కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 7

సాత్వికంగా ఉంటూ యెహోవాను సంతోషపెట్టండి

సాత్వికంగా ఉంటూ యెహోవాను సంతోషపెట్టండి

‘భూమ్మీదున్న సాత్వికులారా, మీరంతా యెహోవాను వెదకండి. సాత్వికాన్ని వెదకండి.’—జెఫ. 2:3, NW.

పాట 80 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) మోషే ఎలాంటి వ్యక్తని బైబిలు చెప్తుంది? అతను ఏం చేశాడు? (బి) సాత్వికాన్ని అలవర్చుకోవడానికి మనకు ఏ బలమైన కారణం ఉంది?

“మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు” అని బైబిలు చెప్తుంది. (సంఖ్యా. 12:3) అంటే మోషే బలహీనుడని, నిర్ణయాలు తీసుకోలేని అసమర్థుడని, పిరికివాడని దానర్థమా? బహుశా, సాత్వికంగా ఉండే వ్యక్తి అలానే ఉంటాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ అది తప్పు. ఎందుకంటే మోషే బలవంతుడు, నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడలేదు, ధైర్యవంతుడు. యెహోవా సహాయంతో అతను శక్తిమంతుడైన ఐగుప్తు రాజుతో ముఖాముఖిగా మాట్లాడాడు, దాదాపు 30 లక్షలమందిని ఎడారి గుండా నడిపించాడు, శత్రువులతో పోరాడేలా ఇశ్రాయేలీయులకు సహాయం చేశాడు.

2 మోషేకు వచ్చినలాంటి సమస్యలు మనకు ఎదురుకాకపోవచ్చు. కానీ కొంతమంది ప్రజల వల్ల లేదా మనకు ఎదురయ్యే పరిస్థితుల వల్ల రోజూ సాత్వికంగా ఉండడం కష్టం కావచ్చు. అయినప్పటికీ, సాత్వికాన్ని అలవర్చుకోవడానికి మనకు ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే, సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారని యెహోవా మాటిస్తున్నాడు. (కీర్త. 37:11) మీరు సాత్వికులేనా? మీరు సాత్వికులని ఇతరులు అనుకుంటారా? ఆ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు, అసలు సాత్వికం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి.

సాత్వికం అంటే ఏంటి?

3-4. (ఎ) సాత్వికం అనే లక్షణాన్ని దేనితో పోల్చవచ్చు? (బి) సాత్వికంగా ఉండాలంటే ఏ నాలుగు లక్షణాలు చూపించాలి? ఎందుకు?

3 సాత్వికం * ఒక అందమైన పెయింటింగ్‌ లాంటిది. ఎలా? కళాకారుడు ఒక పెయింటింగ్‌ని వేయడానికి ఆకర్షణీయమైన వేర్వేరు రంగుల్ని ఉపయోగిస్తాడు. అలాగే మనం కూడా సాత్వికులుగా ఉండాలంటే ఆకర్షణీయమైన వేర్వేరు లక్షణాలు చూపించాలి. ఆ లక్షణాల్లో కొన్ని ఏవంటే: వినయం, లోబడివుండడం, సౌమ్యత, ధైర్యం. యెహోవాను సంతోషపెట్టడానికి ఆ లక్షణాలు మనకెందుకు అవసరం?

4 వినయస్థులు మాత్రమే దేవుని ఇష్టానికి లోబడతారు. మనం సౌమ్యంగా ఉండడం దేవుని ఇష్టంలో ఒక భాగం. (మత్త. 5:5; గల. 5:23) మనం దేవుని ఇష్టాన్ని చేసినప్పుడు సాతానుకు కోపం వస్తుంది. అందుకే మనం వినయంగా, సౌమ్యంగా ఉన్నప్పటికీ సాతాను లోకంలో ఉన్న చాలామంది మనల్ని ద్వేషిస్తారు. (యోహా. 15:18, 19) కాబట్టి సాతానును ఎదిరించడానికి మనకు ధైర్యం కావాలి.

5-6. (ఎ) సాతాను సాత్వికులను ఎందుకు ద్వేషిస్తాడు? (బి) ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

5 సాత్వికంలేని వ్యక్తులు గర్వం, విపరీతమైన కోపం చూపిస్తారు, అలాంటివాళ్లు యెహోవాకు లోబడరు. సాతాను సరిగ్గా అలాంటివాడే. అతను సాత్వికుల్ని ద్వేషిస్తాడు! ఎందుకంటే సాత్వికులు సాతానుకులేని మంచి లక్షణాల్ని చూపిస్తూ అతను చెడ్డవాడని, అబద్ధికుడని నిరూపిస్తారు. సాతాను ఏం చెప్పినా, ఏం చేసినా సాత్వికుల్ని యెహోవా సేవచేయకుండా ఆపలేడు!—యోబు 2:3-5.

6 సాత్వికంగా ఉండడం ఎప్పుడు కష్టం కావచ్చు? మనం ఎందుకు సాత్వికం చూపిస్తూనే ఉండాలి? ఆ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడానికి మోషే, ముగ్గురు హెబ్రీ యువకులు, యేసు ఉంచిన ఆదర్శం గురించి మనం పరిశీలిద్దాం.

సాత్వికంగా ఉండడం ఎప్పుడు కష్టం కావచ్చు?

7-8. ఇతరులు తనతో అగౌరవంగా వ్యవహరించినప్పుడు మోషే ఎలా స్పందించాడు?

7 అధికారంలో ఉన్నప్పుడు: అధికారంలో ఉన్నవాళ్లకు సాత్వికంగా ఉండడం కష్టం కావచ్చు. ముఖ్యంగా, తమ అధికారం కిందున్నవాళ్లు తమతో అగౌరవంగా వ్యవహరించినప్పుడు లేదా తమ నిర్ణయాల్ని ప్రశ్నించినప్పుడు సాత్వికంగా ఉండడం కష్టం కావచ్చు. మీకెప్పుడైనా అలా జరిగిందా? మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీతో అలా వ్యవహరిస్తే, అప్పుడేంటి? మీరెలా స్పందిస్తారు? మోషే ఏం చేశాడో పరిశీలించండి.

8 యెహోవా మోషేను ఇశ్రాయేలీయులకు నాయకునిగా నియమించాడు. అంతేకాదు అతనితో వాళ్లకోసం నియమాల్ని కూడా రాయించాడు. మోషేకు యెహోవా మద్దతు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ, అతని సొంత అక్క, అన్న అంటే మిర్యాము, అహరోనులు అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు; అతను కూషీయురాలిని పెళ్లి చేసుకున్నందుకు తప్పుబట్టారు. మోషే స్థానంలో వేరే ఎవరైనా ఉంటే వాళ్లకు వెంటనే కోపం వచ్చేది, పగతీర్చుకోవడానికి కూడా ప్రయత్నించేవాళ్లు. కానీ మోషే అలా చేయలేదు. అతను త్వరగా కోపం తెచ్చుకోలేదు. అంతేకాదు, మిర్యాముకు వచ్చిన కుష్ఠు వ్యాధిని బాగుచేయమని మోషే యెహోవాను బ్రతిమాలాడు. (సంఖ్యా. 12:1-13) మోషే ఎందుకు అలా స్పందించాడు?

మిర్యాముకు వచ్చిన కుష్ఠు వ్యాధిని బాగుచేయమని మోషే యెహోవాను బ్రతిమాలాడు (8వ పేరా చూడండి)

9-10. (ఎ) మోషే ఏ విషయాన్ని అర్థం చేసుకోవడానికి యెహోవా సహాయం చేశాడు? (బి) మోషే నుండి కుటుంబ యజమానులు, సంఘపెద్దలు ఏం నేర్చుకోవచ్చు?

9 మోషే యెహోవా ఇచ్చిన శిక్షణను స్వీకరించాడు. దాదాపు 40 సంవత్సరాల క్రితం మోషే ఐగుప్తు రాజ కుటుంబంలో ఉన్నప్పుడు అతనికి సాత్వికం లేదు. నిజానికి, ఒక సందర్భంలో మోషేకు ఎంత కోపం వచ్చిందంటే, అన్యాయంగా ప్రవర్తించిన ఒకతన్ని చంపేశాడు. తన పనుల్ని యెహోవా అంగీకరిస్తాడని మోషే అనుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి ధైర్యం ఒక్కటే సరిపోదని మోషే అర్థంచేసుకునేలా యెహోవా 40 సంవత్సరాల పాటు సహాయం చేశాడు. మోషేకు సాత్వికం కూడా అవసరం. అతను సాత్వికంగా ఉండాలంటే వినయస్థుడిగా, లోబడేవాడిగా, సౌమ్యుడిగా కూడా ఉండాలి. మోషే యెహోవా నేర్పించిన పాఠాన్ని చక్కగా అర్థంచేసుకుని, చాలా మంచి పర్యవేక్షకుడు అయ్యాడు.—నిర్గ. 2:11, 12; అపొ. 7:21-30, 36.

10 నేడు కుటుంబ యజమానులు, సంఘపెద్దలు మోషేను ఆదర్శంగా తీసుకోవాలి. మీతో ఎవరైనా అగౌరవంగా ప్రవర్తిస్తే త్వరగా కోపం తెచ్చుకోకండి. మీ పొరపాట్లను వినయంగా ఒప్పుకోండి. (ప్రసం. 7:9, 20) సమస్యల్ని పరిష్కరించేటప్పుడు యెహోవా ఇచ్చే నిర్దేశానికి లోబడండి. అంతేకాదు ఎల్లప్పుడూ సౌమ్యంగా జవాబివ్వండి. (సామె. 15:1) అలా ప్రవర్తించే కుటుంబ యజమానులు, సంఘపెద్దలు యెహోవాను సంతోషపెడతారు, శాంతిని నెలకొల్పుతారు, సాత్వికంగా ఉండే విషయంలో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు.

11-13. ముగ్గురు హెబ్రీ యువకులు మనకు ఎలాంటి ఆదర్శం ఉంచారు?

11 హింసలు ఎదురైనప్పుడు: చరిత్రంతటిలో మానవ పాలకులు యెహోవా ప్రజల్ని హింసిస్తూ వచ్చారు. మనం వాళ్లకు కాకుండా దేవునికి లోబడుతున్నామనే కోపంతో, మనం చెడు పనులు చేస్తున్నామని వాళ్లు నిందించవచ్చు. (అపొ. 5:29) వాళ్లు మనల్ని ఎగతాళి చేయవచ్చు, జైల్లో వేయవచ్చు, కొట్టవచ్చు కూడా. అయినప్పటికీ మనం యెహోవా సహాయంతో, వాళ్లమీద పగతీర్చుకోకుండా సౌమ్యంగా ఉంటాం.

12 హనన్యా, మిషాయేలు, అజర్యా అనే ముగ్గురు హెబ్రీ యువకుల ఉదాహరణ పరిశీలించండి. * బబులోను రాజు ఒక పెద్ద బంగారు విగ్రహం చేయించి దానికి మొక్కమని వాళ్లను ఆజ్ఞాపించాడు. కానీ వాళ్లు ఆ విగ్రహానికి ఎందుకు మొక్కరో రాజుకు సౌమ్యంగా వివరించారు. భగభగ మండే కొలిమిలో పడేస్తానని రాజు బెదిరించినా వాళ్లు దేవునికే లోబడ్డారు. యెహోవా వాళ్లను వెంటనే రక్షించాడు, కానీ ఆయన అలా రక్షిస్తాడని వాళ్లు అనుకోలేదు. యెహోవా ఏది అనుమతించినా దాన్ని అనుభవించడానికి వాళ్లు సిద్ధపడ్డారు. (దాని. 3:1, 8-28) ఆ విధంగా, సాత్వికులు పిరికివాళ్లు కాదని వాళ్లు నిరూపించారు. ఏ రాజు గానీ, బెదిరింపు గానీ, శిక్ష గానీ మనల్ని యెహోవాకు ‘సంపూర్ణ భక్తి’ చూపించకుండా ఆపలేవు.—నిర్గ. 20:4-5, NW.

13 దేవునిపట్ల మన విశ్వసనీయత పరీక్షించబడినప్పుడు, మనం ఆ ముగ్గురు హెబ్రీ యువకుల్ని ఎలా అనుకరించవచ్చు? మనం వినయం చూపిస్తూ, యెహోవా మనపట్ల శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకంతో ఉంటాం. (కీర్త. 118:6, 7) మనల్ని నిందించేవాళ్లకు సౌమ్యంగా, గౌరవపూర్వకంగా జవాబిస్తాం. (1 పేతు. 3:15) అంతేకాదు మన ప్రేమగల తండ్రైన యెహోవాతో ఉన్న స్నేహాన్ని పాడుచేసే ఏ పనికైనా దూరంగా ఉంటాం.

ఇతరులు మనల్ని వ్యతిరేకించినప్పుడు గౌరవపూర్వకంగా జవాబిస్తాం (13వ పేరా చూడండి)

14-15. (ఎ) ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం జరిగే ప్రమాదం ఉంది? (బి) యెషయా 53:7, 10 ప్రకారం ఒత్తిడిలో కూడా సాత్వికంగా ఉండే విషయంలో యేసు అత్యుత్తమ ఆదర్శం అని ఎలా చెప్పవచ్చు?

14 ఒత్తిడిలో ఉన్నప్పుడు: మనందరం వేర్వేరు కారణాల వల్ల ఒత్తిడికి గురౌతాం. స్కూల్‌లో పరీక్షలు రాసే ముందు లేదా ఉద్యోగంలో ఏదైనా పని చేసే ముందు మనం ఒత్తిడికి గురైవుండవచ్చు. ఏదైనా వైద్య చికిత్స గురించి ఆలోచించినప్పుడు కూడా ఒత్తిడి పెరగవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు సాత్వికంగా ఉండడం కష్టం. ఆ సమయంలో చిన్నచిన్న విషయాలకు కూడా చిరాకు పడతాం. అంతేకాదు దురుసుగా మాట్లాడే, ప్రవర్తించే ప్రమాదం ఉంది. మీరెప్పుడైనా ఒత్తిడికి గురైతే యేసు ఆదర్శం గురించి ఆలోచించండి.

15 యేసు భూమ్మీద గడిపిన చివరి నెలల్లో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. తాను చంపబడతానని, తీవ్రమైన బాధ అనుభవిస్తానని ఆయనకు తెలుసు. (యోహా. 3:14, 15; గల. 3:13) చనిపోవడానికి కొన్ని నెలల ముందు, “నేను ఎంతో వేదన పడుతున్నాను” అని ఆయన అన్నాడు. (లూకా 12:50) ఇంకొన్ని రోజుల్లో చనిపోతాడనగా యేసు “నాకు ఆందోళనగా ఉంది” అన్నాడు. ఆయన దేవునికి చేసిన ప్రార్థనలో ఉపయోగించిన మాటల్నిబట్టి ఆయన వినయస్థుడని, దేవునికి లోబడే వ్యక్తని అర్థమౌతుంది. ఆయనిలా ప్రార్థించాడు, “తండ్రీ, జరగబోయేదాని నుండి నన్ను కాపాడు. అయినా, దీని కోసమే నేను వచ్చాను. తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” (యోహా. 12:27, 28) ఆఖరికి చనిపోయే సమయం వచ్చినప్పుడు యేసు ధైర్యంగా తనను తాను శత్రువులకు అప్పగించుకున్నాడు. వాళ్లు ఆయన్ని తీవ్రంగా హింసించి, అవమానించి చంపారు. యేసు ఎంతో ఒత్తిడిని, బాధను అనుభవించినప్పటికీ దేవుని ఇష్టాన్ని సాత్వికంగా నెరవేర్చాడు. ఒత్తిడిలో కూడా సాత్వికంగా ఉండే విషయంలో యేసు అత్యుత్తమ ఆదర్శం ఉంచాడని నిస్సందేహంగా చెప్పవచ్చు.—యెషయా 53:7, 10 చదవండి.

సాత్వికం చూపించే విషయంలో యేసు అత్యుత్తమ ఆదర్శం (16-17 పేరాలు చూడండి) *

16-17. (ఎ) యేసు స్నేహితులు ఆయన సాత్వికాన్ని ఎలా పరీక్షించారు? (బి) మనం యేసును ఎలా అనుకరించవచ్చు?

16 యేసు భూమ్మీద గడిపిన చివరిరాత్రి, తన సన్నిహిత స్నేహితులే ఆయన సాత్వికాన్ని పరీక్షించారు. ఆరోజు రాత్రి యేసు అనుభవించిన ఒత్తిడి గురించి ఆలోచించండి. యేసు చనిపోయే వరకు నమ్మకంగా ఉంటాడా? ఆయన నమ్మకంగా ఉండకపోతే, ఏ మనిషీ శాశ్వత జీవితం పొందలేడు. (రోమా. 5:18, 19) అంతకన్నా ముఖ్యంగా, యేసు పనులు తండ్రి పేరు మీద ప్రభావం చూపిస్తాయి. (యోబు 2:4) తన సన్నిహిత స్నేహితులైన అపొస్తలులతో చివరిసారి భోజనం చేస్తున్నప్పుడు, వాళ్లు “తమలో ఎవరు అందరికన్నా గొప్ప” అని తీవ్రంగా వాదించుకున్నారు. యేసు ఆ విషయంలో వాళ్లను ఎన్నోసార్లు సరిదిద్దాడు. ఆఖరికి ఆరోజు సాయంత్రం కూడా వాళ్లు వాదించుకున్నప్పుడు యేసు కోపం తెచ్చుకోకుండా వాళ్లను సౌమ్యంగా సరిదిద్దాడు! వాళ్ల ఆలోచనాతీరు ఎలా ఉండాలో దయగా, స్థిరంగా చెప్పాడు. ఆ తర్వాత, తనను నమ్మకంగా అంటిపెట్టుకుని ఉన్నందుకు తన స్నేహితుల్ని మెచ్చుకున్నాడు.—లూకా 22:24-28; యోహా. 13:1-5, 12-15.

17 ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే మీరెలా స్పందిస్తారు? యేసును అనుకరిస్తూ ఒత్తిడిలో కూడా సౌమ్యంగా ఉండండి. “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ” ఉండమని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు ఇష్టంగా లోబడండి. (కొలొ. 3:13) మనందరం మన మాటల ద్వారా, పనుల ద్వారా ఇతరులకు చిరాకు తెప్పిస్తామని గుర్తుంచుకుంటే ఆ ఆజ్ఞను సులభంగా పాటిస్తాం. (సామె. 12:18; యాకో. 3:2, 5) అంతేకాదు, ఇతరుల్లో మీరు ఏదైనా మంచిని గమనిస్తే మెచ్చుకోండి.—ఎఫె. 4:29.

ఎల్లప్పుడూ సాత్వికంగా ఎందుకు ఉండాలి?

18. సాత్వికులు మంచి నిర్ణయాలు తీసుకునేలా యెహోవా ఎలా సహాయం చేస్తాడు? కానీ మనం ఏం చేయాలి?

18 మంచి నిర్ణయాలు తీసుకుంటాం. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు యెహోవా మనకు సహాయం చేస్తాడు. కానీ మనం సాత్వికంగా ఉంటేనే ఆయన సహాయం చేస్తాడు. సాత్వికుల ప్రార్థన వింటానని ఆయన మాటిస్తున్నాడు. (కీర్త. 10:17) ఆయన వినడం కన్నా ఎక్కువే చేస్తాడు. ‘ఆయన సాత్వికుల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు, వాళ్లకు తన మార్గాన్ని బోధిస్తాడు’ అని బైబిలు చెప్తుంది. (కీర్త. 25:9, NW) బైబిలు ద్వారా, నమ్మకమైన బుద్ధిగల దాసుడు అందించే ప్రచురణలు, * వీడియోలు, మీటింగ్స్‌ ద్వారా యెహోవా మనల్ని నడిపిస్తాడు. (మత్త. 24:45-47) అయితే, యెహోవా ఇచ్చే సమాచారాన్ని మనం అధ్యయనం చేస్తూ, నేర్చుకున్నవాటిని మనస్ఫూర్తిగా పాటిస్తూ దేవుని సహాయం అవసరమని వినయంగా గుర్తించాలి.

19-21. కాదేషు దగ్గర మోషే ఏ పొరపాటు చేశాడు? దాన్నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

19 పొరపాట్లు చేయకుండా ఉంటాం. మోషే గురించి మళ్లీ ఆలోచించండి. దశాబ్దాలపాటు అతను సాత్వికంగా ఉన్నాడు, యెహోవాను సంతోషపెట్టాడు. కానీ, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చివర్లో మోషే సాత్వికంగా ఉండలేకపోయాడు. ఐగుప్తులో బహుశా మోషే ప్రాణాల్ని కాపాడిన అతని అక్క మిర్యాము చనిపోయింది, ఆమెను కాదేషు దగ్గర పాతిపెట్టారు. అది జరిగి ఎన్నో రోజులు గడవకముందే, మోషే తమను పట్టించుకోవట్లేదని ఇశ్రాయేలీయులు మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈసారి నీళ్లు లేవని వాళ్లు మోషేతో గొడవపడ్డారు. మోషే ద్వారా యెహోవా ఎన్నో అద్భుతాలు చేసినా, మోషే ఎన్నో ఏళ్లుగా వాళ్లను నిస్వార్థంగా నడిపిస్తున్నా ప్రజలు ఫిర్యాదు చేశారు. వాళ్లు కేవలం నీళ్లు లేవని మాత్రమే కాదుగానీ, వాళ్ల దాహానికి కారణం మోషేయే అన్నట్లు ఫిర్యాదు చేశారు.—సంఖ్యా. 20:1-5, 9-11.

20 అప్పుడు మోషేకు విపరీతమైన కోపం వచ్చి తన సాత్వికాన్ని కోల్పోయాడు. యెహోవా ఆజ్ఞాపించినట్లు, విశ్వాసం చూపిస్తూ బండతో మాట్లాడే బదులు, మోషే ప్రజలపై కోపంగా అరిచి, తానే ఆ అద్భుతం చేస్తున్నట్లు మాట్లాడాడు. తర్వాత, మోషే ఆ బండను రెండుసార్లు కొట్టాడు, అప్పుడు అందులో నుండి నీళ్లు ప్రవాహంలా ఉబికాయి. గర్వం, కోపం వల్ల మోషే పెద్ద తప్పు చేశాడు. (కీర్త. 106:32, 33) సాత్వికాన్ని తాత్కాలికంగా కోల్పోవడం వల్ల మోషే వాగ్దాన దేశంలోకి ప్రవేశించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.—సంఖ్యా. 20:12.

21 ఈ సంఘటన నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిగా, ఎల్లప్పుడూ సాత్వికంగా ఉండడానికి కృషిచేయాలి. మనం ఒక్క క్షణం నిర్లక్ష్యంగా ఉన్నా మనలో మళ్లీ గర్వం మొలకెత్తి, మనం అనాలోచితంగా మాట్లాడే, ప్రవర్తించే ప్రమాదం ఉంది. రెండోదిగా, ఒత్తిడిలో ఉన్నప్పుడు సాత్వికంగా ఉండడం కష్టం కావచ్చు. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా సాత్వికంగా ఉండడానికి గట్టి కృషిచేయాలి.

22-23. (ఎ) మనం ఎందుకు ఎల్లప్పుడూ సాత్వికంగా ఉండాలి? (బి) జెఫన్యా 2:3⁠లో ఉన్న మాటలు ఏం సూచిస్తున్నాయి?

22 మనం కాపాడబడతాం. త్వరలో యెహోవా సాత్వికుల్ని మాత్రమే భూమ్మీద ఉంచి, చెడ్డవాళ్లందర్నీ నాశనం చేస్తాడు. అప్పుడు భూమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. (కీర్త. 37:10, 11) మరి ఆ సాత్వికుల్లో మీరూ ఉంటారా? జెఫన్యా 2:3⁠లో యెహోవా చెప్పినట్లు చేస్తే మీరు ఉండగలరు. (చదవండి.)

23 జెఫన్యా 2:3⁠లో ‘ఒకవేళ మీరు దాచబడుదురు’ అని ఎందుకు ఉంది? అంటే తనను సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లను, తాను ప్రేమించేవాళ్లను కాపాడే సామర్థ్యం యెహోవాకు లేదనా? ఎంతమాత్రం కాదు. బదులుగా, మనం కాపాడబడాలంటే మనం చేయాల్సిన కృషి కూడా ఉందని ఆ మాటలు సూచిస్తున్నాయి. మనం సాత్వికంగా ఉంటూ యెహోవాను సంతోషపెట్టడానికి ఇప్పుడు కృషిచేస్తే యెహోవా ఉగ్రత దినాన్ని తప్పించుకుని, శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని పొందవచ్చు.

పాట 120 క్రీస్తులా సౌమ్యంగా ఉండండి

^ పేరా 5 సాత్వికం పుట్టుకతో వచ్చే లక్షణం కాదు. మనం దాన్ని వృద్ధిచేసుకోవాలి. వినయస్థులతో వ్యవహరిస్తున్నప్పుడు సాత్వికంగా ఉండడం తేలికే గానీ గర్విష్ఠులతో వ్యవహరిస్తున్నప్పుడు సాత్వికంగా ఉండడం కష్టంగా ఉండవచ్చు. అయితే సాత్వికం అనే చక్కని లక్షణాన్ని అలవర్చుకోవడానికి మనం అధిగమించాల్సిన కొన్ని సవాళ్ల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చించుకుంటాం.

^ పేరా 3 పదాల వివరణ: సాత్వికం. సాత్వికులు ఇతరులతో దయగా వ్యవహరిస్తారు, చిరాకు తెప్పించే పరిస్థితుల్లో కూడా సౌమ్యంగా ఉంటారు. వినయం. వినయస్థులు గర్వం లేదా అహంకారం చూపించరు; ఇతరుల్ని తమకన్నా గొప్పవాళ్లుగా ఎంచుతారు. యెహోవా విషయానికొస్తే, తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లతో ప్రేమగా, దయగా వ్యవహరించడం ద్వారా ఆయన వినయం చూపిస్తాడు.

^ పేరా 12 బబులోనీయులు ఈ ముగ్గురు హెబ్రీయులకు షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే పేర్లు పెట్టారు.—దాని. 1:7.

^ పేరా 18 ఉదాహరణకు 2011, ఏప్రిల్‌ 15 కావలికోట సంచికలో “దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 59 చిత్రాల వివరణ: తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకున్నప్పుడు యేసు కోపం తెచ్చుకోకుండా సౌమ్యంగా వాళ్లను సరిదిద్దుతున్నాడు.