కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు చెప్పే “ఆమేన్‌” యెహోవా దృష్టిలో విలువైనది

మీరు చెప్పే “ఆమేన్‌” యెహోవా దృష్టిలో విలువైనది

యెహోవా మన ఆరాధనను విలువైనదిగా చూస్తాడు. ఆయన తన సేవకుల మాటల్ని ‘చెవియొగ్గి ఆలకిస్తున్నాడు.’ తనను స్తుతించడానికి మనం చేసే ప్రతీదాన్ని, అది ఎంత చిన్నదైనా సరే ఆయన దాన్ని గమనిస్తాడు. (మలా. 3:16) ఉదాహరణకు, బహుశా మనం లెక్కలేనన్నిసార్లు చెప్పే “ఆమేన్‌” అనే పదం గురించి ఆలోచించండి. ఆ చిన్న మాట కూడా యెహోవా దృష్టిలో విలువైనదేనా? ఖచ్చితంగా! అది ఆయన దృష్టిలో ఎందుకు విలువైనదో తెలుసుకోవడానికి ఆ పదం అర్థమేమిటో, దాన్ని బైబిల్లో ఎలా ఉపయోగించారో ఇప్పుడు పరిశీలిద్దాం.

“ప్రజలందరు—‘ఆమేన్‌’ అనవలెను”

“ఆమేన్‌” అనే ఇంగ్లీషు పదానికి “అలాగే జరగాలి” లేదా “ఖచ్చితంగా” అనే అర్థాలున్నాయి. దాని హీబ్రూ మూలపదానికి “నమ్మకంగా ఉండాలి,” “నమ్మదగినదిగా ఉండాలి” అని అర్థం. ఆ పదం కొన్నిసార్లు న్యాయ సంబంధ విషయాల్లో ఉపయోగించబడింది. ఒక వ్యక్తి ప్రమాణం చేశాక, తాను చెప్పింది నిజమేనని, దానివల్ల వచ్చే ఎలాంటి పర్యవసానాలనైనా తాను అంగీకరిస్తానని తెలియజేయడానికి “ఆమేన్‌” అనేవాడు. (సంఖ్యా. 5:22) ఆ వ్యక్తి అలా అందరి ముందు “ఆమేన్‌” అని చెప్పినప్పుడు, తాను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి అదొక బలమైన కారణంగా ఉండేది.—నెహె. 5:13.

“ఆమేన్‌” అనే పదం ఎలా ఉపయోగించబడిందో తెలియజేసే ఒక చక్కని ఉదాహరణ ద్వితీయోపదేశకాండము 27 వ అధ్యాయంలో చూడవచ్చు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత, వాళ్లకు ధర్మశాస్త్రాన్ని మళ్లీ చదివి వినిపించడం కోసం వాళ్లను ఏబాలు పర్వతానికి, గెరిజీము పర్వతానికి మధ్యనున్న ప్రాంతంలో సమకూర్చారు. వాళ్లు ఆ ధర్మశాస్త్రాన్ని వినడమే కాదు దాన్ని అంగీకరిస్తున్నారని కూడా చెప్పాలి. దాన్ని పాటించకపోతే వచ్చే పర్యవసానాల్ని వాళ్లకు చదివి వినిపించినప్పుడు, వాళ్లు “ఆమేన్‌!” అని అనడం ద్వారా తమ అంగీకారాన్ని తెలిపారు. (ద్వితీ. 27:15-26) వేల సంఖ్యలో పురుషులు, స్త్రీలు, పిల్లలు గట్టిగా అలా చెప్పడాన్ని ఒకసారి ఊహించుకోండి! (యెహో. 8:30-35) ఆ రోజున వాళ్లు పలికిన ఆ మాటల్ని వాళ్లు ఎన్నడూ మర్చిపోలేదు. అంతేకాదు, వాళ్లు తమ మాటను నిలబెట్టుకున్నారు కూడా. ఎందుకంటే బైబిలు ఇలా చెప్తోంది, “యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.”—యెహో. 24:31.

యేసు కూడా తాను చెప్పిన మాటలు సత్యమని నొక్కిచెప్పడానికి “ఆమేన్‌” అనే పదాన్ని ఉపయోగించాడు, కానీ ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో దాన్ని ఉపయోగించాడు. ఆయన ఇతరులు చెప్పిన మాటకు జవాబుగా “ఆమేన్‌” (తెలుగులో “నిజంగా” అని అనువదించబడింది) అని అనలేదు గానీ తాను సత్యాలను పరిచయం చేసే ముందు ఆ మాట అన్నాడు. కొన్నిసార్లు ఆయన “ఆమేన్‌ ఆమేన్‌” అని రెండుసార్లు అన్నాడు. (మత్త. 5:18; యోహా. 1:51) అలా అనడం ద్వారా తాను చెప్తున్నది నూటికి నూరుపాళ్లు నిజమని యేసు తన ప్రేక్షకులకు భరోసా ఇచ్చాడు. దేవుని వాగ్దానాలన్నిటినీ నెరవేర్చే అధికారం యేసుకు ఇవ్వబడింది కాబట్టే ఆయన అంత దృఢ నమ్మకంతో చెప్పగలిగాడు.—2 కొరిం. 1:20; ప్రక. 3:14.

‘జనులు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు’

ఇశ్రాయేలీయులు యెహోవాను స్తుతించేటప్పుడు, ఆయనకు ప్రార్థనలు చేసేటప్పుడు కూడా “ఆమేన్‌” అనే పదాన్ని ఉపయోగించేవాళ్లు. (నెహె. 8:6; కీర్త. 41:13) ప్రార్థన ముగింపులో ఆమేన్‌ అనడం ద్వారా ఆ ప్రార్థనను వినేవాళ్లు దాన్ని అంగీకరిస్తున్నట్లు చూపించేవాళ్లు. ఆ విధంగా అక్కడ హాజరైన వాళ్లందరూ అందులో భాగం వహించేవాళ్లు, అలా యెహోవాను ఆరాధించడంలో ఆనందించేవాళ్లు. రాజైన దావీదు, యెహోవా మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు అదే జరిగింది. ఆ సందర్భాన్ని వేడుకగా జరుపుకుంటున్న సమయంలో దావీదు ఒక పాట రూపంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. దాన్ని 1 దినవృత్తాంతములు 16:8-36⁠లో చూడవచ్చు. అక్కడ హాజరైనవాళ్లు దావీదు మాటలకు ఎంతగా కదిలించబడ్డారంటే, “జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.” అవును, యెహోవాను ఐక్యంగా ఆరాధించడంలో వాళ్లు సంతోషించారు.

మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా యెహోవాను స్తుతించేటప్పుడు “ఆమేన్‌” అనే పదాన్ని ఉపయోగించే వాళ్లు. బైబిలు రచయితలు తరచూ ఆ పదాన్ని తమ ఉత్తరాల్లో రాసేవాళ్లు. (రోమా. 1:25; 16:27; 1 పేతు. 4:11) చివరికి పరలోకంలో దేవదూతలు కూడా యెహోవాను మహిమపరుస్తూ, “ఆమేన్‌! యెహోవాను స్తుతించండి!” అని అన్నారని ప్రకటన పుస్తకం చెప్తోంది. (ప్రక. 19:1, 4, అధస్సూచి) తొలి క్రైస్తవులు తమ కూటాల్లో ప్రార్థన చేసిన తర్వాత “ఆమేన్‌” అని అలవాటుగా అనేవాళ్లు. (1 కొరిం. 14:16) అయితే, అది వాళ్లు అనాలోచితంగా పలికే మాట కాదు.

మీరు చెప్పే “ఆమేన్‌” ఎందుకు విలువైనది?

“ఆమేన్‌” అనే పదాన్ని యెహోవా సేవకులు ఎలా ఉపయోగించేవాళ్లో తెలుసుకున్నాక, ప్రార్థన ముగింపులో ఆమేన్‌ అనడం ఎందుకు అర్థవంతమైనదో మనం గ్రహించాం. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమేన్‌ అనడం ద్వారా మన మనసులో ఉన్నదే చెప్పామని చూపిస్తాం. బహిరంగ ప్రార్థన ముగింపులో, మనసులోనైనా “ఆమేన్‌” అని అనడం ద్వారా ఆ ప్రార్థనలో చెప్పిన మాటల్ని మనం అంగీకరిస్తున్నామని చూపిస్తాం. మనం చెప్పే “ఆమేన్‌” విలువైనదని అనడానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మనం ఆరాధించేటప్పుడు చురుగ్గా, అప్రమత్తంగా ఉన్నామని చూపిస్తాం. మనం ప్రార్థిస్తున్నప్పుడు కేవలం మన మాటల ద్వారానే కాదు మన ప్రవర్తన ద్వారా కూడా యెహోవాను ఆరాధిస్తాం. మనం చెప్పే ఆమేన్‌కు విలువ ఉండాలని కోరుకుంటాం కాబట్టి ప్రార్థన సమయంలో సరైన వైఖరితో ఉంటూ దాన్ని శ్రద్ధగా వింటాం.

సత్యారాధనలో మనందరినీ ఐక్యంగా చేస్తుంది. సంఘంలో బహిరంగ ప్రార్థన చేసేటప్పుడు, మనం మిగతావాళ్లతో పాటు ఒకే ప్రార్థనను వింటాం. (అపొ. 1:14; 12:5) మన సహోదరసహోదరీలతో కలిసి ఆమేన్‌ అన్నప్పుడు మనం మరింత ఐక్యమౌతాం. దాన్ని బయటకు అన్నా లేదా మన మనసులో అన్నా సరే, మనం ఒక గుంపుగా చేసే విన్నపానికి స్పందించేలా మన “ఆమేన్‌” యెహోవాకు బలమైన కారణాన్ని ఇస్తుంది.

మనం చెప్పే “ఆమేన్‌” ద్వారా యెహోవాను స్తుతిస్తాం

మనం యెహోవాను స్తుతిస్తాం. మనం ఆరాధనలో చేసే ప్రతీదాన్ని యెహోవా గమనిస్తాడు. (లూకా 21:2, 3) మన ఉద్దేశం ఏంటో, మన మనసులో ఏముందో యెహోవా చూస్తాడు. ఒకవేళ మనం ఫోన్‌లో మీటింగ్‌ వింటున్నా, ఆ సమయంలో మనం వినయంగా చెప్పే ఆమేన్‌ని యెహోవా గుర్తిస్తాడు. అలా “ఆమేన్‌” అన్నప్పుడు, మీటింగ్‌లో ఉన్న మిగతావాళ్లతో కలిసి యెహోవాను స్తుతిస్తాం.

మనం చెప్పే “ఆమేన్‌” అనే పదానికి పెద్దగా విలువలేదని మనకు అనిపించవచ్చు, కానీ అది చాలా విలువైనది. ఒక బైబిలు ఎన్‌సైక్లోపీడియా చెప్తున్నట్లు, దేవుని ప్రజలు “ఈ ఒక్క పదం ద్వారా తమ మనసులో ఉన్నవాటిని పూర్తి నమ్మకంతో, పూర్తి అంగీకారంతో, హృదయపూర్వక నిరీక్షణతో” వ్యక్తం చేయవచ్చు. కాబట్టి మనం ప్రతీసారి చెప్పే “ఆమేన్‌” యెహోవాకు అంగీకారంగా ఉండాలని కోరుకుందాం.—కీర్త. 19:14.