కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మీద నమ్మకం ఉంచి, జీవించండి!

యెహోవా మీద నమ్మకం ఉంచి, జీవించండి!

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.”సామె. 3:5.

పాటలు: 3, 8

1. మనందరికీ ఓదార్పు ఎందుకు అవసరం?

మనందరికీ ఓదార్పు అవసరం. బహుశా మన జీవితం చింతలతో, నిరాశానిస్పృహలతో, ఆందోళనలతో నిండివుండవచ్చు. అనారోగ్యంవల్ల, వయసు పైబడడంవల్ల, లేదా ఇష్టమైనవాళ్లు చనిపోవడంవల్ల మనం బాధపడుతుండవచ్చు. మనలో కొంతమందిమి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం. వీటికితోడు, మన చుట్టూ ఉన్న ప్రజలు రోజురోజుకూ క్రూరంగా తయారౌతున్నారు. ఈ ‘ప్రమాదకరమైన కాలాలను’ చూస్తుంటే, మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామనీ, కొత్త లోకానికి చాలా దగ్గర్లో ఉన్నామనీ స్పష్టమౌతుంది. (2 తిమో. 3:1) అయితే, మనం యెహోవా వాగ్దానాలు నెరవేరే రోజు కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తుండవచ్చు, మన కష్టాలు అంతకంతకూ ఎక్కువౌతుండవచ్చు. మరి మనకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది?

2, 3. (ఎ) హబక్కూకు గురించి మనకు ఏం తెలుసు? (బి) ఆ పుస్తకం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

2 ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి, మనం హబక్కూకు పుస్తకాన్ని పరిశీలిద్దాం. హబక్కూకు జీవితం గురించి ఎక్కువ వివరాలు బైబిల్లో లేనప్పటికీ, ఆ పుస్తకం మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. హబక్కూకు అనే పేరుకు, “ఆప్యాయంగా హత్తుకోవడం” అనే అర్థం ఉండవచ్చు. యెహోవా మనల్ని ఆప్యాయంగా హత్తుకొని ఓదార్చడాన్ని అది సూచించవచ్చు. లేదా ఒక పిల్లవాడు తన తండ్రిని గట్టిగా పట్టుకున్నట్లు, తన ఆరాధకులు యెహోవాను గట్టిగా పట్టుకోవడాన్ని అది సూచించవచ్చు. హబక్కూకు యెహోవాతో మాట్లాడి, కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ సంభాషణను రాసేలా యెహోవా హబక్కూకును ప్రేరేపించాడు. ఎందుకంటే, మనం దాన్నుండి ప్రయోజనం పొందుతామని ఆయనకు తెలుసు.—హబ. 2:2.

3 కృంగుదలలో ఉన్న ఆ ప్రవక్తకు, యెహోవాకు మధ్య జరిగిన సంభాషణ తప్ప హబక్కూకు గురించిన వేరే వివరాలు బైబిల్లో లేవు. కానీ “పూర్వం రాయబడిన” వాటిలో హబక్కూకు పుస్తకం కూడా ఒకటి. అవన్నీ “మనకు బోధించడానికే రాయబడ్డాయి. మన సహనం ద్వారా, లేఖనాల నుండి దొరికే ఊరట ద్వారా మనం నిరీక్షణ కలిగివుండేందుకు అవి రాయబడ్డాయి.” (రోమా. 15:4) ఆ పుస్తకం నుండి మనలో ప్రతీఒక్కరం ఎలా ప్రయోజనం పొందవచ్చు? ఆ పుస్తకం ద్వారా యెహోవా మీద నమ్మకం ఉంచడమంటే ఏంటో తెలుసుకుంటాం. అలాగే మనకు ఎలాంటి సమస్యలు, కష్టాలు వచ్చినా మనశ్శాంతిగా ఉండవచ్చనే అభయం పొందుతాం.

యెహోవాకు ప్రార్థించండి

4. హబక్కూకు ఎందుకు చాలా బాధపడ్డాడు?

4 హబక్కూకు 1:2, 3 చదవండి. హబక్కూకు చాలా కష్టమైన కాలంలో జీవించాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు చెడుగా, దౌర్జన్యంగా ప్రవర్తించడం చూసి అతను చాలా బాధపడ్డాడు. ఇశ్రాయేలీయులు ఒకరితో ఒకరు క్రూరంగా, అన్యాయంగా ప్రవర్తించేవాళ్లు. అందుకే, ‘ఈ చెడుతనం ఎప్పుడు అంతమౌతుంది? యెహోవా ఎందుకు ఇంకా చర్య తీసుకోవట్లేదు?’ అని హబక్కూకు అనుకొనివుంటాడు. అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి యెహోవాను చర్య తీసుకోమని వేడుకున్నాడు. బహుశా, యెహోవా తన ప్రజల్ని పట్టించుకోవడం మానేశాడని లేదా ఆయన చర్య తీసుకోడని హబక్కూకు అనుకొనివుండవచ్చు. మరి మీకెప్పుడైనా అలా అనిపించిందా?

5. హబక్కూకు పుస్తకం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 హబక్కూకు ఆ ప్రశ్నలు అడిగాడంటే యెహోవా మీద, ఆయన వాగ్దానాల మీద నమ్మకం కోల్పోయాడనా? కాదు! అతను తన సందేహాల్ని, సమస్యల్ని తీర్చమని యెహోవాను అడిగాడు. కాబట్టి అతను ఆశ వదులుకోలేదని, యెహోవా మీద నమ్మకం ఉంచాడని అర్థమౌతుంది. అతనికి ఒకపక్క ఆందోళనగా, మరోపక్క అయోమయంగా ఉంది. యెహోవా ఎందుకు త్వరగా చర్య తీసుకోవడం లేదో, తన బాధను ఎందుకు అనుమతిస్తున్నాడో అతనికి అర్థంకాలేదు. హబక్కూకు తన ఆందోళనల గురించి రాసేలా యెహోవా ప్రేరేపించాడు. దాన్నుండి మనం ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, మనకున్న ఆందోళనల్ని లేదా సందేహాల్ని యెహోవాకు చెప్పుకోవడానికి భయపడకూడదు. నిజానికి, ప్రార్థనలో మన హృదయాన్ని కుమ్మరించమని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. (కీర్త. 50:15; 62:8) సామెతలు 3:5 ఇలా ప్రోత్సహిస్తుంది, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” హబక్కూకు ఆ మాటల్ని పాటించాడు.

6. ప్రార్థన చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

6 హబక్కూకు, తన స్నేహితుడూ తండ్రీ అయిన యెహోవా మీద నమ్మకం ఉంచి, ఆయనకు దగ్గరవ్వడానికి చొరవ తీసుకున్నాడు. అతను ఆందోళనపడుతూ తన పరిస్థితిని తానే చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా తన ఆందోళనల్ని, భావాల్ని ప్రార్థనలో యెహోవాకు చెప్పుకోవడం ద్వారా హబక్కూకు మనకు ఆదర్శంగా నిలిచాడు. ప్రార్థన ఆలకించే యెహోవా, మన ఆందోళనల్ని తనకు చెప్పుకోమని ఆహ్వానిస్తున్నాడు. మనకు తనమీద నమ్మకం ఉందని చూపించడానికి అదొక మార్గమని ఆయన చెప్తున్నాడు. (కీర్త. 65:2) మనమలా చేస్తే, యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో చూడగలుగుతాం. అంతేకాదు ఆయన ఓదార్పును, నడిపింపును ఇచ్చినప్పుడు మనల్ని ఆప్యాయంగా హత్తుకున్నట్లు అనిపిస్తుంది. (కీర్త. 73:23, 24) మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా, మన పరిస్థితిని ఆయన ఎలా దృష్టిస్తున్నాడో అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాడు. కాబట్టి, మనకు ఆయన మీద నమ్మకం ఉందని చూపించగల ఒక శ్రేష్ఠమైన మార్గం, ప్రార్థన చేయడం.

యెహోవా చెప్పేది వినండి

7. హబక్కూకు తన ఆందోళనల్ని చెప్పినప్పుడు యెహోవా ఎలా స్పందించాడు?

7 హబక్కూకు 1:5-7 చదవండి. తన ఆందోళనల్ని యెహోవాకు చెప్పుకున్న తర్వాత, ఆయన ఎలా స్పందిస్తాడోనని హబక్కూకు ఆలోచించివుంటాడు. ఒక ప్రేమగల తండ్రిలా యెహోవా హబక్కూకు భావాల్ని అర్థంచేసుకున్నాడు. అతను బాధపడుతున్నాడనీ, సహాయం కోసం వేడుకుంటున్నాడనీ యెహోవాకు తెలుసు. అందుకే అతన్ని తిట్టకుండా, అవిశ్వాసులైన యూదులకు జరగబోయే దానిగురించి చెప్పాడు. నిజానికి, వాళ్లు అతిత్వరలో పొందబోయే శిక్ష గురించి యెహోవా మొట్టమొదట చెప్పింది హబక్కూకు ప్రవక్తకే.

8. యెహోవా ఇచ్చిన జవాబు విని హబక్కూకు ఎందుకు ఆశ్చర్యపోయాడు?

8 చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని యెహోవా హబక్కూకుతో చెప్పాడు. చెడుగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న యూదుల్ని శిక్షిస్తానని ఆయన చెప్పాడు. అది “మీ దినములలో” జరుగుతుందని చెప్పడం ద్వారా హబక్కూకు లేదా తన చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులు బ్రతికుండగానే ఆ తీర్పు వస్తుందని యెహోవా తెలియజేశాడు. అయితే, యెహోవా ఇచ్చిన జవాబు విని హబక్కూకు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కల్దీయులు అంటే బబులోనీయులు చాలా క్రూరులు, ఇశ్రాయేలీయులకన్నా ఎక్కువ దౌర్జన్యం చేసేవాళ్లు. ఇశ్రాయేలీయులకైతే కనీసం యెహోవా ప్రమాణాలు తెలుసు, కానీ వీళ్లకు తెలీదు. మరి అలాంటి క్రూరులైన అన్యుల్ని ఉపయోగించుకొని యెహోవా తన ప్రజల్ని ఎందుకు శిక్షించాలనుకున్నాడు? అదే జరిగితే యూదులు ఎక్కువ బాధను అనుభవిస్తారు. ఒకవేళ మీరే హబక్కూకు స్థానంలో ఉంటే ఎలా స్పందించేవాళ్లు?

9. హబక్కూకు అడిగిన మరికొన్ని ప్రశ్నలు ఏంటి?

9 హబక్కూకు 1:12-14, 17 చదవండి. తన చుట్టూ ఉన్న చెడ్డ ప్రజల్ని శిక్షించడానికి యెహోవా బబులోనీయుల్ని ఉపయోగించుకుంటాడని ఆ ప్రవక్తకు అర్థమైనా, ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. కానీ, అతను వినయం చూపిస్తూ యెహోవా మీద నమ్మకాన్ని కోల్పోకూడదని నిశ్చయించుకున్నాడు. నిజానికి, యెహోవా ఎల్లప్పుడూ తనకు “ఆశ్రయదుర్గముగా” ఉంటాడని హబక్కూకు నమ్మాడు. (ద్వితీ. 32:4; యెష. 26:4) దేవుడు ప్రేమగలవాడు, దయగలవాడు కాబట్టి అతను ధైర్యం చేసి ఇలాంటి మరికొన్ని ప్రశ్నలు అడిగాడు: యూదాలో పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారయ్యేలా, తన ప్రజలు ఎక్కువ బాధలుపడేలా యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడు? ఆయన వెంటనే ఎందుకు చర్య తీసుకోవట్లేదు? సర్వశక్తిమంతుడు మౌనంగా ఉంటూ చెడుతనాన్ని ఎందుకు సహిస్తున్నాడు? యెహోవా ‘పరిశుద్ధుడు,’ ఆయన “కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది.” అలాంటి దేవుడు ఇవన్నీ జరగడానికి ఎందుకు అనుమతిస్తాడు?

10. కొన్నిసార్లు మనకు హబక్కూకులా ఎందుకు అనిపించవచ్చు?

10 కొన్నిసార్లు మనకు కూడా హబక్కూకులాగే అనిపించవచ్చు. నిజానికి, మనం యెహోవా చెప్పేది వింటాం, ఆయన మీద నమ్మకం ఉంచుతాం, బైబిల్ని అధ్యయనం చేస్తాం, మన నిరీక్షణను బలపర్చుకుంటాం. సంస్థ బోధిస్తున్న వాటి ద్వారా యెహోవా వాగ్దానాల్ని తెలుసుకుంటాం. అయినప్పటికీ, ‘మన బాధలు ఎప్పుడు పోతాయి?’ అని మనం అనుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో హబక్కూకు ఏం చేశాడో, దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.

యెహోవా చర్య తీసుకునే వరకు ఎదురుచూడండి

11. హబక్కూకు ఏం చేయాలని నిశ్చయించుకున్నాడు?

11 హబక్కూకు 2:1 చదవండి. యెహోవాతో మాట్లాడిన తర్వాత హబక్కూకు మనసు కుదుటపడింది. అందుకే యెహోవా చర్య తీసుకునే వరకు ఓపిగ్గా ఎదురుచూడాలని నిశ్చయించుకొని, అతనిలా అన్నాడు ‘నేను, వేదన కలిగించే ఆ రోజు కోసం మౌనంగా ఎదురుచూస్తాను.’ (హబ. 3:16, NW) నమ్మకమైన ఇతర దేవుని సేవకులు కూడా యెహోవా చర్య తీసుకునే వరకు ఓపిగ్గా ఎదురుచూశారు. కాబట్టి మనం కూడా యెహోవా చర్య తీసుకునే వరకు ఎదురుచూడాలని వాళ్లందరి నుండి ప్రోత్సాహం పొందుతాం.—మీకా 7:7; యాకో. 5:7, 8.

12. హబక్కూకు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

12 హబక్కూకు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిగా, మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా యెహోవాకు ప్రార్థించడం ఎన్నడూ మానకూడదు. రెండవదిగా బైబిలు ద్వారా, సంస్థ ద్వారా ఆయన చెప్తున్న విషయాల్ని వినాలి. మూడవదిగా, యెహోవా చర్య తీసుకునే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తూ, ఆయన అనుకున్న సమయంలో మన బాధల్ని తీసేస్తాడనే నమ్మకంతో ఉండాలి. మనం హబక్కూకును అనుకరిస్తే మనశ్శాంతిగా ఉంటాం, బాధల్ని సహిస్తాం. మన నిరీక్షణ వల్ల, సమస్యల్లో కూడా ఓపిగ్గా, సంతోషంగా ఉండగలుగుతాం. మన పరలోక తండ్రి చర్య తీసుకుంటాడనే నమ్మకం మనకుంది!—రోమా. 12:12.

13. యెహోవా హబక్కూకును ఎలా ఓదార్చాడు?

13 హబక్కూకు 2:3 చదవండి. ఓపిగ్గా ఎదురుచూడాలని హబక్కూకు నిశ్చయించుకున్నందుకు యెహోవా సంతోషించాడు. హబక్కూకు దేనిగురించి బాధపడుతున్నాడో సర్వశక్తిమంతునికి తెలుసు. అందుకే యెహోవా అతన్ని ప్రేమగా ఓదారుస్తూ, అతని ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుందని, త్వరలోనే అతని ఆందోళనలన్నీ పోతాయని అభయమిచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే, యెహోవా హబక్కూకుతో “కాస్త ఓపిక పట్టు, నామీద నమ్మకం ఉంచు. ఒకవేళ ఆలస్యమౌతున్నట్లు అనిపించినా నేను నీ ప్రార్థనలకు జవాబిస్తాను” అని అన్నట్లు ఉంది. యెహోవా తన వాగ్దానాల్ని నెరవేర్చే రోజును ఎప్పుడో నిర్ణయించేశాడని అతనికి గుర్తుచేశాడు. కాబట్టి, ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండమని ఆయన హబక్కూకును ప్రోత్సహించాడు. అలా ఎదురుచూసినందుకు ఆ ప్రవక్త ఎన్నడూ నిరుత్సాహపడే పరిస్థితి రాలేదు.

యెహోవా సేవలో మనం చేయగలిగినదంతా చేయాలని ఎందుకు నిశ్చయించుకోవాలి? (14వ పేరా చూడండి)

14. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?

14 మనం కూడా యెహోవా చర్య తీసుకునే వరకు ఎదురుచూడాలి, ఆయన చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే, మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా, మనశ్శాంతిగా ఉండగలుగుతాం. దేవుడు మనకు చెప్పని ‘సమయాల, కాలాల’ మీద మనసు పెట్టవద్దని యేసు అన్నాడు. (అపొ. 1:7) చర్య తీసుకోవడానికి ఏది సరైన సమయమో యెహోవాకు తెలుసు. కాబట్టి ఆశ వదులుకోకుండా వినయాన్ని, ఓర్పును చూపిస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచాలి. యెహోవా కోసం ఎదురుచూస్తుండగా, మన సమయాన్ని తెలివిగా ఉపయోగిస్తూ ఆయన సేవలో చేయగలిగినదంతా చేయాలి.—మార్కు 13:35-37; గల. 6:9.

తనమీద నమ్మకం ఉంచేవాళ్లకు యెహోవా శాశ్వత జీవితం ఇస్తాడు

15, 16. (ఎ) హబక్కూకు పుస్తకంలో యెహోవా చేసిన వాగ్దానాలు ఏంటి? (బి) వాటినుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

15 “నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును,” “భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును” అని ఆయన వాగ్దానం చేశాడు. (హబ. 2:4, 14) అవును, ఓపిగ్గా ఉంటూ తన మీద నమ్మకం ఉంచే వాళ్లందరికీ శాశ్వత జీవితం ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు.

16 హబక్కూకు 2:4⁠లో యెహోవా ఇచ్చిన మాట ఎంత ప్రాముఖ్యమైనదంటే దాన్ని అపొస్తలుడైన పౌలు తన పత్రికల్లో మూడుసార్లు ఎత్తిరాశాడు! (రోమా. 1:17; గల. 3:11; హెబ్రీ. 10:38) మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా యెహోవా మీద నమ్మకం ఉంచితే, ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరడం చూస్తాం. కాబట్టి మన నిరీక్షణ మీద మనసుపెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు.

17. తనమీద నమ్మకం ఉంచేవాళ్లకు ఏం ఇస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు?

17 చివరిరోజుల్లో జీవిస్తున్న మనందరికీ హబక్కూకు పుస్తకంలో ఒక శక్తివంతమైన పాఠం ఉంది. తనమీద విశ్వాసం, నమ్మకం ఉంచే ప్రతీ నీతిమంతునికి యెహోవా శాశ్వత జీవితం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎలాంటి సమస్యల్లో, ఆందోళనల్లో ఉన్నా ఆయన మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటూ ఉందాం. యెహోవా హబక్కూకుతో చెప్పిన విషయాలు, ఆయన మనకు సహాయం చేస్తాడని, మనల్ని రక్షిస్తాడని అభయమిస్తున్నాయి. యెహోవా తన రాజ్యాన్ని ఈ భూమ్మీదకు ఎప్పుడు తీసుకురావాలో ముందే నిర్ణయించాడు. తన మీద నమ్మకం ఉంచుతూ, ఆ రోజు కోసం ఓపిగ్గా ఎదురుచూడమని ఆయన దయగా అడుగుతున్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు సంతోషంగా, శాంతిగా ఉండే యెహోవా ఆరాధకులతో ఈ భూమి నిండివుంటుంది.—మత్త. 5:5; హెబ్రీ. 10:36-39.

యెహోవా మీద నమ్మకం ఉంచి, సంతోషంగా ఉండండి

18. యెహోవా మాటలు హబక్కూకు మీద ఎలాంటి ప్రభావం చూపించాయి?

18 హబక్కూకు 3:16-19 చదవండి. యెహోవా చెప్పిన విషయాలు హబక్కూకుపై ఎంతో ప్రభావం చూపించాయి. ఆయన తన ప్రజల కోసం గతంలో చేసిన ఆశ్చర్యకరమైన విషయాల గురించి హబక్కూకు లోతుగా ఆలోచించాడు. దాంతో యెహోవా మీద అతనికున్న నమ్మకం బలపడింది. త్వరలోనే ఆయన చర్య తీసుకుంటాడని అతను నమ్మాడు. కాబట్టి అతను కొంతకాలంపాటు బాధపడాల్సి ఉంటుందని తెలిసినా ఓదార్పు పొందాడు. ఇక అతనికి ఎలాంటి సందేహాలు లేవు గానీ యెహోవా తనను రక్షిస్తాడనే పూర్తి విశ్వాసం ఉంది. 18వ వచనంలో, యెహోవా మీద తనకున్న నమ్మకాన్ని హబక్కూకు చాలా చక్కగా వర్ణించాడు. ఆ వచనంలో అతను చెప్పిన మాటలు, “నేను ప్రభువునందు ఆనందంతో గంతులు వేస్తాను; నా దేవునియందు సంతోషంతో నాట్యం చేస్తాను” అని అన్నట్లు ఉన్నాయని కొంతమంది విద్వాంసులు నమ్ముతున్నారు. 16-19 వచనాల్లో మనందరికీ ఎంత శక్తివంతమైన అభయం ఉందో కదా! భవిష్యత్తు విషయంలో యెహోవా అద్భుతమైన వాగ్దానాలు చేయడంతోపాటు, వాటిని త్వరలోనే నెరవేరుస్తానని కూడా అభయమిచ్చాడు.

19. హబక్కూకులాగే మనం ఓదార్పు పొందాలంటే ఏం చేయాలి?

19 హబక్కూకు పుస్తకం నుండి మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం, యెహోవా మీద నమ్మకం ఉంచడం. (హబ. 2:4) మనం ఆయన మీద ఎప్పుడూ నమ్మకం ఉంచాలంటే, ఆయనతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవాలి. కాబట్టి మనం ఈ మూడు పనులు చేయాలి: (1) యెహోవాకు క్రమంగా ప్రార్థిస్తూ మన చింతలన్నీ, ఆందోళనలన్నీ చెప్పుకోవాలి. (2) బైబిల్లో ఆయన చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా వింటూ, తన సంస్థ ద్వారా ఇస్తున్న నిర్దేశాన్ని పాటించాలి. (3) ఆయన తన వాగ్దానాల్ని నెరవేర్చే రోజు కోసం మనం ఎదురుచూస్తుండగా విశ్వాసాన్ని, ఓర్పును చూపించాలి. హబక్కూకు అదే చేశాడు. యెహోవాతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అతను చాలా కృంగుదలలో ఉన్నాడు. కానీ ఆ సంభాషణ ముగిసేసరికి ప్రోత్సాహం పొందాడు, సంతోషంగా ఉన్నాడు! మనం హబక్కూకును అనుకరిస్తే, పరలోక తండ్రియైన యెహోవా మనల్ని ఆప్యాయంగా హత్తుకొని ఇచ్చే ఓదార్పును రుచిచూస్తాం. ఈ చెడ్డ లోకంలో మనం పొందగల గొప్ప ఓదార్పు అదే!