కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిస్థితులు మారినప్పటికీ మనశ్శాంతిగా ఎలా ఉండవచ్చు?

పరిస్థితులు మారినప్పటికీ మనశ్శాంతిగా ఎలా ఉండవచ్చు?

“నేను నా ప్రాణమును నిమ్మళపరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను.”—కీర్త. 131:2.

పాటలు: 128, 129

1, 2. (ఎ) జీవితంలో ఊహించని మార్పులు జరిగినప్పుడు మనకెలా అనిపిస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) 131వ కీర్తన చెప్తున్నట్లు మనం మనశ్శాంతితో ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

లాయిడ్‌, అలెగ్జాండ్రా దంపతులు 25 కన్నా ఎక్కువ ఏళ్లు బెతెల్‌లో సేవచేశారు. ఆ తర్వాత వాళ్లను పయినీర్లుగా నియమించారు. మొదట్లో వాళ్లు చాలా బాధపడ్డారు. లాయిడ్‌ ఇలా చెప్తున్నాడు, “బెతెల్‌, అందులో నా నియామకమే నా గుర్తింపు అనుకున్నాను. నన్ను తిరిగి పయినీరుగా నియమించడానికి సరైన కారణాలు ఉన్నాయని అనిపించినా వారాలు, నెలలు గడుస్తుండగా నేను ఎందుకూ పనికిరానివాణ్ణనే భావాలు కలిగేవి.” ఈ మార్పు విషయంలో, లాయిడ్‌ ఒక క్షణం సానుకూలంగా ఉండేవాడు, కానీ మరుక్షణమే నిరుత్సాహపడేవాడు.

2 మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఊహించని మార్పులు జరగడం వల్ల ఎంతో ఆందోళన, ఒత్తిడి కలగవచ్చు. (సామె. 12:25) ఆ మార్పులను అంగీకరించడం లేదా వాటికి అలవాటుపడడం మనకు కష్టంగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో, ప్రశాంతంగా ఉండడానికి మనమేమి చేయవచ్చు? (కీర్తన 131:1-3 చదవండి.) గతంలో అలాగే మనకాలంలోని కొంతమంది యెహోవా సేవకులు తమ జీవితంలో ఊహించని మార్పులు జరిగినప్పుడు ఎలా మనశ్శాంతిగా ఉండగలిగారో పరిశీలిద్దాం.

“దేవుని శాంతి” మనకెలా సహాయం చేస్తుంది?

3. యోసేపు జీవితం ఒక్కసారిగా ఎలా మారిపోయింది?

3 యోసేపు ఉదాహరణ పరిశీలించండి. యాకోబుకు తన మిగతా కుమారుల కన్నా యోసేపు అంటే ఎక్కువ ఇష్టం. అందుకే, యోసేపు అన్నలు అతనిపై ఈర్ష్య పెంచుకున్నారు. యోసేపుకు 17 ఏళ్లు ఉన్నప్పుడు, వాళ్లు అతన్ని బానిసగా అమ్మేశారు. (ఆది. 37:2-4, 23-28) ఒక బానిసగా, ఆ తర్వాత ఖైదీగా అతను దాదాపు 13 ఏళ్లపాటు ఐగుప్తులో బాధలుపడ్డాడు. అంతేకాదు, తనను ఎంతగానో ప్రేమించిన తండ్రికి దూరమయ్యాడు. అలాంటి పరిస్థితిలో కూడా అతను నిరాశపడి కోపం పెంచుకోలేదు. అలా ఉండడానికి యోసేపుకు ఏది సహాయం చేసింది?

4. (ఎ) జైల్లో ఉన్నప్పుడు యోసేపు ఏం చేశాడు? (బి) యోసేపు ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

4 యోసేపు జైల్లో ఉన్నప్పుడు, యెహోవా చేస్తున్న సహాయంపై అతను మనసుపెట్టి ఉంటాడు. (ఆది. 39:21; కీర్త. 105:17-19) తన చిన్నతనంలో వచ్చిన ప్రవచనార్థక కలల గురించి కూడా అతను ఆలోచించివుంటాడు. దానివల్ల యెహోవా తనకు తోడుగా ఉన్నాడనే ధైర్యం అతనికి వచ్చివుంటుంది. (ఆది. 37:5-11) అతను క్రమంగా ప్రార్థిస్తూ, తన మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పివుంటాడు. (కీర్త. 145:18) ఎలాంటి పరిస్థితుల్లోనైనా యోసేపుకు ‘తోడుగా ఉంటాననే’ అభయాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా అతని ప్రార్థనలకు జవాబిచ్చాడు.—అపొ. 7:9, 10. *

5. మనం యెహోవా సేవలో పట్టుదలగా కొనసాగేలా “దేవుని శాంతి” ఎలా సహాయం చేస్తుంది?

5 ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా, మనం ‘దేవుని శాంతిని’ కలిగివుండవచ్చు. అది మన “మనసుకు కాపలా ఉంటుంది,” ప్రశాంతతను ఇస్తుంది. (ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.) ఆందోళన, ఒత్తిడి కలిగినప్పుడు “దేవుని శాంతి” మనల్ని బలపర్చి, యెహోవా సేవలో పట్టుదలగా కొనసాగేలా సహాయం చేస్తుంది. ఆ సహాయాన్ని స్వయంగా రుచిచూసిన ఆధునిక కాలంలోని కొంతమంది సహోదరసహోదరీల ఉదాహరణల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మనశ్శాంతిని తిరిగి పొందడానికి యెహోవా సహాయం అడగండి

6, 7. మనశ్శాంతిని తిరిగి పొందడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది? ఉదాహరణ చెప్పండి.

6 తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా తమ నియామకం ముగిసిందని రయాన్‌, జూలియెట్‌ దంపతులకు తెలిసినప్పుడు, వాళ్లు నిరుత్సాహపడ్డారు. రయాన్‌ ఇలా అంటున్నాడు, “ఈ విషయం గురించి మేం వెంటనే ప్రార్థించాం. ఆ సమయంలో మాకు ఆయన మీద ఎంత నమ్మకం ఉందో చూపించడానికి ఒక ప్రత్యేక అవకాశం దొరికింది. మా సంఘంలో కొత్తగా సత్యంలోకి వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు, కాబట్టి విశ్వాసం విషయంలో మేం వాళ్లకు చక్కని ఆదర్శంగా ఉండేలా సహాయం చేయమని యెహోవాను అడిగాం.”

7 యెహోవా వాళ్లకు ఎలా జవాబిచ్చాడు? రయాన్‌ ఇలా చెప్తున్నాడు, “ప్రార్థన చేసుకున్న వెంటనే, మొదట్లో మాకున్న ప్రతికూల భావాలు, ఆందోళనలు పోయాయి. దేవుని శాంతి మా హృదయానికి, మనసుకు కాపలావుంది. సరైన ఆలోచనతో ఉంటే, ముందుముందు కూడా యెహోవా మమ్మల్ని ఉపయోగించుకుంటాడని మేం గ్రహించాం.”

8-10. (ఎ) ప్రశాంతంగా ఉండడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుంది? (బి) యెహోవా సేవ మీదే మనసుపెట్టినప్పుడు ఆయన మనకెలా సహాయం చేస్తాడు?

8 మనం ప్రశాంతంగా ఉండడానికి పవిత్రశక్తి సహాయం చేయగలదు. అంతేకాదు, మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో తెలియజేసే బైబిలు లేఖనాల వైపు మన అవధానం మళ్లేలా పవిత్రశక్తి సహాయం చేయగలదు. (యోహాను 14:26, 27 చదవండి.) దాదాపు 25 ఏళ్లు బెతెల్‌లో సేవచేసిన ఫిలిప్‌, మేరీ దంపతుల ఉదాహరణ పరిశీలించండి. నాలుగు నెలల్లోనే వాళ్లిద్దరి తల్లులు, ఫిలిప్‌ బంధువుల్లో ఒకరు చనిపోయారు. దానికితోడు, మేరీ వాళ్ల నాన్నకు జ్ఞాపకశక్తి బాగా క్షీణించడంతో అతని బాగోగులు చూసుకోవాల్సి వచ్చింది.

9 ఫిలిప్‌ ఇలా చెప్తున్నాడు, “కొంతవరకు నేను తట్టుకోగలుగుతున్నానని అనుకున్నాను. కానీ ఏదో తక్కువైందని అనిపించింది. ఒక కావలికోట అధ్యయన ఆర్టికల్‌లో కొలొస్సయులు 1:11 గురించి చదివాను. నిజమే, నేను సహిస్తున్నాను కానీ పూర్తిగా సహించట్లేదు. నేను ‘ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించాలి.’ అంటే నా పరిస్థితులు బట్టి నాకు సంతోషం కలగదు గానీ, పవిత్రశక్తి నాపై చూపించే ప్రభావం బట్టే నాకు సంతోషం కలుగుతుందని ఆ వచనం నాకు గుర్తుచేసింది.”

10 ఫిలిప్‌, మేరీ యెహోవా సేవ మీదే మనసుపెట్టినందుకు ఎన్నో దీవెనలు పొందారు. బెతెల్‌ విడిచిపెట్టిన కొంతకాలానికే వాళ్లకు మంచి బైబిలు స్టడీలు దొరికాయి. ఆ విద్యార్థులు చక్కని ప్రగతి సాధిస్తూ, వారంలో ఒకటికన్నా ఎక్కువసార్లు స్టడీకి రమ్మని అడిగేవాళ్లు. మేరీ ఇలా అంటోంది, “వాళ్లే మా సంతోషం. అంతేకాదు, పరిస్థితులు చక్కబడతాయని యెహోవా వాళ్ల ద్వారా చెప్తున్నట్లు మాకు అనిపించింది.”

యెహోవా మిమ్మల్ని దీవించే అవకాశం ఇవ్వండి

మన జీవితంలో ఊహించని మార్పులు జరిగినప్పుడు యోసేపును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? (11-13 పేరాలు చూడండి)

11, 12. (ఎ) యెహోవా తనను దీవించేలా యోసేపు ఏం చేశాడు? (బి) యోసేపు ఎలాంటి ప్రతిఫలం పొందాడు?

11 జీవితం ఒక్కసారిగా తలకిందులైనప్పుడు, మనం చాలా ఆందోళనపడి కేవలం సమస్యల గురించే ఆలోచిస్తాం. యోసేపుకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ అతను సమస్యల గురించే ఆలోచిస్తూ కూర్చోలేదు. బదులుగా ఆ పరిస్థితిలో తాను చేయగలిగినదంతా చేశాడు. అతను పోతీఫరు కింద కష్టపడి పనిచేసినట్టే, జైలు అధిపతి ఇచ్చిన ప్రతీ పనిని కూడా కష్టపడి చేశాడు.—ఆది. 39:21-23.

12 ఒకరోజు యోసేపుకు ఇద్దరి ఖైదీలను చూసుకునే పని అప్పగించబడింది. వాళ్లు ఒకప్పుడు ఫరో దగ్గర పనిచేశారు. యోసేపు వాళ్లతో దయగా ఉండేవాడు. కాబట్టి ఆ ఖైదీలు తమ చింతల్ని, ముందురోజు రాత్రి తమను కలవరపెట్టిన కలల్ని యోసేపుతో చెప్పుకున్నారు. (ఆది. 40:5-8) ఆ సంభాషణ వల్లే కొంతకాలానికి జైలు నుండి బయటపడే మార్గం తెరుచుకుంటుందని ఆ సమయంలో యోసేపుకు తెలీదు. రెండు సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి విడుదలై, ఫరో తర్వాతి అధికారిగా నియమించబడ్డాడు.—ఆది. 41:1, 14-16, 39-41.

13. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యెహోవా మనల్ని దీవించాలంటే ఏం చేయాలి?

13 యోసేపులాగే, మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ ఆ సమయంలో మనం ఓపిగ్గా ఉంటూ చేయగలిగినదంతా చేస్తే, యెహోవా మనల్ని దీవిస్తాడు. (కీర్త. 37:5) మనం అయోమయంలో, ఆందోళనలో ఉన్నా నిస్సహాయులుగా ఉండం లేదా ‘నిరాశా నిస్పృహల్లో విడిచిపెట్టబడం.’ (2 కొరిం. 4:8, అధస్సూచి) ముఖ్యంగా, పరిచర్యపై మనసుపెట్టినప్పుడు యెహోవా మనకు తోడుంటాడు.

మీ పరిచర్యపై మనసుపెట్టండి

14-16. తన జీవితంలో మార్పులు వచ్చినప్పటికీ, మంచివార్త ప్రచారకుడైన ఫిలిప్పు పరిచర్యపై ఎలా మనసుపెట్టాడు?

14 మంచివార్త ప్రచారకుడైన ఫిలిప్పు తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా, పరిచర్యపై మనసుపెట్టాడు. ఆయన యెరూషలేములో తన కొత్త నియామకాన్ని ఆనందంగా చేస్తూ ఉన్నాడు. (అపొ. 6:1-6) కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. స్తెఫను * చంపబడ్డాక క్రైస్తవులపై తీవ్రమైన హింస చెలరేగింది. దాంతో క్రైస్తవులు యెరూషలేము నుండి పారిపోయారు. ఫిలిప్పు మంచివార్త అంతగా ప్రకటించబడని సమరయకు వెళ్లిపోయాడు. ఎందుకంటే ఆయన యెహోవా సేవ మీద మనసుపెట్టాలని కోరుకున్నాడు.—మత్త. 10:5; అపొ. 8:1, 5.

15 పవిత్రశక్తి ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్లడానికి ఫిలిప్పు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి, మంచివార్త ప్రకటించబడని ప్రాంతాల్లో సేవచేసేలా యెహోవా ఫిలిప్పును ఉపయోగించుకున్నాడు. చాలామంది యూదులు సమరయుల్ని చిన్నచూపు చూస్తూ, వాళ్లను అసహ్యించుకునేవాళ్లు. కానీ ఫిలిప్పు అలాంటి పక్షపాతం చూపించకుండా వాళ్లకు ఉత్సాహంగా మంచివార్త ప్రకటించాడు. సమరయులు కూడా “గుంపులు గుంపులుగా వచ్చి ఫిలిప్పు మాటల్ని మనసుపెట్టి విన్నారు.”—అపొ. 8:6-8.

16 ఫిలిప్పు ఆ తర్వాత అష్డోదుకు, కైసరయకు వెళ్లి ప్రకటించేలా పవిత్రశక్తి నడిపించింది. ఆ నగరాల్లో చాలామంది అన్యులు ఉండేవాళ్లు. (అపొ. 8:39, 40) ఆయన అక్కడే స్థిరపడ్డాడు, ఆయనకు ఒక కుటుంబం కూడా ఏర్పడింది కాబట్టి అది ఆయన జీవితంలో మరో మార్పు. అయినప్పటికీ, ఫిలిప్పు పరిచర్యలో ఉత్సాహంగా కొనసాగాడు. యెహోవా కూడా ఆయన్ని, ఆయన కుటుంబాన్ని దీవిస్తూ వచ్చాడు.—అపొ. 21:8, 9.

17, 18. మన జీవితంలో మార్పులు జరిగినప్పటికీ, పరిచర్యపై మనసుపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

17 పూర్తికాల సేవలో ఉన్న చాలామంది, తమ పరిస్థితులు మారినప్పటికీ పరిచర్యపై మనసుపెట్టడం వల్ల సంతోషంగా, సానుకూలంగా ఉండగలుగుతున్నామని చెప్తున్నారు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన అజ్‌బోన్‌, పొలైట్‌ దంపతుల ఉదాహరణ పరిశీలించండి. వాళ్లు బెతెల్‌ నుండి వచ్చేశాక పార్ట్‌టైమ్‌ ఉద్యోగం, ఇల్లు త్వరగా దొరుకుతాయని అనుకున్నారు. కానీ, “మేం అనుకున్నంత త్వరగా ఉద్యోగం దొరకలేదు” అని అజ్‌బోన్‌ చెప్తున్నాడు. “మూడు నెలల వరకు మాకు ఉద్యోగం దొరకలేదు, దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. అది నిజంగా ఒక సవాలే” అని పొలైట్‌ చెప్తుంది.

18 అలాంటి ఒత్తిడిలో అజ్‌బోన్‌, పొలైట్‌లకు ఏది సహాయం చేసింది? అజ్‌బోన్‌ ఇలా చెప్తున్నాడు, “సంఘంతో కలిసి పరిచర్య చేయడం వల్ల వేరేవాటి మీద దృష్టి పెట్టకుండా సానుకూలంగా ఉండగలిగాం.” ఇంట్లో కూర్చొని ఆందోళనపడుతూ ఉండే బదులు పరిచర్యలో బిజీగా ఉండాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. అలా చేయడంవల్ల వాళ్లు ఎంతో సంతోషాన్ని పొందారు. అజ్‌బోన్‌ ఇలా అంటున్నాడు, “మేం అన్నిచోట్ల ఉద్యోగాల కోసం వెదికాం. చివరికి మాకు ఉద్యోగం దొరికింది.”

యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచండి

19-21. (ఎ) ప్రశాంతంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది? (బి) ఊహించని మార్పులకు అలవాటుపడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

19 ఇప్పటివరకు పరిశీలించిన దాన్నిబట్టి, మన పరిస్థితులు ఎలా ఉన్నా, చేయగలిగినదంతా చేస్తూ యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచితే ప్రశాంతంగా ఉండగలుగుతాం. (మీకా 7:7 చదవండి.) అంతేకాదు, కొత్త పరిస్థితులకు అలవాటుపడడం వల్ల యెహోవాతో మన స్నేహం బలపడుతుందని గుర్తిస్తాం. కష్ట పరిస్థితుల్లో యెహోవాపై ఆధారపడడం అంటే ఏంటో బెతెల్‌ నుండి వచ్చేశాక బాగా అర్థమైందని పొలైట్‌ వివరించింది. “యెహోవాతో నా స్నేహం మరింత బలపడింది” అని ఆమె చెప్తుంది.

20 పై పేరాల్లో ప్రస్తావించబడిన మేరీ, వయసుపైబడిన తన తండ్రి బాగోగుల్ని చూసుకుంటూనే పయినీరు సేవచేస్తోంది. ఆమె ఇలా చెప్తుంది, “ఆందోళనగా అనిపించినప్పుడు కాస్త ఆగి, ప్రార్థన చేసుకొని, నిశ్చింతగా ఉండాలని నేను తెలుసుకున్నాను. నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ఏ విషయాన్నైనా యెహోవాకు వదిలేయాలి, భవిష్యత్తులో కూడా అలాగే చేయాలి.”

21 తమ జీవితంలో జరిగిన మార్పులు ఊహించని విధాలుగా తమ విశ్వాసాన్ని పరీక్షించాయని లాయిడ్‌, అలెగ్జాండ్రా చెప్తున్నారు. కానీ ఆ పరీక్షలవల్ల వాళ్లు ఎంతో ప్రయోజనం పొందారని గ్రహించారు. కాబట్టి సమస్యలు వచ్చినా, తమ బలమైన విశ్వాసంవల్ల ఓదార్పు పొందగలరని వాళ్లకు తెలుసు. అంతేకాదు, వాళ్లు దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఊహించని మార్పులు ఊహించని దీవెనలు తెస్తాయి (19-21 పేరాలు చూడండి)

22. పరిస్థితులు ఎలా ఉన్నా మనం చేయగలిగినదంతా చేస్తే ఏ నమ్మకంతో ఉండవచ్చు?

22 నేడు మన జీవితాల్లో ఊహించని మార్పులు జరగవచ్చు. యెహోవా సేవలో మన నియామకం మారవచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, కొత్త కుటుంబ బాధ్యతలు రావచ్చు. కానీ ఏం జరిగినా, యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటాడని, సరైన సమయంలో మీకు సహాయం చేస్తాడని నమ్మండి. (హెబ్రీ. 4:16; 1 పేతు. 5:6, 7) అప్పటి వరకు మీరు చేయగలిగినదంతా చేయండి. మీ పరలోక తండ్రైన యెహోవాకు ప్రార్థిస్తూ ఆయనపై పూర్తిగా ఆధారపడడం నేర్చుకోండి. అలా చేసినప్పుడు, మీ పరిస్థితులు ఎలా ఉన్నా మనశ్శాంతిగా ఉంటారు.

^ పేరా 4 కొన్ని సంవత్సరాల తర్వాత, యోసేపు తనకు పుట్టిన మొదటి బిడ్డకు మనష్షే అని పేరుపెట్టాడు. దానికిగల కారణాన్ని అతను ఇలా చెప్పాడు: “దేవుడు నా సమస్త బాధను . . . మరచిపోవునట్లు చేసెను.” యెహోవా తనను ఓదార్చడానికి ఆ బిడ్డని బహుమానంగా ఇచ్చాడని యోసేపు అర్థంచేసుకున్నాడు.—ఆది. 41:51, అధస్సూచి.

^ పేరా 14 ఈ సంచికలోని “మీకు తెలుసా?” అనే ఆర్టికల్‌ చూడండి.