కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 2

సంఘంలో యెహోవాను స్తుతించండి

సంఘంలో యెహోవాను స్తుతించండి

“సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.”—కీర్త. 22:22.

పాట 59 యెహోవాను స్తుతిద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. దావీదు యెహోవా గురించి ఎలా భావించాడు? దానివల్ల అతను ఏం చేశాడు?

రాజైన దావీదు ఇలా రాశాడు: “యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు.” (కీర్త. 145:3) దావీదు యెహోవాను ప్రేమించాడు, దానివల్ల అతను “సమాజమధ్యమున” యెహోవాను స్తుతించాడు. (కీర్త. 22:22; 40:5) మీకు కూడా యెహోవా మీద ప్రేమ ఉంది. అందుకే దావీదు చెప్పిన ఈ మాటలతో ఏకీభవిస్తారు: “మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.”—1 దిన. 29:10-13.

2. (ఎ) మనం యెహోవాను ఎలా స్తుతించవచ్చు? (బి) కొంతమందికి ఉన్న పెద్ద సవాలు ఏంటి? ముందుగా ఏం చర్చిస్తాం?

2 నేడు, యెహోవాను స్తుతించే ఒక మార్గం ఏంటంటే, మీటింగ్స్‌లో కామెంట్‌ చెప్పడం. అయితే, కొంతమంది సహోదరసహోదరీలకు అదొక పెద్ద సవాలు. వాళ్లకు కామెంట్‌ చెప్పాలని ఉంటుంది, కానీ భయపడతారు. మరి ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? ప్రోత్సాహకరమైన కామెంట్స్‌ చెప్పడానికి మనందరికీ ఏ సలహాలు ఉపయోగపడతాయి? వీటికి జవాబు తెలుసుకునే ముందు, కామెంట్‌ చెప్పడానికిగల నాలుగు ప్రాథమిక కారణాల్ని చర్చించుకుందాం.

మనం కామెంట్స్‌ ఎందుకు చెప్తాం?

3-5. (ఎ) హెబ్రీయులు 13:15 ప్రకారం మనం కామెంట్స్‌ ఎందుకు చెప్తాం? (బి) మనం అందరం ఒకేలాంటి కామెంట్‌ చెప్పాలా? వివరించండి.

3 తనను స్తుతించే గొప్ప అవకాశం యెహోవా మనందరికీ ఇచ్చాడు. (కీర్త. 119:108) మనం యెహోవాకు ఇచ్చే ‘స్తుతి బలిలో’ కామెంట్‌ చెప్పడం ఒక భాగం. మన బదులు వేరేవాళ్లు ఆ బలి ఇవ్వలేరు. (హెబ్రీయులు 13:15 చదవండి.) అయితే, అందరూ ఒకేలాంటి బలి లేదా కామెంట్‌ ఇవ్వాలని యెహోవా ఆశిస్తాడా? లేదు! అలా ఎన్నడూ ఆశించడు.

4 మనందరి సామర్థ్యాలు, పరిస్థితులు వేరని యెహోవాకు తెలుసు. కాబట్టి మనం ఆయనకు ఇవ్వగలిగే దేన్నైనా విలువైనదిగా చూస్తాడు. ఇశ్రాయేలీయులు ఇచ్చిన ఏయే బలుల్ని యెహోవా అంగీకరించాడో ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఇశ్రాయేలీయులకు గొర్రెల్ని లేదా మేకల్ని బలిచ్చే స్తోమత ఉండేది. కానీ పేదవాళ్లు మాత్రం, ‘రెండు తెల్ల గువ్వల్ని లేదా రెండు పావురపు పిల్లల్ని’ ఇచ్చేవాళ్లు. వాటిని కూడా ఇవ్వలేని ఇశ్రాయేలీయులు “తూమెడు గోధుమపిండిలో పదియవవంతును” ఇచ్చేవాళ్లు. దాన్ని కూడా యెహోవా అంగీకరించాడు. (లేవీ. 5:7, 11) గోధుమ పిండి చాలా చౌకగా దొరికేది. అయినప్పటికీ, శ్రేష్ఠమైన లేదా మెత్తని పిండిని మాత్రమే యెహోవా అంగీకరించాడు.

5 మన దయగల దేవుడు నేడు కూడా అలాగే భావిస్తున్నాడు. మనందరి కామెంట్స్‌, అపొల్లోలా అనర్గళంగా లేదా పౌలులా ఒప్పించే విధంగా ఉండాలని యెహోవా ఆశించట్లేదు. (అపొ. 18:24; 26:28) మన సామర్థ్యాలకు తగ్గట్టు కామెంట్‌ చెప్పాలని ఆయన ఆశిస్తాడు. రెండు చిన్న నాణేలు ఇచ్చిన విధవరాలిని గుర్తుచేసుకోండి. ఆమె ఇవ్వగలిగినదంతా ఇచ్చినందుకు యెహోవా ఆమెను విలువైనదానిగా చూశాడు.—లూకా 21:1-4.

కామెంట్స్‌ చెప్పడం వల్ల మనకూ ఇతరులకూ ప్రయోజనం ఉంటుంది (6-7 పేరాలు చూడండి) *

6. (ఎ) హెబ్రీయులు 10:24, 25 ప్రకారం మనం వినే కామెంట్స్‌ మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? (బి) వాళ్లు చేసిన ప్రయత్నాలకు ఎలా కృతజ్ఞత చెప్పవచ్చు?

6 కామెంట్స్‌ ద్వారా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం. (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) మీటింగ్స్‌లో మనం వేర్వేరు కామెంట్స్‌ వినడానికి ఇష్టపడతాం. చిన్నపిల్లలు చెప్పే సరళమైన, హృదయపూర్వకమైన కామెంట్స్‌ని ఆనందిస్తాం. కొత్తగా నేర్చుకున్న ఒక సత్యాన్ని ఎవరైనా ఉత్సాహంగా చెప్తున్నప్పుడు మనమెంతో ప్రోత్సాహం పొందుతాం. అంతేకాదు బిడియస్థులు లేదా మన భాషను కొత్తగా నేర్చుకుంటున్నవాళ్లు “ధైర్యం కూడగట్టుకుని” కామెంట్‌ చెప్పినప్పుడు మనమెంతో మెచ్చుకుంటాం. (1 థెస్స. 2:2) వాళ్లు చేసిన ప్రయత్నాలకు మనమెలా కృతజ్ఞత చెప్పవచ్చు? ప్రోత్సాహకరమైన కామెంట్స్‌ ఇచ్చినందుకు మీటింగ్‌ తర్వాత వాళ్లను మెచ్చుకోవచ్చు; అంతేకాదు, వాళ్లను ఆదర్శంగా తీసుకుని మనం కూడా కామెంట్‌ చెప్పవచ్చు. అప్పుడు, మనం ప్రోత్సాహం పొందడమే కాదు, ఇతరులకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్లమౌతాం.—రోమా. 1:11, 12.

7. కామెంట్స్‌ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

7 కామెంట్స్‌ చెప్పడం మనకే మంచిది. (యెష. 48:17) ఎలా? మొదటిదిగా, కామెంట్‌ చెప్పాలని అనుకున్నప్పుడు, మీటింగ్‌కి బాగా సిద్ధపడతాం; దానివల్ల దేవుని వాక్యాన్ని లోతుగా అర్థంచేసుకోగలుగుతాం. మనం బైబిల్ని ఎంత లోతుగా అర్థంచేసుకుంటే, నేర్చుకున్న వాటిని అంతెక్కువగా పాటిస్తాం. రెండోదిగా, మనం చర్చలో భాగం వహిస్తాం కాబట్టి మీటింగ్‌ని ఎక్కువ ఆనందిస్తాం. మూడోదిగా, మనం బాగా సిద్ధపడతాం కాబట్టి కామెంట్‌ చేసిన విషయాల్ని ఎక్కువకాలం గుర్తుపెట్టుకుంటాం.

8-9. (ఎ) మలాకీ 3:16 ప్రకారం మనం కామెంట్స్‌ చెప్తున్నప్పుడు యెహోవా ఏం చేస్తాడు? (బి) కొంతమంది ఏం చేయడానికి భయపడతారు?

8 మన విశ్వాసాన్ని మాటల్లో వ్యక్తం చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. యెహోవా మన కామెంట్స్‌ని వింటాడు, దానికోసం మనం చేసిన కృషిని విలువైనదిగా ఎంచుతాడు. (మలాకీ 3:16 చదవండి.) యెహోవాను సంతోషపెట్టడానికి కృషిచేసినప్పుడు మనల్ని దీవించడం ద్వారా ఆయన మనల్ని మెచ్చుకుంటాడు.—మలా. 3:10.

9 కాబట్టి, మీటింగ్స్‌లో కామెంట్‌ చెప్పడానికి మంచి కారణాలే ఉన్నాయని అర్థమౌతుంది. అయినప్పటికీ, కొంతమంది చెయ్యి ఎత్తడానికి భయపడతారు. మీకూ అలానే అనిపిస్తుందా? అయితే నిరుత్సాహపడకండి. మీటింగ్స్‌లో ఎక్కువ కామెంట్స్‌ చెప్పడానికి సహాయం చేసే కొన్ని బైబిలు సూత్రాల్ని, ఉదాహరణల్ని, సలహాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

భయాన్ని పోగొట్టుకోండి

10. (ఎ) మనలో చాలామందికి ఏ భయాలు ఉంటాయి? (బి) మీరు కామెంట్‌ చెప్పడానికి భయపడుతున్నారంటే మీకు ఏ మంచి లక్షణం ఉందని అర్థం?

10 కామెంట్‌ చెప్పడానికి చెయ్యి ఎత్తాలనుకున్న ప్రతీసారి మీకు భయంగా లేదా కంగారుగా అనిపిస్తుందా? అలా అనిపించేది మీ ఒక్కరికే కాదు. వాస్తవానికి, కామెంట్‌ చెప్పేటప్పుడు మనలో చాలామందికి ఎంతోకొంత భయంగానే ఉంటుంది. మీకున్న భయాన్ని పోగొట్టుకోవాలంటే, ముందు ఆ భయానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోతారని లేదా తప్పు చెప్తారని భయపడుతున్నారా? వేరేవాళ్లు చెప్పేంత బాగా మీరు చెప్పలేరని చింతిస్తున్నారా? నిజానికి, అలాంటి భయాలు మంచివే. ఎందుకంటే మీకు వినయం ఉందని, ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచుతున్నారని అవి చూపిస్తాయి. వినయస్థుల్ని యెహోవా ఇష్టపడతాడు. (కీర్త. 138:6; ఫిలి. 2:3) కానీ దాంతోపాటు మీరు తనని స్తుతించాలని, మీటింగ్స్‌లో సహోదరసహోదరీలను ప్రోత్సహించాలని కూడా ఆయన కోరుకుంటాడు. (1 థెస్స. 5:11) ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీకు కావాల్సిన ధైర్యాన్నిస్తాడు.

11. ఏ లేఖన సూత్రాలు మనకు సహాయం చేస్తాయి?

11 కొన్ని లేఖన సూత్రాల్ని పరిశీలించండి. మనమందరం మన మాటల్లో, మాట్లాడే విధానంలో పొరపాట్లు చేస్తామని బైబిలు చెప్తుంది. (యాకో. 3:2) యెహోవా గానీ సహోదరసహోదరీలు గానీ మననుండి పరిపూర్ణతను ఆశించరు. (కీర్త. 103:12-14) వాళ్లు మన కుటుంబం, మనల్ని ప్రేమిస్తారు. (మార్కు 10:29, 30; యోహా. 13:35) కొన్నిసార్లు మనం అనుకున్నది సరిగ్గా చెప్పలేకపోయినా సహోదరులు మనల్ని అర్థంచేసుకుంటారు.

12-13. నెహెమ్యా, యోనా నుండి ఏం నేర్చుకోవచ్చు?

12 మీ భయాల్ని పోగొట్టుకోవడానికి సహాయం చేసే కొన్ని బైబిలు వృత్తాంతాల గురించి ఆలోచించండి. నెహెమ్యాను గుర్తుచేసుకోండి. అతను శక్తిమంతుడైన రాజు దగ్గర పనిచేసేవాడు. యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయని, ద్వారాలు కాల్చేయబడ్డాయని తెలుసుకుని నెహెమ్యా చాలా బాధపడ్డాడు. (నెహె. 1:1-4) అతను ఎందుకు అలా ఉన్నాడని రాజు అడిగినప్పుడు నెహెమ్యాకు ఎంత భయంగా లేదా కంగారుగా అనిపించివుంటుందో ఊహించండి! నెహెమ్యా వెంటనే ప్రార్థన చేసుకుని, రాజుకు జవాబిచ్చాడు. ఫలితంగా, రాజు దేవుని ప్రజలకు ఎంతో సహాయం చేశాడు. (నెహె. 2:1-8) యోనా గురించి కూడా ఆలోచించండి. నీనెవె పట్టణస్థులకు తీర్పు సందేశాన్ని ప్రకటించమని యెహోవా చెప్పినప్పుడు, యోనా చాలా భయపడ్డాడు. యెహోవా చెప్పిన వైపుకు వెళ్లకుండా వేరే వైపుకు పారిపోయాడు. (యోనా 1:1-3) కానీ యెహోవా సహాయంతో యోనా తన నియామకాన్ని పూర్తిచేశాడు. అంతేకాదు, అతను ప్రకటించిన సందేశం నీనెవె పట్టణస్థులకు ఎంతో మేలు చేసింది. (యోనా 3:5-10) కాబట్టి మనం జవాబిచ్చే ముందు ప్రార్థన చేసుకోవడం ప్రాముఖ్యమని నెహెమ్యా నుండి నేర్చుకోవచ్చు. మనకు ఎన్ని భయాలు ఉన్నా తన సేవలో కొనసాగడానికి యెహోవా సహాయం చేస్తాడని యోనా నుండి నేర్చుకోవచ్చు. నిజానికి, మీటింగ్స్‌లో కామెంట్‌ చెప్పడం నీనెవె పట్టణస్థులకు తీర్పు సందేశం ప్రకటించడమంత కష్టమైన పనైతే కాదు!

13 మీటింగ్స్‌లో ప్రోత్సాహకరమైన కామెంట్స్‌ చెప్పడానికి మీకు ఏ సలహాలు ఉపయోగపడతాయి? కొన్ని సలహాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

14. మీటింగ్స్‌కి ఎందుకు బాగా సిద్ధపడాలి? మనం ఎప్పుడు సిద్ధపడవచ్చు?

14 ప్రతీ మీటింగ్‌కి సిద్ధపడండి. మీరు ముందే ప్రణాళిక వేసుకుని బాగా సిద్ధపడితే, ధైర్యంగా కామెంట్స్‌ చెప్పగలుగుతారు. (సామె. 21:5) నిజమే, మనందరం వేర్వేరు సమయాల్లో మీటింగ్స్‌కి సిద్ధపడతాం. అలవీజ్‌ అనే 80 ఏళ్ల విధవరాలు, కావలికోట సిద్ధపడడం వారం మొదట్లోనే ప్రారంభిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది, “నేను ముందే సిద్ధపడితే మీటింగ్స్‌ని బాగా ఆనందిస్తాను.” జాయ్‌ అనే సహోదరి పూర్తికాల ఉద్యోగం చేస్తోంది, ఆమె కావలికోట సిద్ధపడడానికి శనివారం కొంత సమయాన్ని వెచ్చిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది, “మీటింగ్‌కు ఒకరోజు ముందు సిద్ధపడడం వల్ల విషయాల్ని తేలిగ్గా గుర్తుపెట్టుకోగలుగుతాను.” సంఘపెద్దగా, పయినీరుగా సేవచేస్తున్న ఐక్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “మొత్తం ఒకేసారి సిద్ధపడే బదులు వారమంతటిలో కొంచెంకొంచెం సిద్ధపడడం నాకు మంచిగా అనిపిస్తుంది.”

15. మీటింగ్స్‌కి బాగా సిద్ధపడాలంటే ఏం చేయాలి?

15 మీటింగ్స్‌కి బాగా సిద్ధపడాలంటే ఏం చేయాలి? సిద్ధపడడానికి ముందు పవిత్రశక్తి కోసం యెహోవాకు ప్రార్థించడం ఎన్నడూ మర్చిపోకండి. (లూకా 11:13; 1 యోహా. 5:14) ఆ తర్వాత ఆర్టికల్‌ శీర్షికను, ఉపశీర్షికలను, చిత్రాలను, బాక్సులను కొన్ని నిమిషాలపాటు పరిశీలించండి. ఇప్పుడు ఒక్కో పేరా సిద్ధపడుతున్నప్పుడు, అక్కడిచ్చిన లేఖనాల్లో ఎన్ని చదవగలిగితే అన్ని చదవండి. చదివిన సమాచారాన్ని లోతుగా ఆలోచించండి, మీరు కామెంట్‌ చేయాలనుకుంటున్న విషయాలపై ఎక్కువ మనసుపెట్టండి. మీరు ఎంతెక్కువ సిద్ధపడితే, అంతెక్కువ ప్రయోజనం పొందుతారు. అంతేకాదు కామెంట్‌ చెప్పడం కూడా తేలికౌతుంది.—2 కొరిం. 9:6.

16. మీకు ఏ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి? వాటిని మీరెలా ఉపయోగిస్తున్నారు?

16 వీలైతే మీ భాషలో ఉన్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగించండి. మీటింగ్స్‌కి సిద్ధపడడానికి యెహోవా తన సంస్థ ద్వారా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఇచ్చాడు. JW లైబ్రరీ® యాప్‌ ద్వారా మీటింగ్స్‌లో అధ్యయనం చేసే ప్రచురణల్ని మన ఫోన్‌లో లేదా ట్యాబ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎప్పుడైనా, ఎక్కడైనా సమాచారాన్ని అధ్యయనం చేయవచ్చు లేదా చదవవచ్చు, కనీసం వినవచ్చు. కొంతమంది ఉద్యోగస్థులు, విద్యార్థులు లంచ్‌ బ్రేక్‌లో లేదా ప్రయాణంలో అధ్యయనం చేయడానికి ఈ యాప్‌ని ఉపయోగిస్తారు. మీరు ఏదైనా విషయాన్ని లోతుగా తెలుసుకోవాలంటే కావలికోట లైబ్రరీ, కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీసహాయంతో తేలిగ్గా పరిశోధన చేయవచ్చు.

మీరు మీటింగ్స్‌కి ఎప్పుడు సిద్ధపడతారు? (14-16 పేరాలు చూడండి) *

17. (ఎ) ఎక్కువ కామెంట్స్‌ సిద్ధపడడం ఎందుకు మంచిది? (బి) కామెంట్‌ ఎలా ప్రిపేర్‌ అవ్వాలి? అనే వీడియో నుండి మీరేం నేర్చుకున్నారు?

17 వీలైతే ఎక్కువ కామెంట్స్‌ సిద్ధపడండి. మీరు చెయ్యి ఎత్తిన ప్రతీసారి మీకు అవకాశం దొరక్కపోవచ్చు. ఎందుకంటే వేరేవాళ్లు కూడా అదే సమయంలో చెయ్యి ఎత్తుతారు కాబట్టి, అధ్యయన నిర్వాహకుడు వాళ్లలో ఎవరైనా ఒకర్ని అడగవచ్చు. మీటింగ్‌ని టైమ్‌కి ముగించాలంటే, నిర్వాహకుడు ఏ భాగంలో ఎన్ని కామెంట్స్‌ అడగాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధ్యయనం ఆరంభంలో మిమ్మల్ని అడగకపోతే బాధపడకండి లేదా నిరుత్సాహపడకండి. మీరు ఎక్కువ కామెంట్స్‌ సిద్ధపడితే, ఎక్కువ అవకాశాలు దొరకవచ్చు. లేఖనాల్ని చదవడానికి కూడా మీరు సిద్ధపడవచ్చు. వీలైతే, సొంత మాటల్లో కామెంట్‌ చెప్పేలా కూడా సిద్ధపడండి. *

18. మనమెందుకు చిన్న కామెంట్స్‌ చెప్పాలి?

18 చిన్న కామెంట్స్‌ చెప్పండి. చిన్నగా, సరళంగా చెప్పే కామెంట్స్‌ ఎక్కువ ప్రోత్సాహాన్నిస్తాయి. కాబట్టి చిన్న కామెంట్స్‌ చెప్పడం మీ లక్ష్యంగా పెట్టుకోండి. అవి 30 సెకన్ల లోపు ఉండేలా చూసుకోండి. (సామె. 10:19; 15:23) మీరు ఎన్నో ఏళ్లుగా కామెంట్స్‌ చెప్తుంటే, చిన్న కామెంట్స్‌ చెప్తూ ఇతరులకు ఆదర్శం ఉంచండి. మీరు చాలా విషయాలు చెప్తూ ఎక్కువ నిమిషాల పాటు కామెంట్‌ చేస్తే, మీ అంత బాగా చెప్పలేమని ఇతరులు భయపడవచ్చు. చిన్న కామెంట్స్‌ చెప్తే, ఎక్కువమందికి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా, మొదటి కామెంట్‌ మిమ్మల్ని అడిగితే సరళమైన, సూటైన జవాబు చెప్పండి. పేరాలో ఉన్న విషయాలన్నీ చెప్పాలని చూడకండి. పేరాలో ముఖ్యమైన విషయాలు చర్చించాక, మీరు అదనపు విషయాల గురించి కామెంట్‌ చెప్పవచ్చు.—“ నేను దేనిగురించి కామెంట్‌ చెప్పవచ్చు?” అనే బాక్సు చూడండి.

19. అధ్యయన నిర్వాహకుడు మీకెలా సహాయం చేస్తాడు? కానీ మీరేమి చేయాల్సి ఉంటుంది?

19 మీరు ఏ పేరాలో కామెంట్‌ చెప్పాలనుకుంటున్నారో నిర్వాహకునికి చెప్పండి. మీరు ఈ పద్ధతిని పాటించాలనుకుంటే, మీటింగ్‌ మొదలవ్వడానికి ముందే అధ్యయన నిర్వాహకుణ్ణి కలిసి చెప్పాలి. అంతేకాదు ఆ పేరా ప్రశ్న అడిగినప్పుడు, నిర్వాహకునికి కనిపించేలా వెంటనే మీ చెయ్యి పైకి ఎత్తాలి.

20. మీటింగ్స్‌ని స్నేహితులతో పంచుకునే ఆహారంగా ఎందుకు చూడాలి?

20 మీటింగ్స్‌ని స్నేహితులతో పంచుకునే ఆహారంలా చూడండి. ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: సంఘంలో మీ స్నేహితులు కొంతమంది ఒక చిన్న పార్టీ చేసుకుందాం అనుకున్నారు. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఏదైనా చిన్న వంటకం చేసి తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు మీరెలా స్పందిస్తారు? మీకు కొంచెం కంగారుగా అనిపించవచ్చు, కానీ అందరికీ నచ్చే మంచి వంటకం చేసి తీసుకెళ్లడానికి మీరు చేయగలిగినదంతా చేస్తారు. అదేవిధంగా, మీటింగ్స్‌లో యెహోవా మనకు రకరకాల వంటకాలతో ఆతిథ్యం ఇస్తున్నాడు. (కీర్త. 23:5; మత్త. 24:45) మనం ఇవ్వగలిగే ఏదైనా చిన్న బహుమానం తీసుకెళ్లినప్పుడు ఆయన తప్పకుండా సంతోషిస్తాడు. కాబట్టి మీటింగ్స్‌కి బాగా సిద్ధపడి, వీలైనన్ని ఎక్కువ కామెంట్స్‌ చెప్పండి. అప్పుడు మీరు కేవలం యెహోవా బల్ల దగ్గర ఆహారం తీసుకోవడానికే కాదు, సంఘంతో పంచుకోవడానికి ఒక బహుమానం కూడా తీసుకెళ్లినట్లు అవుతుంది.

పాట 2 యెహోవా నీ పేరు

^ పేరా 5 కీర్తనకర్త దావీదులాగే మనందరం యెహోవాను ప్రేమిస్తాం, స్తుతిస్తాం. మీటింగ్స్‌లో కామెంట్‌ చెప్పడం ద్వారా యెహోవా మీదున్న ప్రేమను మాటల్లో వ్యక్తం చేసే గొప్ప అవకాశం మనకుంది. కానీ మనలో కొంతమందికి కామెంట్స్‌ చెప్పడం కష్టంగా ఉండవచ్చు. మీకూ ఆ సమస్య ఉందా? అయితే కామెంట్స్‌ చెప్పడానికి మీరెందుకు భయపడుతున్నారో, ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకోవచ్చు.

^ పేరా 17 jw.org/teలో యెహోవా స్నేహితులవ్వండి —కామెంట్‌ ఎలా ప్రిపేర్‌ అవ్వాలి? అనే వీడియో చూడండి. బైబిలు బోధలు కింద పిల్లలు అనే సెక్షన్‌లో చూడండి.

^ పేరా 63 చిత్రాల వివరణ : కావలికోట చర్చలో సంతోషంగా భాగం వహిస్తున్న సహోదరసహోదరీలు.

^ పేరా 65 చిత్రాల వివరణ : కావలికోట అధ్యయనంలో కామెంట్‌ చెప్పడానికి చెయ్యి ఎత్తిన కొంతమంది సహోదరసహోదరీలు. వాళ్లందరి పరిస్థితులు వేరైనా, మీటింగ్‌కి సిద్ధపడడానికి సమయం కేటాయిస్తున్నారు.