కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 28

మన పనిని నిషేధించినప్పుడు కూడా యెహోవాను సేవిస్తూ ఉండండి

మన పనిని నిషేధించినప్పుడు కూడా యెహోవాను సేవిస్తూ ఉండండి

“మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.”—అపొ. 4:19, 20.

పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!

ఈ ఆర్టికల్‌లో. . . *

1-2. (ఎ) మన ఆరాధనను నిషేధించినప్పుడు ఎందుకు ఆశ్చర్యపోకూడదు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

మన ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం లేదా తీవ్రమైన ఆంక్షలు ఉన్న దేశాల్లో 2,23,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారని 2018 నివేదిక తెలిపింది. కానీ అది ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందుకంటే మనం ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నట్లు, నిజక్రైస్తవులకు ఖచ్చితంగా హింసలు వస్తాయి. (2 తిమో. 3:12) మనం జీవించే దేశం ఏదైనా, హఠాత్తుగా ప్రభుత్వ అధికారులు మన ప్రేమగల దేవుడైన యెహోవా ఆరాధనను నిషేధించే అవకాశం ఉంది.

2 మీ దేశ ప్రభుత్వం యెహోవా ఆరాధనను నిషేధించాలని నిర్ణయిస్తే, మీకు ఈ సందేహాలు రావచ్చు: ‘హింసలు వస్తున్నాయంటే మనం దేవుని అనుగ్రహం కోల్పోయామా? నిషేధం ఉంటే ఇంకెప్పటికీ యెహోవాను ఆరాధించలేమా? నేను యెహోవాను స్వేచ్ఛగా ఆరాధించగలిగేలా వేరే దేశానికి వెళ్లిపోవాలా?’ ఈ ఆర్టికల్‌లో వాటిగురించి పరిశీలిస్తాం. అంతేకాదు మన పనిని నిషేధించినా యెహోవాను ఆరాధిస్తూ ఉండడానికి ఏం చేయాలో, ఎలాంటి ఉరుల్ని తప్పించుకోవాలో తెలుసుకుంటాం.

హింసలు వస్తున్నాయంటే దేవుని అనుగ్రహం కోల్పోయామా?

3. రెండో కొరింథీయులు 11:23-27 ప్రకారం, అపొస్తలుడైన పౌలు ఎలాంటి హింసలు ఎదుర్కొన్నాడు? ఆయన అనుభవం బట్టి మనకేమి అర్థమౌతోంది?

3 ఒకవేళ ప్రభుత్వం మన ఆరాధనను నిషేధిస్తే, మనం దేవుని అనుగ్రహం కోల్పోయామని పొరబడే అవకాశం ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, హింసలు వస్తున్నాయంటే యెహోవా మన విషయంలో సంతోషంగా లేడని కాదు. అపొస్తలుడైన పౌలు విషయాన్నే తీసుకోండి. ఆయనపై దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంది. ఆయన క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్న 14 పత్రికల్ని రాశాడు, ‘అన్యులకు అపొస్తలుడిగా’ సేవచేశాడు. అయినప్పటికీ తీవ్రమైన హింసలు ఎదుర్కొన్నాడు. (2 కొరింథీయులు 11:23-27 చదవండి.) అపొస్తలుడైన పౌలు అనుభవం బట్టి, నమ్మకమైన సేవకులు హింసలు ఎదుర్కొనేందుకు యెహోవా అనుమతిస్తాడని మనకు అర్థమౌతోంది.

4. ప్రజలు మనల్ని ఎందుకు ద్వేషిస్తారు?

4 మనం ఈ లోకానికి చెందినవాళ్లం కాదు కాబట్టి ప్రజలు మనల్ని ద్వేషిస్తారని యేసు వివరించాడు. (యోహా. 15:18, 19) అవును, హింసలు వస్తున్నాయంటే మనపై దేవుని అనుగ్రహం లేదని కాదు; బదులుగా మనం సరైనది చేస్తున్నామని అది సూచిస్తుంది.

నిషేధం ఉంటే ఇంకెప్పటికీ యెహోవాను ఆరాధించలేమా?

5. మనుషులకు యెహోవా ఆరాధనను ఆపగలిగే శక్తి ఉందా? వివరించండి.

5 సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఆరాధనను ఆపగలిగే శక్తి అల్పులైన మానవ వ్యతిరేకులకు లేదు. అలా ఆపడానికి చాలామంది ప్రయత్నించి, విఫలమయ్యారు కూడా. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏం జరిగిందో పరిశీలించండి. ఆ సమయంలో ఎన్నో ప్రభుత్వాలు దేవుని ప్రజల్ని తీవ్రంగా హింసించాయి. కేవలం జర్మనీలోని నాజీ ప్రభుత్వమే కాదు ఆస్ట్రేలియా, కెనడా అలాగే మరికొన్ని దేశాలు కూడా యెహోవాసాక్షుల పనిని నిషేధించాయి. అప్పుడు ఏం జరిగింది? 1939లో యుద్ధం మొదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా 72,475 మంది ప్రచారకులు ఉన్నారు. 1945లో యుద్ధం ముగిసే సరికి, యెహోవా ఆశీర్వాదం వల్ల ఆ సంఖ్య 1,56,299కు పెరిగిందని నివేదికలు తెలిపాయి. అంటే రెండింతల కన్నా ఎక్కువమంది ప్రచారకులయ్యారు!

6. వ్యతిరేకత మనలో భయానికి బదులు ఏం కలిగించగలదు? ఒక అనుభవం చెప్పండి.

6 వ్యతిరేకత మనలో భయానికి బదులు, యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయాలనే ప్రోత్సాహాన్ని కలిగించగలదు. ఉదాహరణకు, చంటిబిడ్డ ఉన్న ఒక జంట అనుభవం పరిశీలించండి. వాళ్ల దేశంలో యెహోవా ఆరాధనను నిషేధించినప్పుడు, వాళ్లు భయపడి తమ సేవను తగ్గించలేదు. బదులుగా పయినీరు సేవ మొదలుపెట్టారు. దానికోసం భార్య మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా మానేసింది. నిషేధం వల్ల చాలామందికి యెహోవాసాక్షుల పట్ల కుతూహలం పెరిగిందని భర్త చెప్పాడు. ఫలితంగా, ఆయనకు బైబిలు స్టడీలు మొదలుపెట్టడం తేలికైంది. నిషేధం వల్ల మరో మంచి ఫలితం కూడా వచ్చింది. మీటింగ్స్‌, ప్రీచింగ్‌ మానేసిన చాలామంది మళ్లీ వాటిని చేయడం మొదలుపెట్టారని అదే దేశంలో ఉండే ఒక సంఘపెద్ద చెప్పాడు.

7. (ఎ) లేవీయకాండము 26:36, 37 వచనాల నుండి ఏం నేర్చుకుంటాం? (బి) మీ దేశంలో నిషేధం విధిస్తే మీరేం చేస్తారు?

7 మనం భయపడి యెహోవాను సేవించడం ఆపేయాలనే ఉద్దేశంతో శత్రువులు మన ఆరాధనను నిషేధిస్తారు. అంతేకాదు మన గురించి అబద్ధాలు వ్యాప్తిచేయడం, అధికారుల చేత మన ఇళ్లను సోదా చేయించడం, మనల్ని కోర్టుకు ఈడ్వడం, ఆఖరికి కొంతమందిని జైల్లో వేయడం లాంటివి చేయవచ్చు. అలా కొందర్ని జైల్లో పెడితే భయపడతామని వాళ్లు అనుకుంటారు. ఒకవేళ మనం వాటికి భయపడితే, యెహోవా సేవను తగ్గిస్తాం లేదా పూర్తిగా ఆపేస్తాం. కానీ మనం లేవీయకాండము 26:36, 37 లో చెప్పబడిన వాళ్లలా ఉండాలనుకోం. (చదవండి.) కాబట్టి భయపడి యెహోవా సేవను తగ్గించం లేదా ఆపేయం. బదులుగా యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచుతాం, కంగారుపడకుండా ఉంటాం. (కీర్త. 27:1) నడిపింపు కోసం యెహోవాకు ప్రార్థిస్తాం. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి, ఎంత శక్తివంతమైన మానవ ప్రభుత్వమైనా మనల్ని యెహోవాను సేవించకుండా ఆపలేదని మనకు తెలుసు.—హెబ్రీ. 13:6.

వేరే దేశానికి వెళ్లిపోవాలా?

8-9. (ఎ) ప్రతీ కుటుంబ యజమాని సొంతగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? (బి) తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

8 ఒకవేళ మీ దేశ ప్రభుత్వం మన ఆరాధనను నిషేధిస్తే, యెహోవాను స్వేచ్ఛగా ఆరాధించగలిగేలా వేరేదేశానికి వెళ్లిపోవాలా వద్దా అనే సందేహం మీకు రావచ్చు. అది సొంతగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే కొంతమంది అలా నిర్ణయించుకునే ముందు, హింసలు వచ్చినప్పుడు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఏం చేశారో పరిశీలిస్తారు. శత్రువులు స్తెఫనును రాళ్లతో కొట్టి చంపాక యెరూషలేములో ఉన్న శిష్యులు యూదయ, సమరయ అంతటా అలాగే ఫేనీకే, కుప్ర, అంతియొకయ వరకు కూడా చెదరిపోయారు. (మత్త. 10:23; అపొ. 8:1; 11:19) మరికొంతమంది, ఆ క్రైస్తవులకు మరోసారి హింసలు వచ్చినప్పుడు అపొస్తలుడైన పౌలు ఏం చేశాడో పరిశీలిస్తారు. తనకు ప్రాణాపాయం ఉండొచ్చని తెలిసినా, వ్యతిరేకత ఎదురైన ప్రాంతాల్లోనే ఉండాలని పౌలు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అక్కడ మంచివార్త ప్రకటించాలని, తీవ్రమైన హింసలు అనుభవిస్తున్న సహోదరుల్ని బలపర్చాలని ఆయన కోరుకున్నాడు.—అపొ. 14:19-23.

9 మనం ఈ వృత్తాంతాల నుండి ఏం నేర్చుకోవచ్చు? వేరే దేశానికి వెళ్లాలో వద్దో కుటుంబ యజమానే నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకునే ముందు తన కుటుంబ పరిస్థితుల్ని, వేరే దేశానికి వెళ్లడం వల్ల కలిగే లాభనష్టాల్ని ప్రార్థనాపూర్వకంగా, జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ప్రతీ క్రైస్తవుడు “తన బరువు తానే మోసుకోవాలి.” (గల. 6:5) వేరేవాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా మనం తప్పుపట్టకూడదు.

నిషేధం ఉన్నప్పుడు మనం ఎలా ఆరాధించవచ్చు?

10. బ్రాంచి కార్యాలయం అలాగే సంఘపెద్దలు వేటిగురించి నిర్దేశాలిస్తారు?

10 నిషేధం ఉన్నప్పుడు కూడా మీ ఆరాధనను ఎలా కొనసాగించవచ్చు? ఆ సమయంలో ఆధ్యాత్మిక ఆహారం ఎలా పొందాలో, ఆరాధన కోసం ఎలా కలుసుకోవాలో, మంచివార్తను ఎలా ప్రకటించాలో బ్రాంచి కార్యాలయం మీ సంఘపెద్దలకు నిర్దేశాల్ని, ఉపయోగపడే సలహాల్ని ఇస్తుంది. ఒకవేళ బ్రాంచి కార్యాలయం పెద్దల్ని సంప్రదించలేకపోతే, మీరూ సంఘంలోనివాళ్లూ యెహోవాను ఆరాధించగలిగేలా స్థానిక సంఘపెద్దలు సహాయం చేస్తారు. వాళ్లు బైబిలు అలాగే ప్రచురణల ఆధారంగా నిర్దేశాలిస్తారు.—మత్త. 28:19, 20; అపొ. 5:29; హెబ్రీ. 10:24, 25.

11. నిషేధం ఉన్నా మనం ఆధ్యాత్మికంగా పోషించబడతామని ఎందుకు నమ్మవచ్చు? మీ బైబిల్ని, ప్రచురణల్ని ఎలా కాపాడుకోవచ్చు?

11 యెహోవా తన సేవకులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తానని మాటిచ్చాడు. (యెష. 65:13, 14; లూకా 12:42-44) కాబట్టి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషించడానికి ఆయన సంస్థ చేయగలిగినదంతా చేస్తుందని నమ్మవచ్చు. అయితే మీరు చేయాల్సింది కూడా ఉంది. నిషేధం ఉన్నప్పుడు మీ బైబిల్ని, ఇతర ప్రచురణల్ని ఎవ్వరికీ కనబడకుండా దాచిపెట్టుకోండి. అలాంటి విలువైన సమాచారం ముద్రిత రూపంలో ఉన్నా లేక ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్నా దాన్ని తేలిగ్గా దొరికే చోట పెట్టకండి. మనలో ప్రతీఒక్కరం ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి చేయగలినదంతా చేయాలి.

యెహోవా మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఆరాధన కోసం కలుసుకోవచ్చు (12వ పేరా చూడండి) *

12. మన వ్యతిరేకులకు తెలియకుండా మీటింగ్స్‌ జరిగేలా పెద్దలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు?

12 మరి ప్రతీవారం జరుపుకునే మీటింగ్స్‌ సంగతేంటి? మన వ్యతిరేకులకు తెలియకుండా మీటింగ్స్‌ జరిగేలా పెద్దలు ఏర్పాట్లు చేస్తారు. వాళ్లు బహుశా మిమ్మల్ని చిన్నచిన్న గుంపులుగా కలుసుకోమని చెప్పవచ్చు; మీటింగ్స్‌ జరిగే సమయాల్ని, స్థలాల్ని ఎప్పటికప్పుడు మార్చవచ్చు. మనం మీటింగ్స్‌కు వస్తున్నప్పుడు, తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతీఒక్కరి భద్రతను దృష్టిలో పెట్టుకుని చిన్నగా మాట్లాడుకోవాలి. అంతేకాదు మీటింగ్స్‌కి వేసుకునే లాంటి బట్టలు కాకుండా మామూలు బట్టలు వేసుకోవాల్సి రావచ్చు.

నిషేధం ఉన్నా ప్రకటనా పని ఆపం (13వ పేరా చూడండి) *

13. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లోని మన సహోదరుల నుండి ఏం నేర్చుకోవచ్చు?

13 ప్రకటనా పని విషయానికొస్తే, పరిస్థితులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కానీ మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయన రాజ్యం గురించి ఇతరులకు చెప్పడాన్ని ఆనందిస్తాం కాబట్టి ప్రకటనా పని చేయడానికి ఏదోక మార్గాన్ని కనుగొంటాం. (లూకా 8:1; అపొ. 4:29) ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లోని యెహోవాసాక్షులు చేసిన ప్రకటనా పని గురించి వ్యాఖ్యానిస్తూ ఎమలీ బి. బెరన్‌ అనే చరిత్రకారిణి ఇలా చెప్పింది, “యెహోవాసాక్షులు ఇతరులకు ప్రకటించకూడదని ప్రభుత్వం చెప్పినప్పుడు, వాళ్లు ఇరుగుపొరుగువాళ్లతో, తోటి ఉద్యోగులతో, స్నేహితులతో తమ నమ్మకాల గురించి మాట్లాడారు. అలా మాట్లాడినందుకు వాళ్లను లేబర్‌ క్యాంపుల్లో వేసినా, అక్కడ తోటి ఖైదీలకు సాక్ష్యమిచ్చారు.” అవును, నిషేధం ఉన్నా ఆ సహోదరులు ప్రకటించడం ఆపలేదు. ఒకవేళ మీ దేశంలో ప్రకటనా పనిని నిషేధిస్తే, వాళ్లను అనుకరించమని కోరుతున్నాం!

తప్పించుకోవాల్సిన ఉరులు

ఎప్పుడు మౌనంగా ఉండాలో గుర్తించాలి (14వ పేరా చూడండి) *

14. కీర్తన 39:1 లో మనకు ఏ హెచ్చరిక ఉంది?

14 ఇతరులకు మన విషయాలు చెప్పకండి. నిషేధం ఉన్నప్పుడు, మనం ఎలాంటి విషయాల్లో ‘మౌనంగా ఉండాలో’ గుర్తించాలి. (ప్రసం. 3:1, 7) మన సహోదరసహోదరీల పేర్లు, మనం కలుసుకునే స్థలాలు, పరిచర్య చేసే పద్ధతి, ఆధ్యాత్మిక ఆహారం పొందే విధానం వంటి విషయాల్ని రహస్యంగా ఉంచాలి. వాటిని ప్రభుత్వ అధికారులకు, మన దేశంలోని లేదా ఇతర దేశాల్లోని స్నేహితులకు, బంధువులకు చెప్పకూడదు. ఒకవేళ చెప్తే, మన సహోదరులు ప్రమాదంలో పడతారు.—కీర్తన 39:1 చదవండి.

15. సాతాను ఏం చేయాలని ప్రయత్నిస్తాడు? మనం ఆ ఉరిలో చిక్కుకోకుండా ఎలా ఉండవచ్చు?

15 చిన్నచిన్న సమస్యలు మీ ఐక్యతను పాడు చేయనివ్వకండి. ఒక ఇంట్లోవాళ్లే గొడవలుపడి విడిపోతే, ఆ ఇల్లు నిలవదని సాతానుకు తెలుసు. (మార్కు 3:24, 25) సాతాను మన మధ్య విభజనలు సృష్టించాలని అదేపనిగా ప్రయత్నిస్తుంటాడు. అలా చేస్తే మనం అతనితో పోరాడే బదులు, ఒకరితో ఒకరం గొడవలు పడతామని అతని ఉద్దేశం.

16. గెర్‌ట్రూట్‌ అనే సహోదరి మనకు ఎలాంటి ఆదర్శం ఉంచింది?

16 ఎంతో అనుభవం ఉన్న క్రైస్తవులు కూడా ఈ ఉరిలో పడకుండా జాగ్రత్తపడాలి. అభిషిక్త సహోదరీలైన గెర్‌ట్రూట్‌ పోయెట్‌జింగర్‌, ఇల్‌ఫ్రీడి లోవర్‌ల ఉదాహరణ పరిశీలించండి. వాళ్లను కొంతమంది సహోదరీలతోపాటు నాజీ కాన్సంట్రేషన్‌ క్యాంప్‌లో వేశారు. ఇల్‌ఫ్రీడి ఆ క్యాంప్‌లో ఉన్న సహోదరీలను ప్రోత్సహిస్తూ ప్రసంగాలు ఇచ్చేది, అది చూసి గెర్‌ట్రూట్‌ ఈర్ష్యపడింది. కొంతకాలం తర్వాత గెర్‌ట్రూట్‌ తాను చేసిన పనికి సిగ్గుపడి, సహాయం కోసం యెహోవాను వేడుకుంది. ఆమె ఇలా రాసింది, “ఇతరులకు మనకన్నా ఎక్కువ సామర్థ్యాలు, బాధ్యతలు ఉన్నప్పుడు మనం ఈర్ష్యపడకుండా ఉండడం నేర్చుకోవాలి.” గెర్‌ట్రూట్‌ తన ఆలోచనను ఎలా మార్చుకోగలిగింది? ఆమె ఇల్‌ఫ్రీడిలో ఉన్న మంచి లక్షణాల మీద, స్నేహపూర్వక వ్యక్తిత్వం మీద మనసుపెట్టింది. ఆ విధంగా వాళ్లు మళ్లీ మంచి స్నేహితులు అయ్యారు. కొంతకాలానికి ఇద్దరూ కాన్సంట్రేషన్‌ క్యాంప్‌ నుండి బయటికొచ్చారు, తమ భూజీవితం చివరివరకు యెహోవాకు నమ్మకంగా సేవచేశారు. కాబట్టి తోటి సహోదరులతో ఉన్న విభేదాల్ని పరిష్కరించుకోవడానికి కృషి చేస్తే, మన ఐక్యతను కాపాడుకుంటాం.—కొలొ. 3:13, 14.

17. నిర్దేశాల్ని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు?

17 నిర్దేశాల్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకండి. బాధ్యతగల నమ్మకమైన సహోదరులు ఇచ్చే నిర్దేశాల్ని పాటిస్తే సమస్యల్లో చిక్కుకోకుండా ఉంటాం. (1 పేతు. 5:5) ఉదాహరణకు నిషేధం ఉన్న ఒక దేశంలో, ముద్రిత ప్రచురణల్ని పరిచర్యలో ఇవ్వకూడదని బాధ్యతగల సహోదరులు చెప్పారు. కానీ ఒక పయినీరు సహోదరుడు ఆ నిర్దేశాన్ని పాటించకుండా ప్రచురణల్ని పంచిపెట్టాడు. దాని ఫలితం? ఆయన అలాగే ఇంకొంతమంది అనియత సాక్ష్యం చేసిన కాసేపటికే పోలీసులు వచ్చి వాళ్లను ప్రశ్నించారు. ఆ పోలీసులు వాళ్లతోపాటే వెళ్లి ప్రజల దగ్గర నుండి ప్రచురణల్ని లాక్కున్నారు. ఈ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏదైన నిర్దేశం సరైనది కాదని అనిపించినా దాన్ని మనం పాటించాలి. నాయకత్వం వహించడానికి యెహోవా నియమించిన సహోదరులకు సహకరిస్తే, ఆయన మనల్ని ఎప్పుడూ దీవిస్తాడు.—హెబ్రీ. 13:7, 17.

18. మనం అనవసరమైన నియమాలు ఎందుకు పెట్టకూడదు?

18 అనవసరమైన నియమాలు పెట్టకండి. పెద్దలు అనవసరమైన నియమాలు పెడితే, ఇతరులకు భారంగా అనిపిస్తుంది. ఒకప్పటి జెకస్లోవేకియాలో నిషేధం విధించినప్పుడు ఏం జరిగిందో సహోదరుడు యూరై కామిన్‌స్కీ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “చాలామంది సంఘపెద్దలు అరెస్టు చేయబడ్డారు. అప్పుడు సంఘాల్లో అలాగే సర్క్యూట్లలో నాయకత్వం వహించడానికి కొంతమంది సహోదరులే మిగిలారు. వాళ్లు ప్రచారకులు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్తూ సొంత నియమాల్ని పెట్టడం మొదలుపెట్టారు.” నిజానికి, సహోదరులకు నియమాలు పెట్టే అధికారం యెహోవా మనకు ఇవ్వలేదు. అనవసరమైన నియమాలు పెట్టేవాళ్లు సహోదరులను కాపాడట్లేదు గానీ వాళ్ల విశ్వాసం మీద యజమానులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.—2 కొరిం. 1:24.

యెహోవాను ఆరాధించడం ఎన్నడూ ఆపకండి

19. రెండో దినవృత్తాంతములు 32:7, 8 బట్టి మనం ఎందుకు ధైర్యంగా ఉండవచ్చు?

19 మన ప్రధాన శత్రువైన సాతాను, యెహోవా నమ్మకమైన సేవకుల్ని హింసించడం ఆపడు. (1 పేతు. 5:8; ప్రక. 2:10) సాతాను, అతని మద్దతుదారులు యెహోవా ఆరాధనను నిషేధించడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. (ద్వితీ. 7:21) ఎందుకంటే యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, వ్యతిరేకులు మన పనిని నిషేధించినా ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు.—2 దినవృత్తాంతములు 32:7, 8 చదవండి.

20. మనం ఏమని నిర్ణయించుకోవాలి?

20 మొదటి శతాబ్దంలోని సహోదరులు తమ పాలకులతో ఇలా అన్నారు, “దేవుని మాట కాకుండా మీ మాట వినడం దేవుని దృష్టిలో సరైనదేనా? మీరే ఆలోచించండి. మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.” మనం వాళ్లను అనుకరించాలని నిర్ణయించుకుందాం.—అపొ. 4:19, 20.

పాట 73 మాకు ధైర్యాన్నివ్వు

^ పేరా 5 మనం యెహోవాకు చేసే ఆరాధనను ప్రభుత్వం నిషేధించినప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలిపే సలహాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాటిని పాటిస్తే యెహోవాను సేవిస్తూ ఉండగలుగుతాం.

^ పేరా 59 చిత్రాల వివరణ: మన పనిపై ఆంక్షలు విధించిన దేశాల్లో యెహోవాను సేవిస్తున్న సహోదరసహోదరీల చిత్రాలు. ఒక సహోదరుని ఇంట్లోని స్టోర్‌ రూమ్‌లో మీటింగ్‌ జరుపుకుంటున్న ఒక చిన్న గుంపు.

^ పేరా 61 చిత్రాల వివరణ: (ఎడమవైపు) మన సహోదరి ఒకామెతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ యెహోవా గురించి చెప్పే అవకాశం కోసం చూస్తోంది.

^ పేరా 63 చిత్రాల వివరణ: పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు తన సంఘానికి సంబంధించిన విషయాలు చెప్పకుండా మౌనంగా ఉన్న ఒక సహోదరుడు.