కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

ప్రాచీన కాలాల్లో ఓడ ప్రయాణాలు ఎలా చేసేవాళ్లు?

పౌలు కాలంలో, ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఓడలు ఉండేవి కావు. ఎవరైనా ఓడలో ప్రయాణించాలనుకుంటే, సరుకులు తీసుకెళ్లే ఓడలు అటుగా వెళ్తున్నాయేమో కనుక్కొని, తమను తీసుకెళ్లగలరేమో అడగవల్సి వచ్చేది. (అపొ. 21:2, 3) ఒకవేళ ఆ వ్యక్తి ఎక్కిన ఓడ అతను వెళ్లాల్సిన ప్రాంతం వరకు వెళ్లకపోయినా, అది మధ్యమధ్యలో ఆగినప్పుడు, అతని గమ్యానికి వెళ్లే ఓడ ఏదైనా కనిపిస్తే అందులో ఎక్కవచ్చు.—అపొ. 27:1-6.

సముద్ర ప్రయాణాలు సంవత్సరంలో కొన్ని సమయాల్లోనే చేసేవాళ్లు. అంతేకాదు, ఓడలకు సమయ పట్టికంటూ ఏమీ ఉండేది కాదు. వాతావరణం బాలేకపోవడం వల్ల మాత్రమే కాకుండా, మూఢనమ్మకాల వల్ల కూడా నావికులు ఓడను నడిపేవాళ్లు కాదు. ఉదాహరణకు చెడు శకునాలని నావికులు అనుకునేవి, అంటే కాకి ఓడ తాడు మీద నిలబడి అరవడం, లేదా సముద్ర తీరాన బద్దలైన ఓడల ముక్కలు కనబడడం లాంటివి జరిగితే నావికులు ఓడ తీసేవాళ్లు కాదు. గాలులు అనుకూలంగా ఉన్నప్పుడు నావికులు వాటిని ఉపయోగించుకుని ఓడను నడిపేవాళ్లు. కాబట్టి సరైన గాలులు వీస్తున్నప్పుడు ఓడలు బయల్దేరేవి. ఒకవ్యక్తి తనను ఎక్కించుకునే ఓడ దొరికినప్పుడు, తన సామాన్లతో రేవు దగ్గరకు వచ్చి, ఓడ బయల్దేరుతుందనే ప్రకటన కోసం ఎదురుచూసేవాడు.

ప్రజలు ఓడ కోసం వెతుక్కునే పనిలేకుండా, రోము నగరంలో ఓడను కనుగొనే సులువైన మార్గం ఉండేదని చరిత్రకారుడైన లైనెల్‌ క్యాసన్‌ చెప్పాడు. ఆయనింకా ఇలా చెప్పాడు, “దాని [రోము] ఓడ రేవు టైబర్‌ నది ఆరంభంలో ఉండేది. దాని సమీపాన ఉన్న ఆస్టీయ పట్టణంలో చతురస్రాకారంలో విశాలమైన స్థలం ఉండి దాని చుట్టూ ఆఫీసులు ఉండేవి. వాటిలో చాలా ఆఫీసులు వేర్వేరు రేవుల వర్తకులకు చెందినవి. అందులో ఒకటి నార్‌బోన్‌కు [ప్రస్తుతం ఫ్రాన్స్‌] చెందినది, మరొకటి కార్తేజ్‌కు [ప్రస్తుతం ట్యునీషియా] చెందినది, . . . అలా చాలా ఆఫీసులు ఉండేవి. ఎవరైనా ఓడలో ప్రయాణం చేయాలనుకుంటే, వాళ్ల గమ్యం మీదుగా వెళ్లే ఓడలకు సంబంధించిన ఆఫీసుకు వెళ్తే సరిపోతుంది.”

సముద్ర ప్రయాణం వల్ల చాలా సమయం మిగిలేది, కానీ దానిలో అపాయాలు కూడా ఉండేవి. పౌలు మిషనరీ యాత్రలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయన ప్రయాణిస్తున్న ఓడ బద్దలైంది.—2 కొరిం. 11:25.