కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 12

ఇతరుల మీద సహానుభూతి చూపించండి

ఇతరుల మీద సహానుభూతి చూపించండి

‘మీరందరూ సహానుభూతిని చూపించండి.’—1 పేతు. 3:8.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మొదటి పేతురు 3:8 ప్రకారం మన భావాల్ని, సంక్షేమాన్ని పట్టించుకునే వాళ్ల మధ్య ఉండడానికి మనం ఎందుకు ఇష్టపడతాం?

మన భావాల్ని, సంక్షేమాన్ని పట్టించుకునే వాళ్ల మధ్య ఉండడానికి మనం ఇష్టపడతాం. అలాంటివాళ్లు తమను తాము మన స్థానంలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, అంటే మన భావాల్ని, ఆలోచనల్ని అర్థంచేసుకుంటారు. వాళ్లు మన అవసరాల్ని గమనించి, కొన్నిసార్లు మనం అడగకముందే సహాయం చేస్తారు. మన మీద “సహానుభూతిని” * చూపించే అలాంటివాళ్ల పట్ల మనం ఎంతో కృతజ్ఞతతో ఉంటాం.—1 పేతురు 3:8 చదవండి.

2. సహానుభూతిని చూపించడానికి మనం ఎందుకు కృషి చేయాల్సి ఉంటుంది?

2 క్రైస్తవులముగా మనందరం తదనుభూతిని లేదా సహానుభూతిని చూపించాలి. నిజానికి, ఈ లక్షణం చూపించడానికి మనం కృషి చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఒక కారణం ఏంటంటే, మనం అపరిపూర్ణులం. (రోమా. 3:23) మనం సహజంగా మన గురించే ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి, ఇతరుల గురించి ఆలోచించాలంటే కష్టపడాల్సి ఉంటుంది. అలాగే, మనలో కొంతమందికి తాము పెరిగిన విధానం వల్ల, జీవితంలో ఎదురైన అనుభవాల వల్ల కూడా సహానుభూతి చూపించడం కష్టమవ్వవచ్చు. అంతేకాదు, మన చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావం కూడా మనమీద పడే అవకాశం ఉంది. ఈ చివరి రోజుల్లో చాలామంది ఇతరుల భావాల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. బదులుగా ‘స్వార్థపరులుగా’ ఉంటున్నారు. (2 తిమో. 3:1, 2) ఇతరుల భావాల్ని పట్టించుకోకుండా చేసే ఇలాంటి సవాళ్లను మనం ఎలా అధిగమించవచ్చు?

3. (ఎ) మనం సహానుభూతిని ఎక్కువగా చూపించడం ఎలా నేర్చుకోవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 మనం యెహోవా దేవున్ని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుకరించడం ద్వారా సహానుభూతిని ఎక్కువగా చూపించడం నేర్చుకోవచ్చు. యెహోవా ప్రేమాస్వరూపి, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే విషయంలో ఆయన అత్యుత్తమ ఆదర్శం. (1 యోహా. 4:8) యేసు తన తండ్రి లక్షణాల్ని పరిపూర్ణంగా చూపించాడు. (యోహా. 14:9) ఒక మనిషి ఇతరుల మీద కనికరం ఎలా చూపించవచ్చో యేసు భూమ్మీద ఉన్నప్పుడు చూపించాడు. ఈ ఆర్టికల్‌లో యెహోవా, యేసు ఇతరుల మీద సహానుభూతిని ఎలా చూపించారో చర్చిస్తాం. అంతేకాదు, మనం వాళ్లను ఎలా అనుకరించవచ్చో కూడా పరిశీలిస్తాం.

యెహోవా సహానుభూతిని ఎలా చూపించాడు?

4. యెహోవాకు తన ప్రజల మీద సహానుభూతి ఉందని యెషయా 63:7-9 వచనాలు ఎలా తెలియజేస్తున్నాయి?

4 యెహోవా తన సేవకుల పట్ల సహానుభూతి చూపిస్తాడని బైబిలు బోధిస్తోంది. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలీయులు కష్టాలు పడుతున్నప్పుడు ఆయనకు ఎలా అనిపించిందో పరిశీలించండి. దేవుని వాక్యం ఇలా చెప్తోంది, “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.” (యెషయా 63:7-9 చదవండి.) ఆ తర్వాత, తన ప్రజల్ని బాధపెడితే తనను బాధపెట్టినట్లేనని యెహోవా జెకర్యా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. యెహోవా తన సేవకులతో ఇలా అన్నాడు, ‘ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే.’ (జెక. 2:8, NW) యెహోవాకు తన ప్రజల మీదున్న శ్రద్ధను ఆ మాటలు ఎంత శక్తివంతంగా తెలియజేస్తున్నాయో కదా!

యెహోవా కనికరంతో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు (5వ పేరా చూడండి)

5. బాధలుపడుతున్న తన సేవకులకు యెహోవా ఎలా సహాయం చేశాడో ఉదాహరణ చెప్పండి.

5 బాధలుపడుతున్న తన సేవకుల పట్ల యెహోవా కేవలం కనికరపడి ఊరుకోడు, వాళ్లకు సహాయం చేయడానికి చర్య తీసుకుంటాడు కూడా. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా కష్టాలు పడుతున్నప్పుడు యెహోవా వాళ్ల వేదనను అర్థంచేసుకున్నాడు, దాన్ని తీసేసేలా కదిలించబడ్డాడు. యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను, వారు పెట్టిన మొరను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను.’ (నిర్గ. 3:7, 8.) యెహోవా తన ప్రజలమీద కనికరపడ్డాడు కాబట్టి వాళ్లను బానిసత్వం నుండి విడిపించాడు. శతాబ్దాల తర్వాత, వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీయుల మీద శత్రువులు దాడిచేశారు. అప్పుడు యెహోవా ఎలా స్పందించాడు? “తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని” వాళ్లమీద జాలి పడ్డాడని బైబిలు చెప్తోంది. అలా యెహోవా మళ్లీ సహానుభూతితో తన ప్రజలకు సహాయం చేశాడు. ఇశ్రాయేలీయుల్ని వాళ్ల శత్రువుల నుండి కాపాడడానికి ఆయన న్యాయాధిపతుల్ని పంపించాడు.—న్యాయా. 2:16, 18.

6. ఆలోచనా తీరు సరిగ్గా లేనివాళ్ల పట్ల కూడా యెహోవా ఎలా శ్రద్ధ తీసుకున్నాడో ఒక ఉదాహరణ చెప్పండి.

6 యెహోవా తన ప్రజల భావాల్ని పట్టించుకుంటాడు, వాళ్ల ఆలోచనా తీరు కొన్నిసార్లు సరిగ్గా లేకపోయినా యెహోవా అలా చేస్తాడు. యోనా విషయమే తీసుకోండి. నీనెవె ప్రజలకు తీర్పు సందేశం ప్రకటించమని యెహోవా యోనాను పంపించాడు. అయితే నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు, వాళ్లను నాశనం చేయకూడదని యెహోవా నిర్ణయించుకున్నాడు. కానీ అది యోనాకు నచ్చలేదు. నాశనం గురించిన తన ప్రవచనం నెరవేరకపోవడంతో, యోనాకు చాలా కోపం వచ్చింది. కానీ యెహోవా ఓపిగ్గా వ్యవహరించి, యోనా ఆలోచనా తీరును సరిచేశాడు. (యోనా 3:10–4:11) యెహోవా తనకు నేర్పించాలనుకుంటున్న పాఠాన్ని యోనా ఆ తర్వాత అర్థంచేసుకున్నాడు, అంతేకాదు మన ప్రయోజనం కోసం యోనా జీవిత కథను రాసేందుకు యెహోవా యోనానే ఉపయోగించుకున్నాడు.—రోమా. 15:4. *

7. యెహోవా తన సేవకులతో వ్యవహరించిన విధానాన్ని బట్టి ఏ విషయం అర్థమౌతుంది?

7 యెహోవా తన ప్రజలతో వ్యవహరించిన విధానాన్ని చూస్తే, ఆయనకు తన సేవకుల మీద సహానుభూతి ఉందని అర్థమౌతుంది. మనలో ప్రతీ ఒక్కరి వేదన, బాధ ఆయనకు తెలుసు. యెహోవా ‘మానవుల హృదయాన్ని ఎరిగినవాడు.’ (2 దిన. 6:31) ఆయన మన ఆలోచనలన్నిటినీ, మన లోతైన భావాల్ని, మన పరిమితుల్ని అర్థం చేసుకుంటాడు. మనం “తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు [మనకు] రానివ్వడు.” (1 కొరిం. 10:13) ఆ వాగ్దానం ఎంత ఓదార్పునిస్తుందో కదా!

యేసు ఎలా ఇతరుల మీద శ్రద్ధ చూపించాడు?

8-10. ఏ కారణాల్ని బట్టి యేసు ఇతరుల మీద శ్రద్ధ చూపించివుంటాడు?

8 యేసు మనిషిగా భూమ్మీద ఉన్నప్పుడు, ఇతరుల మీద చాలా శ్రద్ధ చూపించాడు. కనీసం మూడు కారణాల్ని బట్టి ఆయన అలా శ్రద్ధ చూపించివుంటాడు. మొదటిది, మనం ముందే చూసినట్లు యేసు తన పరలోక తండ్రి లక్షణాల్ని పరిపూర్ణంగా చూపించాడు. తన తండ్రిలాగే యేసు ప్రజల్ని ప్రేమించాడు. యెహోవా చేసిన వాటన్నిటిలో యేసు సహాయం చేస్తూ సంతోషించాడు, అయితే ఆయన ముఖ్యంగా మనుషుల్ని చూసి ఎక్కువ సంతోషించాడు. (సామె. 8:31) ఇతరుల భావాల్ని పట్టించుకునేలా ప్రేమే యేసును కదిలించింది.

9 రెండోది, యెహోవాలాగే యేసు కూడా హృదయాల్ని చదవగలడు. ఆయనకు ప్రజల ఉద్దేశాలు, భావాలు తెలుసు. (మత్త. 9:4; యోహా. 13:10, 11) కాబట్టి బాగా కృంగిపోయినవాళ్లను గమనించినప్పుడు, ఆయన వాళ్ల మీద శ్రద్ధ చూపిస్తూ, వాళ్లను ఓదార్చేవాడు.—యెష. 61:1, 2; లూకా 4:17-21.

10 మూడోది, ప్రజలకున్న కొన్ని సమస్యల్ని యేసు స్వయంగా అనుభవించాడు. ఉదాహరణకు, యేసు ఒక పేద కుటుంబంలో పెరిగివుంటాడు. తనను పెంచిన తండ్రైన యోసేపుతో కలిసి పనిచేయడం ద్వారా యేసు శారీరక శ్రమ చేయడం నేర్చుకున్నాడు. (మత్త. 13:55; మార్కు 6:3) అలాగే, యేసు పరిచర్య మొదలుపెట్టిన కొంతకాలానికే బహుశా యోసేపు చనిపోయివుంటాడు కాబట్టి ప్రియమైనవాళ్లు చనిపోతే ఎంత వేదన కలుగుతుందో యేసుకు తెలుసు. అంతేకాదు, వేర్వేరు మత నమ్మకాలు గల కుటుంబ సభ్యులతో ఉండడం ఎలా ఉంటుందో కూడా యేసుకు తెలుసు. (యోహా. 7:5) ఈ కారణాలు, మరితర కారణాల వల్ల యేసు సామాన్య ప్రజల సమస్యల్ని, భావాల్ని అర్థం చేసుకోగలిగివుంటాడు.

యేసు ఒక చెవిటి వ్యక్తిని ప్రజలకు దూరంగా తీసుకెళ్లి, కనికరంతో బాగుచేస్తున్నాడు (11వ పేరా చూడండి)

11. యేసుకు ప్రజల మీదున్న శ్రద్ధ ముఖ్యంగా వేటిలో కనిపిస్తుంది? వివరించండి. (ముఖచిత్రం చూడండి.)

11 యేసుకు ప్రజల మీదున్న శ్రద్ధ, ముఖ్యంగా ఆయన చేసిన అద్భుతాల్లో కనిపిస్తుంది. యేసు కేవలం వాటిని ఒక బాధ్యతగా భావించి చేయలేదు. కష్టాలు పడుతున్న వాళ్లమీద “జాలిపడి” ఆయన వాటిని చేశాడు. (మత్త. 20:29-34; మార్కు 1:40-42) ఉదాహరణకు, యేసు ఒక చెవిటి వ్యక్తిని బాగుచేయడానికి అతన్ని ప్రజలకు దూరంగా తీసుకెళ్లినప్పుడు, ఒక విధవరాలి ఒక్కగానొక్క కొడుకును తిరిగి బ్రతికించిన్నప్పుడు ఆయన భావాలు ఎలా ఉండివుంటాయో ఆలోచించండి. (మార్కు 7:32-35; లూకా 7:12-15) యేసు వాళ్ల కష్టాల్ని అర్థంచేసుకుని వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు.

12. యోహాను 11:32-35 వచనాల్ని బట్టి మార్త, మరియల మీద యేసు సహానుభూతి చూపించాడని ఎలా చెప్పవచ్చు?

12 మార్త, మరియల మీద యేసు సహానుభూతిని చూపించాడు. చనిపోయిన తమ సోదరుడు లాజరు గురించి వాళ్లు దుఃఖించడం చూసి “యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు.” (యోహాను 11:32-35 చదవండి.) యేసు కన్నీళ్లు పెట్టుకుంది, తన సన్నిహిత స్నేహితుడు ఇక లేడనే కారణంతో మాత్రమే కాదు. నిజానికి, తాను లాజరును ఇంకాసేపట్లో బ్రతికిస్తానని యేసుకు తెలుసు. బదులుగా, తన ప్రియమైన స్నేహితుల వేదన చూసి చలించిపోయి యేసు ఏడ్చాడు.

13. యేసుకు సహానుభూతి ఉందని తెలుసుకోవడం ఎందుకు ప్రోత్సాహాన్నిస్తుంది?

13 యేసుకున్న సహానుభూతి గురించి నేర్చుకుంటే మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. ఆయన ప్రజలతో వ్యవహరించిన విధానాన్ని బట్టి మనం ఆయన్ని ప్రేమిస్తాం. (1 పేతు. 1:8) ఆయనిప్పుడు దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్నాడని తెలుసుకోవడం మనకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది. ఆయన త్వరలోనే బాధలన్నిటినీ పూర్తిగా తీసేస్తాడు. యేసు కూడా ఒకప్పుడు భూమ్మీద మనిషిగా జీవించాడు కాబట్టి, సాతాను పరిపాలన వల్ల తగిలిన గాయాల నుండి కోలుకునేలా మనుషులకు సహాయం చేయడానికి ఆయనే తగినవాడు. నిజంగా, ‘మన బలహీనతల్ని అర్థంచేసుకునే’ ఇలాంటి పరిపాలకుడు ఉండడం మనకు ఒక వరం.—హెబ్రీ. 2:17, 18; 4:15, 16.

యెహోవాను, యేసును అనుకరించండి

14. ఎఫెసీయులు 5:1, 2 ప్రకారం మనం ఏం చేయాలనే పురికొల్పు పొందుతాం?

14 యెహోవా, యేసు ఎలా సహానుభూతి చూపించారో పరిశీలించినప్పుడు, మనం కూడా సహానుభూతిని ఇంకా ఎక్కువగా చూపించాలనే పురికొల్పు పొందుతాం. (ఎఫెసీయులు 5:1, 2 చదవండి.) మనం వాళ్లలా హృదయాల్ని చదవలేం. అయినా ఇతరుల భావాల్ని, అవసరాల్ని అర్థంచేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. (2 కొరిం. 11:29) మన చుట్టూ ఉన్న స్వార్థ ప్రజల్లా కాకుండా, మనం “[మన] గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ” ఉండడానికి కృషిచేస్తాం.—ఫిలి. 2:4.

(15-19 పేరాలు చూడండి) *

15. ఎవరు ముఖ్యంగా సహానుభూతిని చూపించాలి?

15 ముఖ్యంగా సంఘపెద్దలు సహానుభూతిని చూపించాలి. తమకు అప్పగించబడిన గొర్రెల్ని చూసుకునే విషయంలో తాము యెహోవాకు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుందని వాళ్లకు తెలుసు. (హెబ్రీ. 13:17) తోటి సహోదరసహోదరీలకు సహాయం చేయాలంటే పెద్దలు వాళ్లను అర్థంచేసుకోవాలి. పెద్దలు సహానుభూతిని ఎలా చూపించవచ్చు?

16. సహానుభూతిని చూపించే సంఘపెద్దలు ఎలా ఉంటారు? అది ఎందుకు ప్రాముఖ్యం?

16 సహానుభూతిని చూపించే సంఘపెద్దలు తోటి సహోదరసహోదరీలతో సమయం గడుపుతారు. వాళ్లను ప్రశ్నలు అడిగి, వాళ్లు చెప్పేది శ్రద్ధగా, ఓపిగ్గా వింటారు. పెద్దలు అలా ఉండడం చాలా ముఖ్యం, ఎందుకంటే కొంతమంది తమ ఆలోచనల్ని, భావాల్ని పెద్దలకు చెప్పుకోవాలనుకుంటారు గానీ ఎలా చెప్పాలో తెలీక సతమతమౌతుంటారు. (సామె. 20:5) సంఘపెద్దలు ఇష్టపూర్వకంగా సహోదరసహోదరీల కోసం సమయం వెచ్చించినప్పుడు వాళ్ల మధ్యవున్న నమ్మకం, స్నేహం, ప్రేమ ఇంకా బలపడతాయి.—అపొ. 20:37.

17. సంఘపెద్దల్లో బాగా నచ్చే లక్షణం ఏంటని చాలామంది సహోదరసహోదరీలు చెప్తారు? ఒక ఉదాహరణ చెప్పండి.

17 సంఘపెద్దల్లో తమకు బాగా నచ్చే లక్షణం, ఇతరుల మీద వాళ్లు చూపించే సహానుభూతి అని చాలామంది సహోదరసహోదరీలు చెప్తారు. “వాళ్లు మిమ్మల్ని అర్థంచేసుకుంటారని మీకు తెలుసు కాబట్టి వాళ్లతో మాట్లాడడం సులభంగా ఉంటుంది” అని అడలేడ్‌ అనే సహోదరి చెప్తోంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్లు స్పందించే విధానంలో వాళ్లకు మనమీద ఉండే సహానుభూతిని గ్రహించవచ్చు.” ఒక సంఘపెద్ద పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నా పరిస్థితి గురించి చెప్తున్నప్పుడు ఆ సంఘపెద్ద కళ్లలో నీళ్లు తిరగడం నేను చూశాను. ఆ దృశ్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను.”—రోమా. 12:15.

18. మనం ఇతరుల మీద సహానుభూతిని ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

18 అయితే, సహానుభూతిని చూపించాల్సింది సంఘపెద్దలు మాత్రమే కాదు. మనందరం ఆ లక్షణాన్ని వృద్ధిచేసుకోవాలి. ఎలా? కుటుంబంలోని వాళ్లు, సంఘంలోని వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా సంఘంలోని యౌవనుల మీద, అనారోగ్యంతో ఉన్నవాళ్ల మీద, పెద్దవయసువాళ్ల మీద, ఆత్మీయుల్ని మరణంలో పోగుట్టుకున్నవాళ్ల మీద శ్రద్ధ చూపించండి. వాళ్ల బాగోగుల్ని అడగండి, వాళ్లు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. మీరు వాళ్ల పరిస్థితిని నిజంగా అర్థంచేసుకున్నారని చూపించండి. మీకు చేతనైన సహాయం చేస్తానని చెప్పండి. మనం అలాచేస్తే, నిజమైన ప్రేమను చేతల్లో చూపించిన వాళ్లమౌతాం.—1 యోహా. 3:18.

19. ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనం పరిస్థితులకు తగ్గట్టు ఎందుకు వ్యవహరించాలి?

19 ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనం పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించాలి. ఎందుకు? ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఒకేలా స్పందించరు. కొంతమంది వాటిగురించి మాట్లాడడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి వాళ్లకు సహాయం చేయాలనే కోరిక మనకు ఉన్నా, వాళ్లను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడగకూడదు. (1 థెస్స. 4:11) ఇతరులు తమ భావాల్ని మనతో చెప్తున్నప్పుడు, వాళ్లు చెప్పే ప్రతీది మనకు సమంజసంగా అనిపించకపోవచ్చు. కానీ, అవి వాళ్ల భావాలని మనం గుర్తుంచుకోవాలి. మనం వినడానికి తొందరపడాలే గానీ మాట్లాడడానికి తొందరపడకూడదు.—మత్త. 7:1; యాకో. 1:19.

20. తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

20 సంఘంలోనివాళ్ల మీదే కాదు పరిచర్యలో కలిసేవాళ్ల మీద కూడా మనం సహానుభూతిని చూపించాలి. శిష్యుల్ని చేసేటప్పుడు మనం సహానుభూతిని ఎలా చూపించవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ఈ విషయం పరిశీలిస్తాం.

పాట 130 క్షమిస్తూ ఉండండి

^ పేరా 5 యెహోవా, యేసు ఇతరుల మీద సహానుభూతిని చూపిస్తారు. ఈ విషయంలో వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం సహానుభూతిని ఎందుకు చూపించాలో, దాన్ని ఎలా చూపించవచ్చో కూడా చర్చిస్తాం.

^ పేరా 1 పదాల వివరణ: మనం “సహానుభూతి” చూపించాలంటే ఇతరులు ఎలా భావిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, మనం కూడా అలాగే భావించడానికి ప్రయత్నించాలి. (రోమా. 12:15) ఈ ఆర్టికల్‌లో “సహానుభూతి,” “శ్రద్ధ” అనే రెండు పదాల్ని ఒకే భావంలో ఉపయోగించారు.

^ పేరా 6 కృంగిపోయిన లేదా భయపడిన ఇతర నమ్మకమైన సేవకులపట్ల కూడా యెహోవా కనికరం చూపించాడు. ఉదాహరణకు హన్నా (1 సమూ. 1:10-20), ఏలీయా (1 రాజు. 19:1-18), ఎబెద్మెలెకు (యిర్మీ. 38:7-13; 39:15-18) గురించి ఆలోచించండి.

^ పేరా 65 చిత్రాల వివరణ : రాజ్యమందిరంలో జరిగే కూటాల్లో మనం ప్రేమపూర్వక సహవాసాన్ని ఆస్వాదిస్తాం. ఇక్కడ (1) ఒక సంఘపెద్ద ఒక పిల్లవాడితో, వాళ్లమ్మతో దయగా మాట్లాడుతున్నాడు, (2) ఒక తండ్రి, ఆయన కూతురు ఒక పెద్ద వయసు సహోదరి కారులో ఎక్కడానికి సహాయం చేస్తున్నారు, (3) నిర్దేశం కోసం వచ్చిన ఒక సహోదరి మాట్లాడుతుంటే ఇద్దరు సంఘపెద్దలు శ్రద్ధగా వింటున్నారు.