కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి”

“పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి”

“పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి, న్యాయంగా తీర్పు తీర్చండి.”యోహా. 7:24.

పాటలు: 142, 123

1. యేసుక్రీస్తు గురించి యెషయా ఏమి చెప్పాడు? అది మనకెందుకు ప్రోత్సాహాన్నిస్తుంది?

యేసుక్రీస్తు గురించి యెషయా చెప్పిన ఒక ప్రవచనం మనకు ప్రోత్సాహాన్ని, నిరీక్షణను ఇస్తుంది. యేసు గురించి ఆయన ఇలా చెప్పాడు, “కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును.” (యెష. 11:3, 4) ఆ మాటలు మనకెందుకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి? ఎందుకంటే మనం జీవిస్తున్న లోకం పక్షపాతంతో నిండిపోయింది. లోకంలోని ప్రజలు పైకి కనిపించే వాటిని బట్టే ఇతరులకు తీర్పు తీరుస్తున్నారు. అందుకే, మనకు పరిపూర్ణ న్యాయమూర్తి అయిన యేసుక్రీస్తు అవసరం. ఆయన పైకి కనిపించే వాటిని బట్టి ఎన్నడూ తీర్పుతీర్చడు.

2. యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

2 మనం ప్రతీరోజు ఇతరుల గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పర్చుకుంటాం. కానీ మనం యేసులా పరిపూర్ణులం కాదు కాబట్టి మన అభిప్రాయాల్లో లోపాలు ఉంటాయి. మనం తరచూ పైకి కనిపించే వాటిని బట్టి వెంటనే ఒక ముగింపుకు వచ్చేస్తుంటాం. అందుకే, “పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి, న్యాయంగా తీర్పు తీర్చండి” అని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. (యోహా. 7:24) అంటే మనం తనను అనుకరించాలని, పైకి కనిపించే వాటిని బట్టి ఇతరులకు తీర్పు తీర్చకూడదని యేసు కోరుకుంటున్నాడు. మనం ఏ మూడు విషయాల్ని బట్టి ఇతరులకు తీర్పుతీర్చే అవకాశం ఉందో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అవేంటంటే: తెగ లేదా జాతి, ఆస్తి-అంతస్తులు, వయసు. వీటిలో ఒక్కోదాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఇతరులకు తీర్పుతీర్చే విషయంలో యేసు ఇచ్చిన ఆజ్ఞను మనం ఎలా పాటించవచ్చో నేర్చుకుంటాం.

తెగ లేదా జాతిని బట్టి తీర్పు తీర్చకండి

3, 4. (ఎ) అన్యుల విషయంలో పేతురుకున్న ఆలోచనా విధానం ఎందుకు మారింది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) పేతురు ఏ కొత్త అవగాహన తెలుసుకున్నాడు?

3 కైసరయలోని అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అపొస్తలుడైన పేతురుకు ఎలా అనిపించివుంటుందో ఊహించగలరా? (అపొ. 10:17-29) అన్యులు అపవిత్రమైనవాళ్లని పేతురు చిన్నప్పటి నుండి నమ్మేవాడు. కానీ, తర్వాత కొన్ని సంఘటనల కారణంగా పేతురు ఆలోచనా విధానం మారింది. ఉదాహరణకు, దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని చూపించాడు. (అపొ. 10:9-16) ఆ దర్శనంలో, అపవిత్రమైన జంతువులతో నిండిన ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశం నుండి కిందికి రావడం ఆయన చూశాడు. తర్వాత ఒక స్వరం, “పేతురూ, లేచి వాటిని చంపుకొని తిను!” అని ఆయనకు చెప్పింది. వాటిని తినమని ఆ స్వరం మూడుసార్లు చెప్పింది, కానీ ఆయన తినని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆయన అలా నిరాకరించిన ప్రతీసారి ఆ స్వరం ఇలా చెప్పింది, “దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు.” ఆ దర్శనం అయిపోయిన తర్వాత, ఆ స్వరం ఏమి చెప్పాలనుకుందో పేతురుకు అర్థంకాలేదు. సరిగ్గా అప్పుడే, కొర్నేలి పంపిన మనుషులు అక్కడికి వచ్చారు. పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం పేతురు వాళ్లతో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్లాడు.

4 ఒకవేళ పేతురు “పైకి కనిపించే వాటిని బట్టి” ఒక ముగింపుకు వచ్చివుంటే, ఆయన కొర్నేలి ఇంటికి అస్సలు వెళ్లివుండేవాడు కాదు. సాధారణంగా యూదులు అన్యుల ఇళ్లకు వెళ్లరు. మరి పేతురు ఎందుకు వెళ్లాడు? ఎందుకంటే ఆయన చూసిన దర్శనాన్ని బట్టి, పవిత్రశక్తి నిర్దేశాన్ని బట్టి అన్యుల పట్ల తనకున్న ఆలోచనను మార్చుకున్నాడు. కొర్నేలితో మాట్లాడిన తర్వాత పేతురు ఇలా అన్నాడు, “దేవునికి పక్షపాతం లేదని నాకు ఇప్పుడు నిజంగా అర్థమైంది. ప్రతీ దేశంలో, దేవునికి భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.” (అపొ. 10:34, 35) ఈ కొత్త అవగాహన పేతురులో ఉత్సాహాన్ని నింపింది. ఈ సత్యం క్రైస్తవులందరిపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?

5. (ఎ) క్రైస్తవులందరూ ఏ విషయాన్ని తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు? (బి) మనం యెహోవాసాక్షులం అయినప్పటికీ వేటి ఛాయలు మనలో ఉండే అవకాశముంది?

5 యెహోవా పేతురును ఉపయోగించుకుని తాను పక్షపాతంలేని దేవుణ్ణని క్రైస్తవులందరూ తెలుసుకునేలా చేశాడు. యెహోవాకు దేశం, జాతి, తెగ, భాష అనే భేదం లేదు. తనకు భయపడి సరైనది చేసేవాళ్లందర్నీ ఆయన అంగీకరిస్తాడు. (గల. 3:26-28; ప్రక. 7:9, 10) యెహోవాకు పక్షపాతం లేదని మీరు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. కానీ పక్షపాతం ఎక్కువగా చూపించే దేశంలో లేదా కుటుంబంలో మీరు పెరిగివుంటే అప్పుడేంటి? మీకు పక్షపాతం లేదని అనిపించినప్పటికీ దాని తాలూకు ఛాయలు మీలో ఉండే అవకాశముందా? దేవునికి పక్షపాతం లేదని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పిన పేతురే కొంతకాలం తర్వాత పక్షపాతం చూపించాడు. (గల. 2:11-14) మరి మనం యేసుకు లోబడుతూ, పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకుండా ఉండాలంటే ఏమి చేయవచ్చు?

6. (ఎ) మనలో పక్షపాతాన్ని తీసేసుకోవడానికి ఏమి చేయవచ్చు? (బి) ఒక సంఘపెద్ద రాసిన రిపోర్ట్‌ని బట్టి ఆయనలో ఏ ఛాయలు ఉన్నాయని అర్థమౌతుంది?

6 మనలో పక్షపాతం తాలూకు ఛాయలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలంటే, బైబిలు సహాయంతో మనల్ని మనం పరిశీలించుకోవాలి. (కీర్త. 119:105) ఒకవేళ అలాంటి ఛాయల్ని మనం గుర్తించలేకపోతే, స్నేహితుని సహాయం కూడా తీసుకోవచ్చు. (గల. 2:11, 14) పక్షపాతం మనలో ఎంతగా పాతుకుపోయి ఉండవచ్చంటే, మనం దాన్ని చూపిస్తున్నామనే సంగతి కూడా మనకు తెలియకపోవచ్చు! ఒక సంఘపెద్ద విషయంలో అదే జరిగింది. ఆయన ఓ సందర్భంలో, ఉత్సాహంగా పూర్తికాల సేవచేస్తున్న ఒక భార్యాభర్త గురించి బ్రాంచి కార్యాలయానికి రిపోర్ట్‌ రాశాడు. ఆ జంటలోని భర్త, చాలామంది చిన్నచూపు చూసే జాతికి చెందిన సహోదరుడు. ఆయన గురించి ఆ సంఘపెద్ద చాలా మంచి విషయాలు చెప్తూ ఇంకా ఇలా రాశాడు: “[ఈ జాతికి] చెందిన చాలామంది మురికిగా, ఇతరులు చిన్నచూపు చూసే జీవన విధానం కలిగివుంటారు. కానీ ఈ సహోదరుని అలవాట్లు, జీవన విధానం చూస్తే [ఆ జాతికి] చెందినవాళ్లందరూ అలా ఉండరని అర్థంచేసుకోవచ్చు.” ఈ సంఘపెద్ద మాటల్లో మీరేమైనా గమనించారా? మనం యెహోవా సంస్థలో ఏ స్థానంలో ఉన్నా, మనలో పక్షపాతం తాలూకు ఛాయలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి, అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వాటితోపాటు మనం ఇంకా ఏమి చేయవచ్చు?

7. మన హృదయాలను విశాలంగా తెరుచుకుంటున్నామని ఎలా చూపిస్తాం?

7 ఒకవేళ మన ‘హృదయాలను విశాలంగా తెరుచుకుంటే,’ మనం పక్షపాతం బదులు ప్రేమను వృద్ధిచేసుకుంటాం. (2 కొరిం. 6:11-13) మీ జాతికి, దేశానికి, తెగకు, లేదా భాషకు చెందినవాళ్లతో మాత్రమే సమయం గడుపుతుంటారా? అలాగైతే, వేరేవాళ్లతో కూడా సమయం గడపడానికి ప్రయత్నించండి. వేర్వేరు నేపథ్యాలకు చెందిన సహోదరసహోదరీలను మీతో కలిసి పరిచర్య చేయడానికి ఆహ్వానించవచ్చు. లేదా వాళ్లను భోజనానికో, సరదాగా సమయం గడపడానికో మీ ఇంటికి పిలవవచ్చు. (అపొ. 16:14, 15) అలాచేస్తే కొంతకాలానికి, మీ హృదయం ప్రేమతో ఎంతగా నిండిపోతుందంటే, ఇక పక్షపాతానికి చోటే ఉండదు. అయితే, “పైకి కనిపించే వాటిని బట్టి” తీర్పు తీర్చగల మరో అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆస్తి-అంతస్తులను బట్టి తీర్పు తీర్చకండి

8. ఒక వ్యక్తికున్న ఆస్తి-అంతస్తులను బట్టి మనం ఆ వ్యక్తితో ఎలా వ్యవహరించే అవకాశముందని లేవీయకాండము 19:15 చెప్తుంది?

8 ఒక వ్యక్తికున్న ఆస్తి-అంతస్తులను బట్టి అతనితో మనం వ్యవహరించే తీరు మారవచ్చు. లేవీయకాండము 19:15 ఇలా చెప్తుంది, “బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.” ఒక వ్యక్తికున్న ఆస్తి-అంతస్తులను బట్టి అతనితో మనం వ్యవహరించే తీరు ఎలా మారవచ్చు?

9. సొలొమోను ఏ చేదు నిజాన్ని రాశాడు? దాన్నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

9 “దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు” అనే చేదు నిజాన్ని రాసేలా పవిత్రశక్తి సొలొమోనును ప్రేరేపించింది. (సామె. 14:20) దీన్నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? మనం జాగ్రత్తగా లేకపోతే, పేద సహోదరులతో కాకుండా ధనవంతులైన సహోదరులతోనే స్నేహం చేసే ప్రమాదం ఉంది. ఒకవ్యక్తి ఆస్తి-అంతస్తును బట్టి అతని గురించి ఒక ముగింపుకు రావడం ఎందుకు ప్రమాదకరం?

10. యాకోబు మొదటి శతాబ్దంలోని కొన్ని సంఘాల్ని దేనిగురించి హెచ్చరించాడు?

10 మనం ధనవంతులైన సహోదరులతో ఒకలా, పేద సహోదరులతో మరోలా ప్రవర్తిస్తే సంఘంలో విభజనలు ఏర్పడవచ్చు. మొదటి శతాబ్దంలోని కొన్ని సంఘాల్లో అలాంటి సమస్యే ఎదురైంది, అందుకే యాకోబు వాళ్లను హెచ్చరించాడు. (యాకోబు 2:1-4 చదవండి.) నేడు మన సంఘంలో అలాంటి విభజనలు ఏర్పడకుండా జాగ్రత్తపడాలి. కాబట్టి, మనం ఇతరుల ఆస్తి-అంతస్తులను బట్టి తీర్పు తీర్చకుండా ఎలా ఉండవచ్చు?

11. ఒక వ్యక్తి దగ్గర వస్తుసంపదలు ఉన్నా, లేకపోయినా అతను యెహోవాతో మంచి సంబంధం కలిగివుండవచ్చని ఎలా చెప్పవచ్చు?

11 మనం మన సహోదరులను యెహోవా చూసినట్టు చూడాలి. ఒక వ్యక్తికున్న ఐశ్వర్యాన్ని బట్టి లేదా పేదరికాన్ని బట్టి యెహోవా అతన్ని విలువైనవాడిగా ఎంచడు. మన దగ్గర వస్తుసంపదలు ఉన్నా, లేకపోయినా యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండవచ్చు. నిజానికి, “ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం కష్టం” అని యేసు ఒక సందర్భంలో చెప్పాడు. కానీ అది అసాధ్యమని ఆయన చెప్పలేదు. (మత్త. 19:23) యేసు మరో విషయం కూడా చెప్పాడు. అదేంటంటే, “పేదవాళ్లయిన మీరు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే దేవుని రాజ్యం మీదే.” (లూకా 6:20) అంటే పేదవాళ్లందరూ యేసు బోధలకు చక్కగా స్పందించి, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుతారని దానర్థం కాదు. యేసు కాలంలో ఆయన్ని అనుసరించని పేదవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాస్తవమేమిటంటే, ఒక వ్యక్తికున్న ఆస్తి-అంతస్తులను బట్టి అతనికి యెహోవాతో మంచి సంబంధం ఉంటుందనిగానీ ఉండదనిగానీ మనం తీర్పు తీర్చలేం.

12. ధనవంతులకు, పేదవాళ్లకు బైబిలు ఏమి చెప్తుంది?

12 యెహోవా ప్రజల్లో ధనవంతులూ ఉన్నారు పేదవాళ్లూ ఉన్నారు. కానీ వాళ్లందరూ నిండు హృదయంతో యెహోవాను ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ధనవంతులు, “నశించిపోయే సిరిసంపదల మీద కాకుండా . . . దేవుని మీద నిరీక్షణ ఉంచాలి” అని లేఖనాలు చెప్తున్నాయి. (1 తిమోతి 6:17-19 చదవండి.) మనం ధనవంతులమైనా, పేదవాళ్లమైనా డబ్బును ప్రేమించడం ప్రమాదకరమని బైబిలు దేవుని ప్రజలందర్నీ హెచ్చరిస్తోంది. (1 తిమో. 6:9, 10) మనం తోటి సహోదరసహోదరీలను యెహోవా చూసినట్టు చూస్తే వాళ్ల ఆస్తి-అంతస్తులను బట్టి వాళ్లకు తీర్పు తీర్చం. మరి వయసు సంగతేంటి? ఇతరుల వయసును బట్టి తీర్పుతీర్చడం సరైనదేనా?

వయసును బట్టి తీర్పు తీర్చకండి

13. వృద్ధుల్ని గౌరవించడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

13 వృద్ధుల్ని గౌరవించాలని బైబిలు చాలాసార్లు చెప్తుంది. లేవీయకాండము 19:32⁠లో ఇలా ఉంది, “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను.” సామెతలు 16:31 ఇలా చెప్తుంది, “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.” వృద్ధుల్ని విమర్శించవద్దని, వాళ్లను తండ్రుల్లా చూడమని పౌలు తిమోతికి చెప్పాడు. (1 తిమో. 5:1, 2) పెద్ద వయసు సహోదరుల మీద తిమోతికి కొంత అధికారం ఉన్నప్పటికీ, ఆయన వాళ్లతో ఎల్లప్పుడూ దయగా, మర్యాదగా వ్యవహరించాలి.

14. పెద్ద వయసువాళ్లను సరిదిద్దాల్సిన పరిస్థితి ఎప్పుడు రావచ్చు?

14 పెద్ద వయసువాళ్లు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే లేదా యెహోవాకు ఇష్టంలేని పనిని ప్రోత్సహిస్తుంటే, అప్పుడేంటి? ఉద్దేశపూర్వకంగా పాపం చేసే వ్యక్తిని యెహోవా క్షమించడు. ఆ వ్యక్తి పెద్ద వయసువాడైనా, అందరి చేత గౌరవించబడేవాడైనా సరే. బైబిలులో ఉన్న ఈ సూత్రాన్ని పరిశీలించండి, ‘పాపం చేసిన వ్యక్తి వందేళ్లవాడైనా సరే శపించబడతాడు.’ (యెషయా 65:20, NW) యెహెజ్కేలుకు వచ్చిన ఒక దర్శనంలో కూడా అలాంటి సూత్రం గురించే చెప్పబడింది. (యెహె. 9:5-7) ‘మహావృద్ధుడైన’ యెహోవాను గౌరవించడమే అన్నిటికన్నా ప్రాముఖ్యం. (దాని. 7:9, 10, 13, 14) మనం యెహోవాను గౌరవించినప్పుడు, తప్పుచేసిన వ్యక్తి ఏ వయసువాడైనా సరే అతన్ని సరిదిద్దడానికి భయపడం.—గల. 6:1.

యౌవన సహోదరుల్ని మీరు గౌరవిస్తారా? (15వ పేరా చూడండి)

15. యౌవన సహోదరులను గౌరవించడం గురించి అపొస్తలుడైన పౌలు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

15 మరి యౌవన సహోదరుని సంగతేంటి? అతన్ని గౌరవించాల్సిన అవసరం లేదా? ఉంది. తిమోతికి పౌలు ఇలా రాశాడు, “నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు. మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పవిత్రత విషయంలో నమ్మకస్థులకు ఆదర్శంగా ఉండు.” (1 తిమో. 4:12) పౌలు ఆ మాటలు రాసే సమయానికి తిమోతికి సుమారు 30 ఏళ్లు ఉండివుంటాయి. అయినా పౌలు తిమోతికి చాలా ప్రాముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు. దీన్నిబట్టి ఏమి అర్థమౌతుంది? యౌవన సహోదరులను వాళ్ల వయసును బట్టి తీర్పు తీర్చకూడదు. యేసు కేవలం 33 ఏళ్లకే ఎన్ని పనులు చేశాడో ఒకసారి ఆలోచించండి.

16, 17. (ఎ) ఒక సహోదరునికి సంఘ పరిచారకుడు లేదా సంఘపెద్ద అయ్యే అర్హత ఉందో లేదో పెద్దలు దేన్నిబట్టి నిర్ణయిస్తారు? (బి) సొంత అభిప్రాయాలు లేదా స్థానిక పద్ధతులు, బైబిలు చెప్తున్నదానికి ఎలా విరుద్ధంగా ఉండవచ్చు?

16 కొన్ని సంస్కృతుల్లో యౌవనులను గౌరవించరు. దానివల్ల కొంతమంది సంఘపెద్దలు, అర్హులైన యౌవన సహోదరుల్ని సంఘ పరిచారకులుగా లేదా పెద్దలుగా సిఫారసు చేయకపోవచ్చు. ఒక సహోదరుడు సంఘ పరిచారకునిగా లేదా పెద్దగా నియమించబడాలంటే అతనికి ఫలానా వయసు ఉండాలని బైబిల్లో ఎక్కడా లేదు. (1 తిమో. 3:1-10, 12, 13; తీతు 1:5-9) ఒకవేళ సంఘపెద్దలు తమ సంస్కృతిని బట్టి వయసు విషయంలో ఏదైనా నియమం పెడితే, వాళ్లు బైబిల్ని పాటించట్లేదని అర్థం. సంఘపెద్దలు తమ సొంత అభిప్రాయాల్ని బట్టి లేదా స్థానిక పద్ధతుల్ని బట్టి యౌవన సహోదరులకు తీర్పు తీర్చకూడదు. బదులుగా బైబిలు ప్రమాణాల్ని పాటించాలి.—2 తిమో. 3:16, 17.

17 సంఘ పరిచారకుల్ని లేదా పెద్దల్ని నియమించే విషయంలో సంఘపెద్దలు బైబిలు ప్రమాణాల్ని పాటించకపోతే, అర్హులైన సహోదరులకు ఆ సేవావకాశాలు దక్కకపోవచ్చు. ఈ ఉదాహరణ పరిశీలించండి. ఒక దేశంలో సంఘ పరిచారకునిగా సేవచేస్తున్న ఒక సహోదరుడు తనకిచ్చిన ప్రాముఖ్యమైన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించేవాడు. సంఘపెద్దగా నియమించబడడానికి కావాల్సిన లేఖన అర్హతల్ని కూడా ఆ సహోదరుడు చేరుకున్నాడని పెద్దలు గమనించారు. కానీ, వాళ్లలో వృద్ధులైన కొంతమంది పెద్దలు మాత్రం అతనికి తగిన వయసు లేదంటూ అతన్ని సిఫారసు చేయలేదు. విచారకరంగా ఆ సహోదరుడు సంఘపెద్ద అవ్వలేదు. దానికి కారణం వాళ్లు అతన్ని చూసిన విధానమే. చాలా దేశాల్లోని పెద్దలు ఇలానే ఆలోచిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. కానీ మన సొంత అభిప్రాయాలపై లేదా స్థానిక పద్ధతులపై కాకుండా బైబిలుపై ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. అప్పుడే మనం యేసుకు లోబడుతూ, పైకి కనిపించేవాటిని బట్టి తీర్పు తీర్చకుండా ఉండగలుగుతాం.

న్యాయంగా తీర్పు తీర్చండి

18, 19. మన సహోదరుల్ని యెహోవా చూసినట్టు చూడడానికి ఏది సహాయం చేస్తుంది?

18 మనం అపరిపూర్ణులం అయినప్పటికీ, యెహోవాలా ఇతరులపట్ల పక్షపాతం చూపించకుండా ఉండడం నేర్చుకోవచ్చు. (అపొ. 10:34, 35) కాబట్టి మనం ఎల్లప్పుడూ బైబిల్లో ఉన్న జ్ఞాపికల మీద మనసుపెట్టాలి. వాటిని పాటించినప్పుడు, “పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి” అనే యేసు ఆజ్ఞకు లోబడినవాళ్లమౌతాం.—యోహా. 7:24.

19 మన రాజైన యేసుక్రీస్తు త్వరలోనే ప్రజలందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయన కనిపించే వాటిని బట్టి లేదా వినిపించేదాన్ని తీర్పు తీర్చడుగానీ దేవుని నీతి ప్రమాణాల ఆధారంగా తీర్పు తీరుస్తాడు. (యెష. 11:3, 4) అద్భుతమైన ఆ సమయం కోసం మనం ఖచ్చితంగా ఎదురుచూస్తాం కదా!