కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 29

“వెళ్లి . . . శిష్యుల్ని చేయండి”

“వెళ్లి . . . శిష్యుల్ని చేయండి”

“కాబట్టి, మీరు వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి.” —మత్త. 28:19.

పాట 60 జీవాన్నిచ్చే సందేశం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) మత్తయి 28:18-20 వచనాల్లో ఉన్న యేసు ఆజ్ఞ ప్రకారం, క్రైస్తవ సంఘం ప్రధాన బాధ్యత ఏంటి? (బి) ఈ ఆర్టికల్‌లో వేటికి జవాబులు తెలుసుకుంటాం?

అపొస్తలులు కొండ దగ్గర సమకూడినప్పుడు చాలా కుతూహలంతో ఉండివుంటారు. ఎందుకంటే అక్కడికి రమ్మని పునరుత్థానమైన యేసు వాళ్లకు చెప్పాడు. (మత్త. 28:16) ఆయన “ఒకేసారి 500 కన్నా ఎక్కువమందికి” కనిపించింది బహుశా ఆ సందర్భంలోనే అయ్యుంటుంది. (1 కొరిం. 15:6) ఇంతకీ యేసు వాళ్లను ఎందుకు సమకూడమని చెప్పాడు? ఒక ఆసక్తికరమైన నియామకం ఇవ్వడానికి ఆయన వాళ్లను పిలిచాడు. అదేంటంటే, “మీరు వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి.”—మత్తయి 28:18-20 చదవండి.

2 యేసు ఆజ్ఞ విన్న ఆ శిష్యులు కొంతకాలానికి మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘంలో భాగమయ్యారు. ఆ సంఘం ప్రధాన బాధ్యత ఎక్కువమందిని క్రీస్తు శిష్యుల్ని * చేయడం. నేడు భూవ్యాప్తంగా కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, వాటి ప్రధాన బాధ్యత కూడా అదే. ఈ ఆర్టికల్‌లో నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: శిష్యుల్ని చేసే పని ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? దానికోసం మనం చేయాల్సిన వివిధ పనులు ఏంటి? శిష్యుల్ని చేయడంలో ప్రతీ క్రైస్తవునికి వంతు ఉందా? ఈ పని చేయడానికి ఓర్పు ఎందుకు అవసరం?

శిష్యుల్ని చేసే పని ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది?

3. యోహాను 14:6; 17:3 ప్రకారం శిష్యుల్ని చేసే పని ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది?

3 శిష్యుల్ని చేసే పని ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? ఎందుకంటే క్రీస్తు శిష్యులు మాత్రమే దేవునికి స్నేహితులు అవ్వగలరు. అంతేకాదు క్రీస్తును అనుసరించేవాళ్లు ఇప్పుడు మెరుగైన జీవితాన్ని ఆనందిస్తారు, భవిష్యత్తులో శాశ్వత జీవితాన్ని పొందుతారు. (యోహాను 14:6; 17:3 చదవండి) అవును యేసు మనకు ముఖ్యమైన బాధ్యత అప్పగించాడు, అయితే ఆ పనిలో భాగం వహిస్తున్నది మనం మాత్రమే కాదు. అపొస్తలుడైన పౌలు తన గురించి, తనకు సన్నిహితులైన కొంతమంది గురించి ఇలా రాశాడు, “మేము దేవుని తోటి పనివాళ్లం.” (1 కొరిం. 3:9) అపరిపూర్ణ మనుషులకు యెహోవా, యేసు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారో కదా!

4. ఈవాన్‌, మటీల్డా దంపతుల అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

4 శిష్యుల్ని చేసే పని మనకు ఎంతో ఆనందాన్ని ఇవ్వగలదు. ఉదాహరణకు కొలంబియాలో ఉంటున్న ఈవాన్‌, ఆయన భార్య మటీల్డా అనుభవాన్ని పరిశీలించండి. వాళ్లు డేవియర్‌ అనే యువకునికి మంచివార్త ప్రకటించినప్పుడు అతను వాళ్లతో ఇలా అన్నాడు, “నా అలవాట్లను మార్చుకోవాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు.” బాక్సర్‌ అయిన డేవియర్‌ డ్రగ్స్‌కు, మద్యానికి బానిసగా ఉండేవాడు; ఎరీక అనే గర్ల్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేసేవాడు. ఈవాన్‌ ఇలా చెప్తున్నాడు, “డేవియర్‌ ఒక మారుమూల పల్లెటూర్లో ఉండేవాడు. అతన్ని కలవడానికి మేము మట్టి రోడ్ల మీద ఎన్నో గంటలపాటు సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్లేవాళ్లం. డేవియర్‌లో మంచి మార్పు రావడం గమనించాక, ఎరీక కూడా స్టడీలో కూర్చోవడం మొదలుపెట్టింది.” కొంతకాలానికి అతను డ్రగ్స్‌, మద్యం, బాక్సింగ్‌ మానేశాడు. ఎరీకను పెళ్లి కూడా చేసుకున్నాడు. మటీల్డా ఇలా చెప్పింది, “2016లో డేవియర్‌, ఎరీక బాప్తిస్మం తీసుకున్నారు. ‘నా అలవాట్లను మార్చుకోవాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు’ అని డేవియర్‌ చెప్పే మాటలు గుర్తొచ్చి ఆ సమయంలో మాకు సంతోషంతో కన్నీళ్లు ఆగలేదు.” అవును, ప్రజలను క్రీస్తు శిష్యుల్ని చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతో ఆనందాన్ని పొందుతాం.

శిష్యుల్ని చేయడానికి మనం చేయాల్సిన వివిధ పనులు ఏంటి?

5. మనం చేయాల్సిన మొదటి పని ఏంటి?

5 మనం చేయాల్సిన మొదటి పని, యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇష్టపడే ప్రజల కోసం ‘వెదకడం.’ (మత్త. 10:11) మన క్షేత్రంలోని ప్రజలందరికీ సాక్ష్యమివ్వడం ద్వారా మనం యెహోవాసాక్షులమని నిరూపించుకుంటాం. అంతేకాదు, ప్రకటించమనే క్రీస్తు ఆజ్ఞను పాటించడం ద్వారా మనం నిజ క్రైస్తవులమని నిరూపించుకుంటాం.

6. పరిచర్యలో మంచి ఫలితాలు సాధించడానికి ఏం అవసరం?

6 కొంతమందికి బైబిలు సత్యాల్ని నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ చాలామందికి మనం చెప్పే విషయాల మీద మొదట్లో ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటివాళ్లలో మనమే ఆసక్తి కలిగించాలి. కాబట్టి పరిచర్యలో మంచి ఫలితాలు సాధించాలంటే మనకు చక్కని సిద్ధపాటు ఉండాలి. దానికోసం మీ క్షేత్రంలోని ప్రజలకు నచ్చే కొన్ని అంశాలను ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత, వాటి గురించి ఎలా మాట్లాడాలో ఆలోచించి పెట్టుకోండి.

7. ఇంటివాళ్లతో ఎలా మాట్లాడవచ్చు? వాళ్లు చెప్పేది వినడం, వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించడం ఎందుకు ముఖ్యం?

7 ఉదాహరణకు, మీరు ఇంటివ్యక్తిని ఇలా అడగవచ్చు: “ఒక విషయం గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ప్రపంచంలోని ప్రజలందరూ దాదాపు ఒకేలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రపంచ సమస్యలన్నిటినీ పరిష్కరించగల ఒక ప్రభుత్వం రావాలని మీరు అనుకుంటున్నారా?” ఆ తర్వాత వాళ్లతో దానియేలు 2:44 ను చర్చించవచ్చు. కొంతమందితో ఇలా కూడా మాట్లాడవచ్చు: “పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడానికి ఒక చక్కని పద్ధతి ఏంటని మీరు అనుకుంటున్నారు?” ఆ తర్వాత ద్వితీయోపదేశకాండము 6:6, 7 వచనాల్ని చర్చించండి. మీరు ఏదైనా అంశాన్ని ఎంచుకునే ముందు మీ క్షేత్రంలోని ప్రజల్ని మనసులో ఉంచుకోండి. ఆ అంశం గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడం వల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనం పొందుతారో ఆలోచించండి. అయితే ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు చెప్పేది వినడం, వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించడం ప్రాముఖ్యం. అప్పుడే మీరు వాళ్ల మనసులో ఏముందో అర్థం చేసుకోగలుగుతారు, వాళ్లు కూడా మీరు చెప్పేది వినడానికి ఇష్టపడతారు.

8. ఆసక్తిపరులను ఎందుకు మళ్లీమళ్లీ కలవాల్సి రావచ్చు?

8 ఎవరైనా బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకోవాలంటే మనం ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించి వాళ్లను మళ్లీమళ్లీ కలవాల్సి రావచ్చు. ఎందుకు? ఎందుకంటే మనం రిటన్‌ విజిట్‌కు వెళ్లినప్పుడు వాళ్లు ఉండకపోవచ్చు. అంతేకాదు వాళ్లకు మీతో పరిచయం ఏర్పడి, స్టడీ తీసుకోవడానికి ముందుకు రావాలంటే మీరు వాళ్లను తరచూ కలవాల్సి రావచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ మొక్క అయినా వృద్ధి చెందాలంటే దానికి రోజూ నీళ్లు పోయాలి. అదేవిధంగా ఆసక్తిపరులకు యెహోవా మీద, యేసుక్రీస్తు మీద ప్రేమ పెరగాలంటే వాళ్లతో క్రమంగా దేవుని వాక్యాన్ని చర్చించాలి.

శిష్యుల్ని చేయడంలో ప్రతీ క్రైస్తవునికి వంతు ఉందా?

ఆసక్తిపరులను వెదికే పనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాక్షులు భాగం వహిస్తున్నారు (9-10 పేరాలు చూడండి) *

9-10. శిష్యుల్ని చేయడంలో ప్రతీ క్రైస్తవునికి వంతు ఉందని ఎందుకు చెప్పవచ్చు?

9 యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇష్టపడేవాళ్లను వెదకడంలో ప్రతీ క్రైస్తవునికి వంతు ఉంది. ఈ పనిని, తప్పిపోయిన పిల్లవాడిని వెదకడంతో పోల్చవచ్చు. ఈ నిజ జీవిత అనుభవాన్ని గమనించండి: మూడేళ్ల బాబు తప్పిపోయినప్పుడు, దాదాపు 500 మంది ఆ బాబు కోసం వెదకడం మొదలుపెట్టారు. సుమారు 20 గంటల తర్వాత వాళ్లలో ఒక వ్యక్తికి మొక్కజొన్న తోటలో ఆ పిల్లవాడు కనిపించాడు. అయితే పిల్లవాడిని వెదికి కనిపెట్టిన ఘనత తనకు మాత్రమే సొంతం కాదని చెప్తూ అతనిలా అన్నాడు, “ఆ బాబును వెదకడానికి వందల మంది సహాయం చేశారు.”

10 నిజమే నేడు చాలామంది, తప్పిపోయిన ఆ పిల్లవాడి లాంటి స్థితిలో ఉన్నారు. ఏ నిరీక్షణా లేని ఆ ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. (ఎఫె. 2:12) వాళ్లను కనుగొనడానికి 80 లక్షల కన్నా ఎక్కువమందిమి వెదుకుతున్నాం. అయితే బైబిలు సత్యాల్ని నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు మీకు దొరకకపోయినా, అదే క్షేత్రంలో ప్రకటిస్తున్న ఇంకెవరికైనా దొరకవచ్చు. కాబట్టి వాళ్లు స్టడీ ఇచ్చిన వ్యక్తి కొంతకాలానికి క్రీస్తు శిష్యునిగా మారితే, అలాంటివాళ్లను కనుగొనడానికి ప్రయత్నించిన ప్రతీఒక్కరు సంతోషించవచ్చు.

11. మీకు ఒక్క స్టడీ కూడా లేనట్లయితే, శిష్యుల్ని చేసే పనిలో ఏయే విధాలుగా సహాయపడవచ్చు?

11 ప్రస్తుతం మీకు ఒక్క స్టడీ కూడా లేనట్లయితే, శిష్యుల్ని చేసే పనిలో వేరే విధాలుగా సహాయపడవచ్చు. ఉదాహరణకు, రాజ్యమందిరానికి వచ్చే కొత్తవాళ్లను ఆప్యాయంగా ఆహ్వానించి వాళ్లకు సహాయం చేయవచ్చు. అలా మీరు ప్రేమ చూపించినప్పుడు, మనం నిజక్రైస్తవులమని వాళ్లు గుర్తించగలుగుతారు. (యోహా. 13:34, 35) మీరు మీటింగ్స్‌లో జవాబుల్ని క్లుప్తంగా, సొంతమాటల్లో, ఇతరుల్ని నొప్పించకుండా చెప్పవచ్చు. అప్పుడు జవాబులు ఎలా చెప్పాలో కొత్తవాళ్లు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అంతేకాదు మీరు కొత్తగా ప్రచారకులైన వాళ్లతో కలిసి పరిచర్య చేయవచ్చు, లేఖనాలు ఉపయోగించి ఇతరులకు ఎలా బోధించాలో చూపించవచ్చు. అలా చేస్తే, క్రీస్తును ఎలా అనుకరించాలో వాళ్లు నేర్చుకుంటారు.—లూకా 10:25-28.

12. ఇతరులను క్రీస్తు శిష్యుల్ని చేయాలంటే ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండాలా? వివరించండి.

12 మనకు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటేనే ఇతరులను క్రీస్తు శిష్యుల్ని చేయగలమని అనుకోకూడదు. ఎందుకు? ఉదాహరణకు, బొలీవియాలో ఉండే ఫాస్టీనా అనుభవం పరిశీలించండి. యెహోవాసాక్షుల్ని కలిసే సమయానికి ఆమెకు చదువు రాదు. ఆ తర్వాత కాస్త చదవడం నేర్చుకుంది. ఇప్పుడు ఆమె బాప్తిస్మం తీసుకుని, ఇతరులకు ఇష్టంగా బోధిస్తోంది. ఆమె ప్రతీవారం ఐదు స్టడీలు చేస్తోంది. ఫాస్టీనా తన బైబిలు విద్యార్థులంత బాగా చదవలేకపోయినా, ఆరుగురు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేసింది.—లూకా 10:21.

13. బిజీగా ఉన్నా, శిష్యుల్ని చేసే పనిలో భాగం వహించడం వల్ల వచ్చే కొన్ని ఆశీర్వాదాలు ఏంటి?

13 చాలామంది క్రైస్తవులు తమకున్న ముఖ్యమైన బాధ్యతల వల్ల ఎంతో బిజీగా ఉంటారు. అయినాసరే వాళ్లు స్టడీలు చేయడానికి సమయం కేటాయిస్తున్నారు, ఎంతో సంతోషం పొందుతున్నారు. ఉదాహరణకు అలాస్కాలో ఉండే మెలానీ అనే ఒంటరి తల్లి అనుభవాన్ని పరిశీలించండి. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఆమె రోజంతా ఉద్యోగంలో కష్టపడేది, ఇంటికొచ్చాక క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి బాగోగులు చూసుకునేది. మెలానీ ఉండే మారుమూల పల్లెటూర్లో ఆమె ఒక్కతే యెహోవాసాక్షి. అయితే ఆమెకు బైబిలు స్టడీలు చేయాలనే కోరిక ఉండేది. కాబట్టి చలిని తట్టుకుని పరిచర్యకు వెళ్లడానికి బలాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించేది. ఒకరోజు మెలానీ శారా అనే స్త్రీతో, దేవునికి ఒక పేరు ఉందని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. కొన్నిరోజులకు శారా బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకుంది. మెలానీ ఇలా చెప్పింది, “శుక్రవారాలు సాయంత్రం ఇంటికొచ్చేసరికి చాలా అలసిపోయి ఉండేదాన్ని. అయినాసరే నేనూ, నా కూతురు కలిసి శారా స్టడీకి వెళ్లడం వల్ల ఇద్దరం ప్రయోజనం పొందాం. ఆమె అడిగే ప్రశ్నల గురించి పరిశోధన చేయడం మాకు నచ్చేది, ఆమె యెహోవాకు స్నేహితురాలు అవ్వడం చూసి చాలా సంతోషించాం.” శారా వ్యతిరేకతను ధైర్యంగా ఎదిరించింది, తన చర్చీని వదిలిపెట్టింది, చివరికి బాప్తిస్మం తీసుకుంది.

శిష్యుల్ని చేయడానికి ఓర్పు ఎందుకు అవసరం?

14. (ఎ) శిష్యుల్ని చేసే పని చేపలు పట్టడం లాంటిదని ఎందుకు చెప్పవచ్చు? (బి) 2 తిమోతి 4:1, 2 లో ఉన్న పౌలు మాటల్ని బట్టి మీరేమి చేయాలనుకుంటున్నారు?

14 మీకు ఇప్పటిదాకా బైబిలు పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు దొరకకపోయినా వాళ్లకోసం వెదుకుతూనే ఉండండి. శిష్యుల్ని చేసే పని చేపలు పట్టడం లాంటిదని యేసు చెప్పాడు. జాలర్లు చేపలు పట్టడానికి ఎన్నో గంటలు కష్టపడాల్సి రావచ్చు. వాళ్లు ఎక్కువగా అర్ధరాత్రిళ్లు లేదా తెల్లవార్లు పనిచేస్తారు; కొన్నిసార్లు పడవలో చాలా దూరం ప్రయాణిస్తారు. (లూకా 5:5) అదేవిధంగా, కొంతమంది ప్రచారకులు వేర్వేరు సమయాల్లో, ప్రదేశాల్లో ఎన్నో గంటలపాటు ఓపిగ్గా ప్రకటిస్తారు. ఎందుకు? ఎక్కువమందిని కలవడం కోసం అలా చేస్తారు. అలాంటివాళ్లకు, మన సందేశం పట్ల ఆసక్తి ఉన్న ప్రజలు తారసపడుతుంటారు. మీరు ఎక్కువమందిని కలిసే అవకాశం ఉన్న సమయంలో లేదా ప్రదేశంలో ప్రకటించడానికి ప్రయత్నించగలరా?—2 తిమోతి 4:1, 2 చదవండి.

మీ విద్యార్థులు యెహోవాను తెలుసుకునేలా, ఆయన్ని ప్రేమించేలా, ఆయనకు లోబడేలా ఓపిగ్గా సహాయం చేయండి (15-16 పేరాలు చూడండి) *

15. స్టడీలు చేయడానికి ఓర్పు ఎందుకు అవసరం?

15 బైబిలు స్టడీలు చేయడానికి ఓర్పు ఎందుకు అవసరం? ఎందుకంటే, విద్యార్థులు బైబిల్లోని విషయాల్ని తెలుసుకునేలా, వాటిని ప్రేమించేలా మనం సహాయం చేస్తే సరిపోదు. వాళ్లు బైబిల్ని రాయించిన యెహోవాను తెలుసుకుని, ఆయన్ని ప్రేమించేలా కూడా మనం సహాయం చేయాలి. అంతేకాదు, యేసు తన శిష్యులకు ఏం బోధించాడో బైబిలు విద్యార్థులకు చెప్పడంతో పాటు, వాటిని ఎలా పాటించాలో కూడా నేర్పించాలి. వాళ్లు బైబిలు సూత్రాల్ని పాటించడానికి ప్రయత్నిస్తుండగా మనం ఓపిగ్గా సహాయం చేయాలి. ఎందుకంటే కొంతమంది తమ ఆలోచనా విధానాన్ని, అలవాట్లను కొన్ని నెలల్లోనే మార్చుకుంటారు, కానీ ఇంకొంతమంది ఎక్కువ సమయం తీసుకుంటారు.

16. రావూల్‌ ఉదాహరణ నుండి మీరేమి నేర్చుకున్నారు?

16 పెరూలో ఒక మిషనరీకి ఎదురైన అనుభవం, ఓపిగ్గా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో వివరిస్తుంది. ఆ మిషనరీ ఇలా చెప్తున్నాడు, “నేను రావూల్‌ అనే వ్యక్తితో రెండు పుస్తకాలు స్టడీ చేశాను. అయినప్పటికీ అతను చేసుకోవాల్సిన మార్పులు చాలానే ఉన్నాయి. అతని వివాహ జీవితంలో సమస్యలు ఉండేవి, బూతులు మాట్లాడేవాడు, అతని చెడ్డ ప్రవర్తన చూసి సొంత పిల్లలే అతన్ని గౌరవించేవాళ్లు కాదు. కానీ అతను క్రమంగా మీటింగ్స్‌కి వచ్చేవాడు. కాబట్టి అతనికి, అతని కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి వాళ్ల ఇంటికి వెళ్లేవాణ్ణి. అతను బాప్తిస్మం తీసుకోవడానికి మూడు కన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టింది.”

17. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

17 యేసు మనల్ని, “వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి” అని చెప్పాడు. మనం ఆ బాధ్యతను నెరవేర్చడంలో భాగంగా, వేర్వేరు నమ్మకాలున్న ప్రజలతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్లలో ఏ మత సంస్థకు చెందనివాళ్లూ ఉంటారు, దేవుడు లేడని నమ్మేవాళ్లూ ఉంటారు. అలాంటివాళ్లకు మంచివార్త ఎలా ప్రకటించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 68 రాజ్య విత్తనాలు చల్లుదాం

^ పేరా 5 ప్రజలను క్రీస్తు శిష్యుల్ని చేయడమే క్రైస్తవ సంఘానికున్న ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడానికి సహాయం చేసే సలహాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 2 పదాల వివరణ: క్రీస్తు శిష్యులు యేసు బోధల్ని కేవలం నేర్చుకోవడమే కాదు, వాటి ప్రకారం జీవిస్తారు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి శాయశక్తులా కృషిచేస్తారు.—1 పేతు. 2:21.

^ పేరా 52 చిత్రాల వివరణ: ఒక వ్యక్తి సరదాగా గడపడానికి వేరే ప్రాంతానికి వెళ్తూ విమానాశ్రయంలో సాక్షుల దగ్గర ఒక ప్రచురణ తీసుకుంటున్నాడు. తర్వాత, అతను వెళ్లిన ప్రాంతంలో కూడా వేరే ప్రచారకులు బహిరంగ సాక్ష్యంలో పాల్గొనడం అతను చూస్తున్నాడు. అతను తిరిగొచ్చాక ప్రచారకులు అతని ఇంటికి కూడా వెళ్లి ప్రకటిస్తున్నారు.

^ పేరా 54 చిత్రాల వివరణ: అదే వ్యక్తి బైబిలు స్టడీ తీసుకుని, కొంతకాలానికి బాప్తిస్మం తీసుకుంటున్నాడు.