కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యాన్ని బోధించండి

సత్యాన్ని బోధించండి

“యెహోవా . . . నీ వాక్య సారాంశము సత్యము.”కీర్త. 119:159, 160.

పాటలు: 29, 53

1, 2. (ఎ) యేసు తన జీవితంలో ఏ పనికి మొదటిస్థానం ఇచ్చాడు? ఎందుకు? (బి) ‘దేవుని తోటి పనివాళ్లమైన’ మనం పరిచర్యను సమర్థవంతంగా చేయడానికి ఏవి సహాయం చేస్తాయి?

యేసుక్రీస్తు వడ్రంగిగా పనిచేశాడు, తర్వాత పరిచారకుడు అయ్యాడు. (మార్కు 6:3; రోమా. 15:8) ఆ రెండు పనుల్లో ఆయన సాటిలేని నైపుణ్యం సంపాదించుకున్నాడు. వడ్రంగిగా పని చేస్తున్నప్పుడు, చెక్కతో వస్తువుల్ని తయారుచేయడానికి తన పనిముట్లను ఎలా ఉపయోగించాలో ఆయన నేర్చుకున్నాడు. పరిచారకుడిగా సేవ చేస్తున్నప్పుడు, దేవుని వాక్యంలోని సత్యాన్ని మామూలు ప్రజలకు అర్థమయ్యేలా బోధించడానికి తనకున్న లోతైన లేఖన జ్ఞానాన్ని ఉపయోగించాడు. (మత్త. 7:28; లూకా 24:32, 45) యేసుకు 30 ఏళ్లు ఉన్నప్పుడు, వడ్రంగి పనిని ఆపేసి పరిచారకుడిగా సేవచేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ప్రకటనా పనే అత్యంత ప్రాముఖ్యమైనదని ఆయనకు తెలుసు. రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడానికి కూడా దేవుడు తనను భూమ్మీదకు పంపించాడని యేసు చెప్పాడు. (మత్త. 20:28; లూకా 3:23; 4:43) ఆయన తన జీవితంలో ప్రకటనా పనికే మొదటిస్థానం ఇచ్చాడు, ఇతరులు కూడా అలాగే చేయాలని కోరుకున్నాడు.—మత్త. 9:35-38.

2 మనలో చాలామందిమి వడ్రంగి పని చేసేవాళ్లం కాదు, కానీ మనందరం మంచివార్త ప్రకటించే పరిచారకులం. ఈ పనిలో మనం దేవునితో కలిసి పనిచేస్తాం కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి, మనం “దేవుని తోటి పనివాళ్లం” అని పిలవబడుతున్నాం. (1 కొరిం. 3:9; 2 కొరిం. 6:4) కీర్తనకర్త చెప్పిన ఈ మాటలతో మనం ఏకీభవిస్తాం, “నీ వాక్య సారాంశము సత్యము.” (కీర్త. 119:159, 160) అవును, యెహోవా వాక్యమే సత్యం. అందుకే, పరిచర్యలో “సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించే” వాళ్లుగా ఉండాలని మనం కోరుకుంటాం. (2 తిమోతి 2:15 చదవండి.) అంతేకాదు బైబిల్ని మరింత నైపుణ్యవంతంగా ఉపయోగించడానికి కృషి చేస్తూ ఉంటాం. ఎందుకంటే యెహోవా గురించి, యేసు గురించి, దేవుని రాజ్యం గురించి ఇతరులకు బోధించడానికి సహాయపడే ముఖ్యమైన పనిముట్టు బైబిలే. మనం పరిచర్యను సమర్థవంతంగా చేయడానికి యెహోవా తన సంస్థ ద్వారా వేరే పనిముట్లు కూడా ఇచ్చాడు. వాటిని కూడా ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోవాలి. వాటినే బోధనా పనిముట్లు అని పిలుస్తాం.

3. పరిచర్యలో మనం దేనిమీద మనసుపెట్టాలి? ఆ విషయంలో అపొస్తలుల కార్యాలు 13:48 ఎలా సహాయం చేస్తుంది?

3 ఆ పనిముట్లను, ‘ప్రకటనా పనిముట్లు’ అని కాకుండా, ‘బోధనా పనిముట్లు’ అని ఎందుకు పిలుస్తున్నాం? “ప్రకటించడం” అంటే ఏదైనా సందేశాన్ని చెప్పడం, కానీ “బోధించడం” అంటే ఏదైనా సందేశాన్ని ఒక వ్యక్తికి అర్థమయ్యేలా వివరించడం. అంతేకాదు ఆ వ్యక్తి, విన్న సందేశాన్ని బట్టి చర్య తీసుకునేలా ప్రోత్సహించబడతాడు. ఈ వ్యవస్థ అతిత్వరలో అంతమౌతుంది కాబట్టి మనకున్న ఈ కొద్ది సమయంలో బైబిలు స్టడీలు చేయడం మీద, ప్రజలకు సత్యాన్ని బోధించడం మీద మనసుపెట్టాలి. అంటే, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్నవాళ్లందరి” కోసం మనం ఉత్సాహంగా వెదకాలి, వాళ్లు యెహోవా సేవకులు అయ్యేలా సహాయం చేయాలి.—అపొస్తలుల కార్యాలు 13:44-48 చదవండి.

4. “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లను ఎలా వెదకవచ్చు?

4 “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లను ఎలా వెదకవచ్చు? అలా వెదకడానికి తొలి క్రైస్తవులకున్న ఏకైక మార్గం ప్రకటనా పని. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, “మీరు ఏదైనా నగరంలో గానీ గ్రామంలో గానీ అడుగుపెట్టినప్పుడు, అందులో ఎవరు మీ సందేశానికి అర్హులో వెదకండి.” (మత్త. 10:11) నేడు మనం కూడా అదే చేయాలి. ఆసక్తి లేనివాళ్లు, గర్విష్ఠులు, దేవుడంటే లెక్కలేని వాళ్లు మంచివార్త వింటారని మనం ఆశించం. కానీ మనం, నిజమైన ఆసక్తి ఉన్నవాళ్ల కోసం, వినయస్థుల కోసం, సత్యం తెలుసుకోవాలని నిజంగా కోరుకునే వాళ్ల కోసం వెదకుతాం. మనం చేసే ఈ పనిని, యేసు చేసిన వడ్రంగి పనితో పోల్చవచ్చు. ఆయన ఏదైనా ఒక వస్తువును అంటే తలుపును, కాడిని, లేదా వేరే దేన్నైనా చేసేముందు సరైన చెక్క కోసం వెదికాడు. ఆ తర్వాత తన పనిముట్లను, నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ ఆ వస్తువులు చేశాడు. అదేవిధంగా మనం కూడా ముందుగా, నిజమైన ఆసక్తి ఉన్నవాళ్ల కోసం వెదకాలి. ఆ తర్వాత మన పనిముట్లను, నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ వాళ్లను శిష్యులుగా చేయాలి.—మత్త. 28:19, 20.

5. మన పనిముట్లు ఎలా ఉపయోగపడతాయో ఉదాహరణతో చెప్పండి. (ప్రారంభ చిత్రాలు చూడండి.)

5 ఒక్కో పనిముట్టు ఒక్కో పనికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, వడ్రంగి పనిలో యేసు ఉపయోగించిన పనిముట్ల గురించి ఆలోచించండి. * చెక్కను కొలవడానికి, గుర్తులుపెట్టడానికి, కోయడానికి, రంధ్రాలు పెట్టడానికి, దాన్ని ఒక ఆకారంలోకి తీసుకురావడానికి, రెండు చెక్క ముక్కల్ని సమానంగా చేసి అతికించడానికి రకరకాల పనిముట్లు అవసరమయ్యాయి. అదేవిధంగా, పరిచర్యలో కూడా ఒక్కో బోధనా పనిముట్టు ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రాముఖ్యమైన ఆ పనిముట్లను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మన గురించి తెలియజేసే పనిముట్లు

6, 7. (ఎ) కాంటాక్ట్‌ కార్డులను మీరెలా ఉపయోగించారు? (బి) సంఘ కూటాల ఆహ్వానపత్రాన్ని ఇవ్వడం వల్ల ఏయే ఉపయోగాలు ఉన్నాయి?

6 కాంటాక్ట్‌ కార్డులు. ఇవి చిన్నవే అయినప్పటికీ ప్రజలకు మన గురించి చెప్పడానికి, వాళ్లకు మన వెబ్‌సైట్‌ని పరిచయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలు మన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు, బైబిలు స్టడీ కోసం రిక్వెస్టు చేసుకోవచ్చు. ఇప్పటివరకు jw.orgలో నాలుగు లక్షలకన్నా ఎక్కువమంది బైబిలు స్టడీ కోసం రిక్వెస్టు పంపారు. ప్రతీరోజు వందల రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి రోజంతటిలో మీరు కలిసేవాళ్లకు ఇవ్వడానికి మీ దగ్గర కొన్ని కాంటాక్ట్‌ కార్డులు పెట్టుకోవచ్చు.

7 ఆహ్వానపత్రాలు. సంఘ కూటాల ఆహ్వానపత్రం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఆహ్వానపత్రంలో ఇలా ఉంది, “మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం! యెహోవాసాక్షులతో కలిసి దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి.” అంతేకాదు “మా కూటాల్లో,” “లేదా ఒక యెహోవాసాక్షితో కలిసి” బైబిలు గురించి నేర్చుకోవచ్చని కూడా ఆ ఆహ్వానపత్రంలో ఉంది. కాబట్టి ఈ ఆహ్వానపత్రం వల్ల ప్రజలు మన గురించి తెలుసుకుంటారు. అంతేకాదు “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించే” ప్రజలు బైబిలు స్టడీ కోసం అడుగుతారు. (మత్త. 5:3) అయితే ప్రజలు బైబిలు స్టడీ తీసుకున్నా, తీసుకోకపోయినా కూటాలకు రావచ్చు. అలా వచ్చినప్పుడు, కూటాల్లో బైబిలు గురించి ఎంత ఎక్కువ నేర్చుకోవచ్చో తెలుసుకుంటారు.

8. ప్రజలు కనీసం ఒక్కసారైనా మన కూటాలకు వస్తే ప్రయోజనం ఏంటి? ఒక అనుభవం చెప్పండి.

8 కనీసం ఒక్కసారైనా మన కూటాలకు రమ్మని ప్రజల్ని పిలుస్తూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే, అబద్ధ మతాలకు భిన్నంగా యెహోవాసాక్షుల కూటాల్లో బైబిల్లోని సత్యాన్ని బోధిస్తారని, దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తారని వాళ్లు గుర్తిస్తారు. (యెష. 65:13) ఉదాహరణకు, అమెరికాలో ఉంటున్న రే, లిండ అనే దంపతుల అనుభవాన్ని పరిశీలించండి. వాళ్లు సత్య మతానికి, అబద్ధ మతానికి ఉన్న తేడాను కొన్ని సంవత్సరాల క్రితం గుర్తించారు. వాళ్లకు దేవుని మీద నమ్మకం, ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలనే కోరిక ఉండేవి. అందుకే, వాళ్లు చర్చిలో సభ్యులుగా చేరేముందు తమ పట్టణంలో ఉన్న అన్ని చర్చీలకు వెళ్లి, ఈ రెండు విషయాలు గమనించాలని అనుకున్నారు: ఒకటి, చర్చిలో ఏదోకటి నేర్చుకోగలగాలి. రెండు, చర్చి సభ్యుల వస్త్రధారణ దేవుని సేవకులకు తగ్గట్టు ఉండాలి. చర్చీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి వెళ్లేసరికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ వాళ్లకు నిరుత్సాహమే ఎదురైంది. ఎందుకంటే వాళ్లు ఏమీ నేర్చుకోలేదు, పైగా చర్చి సభ్యుల బట్టలు కూడా చాలా అమర్యాదగా ఉండేవి. వాళ్ల లిస్టులో ఉన్న చివరి చర్చికి కూడా వెళ్లి చూశాక, లిండ ఉద్యోగానికి వెళ్లిపోయింది, రే ఇంటికి బయల్దేరాడు. దారిలో రేకి ఒక రాజ్యమందిరం కనిపించింది. ‘ఊరికే లోపలికి వెళ్లి చూసి వద్దాం’ అనుకున్నాడు. చివరికి అదే మర్చిపోలేని అనుభవం అయ్యింది! రాజ్యమందిరంలో అందరూ దయగా, స్నేహపూర్వకంగా ఉన్నారు. వాళ్ల వస్త్రధారణ కూడా గౌరవపూర్వకంగా ఉంది. రే ముందు వరుసలో కూర్చున్నాడు. ఆరోజు విన్న విషయాలు అతనికి బాగా నచ్చాయి. రే అనుభవం అపొస్తలుడైన పౌలు మాటల్ని గుర్తుచేస్తుంది. మొదటిసారి కూటాలకు వచ్చిన వ్యక్తి ఇలా అంటాడని పౌలు చెప్పాడు, “దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు.” (1 కొరిం. 14:23-25) రే ఆ తర్వాత నుండి ప్రతీ ఆదివారం కూటాలకు వెళ్లాడు. కొంతకాలానికి, వారం మధ్యలో జరిగే కూటానికి క్రమంగా వెళ్లాడు. లిండ కూడా కూటాలకు వెళ్లడం మొదలుపెట్టింది. వాళ్లకు 70 ఏళ్లు దాటినా బైబిలు స్టడీ తీసుకుని, బాప్తిస్మం పొందారు.

సంభాషణ మొదలుపెట్టడానికి సహాయపడే పనిముట్లు

9, 10. (ఎ) కరపత్రాలు ఉపయోగించడం ఎందుకు తేలిక? (బి) దేవుని రాజ్యం అంటే ఏమిటి? కరపత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చో వివరించండి.

9 కరపత్రాలు. మనకు ఎనిమిది కరపత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం తేలిక, పైగా వాటితో చక్కగా సంభాషణ మొదలుపెట్టవచ్చు. 2013లో ఈ కరపత్రాలను విడుదల చేసినప్పటి నుండి సుమారు 500 కోట్ల కాపీలు ముద్రించబడ్డాయి. ఈ కరపత్రాలన్నీ ఒకే నమూనాలో ఉంటాయి. కాబట్టి మీరు ఒక్క కరపత్రాన్ని ఉపయోగించడం నేర్చుకుంటే, మిగతావాటిని కూడా ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. మరి కరపత్రంతో సంభాషణ ఎలా మొదలుపెట్టవచ్చు?

10 ఉదాహరణకు, దేవుని రాజ్యం అంటే ఏమిటి? కరపత్రాన్నే తీసుకోండి. దాన్నెలా ఉపయోగించవచ్చు? ఇంటివ్యక్తికి ఆ కరపత్రం మీదున్న ప్రశ్న చూపించి, “దేవుని రాజ్యం అంటే ఏంటో మీరెప్పుడైనా ఆలోచించారా?” అని అడగండి. తర్వాత కిందున్న మూడు జవాబుల్లో వాళ్లు దేన్ని ఎంచుకుంటారో అడగండి. వాళ్ల జవాబు సరైనదైనా, కాకపోయినా ఆ కరపత్రం లోపల ఉన్న “పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?” అనే భాగాన్ని చూపించి, అక్కడున్న దానియేలు 2:44, యెషయా 9:6 చదవండి. సంభాషణ ముగింపులో, కరపత్రం చివరి పేజీలోని “ఒక్కసారి ఆలోచించండి . . . ” అనే శీర్షిక కిందున్న, “దేవుని రాజ్యంలో జీవితం ఎలా ఉంటుంది?” అనే ప్రశ్న అడగండి. ఆ విధంగా మీరు రిటన్‌ విజిట్‌కు పునాది వేసుకోవచ్చు. ఈసారి కలిసినప్పుడు, దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురులోని 7వ పాఠాన్ని ఉపయోగించి మాట్లాడవచ్చు. ఎందుకంటే, ఆ బ్రోషురు బైబిలు స్టడీ మొదలుపెట్టడానికి సహాయపడే పనిముట్లలో ఒకటి.

బైబిలు మీద ఆసక్తి పెంచే పనిముట్లు

11. మన పత్రికల్ని దేనికోసం తయారుచేశారు? పత్రికల్ని ఉపయోగించే ముందు మనకు ఏం తెలిసివుండాలి?

11 పత్రికలు. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ప్రచురించబడుతున్న, అనువదించబడుతున్న పత్రికలు కావలికోట, తేజరిల్లు! చాలా దేశాల్లోని ప్రజలు ఈ పత్రికల్ని చదువుతారు కాబట్టి, వాటి కవరు పేజీ మీదున్న అంశాలను అన్ని ప్రాంతాల ప్రజలకు ఆసక్తి కలిగించే విధంగా తయారుచేస్తారు. జీవితంలోని ముఖ్యమైన విషయాలపై మనసుపెట్టేలా ప్రజలకు సహాయం చేయడానికి మనం ఈ పత్రికల్ని ఉపయోగించాలి. అయితే వాటిని ఉపయోగించే ముందు, ఏ పత్రికను ఎవరి కోసం తయారుచేశారో మనకు తెలిసివుండాలి.

12. (ఎ) తేజరిల్లు! పత్రికను ఎవరి కోసం తయారుచేశారు? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? (బి) ఈ పనిముట్టును ఉపయోగించడం వల్ల మీకు ఎలాంటి మంచి అనుభవాలు ఎదురయ్యాయి?

12 తేజరిల్లు! బైబిలు గురించి కొంచెం తెలిసిన వాళ్లకోసం లేదా అస్సలు తెలియని వాళ్లకోసం ఈ పత్రికను తయారుచేశారు. వాళ్లకు క్రైస్తవ బోధలు తెలియకపోవచ్చు, మతంపై నమ్మకం లేకపోవచ్చు, లేదా బైబిలు సలహాలు వాళ్ల జీవితంలో ఉపయోగపడతాయని తెలియకపోవచ్చు. తేజరిల్లు! పత్రిక ముఖ్య ఉద్దేశం, దేవుడు ఉన్నాడని పాఠకులకు నమ్మకం కుదిరేలా చేయడం. (రోమా. 1:20; హెబ్రీ. 11:6) అంతేకాదు, బైబిలు ‘నిజంగా దేవుని వాక్యమనే’ విశ్వాసం పాఠకుల్లో కలిగించడానికి ఈ పత్రిక సహాయం చేస్తుంది. (1 థెస్స. 2:13) 2018లో వచ్చిన మూడు తేజరిల్లు! సంచికల అంశాలు ఇలా ఉన్నాయి: “సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం,” “కుటుంబ విజయానికి 12 సలహాలు,” “మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?

13. (ఎ) కావలికోట సార్వజనిక ప్రతి ముఖ్య ఉద్దేశం ఏంటి? (బి) ఈ పనిముట్టును ఉపయోగించడం వల్ల మీకు ఎదురైన మంచి అనుభవాల్ని చెప్పండి.

13 కావలికోట సార్వజనిక ప్రతి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని మీద, బైబిలు మీద కొంత గౌరవం ఉన్న ప్రజలకు బైబిలు బోధల్ని వివరించడం. అలాంటివాళ్లకు కొంత బైబిలు జ్ఞానం ఉన్నా, బైబిలు బోధల్ని సరిగ్గా అర్థంచేసుకొని ఉండకపోవచ్చు. (రోమా. 10:2; 1 తిమో. 2:3, 4) 2018లో వచ్చిన మూడు కావలికోట సంచికల్లో ఈ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి: “బైబిలు ఈ కాలానికి పనికొస్తుందా?,” “భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?,” “దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడా?

ప్రోత్సహించే పనిముట్లు

14. (ఎ) ‘బోధనా పనిముట్లలో’ ఏ నాలుగు వీడియోలు ఉన్నాయి? (బి) ఈ వీడియోలను చూపించడం వల్ల మీకు ఎలాంటి మంచి అనుభవాలు ఎదురయ్యాయో చెప్పండి.

14 వీడియోలు. యేసు కాలంలో వడ్రంగి దగ్గర చేతి పనిముట్లే ఉండేవి. కానీ ఈరోజుల్లో వడ్రంగులు కరెంటుతో పనిచేసే రంపం, డ్రిల్లింగ్‌ మెషీన్‌, చెక్కను నునుపుగా చేసే మెషీన్‌ వంటి పనిముట్లను కూడా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా, మన దగ్గర ముద్రిత ప్రచురణలతోపాటు ప్రజలకు చూపించడానికి ఎన్నో మంచి వీడియోలు ఉన్నాయి. ఉదాహరణకు, ‘బోధనా పనిముట్లలో’ బైబిలు ఎందుకు చదవాలి?, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?, రాజ్యమందిరం అంటే ఏమిటి?, యెహోవాసాక్షులు—మేము ఎవరం? అనే నాలుగు వీడియోలు ఉన్నాయి. కొన్ని వీడియోలు రెండు నిమిషాల లోపే ఉంటాయి. కాబట్టి ఇంటివ్యక్తులను మొదటిసారి కలిసినప్పుడు చూపించడానికి అవి చక్కగా ఉపయోగపడతాయి. ఎక్కువసేపు ఉండే వీడియోలను రిటన్‌ విజిట్‌లో ఉపయోగించవచ్చు లేదా ఎక్కువ సమయం వెచ్చించగలిగే ఇంటివ్యక్తులకు చూపించవచ్చు. ప్రజలు బైబిలు స్టడీ తీసుకునేలా, మన కూటాలకు వచ్చేలా ఈ వీడియోలు ప్రోత్సహిస్తాయి కాబట్టి ఇవి అద్భుతమైన పనిముట్లని చెప్పవచ్చు.

15. ప్రజలకు తమ సొంత భాషలో వీడియోలు చూపించడంవల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? అనుభవాలు చెప్పండి.

15 ఈ అనుభవం పరిశీలించండి. మన సహోదరి మైక్రోనీసియా నుండి వచ్చిన ఒకామెను కలిసింది. ఆమె మాతృభాష యాపీస్‌. మన సహోదరి ఆమెకు యాపీస్‌ భాషలో ఉన్న బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియో చూపించింది. ఆ వీడియో ప్లే అవ్వడం మొదలవ్వగానే ఆమె ఇలా అంది, “నేను నమ్మలేకపోతున్నాను ఇది మా భాషే! ఇతని యాస చూస్తుంటే మా ద్వీపానికి చెందినవాడే అనిపిస్తుంది. ఇతను మా భాష మాట్లాడుతున్నాడు!” ఆ వీడియో చూసిన తర్వాత, jw.orgలో తన భాషలో ఉన్న ప్రతీదాన్ని చదువుతానని, ప్రతీ వీడియోను చూస్తానని ఆమె మన సహోదరికి చెప్పింది. (అపొస్తలుల కార్యాలు 2:8, 11 పోల్చండి.) మరో అనుభవం పరిశీలించండి. అమెరికాలోని ఒక సహోదరి, వేరే ఖండంలో ఉంటున్న తన మేనల్లుడికి బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియో లింక్‌ని పంపించింది. తన భాషలో ఉన్న ఆ వీడియోని చూశాక అతను ఆమెకు ఒక ఈ-మెయిల్‌ పంపాడు. అందులో ఇలా రాశాడు: “ప్రపంచమంతా ఒక దుష్టుడి చేతిలో ఉందనే విషయం చాలా ఆసక్తిగా అనిపించింది. బైబిలు స్టడీ కోసం రిక్వెస్టు కూడా పెట్టాను.” అతనికి సత్యం అందడం ఒక గొప్ప విషయం, ఎందుకంటే అతను మన పనిని నిషేధించిన దేశంలో ఉంటున్నాడు.

సత్యాన్ని బోధించే పనిముట్లు

16. ఈ బ్రోషుర్ల ఉద్దేశం ఏంటి? (ఎ) దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి. (బి) దేవుడు చెబుతున్న మంచివార్త! (సి) నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు?

16 బ్రోషుర్లు. అంతగా చదువురాని వాళ్లకు, లేదా తమ భాషలో ఏ బైబిలు సాహిత్యంలేని వాళ్లకు మనం సత్యం ఎలా బోధించవచ్చు? అలాంటివాళ్లకు దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి * బ్రోషురు ఉపయోగపడుతుంది. బైబిలు స్టడీ మొదలుపెట్టడానికి ఉపయోగపడే మరో చక్కని పనిముట్టు, దేవుడు చెబుతున్న మంచివార్త! అనే బ్రోషురు. ఈ బ్రోషురు వెనకున్న 14 ప్రశ్నల్ని ఇంటివ్యక్తికి చూపించి, వాటిలో దేనిగురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో అడగవచ్చు. వాళ్లు ఎంచుకున్న పాఠంతో స్టడీ ప్రారంభించవచ్చు. మీరెప్పుడైనా ఈ పద్ధతిని రిటన్‌ విజిట్‌లో ప్రయత్నించారా? మనకు సహాయపడే మూడో పనిముట్టు, నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? అనే బ్రోషురు. బైబిలు విద్యార్థులకు మన సంస్థ గురించి బోధించడానికి ఈ బ్రోషురు సహాయం చేస్తుంది. స్టడీ అయిపోయిన ప్రతీసారి ఈ బ్రోషురులోని సమాచారం చర్చించవచ్చు. ఆ బ్రోషురును ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి 2017, మార్చి మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ చూడండి.

17. (ఎ) బైబిలు స్టడీ కోసం ఉపయోగించే రెండు పుస్తకాల ముఖ్య ఉద్దేశం ఏంటి? (బి) బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా విద్యార్థి ఏం చేయాలి? ఎందుకు?

17 పుస్తకాలు. బ్రోషురు నుండి స్టడీ చేస్తున్నప్పటికీ, ఏ సమయంలోనైనా బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకానికి మారవచ్చు. బైబిల్లోని ప్రాథమిక సత్యాల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఈ పనిముట్టు సహాయం చేస్తుంది. విద్యార్థి ప్రగతి సాధిస్తూ ఆ పుస్తకాన్ని పూర్తిచేస్తే, ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకంతో స్టడీ కొనసాగించవచ్చు. బైబిల్లోని సూత్రాలను ఎలా పాటించాలో విద్యార్థికి నేర్పించడానికి ఈ పనిముట్టు సహాయం చేస్తుంది. విద్యార్థి బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా రెండు పుస్తకాలు పూర్తయ్యేవరకు స్టడీ కొనసాగించాలి. అలా చేయడంవల్ల, విద్యార్థి యెహోవా మీద బలమైన విశ్వాసం కలిగివుంటాడు, చివరివరకు దేవునికి నమ్మకంగా ఉంటాడు.—కొలొస్సయులు 2:6, 7 చదవండి.

18. (ఎ) సత్యాన్ని బోధించేవాళ్లుగా మనం ఏం చేయాలని 1 తిమోతి 4:16 చెప్తుంది? దాని ఫలితమేమిటి? (బి) బోధనా పనిముట్లను ఉపయోగిస్తున్నప్పుడు మన లక్ష్యం ఏమైవుండాలి?

18 యెహోవాసాక్షులుగా, ప్రజలకు “మంచివార్త గురించిన సత్యాన్ని” బోధించాల్సిన బాధ్యత మనకుంది. వాళ్లు ఆ సత్యాన్ని తెలుసుకుంటే శాశ్వత జీవితాన్ని పొందగలుగుతారు. (కొలొ. 1:5; 1 తిమోతి 4:16 చదవండి.) మన బాధ్యతను చక్కగా నిర్వర్తించడానికి బోధనా పనిముట్లు సహాయం చేస్తాయి. (“ బోధనా పనిముట్లు” అనే బాక్సు చూడండి.) కాబట్టి, వాటిని వీలైనంత బాగా ఉపయోగిద్దాం. ఏ పనిముట్టును ఎప్పుడు ఉపయోగించాలో మనమే నిర్ణయించుకోవచ్చు. కానీ కేవలం సాహిత్యాన్ని పంచిపెట్టడం మన లక్ష్యం కాదని గుర్తుంచుకోండి. కాబట్టి, మన సందేశంపట్ల ఆసక్తి చూపించనివాళ్లకు సాహిత్యాన్ని ఇవ్వకూడదు. నిజమైన ఆసక్తి ఉన్నవాళ్లను, వినయస్థులను, సత్యం తెలుసుకోవాలనుకునే వాళ్లను, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లను శిష్యులుగా చేయడమే మన లక్ష్యం.—అపొ. 13:48; మత్త. 28:19, 20.

^ పేరా 5 2010, ఆగస్టు 1 కావలికోట (ఇంగ్లీష్‌) సంచికలోని ‘వడ్రంగి’ అనే ఆర్టికల్‌, ‘వడ్రంగి పనిముట్లు’ అనే బాక్సు చూడండి.

^ పేరా 16 మీరు స్టడీ చేస్తున్న వ్యక్తికి చదువు లేనట్లయితే, దేవుడు చెప్పేది వినండి బ్రోషురు చూడమని చెప్పవచ్చు. ఎందుకంటే దానిలో ఎక్కువగా చిత్రాలే ఉంటాయి.