కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఓర్పు—ఆశతో సహించడం

ఓర్పు—ఆశతో సహించడం

ఈ “చివరి రోజుల్లో” జీవితం కష్టంగా తయారౌతోంది కాబట్టి ముందెప్పటికన్నా ఇప్పుడు ఓర్పు చూపించడం చాలా అవసరం. (2 తిమో. 3:1-5) మన చుట్టూ ఉన్న చాలామంది ఓర్పు చూపించట్లేదు. వాళ్లు స్వార్థపరులు, మొండివాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు. కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘నా చుట్టూ ఉన్న వాళ్లలాగే నేను కూడా అసహనంగా ప్రవర్తిస్తున్నానా? ఓర్పు చూపించడం అంటే ఏమిటి? ఓర్పును నా వ్యక్తిత్వంలో భాగంగా చేసుకోవడానికి నేను ఏమి చేయవచ్చు?’

ఓర్పు అంటే ఏమిటి?

బైబిల్లో ఉపయోగించిన “ఓర్పు” అనే పదానికి అర్థం ఏమిటి? ఓర్పు అంటే కేవలం కష్టాల్ని భరించడం కాదు. ఓర్పు చూపించే వ్యక్తి ఒక సంకల్పంతో, అంటే పరిస్థితులు మంచిగా మారతాయనే ఆశతో ఉంటాడు. ఆయన కేవలం తన గురించే ఆలోచించుకోడు గానీ ఇతరుల భావాల్ని కూడా పట్టించుకుంటాడు. ఆఖరికి వాళ్లు చిరాకు తెప్పించినా లేదా దురుసుగా ప్రవర్తించినా వాళ్ల భావాల్ని పట్టించుకుంటాడు. వాళ్లతో మళ్లీ సత్సంబంధాలు నెలకొంటాయనే ఆశతో ఉంటాడు. ఓర్పు ప్రేమ నుండే పుడుతుందని బైబిలు చెప్తుంది. * (1 కొరిం. 13:4) అంతేకాదు ఓర్పు, ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో’ ఒకటి. (గల. 5:22, 23) కాబట్టి మనం ఓర్పు చూపించాలంటే ఏమి చేయాలి?

ఓర్పును ఎలా అలవర్చుకోవచ్చు?

మనం ఓర్పును అలవర్చుకోవాలంటే పవిత్రశక్తి సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాలి. తన మీద నమ్మకం ఉంచేవాళ్లకు యెహోవా పవిత్రశక్తిని ఇస్తాడు. (లూకా 11:13) అది చాలా శక్తివంతమైనదే అయినప్పటికీ మనం మన ప్రార్థనలకు తగ్గట్టు ప్రవర్తించాలి. (కీర్త. 86:10, 11) అంటే ప్రతీరోజు ఓర్పు చూపించడానికి, ఆ లక్షణాన్ని మన వ్యక్తిత్వంలో భాగంగా చేసుకోవడానికి శతవిధాలా కృషిచేయాలి. కానీ కొన్నిసార్లు ఓర్పు చూపించడంలో మనం తప్పిపోతుంటాం. మరి మనకు ఏది సహాయం చేయగలదు?

మనం యేసు పరిపూర్ణ ఆదర్శాన్ని అధ్యయనం చేయాలి, అనుకరించాలి. ఓర్పు కొత్త వ్యక్తిత్వంలో భాగమని బైబిలు చెప్తుంది. అపొస్తలుడైన పౌలు ‘కొత్త వ్యక్తిత్వం’ గురించి మాట్లాడుతూ ఇలా ప్రోత్సహించాడు, “క్రీస్తు శాంతి మీ హృదయాల్ని అదుపుచేయనివ్వండి.” (కొలొ. 3:10, 12, 15, అధస్సూచి) అలా చేయాలంటే మనం యేసును అనుకరించాలి, దేవుడు సరైన సమయంలో పరిస్థితుల్ని చక్కదిద్దుతాడనే పూర్తి నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకం ఉంటే, మన చుట్టూ ఏమి జరుగుతున్నా ఓర్పు చూపించగలుగుతాం.—యోహా. 14:27; 16:33.

కొత్తలోకం త్వరగా రావాలని మనందరం కోరుకుంటాం. కానీ యెహోవా మన విషయంలో ఎంత ఓర్పు చూపిస్తున్నాడో ఆలోచించినప్పుడు, మనం మరింత ఓర్పు చూపించడం నేర్చుకుంటాం. బైబిలు ఇలా అభయమిస్తుంది, “కొందరు అనుకుంటున్నట్టు యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయడు. కానీ మీ విషయంలో ఆయన ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనం కావడం ఆయనకు ఇష్టంలేదు, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు.” (2 పేతు. 3:9) కాబట్టి యెహోవా మనతో ఎంత ఓపిగ్గా ఉంటున్నాడో ఆలోచించినప్పుడు, మనం ఇతరులతో మరింత ఓపిగ్గా ఉండగలుగుతాం. (రోమా. 2:4) మనం ఓర్పు చూపించాల్సిన కొన్ని పరిస్థితులు ఏమిటి?

ఓర్పు చూపించాల్సిన పరిస్థితులు

మన రోజువారీ జీవితంలో ఓర్పు చూపించాల్సిన ఎన్నో సందర్భాలు ఎదురౌతుంటాయి. ఉదాహరణకు, మన దగ్గర ఒక ముఖ్యమైన విషయం ఉందని మనకు అనిపించినా, ఇతరుల సంభాషణకు అడ్డుతగలకుండా ఉండడానికి ఓర్పు అవసరమౌతుంది. (యాకో. 1:19) ఎవరైనా మనకు చిరాకు తెప్పించినప్పుడు కూడా ఓర్పు అవసరమౌతుంది. వాళ్లపట్ల అసహనం చూపించే బదులు యెహోవా, యేసు మన బలహీనతలకు ఎలా స్పందిస్తున్నారో గుర్తుంచుకోవడం మంచిది. మనం రోజూ ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. కానీ యెహోవా, యేసు ఆ చిన్నచిన్న పొరపాట్లను పట్టించుకోరు గానీ మనలో ఉన్న మంచి లక్షణాల్ని చూసి, మనం మారడానికి ఓర్పుతో సమయం ఇస్తారు.—1 తిమో. 1:16; 1 పేతు. 3:12.

ఎవరైనా మన మాటల్ని లేదా పనుల్ని తప్పుబట్టినప్పుడు కూడా మనకు ఓర్పు అవసరమౌతుంది. బహుశా మనం వెంటనే కోపం తెచ్చుకొని, మనల్ని మనం సమర్థించుకోవడం మొదలుపెట్టవచ్చు. కానీ అలా కాకుండా వేరేలా స్పందించమని బైబిలు చెప్తుంది. “అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” (ప్రసం. 7:8, 9) కాబట్టి మనపై వేసిన నిందలు పూర్తిగా తప్పయినా సరే, మనం ఓర్పు చూపించాలి, స్పందించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇతరులు తన మీద తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు యేసు అలానే స్పందించాడు.—మత్త. 11:19.

పిల్లల ఆలోచనల్ని సరిదిద్దడానికి లేదా తప్పుడు కోరికల్ని తీసేసుకునేలా సహాయం చేయడానికి తల్లిదండ్రులకు ఓర్పు అవసరం. యూరప్‌ బెతెల్‌లో సేవచేస్తున్న సహోదరుడు మాత్తీయాస్‌ అనుభవాన్ని పరిశీలించండి. టీనేజీలో ఉన్నప్పుడు, అతని నమ్మకాల్నిబట్టి తోటి విద్యార్థులు అతన్ని ఎప్పుడూ ఎగతాళి చేసేవాళ్లు. మొదట్లో అతని తల్లిదండ్రులకు ఈ విషయం తెలీదు. కానీ అతను తన నమ్మకాల గురించి సందేహాలు వ్యక్తం చేయడం వాళ్లు గమనించారు. ఆ పరిస్థితిలో తనకు, తన భార్యకు చాలా ఓర్పు అవసరమైందని మాత్తీయాస్‌ వాళ్ల నాన్న ఇల్లీస్‌ చెప్తున్నాడు. మాత్తీయాస్‌ ఆయన్ని ఇలా అడిగేవాడు, “దేవుడు ఎవరు? బైబిలు ఒకవేళ దేవుడు రాసింది కాకపోతే? మనం ఫలానా పని చేయకూడదని లేదా చేయాలని నిజంగా దేవుడే చెప్పాడా? నాకు మీలాంటి ఆలోచనలు, నమ్మకాలు లేకపోతే నన్ను ఎందుకు తప్పుబడతారు?”

ఇల్లీస్‌ ఇలా చెప్తున్నాడు, “మా అబ్బాయి కొన్నిసార్లు కోపంగా ప్రశ్నలు అడిగేవాడు. ఆ కోపం నా మీదో వాళ్ల అమ్మ మీదో కాదు, సత్యం మీద. ఎందుకంటే సత్యం వల్ల తన జీవితం కష్టంగా మారిందని అతను అనుకున్నాడు.” మరి ఇల్లీస్‌ తన కొడుకుకు ఎలా సహాయం చేశాడు? “నేనూ, మా అబ్బాయి కూర్చొని గంటలు తరబడి మాట్లాడుకునేవాళ్లం” అని ఇల్లీస్‌ చెప్తున్నాడు. ఇల్లీస్‌ తన కొడుకు చెప్పేదంతా వింటూ అతని భావాల్ని, అభిప్రాయాల్ని రాబట్టడానికి ప్రశ్నలు అడిగేవాడు. కొన్నిసార్లు ఒక విషయాన్ని వివరించి, దానిగురించి ఒకట్రెండు రోజుల తర్వాత మళ్లీ మాట్లాడదామని, ఈలోపు దానిగురించి ఆలోచించమని తన కొడుకుకు చెప్పేవాడు. ఇంకొన్నిసార్లు, తన కొడుకు అడిగిన వాటిగురించి ఆలోచించడానికి ఇల్లీస్‌యే కొన్నిరోజులు సమయం అడిగేవాడు. ఇలా క్రమంగా మాట్లాడుకోవడంవల్ల ఆ అబ్బాయి విమోచనా క్రయధనాన్ని, యెహోవా ప్రేమను, దేవుని సర్వాధిపత్యపు హక్కును అర్థంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఇల్లీస్‌ ఇలా చెప్తున్నాడు, “దానికి సమయం పట్టింది, కష్టంగా కూడా అనిపించింది. కానీ మెల్లమెల్లగా అతని హృదయంలో యెహోవా మీద ప్రేమ చిగురించింది. మా అబ్బాయి టీనేజీలో ఉన్నప్పుడు మేము ఓర్పుతో చేసిన సహాయానికి మంచి ఫలితాలు వచ్చాయి. ఆ విషయంలో నేనూ, నా భార్య చాలా సంతోషిస్తున్నాం.”

ఇల్లీస్‌, ఆయన భార్య వాళ్ల కొడుకుకు ఓపిగ్గా సహాయం చేస్తున్నప్పుడు యెహోవాపై నమ్మకం ఉంచారు. ఇల్లీస్‌ ఇలా చెప్తున్నాడు, “విషయాలు తనకు అర్థమయ్యేలా సహాయం చేయమని మేము యెహోవాకు పట్టుదలగా ప్రార్థించామనీ, తన మీదున్న ప్రేమను బట్టే అలా చేశామనీ తరచూ మా అబ్బాయికి చెప్పేవాణ్ణి.” వాళ్లు ఆశ వదులుకోకుండా ఓర్పు చూపించినందుకు చాలా సంతోషంగా ఉన్నారు!

ఏదైనా దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యుల్ని లేదా స్నేహితుల్ని చూసుకోవాలంటే కూడా మనకు ఓర్పు అవసరం. యూరప్‌లో ఉండే ఎలీసా * అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి.

దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం, ఆమె భర్తకు రెండుసార్లు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి, మెదడు దెబ్బతింది. దానివల్ల అతనికి సంతోషం, దుఃఖం, జాలి వంటి భావోద్వేగాలు ఏవీ కలుగవు. ఎలీసాకు ఆ పరిస్థితి తట్టుకోవడం చాలా కష్టమైంది. ఆమె ఇలా చెప్తుంది, “నాకు చాలా ఓర్పు అవసరమైంది, ఎన్నోసార్లు ప్రార్థించాను. నాకు ఊరటనిచ్చే, నాకిష్టమైన లేఖనం ఫిలిప్పీయులు 4:13. అక్కడిలా ఉంది: ‘ఎందుకంటే, నాలో శక్తిని నింపే దేవుని వల్ల దేన్నైనా ఎదుర్కొనే బలం నాకుంది.’” యెహోవా ఇస్తున్న శక్తి, సహాయం వల్ల ఎలీసా ఆ పరిస్థితిని ఓపిగ్గా సహిస్తుంది.—కీర్త. 62:5, 6.

యెహోవాలా ఓర్పు చూపించండి

నిజానికి ఓర్పు చూపించడంలో యెహోవాయే అత్యుత్తమ ఆదర్శం. (2 పేతు. 3:15) బైబిల్లో ఆయన చూపించిన గొప్ప ఓర్పు గురించి చదువుతుంటాం. (నెహె. 9:30; యెష. 30:18) సొదొమ నగరాన్ని నాశనం చేసే విషయంలో, అబ్రాహాము అడిగిన చాలా ప్రశ్నలకు యెహోవా ఎలా జవాబిచ్చాడో గుర్తుచేసుకోండి. అబ్రాహాము మాట్లాడుతున్నప్పుడు యెహోవా మధ్యలో కలుగజేసుకోలేదు. బదులుగా అతను తనకున్న ప్రశ్నల్ని, చింతల్ని చెప్తున్నప్పుడు ప్రతీఒక్కదాన్ని యెహోవా ఓపిగ్గా విన్నాడు. తర్వాత వాటిని మళ్లీ ప్రస్తావించడం ద్వారా అబ్రాహాము చెప్పినవన్నీ తాను విన్నానని చూపిస్తూ, సొదొమ నగరంలో ఒకవేళ పదిమంది నీతిమంతులు ఉన్నా దాన్ని నాశనం చేయనని యెహోవా అభయమిచ్చాడు. (ఆది. 18:22-33) యెహోవా ఓపిగ్గా వింటాడు, ఆయన ఎన్నడూ కోపంగా స్పందించడు!

క్రైస్తవులందరూ అలవర్చుకోవాల్సిన కొత్త వ్యక్తి త్వంలో ఓర్పు చాలా ప్రాముఖ్యమైన భాగం. ఓర్పును అలవర్చుకోవడానికి శతవిధాలా కృషిచేసినప్పుడు శ్రద్ధగల, ఓర్పుగల తండ్రైన యెహోవాను ఘనపరుస్తాం. అంతేకాదు, “వాగ్దానం చేయబడినవాటిని తమ విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా” పొందేవాళ్లలో ఒకరం అవుతాం.—హెబ్రీ. 6:10-12.

^ పేరా 4 పవిత్రశక్తి పుట్టించే లక్షణాల గురించి చర్చించే తొమ్మిది ఆర్టికల్స్‌లో మొట్టమొదటి ఆర్టికల్‌లో ప్రేమ గురించి పరిశీలించాం.

^ పేరా 15 అసలు పేరు కాదు.