కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 27

హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడండి

హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడండి

“క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.”—2 తిమో. 3:12.

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

ఈ ఆర్టికల్‌లో. . . *

1. మనం ఎందుకు హింసల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి?

తనకు శిష్యులుగా ఉండే ప్రతీఒక్కరిని లోకం ద్వేషిస్తుందని మన ప్రభువైన యేసు తన భూజీవితపు చివరి రాత్రి చెప్పాడు. (యోహా. 17:14) అప్పటినుండి ఇప్పటివరకు, నమ్మకమైన క్రైస్తవులు సత్యారాధనను వ్యతిరేకించేవాళ్ల చేతుల్లో హింసలు ఎదుర్కొంటూనే ఉన్నారు. (2 తిమో. 3:12) ఈ వ్యవస్థ ముగింపు దగ్గరయ్యే కొద్దీ, శత్రువులు మనల్ని ఇంకా ఎక్కువ హింసిస్తారని మనకు తెలుసు.—మత్త. 24:9.

2-3. (ఎ) భయపడితే ఏం జరుగుతుంది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 మనం హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు? మనకు ఎలాంటి హింసలు రావచ్చో ముందే ఊహించాల్సిన అవసరంలేదు. ఒకవేళ అలా ఊహించుకుంటే భయపడిపోతాం, అవి రాకముందే యెహోవాను ఆరాధించడం మానేస్తాం. (సామె. 12:25; 17:22) భయం అనేది మన శత్రువైన అపవాది ఉపయోగించే శక్తివంతమైన ఆయుధం. (1 పేతు. 5:8, 9) మరి రాబోయే హింసల్ని సహించేలా ఇప్పుడే మనమేమి చేయవచ్చు?

3 ఈ ఆర్టికల్‌లో, యెహోవాతో మనకున్న సంబంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చో, ఇప్పుడే బలపర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో పరిశీలిస్తాం. అంతేకాదు ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుంటాం. చివరిగా, వ్యతిరేకులు మనల్ని ద్వేషించినప్పుడు ఏం చేయాలో నేర్చుకుంటాం.

యెహోవాతో ఉన్న సంబంధాన్ని మీరెలా బలపర్చుకోవచ్చు?

4. హెబ్రీయులు 13:5, 6 వచనాల ప్రకారం మనం ఏ నమ్మకంతో ఉండాలి? ఎందుకు?

4 యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఎన్నడూ విడిచిపెట్టడని నమ్మండి. (హెబ్రీయులు 13:5, 6 చదవండి.) చాలా ఏళ్ల క్రితం ఒక కావలికోట ఇలా చెప్పింది, “దేవుని గురించి బాగా తెలిసిన వ్యక్తి, హింసలు వచ్చినప్పుడు ఆయనపై ఎక్కువ నమ్మకం ఉంచుతాడు.” ఆ మాటలు ఎంత నిజమో కదా! కాబట్టి మనం యెహోవాను ప్రేమిస్తూ, ఆయనపై పూర్తి నమ్మకం ఉంచాలి. ఆయనకు మనపై ఉన్న ప్రేమను ఎన్నడూ సందేహించకూడదు. అప్పుడే మనం హింసల్ని సహించగలుగుతాం.—మత్త. 22:36-38; యాకో. 5:11.

5. యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థంచేసుకోవడానికి ఏం చేయవచ్చు?

5 యెహోవాకు దగ్గరవ్వాలనే లక్ష్యంతో బైబిల్ని రోజూ చదవండి. (యాకో. 4:8) మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు యెహోవాకున్న లక్షణాలపై మనసుపెట్టండి. ఆయనకు మీ మీద ఎంత ప్రేమ, కరుణ, దయ ఉన్నాయో అర్థంచేసుకోవడానికి ఆయన మాటల్ని, పనుల్ని ధ్యానించండి. (నిర్గ. 34:6) కొంతమందికి దేవుడు తమను ప్రేమిస్తున్నాడని నమ్మడం కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే వాళ్లు ఇతరుల ప్రేమను ఎప్పుడూ రుచిచూసి ఉండకపోవచ్చు. ఒకవేళ మీ సమస్య కూడా అదే అయితే, యెహోవా మీ మీద కరుణ, దయ ఏయే విధాలుగా చూపిస్తున్నాడో ఒక లిస్టు రాసుకోండి, అలా ప్రతీరోజు చేయండి. (కీర్త. 78:38, 39; రోమా. 8:32) మీ సొంత అనుభవాల గురించి ఆలోచించినప్పుడు, అలాగే బైబిల్లో చదివేవాటిని ధ్యానించినప్పుడు యెహోవా మీకోసం చేసినవాటిని ఆ లిస్టులో రాసుకోగలుగుతారు. మీకు యెహోవా పనుల పట్ల ఎంత కృతజ్ఞత పెరిగితే, ఆయనతో మీ సంబంధం అంత బలపడుతుంది.—కీర్త. 116:1, 2.

6. కీర్తన 94:17-19 వచనాల ప్రకారం, మనసువిప్పి ప్రార్థించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది?

6 క్రమంగా ప్రార్థించండి. ఒక తండ్రి తన పిల్లవాణ్ణి ప్రేమగా దగ్గర తీసుకున్నట్లు ఊహించుకోండి. ఆ పిల్లవాడు ఎంత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాడంటే, ఆరోజు తనకు జరిగిన మంచిచెడులను మనసువిప్పి తన తండ్రికి చెప్తాడు. మీకు కూడా యెహోవాతో అలాంటి సన్నిహిత సంబంధం ఉండాలంటే, క్రమంగా ప్రార్థిస్తూ ఆయనకు దగ్గరవ్వాలి. (కీర్తన 94:17-19 చదవండి) అలా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముందు మీ హృదయాన్ని ‘నీళ్లలా కుమ్మరించండి.’ మీ ప్రేమగల తండ్రికి మీ భయాల్ని, ఆందోళనల్ని చెప్పుకోండి. (విలా. 2:19) అప్పుడు మీరు ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతిని’ పొందుతారు. (ఫిలి. 4:6, 7) మీరు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే, యెహోవాకు అంత దగ్గరౌతున్నట్లు భావిస్తారు.—రోమా. 8:38, 39.

యెహోవా మీద, ఆయన రాజ్యం మీద బలమైన విశ్వాసం ఉంటే ధైర్యంగా ఉంటాం

స్టాన్లీ జోన్స్‌ దేవుని రాజ్యం వాస్తవమైనదని నమ్మడం ద్వారా విశ్వాసాన్ని బలంగా ఉంచుకోగలిగాడు (7వ పేరా చూడండి)

7. దేవుని రాజ్యానికి సంబంధించిన వాగ్దానాలు నిజమౌతాయని మీరు ఎందుకు నమ్మాలి?

7 దేవుని రాజ్యాశీర్వాదాలు నిజమౌతాయని నమ్మండి. (సంఖ్య. 23:19) ఒకవేళ ఆ వాగ్దానాల మీద మీకు పూర్తి నమ్మకం లేకపోతే మిమ్మల్ని భయపెట్టడం సాతానుకు, అతని గుప్పిట్లో ఉన్నవాళ్లకు తేలికౌతుంది. (సామె. 24:10; హెబ్రీ. 2:15) మరి దేవుని రాజ్యంపై మీకున్న నమ్మకాన్ని ఇప్పుడే ఎలా బలపర్చుకోవచ్చు? దేవుని రాజ్యానికి సంబంధించిన వాగ్దానాల్ని లోతుగా పరిశోధన చేయాలనే ప్రాజెక్టు పెట్టుకోండి. అవి నిజమౌతాయని ఎందుకు నమ్మవచ్చో పరిశీలించండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? తన మతనమ్మకాల కారణంగా ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన స్టాన్లీ జోన్స్‌ అనే సహోదరుని అనుభవాన్ని పరిశీలిస్తే అది అర్థమౌతుంది. ఆయన ఆ హింసను నమ్మకంగా ఎలా సహించగలిగాడో వివరిస్తూ ఇలా చెప్పాడు, “దేవుని రాజ్యం గురించి, అది తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి నాకు తెలుసు కాబట్టి నా విశ్వాసం బలంగా ఉంది. అవి నిజం కావనే సందేహం ఒక్కసారి కూడా రాలేదు. అందుకే ఎవ్వరూ నన్ను యెహోవాకు దూరం చేయలేకపోయారు.” అవును, మీరు దేవుని వాగ్దానాలు నిజమౌతాయని బలంగా నమ్మితే యెహోవాకు మరింత దగ్గరౌతారు, భయానికి ఎన్నడూ లొంగిపోరు.—సామె. 3:25, 26.

8. రాబోయే హింసల్ని సహిస్తామో లేదో దేన్నిబట్టి తెలుస్తుంది? వివరించండి.

8 మీటింగ్స్‌కు మానకుండా హాజరవ్వండి. మీటింగ్స్‌ మనల్ని యెహోవాకు దగ్గర చేస్తాయి. మీటింగ్స్‌ని ఎంత విలువైనవిగా చూస్తున్నామనే దాన్నిబట్టే, మనం రాబోయే హింసల్ని సహిస్తామో లేదో తెలుస్తుంది. (హెబ్రీ. 10:24, 25) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఇప్పుడు చిన్నచిన్న కారణాలకే మీటింగ్స్‌ మానేస్తే, రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు తోటి సహోదరసహోదరీలతో ఎలా సమకూడతాం? కానీ పరిస్థితులు ఎలాగున్నా మీటింగ్స్‌ మానకూడదని బలంగా నిర్ణయించుకుంటే, వ్యతిరేకులు తీసుకొచ్చే ఆటంకాల్ని ఎదిరించి తోటి సహోదరసహోదరీలతో సమకూడతాం. మీటింగ్స్‌ పట్ల ప్రేమ పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. అలా చేస్తే వ్యతిరేకత వచ్చినా, ప్రభుత్వం నిషేధం విధించినా దేవునికే లోబడతాం గానీ మనుషులకు కాదు.—అపొ. 5:29.

ఇప్పుడే లేఖనాల్ని, రాజ్య గీతాలను కంఠస్థం చేస్తే, హింసలు వచ్చినప్పుడు అవి మిమ్మల్ని బలపరుస్తాయి (9వ పేరా చూడండి) *

9. లేఖనాల్ని కంఠస్థం చేయడం ద్వారా హింసల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడవచ్చని ఎందుకు చెప్పవచ్చు?

9 మీకిష్టమైన లేఖనాల్ని కంఠస్థం చేయండి. (మత్త. 13:52) మీకు పరిపూర్ణమైన జ్ఞాపకశక్తి లేకపోవచ్చు. కానీ యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి మీరు లేఖనాల్ని గుర్తుతెచ్చుకునేలా సహాయం చేయగలడు. (యోహా. 14:26) తూర్పు జర్మనీలోని ఒక సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన్ని జైలు గదిలో ఒంటరిగా నిర్బంధించినప్పుడు ఏం చేశాడో వివరిస్తూ ఇలా అన్నాడు, “అప్పటికే నేను కొన్ని వందల లేఖనాల్ని కంఠస్థం చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఒంటరిగా ఉన్నప్పటికీ, వేర్వేరు బైబిలు అంశాల గురించి ధ్యానిస్తూ మనసును బిజీగా ఉంచుకున్నాను.” ఆయన ఆ లేఖనాల్ని ధ్యానించడం వల్లే యెహోవాకు దగ్గరవ్వగలిగాడు, హింసల్ని సహించి నమ్మకంగా ఉండగలిగాడు.

(10వ పేరా చూడండి) *

10. రాజ్య గీతాలను ఎందుకు కంఠస్థం చేయాలి?

10 రాజ్య గీతాలను, వెబ్‌సైట్‌లో ఉన్న పాటల్ని కంఠస్థం చేసి పాడండి. ఫిలిప్పీలో పౌలును, సీలను బంధించినప్పుడు వాళ్లు తమకు గుర్తున్న స్తుతిగీతాలు పాడారు. (అపొ. 16:25) ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో ఉన్న మన సహోదరుల్ని సైబీరియా దేశానికి బందీలుగా పంపించినప్పుడు వాళ్లెలా బలం పొందారు? మారీయా ఫెడూన్‌ అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంది, “మాకు గుర్తున్న రాజ్య గీతాలన్నిటినీ మేము పాడాం.” ఆ పాటల వల్ల అందరూ బలం పొందారని, యెహోవాకు దగ్గరగా ఉన్నట్లు భావించారని ఆమె చెప్పింది. మీకిష్టమైన రాజ్య గీతాలను, మన వెబ్‌సైట్‌లో ఉన్న పాటల్ని పాడినప్పుడు ప్రోత్సాహంగా అనిపిస్తుందా? అయితే వాటిని ఇప్పుడే కంఠస్థం చేయండి!—“ యెహోవాయే నా ధైర్యం” అనే బాక్సు చూడండి.

ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు?

11-12. (ఎ) 1 సమూయేలు 17:37, 45-47 వచనాల ప్రకారం దావీదు ఎందుకు ధైర్యంగా ఉండగలిగాడు? (బి) దావీదు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

11 హింసను సహించడానికి ధైర్యం అవసరం. ఒకవేళ మీలో ఆ లక్షణం లోపించిందని అనిపిస్తే ఏం చేయవచ్చు? నిజమైన ధైర్యం మన ఎత్తు, బలం లేదా సామర్థ్యం మీద ఆధారపడి ఉండదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, గొల్యాతుతో తలపడిన బాలుడైన దావీదునే తీసుకోండి. భారీకాయుడైన గొల్యాతుతో పోలిస్తే దావీదు చాలా చిన్నవాడు, బలహీనుడు. పైగా ఆయన దగ్గర సరైన ఆయుధాలు, కనీసం కత్తి కూడా లేదు; కానీ కొండంత ధైర్యం ఉంది. ఆ ధైర్యంతోనే గర్విష్ఠి అయిన గొల్యాతుతో పోరాడడానికి దావీదు ముందుకెళ్లాడు.

12 దావీదుకు అంత ధైర్యం ఎలా వచ్చింది? తనకు యెహోవా తోడుగా ఉన్నాడని ఆయన పూర్తిగా నమ్మాడు. (1 సమూయేలు 17:37, 45-47 చదవండి.) గొల్యాతు తనకన్నా ఎంతో భారీకాయుడని దావీదు ఆలోచించలేదు. బదులుగా యెహోవా ముందు గొల్యాతు ఎంతో అల్పుడనే విషయం మీద మనసు నిలిపాడు. ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? యెహోవా మనకు తోడుగా ఉన్నాడని, సర్వశక్తిమంతుడైన దేవుని ముందు మన వ్యతిరేకులు ఎందుకూ పనికిరారని నమ్మితే ధైర్యంగా ఉంటాం. (2 దిన. 20:15; కీర్త. 16:8) అలాంటి ధైర్యాన్ని ఇప్పుడే, అంటే హింసలు రాకముందే ఎలా పెంచుకోవచ్చు?

13. మనం ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు? వివరించండి.

13 మనం ఇతరులకు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడం ద్వారా ఇప్పుడే ధైర్యాన్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే ప్రకటనా పని చేసినప్పుడు యెహోవాపై నమ్మకం ఉంచడం, మనుషుల భయాన్ని అధిగమించడం నేర్చుకుంటాం. (సామె. 29:25) వ్యాయామం చేసినప్పుడు మన కండరాలు ఎలాగైతే బలపడతాయో; అలాగే ఇంటింటి పరిచర్యలో, బహిరంగ సాక్ష్యంలో, అనియత సాక్ష్యంలో, వ్యాపార స్థలాల్లో సాక్ష్యం ఇవ్వడంలో పాల్గొన్నప్పుడు మనలో ధైర్యం పెరుగుతుంది. ఇప్పుడు ధైర్యంగా ప్రకటిస్తేనే, ప్రభుత్వ నిషేధం ఉన్నప్పుడు కూడా ప్రకటించగలుగుతాం.—1 థెస్స. 2:1, 2.

నాన్సీ యూయన్‌ ప్రకటనా పనిని ఆపడానికి ఒప్పుకోలేదు (14వ పేరా చూడండి)

14-15. నాన్సీ యూయన్‌, వ్యాలెంటీనా గోర్నోఫ్‌స్కయా నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

14 ధైర్యం చూపించడంలో ఆదర్శం ఉంచిన ఇద్దరు నమ్మకమైన సహోదరీల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. నాన్సీ యూయన్‌ సుమారు ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది, కానీ మనుషుల బెదిరింపులకు అస్సలు భయపడలేదు. * ప్రకటనా పనిని ఆపడానికి ఆమె ఒప్పుకోలేదు. అందుకే చైనాలో 20 కన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. ఆమె తమ దేశంలోని “అత్యంత మొండి స్త్రీ” అని ఆమెను విచారించిన అధికారులు చెప్పారు.

వ్యాలెంటీనా గోర్నోఫ్‌స్కయా తనకు యెహోవా తోడుగా ఉన్నాడని నమ్మింది (15వ పేరా చూడండి)

15 అదేవిధంగా, ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో ఉన్న వ్యాలెంటీనా గోర్నోఫ్‌స్కయా మూడు వేర్వేరు సందర్భాలకుగానూ 21 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. * ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లో ప్రకటనా పని ఆపకూడదని నిర్ణయించుకున్నందుకు, అధికారులు ఆమెను “అత్యంత ప్రమాదకరమైన నేరస్తురాలు” అని నిందించారు. ఆ ఇద్దరు నమ్మకమైన సహోదరీలు ఎలా అంత ధైర్యంగా ఉండగలిగారు? తమకు యెహోవా తోడుగా ఉన్నాడని వాళ్లు నమ్మారు.

16. నిజమైన ధైర్యానికి మూలం ఏంటి?

16 మనం చర్చించుకున్నట్లు, ధైర్యాన్ని పెంచుకోవాలంటే మన సొంత శక్తిసామర్థ్యాల మీద మనసు నిలపకూడదు. బదులుగా యెహోవా మనకు తోడుగా ఉన్నాడనీ, ఆయనే మన తరఫున పోరాడుతున్నాడనీ నమ్మాలి. (ద్వితీ. 1:29, 30; జెక. 4:6) ఆ నమ్మకమే నిజమైన ధైర్యానికి మూలం.

ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తే ఏం చేయాలి?

17-18. యోహాను 15:18-21 వచనాల ప్రకారం యేసు మనల్ని ఏమని హెచ్చరించాడు? వివరించండి.

17 సాధారణంగా మనల్ని ప్రజలు గౌరవించాలని కోరుకుంటాం. ఒకవేళ వాళ్లు గౌరవించకపోతే, మనం పనికిరాని వాళ్లమని భావించకూడదు. యేసు ఇలా చెప్పాడు, “మానవ కుమారుణ్ణి బట్టి మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీరు చెడ్డవాళ్లని అంటూ మీ పేరు పాడు చేసినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.” (లూకా 6:22) యేసు మాటలకు అర్థమేంటి?

18 ప్రజల చేత ద్వేషించబడడం క్రైస్తవులకు ఇష్టమని యేసు చెప్పడం లేదు. బదులుగా మనకు ఏం జరగవచ్చో ఆయన హెచ్చరిస్తున్నాడు. మనం ఈ లోకానికి చెందినవాళ్లం కాదు. మనం యేసు బోధల ప్రకారం జీవిస్తూ, ఆయన ప్రకటించిన సందేశాన్నే ఇతరులకు ప్రకటిస్తాం. అందుకే ప్రజలు మనల్ని ద్వేషిస్తారు. (యోహాను 15:18-21 చదవండి.) మనం యెహోవాను సంతోషపెట్టాలనుకుంటాం. కాబట్టి, ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ప్రజలు మనల్ని ద్వేషించినా నిరుత్సాహపడం.

19. అపొస్తలుల్ని అనుకరిస్తూ మనం ఏం చేయవచ్చు?

19 అల్పులైన మనుషుల మాటల్ని బట్టి, పనుల్ని బట్టి మీరు యెహోవాసాక్షిగా ఉండడం అవమానంగా భావించకండి. (మీకా 4:5) యేసు చనిపోయాక యెరూషలేములోని అపొస్తలులు ఏం చేశారో పరిశీలించడం ద్వారా మనం మనుషుల భయాన్ని అధిగమించవచ్చు. తమ మీద యూదా మతనాయకులకు ఎంత ద్వేషం ఉందో అపొస్తలులకు తెలుసు. (అపొ. 5:17, 18, 27, 28) అయినాసరే వాళ్లు ఆలయానికి క్రమంగా వెళ్లారు, తాము యేసు శిష్యులమని ప్రకటనా పని ద్వారా చాటి చెప్పారు. (అపొ. 5:42) అంతేగానీ భయపడి వాళ్ల పనిని ఆపేయలేదు. అదేవిధంగా మనం యెహోవాసాక్షులమని తోటి ఉద్యోగస్థులకు, తోటి విద్యార్థులకు, పొరుగువాళ్లకు తెలియజేయడం ద్వారా మనుషుల భయాన్ని అధిగమించవచ్చు.—అపొ. 4:29; రోమా. 1:16.

20. ప్రజలు ద్వేషించినా అపొస్తలులు ఎందుకు సంతోషంగా ఉండగలిగారు?

20 అపొస్తలులు ఎందుకు సంతోషంగా ఉండగలిగారు? ప్రజలు ఏ కారణంతో తమను ద్వేషిస్తున్నారో అపొస్తలులకు తెలుసు. అంతేకాదు, యెహోవా ఇష్టం చేస్తున్నందుకు అవమానాలపాలు అవ్వడం గొప్ప గౌరవమని వాళ్లు భావించారు. (లూకా 6:23; అపొ. 5:41) కొంతకాలం తర్వాత అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, “ఒకవేళ మీరు నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడాల్సి వచ్చినా, మీరు సంతోషంగా ఉంటారు.” (1 పేతు. 2:19-21; 3:14) కాబట్టి మనం సరైనది చేస్తున్నందుకు ద్వేషించబడుతున్నామని అర్థంచేసుకున్నప్పుడు, ప్రజలు ద్వేషించినా యెహోవా సేవను ధైర్యంగా కొనసాగిస్తాం.

సిద్ధపడడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు

21-22. (ఎ) హింసల్ని ఎదుర్కోవడానికి మీరెలా సిద్ధపడాలని నిర్ణయించుకున్నారు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

21 మనకు హింసలు ఎప్పుడు వస్తాయో లేదా ప్రభుత్వం మన పనిపై నిషేధం ఎప్పుడు విధిస్తుందో మనకు తెలీదు. కానీ యెహోవాతో ఉన్న సంబంధాన్ని బలపర్చుకోవడం ద్వారా, ధైర్యాన్ని పెంచుకోవడం ద్వారా, ప్రజలు మనల్ని ద్వేషిస్తారని అర్థంచేసుకోవడం ద్వారా ఆ హింసల్ని ఎదుర్కోవడానికి ఇప్పుడే సిద్ధపడవచ్చు. అలా ఇప్పుడు సిద్ధపడితే, భవిష్యత్తులో స్థిరంగా నిలబడగలుగుతాం.

22 ఒకవేళ మన ఆరాధన పై ప్రభుత్వం నిషేధం విధిస్తే ఏం చేయాలి? అలాంటి పరిస్థితిలో కూడా యెహోవా సేవను కొనసాగించడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల్ని తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

^ పేరా 5 ఇతరులు మనల్ని ద్వేషించాలని కోరుకోం. కానీ ఏదోకరోజు మనందరం హింసల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే హింసలు వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉండవచ్చో, వాటిని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

^ పేరా 14 ఇంగ్లీషులో అందుబాటులో ఉన్న 1979, జూలై 15 కావలికోట సంచికలోని 4-7 పేజీలు; అలాగే JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ఇంటర్వ్యూలు, అనుభవాలు విభాగంలో ఉన్న జెహోవాస్‌ నేమ్‌ విల్‌ బి నోన్‌ అనే వీడియో చూడండి.

^ పేరా 66 చిత్రాల వివరణ: తల్లిదండ్రులు కుటుంబ ఆరాధనలో పేపరు కార్డులను ఉపయోగించి లేఖనాల్ని తమ పిల్లలతో కంఠస్థం చేయిస్తున్నారు.

^ పేరా 69 చిత్రాల వివరణ: ఒక కుటుంబం కారులో మీటింగ్‌కి వెళ్తూ రాజ్య గీతాలు పాడుతున్నారు.