కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాతాను ఉపయోగించే ఒక ఉరి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

సాతాను ఉపయోగించే ఒక ఉరి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

ప్రాచీన ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటడానికి, దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. ఇంతలో కొంతమంది సందర్శకులు అక్కడికి వచ్చారు. వాళ్లు విదేశీ స్త్రీలు, ఇశ్రాయేలు పురుషుల్ని వాళ్లు విందుకు ఆహ్వానించారు. ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదని ఆ పురుషులకు అనిపించి ఉండవచ్చు. సాధారణంగా కొత్త స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం, నాట్యం చేయడం, రుచికరమైన విందు ఆనందించడం ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అయితే ఆ స్త్రీల ఆచారాలు, ప్రమాణాలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది పురుషులు, ‘ఏం ఫర్వాలేదు. మేము జాగ్రత్తగా ఉంటాం’ అని అనుకుని ఉంటారు.

తర్వాత ఏం జరిగింది? ‘ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగారు’ అని బైబిలు చెప్తుంది. నిజానికి ఆ స్త్రీలు, ఇశ్రాయేలు పురుషుల చేత అబద్ధ ఆరాధన చేయించాలని అనుకున్నారు; అనుకున్నది సాధించారు కూడా! అందుకే ఇశ్రాయేలీయుల మీద ‘యెహోవా కోపం రగులుకుంది.’—సంఖ్యా. 25:1-3.

వాళ్లు దేవుని ధర్మశాస్త్రాన్ని రెండు విధాలుగా మీరారు. మొదటిది, విగ్రహాలకు నమస్కరించారు; రెండవది, వ్యభిచారం చేశారు. అలా వేలమంది ఇశ్రాయేలీయులు అవిధేయత చూపించి ప్రాణాల్ని కోల్పోయారు. (నిర్గ. 20:4, 5, 14; ద్వితీ. 13:6-9) అదొక విషాదకరమైన సంఘటన అని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఆ పురుషులు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరకపోయుంటే యొర్దాను నది దాటి వాగ్దాన దేశంలో అడుగుపెట్టేవాళ్లు.—సంఖ్యా. 25:5, 9.

ఆ సంఘటనల గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “వాళ్లకు జరిగినవన్నీ మనకు గుణపాఠాలుగా ఉన్నాయి. అంతేకాదు, ఈ వ్యవస్థ అంతం కాబోయే సమయంలో జీవిస్తున్న మనకు హెచ్చరికగా ఉండడానికి ఆ విషయాలు లేఖనాల్లో రాయబడ్డాయి.” (1 కొరిం. 10:7-11) ఇశ్రాయేలీయుల్లో కొంతమంది ఘోరమైన పాపం చేసి వాగ్దాన దేశంలో అడుగుపెట్టే అర్హత కోల్పోయినప్పుడు సాతాను ఖచ్చితంగా సంతోషించి ఉంటాడు. మనల్ని కూడా కొత్త లోకంలోకి ప్రవేశించకుండా చేసి సాతాను సంతోషించాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు పురుషులు చేసిన తప్పు మనకు ఒక హెచ్చరికగా ఉండాలి!

ఒక ప్రమాదకరమైన ఉరి

నేడు, క్రైస్తవులు తన ఉరిలో పడాలని సాతాను కోరుకుంటున్నాడు. అందుకోసం, గతంలో ఎంతోమంది మీద ప్రయోగించి విజయం సాధించిన కుయుక్తులను ఉపయోగిస్తున్నాడు. సాతాను ఇశ్రాయేలీయుల్ని పడేయడానికి లైంగిక అనైతికత అనే ఉరి ఉపయోగించాడని మనం తెలుసుకున్నాం. మనకాలంలో కూడా అదొక ప్రమాదకరమైన ఉరి అని చెప్పవచ్చు. ఆ ఉరిలో చిక్కుకునేలా చేసే ఒక శక్తివంతమైన ఎర, అశ్లీల చిత్రాలు.

ఈ రోజుల్లో, రహస్యంగా అశ్లీల చిత్రాలు చూసే సౌలభ్యం ఉంది. ఒకప్పుడు, అశ్లీల చిత్రాలు చూడాలనుకుంటే వాటిని చూపించే సినిమా హాళ్లకో, బూతు సాహిత్యం అమ్మే షాపులకో వెళ్లాల్సి వచ్చేది. అయితే చాలామంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే భయంతో అక్కడికి వెళ్లడానికి వెనకాడేవాళ్లు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌ ఉంటే చాలు ఉద్యోగ స్థలంలో ఉన్నా, కారులో ఖాళీగా కూర్చున్నా అశ్లీల చిత్రాలు చూడగలుగుతున్నారు. చాలా దేశాల్లో స్త్రీలైనా, పురుషులైనా ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండానే అశ్లీల చిత్రాలు చూసే వీలు ఉంది.

అంతేనా? ఫోన్‌లు, ట్యాబ్‌లు రావడంతో అశ్లీల చిత్రాలు చూడడం ఇంకా తేలికైంది. వీధిలో నడుస్తూ, బస్సులో లేదా ట్రైన్‌లో వెళ్తూ కూడా చేతిలో ఉన్న ఫోన్‌లో, ట్యాబ్‌లో అశ్లీల చిత్రాలు చూడడం వీలౌతుంది.

అశ్లీల చిత్రాలు చూడడం, దాన్ని రహస్యంగా ఉంచడం చాలా తేలికైంది కాబట్టి, దానివల్ల కలిగే హాని గతంలో కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంది. వాటిని చూసే ఎంతోమంది తమ వివాహ బంధాన్ని, ఆత్మగౌరవాన్ని, మనస్సాక్షిని పాడుచేసుకుంటున్నారు. అంతకన్నా ఘోరంగా, దేవునితో వాళ్లకున్న సంబంధాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు. కాబట్టి అశ్లీల చిత్రాలు చూసేవాళ్లు తమకు తాము హాని చేసుకుంటున్నారు అనడం సరైనదే. ఆ అలవాటు వల్ల చాలా చెడు పర్యవసానాలు ఎదురౌతాయి. వాటిని చాలాకాలంపాటు, కొన్నిసార్లయితే జీవితాంతం ఎదుర్కొంటూనే ఉండాలి.

సాతాను ఉపయోగించే ఈ ఉరిని తప్పించుకునే మార్గం యెహోవా చూపిస్తున్నాడని మనం గుర్తించాలి. యెహోవా ఇచ్చే ఆ రక్షణ పొందాలంటే, మనం ఆయన మాట ‘శ్రద్ధగా వినాలి.’ అలా వినడంలో ప్రాచీన ఇశ్రాయేలీయులు విఫలమయ్యారు. (నిర్గ. 19:5) అయితే, అశ్లీల చిత్రాలు చూడడాన్ని యెహోవా అసహ్యించుకుంటున్నాడని మనం ఎందుకు చెప్పవచ్చు?

యెహోవాలాగే మీరూ అసహ్యించుకోండి

దీనిగురించి ఆలోచించండి: అప్పట్లో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన లాంటి నియమాలు వేరే ఏ జనాంగానికి లేవు. ఆ నియమాలు, చుట్టూ ఉన్న జనాంగాల నుండి, చెడ్డ ఆచారాల నుండి వాళ్లను కాపాడే గోడలా ఉండేవి. (ద్వితీ. 4:6-8) యెహోవా లైంగిక పాపాన్ని అసహ్యించుకుంటున్నాడనే సత్యాన్ని ఆ నియమాలు స్పష్టం చేశాయి.

చుట్టూ ఉన్న జనాంగాలు చేసే అనైతిక పనుల గురించి చెప్పిన తర్వాత యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు, “నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు . . . ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను.” ఇశ్రాయేలు పవిత్ర దేవునికి కనానీయుల జీవన విధానం ఎంత అసహ్యంగా అనిపించిందంటే, వాళ్లు నివసించిన ప్రాంతాన్ని సైతం ఆయన అపవిత్రమైనదిగా, కలుషితమైనదిగా భావించాడు.—లేవీ. 18:3, 25.

యెహోవా కనానీయుల్ని శిక్షించినప్పటికీ ఇతర ప్రజలు అనైతికతకు పాల్పడుతూ వచ్చారు. దాదాపు 1500 కన్నా ఎక్కువ ఏళ్ల తర్వాత, పౌలు వాళ్ల గురించి మాట్లాడుతూ ‘వాళ్లు నైతిక విచక్షణ కోల్పోయి, అత్యాశతో అన్నిరకాల అపవిత్రమైన పనులు చేస్తూ లెక్కలేనట్టు ప్రవర్తించారు’ అని అన్నాడు. (ఎఫె. 4:17-19) నేడు కూడా చాలామంది విచ్చలవిడిగా అనైతికతకు పాల్పడడమే కాకుండా, దాని విషయంలో గర్వపడుతున్నారు. అయితే సత్యారాధకులు, లోకం చూపించే అనైతికమైన వాటిని చూడకుండా ఉండడానికి శతవిధాలా కృషిచేయాలి.

అశ్లీల చిత్రాలు చూడడమంటే దేవుని మీద ఏమాత్రం గౌరవం లేనట్టే. దేవుడు మనుషుల్ని తన స్వరూపంలో, తన లక్షణాలతో సృష్టించాడు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. అంతేకాదు, లైంగిక సంబంధాల విషయంలో ఆయన జ్ఞానయుక్తమైన నియమాలు పెట్టాడు. భార్యాభర్తలు మాత్రమే లైంగిక సంబంధం కలిగి ఉండాలనేది ఆయన ఉద్దేశం. (ఆది. 1:26-28; సామె. 5:18, 19) కానీ అశ్లీల చిత్రాల్ని తయారుచేసే లేదా వాటిని ప్రోత్సహించేవాళ్ల విషయమేంటి? వాళ్లు యెహోవా నైతిక ప్రమాణాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆయన్ని అగౌరవపరుస్తున్నారు. తన ప్రమాణాల్ని నిర్లక్ష్యం చేస్తూ అశ్లీల చిత్రాల్ని తయారు చేసేవాళ్లకు లేదా వాటిని ప్రోత్సహించేవాళ్లకు దేవుడు తీర్పు తీరుస్తాడు.—రోమా. 1:24-27.

మరి ఉద్దేశపూర్వకంగా అశ్లీల సాహిత్యాన్ని చదివేవాళ్ల, అశ్లీల చిత్రాల్ని చూసేవాళ్ల విషయమేంటి? అది హానికరమైన వినోదం కాదని కొంతమంది అనుకోవచ్చు. ఏదేమైనా, వాళ్లు యెహోవా ప్రమాణాల్ని నిర్లక్ష్యం చేస్తున్నవాళ్లకు మద్దతిస్తున్నారు. నిజానికి వాటిని చూడడం మొదలుపెట్టినప్పుడు, అలా మద్దతివ్వడం వాళ్ల ఉద్దేశం కాకపోవచ్చు. కానీ సత్యారాధకులు అశ్లీల చిత్రాల్ని అసహ్యించుకోవాలని బైబిలు స్పష్టంగా చెప్తోంది. అంతేకాదు, ‘యెహోవాను ప్రేమించేవాళ్లారా, చెడుతనాన్ని అసహ్యించుకోండి’ అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.—కీర్త. 97:10.

అశ్లీల చిత్రాలు చూడకూడదని అనుకునేవాళ్లకు సైతం అది కష్టంగా అనిపించవచ్చు. మనం అపరిపూర్ణులం కాబట్టి తప్పుడు కోరికలతో తీవ్రంగా పోరాడాల్సి రావచ్చు. పైగా దేవుని నియమాల్ని నిర్లక్ష్యం చేసేలా మన అపరిపూర్ణ హృదయం మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. (యిర్మీ. 17:9) కానీ క్రైస్తవులుగా మారిన ఎంతోమంది, వాటికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. కాబట్టి మీరు కూడా అశ్లీల చిత్రాలు చూడాలనే కోరిక మీద విజయం సాధించగలరు. సాతాను ఉపయోగించే ఆ ఉరిని తప్పించుకోవడానికి దేవుని వాక్యం ఎలా సహాయం చేయగలదో పరిశీలించండి.

తప్పుడు కోరికల గురించి ఆలోచిస్తూ ఉండకండి

చాలామంది ఇశ్రాయేలీయులు, తప్పుడు కోరికల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్లే పాపం చేసి ఘోరమైన పర్యవసానాల్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే జరగవచ్చు. ఆ ప్రమాదం గురించి యేసు తమ్ముడైన యాకోబు ఇలా రాశాడు, “ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, ప్రలోభపెట్టి . . . తర్వాత ఆ కోరిక వృద్ధి చెంది పాపాన్ని కంటుంది.” (యాకో. 1:14, 15) ఒక వ్యక్తి హృదయంలో తప్పుడు కోరిక వృద్ధి చెందితే ఏదోక సమయంలో అతను పాపం చేస్తాడు. కాబట్టి మనం తప్పుడు కోరికల్ని వెంటనే తీసేసుకోవాలి, వాటిగురించి ఆలోచిస్తూ ఉండకూడదు.

ఒకవేళ మీరు తప్పుడు విషయాల గురించి ఆలోచిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్య తీసుకోండి. యేసు ఇలా చెప్పాడు, “నీ చేయిగానీ కాలుగానీ నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే, దాన్ని నరికేసి నీ నుండి దూరంగా పడేయి . . . అంతేకాదు, ఒకవేళ నీ కన్ను నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే, దాన్ని పీకేసి నీ నుండి దూరంగా పడేయి.” (మత్త. 18:8, 9) యేసు, మన శరీరాన్ని నిజంగానే గాయపర్చుకోవాలని చెప్పలేదు. బదులుగా పాపం చేయడానికి కారణమయ్యే దాన్ని గుర్తించాలని, దాన్ని తీసేసుకోవడానికి వెంటనే చర్య తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పాడు. అశ్లీల చిత్రాల విషయంలో మనమెలా ఈ సలహాను పాటించవచ్చు?

ఒకవేళ అశ్లీల చిత్రాలు మీ కంటపడితే, ‘నాకేం కాదులే’ అనుకోకండి. వెంటనే చూపు తిప్పుకోండి. వెంటనే టీవీ ఆపేయండి. వెంటనే కంప్యూటర్‌ లేదా ఫోన్‌ను మూసేయండి. ధ్యాసను మంచివాటి మీదికి మళ్లించండి. అలా చేస్తే తప్పుడు కోరికలతో సతమతమయ్యే పరిస్థితి రాదు; బదులుగా మీ ఆలోచనలు మీ అధీనంలోనే ఉంటాయి.

గతంలో చూసిన అశ్లీల చిత్రాలు గుర్తొస్తే ఏం చేయాలి?

మీరు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు నుండి బయటపడినా, గతంలో చూసినవి అప్పుడప్పుడు గుర్తొస్తే ఏం చేయాలి? అశ్లీల చిత్రాలు చాలాకాలం పాటు హృదయంలో ఉండిపోవచ్చు. అవి ఎప్పుడైనా గుర్తుకురావచ్చు. అలా గుర్తొస్తే, హస్తప్రయోగం లాంటి అపవిత్ర పనులు చేయాలనే కోరిక మీలో కలగవచ్చు. కాబట్టి ఇలాంటి కోరికలు ఏ నిమిషంలోనైనా కలగవచ్చని గుర్తుంచుకోండి, వాటిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండండి.

దేవునికి నచ్చేలా ఆలోచించాలని, ప్రవర్తించాలని మరింత గట్టిగా నిర్ణయించుకోండి. అపొస్తలుడైన పౌలులా ‘శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి, దాన్ని బానిసగా చేసుకోవడానికి’ సిద్ధంగా ఉండండి. (1 కొరిం. 9:27) తప్పుడు కోరికలకు బానిస కాకండి. బదులుగా, “మీ మనసు మార్చుకొని మీ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోండి. అలా మీరు మంచిదైన, ఆమోదయోగ్యమైన, సంపూర్ణమైన దేవుని ఇష్టమేమిటో పరీక్షించి తెలుసుకుంటారు.” (రోమా. 12:2) ఒక్క విషయం గుర్తుంచుకోండి, అనైతిక పనులు చేయడం వల్ల కాదుగానీ దేవునికి నచ్చేలా ఆలోచిస్తూ ప్రవర్తిస్తేనే సంతోషాన్ని పొందుతారు.

అనైతిక పనులు చేయడం వల్ల కాదుగానీ, దేవునికి నచ్చేలా ఆలోచిస్తూ ప్రవర్తిస్తేనే సంతోషాన్ని పొందుతారు

కొన్ని లేఖనాల్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. తప్పుడు ఆలోచనలు మనసులోకి వచ్చినప్పుడల్లా, మీ ధ్యాసను ఆ లేఖనాల మీదికి మళ్లించి వాటిగురించి ఆలోచించండి. ఉదాహరణకు కీర్తన 119:37; యెషయా 52:11; మత్తయి 5:28; ఎఫెసీయులు 5:3; కొలొస్సయులు 3:5; 1 థెస్సలొనీకయులు 4:4-8 వంటివి. ఆ లేఖనాలు, అశ్లీల చిత్రాల విషయంలో యెహోవాకున్న లాంటి అభిప్రాయాన్ని కలిగివుండడానికి, మీరు ఎలా ప్రవర్తించాలని ఆయన కోరుకుంటున్నాడో అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాయి.

ఒకానొక సందర్భంలో, అనైతికమైన వాటిని చూడాలనే లేదా వాటిగురించి ఆలోచించాలనే కోరికను అణచుకోలేకపోతుంటే ఏమి చేయాలి? యేసును ఆదర్శంగా తీసుకోండి. (1 పేతు. 2:21) యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, సాతాను ఆయన్ని మళ్లీమళ్లీ శోధించాడు. అప్పుడు యేసు ఏం చేశాడు? ఆయన సాతానును ఎదిరిస్తూ వచ్చాడు. వేర్వేరు లేఖనాల్ని ఉపయోగిస్తూ అతని శోధనల్ని తిప్పికొట్టాడు. “సాతానా! వెళ్లిపో” అని యేసు అనగానే, అతను వెళ్లిపోయాడు. యేసు అపవాదిని పట్టువదలకుండా ఎదిరించినట్లే, మీరూ ఎదిరించండి. (మత్త. 4:1-11) సాతాను, అతని మనుషులు మీ మనసును అపవిత్ర ఆలోచనలతో నింపడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు మాత్రం మీ పోరాటాన్ని ఆపకండి. అశ్లీల చిత్రాలు చూసే అలవాటు నుండి మీరు బయటపడగలరు. అలా బయటపడడానికి యెహోవా మీకు సహాయం చేయగలడు.

యెహోవాకు ప్రార్థించండి, ఆయన మాట వినండి

యెహోవాకు పట్టుదలగా ప్రార్థన చేస్తూ సహాయం చేయమని వేడుకోండి. పౌలు ఇలా అన్నాడు, “మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి; అప్పుడు, మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.” (ఫిలి. 4:6, 7) మీకు దేవుడు తన శాంతిని ఇచ్చి చెడును ఎదిరించేలా సహాయం చేస్తాడు. మీరు యెహోవాకు దగ్గరైతే “ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకో. 4:8.

విశ్వసర్వాధిపతితో మీకున్న సంబంధం బలంగా ఉంటే సాతాను ఉరుల్ని తప్పించుకోగలుగుతారు. యేసు ఇలా చెప్పాడు, “లోక పరిపాలకుడు [సాతాను] వస్తున్నాడు, నా మీద అతనికి ఎలాంటి పట్టూ లేదు.” (యోహా. 14:30) యేసు ఆ మాటల్ని అంత నమ్మకంతో ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే ఒక సందర్భంలో యేసు ఇలా వివరించాడు, “నన్ను పంపించిన వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను, కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.” (యోహా. 8:29) మీరు యెహోవాకు ఇష్టమైన పనులు చేస్తే, మిమ్మల్ని కూడా ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. అశ్లీల చిత్రాలు అనే ఉరిని తప్పించుకోండి, అప్పుడు సాతాను చేతిలో మీరు ఎన్నడూ చిక్కుకోరు.