కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 13

మీ పరిచర్యలో సహానుభూతిని చూపించండి

మీ పరిచర్యలో సహానుభూతిని చూపించండి

“ప్రజల్ని చూసి ఆయనకు జాలేసింది. అప్పుడు ఆయన వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.”—మార్కు 6:34.

పాట 70 అర్హుల్ని వెదకండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనకు ఏ విషయం సంతోషాన్నిస్తుంది? వివరించండి.

అపరిపూర్ణులమైన మనం ఎదుర్కొనే సమస్యల్ని యేసు అర్థంచేసుకుంటాడని తెలుసుకోవడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా! భూమ్మీదున్నప్పుడు యేసు, ‘సంతోషించేవాళ్లతో కలిసి సంతోషించాడు, ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్చాడు.’ (రోమా. 12:15) ఉదాహరణకు, 70 మంది శిష్యులు పరిచర్యను విజయవంతంగా పూర్తిచేసుకొని ఆనందంగా తిరిగొచ్చినప్పుడు, యేసు కూడా ‘పవిత్రశక్తితో నిండిపోయి ఎంతో సంతోషించాడు.’ (లూకా 10:17-21) మరోవైపు లాజరు చనిపోయినప్పుడు, అతని ప్రియమైనవాళ్లు పడిన వేదనను చూసి యేసు “తనలోతాను మూలిగాడు, చాలా బాధపడ్డాడు.”—యోహా. 11:33.

2. ప్రజలపట్ల సహానుభూతిని చూపించడానికి యేసుకు ఏది సహాయం చేసింది?

2 పాపులైన మనుషులతో అంత దయగా, కనికరంగా వ్యవహరించడానికి పరిపూర్ణుడైన యేసుకు ఏది సహాయం చేసింది? అన్నిటికన్నా ముఖ్యంగా, ఆయనకు ప్రజల మీదున్న ప్రేమే. ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నట్లు, ఆయన మనుషుల్ని బట్టి ఎంతో ఆనందించాడు. (సామె. 8:31) ప్రజల మీదున్న ప్రేమవల్లే యేసు మనుషుల ఆలోచనల్ని బాగా తెలుసుకోగలిగాడు. అపొస్తలుడైన యోహాను ఇలా వివరించాడు, “మానవ స్వభావం ఆయనకు తెలుసు.” (యోహా. 2:25) యేసు ఇతరుల పట్ల ఎంతో కనికరం చూపించాడు. యేసు తమను ప్రేమిస్తున్నాడని ప్రజలు గ్రహించగలిగారు, దానివల్ల వాళ్లు రాజ్య సందేశానికి చక్కగా స్పందించారు. మనం కూడా ప్రజల మీద ఎంత కనికరాన్ని చూపిస్తే, మన పరిచర్యను అంత సమర్థవంతంగా చేయగలుగుతాం.—2 తిమో. 4:5.

3-4. (ఎ) మనకు సహానుభూతి ఉంటే పరిచర్యను ఎలా చూస్తాం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 ప్రజలకు మంచివార్త ప్రకటించాల్సిన బాధ్యత తనకుందని అపొస్తలుడైన పౌలుకు తెలుసు. మనకు కూడా ఆ బాధ్యత ఉందని మనకు తెలుసు. (1 కొరిం. 9:16) అయితే, మనకు సహానుభూతి ఉంటే పరిచర్యను కేవలం ఒక బాధ్యతగా చూడం. మనకు ప్రజలపట్ల శ్రద్ధ ఉందని, వాళ్లకు నిజంగా సహాయం చేయాలని కోరుకుంటున్నామని చూపిస్తాం. “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అని మనకు తెలుసు. (అపొ. 20:35) మనం పరిచర్యను ఆ దృష్టితో చూసేకొద్దీ దాన్ని మరింత ఆనందిస్తాం.

4 పరిచర్యలో మనం సహానుభూతిని ఎలా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. ముందుగా, ప్రజలపట్ల యేసుకున్న భావాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూస్తాం. తర్వాత, ఆయన్ని అనుకరించగల నాలుగు మార్గాల గురించి పరిశీలిస్తాం.—1 పేతు. 2:21.

యేసు పరిచర్యలో సహానుభూతిని చూపించాడు

సహానుభూతి వల్ల యేసు ఊరటనిచ్చే సందేశాన్ని ప్రకటించాడు (5-6 పేరాలు చూడండి)

5-6. (ఎ) యేసు ఎవరిపట్ల జాలిని లేదా సహానుభూతిని చూపించాడు? (బి) యెషయా 61:1-2⁠లో ఉన్న ప్రవచనం ప్రకారం తాను ప్రకటించే వాళ్లపట్ల యేసు ఎందుకు జాలి చూపించాడు?

5 యేసు సహానుభూతిని చూపించిన ఒక ఉదాహరణ గమనించండి. ఒక సందర్భంలో యేసు, ఆయన శిష్యులు నిర్విరామంగా పరిచర్య చేశారు. “వాళ్లకు తినడానికి కూడా తీరిక లేకపోయింది.” దాంతో తన శిష్యులు కాస్త విశ్రాంతి తీసుకునేలా, యేసు వాళ్లను “ఏకాంత ప్రదేశానికి” తీసుకెళ్లాడు. కానీ ప్రజలు పెద్ద సంఖ్యలో వాళ్లకన్నా ముందు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. యేసు అక్కడికి చేరుకొని వాళ్లను చూసినప్పుడు ఎలా స్పందించాడు? “కాపరిలేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలేసింది. * అప్పుడు ఆయన వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.”—మార్కు 6:30-34.

6 యేసు ఎందుకు వాళ్లపట్ల జాలిని లేదా సహానుభూతిని చూపించాడు? ఎందుకంటే, వాళ్లు “కాపరిలేని గొర్రెల్లా” ఉన్నారని బైబిలు చెప్తుంది. వాళ్లలో కొంతమంది పేదవాళ్లని, తమ కుటుంబాల్ని పోషించుకోవడానికి చాలా కష్టపడుతున్నారని యేసు గమనించివుంటాడు. ఇంకొంతమంది బహుశా తమ ప్రియమైనవాళ్లు చనిపోవడం వల్ల దుఃఖిస్తుండవచ్చు. అలాగైతే, యేసుకు వాళ్ల పరిస్థితి అర్థమైవుంటుంది. ఎందుకంటే, ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నట్లు యేసు వాటిలో కొన్ని సమస్యల్ని స్వయంగా అనుభవించాడు. యేసుకు ఇతరులపట్ల శ్రద్ధ ఉంది. అంతేకాదు, వాళ్లకు ఊరటనిచ్చే సందేశాన్ని ప్రకటించేలా కదిలించబడ్డాడు.—యెషయా 61:1, 2 చదవండి.

7. మనం యేసును ఎలా అనుకరించవచ్చు?

7 యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యేసులాగే, మన చుట్టూ కూడా “కాపరిలేని గొర్రెల్లా” ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్లు ఎన్నో సమస్యలతో పోరాడుతుండవచ్చు. వాళ్లకు అవసరమైంది మన దగ్గర ఉంది, అదే దేవుని రాజ్య సందేశం. (ప్రక. 14:6) కాబట్టి మన యజమానియైన యేసును అనుకరిస్తూ దీనుల మీద, పేదవాళ్ల మీద మనకున్న జాలిని బట్టి మంచివార్త ప్రకటిస్తాం. (కీర్త. 72:13) మనం ప్రజలపట్ల జాలి చూపిస్తాం, వాళ్లకు సహాయం చేయడానికి ఏదోకటి చేయాలని కోరుకుంటాం.

మనం సహానుభూతిని ఎలా చూపించవచ్చు?

ఒక్కోవ్యక్తికి ఉండే అవసరాల గురించి ఆలోచించండి (8-9 పేరాలు చూడండి)

8. పరిచర్యలో సహానుభూతిని చూపించే మొదటి మార్గం ఏంటి? ఉదాహరణ చెప్పండి.

8 మనం ప్రకటించేవాళ్ల పట్ల సహానుభూతిని చూపించడానికి మనకేది సహాయం చేస్తుంది? మనం కలిసే ప్రజలు ఎలా ఆలోచిస్తారో, భావిస్తారో ఊహించుకోవాలి; ఆ తర్వాత, వాళ్ల స్థానంలో మనం ఉంటే వాళ్లు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో మనమూ వాళ్లతో అలాగే వ్యవహరించాలి. * (మత్త. 7:12) మనం అలా చేయగల నాలుగు మార్గాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటిగా, ఒక్కోవ్యక్తికి ఉండే అవసరాల గురించి ఆలోచించాలి. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు, మనం చేసే పనిని డాక్టర్‌ చేసే పనితో పోల్చవచ్చు. ఒక మంచి డాక్టర్‌ ఒక్కో రోగి అవసరాల గురించి ఆలోచిస్తాడు. అతను ప్రశ్నలు అడుగుతాడు, రోగి చెప్పేవాటిని జాగ్రత్తగా వింటాడు. ఏ మందులు ఇవ్వాలో వెంటనే నిర్ణయించుకునే బదులు, కాసేపు రోగికున్న జబ్బు లక్షణాల్ని గమనించి, అప్పుడు సరైన మందులు ఇస్తాడు. అదేవిధంగా, ప్రీచింగ్‌లో మనం కలిసే ప్రతీ ఒక్కరితో ఒకే పద్ధతిలో సంభాషణను మొదలుపెట్టకూడదు. బదులుగా, ప్రతీ వ్యక్తికున్న పరిస్థితుల్ని, అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి.

9. మనం ఏం అనుకోకూడదు? బదులుగా ఏం చేస్తే బాగుంటుంది?

9 మీరు ప్రీచింగ్‌లో ఎవరినైనా కలిసినప్పుడు, ఎదుటివ్యక్తి పరిస్థితుల గురించి, అతని నమ్మకాల గురించి, వాటి వెనుకున్న కారణాల గురించి మీకు తెలుసని అనుకోకండి. (సామె. 18:13) బదులుగా, అతని గురించి తెలుసుకోవడానికి తెలివిగా ప్రశ్నలు అడగండి. (సామె. 20:5) మీ సంస్కృతిలో సరైనదని అనిపిస్తే, అతని ఉద్యోగం గురించి, కుటుంబం గురించి, అతనికి ఎదురైన అనుభవాల గురించి, అతని అభిప్రాయాల గురించి అడగండి. మనం ప్రశ్నలు అడిగినప్పుడు, వాళ్లకు మంచివార్త ఎందుకు అవసరమో వాళ్లంతట వాళ్లే చెప్పేలా చేస్తాం. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాక, వాళ్లకున్న నిర్దిష్టమైన అవసరాల్ని బట్టి యేసులాగే మనం సహానుభూతిని చూపించవచ్చు, వాళ్లకు అవసరమైన సహాయం చేయవచ్చు.—1 కొరింథీయులు 9:19-23 పోల్చండి.

మనం ప్రకటించేవాళ్ల జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి (10-11 పేరాలు చూడండి)

10-11. రెండో కొరింథీయులు 4:7, 8 ప్రకారం సహానుభూతిని చూపించే రెండో మార్గం ఏంటి? ఉదాహరణ చెప్పండి.

10 రెండోదిగా, వాళ్ల జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. కొన్నిసార్లు, వాళ్ల పరిస్థితిని మనం అర్థంచేసుకోగలం. ఎందుకంటే, మనం అపరిపూర్ణులం కాబట్టి మనకూ సమస్యలు ఉంటాయి. (1 కొరిం. 10:13) ఈ లోకంలో జీవితం చాలా కష్టంగా ఉంటుందని మనకు తెలుసు. కేవలం యెహోవా సహాయంతోనే మనం సమస్యల్ని తట్టుకోగలుగుతాం. (2 కొరింథీయులు 4:7, 8 చదవండి.) కానీ యెహోవాతో సన్నిహిత స్నేహం లేకుండా ఈ లోకంలో జీవించడానికి కష్టపడుతున్న వాళ్లగురించి ఆలోచించండి. యేసులాగే మనం వాళ్లమీద జాలిపడతాం, మేలైన విషయాల గురించిన మంచివార్తను చెప్పేలా కదిలించబడతాం.—యెష. 52:7.

11 సెర్గే అనే సహోదరుని ఉదాహరణ పరిశీలించండి. సత్యం నేర్చుకోకముందు, సెర్గే చాలా బిడియస్థుడు. ఇతరులతో మాట్లాడడానికి చాలా ఇబ్బందిపడేవాడు. కొంతకాలానికి, అతను బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. అతనిలా చెప్పాడు, “నేను బైబిలు స్టడీ తీసుకుంటుండగా, క్రైస్తవులు తమ విశ్వాసం గురించి ఇతరులకు చెప్పాలని తెలుసుకున్నాను. కానీ, అది నా వల్ల కాదని అనుకున్నాను.” అయినప్పటికీ, అతను సత్యం తెలియనివాళ్ల గురించి ఆలోచించాడు, యెహోవా గురించి తెలియనివాళ్ల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకున్నాడు. సెర్గే ఇలా చెప్తున్నాడు, “నేను నేర్చుకున్న కొత్త విషయాలు నాలో ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను నింపాయి. ఇతరులు కూడా ఆ సత్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నాకు తెలుసు.” సెర్గేలో సహానుభూతి పెరిగిన కొద్దీ, ప్రీచింగ్‌ చేయాలనే ధైర్యం కూడా పెరిగింది. అతనిలా చెప్పాడు, “ఆశ్చర్యకరంగా, బైబిలు గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా నమ్మకాల గురించి చెప్తున్నప్పుడు నా విశ్వాసం కూడా బలపడింది.” *

ప్రగతి సాధించడానికి కొంతమందికి సమయం పడుతుంది (12-13 పేరాలు చూడండి)

12-13. మనం బోధించే వాళ్లపట్ల ఎందుకు ఓర్పు చూపించాలి? ఉదాహరణ చెప్పండి.

12 మూడోదిగా, మీరు బోధించే వాళ్లపట్ల ఓర్పు చూపించాలి. మనకు బాగా తెలిసిన కొన్ని బైబిలు సత్యాల గురించి బహుశా వాళ్లెన్నడూ ఆలోచించివుండరని గుర్తుంచుకోండి. అంతేకాదు, చాలామంది తమ నమ్మకాల్ని బాగా ప్రేమిస్తారు. మత నమ్మకాలు వాళ్లను తమ కుటుంబంతో, ఆచారాలతో, సమాజంతో ఐక్యం చేస్తున్నాయని వాళ్లు అనుకోవచ్చు. మరి అలాంటివాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?

13 ఈ పోలిక గురించి ఆలోచించండి: కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక బ్రిడ్జిని తీసేసి కొత్తది కట్టాలంటే ఏం చేస్తారు? ఎక్కువశాతం, పాత బ్రిడ్జి ఉపయోగంలో ఉండగానే కొత్త బ్రిడ్జిని కట్టడం మొదలుపెడతారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత, పాతదాన్ని కూల్చేస్తారు. అదేవిధంగా, తమ “పాత” నమ్మకాల్ని వదిలేయమని ప్రజలకు చెప్పడానికి ముందు, వాళ్లకు ఇదివరకు తెలియని “కొత్త” సత్యాల్ని అర్థంచేసుకుని, ప్రేమించేలా సహాయం చేయాలి. అప్పుడు మాత్రమే, వాళ్లు తమ పాత నమ్మకాల్ని వదిలేయడానికి ఇష్టపడతారు. ప్రజలు అలాంటి మార్పులు చేసుకునేలా సహాయం చేయడానికి సమయం పట్టవచ్చు.—రోమా. 12:2.

14-15. పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ గురించి ఏమీ తెలియని ప్రజలకు మనమెలా సహాయం చేయవచ్చు? ఉదాహరణ చెప్పండి.

14 మనం ప్రీచింగ్‌లో ప్రజలపట్ల ఓర్పు చూపిస్తే, వాళ్లు మొదటిసారి బైబిలు సత్యాల్ని విన్నప్పుడే వాటిని అర్థంచేసుకోవాలని లేదా అంగీకరించాలని ఆశించం. బదులుగా, బైబిలు ఏం చెప్తుందో వాళ్లు అర్థంచేసుకునేలా కొంతకాలంపాటు సహాయం చేయడానికి సహానుభూతి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ గురించి వాళ్లు అర్థంచేసుకునేలా మనమెలా సహాయం చేయవచ్చో ఆలోచించండి. ఈ బోధ గురించి చాలామందికి ఏమీ తెలీదు. ఒకవ్యక్తి చనిపోతే ఇక అంతా అయిపోయినట్లే అని వాళ్లు నమ్ముతుండవచ్చు. లేదా మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారని వాళ్లు అనుకుంటుండవచ్చు. మరి వాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?

15 ఒక సహోదరుడు దాన్నెలా చేస్తున్నాడో చెప్పాడు. ముందుగా, ఆయన ఆదికాండము 1:28 చదువుతాడు. తర్వాత, మనుషులు ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో జీవించాలని దేవుడు కోరుకున్నాడని ఇంటివాళ్లను అడుగుతాడు. దానికి చాలామంది “భూమ్మీద, మంచి పరిస్థితుల్లో” అని జవాబిస్తారు. ఆ తర్వాత, సహోదరుడు యెషయా 55:11 చదివి, దేవుని సంకల్పం ఏమైనా మారిందా అని అడుగుతాడు. ఇంటివాళ్లు తరచూ, “లేదు” అనే చెప్తారు. చివరిగా, సహోదరుడు కీర్తన 37:10-11 చదివి, మనుషుల భవిష్యత్తు ఎలా ఉంటుందో అడుగుతాడు. ఈ విధంగా లేఖనాల్ని ఉపయోగించి, మంచివాళ్లు పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించాలని దేవుడు ఇంకా కోరుకుంటున్నాడని అర్థంచేసుకునేలా ఆయన చాలామందికి సహాయం చేశాడు.

దయతో చేసే ఒక చిన్న పని, అంటే ప్రోత్సాహకరమైన ఉత్తరం పంపించడం లాంటివి మంచి ఫలితాల్ని తీసుకొస్తుంది (16-17 పేరాలు చూడండి)

16-17. సామెతలు 3:27⁠లోని మాటల్ని బట్టి ప్రజలపై శ్రద్ధ ఉందని చేతల్లో చూపించే కొన్ని మార్గాలు ఏంటి? ఉదాహరణ చెప్పండి.

16 నాలుగోదిగా, ప్రజలపై శ్రద్ధ ఉందని చేతల్లో చూపించాలి. ఉదాహరణకు, ఇంటివ్యక్తికి ఇబ్బంది కలిగించే సమయంలో మనం వెళ్తే, క్షమించమని అడిగి, వేరే సమయంలో వస్తామని చెప్పవచ్చు. ఒకవేళ ఇంటివ్యక్తికి చిన్నచిన్న విషయాల్లో సహాయం అవసరమైతే? లేదా వృద్ధాప్యం వల్ల, అనారోగ్యం వల్ల ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్నవాళ్లకు కూరగాయలు తెచ్చిపెట్టడానికి లేదా ఉత్తరాలు పోస్ట్‌ చేయడానికి సహాయం అవసరమైతే? అలాంటి పరిస్థితుల్లో, వాళ్లకు మనం సహాయం చేయవచ్చు.—సామెతలు 3:27 చదవండి.

17 ఒక సహోదరి దయతో చేసిన చిన్న పనికి మంచి ఫలితం వచ్చింది. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన ఒక కుటుంబానికి మన సహోదరి సహానుభూతితో ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఊరటనిచ్చే కొన్ని లేఖనాల్ని కూడా ఆమె రాసింది. మరి ఆ కుటుంబం ఎలా స్పందించింది? బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆ తల్లి ఇలా రాసింది, “నిన్న నేను చాలా బాధలో ఉన్నాను. మీరు రాసిన ఉత్తరం నాకు ఎంత సహాయం చేసిందో మీకు తెలీదు. నాకు ఎంతో ఓదార్పునిచ్చిన ఆ ఉత్తరం రాసినందుకు చాలా థ్యాంక్స్‌. నేను దాన్ని 20 కన్నా ఎక్కువసార్లు చదివుంటాను. ఆ మాటలు ఎంత దయగా, ఆప్యాయంగా, ఊరటగా ఉన్నాయో నేను చెప్పలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం.” బాధపడేవాళ్ల స్థానంలో మనల్ని మనం ఊహించుకొని, వాళ్లకు సహాయం చేసినప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.

మీ పరిమితుల్ని గుర్తించండి

18. మొదటి కొరింథీయులు 3:6, 7 ప్రకారం పరిచర్య విషయంలో మనం ఏం గుర్తించాలి? ఎందుకు?

18 అవును, పరిచర్య విషయంలో మన పరిమితుల్ని గుర్తించాలి. ఇతరులు దేవుని గురించి తెలుసుకునేలా సహాయం చేయడంలో మనకు పాత్ర ఉంది. కానీ, మనదే ముఖ్యమైన పాత్ర కాదు. (1 కొరింథీయులు 3:6, 7 చదవండి.) ఎందుకంటే ప్రజల్ని ఆకర్షించేది యెహోవాయే. (యోహా. 6:44) ఒకవ్యక్తి మంచివార్తను అంగీకరిస్తాడా లేదా అనేది అతను లేదా ఆమె హృదయస్థితిని బట్టి ఉంటుంది. (మత్త. 13:4-8) జీవించిన వాళ్లందరిలో గొప్ప బోధకుడైన యేసు ప్రకటించినప్పుడే చాలామంది అంగీకరించలేదని గుర్తుంచుకోండి. కాబట్టి మనం చెప్పే మంచివార్తను చాలామంది వినకపోతే నిరుత్సాహపడకూడదు.

19. పరిచర్యలో సహానుభూతిని చూపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి?

19 మనం పరిచర్యలో సహానుభూతిని చూపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మనం ప్రీచింగ్‌ని ఎక్కువగా ఆనందిస్తాం. ఇవ్వడంలో ఉండే గొప్ప సంతోషాన్ని రుచిచూస్తాం. “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లు మంచివార్తను అంగీకరించడాన్ని సులభం చేస్తాం. (అపొ. 13:48) కాబట్టి, “మనకు అవకాశం ఉన్నంతవరకు అందరికీ మంచి చేస్తూ ఉందాం.” (గల. 6:10) అప్పుడు, మన పరలోక తండ్రికి మహిమ తీసుకొచ్చామనే ఆనందాన్ని సొంతం చేసుకుంటాం.—మత్త. 5:16.

పాట 64 సంతోషంగా కోతపని చేద్దాం

^ పేరా 5 మనం సహానుభూతిని చూపించినప్పుడు పరిచర్యలో ఎక్కువ ఆనందాన్ని పొందుతాం, ప్రజలు కూడా మనం చెప్పే సందేశాన్ని వినడానికి మరింత సుముఖంగా ఉంటారు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఈ ఆర్టికల్‌లో మనం యేసు ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చో పరిశీలిస్తాం. అంతేకాదు ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు మనం సహానుభూతిని చూపించగల నాలుగు మార్గాల గురించి కూడా తెలుసుకుంటాం.

^ పేరా 5 పదాల వివరణ: ఈ సందర్భంలో జాలి అనే పదం, బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు లేదా ఎవరైనా ఒకవ్యక్తితో దురుసుగా ప్రవర్తించడం చూసినప్పుడు కలిగే సున్నితమైన భావాల్ని సూచిస్తుంది. అలాంటి భావాలు, ఎదుటివ్యక్తికి సహాయం చేయడానికి చేయగలినదంతా చేయాలనే ప్రోత్సాహాన్నిస్తాయి.

^ పేరా 8 2014, మే 15 కావలికోట సంచికలో, “బంగారు సూత్రాన్ని మీ పరిచర్యలో పాటించండి” అనే ఆర్టికల్‌ చూడండి.