కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 11

యెహోవా చెప్పేది వినండి

యెహోవా చెప్పేది వినండి

“ఈయన నా ప్రియ కుమారుడు. . . . ఈయన మాట వినండి.” —మత్త. 17:5.

పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) గతంలో యెహోవా మనుషులతో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

యెహోవాకు మనతో మాట్లాడడమంటే ఇష్టం. గతంలో ఆయన తన ఆలోచనల్ని తెలియజేయడానికి ప్రవక్తల్ని, దేవదూతల్ని, తన కుమారుడైన యేసుక్రీస్తును ఉపయోగించుకున్నాడు. (ఆమో. 3:7; గల. 3:19; ప్రక. 1:1) ప్రస్తుతం ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం తన ఆలోచనల్ని తెలుసుకుని, తన మార్గాల్ని అర్థంచేసుకోవడానికి యెహోవా మనకు బైబిల్ని ఇచ్చాడు.

2 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, యెహోవా మూడు సందర్భాల్లో పరలోకం నుండి మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో, వాటినుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చో కూడా తెలుసుకుందాం.

“నువ్వు నా ప్రియ కుమారుడివి”

3. మార్కు 1:9-11 ప్రకారం, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా ఏం చెప్పాడు? ఆ మాటలు యేసు గురించి ఏ ప్రాముఖ్యమైన వాస్తవాల్ని తెలియజేస్తున్నాయి?

3 మార్కు 1:9-11లో యెహోవా పరలోకం నుండి మాట్లాడిన మొదటి సందర్భం గురించి ఉంది. (చదవండి.) అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, “నువ్వు నా ప్రియ కుమారుడివి; నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను [లేదా “నేను నిన్ను ఆమోదించాను,” అధస్సూచి].” తన తండ్రి తనమీద ప్రేమను, నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ చెప్పిన ఆ మాటల్ని విన్నప్పుడు యేసు ఎంత సంతోషించి ఉంటాడో కదా! యెహోవా చెప్పిన ఆ మాటలు యేసు గురించి మూడు ప్రాముఖ్యమైన వాస్తవాల్ని తెలియజేశాయి. మొదటిది, యేసు తన కుమారుడు. రెండోది, యెహోవా తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. మూడోది, ఆయన తన కుమారుణ్ణి ఆమోదించాడు. వీటిలో ఒక్కొక్క దాన్ని లోతుగా పరిశీలిద్దాం.

4. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా ఒక కొత్త భావంలో దేవుని కుమారుడు అయ్యాడు?

4 ‘నువ్వు నా కుమారుడివి.’ తన ప్రియ కుమారుడైన యేసుకు ఇప్పుడు తనతో ఒక కొత్త బంధం ఏర్పడిందని యెహోవా ఆ మాటల ద్వారా తెలియజేశాడు. యేసు పరలోకంలో ఉన్నప్పుడు కూడా దేవుని కుమారుడే. అయితే, బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసు ఒక కొత్త భావంలో దేవునికి కుమారుడు అయ్యాడు. యేసు పవిత్రశక్తి చేత అభిషేకించబడడం ద్వారా దేవుని నియమిత రాజుగా, ప్రధానయాజకుడిగా అయ్యేందుకు తిరిగి పరలోకానికి వెళ్లే నిరీక్షణను పొందాడు. (లూకా 1:31-33; హెబ్రీ. 1:8, 9; 2:17) అందుకే బాప్తిస్మం సమయంలో యెహోవా యేసును, ‘నువ్వు నా కుమారుడివి’ అని పిలిచాడు.—లూకా 3:22.

ఇతరులు మనల్ని మెచ్చుకున్నప్పుడు, ప్రోత్సహించినప్పుడు మనం ప్రగతిసాధిస్తాం (5వ పేరా చూడండి) *

5. ప్రేమను, ఆమోదాన్ని తెలియజేయడంలో మనం యెహో వాను ఎలా అనుకరించవచ్చు?

5 “నువ్వు నా ప్రియ కుమారుడివి.” ప్రేమను, ఆమోదాన్ని తెలియజేయడంలో యెహోవా ఉంచిన ఆదర్శం, మనం కూడా ఇతరుల్ని ప్రోత్సహించే అవకాశాల కోసం వెదకాలని గుర్తుచేస్తుంది. (యోహా. 5:20) మన మంచి కోరుకునేవాళ్లు మనపట్ల ప్రేమ చూపించినప్పుడు, మనం చేసిన మంచి పనుల్ని మెచ్చుకున్నప్పుడు మనమెంతో ప్రోత్సాహం పొందుతాం. అదేవిధంగా సంఘంలో ఉన్న సహోదరసహోదరీలకు, కుటుంబ సభ్యులకు కూడా మన ప్రేమ, ప్రోత్సాహం అవసరం. మనం ఇతరుల్ని మెచ్చుకున్నప్పుడు వాళ్ల విశ్వాసం బలపడుతుంది, వాళ్లు యెహోవాకు నమ్మకంగా సేవ చేయగలుగుతారు. ముఖ్యంగా, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిజాయితీగా మెచ్చుకున్నప్పుడు, వాళ్ల పట్ల ప్రేమ చూపించినప్పుడు పిల్లలు చక్కగా ఎదుగుతారు.

6. మనం యేసుపై ఎందుకు నమ్మకం ఉంచవచ్చు?

6 “నేను నిన్ను ఆమోదించాను.” తన ఇష్టాన్ని యేసు తప్పకుండా నెరవేరుస్తాడనే నమ్మకాన్ని యెహోవా ఆ మాటల ద్వారా తెలియజేశాడు. యెహోవాకు తన కుమారుని మీద ఎంతో నమ్మకం ఉంది, అందుకే మనం కూడా యెహోవా వాగ్దానాలన్నిటినీ యేసు తప్పకుండా నెరవేరుస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. (2 కొరిం. 1:20) యేసు ఆదర్శం గురించి లోతుగా ఆలోచించినప్పుడు, ఆయన నుండి నేర్చుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని మనం బలంగా నిశ్చయించుకుంటాం. యెహోవాకు యేసు మీద నమ్మకం ఉన్నట్లే, తన సేవకుల మీద కూడా నమ్మకం ఉంది. వాళ్లు ఒక గుంపుగా తన కుమారుని నుండి నేర్చుకుంటూ ఉంటారని యెహోవా నమ్ముతున్నాడు.—1 పేతు. 2:21.

“ఈయన మాట వినండి”

7. మత్తయి 17:1-5 ప్రకారం ఏ సందర్భంలో యెహోవా పరలోకం నుండి మాట్లాడాడు? అప్పుడు ఆయన ఏం చెప్పాడు?

7 మత్తయి 17:1-5 చదవండి. యేసు రూపాంతరం చెందినప్పుడు, యెహోవా రెండోసారి పరలోకం నుండి మాట్లాడాడు. యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఒక ఎత్తయిన కొండమీదికి వెళ్లాడు. అక్కడ వాళ్లు ఒక అసాధారణమైన దర్శనం చూశారు. యేసు ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన బట్టలు తెల్లగా మెరిశాయి. మోషేలా, ఏలీయాలా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు యేసుతో ఆయన మరణం, పునరుత్థానం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ ముగ్గురు అపొస్తలులు ‘నిద్రమత్తులో ఉన్నప్పటికీ,’ ఆశ్చర్యకరమైన ఆ దర్శనాన్ని చూసే సమయానికి పూర్తిగా మెలకువతో ఉన్నారు. (లూకా 9:29-32) తర్వాత, ఒక ప్రకాశవంతమైన మేఘం వాళ్లను కమ్మింది, అప్పుడు ఆ మేఘం నుండి దేవుని స్వరం వినబడింది. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మాట్లాడినట్లే, ఇప్పుడు కూడా యెహోవా తన ప్రేమను, ఆమోదాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.” అయితే ఈ సందర్భంలో యెహోవా, “ఈయన మాట వినండి” అని కూడా చెప్పాడు.

8. రూపాంతర దర్శనం యేసు మీద, ఆయన శిష్యుల మీద ఎలాంటి ప్రభావం చూపించింది?

8 దేవుని రాజ్యానికి రాజుగా యేసు భవిష్యత్తులో పొందబోయే మహిమ, శక్తి గురించి ఆ దర్శనం క్లుప్తంగా తెలియజేసింది. ఆయన అనుభవించబోయే శ్రమల్ని, బాధాకరమైన మరణాన్ని తట్టుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, బలాన్ని ఆ దర్శనం ఇచ్చింది. అంతేకాదు, అది శిష్యుల విశ్వాసాన్ని కూడా బలపర్చి, వాళ్లు ఎదుర్కోబోయే పరీక్షలకు, చేయాల్సిన గొప్ప పనికి వాళ్లను సిద్ధం చేసింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత కూడా అపొస్తలుడైన పేతురు రూపాంతర దర్శనం గురించి రాశాడంటే, అది అతని మనసులో ఎంతగా నాటుకుపోయిందో అర్థమౌతుంది.—2 పేతు. 1:16-18.

9. యేసు ఉపయోగకరమైన ఏ సలహాల్ని తన శిష్యులకు ఇచ్చాడు?

9 “ఈయన మాట వినండి.” మనం తన కుమారుడు చెప్పేది వినాలనేది, వాటికి లోబడాలనేది తన కోరికని యెహోవా స్పష్టం చేశాడు. ఇంతకీ యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు? మనం తప్పకుండా విని, పాటించాల్సిన ఎన్నో విషయాల్ని ఆయన చెప్పాడు. ఉదాహరణకు, మంచివార్తను ఎలా ప్రకటించాలో ఆయన తన అనుచరులకు ప్రేమతో నేర్పించాడు; అంతేకాదు అప్రమత్తంగా ఉండమని పదేపదే వాళ్లకు గుర్తుచేశాడు. (మత్త. 24:42; 28:19, 20) తీవ్రంగా కష్టపడమని, వెనుకంజ వేయవద్దని వాళ్లను ప్రోత్సహించాడు. (లూకా 13:24) తన అనుచరులు ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఐక్యంగా ఉండడం, ఆయన ఆజ్ఞల్ని పాటించడం ఎంత ప్రాముఖ్యమో చెప్పాడు. (యోహా. 15:10, 12, 13) యేసు తన శిష్యులకు ఎంత ఉపయోగకరమైన సలహాల్ని ఇచ్చాడో కదా! అయితే, ఆ సలహాలు అప్పుడు ఎంత ప్రాముఖ్యమైనవో ఇప్పుడు కూడా అంతే ప్రాముఖ్యమైనవి.

10-11. యేసు చెప్పేది వింటున్నామని మనం ఎలా చూపించవచ్చు?

10 యేసు ఇలా అన్నాడు, “సత్యానికి లోబడే ప్రతీ ఒక్కరు నేను చెప్పేది వింటారు.” (యోహా. 18:37) మనం “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ” ఉన్నప్పుడు యేసు చెప్పేది వింటున్నామని చూపిస్తాం. (కొలొ. 3:13; లూకా 17:3, 4) “అనుకూలంగా ఉన్న సమయాల్లో, కష్ట సమయాల్లో” మంచివార్తను ఉత్సాహంగా ప్రకటించడం ద్వారా కూడా మనం యేసు చెప్పేది వింటున్నామని చూపిస్తాం.—2 తిమో. 4:2.

11 యేసు ఇలా అన్నాడు, “నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి.” (యోహా. 10:27) క్రీస్తు అనుచరులు యేసు మాటల్ని వినడం మాత్రమే కాదుగానీ వాటిని పాటించడం ద్వారా కూడా ఆయన స్వరాన్ని వింటారు. వాళ్లు “జీవిత చింతల వల్ల” పక్కకు మళ్లరు. (లూకా 21:34) బదులుగా వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఆఖరికి కష్టపరిస్థితుల్లో కూడా యేసు ఆజ్ఞల్ని పాటించడమే తమ జీవితంలో అన్నింటికన్నా ప్రాముఖ్యమని భావిస్తారు. మన సహోదరుల్లో చాలామంది తీవ్ర శ్రమల్ని, శత్రువుల దాడుల్ని, కడు బీదరికాన్ని, ప్రకృతి వైపరిత్యాల్ని కూడా సహిస్తున్నారు. వాటివల్ల మన సహోదరులు ఏం పోగొట్టుకోవాల్సి వచ్చినా యెహోవాకు నమ్మకంగా ఉంటారు. అలాంటివాళ్లకు యేసు ఈ అభయాన్ని ఇస్తున్నాడు: “నా ఆజ్ఞల్ని స్వీకరించి, వాటిని పాటించే వ్యక్తే నన్ను ప్రేమించే వ్యక్తి. నన్ను ప్రేమించే వ్యక్తిని నా తండ్రి ప్రేమిస్తాడు.”—యోహా. 14:21.

పరిచర్య చేయడంవల్ల మన దృష్టి పక్కకు మళ్లకుండా ఉంటుంది (12వ పేరా చూడండి) *

12. మనం యేసు చెప్పేది వింటున్నామని చూపించే మరో మార్గం ఏంటి?

12 మనం యేసు చెప్పేది వింటున్నామని చూపించే మరో మార్గం ఏంటంటే, మనలో నాయకత్వం వహించడానికి యేసు నియమించిన వాళ్లకు సహకరించడం. (హెబ్రీ. 13:7, 17) ఈ మధ్యకాలంలో దేవుని సంస్థ చాలా మార్పులు చేసింది. ఉదాహరణకు, మన పరిచర్యలో ఉపయోగించడానికి కొత్త పనిముట్లను ఇచ్చింది; అలాగే పరిచర్య చేసే పద్ధతుల విషయంలో, వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో, రాజ్యమందిరాల్ని కట్టే, మరమ్మతులు చేసే, అవి మంచిస్థితిలో ఉండేలా చూసుకునే విధానంలో కొన్ని మార్పులు చేసింది. సంస్థ ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ప్రేమపూర్వకంగా ఇస్తున్న నిర్దేశాలకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! దేవుని సంస్థ సమయానికి తగ్గట్టు ఇస్తున్న నిర్దేశాల్ని పాటించడానికి మనం చేసే ప్రయత్నాల్ని యెహోవా దీవిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

13. యేసు చెప్పేది వినడంవల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

13 యేసు బోధించిన విషయాలన్నిటినీ వినడం ద్వారా మనం ప్రయోజనం పొందుతాం. తన బోధలు సేదదీర్పును ఇస్తాయని యేసు తన శిష్యులకు మాటిచ్చాడు. ఆయనిలా అన్నాడు, “మీరు సేదదీర్పు పొందుతారు. ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.” (మత్త. 11:28-30) యేసు జీవితం, పరిచర్య గురించి చెప్పే నాలుగు సువార్త వృత్తాంతాలతో సహా దేవుని వాక్యమంతా మనకు సేదదీర్పును, ఆధ్యాత్మికంగా పునరుత్తేజాన్ని, తెలివిని ఇస్తుంది. (కీర్త. 19:7; 23:3) యేసు ఇలా అన్నాడు, “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!”—లూకా 11:28.

‘నేను నా పేరును మహిమపరుస్తాను’

14-15. (ఎ) యోహాను 12:27, 28 ప్రకారం యెహోవా పరలోకం నుండి మాట్లాడిన మూడో సందర్భం ఏంటి? (బి) యెహోవా మాటలు యేసును ఓదార్చి, బలపర్చాయని ఎందుకు చెప్పవచ్చు?

14 యోహాను 12:27, 28 చదవండి. యెహోవా పరలోకం నుండి మాట్లాడిన మూడో సందర్భం గురించి యోహాను రాశాడు. యేసు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, తన చివరి పస్కా పండుగను జరుపుకోవడానికి యెరూషలేములో ఉన్నాడు. అప్పుడు యేసు, “నాకు ఆందోళనగా ఉంది” అన్నాడు. ఆ తర్వాత, “తండ్రీ, నీ పేరును మహిమపర్చు” అని ప్రార్థించాడు. దానికి జవాబుగా, “నేను దాన్ని మహిమపర్చాను, మళ్లీ మహిమపరుస్తాను” అని తన తండ్రి పరలోకం నుండి మాట్లాడాడు.

15 చివరివరకు యెహోవాకు నమ్మకంగా ఉండాలనే పెద్ద బాధ్యతను బట్టి యేసు ఆందోళనపడ్డాడు. తాను చాలా క్రూరమైన, బాధాకరమైన మరణాన్ని అనుభవిస్తానని యేసుకు తెలుసు. (మత్త. 26:38) అయితే యేసుకు అన్నిటికన్నా ముఖ్యమైంది, తన తండ్రి పేరును మహిమపర్చడమే. యేసు మీద దైవదూషణ చేశాడనే నింద వేయబడింది కాబట్టి అలాంటి మరణంవల్ల దేవునికి చెడ్డపేరు వస్తుందేమోనని ఆయన ఆందోళనపడ్డాడు. ఆ సమయంలో, యెహోవా మాటలు యేసుకు ఎంతటి ధైర్యాన్ని ఇచ్చివుంటాయో కదా! యెహోవా పేరు మహిమపర్చబడుతుందనే నమ్మకం యేసుకు కలిగింది. తన తండ్రి మాటలు యేసును ఎంతో ఓదార్చి, తాను అనుభవించబోయే బాధను తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చివుంటాయి. తన తండ్రి మాట్లాడినప్పుడు, అక్కడున్నవాళ్లలో యేసు మాత్రమే ఆ మాటల్ని అర్థంచేసుకొనివుంటాడు. కానీ యెహోవా మనందరి కోసం తన మాటల్ని బైబిల్లో నమోదు చేయించాడు.—యోహా. 12:29, 30.

యెహోవా తన పేరును మహిమపర్చుకుంటాడు, తన ప్రజల్ని కాపాడతాడు (16వ పేరా చూడండి) *

16. దేవుని పేరు మీదకు నింద వస్తుందేమోనని మనమెందుకు ఆందోళనపడుతుంటాం?

16 యేసులాగే, మనం కూడా యెహోవా పేరు మీద పడే నింద గురించి ఆందోళనపడుతుండవచ్చు. బహుశా యేసులాగే, మనకు అన్యాయం జరిగివుండవచ్చు. లేదా వ్యతిరేకులు మన గురించి వ్యాప్తిచేసిన అబద్ధాల వల్ల మనం కలత చెంది ఉండవచ్చు. అలాంటి అబద్ధాల వల్ల యెహోవా పేరు మీద, ఆయన సంస్థ మీద పడే నింద గురించి మనం ఆలోచిస్తుండవచ్చు. అలాంటి సమయాల్లో, యెహోవా మాటలు మనకు చాలా ఓదార్పును ఇస్తాయి. మనం అతిగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా [మన] హృదయాలకు, [మన] మనసులకు కాపలా” ఉంటుందనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (ఫిలి. 4:6, 7) యెహోవా తన పేరును ఎప్పటికీ మహిమపర్చుకుంటాడు. సాతాను, ఈ లోకం తన నమ్మకమైన సేవకులకు చేసిన నష్టానంతటినీ ఆయన తన రాజ్యం ద్వారా పూరిస్తాడు.—కీర్త. 94:22, 23; యెష. 65:17.

నేడు యెహోవా స్వరం నుండి ప్రయోజనం పొందండి

17. యెషయా 30:21 ప్రకారం, యెహోవా నేడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు?

17 యెహోవా ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. (యెషయా 30:21 చదవండి.) నిజమే, దేవుడు మనతో పరలోకం నుండి మాట్లాడట్లేదు. కానీ, ఆయన మనకు తన వాక్యమైన బైబిల్ని ఇచ్చాడు. దానిలో మనకు నిర్దేశాల్ని ఇచ్చాడు. అంతేకాదు, యెహోవా తన పవిత్రశక్తి ద్వారా ‘నమ్మకమైన గృహనిర్వాహకుడిని’ ప్రేరేపిస్తూ తన సేవకులకు ఆహారం పెడుతున్నాడు. (లూకా 12:42) ముద్రిత ప్రచురణల రూపంలో, ఆన్‌లైన్‌ సమాచారం, వీడియోలు, ఆడియో రూపంలో మనకు ఆధ్యాత్మిక ఆహారం ఎంత సమృద్ధిగా అందుతుందో కదా!

18. యెహోవా మాటలు మీ విశ్వాసాన్ని బలపర్చి, మీకు ధైర్యాన్ని ఎలా ఇస్తాయి?

18 తన కుమారుడైన యేసు భూమ్మీద ఉన్నప్పుడు యెహోవా పలికిన మాటల్ని మనసులో ఉంచుకుందాం. బైబిల్లో నమోదు చేయబడిన ఆ మాటలు, పరిస్థితులన్నీ యెహోవా అధీనంలో ఉన్నాయని, సాతానుతోపాటు ఈ దుష్టలోకం చేసిన నష్టాన్ని ఆయన పూరిస్తాడనే నమ్మకాన్ని మనకు ఇస్తాయి. కాబట్టి మనం యెహోవా స్వరాన్ని జాగ్రత్తగా వినాలని నిశ్చయించుకుందాం. అలా చేస్తే, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని అలాగే రాబోయే సమస్యల్ని విజయవంతంగా సహిస్తాం. బైబిలు మనకు ఇలా గుర్తుచేస్తోంది, “దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందాలంటే మీకు సహనం అవసరం. అయితే, ముందు మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి.”—హెబ్రీ. 10:36.

పాట 4 “యెహోవా నా కాపరి”

^ పేరా 5 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, యెహోవా మూడు సందర్భాల్లో పరలోకం నుండి మాట్లాడాడు. ఒక సందర్భంలో, తన కుమారుని మాట వినమని ఆయన యేసు శిష్యులకు చెప్పాడు. యెహోవా నేడు, యేసు బోధలు కూడా భాగంగా ఉన్న తన వాక్యం ద్వారా, తన సంస్థ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా, యేసు చెప్పేది విన్నప్పుడు మనం ఎలా ప్రయోజనం పొందుతామో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 52 చిత్రాల వివరణ: రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తున్న, లిటరేచర్‌ కౌంటర్‌ దగ్గర పనిచేస్తున్న ఒక సంఘ పరిచారకుడిని ఒక సంఘపెద్ద గమనిస్తున్నాడు. ఆ సంఘపెద్ద అతన్ని ప్రేమగా మెచ్చుకుంటున్నాడు.

^ పేరా 54 చిత్రాల వివరణ: సియర్రా లియోన్‌లో ఉంటున్న ఒక జంట ఒక స్థానిక జాలరికి మీటింగ్‌ ఆహ్వానపత్రాన్ని ఇస్తున్నారు.

^ పేరా 56 చిత్రాల వివరణ: మన పనిపై ఆంక్షలు విధించబడిన ఒక దేశంలో కొంతమంది సాక్షులు ఒక ఇంట్లో కూడుకున్నారు. వాళ్లు ఇతరుల దృష్టిలో పడకూడదని మామూలు బట్టలు వేసుకున్నారు.