడో అర్థంచేసుకోగలుగుతాం. ఇతరుల పనుల్నిబట్టి యెహోవాతో మనకున్న స్నేహం పాడవ్వకుండా జాగ్రత్తపడాలి. మోషేకు జరిగిన దాన్నుండి మనం ఆ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకున్నాం. ఇతరులు చేసిన పొరపాట్లనుబట్టి అతిగా స్పందించే బదులు, “యెహోవా మనలను కరుణించువరకు” ఆయనవైపే చూస్తూ ఉందాం.—కీర్త. 123:1, 2.

^ పేరా 8 మస్సా అని కూడా పిలువబడే రెఫీదీము దగ్గరి మెరీబా, కాదేషు దగ్గరి మెరీబా రెండూ వేర్వేరు. ఆ రెండు ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులు వాదనకు దిగడం లేదా ఫిర్యాదు చేయడంవల్ల ఆ రెండిటికీ ఒకే పేరు వచ్చింది.—దేవుని వాక్యం అధ్యయనం చేయడానికి మార్గదర్శి అనే చిన్నపుస్తకంలోని 7వ మ్యాపు చూడండి.

^ పేరా 11 ప్రొఫెసర్‌ జాన్‌. ఎ. బెక్‌ ఈ వృత్తాంతం గురించి ఇలా చెప్పాడు: “ఒక యూదా కథ చెప్తున్నట్లు, తిరుగుబాటుదారులు మోషేను ఇలా విమర్శించారు, ‘ఆ బండలో నీళ్లు ఉన్నాయని మోషేకు తెలుసు. ఆయన నిజంగా అద్భుతం చేశాడని నిరూపించుకోవాలంటే, వేరే బండ నుండి కూడా నీళ్లను తెప్పించి చూపించమనండి.’” కానీ ఆ ప్రొఫెసర్‌ చెప్పింది ఒక యూదా కథలోని మాటలు మాత్రమేనని గమనించండి.

^ పేరా 12 1987 అక్టోబరు 15 కావలికోట (ఇంగ్లీషు) సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.