కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 6

మీ యథార్థతను కాపాడుకోండి!

మీ యథార్థతను కాపాడుకోండి!

“మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.”—యోబు 27:5.

పాట 34 యథార్థంగా జీవించడం

ఈ ఆర్టికల్‌లో. . . *

1. ఈ పేరాలో చర్చించుకున్న ముగ్గురు యెహోవాసాక్షులు యెహోవాకు ఎలా విశ్వసనీయంగా ఉన్నారు?

ఈ సన్నివేశాల్ని ఊహించుకోండి: (1) యెహోవాసాక్షియైన ఒక పాప స్కూల్లో ఉన్నప్పుడు, తన టీచర్‌ క్లాసులో ఉన్న పిల్లలందర్నీ ఒక అబద్ధమత లేదా జాతీయ వేడుకలో పాల్గొనమని చెప్పింది. దేవుడు ఆ వేడుకను ఇష్టపడడని ఆ పాపకు తెలుసు కాబట్టి దానిలో పాల్గొననని గౌరవపూర్వకంగా చెప్పింది. (2) బిడియస్థుడైన ఒక యువ సహోదరుడు ఇంటింటి పరిచర్యకు వెళ్లాడు. అతను మాట్లాడాల్సిన తర్వాతి ఇల్లు, యెహోవాసాక్షుల్ని ఎగతాళి చేసిన తన తోటి విద్యార్థిదని గుర్తించాడు. అయినాసరే ఆ యువకుడు ఆ ఇంటికి వెళ్లి, తలుపు తట్టాడు. (3) ఒక క్రైస్తవ భర్త తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నాడు. ఒకరోజు బాస్‌ అతన్ని పిలిచి చట్టవిరుద్ధమైన పని చేయమని చెప్పాడు. బాస్‌ చెప్పినట్టు చేయకపోతే ఉద్యోగం పోతుందని తెలిసినా, దేవుడు కోరుతున్నట్లు తాను నిజాయితీగా, చట్టానికి లోబడేవానిగా ఉంటానని వివరించాడు.—రోమా. 13:1-4; హెబ్రీ. 13:18.

2. మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం? ఎందుకు?

2 ఆ ముగ్గురిలో మీకు ఏ లక్షణం కనిపిస్తుంది? వాళ్లలో ధైర్యం, నిజాయితీ లాంటి లక్షణాలు మీకు కనిపించవచ్చు. కానీ ఒక అమూల్యమైన లక్షణం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది, అదే యథార్థత. వాళ్లలో ప్రతీఒక్కరూ యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నారు. వాళ్లు దేవుని ప్రమాణాల విషయంలో రాజీపడలేదు. యథార్థత వల్లే వాళ్లు అలా ఉండగలిగారు. వాళ్లను చూసి యెహోవా ఖచ్చితంగా గర్వపడతాడు. మనల్ని చూసి కూడా మన పరలోక తండ్రి గర్వపడాలని కోరుకుంటాం, కాబట్టి ఈ ప్రశ్నల గురించి ఆలోచిద్దాం: యథార్థత అంటే ఏంటి? అది మనకెందుకు అవసరం? ఈ కష్టకాలాల్లో యథార్థంగా ఉండాలనే మన నిశ్చయాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

యథార్థత అంటే ఏంటి?

3. (ఎ) దేవుని సేవకులు ఎలా యథార్థతను చూపిస్తారు? (బి) యథార్థత అంటే ఏంటో అర్థంచేసుకోవడానికి ఏ ఉదాహరణలు సహాయం చేస్తాయి?

3 దేవుని సేవకులు యథార్థతను ఎలా చూపిస్తారు? యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ, ఆయనమీద అచంచలమైన భక్తి చూపిస్తూ ఎల్లప్పుడూ ఆయన్ని సంతోషపెట్టే పనులు చేయడం ద్వారా యథార్థతను చూపిస్తారు. బైబిల్లో “యథార్థత” అని అనువదించబడిన హీబ్రూ పదానికి సంపూర్ణత, లోపం లేనిది అనే అర్థాలున్నాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు యెహోవాకు జంతువుల్ని బలిగా అర్పించేటప్పుడు అవి లోపం లేనివిగా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పింది. * (లేవీ. 22:21, 22) వాళ్లు కుంటిదాన్ని, చెవిటిదాన్ని, గుడ్డిదాన్ని లేదా జబ్బు చేసినదాన్ని బలిగా అర్పించకూడదు. అవి సంపూర్ణంగా, లోపం లేనివిగా ఉండడం యెహోవాకు ముఖ్యం. (మలా. 1:6-9) యెహోవా ఎందుకు ఆ విషయాన్ని అంతగా పట్టించుకుంటున్నాడో అర్థంచేసుకోవడానికి దీన్ని పరిశీలించండి. మనం ఏదైనా పండును, పుస్తకాన్ని లేదా వస్తువును కొనేటప్పుడు పెద్దపెద్ద రంధ్రాలు ఉన్నదాన్ని గానీ కొన్ని భాగాలే ఉన్నదాన్ని గానీ కొంటామా? లేదు కదా! సంపూర్ణంగా, లోపం లేనిదిగా ఉన్నదాన్నే కొంటాం. యెహోవా కూడా, మనం తనపట్ల చూపించే ప్రేమ, విశ్వసనీయత విషయంలో అలాగే భావిస్తాడు. అవి సంపూర్ణంగా, లోపం లేనివిగా ఉండాలనుకుంటాడు.

4. (ఎ) అపరిపూర్ణులు కూడా యథార్థంగా ఉండగలరని ఎలా చెప్పవచ్చు? (బి) కీర్తన 103:12-14 ప్రకారం, యెహోవాకు మన గురించి ఏం తెలుసు?

4 మనం యథార్థత చూపించాలంటే పరిపూర్ణులుగా ఉండాలా? నిజానికి, మనం అపరిపూర్ణులమని, పొరపాట్లు చేస్తామని మన గురించి మనం అనుకుంటాం. అయితే యథార్థత చూపించాలంటే మనం పరిపూర్ణులుగా ఉండాల్సిన అవసరం ఎందుకు లేదో రెండు కారణాల్ని పరిశీలించండి. మొదటిది, యెహోవా మనలో ఉన్న లోపాల మీద మనసుపెట్టడు. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్త. 130:3) మనం అపరిపూర్ణులమని, పాపులమని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. (కీర్త. 86:5) రెండోది, యెహోవాకు మన పరిమితులు తెలుసు. కాబట్టి మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువ ఆశించడు. (కీర్తన 103:12-14 చదవండి.) మరి మనం యెహోవా దృష్టిలో ఏ విధంగా సంపూర్ణంగా, లోపం లేనివాళ్లుగా ఉండవచ్చు?

5. యెహోవా సేవకులు యథార్థంగా ఉండడానికి ముఖ్య కారణం ప్రేమే అని ఎలా చెప్పవచ్చు?

5 యెహోవా సేవకులు యథార్థంగా ఉండడానికి ముఖ్య కారణం, ప్రేమే. మన పరలోక తండ్రి పట్ల మనకున్న ప్రేమ, అచంచల భక్తి సంపూర్ణంగా, లోపం లేనివిగా ఉండాలి. మనకు పరీక్షలు ఎదురైనా మన ప్రేమ అలాగే ఉంటే, మనకు యథార్థత ఉన్నట్టే. (1 దిన. 28:9; మత్త. 22:37) మొదటి పేరాలో చర్చించుకున్న ముగ్గురు యెహోవాసాక్షుల గురించి మళ్లీ ఆలోచించండి. వాళ్లు ఎందుకలా ప్రవర్తించారు? ఆ పాపకు స్కూల్లో సరదాగా గడపడం ఇష్టంలేదా? ఆ యువ సహోదరునికి, గుమ్మం దగ్గర అవమానించబడడం ఇష్టమా? ఆ క్రైస్తవ భర్త తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలని కోరుకున్నాడా? కానేకాదు! బదులుగా, యెహోవా ప్రమాణాలు నీతియుక్తమైనవని వాళ్లకు తెలుసు. అంతేకాదు, వాళ్ల మనసంతా ఆయన్ని సంతోషపెట్టడం మీదే ఉంది కాబట్టే అలా ప్రవర్తించారు. వాళ్లు యెహోవాను ప్రేమిస్తారు కాబట్టి నిర్ణయం తీసుకునే ప్రతీసారి ఆయన గురించి ఆలోచిస్తారు. ఆ విధంగా వాళ్లు తమ యథార్థతను క్రియల్లో చూపిస్తారు.

మనకు యథార్థత ఎందుకు అవసరం?

6. (ఎ) మనకు యథార్థత ఎందుకు అవసరం? (బి) ఆదాముహవ్వలు ఎందుకు యథార్థంగా ఉండలేకపోయారు?

6 మనందరికి యథార్థత ఎందుకు అవసరం? ఎందుకంటే సాతాను యెహోవాను అలాగే మనల్ని సవాలు చేశాడు. తిరుగుబాటుదారుడైన ఒక దూత ఏదెను తోటలో సాతానుగా లేదా “వ్యతిరేకించేవాడిగా” మారాడు. సాతాను యెహోవాను చెడ్డవాడు, స్వార్థపరుడు, అవినీతిగల పాలకుడు అని నిందిస్తూ ఆయన పేరుకు మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించాడు. విచారకరంగా, ఆదాముహవ్వలు సాతానుతో చేతులు కలిపి యెహోవాపై తిరుగుబాటు చేశారు. (ఆది. 3:1-6) ఆదాముహవ్వలు ఏదెను తోటలో ఉన్నప్పుడు వాళ్లకు యెహోవా మీద ప్రేమ పెంచుకోవడానికి లెక్కలేనన్ని అవకాశాలు దొరికాయి. కానీ, సాతాను యెహోవామీద లేనిపోనివి చెప్పే సమయానికి ఆదాముహవ్వలకు ఆయన మీదున్న ప్రేమ సంపూర్ణంగా, లోపం లేనిదిగా లేదు. అలాగే ఆ తర్వాత మరో ప్రశ్న కూడా లేవదీయబడింది. అదేంటంటే, ఏ మనిషైనా దేవుని మీద ప్రేమతో ఆయనకు విశ్వసనీయంగా ఉండగలడా, ఇంకోమాటలో చెప్పాలంటే, మనుషులు యథార్థత చూపించగలరా? ఈ ప్రశ్న యోబు విషయంలో లేవదీయబడింది.

7. యోబు 1:8-11 ప్రకారం, యోబు యథార్థతను చూసి యెహోవా ఎలా భావించాడు? సాతాను ఎలా భావించాడు?

7 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నకాలంలో యోబు జీవించాడు. ఆ కాలంలో ఎవ్వరూ లేనంత యథార్థంగా యోబు ఉన్నాడు. ఆయన కూడా మనలాగే అపరిపూర్ణుడు, పొరపాట్లు చేశాడు. కానీ, ఆయనకున్న యథార్థతను చూసి యెహోవా ఆయన్ని ప్రేమించాడు. బహుశా యోబు కాలంనాటికే సాతాను మనుషుల యథార్థత గురించి యెహోవాను నిందించివుంటాడు. అందుకే, యెహోవా సాతానుకు యోబును చూపించాడు. యోబు జీవన విధానం సాతాను అబద్ధికుడని నిరూపించింది! దాంతో, యోబును పరీక్షించడానికి అనుమతించమని సాతాను యెహోవాను అడిగాడు. తన స్నేహితుడైన యోబు మీదున్న నమ్మకంతో యెహోవా సాతాన్ని అనుమతించాడు.—యోబు 1:8-11 చదవండి.

8. సాతాను యోబు మీద ఎలా దాడిచేశాడు?

8 సాతాను క్రూరుడు, హంతకుడు. అతను యోబు దగ్గరున్న ప్రతీది తీసేసుకున్నాడు, ఆయన సేవకుల్ని చంపేశాడు, ఆయనకున్న మంచిపేరును పాడుచేశాడు. తర్వాత అతను యోబు కుటుంబంపై దాడిచేసి, ఆయన పదిమంది పిల్లల్ని చంపేశాడు. అంతటితో ఆగకుండా సాతాను యోబు ఆరోగ్యంపై దాడిచేసి, తల నుండి పాదాల వరకు నొప్పిపుట్టించే పుండ్లు వచ్చేలా చేశాడు. యోబు భార్య ఆందోళనపడి, దుఃఖంలో మునిగిపోయింది; దేవున్ని దూషించి, చనిపోమని ఆమె యోబుతో అంది. యోబు కూడా చనిపోవాలని అనుకున్నాడు కానీ తన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. అప్పుడు సాతాను మరో రకంగా దాడిచేశాడు. అతను యోబుకున్న ముగ్గురు స్నేహితుల్ని ఉపయోగించుకున్నాడు. వాళ్లు కొన్నిరోజుల పాటు ఆయన దగ్గరే ఉన్నారు, కానీ ఆయన్ని ఓదార్చే బదులు కఠినంగా మాట్లాడుతూ తిట్టారు. ఆయన కష్టాలన్నిటికీ దేవుడే కారణమని, దేవుని దృష్టిలో ఆయన యథార్థతకు ఎలాంటి విలువలేదని వాళ్లు అన్నారు. అంతేకాదు యోబు చెడ్డవాడని, ఆయనకు తగినశాస్తే జరిగిందని వాళ్లు అన్నారు!—యోబు 1:13-22; 2:7-11; 15:4, 5; 22:3-6; 25:4-6.

9. కష్టాలు వచ్చినా యోబు ఏం చేయలేదు?

9 కష్టాలు ఎదురైనప్పుడు యోబు ఎలా స్పందించాడు? యోబు పరిపూర్ణుడు కాదు. ఆయన కోపంతో తన కపట స్నేహితుల్ని గద్దించాడు. కానీ తాను అనాలోచితంగా మాట్లాడానని యోబు ఆ తర్వాత ఒప్పుకున్నాడు. దేవున్ని కాకుండా తనను తాను నీతిమంతుడిగా నిరూపించుకోవడానికి యోబు ప్రయత్నించాడు. (యోబు 6:3; 13:4, 5; 32:2; 34:5) కానీ, ఆయన ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవునికి ఎదురుతిరగలేదు. తన స్నేహితులు చెప్పిన అబద్ధాల్ని నమ్మలేదు. ఆయనిలా అన్నాడు, “మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.” (యోబు 27:5) ఏం జరిగినాసరే తన యథార్థతను విడిచిపెట్టకూడని యోబు ఎంత బలంగా నిశ్చయించుకున్నాడో ఆ మాటల్నిబట్టి అర్థమౌతుంది. యోబు యథార్థంగా ఉన్నాడు, మనం కూడా ఉండగలం.

10. సాతాను యోబు విషయంలో లేవదీసిన వివాదాంశంలో మీరు కూడా ఉన్నారని ఎలా చెప్పవచ్చు?

10 సాతాను యోబు విషయంలో లేవదీసిన వివాదాంశంలో మీరు కూడా ఉన్నారని ఎలా చెప్పవచ్చు? ఆ వివాదాంశం ప్రకారం, మీరు యెహోవా దేవున్ని నిజంగా ప్రేమించట్లేదని, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి యెహోవాను ఆరాధించడం మానేస్తారని, చివరివరకు యథార్థంగా ఉండలేరని సాతాను అంటున్నాడు. (యోబు 2:4, 5; ప్రక. 12:10) ఆ మాటలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది కదా. కానీ దీనిగురించి ఆలోచించండి: మీ యథార్థతను పరీక్షించడానికి యెహోవా సాతానును అనుమతిస్తున్నాడు. మీరు యథార్థంగా ఉంటారనే నమ్మకంతో, సాతాను అబద్ధికుడని నిరూపించే గొప్ప అవకాశాన్ని యెహోవా మీకు ఇస్తున్నాడు. అంతేకాదు, మీరు యథార్థంగా ఉండడానికి సహాయం చేస్తానని కూడా ఆయన మాటిస్తున్నాడు. (హెబ్రీ. 13:6) విశ్వసర్వాధిపతి మనపై నమ్మకం ఉంచడం మనకు ఒక గొప్ప గౌరవం! యథార్థత ఎందుకంత ప్రాముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైందా? మనం యథార్థంగా ఉండడంవల్ల సాతాను అబద్ధికుడని నిరూపిస్తాం, మన తండ్రికున్న మంచి పేరును సమర్థిస్తాం, ఆయన పరిపాలనకు మద్దతిస్తాం. మరి ఈ ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనం ఎలా పెంపొందించుకోవచ్చు?

నేడు మనం యథార్థతను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

11. యోబు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

11 కష్టాలతో నిండిన ఈ “చివరి రోజుల్లో” సాతాను దేవుని సేవకుల మీద ఇంకా ఎక్కువ దాడి చేస్తున్నాడు. (2 తిమో. 3:1) అయితే ఇలాంటి పరిస్థితుల్లో యథార్థంగా ఉండాలనే మన నిశ్చయతను ఎలా బలపర్చుకోవచ్చు? ఈ విషయంలో కూడా యోబు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఎందుకంటే, తనకు పరీక్షలు రాకముందే యోబు ఎన్నోసార్లు యెహోవాపట్ల యథార్థతను చూపించాడు. అయితే యోబు నుండి మనం నేర్చుకోగల మూడు పాఠాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

యథార్థంగా ఉండాలనే మన నిశ్చయతను బలపర్చుకోవడానికి కొన్ని మార్గాలు ఏంటి? (12వ పేరా చూడండి) *

12. (ఎ) యోబు 26:7-8, 14 ప్రకారం, యోబు యెహోవాపట్ల భక్తిపూర్వక భయాన్ని ఎలా వృద్ధిచేసుకున్నాడు? (బి) మనం కూడా యెహోవాపట్ల భక్తిపూర్వక భయాన్ని ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

12 యెహోవాపట్ల భక్తిపూర్వక భయాన్ని వృద్ధిచేసుకోవడం ద్వారా యోబు తన ప్రేమను పెంచుకున్నాడు. యోబు సృష్టిలోని అద్భుతాల గురించి ధ్యానించాడు. (యోబు 26:7-8, 14 చదవండి.) భూమి, ఆకాశం, మేఘాలు, ఉరుముల గురించి ఆలోచించినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. యెహోవా సృష్టించిన వాటన్నిటి గురించి తనకు తెలిసింది చాలా తక్కువని యోబు అర్థంచేసుకున్నాడు. అంతేకాదు, దేవుని మాటల్ని కూడా ఆయన విలువైనవిగా ఎంచాడు. ఆ మాటల గురించి యోబు ఇలా అన్నాడు, ‘ఆయన నోటి మాటలు విలువైనవని భావించాను.’ (యోబు 23:12, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యోబు యెహోవాపట్ల భక్తిపూర్వక భయాన్ని, గౌరవాన్ని వృద్ధిచేసుకున్నాడు. యోబు తన తండ్రిని ప్రేమించాడు, సంతోషపెట్టాలని కోరుకున్నాడు. వీటన్నిటి వల్ల యథార్థంగా ఉండాలనే యోబు నిశ్చయత ఇంకా బలపడింది. మనం కూడా యోబు చేసినట్టే చేయాలి. సృష్టిలోని అద్భుతాల గురించి యోబు కాలంలోని ప్రజల కన్నా మనకే ఎక్కువ తెలుసు. అంతేకాదు యెహోవా నిజంగా ఎవరో తెలుసుకోవడానికి మన దగ్గర పూర్తి బైబిలు ఉంది. మనం నేర్చుకునే విషయాలన్నీ మన హృదయంలో భక్తిపూర్వక భయాన్ని, గౌరవాన్ని నింపుతాయి. దానివల్ల మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయనకు లోబడతాం. అంతేకాదు యథార్థంగా ఉండాలని మరింతగా కోరుకుంటాం.—యోబు 28:28.

అశ్లీల చిత్రాలను చూడకుండా ఉండడం ద్వారా యథార్థంగా ఉండాలనే మన నిశ్చయతను బలపర్చుకుంటాం (13 పేరాలు చూడండి) *

13-14. (ఎ) యోబు 31:1 ప్రకారం, యోబు యెహోవాకు లోబడడానికి ఎలా కృషి చేశాడు? (బి) యోబు ఆదర్శాన్ని మనమెలా పాటించవచ్చు?

13 యోబు ప్రతీవిషయంలో యెహోవాకు లోబడడంవల్ల యథార్థంగా ఉండగలిగాడు. యథార్థంగా ఉండాలంటే యెహోవాకు లోబడాలని యోబుకు తెలుసు. నిజానికి, మనం యెహోవాకు లోబడుతున్న ప్రతీసారి యథార్థంగా ఉండాలనే మన నిశ్చయత బలపడుతుంది. ప్రతీరోజు యెహోవాకు లోబడడానికి యోబు చాలా కృషిచేశాడు. ఉదాహరణకు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. (యోబు 31:1 చదవండి.) పెళ్లయిన వ్యక్తిగా, తన భార్యపట్ల కాకుండా మరో స్త్రీ పట్ల అనవసరమైన ఆసక్తి చూపించడం తప్పని ఆయనకు తెలుసు. నేడున్న లోకంలో మనకు లైంగిక శోధనలు అంతకంతకూ ఎక్కువౌతున్నాయి. యోబులాగే మనం కూడా మన వివాహజత పట్ల కాకుండా మరెవ్వరి విషయంలోనూ అనవసరమైన ఆసక్తి చూపించకుండా ఉంటామా? అశ్లీలచిత్రాలు చూడకుండా ఉంటామా? (మత్త. 5:28) ప్రతీరోజు మనం అలాంటి ఆత్మనిగ్రహాన్ని చూపిస్తే యథార్థంగా ఉండాలనే మన నిశ్చయత బలపడుతుంది.

వస్తుసంపదల విషయంలో సరైన అభిప్రాయం కలిగివుండడం ద్వారా యథార్థంగా ఉండాలనే మన నిశ్చయతను బలపర్చుకుంటాం (14 పేరాలు చూడండి) *

14 వస్తుసంపదల విషయంలో కూడా యోబు యెహోవాకు లోబడ్డాడు. వస్తుసంపదల మీద నమ్మకం ఉంచితే ఘోరమైన పాపం చేసినట్లు అవుతుందని, దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుందని యోబు అర్థంచేసుకున్నాడు. (యోబు 31:24-25, 27-28) నేడున్న లోకం వస్తుసంపదలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. కానీ బైబిలు చెప్తున్నట్లు వాటి విషయంలో మనం సరైన అభిప్రాయాన్ని వృద్ధి చేసుకుంటే, యథార్థంగా ఉండాలనే మన నిశ్చయత బలపడుతుంది.—సామె. 30:8, 9; మత్త. 6:19-21.

మన నిరీక్షణను మనసులో సజీవంగా ఉంచుకోవడం ద్వారా యథార్థంగా ఉండాలనే మన నిశ్చయతను బలపర్చుకుంటాం (15 పేరాలు చూడండి) *

15. (ఎ) యథార్థంగా ఉండడానికి యోబుకు ఏది సహాయం చేసింది? (బి) మన నిరీక్షణను మనసులో సజీవంగా ఉంచుకోవాలంటే మనం ఏం గుర్తుంచుకోవాలి?

15 దేవుడు ఇవ్వబోయే నిరీక్షణ మీద మనసుపెట్టడం ద్వారా యోబు యథార్థంగా ఉండగలిగాడు. తన యథార్థతను దేవుడు విలువైనదిగా ఎంచుతున్నాడని యోబు నమ్మాడు. (యోబు 31:6, 7) యోబు కష్టాలు అనుభవించినప్పటికీ, యెహోవా చివరికి తనకు ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ నమ్మకం వల్లే ఆయన చివరివరకు యథార్థంగా ఉండగలిగాడు. యోబు యథార్థతను చూసి యెహోవా చాలా సంతోషించాడు. ఎంతగా అంటే, ఆయన ఇంకా అపరిపూర్ణుడిగా ఉండగానే యెహోవా గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. (యోబు 42:12-16; యాకో. 5:11) భవిష్యత్తులో యోబు ఇంకా గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాడు. యెహోవా మీ యథార్థతను చూసి ప్రతిఫలం ఇస్తాడనే బలమైన నమ్మకం మీకుందా? మన దేవుడు మార్పులేనివాడు. (మలా. 3:6) మన యథార్థతను యెహోవా విలువైనదిగా ఎంచుతాడని మనం గుర్తుంచుకుంటే, అద్భుతమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటామనే మన నిరీక్షణను మనసులో సజీవంగా ఉంచుకుంటాం.—1 థెస్స. 5:8, 9.

16. మనం ఏమని తీర్మానించుకోవాలి?

16 కాబట్టి ఎల్లప్పుడూ యథార్థంగా ఉండాలని తీర్మానించుకోండి! కొన్నిసార్లు, మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎవ్వరూ యథార్థంగా ఉండట్లేదని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఒంటరివాళ్లు కాదు. యథార్థంగా ఉంటున్న నమ్మకమైన సేవకులు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్లలో మీరూ ఒకరిగా ఉంటారు. అంతేకాదు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినా తమ యథార్థతను కాపాడుకున్న ఎంతోమంది ప్రాచీనకాల నమ్మకమైన స్త్రీపురుషుల గుంపులో మీరూ సభ్యులౌతారు. (హెబ్రీ. 11:36-38; 12:1) కాబట్టి మనందరం, “నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని చెప్పిన యోబులాగే యథార్థంగా ఉండాలని నిశ్చయించుకుందాం. మన యథార్థత ద్వారా యెహోవాకు ఎల్లప్పుడూ మహిమ తీసుకొద్దాం!

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

^ పేరా 5 యథార్థత అంటే ఏంటి? తన సేవకుల్లో ఉన్న ఆ లక్షణాన్ని యెహోవా ఎందుకు విలువైనదిగా చూస్తాడు? మనం ఎందుకు యథార్థంగా ఉండాలి? ఈ ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న జవాబుల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అంతేకాదు, ప్రతీరోజు యథార్థంగా ఉండాలనే మన నిశ్చయతను ఎలా బలపర్చుకోవచ్చో తెలుసుకుంటాం. నిజానికి మనం యథార్థంగా ఉండడం వల్ల ఎన్నో ఆశీర్వాదాల్ని పొందుతాం.

^ పేరా 3 జంతువుల విషయంలో, “లోపంలేని” అని అనువదించిన హీబ్రూ పదానికి, మనుషుల విషయంలో “యథార్థత” అని అనువదించబడిన పదంతో సంబంధం ఉంది.

^ పేరా 50 చిత్రాల వివరణ: యోబు తన పిల్లల్లో కొంతమందికి యెహోవా సృష్టిలోని అద్భుతాల గురించి చెప్తున్నాడు.

^ పేరా 52 చిత్రాల వివరణ: తోటి ఉద్యోగులు అశ్లీలచిత్రాలు చూస్తూ తనను కూడా పిలుస్తుంటే అక్కడ నుండి వెళ్లిపోతున్న ఒక సహోదరుడు.

^ పేరా 54 చిత్రాల వివరణ: తనకు అవసరంలేని, తన స్తోమతకు మించిన ఖరీదైన పెద్ద టీవీ కొనమనే ఒత్తిడిని అధిగమిస్తున్న ఆ సహోదరుడు.

^ పేరా 56 చిత్రాల వివరణ: అతను సమయం తీసుకొని పరదైసు నిరీక్షణ గురించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తున్నాడు.