కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 10

నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?

నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?

“ఫిలిప్పు, ఆ అధికారి నీళ్లలోకి దిగారు; ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు.”—అపొ. 8:38.

పాట 52 క్రైస్తవ సమర్పణ

ఈ ఆర్టికల్‌లో . . . *

1. ఆదాముహవ్వలు ఏ నిర్ణయం తీసుకున్నారు? దాని ఫలితం ఏంటి?

మంచిచెడుల విషయంలో ప్రమాణాలు పెట్టే హక్కు ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? ఆదాముహవ్వలు మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు పండును తిన్నప్పుడు తమకు యెహోవా మీద, ఆయన ప్రమాణాల మీద నమ్మకం లేదని స్పష్టంగా తెలియజేశారు. మంచిచెడుల విషయంలో సొంతగా ప్రమాణాలు పెట్టుకోవాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. (ఆది. 3:22) ఫలితంగా, వాళ్లు యెహోవాతో ఉన్న స్నేహాన్ని కోల్పోయారు. శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని కోల్పోయారు, తమ పిల్లలకు పాపమరణాల్ని వారసత్వంగా ఇచ్చారు. (రోమా. 5:12) ఆదాముహవ్వల నిర్ణయం వల్ల ఘోరమైన పర్యవసానాలు వచ్చాయి.

యేసును అంగీకరించిన తర్వాత, ఐతియోపీయుడైన అధికారి వీలైనంత త్వరగా బాప్తిస్మం తీసుకోవాలనుకున్నాడు (2-3 పేరాలు చూడండి)

2-3. (ఎ) ఫిలిప్పు మంచివార్త ప్రకటించినప్పుడు ఐతియోపీయుడైన అధికారి ఎలా స్పందించాడు? (బి) బాప్తిస్మం తీసుకుంటే ఎలాంటి దీవెనలు వస్తాయి? ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

2 అయితే ఆదాముహవ్వలకు భిన్నంగా, ఐతియోపీయుడైన అధికారి తనకు ఫిలిప్పు మంచివార్త ప్రకటించినప్పుడు చక్కగా స్పందించాడు. యెహోవా, యేసు తనకోసం చేసినవాటికి ఎంతో కృతజ్ఞత చూపిస్తూ ఆ అధికారి వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. (అపొ. 8:34-38) మనం కూడా దేవునికి సమర్పించుకుని, ఆ అధికారిలాగే బాప్తిస్మం తీసుకుంటే యెహోవా, యేసు మనకోసం చేసినవాటికి కృతజ్ఞత కలిగివున్నామని స్పష్టంగా తెలియజేస్తాం. అంతేకాదు, మనకు యెహోవాపై నమ్మకం ఉందని, మంచిచెడుల విషయంలో ప్రమాణాలు పెట్టే హక్కు ఆయనకు మాత్రమే ఉందనే విషయాన్ని గుర్తించామని చూపిస్తాం.

3 యెహోవా సేవచేస్తే మనకొచ్చే దీవెనల గురించి ఒకసారి ఆలోచించండి. ఒకటేంటంటే, ఆదాముహవ్వలు కోల్పోయిన వాటన్నిటినీ, చివరికి శాశ్వతంగా జీవించే అవకాశాన్ని కూడా మనం పొందుతాం. యేసుక్రీస్తుపై మనకున్న విశ్వాసం మూలంగా యెహోవా మన తప్పుల్ని క్షమిస్తాడు, మంచి మనస్సాక్షిని ఇస్తాడు. (మత్త. 20:28; అపొ. 10:43) అంతేకాదు, యెహోవా ఆమోదం ఉన్న సేవకుల కుటుంబంలో మనం కూడా సభ్యులమౌతాం, అద్భుతమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటాం. (యోహా. 10:14-16; రోమా. 8:20, 21) ఇన్ని దీవెనలు వస్తాయని తెలిసినా కొంతమంది ఐతియోపీయుడైన అధికారి చేసిన పనిని చేయడానికి వెనకాడతారు. ఇంతకీ వాళ్లు బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకాడతారు? ఆ సవాళ్లను వాళ్లెలా అధిగమించవచ్చు?

కొంతమంది ఎదుర్కొనే సవాళ్లు

బాప్తిస్మం తీసుకోవడానికి ముందు కొంతమంది ఎదుర్కొనే సవాళ్లు

ఆత్మవిశ్వాసం లేకపోవడం (4-5 పేరాలు చూడండి) *

4-5. ఏవరీ, హన్నా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?

4 ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఏవరీ అనే యువకుని తల్లిదండ్రులు యెహోవాసాక్షులు. అతని నాన్నకు ఒక ప్రేమగల తండ్రిగా, సంఘపెద్దగా మంచి పేరు ఉంది. అయినప్పటికీ, ఏవరీ బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడాడు. ఎందుకు? “మా నాన్నలా నేను మంచి పేరు సంపాదించుకోలేనేమో అని నాకు అనిపించింది” అని అతను చెప్పాడు. అంతేకాదు భవిష్యత్తులో రాబోయే బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేనని అతను అనుకున్నాడు. ఏవరీ ఇలా చెప్తున్నాడు: “అందరి ముందు ప్రార్థన చేయమని, ప్రసంగాలు ఇవ్వమని, క్షేత్ర సేవా గ్రూప్‌ను నడిపించమని నన్ను అడుగుతారేమోనని భయపడ్డాను.”

5 పద్దెనిమిదేళ్ల హన్నాకు ఏమాత్రం ఆత్మవిశ్వాసం ఉండేదికాదు. ఆమె యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగింది. అయినప్పటికీ, యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించలేనేమోనని భయపడింది. ఎందుకు? ఎందుకంటే, తాను ఎందుకూ పనికిరానిదాన్నని హన్నా అనుకునేది. కొన్నిసార్లు ఆ బాధలో ఆమె తన శరీరాన్ని గాయపర్చుకునేది, దానివల్ల పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. ఆమె ఇలా చెప్తుంది, “నేను దానిగురించి ఎవ్వరికీ చెప్పలేదు, ఆఖరికి మా అమ్మానాన్నలకు కూడా. నేను నా శరీరాన్ని గాయపర్చుకుంటున్నాను కాబట్టి యెహోవా నన్ను ఎప్పటికీ ఇష్టపడడని అనుకున్నాను.”

స్నేహితుల ప్రభావం (6వ పేరా చూడండి) *

6. వనెస్సా బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకాడింది?

6 స్నేహితుల ప్రభావం. 22 ఏళ్ల వనెస్సా ఇలా చెప్తుంది, “దాదాపు పది సంవత్సరాల పాటు ఒకామె నాకు మంచి స్నేహితురాలుగా ఉంది.” అయితే, ఆ స్నేహితురాలికి వనెస్సా బాప్తిస్మం తీసుకోవడం ఇష్టంలేదు. దానివల్ల వనెస్సా చాలా బాధపడింది. ఆమె ఇలా చెప్తుంది, “నేను ఎవ్వరితో అంత త్వరగా స్నేహం చేయలేను, కాబట్టి నేను ఆమెతో స్నేహం మానేస్తే, నాకు మళ్లీ మంచి స్నేహితులు దొరుకుతారో లేరో అని ఆందోళనపడ్డాను.”

తప్పు చేస్తామేమో అనే భయం (7వ పేరా చూడండి) *

7. మకేల దేనిగురించి భయపడింది? ఎందుకు?

7 ఏదైనా పెద్ద తప్పు చేస్తామేమో అనే భయం. మకేలకు ఐదు ఏళ్లు ఉన్నప్పుడు, ఆమె అన్నయ్యను సంఘం నుండి బహిష్కరించారు. ఆమె పెద్దౌతున్న కొద్దీ, తన అన్నయ్య చేసిన పనివల్ల ఆమె అమ్మానాన్నలు ఎంత బాధపడుతున్నారో మకేల చూసింది. ఆమె ఇలా చెప్తుంది, “ఒకవేళ నేను బాప్తిస్మం తీసుకున్నాక ఏదైనా తప్పు చేసి, సంఘం నుండి బహిష్కరించబడితే అమ్మానాన్నలు ఇంకా బాధపడతారేమోనని భయపడ్డాను.”

వ్యతిరేకత వస్తుందేమో అనే భయం (8వ పేరా చూడండి) *

8. మైల్జ్‌ దేనిగురించి భయపడ్డాడు?

8 వ్యతిరేకత వస్తుందేమో అనే భయం. మైల్జ్‌ వాళ్ల నాన్న, మారుటి తల్లి యెహోవాసాక్షులు. కానీ అతని కన్నతల్లి యెహోవాసాక్షి కాదు. అతనిలా చెప్పాడు, “నేను మా అమ్మతో 18 సంవత్సరాలు కలిసి ఉన్నాను. నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అని అమ్మకు చెప్పడానికి భయపడ్డాను. ఎందుకంటే నాన్న యెహోవాసాక్షి అయినప్పుడు అమ్మ ఎంత వ్యతిరేకించిందో నేను చూశాను. కాబట్టి నన్ను కూడా వ్యతిరేకిస్తుందేమో అని భయపడ్డాను.”

సవాళ్లను ఎలా అధిగమించవచ్చు?

9. యెహోవా ఎంత ప్రేమ, ఓర్పు గల దేవుడో తెలుసుకుంటే మీరేమి చేయాలనే ప్రోత్సాహం పొందవచ్చు?

9 ఆదాముహవ్వలు యెహోవా మీద బలమైన ప్రేమను వృద్ధి చేసుకోలేకపోయారు కాబట్టి ఆయన్ని సేవించకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ, వాళ్లు పిల్లల్ని కనేలా యెహోవా వాళ్లను బ్రతకనిచ్చాడు, వాళ్లు తమ సొంత ప్రమాణాల ప్రకారం పిల్లల్ని పెంచేలా అనుమతించాడు. యెహోవాకు దూరంగా ఉండాలనుకోవడం ఎంత తెలివితక్కువ నిర్ణయమో తెలుసుకోవడానికి వాళ్లకు ఎక్కువకాలం పట్టలేదు. వాళ్ల పెద్ద కొడుకు తన తమ్ముణ్ణి చంపేశాడు, క్రమక్రమంగా హింస, స్వార్థం మానవ కుటుంబంపై రాజ్యమేలాయి. (ఆది. 4:8; 6:11-13) అయితే, ఆదాముహవ్వల పిల్లల్లో తనను సేవించాలని కోరుకునేవాళ్లను రక్షించడానికి యెహోవా ఒక ఏర్పాటు చేశాడు. (యోహా. 6:38-40, 57, 58) యెహోవా ఎంత ఓర్పు, ప్రేమ గల దేవుడో మీరు తెలుసుకునే కొద్దీ ఆయన మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది. ఫలితంగా ఆదాముహవ్వల దారిలో నడవకుండా మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవాలని నిర్ణయించుకుంటారు.

ఈ సవాళ్లను మీరెలా అధిగమించవచ్చు?

(9-10 పేరాలు చూడండి) *

10. కీర్తన 19:7 లోని మాటల్ని ధ్యానించడం వల్ల యెహోవా సేవ చేయాలనే కోరిక ఎలా కలుగుతుంది?

10 యెహోవా గురించి నేర్చుకుంటూ ఉండండి. యెహోవా గురించి మీరు ఎంతెక్కువ నేర్చుకుంటే, ఆయన సేవను విజయవంతంగా చేయవచ్చనే నమ్మకం మీలో అంతెక్కువ పెరుగుతుంది. పైన ప్రస్తావించబడిన ఏవరీ ఇలా చెప్పాడు, కీర్తన 19:7⁠లో ఉన్న వాగ్దానం గురించి పరిశోధన చేసి, దానిగురించి లోతుగా ఆలోచించడం వల్ల నా ఆత్మవిశ్వాసం పెరిగింది.” (చదవండి.) ఆ లేఖనంలోని వాగ్దానాన్ని యెహోవా నెరవేర్చడం ఏవరీ చూసినప్పుడు, యెహోవా మీద అతనికున్న ప్రేమ పెరిగింది. దేవుని మీద ప్రేమ, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, యెహోవాను సంతోషపెట్టాలనే, ఆయన సేవ చేయాలనే మన కోరికను కూడా బలపరుస్తుంది. పైన ప్రస్తావించిన హన్నా ఇలా చెప్తుంది, “నన్ను నేను గాయపర్చుకున్నప్పుడు, యెహోవాను కూడా గాయపరుస్తున్నానని బైబిలు చదవడం ద్వారా, అధ్యయన చేయడం ద్వారా అర్థంచేసుకున్నాను.” (1 పేతు. 5:7) హన్నా బైబిల్లోని విషయాల్ని పాటించడం మొదలుపెట్టింది. (యాకో. 1:22) దాని ఫలితం ఏంటి? ఆమె ఇలా చెప్తోంది, “యెహోవాకు లోబడడం వల్ల నేను పొందిన ప్రయోజనాల్ని చూసినప్పుడు ఆయన మీద నాకున్న ప్రేమ బలపడింది. నాకు అవసరమైనప్పుడు యెహోవా తప్పకుండా నిర్దేశాన్ని ఇస్తాడనే గట్టి నమ్మకం ఇప్పుడు నాకు కలిగింది.” హన్నా తనను తాను గాయపర్చుకునే అలవాటును మానుకోగలిగింది. ఆమె యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుంది.

(11వ పేరా చూడండి) *

11. మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడానికి వనెస్సా ఏమి చేసింది? ఆమె నుండి మనమేం నేర్చుకోవచ్చు?

11 స్నేహితుల్ని జ్ఞానయుక్తంగా ఎంచుకోండి. యెహోవా సేవ చేయకుండా తన స్నేహితురాలు అడ్డుపడుతున్నట్లు కొంతకాలానికి వనెస్సా గుర్తించింది. దాంతో వనెస్సా ఆమెతో స్నేహం చేయడం మానేసింది. అంతేకాదు, సంఘంలో కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడానికి గట్టిగా కృషిచేసింది. ఈ విషయంలో తాను నోవహును, ఆయన కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నానని చెప్పింది. ఆమె ఇలా అంది, “వాళ్లు యెహోవాను ప్రేమించని ప్రజల మధ్య జీవించారు. కానీ వాళ్లు ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉన్నారు.” వనెస్సా బాప్తిస్మం తీసుకున్న తర్వాత పయినీరు సేవ మొదలుపెట్టింది. ఆమె ఇప్పుడు ఇలా చెప్తోంది, “పయినీరు సేవవల్ల నా సంఘంలోనే కాదు వేరే సంఘాల్లో కూడా స్నేహితుల్ని సంపాదించుకోగలిగాను.” కాబట్టి యెహోవా మీకు అప్పగించిన పనిలో చేయగలిగినదంతా చేసినప్పుడు మీరు కూడా మంచి స్నేహితుల్ని సంపాదించుకోవచ్చు.—మత్త. 24:14.

(12-15 పేరాలు చూడండి) *

12. ఆదాముహవ్వలకు ఎలాంటి భయం లేదు? దాని ఫలితం ఏంటి?

12 సరైన భయం కలిగివుండండి. కొన్ని రకాల భయాలు మనకు మంచివే. ఉదాహరణకు, యెహోవాను బాధపెట్టే పనులు చేస్తామేమో అనే భయం మనకు ఉండాలి. (కీర్త. 111:10) ఒకవేళ ఆదాముహవ్వలు అలాంటి భయాన్ని పెంపొందించుకొని ఉంటే, వాళ్లు యెహోవాకు ఎదురుతిరిగి ఉండేవాళ్లు కాదు. అలా ఎదురుతిరిగిన తర్వాత, వాళ్ల కళ్లు తెరవబడి, వాళ్లు పాపం చేశారనే విషయాన్ని పూర్తిగా అర్థంచేసుకోగలిగారు. వాళ్లు తమ పిల్లలకు పాపాన్ని, మరణాన్ని మాత్రమే వారసత్వంగా ఇవ్వగలిగారు. వాళ్లు యెహోవా ఆజ్ఞను మీరారనే విషయాన్ని అర్థంచేసుకున్నారు కాబట్టే దిగంబరులుగా ఉన్నామని సిగ్గుతో ఆకులు చుట్టుకున్నారు.—ఆది. 3:7, 21.

13-14. (ఎ) 1 పేతురు 3:21 ప్రకారం, మనం చనిపోతామేమో అని ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు? (బి) యెహోవాను ప్రేమించడానికి మనకు ఏ కారణాలు ఉన్నాయి?

13 యెహోవాను ఎక్కడ బాధపెడతామో అనే భయం మనకు ఉండాలి గానీ చనిపోతామేమో అనే భయం ఉండాల్సిన అవసరంలేదు. మనం శాశ్వత జీవితాన్ని పొందడానికి యెహోవా ఒక ఏర్పాటు చేశాడు. ఒకవేళ మనం పాపం చేసినా, నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తే యెహోవా మన తప్పుల్ని క్షమిస్తాడు. తన కుమారుని విమోచన క్రయధనంపై మనకు విశ్వాసం ఉంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనకు ఆ విశ్వాసం ఉందని చూపించే ప్రధానమైన మార్గం ఏంటంటే, మన జీవితాల్ని దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం.—1 పేతురు 3:21 చదవండి.

14 యెహోవాను ప్రేమించడానికి మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. యెహోవా, మనం ప్రతీరోజు ఆస్వాదించే ఎన్నో మంచివాటిని ఇవ్వడంతోపాటు తన గురించి, తన సంకల్పాల గురించి మనకు నేర్పిస్తున్నాడు. (యోహా. 8:31, 32) మనకు నిర్దేశమివ్వడానికి, మద్దతునివ్వడానికి ఆయన క్రైస్తవ సంఘాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం సమస్యల్ని తట్టుకోవడానికి సహాయం చేయడమే కాదు, భవిష్యత్తులో అద్భుతమైన పరిస్థితుల్లో శాశ్వతకాలం జీవించే నిరీక్షణను కూడా ఇస్తున్నాడు. (కీర్త. 68:19; ప్రక. 21:3, 4) మనల్ని ప్రేమిస్తున్నాడని చూపించడానికి యెహోవా ఇప్పటికే చేసిన పనుల గురించి లోతుగా ఆలోచించినప్పుడు, ఆయన్ని ప్రేమించాలనే ప్రోత్సాహం పొందుతాం. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు, సరైన భయాన్ని కలిగివుంటాం. మనం ఎంతగానో ప్రేమించే ఆయన్ని ఎక్కడ బాధపెడతామో అని భయపడతాం.

15. మకేల తప్పు చేస్తానేమో అనే భయాన్ని ఎలా పోగొట్టుకుంది?

15 యెహోవా ఎంత క్షమించే దేవుడో తెలుసుకున్న తర్వాత మకేల తనకున్న భయాల్ని పోగొట్టుకుంది. ఆమె ఇలా చెప్తుంది, “మనందరం అపరిపూర్ణులమని, పొరపాట్లు చేస్తామని గ్రహించాను. అంతేకాదు యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, విమోచన క్రయధనం ఆధారంగా మనల్ని క్షమిస్తాడని తెలుసుకున్నాను.” యెహోవా మీద ఉన్న ప్రేమనుబట్టి మకేల తన జీవితాన్ని సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుంది.

(16వ పేరా చూడండి) *

16. వ్యతిరేకత వస్తుందేమో అనే భయాన్ని మైల్జ్‌ ఎలా అధిగమించగలిగాడు?

16 బాప్తిస్మం తీసుకుంటే తన తల్లి వ్యతిరేకిస్తుందేమో అని భయపడిన మైల్జ్‌, ప్రాంతీయ పర్యవేక్షకుని సహాయం తీసుకున్నాడు. మైల్జ్‌ ఇలా చెప్తున్నాడు, “ఆ ప్రాంతీయ పర్యవేక్షకుని తల్లి కూడా సత్యంలో లేదు. నన్ను బాప్తిస్మం తీసుకోమని నాన్న బలవంతం చేయలేదు గానీ అది నా సొంత నిర్ణయమని అమ్మను ఒప్పించేలా ఎలా మాట్లాడాలో ఆయన చెప్పాడు.” మైల్జ్‌ వాళ్ల అమ్మకు అతని నిర్ణయం నచ్చలేదు. అతను తీసుకున్న నిర్ణయానికి అంటిపెట్టుకొని ఉండడంవల్ల కొంతకాలానికి ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. అతనిలా చెప్తున్నాడు, “యెహోవా నాకోసం చేసిన మంచివాటి గురించి తెలుసుకున్నప్పుడు అవి నా హృదయాన్ని తాకాయి. యేసు విమోచన క్రయధనం గురించి లోతుగా ఆలోచించినప్పుడు, యెహోవా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది. దానివల్ల నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నాను.”

మీ నిర్ణయానికి అంటిపెట్టుకొని ఉండండి

దేవుడు మనకోసం చేసినవాటికి కృతజ్ఞత చూపించవచ్చు (17వ పేరా చూడండి)

17. మనకు ఏ అవకాశం ఉంది?

17 హవ్వ ఏదెను తోటలో పండు తినడం ద్వారా తన తండ్రిని తిరస్కరించింది. ఆదాము కూడా ఆమెతో చేతులు కలిపినప్పుడు, యెహోవా తనకోసం చేసిన మంచివాటి పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేదని అతను చూపించాడు. మనం ఆదాముహవ్వల్లా లేమని చూపించే అవకాశం మనందరికీ ఉంది. యెహోవా మనకోసం చేసిన మంచివాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగివున్నాం. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, మంచిచెడుల విషయంలో ప్రమాణాలు పెట్టే హక్కు యెహోవాకు మాత్రమే ఉందని చూపిస్తాం. అంతేకాదు మన తండ్రైన యెహోవాను ప్రేమిస్తున్నామని, నమ్ముతున్నామని చూపిస్తాం.

18. యెహోవా సేవలో మీరెలా విజయం సాధించవచ్చు?

18 బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనకు ఎదురయ్యే సవాలు ఏంటంటే, మనం ప్రతీరోజు సొంత ప్రమాణాల ప్రకారం కాకుండా యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించాలి. ప్రతీ సంవత్సరం లక్షల మంది అలా జీవిస్తున్నారు. వాళ్లలో మీరూ ఒకరిగా ఉండవచ్చు. బైబిల్ని లోతుగా అర్థంచేసుకోవడం ద్వారా, సహోదరసహోదరీలతో క్రమంగా సహవసించడం ద్వారా, మీ ప్రేమగల తండ్రైన యెహోవా గురించి ఉత్సాహంగా అందరికీ చెప్పడం ద్వారా మీరు అలా ఉండవచ్చు. (హెబ్రీ. 10:24, 25) మీరు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు బైబిలు ద్వారా, తన సంస్థ ద్వారా యెహోవా ఇచ్చే సలహాల్ని పాటించండి. (యెష. 30:21) అప్పుడు మీరు చేసే ప్రతీది సఫలమౌతుంది.—సామె. 16:3, 20.

19. మీరు ఏ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు?

19 యెహోవా నిర్దేశం వల్ల మీరెంత ప్రయోజనం పొందుతున్నారో ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆయనపట్ల, ఆయన ప్రమాణాల పట్ల మీకున్న ప్రేమ పెరుగుతుంది. అప్పుడు, సాతాను ఏ ఆశ చూపించినా, మీరు యెహోవా సేవనుండి పక్కకు తొలగిపోరు. వెయ్యి సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు ఊహించుకోండి. వెనక్కి తిరిగి చూసుకుంటే, బాప్తిస్మం తీసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయం జీవితంలో అత్యంత శ్రేష్ఠమైన నిర్ణయమని గుర్తిస్తారు!

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

^ పేరా 5 బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవడమే మీరు తీసుకోగల అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం. అది ఎందుకంత ప్రాముఖ్యమైన నిర్ణయం? ఈ ఆర్టికల్‌లో దానికి జవాబు తెలుసుకుంటాం. అంతేకాదు బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది ఎందుకు వెనకాడతారో, ఆ సవాళ్లను ఎలా అధిగమించవచ్చో కూడా ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 56 చిత్రాల వివరణ: ఆత్మవిశ్వాసం లేకపోవడం: ఒక యువకుడు కామెంట్‌ చెప్పడానికి భయపడుతున్నాడు.

^ పేరా 58 చిత్రాల వివరణ: స్నేహితులు: ఒక యువ సహోదరి, తన చెడ్డ స్నేహితురాలితో వెళ్తున్నప్పుడు తోటి సాక్షుల్ని చూసి ముఖం తిప్పేసుకుంది.

^ పేరా 60 చిత్రాల వివరణ: తప్పు చేస్తామేమో అనే భయం: తన అన్నయ్య సంఘం నుండి బహిష్కరించబడి, ఇల్లు వదిలి వెళ్లినప్పుడు, ఒక యువ సహోదరి తాను కూడా ఏదైనా తప్పు చేస్తానేమో అని భయపడుతుంది.

^ పేరా 62 చిత్రాల వివరణ: వ్యతిరేకత: ఒక అబ్బాయి సాక్షికాని తన తల్లి ముందు ప్రార్థన చేసుకోవడానికి భయపడుతున్నాడు.

^ పేరా 65 చిత్రాల వివరణ: ఆత్మవిశ్వాసం లేకపోవడం: ఇంకా ఎక్కువగా వ్యక్తిగత అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు.

^ పేరా 67 చిత్రాల వివరణ: స్నేహితులు: యెహోవాసాక్షిగా ఉన్నందుకు గర్వపడడం ఆమె నేర్చుకుంది.

^ పేరా 69 చిత్రాల వివరణ: తప్పు చేస్తామేమో అనే భయం: ఆమె సత్యాన్ని సొంతం చేసుకుని, బాప్తిస్మం తీసుకుంది.

^ పేరా 71 చిత్రాల వివరణ: వ్యతిరేకత: అతను ఆ తర్వాత తన నమ్మకాల గురించి ధైర్యంగా చెప్తున్నాడు.