కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 49

పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ‘సమయం ఉంది’

పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ‘సమయం ఉంది’

“మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం పదండి, కాస్త విశ్రాంతి తీసుకుందాం.”—మార్కు 6:31.

పాట 143 పనిచేస్తూ, కనిపెట్టుకుంటూ, ఎదురుచూస్తూ ఉండండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. పని గురించి చాలామంది ఏమనుకుంటున్నారు?

పని గురించి మీ ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా దేశాల్లో ప్రజలు, ఎప్పుడూ లేనంతగా ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ విపరీతంగా కష్టపడుతున్నారు. నిర్విరామంగా పని చేసేవాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబంతో సమయం గడపడానికి, లేదా తమ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకోవడానికి సమయం లేనంత బిజీగా ఉంటున్నారు. (ప్రసం. 2:23) ఇంకోవైపు, కొంతమంది పని చేయడానికి అస్సలు ఇష్టపడరు పైగా పని తప్పించుకోవడానికి సాకులు వెదుకుతుంటారు.—సామె. 26:13, 14.

2-3. పని విషయంలో యెహోవా, యేసు ఎలాంటి ఆదర్శం ఉంచారు?

2 లోకంలో చాలామంది, చేస్తే విపరీతంగా పనిచేస్తారు, లేదంటే అస్సలు చేయరు. కానీ పని గురించి యెహోవా, యేసు ఏమనుకుంటున్నారో పరిశీలించండి. యెహోవా పనివంతుడని మనకు బాగా తెలుసు. యేసు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నాడు, “నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు, కాబట్టి నేను కూడా పనిచేస్తూ ఉన్నాను.” (యోహా. 5:17) యెహోవా దేవదూతల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని చేశాడు. ఆ పనంతటి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమ్మీద ఆయన చేసిన ఎన్నో అందమైన వాటిని మనం చూస్తున్నాం. అందుకే కీర్తనకర్త సరిగ్గానే ఇలా చెప్పాడు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.”—కీర్త. 104:24.

3 యేసు తన తండ్రి బాటలోనే నడిచాడు. యెహోవా ‘ఆకాశాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు’ యేసు ఆయనకు సహాయం చేశాడు. ఆయన యెహోవా దగ్గర “ప్రధానశిల్పిగా” ఉన్నాడు. (సామె. 8:27-31) ఆ తర్వాత చాలా కాలానికి అంటే ఆయన భూమ్మీదున్న రోజుల్లో ఒక ముఖ్యమైన పని చేశాడు. ఆ పని తనకు ఆహారం లాంటిదని చెప్పాడు, ఆయన చేసిన పనుల్ని బట్టి ఆయన్ని దేవుడే పంపాడని ప్రజలు గుర్తించగలిగారు.—యోహా. 4:34; 5:36; 14:10.

4. విశ్రాంతి తీసుకోవడం గురించి యెహోవా, యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

4 యెహోవా, యేసు కష్టపడి పని చేశారంటే, దానర్థం మనం విశ్రాంతి తీసుకోకుండా పని చేయాలనా? ఎంతమాత్రం కాదు! యెహోవా ఎన్నడూ అలసిపోడు కాబట్టి ఆయనకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ యెహోవా ఆకాశాన్ని, భూమిని చేసిన తర్వాత ‘విశ్రాంతి తీసుకుని, సేదదీరాడు’ అని బైబిలు చెప్తుంది. (నిర్గ. 31:17, NW) అంటే, యెహోవా తాను చేసిన పనిని చూసి ఆనందించడానికి సమయం తీసుకున్నాడని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే యేసు భూమ్మీదున్నప్పుడు కష్టపడి పని చేశాడు. అంతేకాదు విశ్రాంతి తీసుకోవడానికి, స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి సమయం కూడా తీసుకున్నాడు.—మత్త. 14:13; లూకా 7:34.

5. దేవుని ప్రజల్లో చాలామందికి ఏది కష్టంగా ఉండవచ్చు?

5 దేవుని ప్రజలు పని చేయడానికి ఇష్టపడాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. తన సేవకులు కష్టపడేవాళ్లుగా ఉండాలే తప్ప సోమరులుగా ఉండకూడదు. (సామె. 15:19) బహుశా మీరు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేస్తుండవచ్చు. అంతేకాదు, మంచివార్త ప్రకటించాల్సిన బాధ్యత క్రీస్తు శిష్యులందరికీ ఉంది. అయితే, మీరు సరిపడా విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమే. కొన్నిసార్లు ఉద్యోగం, పరిచర్య, విశ్రాంతి తీసుకోవడం వంటివాటికి సమయం కేటాయించడం మీకు కష్టంగా ఉందా? మనం ఎంత పని చేయాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అనేది తెలుసుకోవడం ఎలా?

పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి సరైన వైఖరి

6. మార్కు 6:30-34 ప్రకారం యేసుకు పని గురించి, విశ్రాంతి గురించి సరైన వైఖరి ఉందని ఎలా చెప్పవచ్చు?

6 పని విషయానికొస్తే, దాని గురించి సరైన వైఖరి అవసరం. “ప్రతిదానికి సమయము కలదు” అని సొలొమోను రాజు పవిత్రశక్తి ప్రేరణతో రాశాడు. నాటడం, కట్టడం, ఏడ్వడం, నవ్వడం, నాట్యం చేయడం, అలాగే మరితర పనుల గురించి ఆయన ప్రస్తావించాడు. (ప్రసం. 3:1-8) పని చేయడం, విశ్రాంతి తీసుకోవడం ఈ రెండూ మన జీవితంలో ముఖ్యమైన అంశాలని స్పష్టమౌతుంది. వాటి విషయంలో యేసుకు సరైన వైఖరి ఉంది. ఒక సందర్భంలో, అపొస్తలులు పరిచర్యలో ఎంత బిజీగా ఉన్నారంటే, “వాళ్లకు తినడానికి కూడా తీరిక లేకపోయింది.” వాళ్లు పరిచర్య నుండి తిరిగొచ్చినప్పుడు “మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం పదండి, కాస్త విశ్రాంతి తీసుకుందాం” అని యేసు వాళ్లతో అన్నాడు. (మార్కు 6:30-34 చదవండి.) యేసుకు, ఆయన శిష్యులకు సరిపడా విశ్రాంతి తీసుకునే సమయం అన్నిసార్లూ దొరకకపోయినా, వాళ్లందరికీ విశ్రాంతి అవసరమని యేసుకు తెలుసు.

7. విశ్రాంతి రోజు గురించిన నియమం పరిశీలించడం వల్ల మనకేంటి ప్రయోజనం?

7 కొన్నిసార్లు కొంత విశ్రాంతి, కొంత మార్పు నిజంగా అవసరం. ప్రాచీన ఇశ్రాయేలీయుల కోసం దేవుడు చేసిన ఒక ఏర్పాటులో అది కనబడుతుంది. అదే విశ్రాంతి రోజు. మనం ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం కింద లేము; అయినాగానీ విశ్రాంతి రోజు గురించి ధర్మశాస్త్రం ఏం చెప్పిందో పరిశీలిస్తే మనకు ప్రయోజనం ఉంటుంది. మనం నేర్చుకునే విషయాలను బట్టి పని గురించి, విశ్రాంతి గురించి మనకు సరైన వైఖరి ఉందో లేదో పరిశీలించుకోవచ్చు.

విశ్రాంతి రోజు అనేది విశ్రాంతి తీసుకోవడానికి, ఆరాధించడానికి సమయం

8. నిర్గమకాండము 31:12-15 ప్రకారం, ఇశ్రాయేలీయులు విశ్రాంతి రోజును ఎందుకు ఆచరించాలి?

8 ఆరు సృష్టి ‘దినాల’ తర్వాత దేవుడు భూమికి సంబంధించి తన పనులు ఆపాడని బైబిలు చెప్తుంది. (ఆది. 2:2) కానీ పని చేయడమంటే యెహోవాకు ఇష్టం, ఆయన వేరే విషయాల్లో ‘ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు.’ (యోహా. 5:17) యెహోవా ఆరు ‘దినాలు’ పనిచేశాడు, ఏడో “దినము” విశ్రాంతి తీసుకున్నాడు. ప్రతీవారం ఏడో రోజున విశ్రాంతి తీసుకోమని ఆయన ఇశ్రాయేలీయులకు కూడా చెప్పాడు. విశ్రాంతి రోజు అనేది తనకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఒక గుర్తుగా ఉంటుందని దేవుడు చెప్పాడు. ఆ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన రోజు. అది “యెహోవాకు ప్రతిష్ఠితమైన” రోజు. (నిర్గమకాండము 31:12-15 చదవండి.) ఆ రోజున పిల్లలు గానీ దాసులుగానీ అంతెందుకు పొలాల్లో ఉండే పశువులు కూడా పనిచేయకూడదు. (నిర్గ. 20:10) దానివల్ల ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వీలైంది.

9. యేసు కాలంలో, విశ్రాంతి రోజును పాటించడానికి సంబంధించి ఎలాంటి తప్పుడు అభిప్రాయం ఉండేది?

9 విశ్రాంతి రోజు దేవుని ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేది; అయితే యేసు కాలంలోని చాలామంది మత నాయకులు, విశ్రాంతి రోజును ఎలా పాటించాలనే విషయంలో చాలా కఠినమైన నియమాలు పెట్టారు. విశ్రాంతి రోజున ధాన్యాన్ని తుంచినా, అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బాగుచేసినా అది ధర్మశాస్త్రానికి విరుద్ధమౌతుందని వాళ్లు చెప్పారు. (మార్కు 2:23-27; 3:2-5) కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఆ విషయాన్నే యేసు తన ప్రేక్షకులకు స్పష్టం చేశాడు.

యేసు కుటుంబం విశ్రాంతి రోజును దేవుని ఆరాధన కోసం ఉపయోగించేవాళ్లు (10వ పేరా చూడండి) *

10. మత్తయి 12:9-12 ప్రకారం, విశ్రాంతి రోజును యేసు ఎలా చూశాడు?

10 యేసు అలాగే ఆయన్ని అనుసరించిన యూదులు మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నారు కాబట్టి వాళ్లు విశ్రాంతి రోజును పాటించేవాళ్లు. * అయితే విశ్రాంతి రోజున దయ చూపించడం, ఇతరులకు సహాయం చేయడం తప్పు కాదని యేసు తన మాటల్లో, పనుల్లో చూపించాడు. ఆయన స్పష్టంగా ఇలా చెప్పాడు: “విశ్రాంతి రోజున మంచి పని చేయడం సరైనదే.” (మత్తయి 12:9-12 చదవండి.) ఆ రోజున దయతో ఇతరులకు సహాయం చేసినంత మాత్రాన విశ్రాంతి రోజు నియమాన్ని ఉల్లంఘించినట్లు అవ్వదని యేసు భావించాడు. విశ్రాంతి రోజు వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటో యేసు పనులు స్పష్టం చేశాయి. ఆ రోజున దేవుని ప్రజలకు తమ రోజువారీ పనుల నుండి విశ్రాంతి దొరికేది కాబట్టి వాళ్లు దేవుణ్ణి ఆరాధించడం మీద మనసు పెట్టగలిగేవాళ్లు. యేసు పెరిగిన కుటుంబం, విశ్రాంతి రోజును దేవుణ్ణి ఆరాధన కోసం ఉపయోగించి ఉండవచ్చు. ఎందుకంటే, యేసు తన సొంత ఊరైన నజరేతులో ఉన్నప్పుడు, “తన అలవాటు ప్రకారం విశ్రాంతి రోజున సభామందిరానికి వెళ్లి లేఖనాలు చదవడానికి నిలబడ్డాడు” అని మనం చదువుతాం.—లూకా 4:15-19.

పని గురించి మీరెలా భావిస్తున్నారు?

11. పని విషయంలో యేసుకు ఎవరు మంచి ఆదర్శంగా ఉన్నారు?

11 యోసేపు తన పెంపుడు కొడుకైన యేసుకు వడ్రంగి పని నేర్పించేటప్పుడు, పని గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడో తప్పకుండా వివరించివుంటాడు. (మత్త. 13:55, 56) అంతేకాదు, యోసేపు తన పెద్ద కుటుంబాన్ని పోషించడానికి ప్రతీరోజు ఎంత కష్టపడి పని చేసేవాడో కూడా యేసు స్వయంగా చూసివుండొచ్చు. ఆసక్తికరంగా, కొంతకాలానికి యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “పనివాడు తన జీతానికి అర్హుడు.” (లూకా 10:7) అవును, కష్టపడి పనిచేయడం అంటే ఏంటో యేసుకు బాగా తెలుసు.

12. కష్టపడి పని చేయడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

12 అపొస్తలుడైన పౌలు కూడా కష్టపడి పని చేశాడు. ఆయన ముఖ్యంగా యేసు గురించి, ఆయన బోధల గురించి ఇతరులకు చెప్పేవాడు. దాంతోపాటు, ఆయన తనను తాను పోషించుకోవడానికి పని కూడా చేశాడు. ఆయన “ఏ ఒక్కరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి” పని చేయడం థెస్సలోనిక సంఘంలో వాళ్లకు తెలుసు. (2 థెస్స. 3:8; అపొ. 20:34, 35) పౌలు తన పని గురించి రాసినప్పుడు, డేరాలు కుట్టడం గురించి మాట్లాడుతుండవచ్చు. ఆయన కొరింథులో ఉన్నప్పుడు అకుల, ప్రిస్కిల్లతో పాటు ఉన్నాడు. ‘వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే కాబట్టి పౌలు వాళ్లతో కలిసి పనిచేశాడు.’ పౌలు “రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి” పని చేశాడంటే దానర్థం ఆయన నిర్విరామంగా పని చేశాడని కాదు. ఆయన విశ్రాంతి రోజు ఆ పని ఆపేసేవాడు. ఆ రోజు యూదులు కూడా విశ్రాంతి రోజును పాటించేవాళ్లు కాబట్టి పౌలు వాళ్లకు ప్రకటించేవాడు.—అపొ. 13:14-16, 42-44; 16:13; 18:1-4.

13. పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

13 అపొస్తలుడైన పౌలు మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయన ఒకవైపు డేరాలు కుట్టుకుంటూనే, క్రమంగా “దేవుని మంచివార్తకు సంబంధించిన పవిత్రమైన పని” చేశాడు. (రోమా. 15:16; 2 కొరిం. 11:23) క్రమంగా ప్రకటించమని ఆయన ఇతరుల్ని కూడా ప్రోత్సహించాడు. అకుల, ప్రిస్కిల్ల “క్రీస్తుయేసు సేవలో నా తోటి పనివాళ్లు” అని పౌలు అన్నాడు. (రోమా. 12:11; 16:3) అంతేకాదు, “ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి” అని పౌలు కొరింథీయుల్ని ప్రోత్సహించాడు. (1 కొరిం. 15:58; 2 కొరిం. 9:8) అపొస్తలుడైన పౌలు యెహోవా ప్రేరణతో ఇలా రాశాడు: “ఎవరికైనా పనిచేయడం ఇష్టంలేకపోతే వాళ్లు భోజనం చేయకూడదు.”—2 థెస్స. 3:10.

14. యోహాను 14:12 లో యేసు చెప్పిన మాటల భావం ఏంటి?

14 ప్రకటించడం, శిష్యుల్ని చేయడం ఇదే ఈ చివరి రోజుల్లో అన్నిటికన్నా ముఖ్యమైన పని. నిజానికి, తన శిష్యులు తన కన్నా గొప్ప పనులు చేస్తారని యేసు ముందే చెప్పాడు. (యోహాను 14:12 చదవండి.) దానర్థం మనం ఆయనలా అద్భుతాలు చేస్తామని కాదు. బదులుగా, తన అనుచరులు ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో, చాలామంది ప్రజలకు, ఆయన కన్నా ఎక్కువకాలం ప్రకటిస్తారని యేసు భావం.

15. మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి? ఎందుకు?

15 మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే ఇలా ప్రశ్నించుకోండి: ‘ఉద్యోగ స్థలంలో కష్టపడి పని చేస్తాననే పేరు నాకుందా? నేను పనిని సమయానికి పూర్తి చేస్తానా? నా శక్తి లోపం లేకుండా పని చేస్తానా?’ ఒకవేళ మీ జవాబు అవును అయితే, మీరు మీ యజమాని నమ్మకాన్ని సంపాదించుకుంటారు. అంతేకాదు, మిమ్మల్ని గమనించే మీ తోటి ఉద్యోగులకు మంచివార్త ప్రకటించినప్పుడు, వాళ్లు ఇంకా ఆసక్తిగా వింటారు. మరోవైపు మంచివార్త ప్రకటించడం, బోధించడం గురించి ఇలా ప్రశ్నించుకోండి: ‘పరిచర్యలో కష్టపడి పని చేస్తాననే పేరు నాకుందా? మొదటిసారి కలిసినప్పుడు ఏం మాట్లాడాలో సరిగ్గా సిద్ధపడుతున్నానా? ఆసక్తి చూపించిన ప్రజల్ని వెంటనే కలుస్తున్నానా? వేర్వేరు పద్ధతుల్లో క్రమంగా పరిచర్య చేస్తున్నానా?’ మీ జవాబు అవును అయితే, మీరు మీ పరిచర్యలో ఆనందాన్ని పొందుతారు.

విశ్రాంతి తీసుకోవడం గురించి మీరెలా భావిస్తున్నారు?

16. విశ్రాంతి తీసుకోవడం గురించి యేసు, ఆయన అపొస్తలులు ఎలా భావించారు? నేడున్న చాలామంది ఎలా భావిస్తున్నారు?

16 తనకు, తన అపొస్తలులకు అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి అవసరమని యేసుకు తెలుసు. అయితే, ఆ కాలంలో అలాగే నేడు చాలామంది యేసు చెప్పిన ఉదాహరణలోని ధనవంతునిలా ఉన్నారు. ఆ ధనవంతుడు తనకు తాను ఇలా చెప్పుకున్నాడు: “హాయిగా ఉండు, తిను, తాగు, సంతోషించు.” (లూకా 12:19; 2 తిమో. 3:4) అతను విశ్రాంతి తీసుకోవడం మీద, సుఖాల మీద మనసుపెట్టాడు. కానీ యేసు ఆయన అపొస్తలులు వాటిమీద మనసుపెట్టలేదు.

పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి సరైన వైఖరి కలిగివుండడం వల్ల మనకు సంతోషాన్నిచ్చే మంచి పనులపై దృష్టి పెట్టగలుగుతాం (17వ పేరా చూడండి) *

17. సెలవు దొరికినప్పుడు మన సమయాన్ని ఎలా ఉపయోగిస్తాం?

17 నేడు, మనం యేసును అనుకరిస్తూ సెలవు దొరికినప్పుడు విశ్రాంతి తీసుకోవడంతో పాటు పరిచర్య చేయడం, కూటాలకు వెళ్లడం లాంటి మంచిపనులు చేస్తాం. నిజానికి శిష్యుల్ని చేయడం, క్రైస్తవ కూటాలకు వెళ్లడం మనకెంత ప్రాముఖ్యమంటే, వాటిలో క్రమంగా పాల్గొనడానికి శాయశక్తులా కృషిచేస్తాం. (హెబ్రీ. 10:24, 25) ఆఖరికి, మనం సెలవులకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా అక్కడున్న మన కూటాలకు వెళ్లడం, మనం కలిసేవాళ్లకు మంచివార్త ప్రకటించడం లాంటి ఆధ్యాత్మిక పనల్ని చేస్తూనే ఉంటాం.—2 తిమో. 4:2.

18. మనం ఏం చేయాలని మన రాజైన క్రీస్తు యేసు కోరుకుంటున్నాడు?

18 మన రాజైన యేసుక్రీస్తు, మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువ మన దగ్గర నుండి ఆశించడు. అలాగే పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి సరైన వైఖరి కలిగివుండడానికి సహాయం చేస్తాడు. ఈ విషయం తెలుసుకోవడం మనకెంత సంతోషాన్నిస్తుందో కదా! (హెబ్రీ. 4:15) మనం తగినంత విశ్రాంతి తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, మన అవసరాల కోసం కష్టపడి పని చేయాలని, మనకు సంతోషాన్నిచ్చే ప్రకటనా పనిలో పాల్గొనాలని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. తర్వాతి ఆర్టికల్‌లో, క్రూరమైన బానిసత్వం నుండి యేసు మనల్ని ఎలా విడిపించాడో పరిశీలిస్తాం.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

^ పేరా 5 పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి సరైన వైఖరి కలిగివుండడానికి లేఖనాలు మనకు సహాయం చేస్తాయి. ఇశ్రాయేలీయులు ప్రతీవారం పాటించిన విశ్రాంతి రోజు గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. పని గురించి, విశ్రాంతి తీసుకోవడం గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవడానికి అది సహాయం చేస్తుంది.

^ పేరా 10 విశ్రాంతి రోజును యేసు శిష్యులు ఎంతగా గౌరవించారంటే, ఆయన చనిపోయాక ఆయన శరీరానికి పూసే సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు తయారుచేసే పనిని విశ్రాంతి రోజు మొదలవ్వగానే ఆపేసి, అది ముగిశాక తిరిగి కొనసాగించారు.—లూకా 23:55, 56.

^ పేరా 55 చిత్రాల వివరణ: విశ్రాంతి రోజు యోసేపు తన కుటుంబాన్ని సభామందిరానికి తీసుకెళ్తున్నాడు.

^ పేరా 57 చిత్రాల వివరణ: ఉద్యోగం చేసే ఒక తండ్రి, తన కుటుంబంతో కలిసి సెలవులకు వెళ్లినప్పుడు కూడా ఆధ్యాత్మిక పనుల్లో పాల్గొంటున్నాడు.