కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 8

కృతజ్ఞతను ఎందుకు చూపించాలి?

కృతజ్ఞతను ఎందుకు చూపించాలి?

“కృతజ్ఞులై ఉండండి.”—కొలొ. 3:15.

పాట 46 యెహోవా, నీకు కృతజ్ఞతలు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యేసు బాగుచేసిన ఒక సమరయుడు తన కృతజ్ఞతను ఎలా చూపించాడు?

ఆ పదిమంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్లు కుష్ఠు రోగులు, వాళ్ల ఆరోగ్యం బాగౌతుందనే ఆశ వాళ్లకు లేదు. కానీ ఒకరోజు వాళ్లు గొప్ప బోధకుడైన యేసును దూరం నుండి చూశారు. ఆయన అన్నిరకాల వ్యాధుల్ని బాగుచేశాడని వాళ్లు విన్నారు. ఆయన తమను కూడా బాగుచేయగలడని వాళ్లు నమ్మారు. అందుకే వాళ్లు “యేసూ, బోధకుడా, మమ్మల్ని కరుణించు!” అని బిగ్గరగా కేకలు వేశారు. ఆ పదిమంది వ్యాధి, పూర్తిగా నయం అయిపోయింది. యేసు దయ చూపించినందుకు వాళ్లందరూ తప్పకుండా కృతజ్ఞతతో ఉండేవుంటారు. అయితే, వాళ్లలో ఒకతను మాత్రం తన కృతజ్ఞతను * కేవలం మనసులోనే ఉంచుకోకుండా దాన్ని యేసు ముందు వ్యక్తం చేశాడు. సమరయుడైన ఆ వ్యక్తి దేవుణ్ణి “బిగ్గరగా” మహిమపర్చడానికి కదిలించబడ్డాడు.—లూకా 17:12-19.

2-3. (ఎ) మనం కొన్నిసార్లు ఎందుకు కృతజ్ఞతను చూపించలేకపోతాం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 ఆ సమరయునిలాగే మనం కూడా మనమీద దయ చూపించే వాళ్లపట్ల కృతజ్ఞత చూపించాలని కోరుకుంటాం. కానీ అప్పుడప్పుడు మనకున్న కృతజ్ఞతను మాటల్లో, చేతల్లో చూపించడం మర్చిపోతాం.

3 మనం కృతజ్ఞతను మాటల్లో, చేతల్లో చూపించడం ఎందుకు ప్రాముఖ్యమో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. బైబిలుకాలాల్లో కృతజ్ఞత చూపించిన కొంతమంది, చూపించని కొంతమంది ఉదాహరణల్ని పరిశీలించి వాళ్లనుండి ఏం నేర్చుకోవచ్చో కూడా తెలుసుకుంటాం. ఆ తర్వాత, మనం కృతజ్ఞతను ఏయే విధాలుగా చూపించవచ్చో కూడా చర్చిస్తాం.

మనం కృతజ్ఞతను ఎందుకు చూపించాలి?

4-5. మనం కృతజ్ఞతను ఎందుకు చూపించాలి?

4 కృతజ్ఞతను చూపించే విషయంలో యెహోవా దేవుడే మనకు ఆదర్శం. ఆయన అలా చూపించే ఒక మార్గం ఏంటంటే, తనను సంతోషపెట్టేవాళ్లకు ప్రతిఫలం ఇవ్వడం. (2 సమూ. 22:21; కీర్త. 13:6; మత్త. 10:40, 41) “దేవునికి ఇష్టమైన పిల్లల్లా మీరు ఆయన్ని అనుకరించండి” అని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. (ఎఫె. 5:1) కాబట్టి, మనం కృతజ్ఞతను చూపిస్తే యెహోవాను అనుకరించిన వాళ్లమౌతాం. మనం కృతజ్ఞత చూపించడానికి అదే ముఖ్యమైన కారణం!

5 మనం కృతజ్ఞతను చూపించడానికి గల ఇంకో కారణాన్ని పరిశీలించండి. కృతజ్ఞత అనేది రుచికరమైన ఆహారం లాంటిది. దాన్ని ఇతరులతో పంచుకుంటే మరింత ఆనందిస్తాం. మనం చేసినదానికి ఇతరులు కృతజ్ఞత కలిగివున్నారని తెలుసుకున్నప్పుడు మనం సంతోషిస్తాం. అలాగే మనం ఇతరులకు కృతజ్ఞతలు చెప్పినప్పుడు వాళ్లు సంతోషిస్తారు. మనకు సహాయం చేయడానికి లేదా మన అవసరాన్ని తీర్చడానికి వాళ్లు చేసిన కృషి వల్ల మనకు నిజంగా మేలు జరిగిందని వాళ్లు గ్రహించగలుగుతారు. దానివల్ల మనకూ వాళ్లకూ మధ్యున్న స్నేహం ఇంకా బలపడుతుంది.

6. మన కృతజ్ఞతను వ్యక్తం చేసే మాటల్ని, బంగారు ఆపిల్‌తో ఎందుకు పోల్చవచ్చు?

6 కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ మనం చెప్పే మాటలు చాలా విలువైనవి. బైబిలు ఇలా చెప్తుంది, “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.” (సామె. 25:11) బంగారంతో తయారుచేసిన ఆపిల్‌ని ఒక వెండి పళ్లెంలో పెట్టినప్పుడు అది చూడడానికి ఎలా ఉంటుందో ఊహించండి. అలాగే దానికి ఎంత విలువ ఉంటుందో ఆలోచించండి. మీకు ఎవరైనా అలాంటి గిఫ్ట్‌ ఇస్తే మీకెలా అనిపిస్తుంది? ఇతరులపట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ మీరు చెప్పే మాటలు కూడా అంతే విలువైనవి. అంతేకాదు ఒక బంగారు ఆపిల్‌ చాలా కాలంపాటు ఉంటుంది. అదేవిధంగా, మీరు కృతజ్ఞతను మాటల్లో వ్యక్తం చేసినప్పుడు అవి విన్న వ్యక్తి వాటిని జీవితాంతం గుర్తుంచుకుంటాడు, హృదయంలో భద్రపర్చుకుంటాడు.

వాళ్లు కృతజ్ఞతను చూపించారు

7. కీర్తన 27:4 ప్రకారం, దావీదు అలాగే ఆసాపు వంశస్థులు తమ కృతజ్ఞతను ఎలా చూపించారు?

7 ప్రాచీనకాలంలోని చాలామంది దేవుని సేవకులు కృతజ్ఞతను చూపించారు. వాళ్లలో దావీదు ఒకడు. (కీర్తన 27:4 చదవండి.) ఆయన స్వచ్ఛారాధనను విలువైనదిగా ఎంచాడు, ఆ విషయాన్ని చేతల్లో చూపించాడు. ఆయన ఆలయ నిర్మాణం కోసం చాలా పెద్ద మొత్తంలో వస్తుసంపదల్ని విరాళంగా ఇచ్చాడు. ఆసాపు వంశస్థులు కూడా కీర్తనలు లేదా స్తుతిగీతాలు రాయడం ద్వారా తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఒక కీర్తనలో వాళ్లు యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ ఆయన ‘ఆశ్చర్యకార్యాల’ మీద తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. (కీర్త. 75:1) దావీదు, ఆసాపు వంశస్థులు యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి పట్ల తమకు ఎంత కృతజ్ఞత ఉందో చూపించాలని కోరుకున్నారు. వాళ్లలాగే మీరు కూడా కృతజ్ఞతను ఏయే విధాలుగా చూపించవచ్చో ఆలోచించగలరా?

కృతజ్ఞతను చూపించడం గురించి పౌలు రోమీయులకు రాసిన ఉత్తరం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (8-9 పేరాలు చూడండి) *

8-9. అపొస్తలుడైన పౌలు తన సహోదరసహోదరీల పట్ల ఉన్న కృతజ్ఞతను ఎలా చూపించాడు? దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చివుంటుంది?

8 అపొస్తలుడైన పౌలు తోటి సహోదరసహోదరీల్ని విలువైనవాళ్లగా ఎంచాడు, ఆయన వాళ్ల గురించి చెప్పిన మాటల్ని చూస్తే ఆ విషయం అర్థమౌతుంది. ఆయన తన ప్రార్థనల్లో వాళ్లను బట్టి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు. వాళ్లు తనకు ఎంత ముఖ్యమైనవాళ్లో తాను రాసిన ఉత్తరాల్లో పౌలు తెలియజేశాడు. రోమీయులు 16:1-15 వచనాల్లో పౌలు 27 మంది క్రైస్తవుల పేర్లను ప్రస్తావించాడు. ముఖ్యంగా, తన కోసం “తమ ప్రాణాల్ని పణంగా” పెట్టిన ప్రిస్కను, అకులను గుర్తుచేసుకున్నాడు. అలాగే ఫీబే గురించి మాట్లాడుతూ ఆమె తనతో పాటు చాలామందిని “కాపాడింది” అని పౌలు చెప్పాడు. కష్టపడి పనిచేసే ఆ ప్రియమైన సహోదరసహోదరీల్ని ఆయన మెచ్చుకున్నాడు.—రోమా. 16:1-15.

9 తన సహోదరసహోదరీలు అపరిపూర్ణులని పౌలుకు తెలుసు. కానీ రోమీయులకు రాసిన ఉత్తరం చివర్లో, ఆయన వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీదే మనసుపెట్టాడు. పౌలు రాసిన మాటల్ని సంఘంలో బిగ్గరగా చదువుతున్నప్పుడు ఆ సహోదరసహోదరీలకు ఎంత ప్రోత్సాహంగా అనిపించివుంటుందో ఊహించండి. ఫలితంగా పౌలుకు, వాళ్లకు మధ్యున్న స్నేహం ఇంకా బలపడివుంటుంది. అయితే, మీ సంఘంలోనివాళ్లు చెప్పే మంచి మాటల్నిబట్టి, చేసే మంచి పనుల్నిబట్టి మీరు వాళ్లను తరచూ మెచ్చుకుంటారా?

10. యేసు తన అనుచరులను మెచ్చుకున్న విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

10 యేసు ఆసియా మైనరులోని ఆయా సంఘాలకు పంపించిన సందేశంలో, తన అనుచరులు చేసిన పనుల్నిబట్టి వాళ్లపట్ల కృతజ్ఞత వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, ఆయన తుయతైర సంఘానికి పంపించిన సందేశాన్ని ఈ మాటలతో మొదలుపెట్టాడు: “నీ పనుల గురించి, నీ ప్రేమ గురించి, నీ విశ్వాసం గురించి, నీ పరిచర్య గురించి, నీ సహనం గురించి నాకు తెలుసు. అలాగే, మొదట్లో నువ్వు చేసిన పనులకన్నా ఈమధ్య చేసిన పనులు మెరుగ్గా ఉన్నాయని కూడా నాకు తెలుసు.” (ప్రక. 2:19) వాళ్లు ఎక్కువగా చేస్తున్న పనుల్ని ప్రస్తావించడంతో పాటు, మంచి పనులు చేసేలా వాళ్లను పురికొల్పిన లక్షణాల్ని కూడా ఆయన మెచ్చుకున్నాడు. తుయతైరలో ఉన్న కొంతమందిని గద్దించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, యేసు తన సందేశాన్ని ప్రోత్సహించే మాటలతో మొదలుపెట్టి, ఆ మాటలతోనే ముగించాడు. (ప్రక. 2:25-28) సంఘాలన్నిటికి శిరస్సుగా యేసుకున్న అధికారం గురించి ఒకసారి ఆలోచించండి. మనం తనకోసం చేస్తున్న పనుల్ని బట్టి మనకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినప్పటికీ, ఆయన తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాడు. సంఘపెద్దలకు ఆయన ఎంత చక్కని ఆదర్శమో కదా!

వాళ్లు కృతజ్ఞతను చూపించలేదు

11. హెబ్రీయులు 12:16 ప్రకారం, ఏశావు పవిత్రమైన విషయాలను ఎలా చూశాడు?

11 విచారకరంగా, ప్రాచీనకాలంలో కొంతమంది కృతజ్ఞతను చూపించలేదు. ఉదాహరణకు, ఏశావు యెహోవాను ప్రేమించే, గౌరవించే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినా పవిత్రమైన విషయాలపట్ల కృతజ్ఞత చూపించలేదు. (హెబ్రీయులు 12:16 చదవండి.) అది మనకెలా తెలుసు? ఏశావు కేవలం ఒక గిన్నెడు కూర కోసం, ముందూవెనకా ఆలోచించకుండా తన జేష్ఠత్వపు హక్కును తన తమ్ముడైన యాకోబుకు అమ్మేశాడు. (ఆది. 25:30-34) ఆ తర్వాత ఏశావు, తన నిర్ణయాన్ని బట్టి చాలా బాధపడ్డాడు. అయితే, తన దగ్గర ఉన్నదాని పట్ల ఏశావు కృతజ్ఞత చూపించలేదు కాబట్టి జేష్ఠత్వపు ఆశీర్వాదం దక్కనప్పుడు దాని గురించి ఫిర్యాదు చేసే అవకాశం అతనికి లేదు.

12-13. తమకు కృతజ్ఞత లేదని ఇశ్రాయేలీయులు ఎలా చూపించారు? దాని ఫలితం ఏంటి?

12 ఇశ్రాయేలీయులు కృతజ్ఞత చూపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. యెహోవా ఐగుప్తు మీదకు పది తెగుళ్లు రప్పించి, దాని బానిసత్వం నుండి వాళ్లను విడిపించాడు. ఆ తర్వాత దేవుడు ఎర్ర సముద్రంలో ఐగుప్తీయుల సైన్యమంతటినీ నాశనం చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో కృతజ్ఞతతో యెహోవాను స్తుతిస్తూ ఆయనకు విజయగీతం పాడారు. మరి వాళ్లు ఆ కృతజ్ఞతను తర్వాత్తర్వాత కూడా చూపించారా?

13 ఇశ్రాయేలీయులకు కొత్త సమస్యలు ఎదురైనప్పుడు, యెహోవా తమ కోసం చేసిన మంచి పనులన్నిటినీ త్వరగా మర్చిపోయారు. తమకు కృతజ్ఞత లేదని చూపించారు. (కీర్త. 106:7) ఎలా? “ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.” నిజానికి వాళ్లు సణిగింది యెహోవా మీదే. (నిర్గ. 16:2, 8) తన ప్రజలు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం చూసి యెహోవా బాధపడ్డాడు. అందుకే యెహోషువా, కాలేబులు తప్ప ఆ ఇశ్రాయేలీయుల తరమంతా అరణ్యంలోనే నశించిపోతుందని యెహోవా ఆ తర్వాత ప్రవచించాడు. (సంఖ్యా. 14:22-24; 26:65) అయితే, ఈ చెడ్డ ఉదాహరణల్ని కాకుండా మంచి ఉదాహరణల్ని ఎలా అనుకరించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

నేడు కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

14-15. (ఎ) భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు కృతజ్ఞత ఎలా చూపించుకోవచ్చు? (బి) కృతజ్ఞత చూపించడం తల్లిదండ్రులు పిల్లలకు ఎలా నేర్పించవచ్చు?

14 కుటుంబంలో. కుటుంబంలో ఉన్న ప్రతీఒక్కరు కృతజ్ఞతను వ్యక్తం చేసినప్పుడు కుటుంబమంతా ప్రయోజనం పొందుతుంది. భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ఎంతెక్కువ కృతజ్ఞత చూపించుకుంటే అంతెక్కువ దగ్గరౌతారు. అప్పుడు ఒకరి పొరపాట్లను ఒకరు క్షమించడం వాళ్లకు తేలికౌతుంది. భార్యపట్ల కృతజ్ఞత ఉన్న భర్త ఆమె మంచి మాటల్ని, మంచి పనుల్ని కేవలం గమనించడమే కాదు, ఆమెను ‘పొగుడుతాడు’ కూడా. (సామె. 31:10, 28-29) తెలివిగల భార్య తన భర్తలో ఏయే విషయాలు తనకు బాగా నచ్చుతాయో ఆయనకు చెప్తుంది.

15 తల్లిదండ్రులారా, కృతజ్ఞత చూపించడం మీ పిల్లలకు ఎలా నేర్పించవచ్చు? మీ పిల్లలు మీ మాటల్ని, పనుల్ని అనుకరిస్తారని గుర్తుంచుకోండి. కాబట్టి వాళ్లు మీకోసం ఏదైనా చేస్తే వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడం ద్వారా మంచి ఆదర్శాన్ని ఉంచండి. అంతేకాదు ఎవరైనా వాళ్లకు సహాయం చేస్తే థ్యాంక్స్‌ చెప్పమని మీ పిల్లలకు నేర్పించండి. కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ చెప్పే మాటలు హృదయం నుండి వస్తాయని, ఆ మాటలు ఇతరులకు ఎంతో మేలు చేస్తాయని మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. క్లాడీ అనే ఒక యువ సహోదరి ఉదాహరణ పరిశీలించండి. ఆమె ఇలా చెప్తుంది: “మా అమ్మకు 32 ఏళ్లు ఉన్నప్పుడు, భర్త దూరమవ్వడం వల్ల ఒంటరిగానే ముగ్గురు పిల్లల్ని పెంచాల్సివచ్చింది. అది ఆమెకు ఎంత కష్టంగా ఉండేదో నాకు 32 ఏళ్లు వచ్చినప్పుడు నేను ఆలోచించాను. కాబట్టి నన్ను, అన్నను, తమ్ముణ్ణి పెంచడానికి మా అమ్మ చేసిన త్యాగాలన్నిటికీ నేను ఆమెకు ఎంతగా రుణపడి ఉన్నానో ఆమెకు చెప్పాను. నా మాటలు తనకు చాలా విలువైనవని, వాటిని తరచూ గుర్తుచేసుకుంటానని, దానివల్ల సంతోషంగా అనిపిస్తుందని ఈమధ్యే మా అమ్మ నాతో చెప్పింది.”

కృతజ్ఞతను చూపించడం మీ పిల్లలకు నేర్పించండి (15వ పేరా చూడండి) *

16. కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇతరుల్ని ఎలా ప్రోత్సహించవచ్చో ఒక ఉదాహరణ చెప్పండి.

16 సంఘంలో. మన సహోదరసహోదరీల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు వాళ్లకు ప్రోత్సాహంగా అనిపిస్తుంది. హోర్‌హే అనే 28 ఏళ్ల సంఘపెద్ద ఉదాహరణ పరిశీలించండి. తీవ్ర అనారోగ్యంవల్ల ఆయన ఒక నెలపాటు మీటింగ్స్‌కు వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత మీటింగ్స్‌కు వెళ్లాక కూడా తన నియామకాల్ని చేయలేని స్థితిలో ఉన్నాడు. హోర్‌హే ఇలా అంటున్నాడు, “నా పరిమితుల వల్ల, సంఘ బాధ్యతల్ని నిర్వర్తించలేకపోవడం వల్ల నేను దేనికీ పనిరానివాణ్ణని అనిపించింది. కానీ ఒకరోజు మీటింగ్‌ తర్వాత ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, ‘మీరు మా కుటుంబానికి ఉంచిన మంచి ఆదర్శాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రసంగాల్ని మేము ఎంతగా ఆనందించామో మీకు తెలీదు. మేము విశ్వాసంలో బలపడడానికి అవి మాకు సహాయం చేశాయి’ అని అన్నాడు. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి, నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో నాకు అవసరమైంది సరిగ్గా అలాంటి మాటలే.”

17. కొలొస్సయులు 3:15 ప్రకారం, ఉదారతగల మన దేవునికి మనం కృతజ్ఞత ఎలా చూపించవచ్చు?

17 ఉదారతగల మన దేవునికి. యెహోవా మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. ఉదాహరణకు మన మీటింగ్స్‌ ద్వారా, పత్రికల ద్వారా, వెబ్‌సైట్‌ ద్వారా మనం చక్కని ఉపదేశాన్ని పొందుతున్నాం. మీరు ఒక ప్రసంగాన్ని విన్నప్పుడు, ఒక ఆర్టికల్‌ని చదివినప్పుడు లేదా బ్రాడ్‌కాస్టింగ్‌లో ఒక కార్యక్రమం చూసినప్పుడు, ‘సరిగ్గా నాకు కావాల్సింది ఇదే’ అని మీకెప్పుడైనా అనిపించిందా? మరి మనం యెహోవాకు ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? (కొలొస్సయులు 3:15 చదవండి.) ఒక విధానం ఏంటంటే, ఆయన మనకిస్తున్న ఇలాంటి మంచి బహుమతుల్ని బట్టి ప్రార్థనలో క్రమంగా కృతజ్ఞతలు చెప్పడం.—యాకో. 1:17.

రాజ్యమందిరాన్ని శుభ్రపర్చే పనిలో పాల్గొనడం మన కృతజ్ఞతను చూపించే ఒక చక్కని మార్గం (18వ పేరా చూడండి)

18. రాజ్యమందిరాల పట్ల మనకున్న కృతజ్ఞతను ఏయే విధాలుగా చూపించవచ్చు?

18 మన ఆరాధనా స్థలాన్ని శుభ్రంగా, పద్ధతిగా ఉంచుకున్నప్పుడు కూడా మనం యెహోవా పట్ల కృతజ్ఞతను చూపిస్తాం. మనం మన రాజ్యమందిరాల్ని క్రమంగా శుభ్రం చేస్తాం, మరమ్మతులు చేస్తాం. అలాగే సంఘానికి సంబంధించిన సౌండ్‌, వీడియో పరికరాల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తాం. రాజ్యమందిరాల్ని జాగ్రత్తగా చూసుకుంటే అవి ఎక్కువకాలం పాటు బాగుంటాయి, అంతేకాదు తక్కువ రిపేర్లు వస్తాయి. దానివల్ల, ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజ్యమందిరాల్ని కట్టడానికి, రాజ్యమందిరాల్ని రిపేరు చేయడానికి ఎక్కువ డబ్బు అందుబాటులో ఉంటుంది.

19. ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు, అతని భార్య అనుభవం నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

19 మన కోసం కష్టపడి పనిచేసే వాళ్లకు. మనం కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ చెప్పే మాటలు, ఇతరులు తమ సమస్యల్ని చూసే విధానాన్ని మార్చవచ్చు. ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు, అతని భార్య అనుభవాన్ని పరిశీలించండి. వాళ్లు ఒకసారి చలికాలంలో రోజంతా పరిచర్య చేసి బాగా అలసిపోయి ఇంటికి తిరిగొచ్చారు. అప్పుడు బాగా చలిగా ఉండడంతో ఆ పర్యవేక్షకుని భార్య తాను వేసుకున్న చలికోటుతోనే నిద్రపోయింది. ఆమె ఉదయాన్నే నిద్రలేచాక, ప్రయాణసేవలో కొనసాగడం ఇక తనవల్ల కాదని తన భర్తతో చెప్పింది. కాసేపటికే బ్రాంచి కార్యాలయం నుండి ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఆమె చేస్తున్న పరిచర్యను బట్టి, చూపిస్తున్న సహనాన్ని బట్టి బ్రాంచి ఆమెను మెచ్చుకుంది. ఒక్కోవారం ఒక్కో ఇంట్లో ఉండడం ఎంత కష్టమో తాము అర్థంచేసుకోగలమని ఆ ఉత్తరంలో రాశారు. ఆమె భర్త ఇలా చెప్తున్నాడు, “అలా మెచ్చుకోవడం వల్ల ఆమె ఎంత సంతోషించిందంటే, ఇంకెప్పుడూ ప్రయాణ సేవను వదిలిపెట్టడం గురించిన ప్రస్తావనే తేలేదు. నిజానికి, కొన్నిసార్లు ఆ సేవను ఆపేయాలని నాకు అనిపించినప్పుడు ఆమె నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది.” ఈ దంపతులు దాదాపు 40 ఏళ్లు ప్రయాణ సేవ చేశారు.

20. మనం ప్రతీరోజు ఏం చేయడానికి ప్రయత్నించాలి? ఎందుకు?

20 కాబట్టి మనం ప్రతీరోజు మన మాటల్లో, చేతల్లో కృతజ్ఞతను చూపించడానికి కృషిచేద్దాం. కృతజ్ఞత కరువైన ఈ లోకంలో మన హృదయపూర్వక మాటలు, చేతలు ఇతరులకు రోజూ ఎదురయ్యే సమస్యల్ని, ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయం చేయవచ్చు. అలా మనం కృతజ్ఞతను చూపించినప్పుడు చిరకాలం ఉండే స్నేహితుల్ని సంపాదించుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఉదారతగల, కృతజ్ఞతగల మన పరలోక తండ్రిని అనుకరించిన వాళ్లమౌతాం.

పాట 20 ప్రశస్తమైన నీ కుమారుణ్ణి ఇచ్చావు

^ పేరా 5 కృతజ్ఞతను చూపించే విషయంలో మనం యెహోవా, యేసు, కుష్ఠురోగియైన సమరయుని నుండి ఏం నేర్చుకోవచ్చు? ఈ ఆర్టికల్‌లో వాళ్ల ఉదాహరణలతో పాటు ఇంకొన్ని ఉదాహరణల్ని పరిశీలిస్తాం. అంతేకాదు కృతజ్ఞతను చూపించడం ఎందుకు ప్రాముఖ్యమో, దాన్ని ఏయే విధాలుగా చూపించవచ్చో కూడా చర్చిస్తాం.

^ పేరా 1 పదాల వివరణ: ఒక వ్యక్తి పట్ల లేదా ఒక వస్తువు పట్ల కృతజ్ఞత లేదా మెప్పుదల చూపించడమంటే ఆ వ్యక్తి లేదా వస్తువు విలువను గుర్తించడమని అర్థం. మెప్పుదల అనేది హృదయపూర్వకమైన కృతజ్ఞతా భావాల్ని కూడా సూచిస్తుంది.

^ పేరా 55 చిత్రాల వివరణ: పౌలు రాసిన ఉత్తరాన్ని రోమా సంఘంలో చదువుతున్నప్పుడు అకుల, ప్రిస్కిల్ల, ఫీబేతోపాటు ఇంకొంతమంది తమ పేర్లు ప్రస్తావించబడడం విని సంతోషిస్తున్నారు.

^ పేరా 57 చిత్రాల వివరణ: ఒక వృద్ధ సహోదరి మంచి ఆదర్శాన్ని బట్టి ఆమెపట్ల కృతజ్ఞత ఎలా చూపించాలో తన పాపకు నేర్పిస్తున్న ఒక తల్లి.