కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 1

‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి’

‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి’

2020 వార్షిక వచనం: ‘కాబట్టి, మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి, వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.’మత్త. 28:19.

పాట 79 వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. యేసు సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలకు దేవదూత ఏం చెప్పాడు? వాళ్లకు యేసు ఏ నిర్దేశం ఇచ్చాడు?

అది క్రీ.శ. 33, నీసాను నెల 16వ తేదీ తెల్లవారుజాము. దైవభయంగల కొంతమంది స్త్రీలు బరువెక్కిన హృదయాలతో ప్రభువైన యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వెళ్తున్నారు. ఆయన్ని సమాధిలో పెట్టి 36 గంటల కన్నా ఎక్కువ సమయం గడిచింది. యేసు శరీరానికి సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు పూయడానికి వెళ్తున్న ఆ స్త్రీలు సమాధి దగ్గరికి రాగానే అది ఖాళీగా ఉండడం చూసి అవాక్కయ్యారు! యేసు పునరుత్థానం అయ్యాడని ఒక దేవదూత ఆ స్త్రీలకు చెప్పాడు. ఆ దేవదూత ఇంకా ఇలా అన్నాడు: “ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు. ఆయన్ని మీరు అక్కడ చూస్తారు.”—మత్త. 28:1-7; లూకా 23:56; 24:10.

2 ఆ స్త్రీలు సమాధి దగ్గర నుండి వెళ్లిపోతుంటే దారిలో యేసే స్వయంగా వాళ్లను కలిసి ఈ నిర్దేశం ఇచ్చాడు: “మీరు వెళ్లి నా సహోదరుల్ని గలిలయకు రమ్మని చెప్పండి, అక్కడ వాళ్లు నన్ను చూస్తారు.” (మత్త. 28:10) యేసు పునరుత్థానం అయ్యాక చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, తన శిష్యులతో ఒక కూటాన్ని ఏర్పాటు చేయడం. ఆ కూటంలో వాళ్లకు చాలా ముఖ్యమైన నిర్దేశాలు ఆయన ఇచ్చాడు.

యేసు ఎవరికి ఆజ్ఞాపించాడు?

యేసు పునరుత్థానం అయ్యాక తన అపొస్తలులను అలాగే గలిలయలో ఉన్న ఇతరుల్ని కలిసి, ‘వెళ్లి శిష్యుల్ని చేయండి’ అని ఆజ్ఞాపిస్తున్నాడు. (3-4 పేరాలు చూడండి)

3-4. మత్తయి 28:19, 20 వచనాల్లో ఉన్న ఆజ్ఞను యేసు కేవలం అపొస్తలులకు మాత్రమే ఇవ్వలేదని ఎలా చెప్పవచ్చు? (ముఖచిత్రం చూడండి.)

3 మత్తయి 28:16-20 చదవండి. యేసు ఏర్పాటు చేసిన ఆ కూటంలో, తన శిష్యులు మొదటి శతాబ్దం అంతటిలో చేయబోయే ముఖ్యమైన పని గురించి చెప్పాడు. ఆ పనిని నేడు మనం కూడా చేస్తున్నాం. యేసు ఇలా చెప్పాడు: “కాబట్టి, మీరు వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి; . . . నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.”

4 తన శిష్యులందరూ ప్రకటనా పని చేయాలని యేసు కోరుకుంటున్నాడు. ఆయన ఆ ఆజ్ఞను కేవలం తన 11 మంది నమ్మకమైన అపొస్తలులకు మాత్రమే ఇవ్వలేదు. అది మనకెలా తెలుసు? ఎలాగంటే, శిష్యుల్ని చేయమని యేసు ఆజ్ఞాపించినప్పుడు గలిలయ పర్వతం దగ్గర అపొస్తలులతోపాటు వేరేవాళ్లు కూడా ఉన్నారు. దేవదూత ఆ స్త్రీలకు ఏం చెప్పాడో గుర్తుచేసుకోండి: “ఆయన్ని మీరు అక్కడ [గలిలయలో] చూస్తారు.” దీన్నిబట్టి ఆ నమ్మకమైన స్త్రీలు కూడా అక్కడ ఉండివుంటారని చెప్పవచ్చు. వీళ్లూ, అపొస్తలులు మాత్రమేనా?

5. మొదటి కొరింథీయులు 15:6 లేఖనాన్ని బట్టి మనం ఏం అర్థంచేసుకోవచ్చు?

5 “ఆయన ఒకేసారి 500 కన్నా ఎక్కువమంది సోదరులకు కనిపించాడు” అని అపొస్తలుడైన పౌలు తెలియజేశాడు. (1 కొరిం. 15:6) పౌలు అలా చెప్పినప్పుడు ఆయన మనసులో బహుశా మత్తయి 28వ అధ్యాయంలో వివరించబడిన గలిలయ కూటమే ఉందని చెప్పడానికి సరైన కారణాలు ఉన్నాయి. ఏంటా కారణాలు? మొదటిది, యేసు శిష్యుల్లో చాలామంది గలిలయకు చెందినవాళ్లే. కాబట్టి అంతమంది ప్రజలు యెరూషలేములో ఒక ఇంట్లో కన్నా గలిలయలోని పర్వతం దగ్గర కలుసుకోవడమే సరైనది. రెండోది, పునరుత్థానమైన యేసు అంతకుముందే యెరూషలేములోని ఒక ఇంట్లో తన 11 మంది అపొస్తలులను కలిశాడు. ఒకవేళ ప్రకటించి, శిష్యుల్ని చేసే పనిని యేసు కేవలం అపొస్తలులకే అప్పగించాలనుకుంటే, దాన్ని ఆయన యెరూషలేములోనే చేసేవాడు. అంతేగానీ తన సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలను, మరితర శిష్యులను గలిలయకు రమ్మని చెప్పి ఉండేవాడుకాదు.—లూకా 24:33, 36.

6. యేసు ఆజ్ఞాపించిన పని మన కాలానికి కూడా వర్తిస్తుందని మత్తయి 28:20 బట్టి ఎలా చెప్పవచ్చు? నేడు ఆ పనిని దేవుని సేవకులు ఎంత విస్తృతంగా చేస్తున్నారు?

6 మూడో ముఖ్యమైన కారణాన్ని గమనించండి. శిష్యుల్ని చేయమనే ఆజ్ఞను యేసు కేవలం మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకే ఇవ్వలేదు. అలాగని ఎలా చెప్పవచ్చు? యేసు తన అనుచరులకు ఇస్తున్న నిర్దేశాల్ని ఈ మాటలతో ముగించాడు: “ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.” (మత్త. 28:20) ఆయన చెప్పినట్టే నేడు శిష్యుల్ని చేసే పని ముమ్మరంగా సాగుతోంది. ఒక్కసారి ఆలోచించండి! ప్రతీ సంవత్సరం దాదాపు మూడు లక్షలమంది ప్రజలు యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకుని, యేసుక్రీస్తు శిష్యులు అవుతున్నారు!

7. మనం ఇప్పుడు ఏం చర్చిస్తాం? ఎందుకు?

7 బైబిలు అధ్యయనం తీసుకుంటున్న చాలామంది ప్రగతి సాధించి, బాప్తిస్మం తీసుకుంటున్నారు. కానీ, మనతో క్రమంగా బైబిలు అధ్యయనం చేసే కొంతమంది శిష్యులు అయ్యేందుకు భయపడుతున్నారు. వాళ్లు బైబిలు అధ్యయనాన్ని ఆనందిస్తున్నారు గానీ బాప్తిస్మం తీసుకునేంత ప్రగతి సాధించట్లేదు. మన విద్యార్థులు, నేర్చుకున్న విషయాల్ని పాటించాలనీ క్రీస్తు శిష్యులు అవ్వాలనీ బైబిలు అధ్యయనాలు చేసే మనందరం ఆశిస్తాం. అయితే, మన విద్యార్థి హృదయాన్ని మనమెలా చేరుకోవచ్చో, ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా అతనికి ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. ఈ అంశాన్ని మనమెందుకు చర్చించుకోవాలి? ఎందుకంటే, మనం కొన్నిసార్లు ఒక బైబిలు అధ్యయనాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.

హృదయాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి

8. బైబిలు విద్యార్థుల హృదయాల్ని చేరుకోవడం ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

8 ప్రజలు తనను ప్రేమతో ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి, యెహోవా తమ మీద వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధ తీసుకుంటాడని, ఎంతో ప్రేమిస్తాడని మన విద్యార్థులు అర్థంచేసుకునేలా వాళ్లకు సహాయం చేయడమే మన లక్ష్యం. యెహోవా, “తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు” అని మన విద్యార్థులు గ్రహించేలా వాళ్లకు సహాయం చేయాలనుకుంటాం. (కీర్త. 68:5) తమ మీద దేవునికున్న ప్రేమను విద్యార్థులు అర్థంచేసుకుంటుండగా, వాళ్లు కూడా యెహోవాను ప్రేమించడం మొదలుపెడతారు. యెహోవాను ఒక ప్రేమగల తండ్రిగా చూడడం కొంతమంది బైబిలు విద్యార్థులకు కష్టంగా అనిపించవచ్చు. దానికి కారణం బహుశా వాళ్ల కన్నతండ్రి వాళ్లమీద ఎన్నడూ ప్రేమాప్యాయతలు చూపించి ఉండకపోవడం కావచ్చు. (2 తిమో. 3:1, 3) అలాంటి పరిస్థితిలో, మీరు బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు యెహోవాకున్న ఆకర్షణీయమైన లక్షణాల గురించి నొక్కి చెప్పండి. మీ బైబిలు విద్యార్థులు శాశ్వత జీవం సంపాదించుకోవడం మన ప్రేమగల దేవుని కోరికని వాళ్లు అర్థంచేసుకునేలా సహాయం చేయండి. ఆ విషయంలో వాళ్లకు సహాయం చేయడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనం ఏం చేయవచ్చు?

9-10. ఏ ప్రచురణలతో బైబిలు అధ్యయనాలు చేయాలి? ఎందుకు?

9 బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?అలాగే దేవుని ప్రేమలో నిలిచి ఉండండిపుస్తకాల్ని ఉపయోగించండి. మన బైబిలు విద్యార్థుల హృదయాన్ని చేరుకునేలా మనకు సహాయం చేయడానికి ఆ రెండు పుస్తకాలు ప్రత్యేకంగా తయారుచేయబడ్డాయి. ఉదాహరణకు, బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని మొదటి అధ్యాయంలో, దేవుడు మనల్ని పట్టించుకుంటాడా, లేదా ఆయన క్రూరుడా? ప్రజలు బాధలుపడుతుంటే దేవునికి ఎలా అనిపిస్తుంది? అలాగే మీరు యెహోవాకు స్నేహితులు అవ్వగలరా? అనే ప్రశ్నలకు జవాబులు చూస్తాం. మరి, దేవుని ప్రేమ పుస్తకం సంగతేంటి? బైబిలు సూత్రాలు పాటించడం వల్ల తన జీవితం ఎలా మెరుగౌతుందో, యెహోవాకు ఎలా సన్నిహితం కావచ్చో బైబిలు విద్యార్థి గ్రహించడానికి ఆ పుస్తకం సహాయం చేస్తుంది. ఒకవేళ మీరు ఈ రెండు పుస్తకాలతో వేరేవాళ్లకు అధ్యయనం చేసినా సరే, ఒక్కో విద్యార్థి అవసరాల్ని మనసులో ఉంచుకొని బైబిలు అధ్యయనం కోసం బాగా సిద్ధపడండి.

10 అయితే, మన బోధనా పనిముట్లలో లేని ఒక ప్రచురణలోని అంశాన్ని చర్చించడానికి విద్యార్థి ఆసక్తి చూపించవచ్చు. అలాంటి సందర్భాల్లో, ఆ ప్రచురణను సొంతగా చదువుకోమని ప్రోత్సహించవచ్చు. అలా బైబిలు అధ్యయనం కోసం సంస్థ తయారుచేసిన ప్రచురణల్ని అంటే పై పేరాలో ప్రస్తావించిన ప్రచురణల్ని ఉపయోగించి మీరు అధ్యయనాన్ని కొనసాగించవచ్చు.

బైబిలు అధ్యయనాన్ని ప్రార్థనతో మొదలుపెట్టండి (11వ పేరా చూడండి)

11. బైబిలు అధ్యయనాన్ని ప్రార్థనతో మొదలుపెట్టి, ప్రార్థనతో ముగించడం ఎప్పటినుండి చేయవచ్చు? ప్రార్థన గురించి మాట్లాడడానికి మీరేం చేయవచ్చు?

11 అధ్యయనాన్ని ప్రార్థనతో మొదలుపెట్టండి. బైబిలు అధ్యయనాన్ని ప్రార్థనతో మొదలుపెట్టి, ప్రార్థనతో ముగించడానికి వీలైనంత త్వరగా ప్రయత్నించండి. అధ్యయనాన్ని క్రమంగా చేయడం మొదలుపెట్టిన కొన్ని వారాలకే ఆ పద్ధతిని మొదలుపెట్టవచ్చు. దేవుని వాక్యాన్ని కేవలం ఆయన పవిత్రశక్తి సహాయంతోనే అర్థంచేసుకోగలమని మన విద్యార్థి గ్రహించేలా సహాయం చేయాలి. కొంతమంది సహోదరసహోదరీలు ప్రార్థన గురించి మాట్లాడే ముందు యాకోబు 1:5 చదువుతారు. అక్కడిలా ఉంది: “మీలో ఎవరికైనా తెలివి కొరవడితే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి.” ఆ తర్వాత విద్యార్థిని వాళ్లిలా అడుగుతారు, “తెలివి కోసం దేవున్ని ఎలా అడగవచ్చు?” దానికోసం మనం ప్రార్థించాలని బహుశా విద్యార్థి ఒప్పుకోవచ్చు.

12. మీ విద్యార్థి ప్రార్థనలో యెహోవాతో మనసువిప్పి మాట్లాడేలా సహాయం చేయడానికి కీర్తన 139:2-4 వచనాల్ని మీరెలా ఉపయోగిస్తారు?

12 ప్రార్థన ఎలా చేయాలో మీ విద్యార్థికి వివరించండి. మీ విద్యార్థి చేసే హృదయపూర్వక ప్రార్థనల్ని వినడానికి యెహోవా ఇష్టపడతాడని అతనికి వివరించండి. వ్యక్తిగతంగా మనం చేసుకునే ప్రార్థనలో, ఎవ్వరికీ చెప్పుకోలేని భావాల్ని కూడా యెహోవాతో మనసువిప్పి చెప్పుకోవచ్చని అతనికి వివరించండి. నిజానికి, మన హృదయంలో ఏముందో యెహోవాకు ముందే తెలుసు. (కీర్తన 139:2-4 చదవండి.) తప్పుడు ఆలోచనల్ని తీసేసుకోవడానికి, చెడు అలవాట్లను మానుకోవడానికి సహాయం చేయమని కూడా దేవున్ని అడగవచ్చని మన విద్యార్థిని ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు, మనం కొంతకాలంగా బైబిలు అధ్యయనం చేస్తున్న వ్యక్తికి ఒకానొక అన్యమత పండగంటే ఇష్టం అనుకుందాం. అది తప్పని అతనికి తెలుసు కానీ దాంట్లో కొన్ని విషయాల్ని అతను ఇష్టపడుతుండవచ్చు. అతని భావాల గురించి యెహోవాకు నిర్దిష్టంగా చెప్పమని ప్రోత్సహించండి; దేవుడు ప్రేమించేవాటిని ప్రేమించడానికి సహాయం చేయమని ప్రార్థనలో అర్థించమనండి.—కీర్త. 97:10.

మీ బైబిలు విద్యార్థిని కూటాలకు ఆహ్వానించండి (13వ పేరా చూడండి)

13. (ఎ) మన విద్యార్థులను కూటాలకు రమ్మని వీలైనంత త్వరగా ఎందుకు ఆహ్వానించాలి? (బి) కూటాలకు వచ్చినప్పుడు వాళ్లకు ఏదో కొత్త ప్రాంతానికి వచ్చినట్టు ఉండకూడదంటే మనం ఏం చేయవచ్చు?

13 కూటాలకు రమ్మని వీలైనంత త్వరగా మీ బైబిలు విద్యార్థిని ఆహ్వానించండి. క్రైస్తవ కూటాల్లో మీ విద్యార్థి వినే, గమనించే విషయాలు అతని హృదయాన్ని తాకి, ప్రగతి సాధించేలా అతనికి సహాయపడవచ్చు. రాజ్యమందిరం అంటే ఏంటి? అనే వీడియోను చూపించి, మీతోపాటు కూటాలకు రమ్మని సాదరంగా ఆహ్వానించండి. వీలైతే అతను కూటాలకు వచ్చేలా రవాణా ఏర్పాట్లు చేయవచ్చు. అప్పుడప్పుడు బైబిలు అధ్యయనానికి మీతోపాటు వేర్వేరు ప్రచారకులను కూడా తీసుకెళ్లడం మంచిది. ఆ విధంగా, మీ విద్యార్థికి సంఘంలో ఉన్న మిగతావాళ్లతో పరిచయం ఏర్పడుతుంది, ఆ తర్వాత కూటాలకు వచ్చినప్పుడు ఏదో కొత్త ప్రాంతానికి వచ్చినట్టు అనిపించదు.

ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా విద్యార్థులకు సహాయం చేయండి

14. విద్యార్థి ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా ఏది సహాయం చేస్తుంది?

14 విద్యార్థి ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా వాళ్లకు సహాయం చేయడమే మన లక్ష్యం. (ఎఫె 4:13) ఎవరైనా మనతో బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించారంటే, ఆ అధ్యయనం వల్ల తనకు ఉండే ప్రయోజనాల మీద ఆసక్తితోనే ఆ వ్యక్తి ఒప్పుకొని ఉండవచ్చు. కానీ యెహోవా మీద తనకున్న ప్రేమ పెరిగే కొద్దీ ఇతరులకు, అలాగే సంఘంలో వాళ్లకు ఎలా సహాయం చేయాలని అతను ఆలోచించడం మొదలుపెట్టవచ్చు. (మత్త. 22:37-39) సరైన సమయం వచ్చినప్పుడు, రాజ్య పనికి ఆర్థికంగా మద్దతిచ్చే అవకాశం ఉందనే విషయం చెప్పడానికి వెనకాడకండి.

సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలో మీ విద్యార్థికి నేర్పించండి (15వ పేరా చూడండి)

15. బైబిలు విద్యార్థికి ఏదైనా సమస్య వస్తే సరైనది చేసేలా మనం అతనికి ఎలా సహాయం చేయవచ్చు?

15 సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలో మీ విద్యార్థికి నేర్పించండి. ఉదాహరణకు, బాప్తిస్మం తీసుకోని మీ బైబిలు విద్యార్థి సంఘంలో ఎవరి వల్లయినా నొచ్చుకున్నాడని మీతో చెప్పాడనుకుందాం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని చెప్పకుండా, బైబిలు అతన్ని ఏం చేయమని చెప్తుందో వివరించండి. అతను కావాలనుకుంటే సహోదరుణ్ణి క్షమించి, విషయాన్ని అంతటితో వదిలేయవచ్చు. అతను అలా చేయలేకపోతుంటే నొప్పించిన సహోదరునితో మాట్లాడాలి. అతను దయగా, ప్రేమగా ‘సహోదరుణ్ణి సంపాదించుకోవాలనే’ లక్ష్యంతో మాట్లాడాలి. (మత్తయి 18:15 పోల్చండి.) అతనెలా మాట్లాడాలో సిద్ధపడడానికి మీ విద్యార్థికి సహాయం చేయండి. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే సలహాల గురించి తెలుసుకోవడానికి JW లైబ్రరీ యాప్‌, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం, అలాగే jw.org® వెబ్‌సైట్‌ని ఎలా వాడాలో చూపించండి. బాప్తిస్మం తీసుకోకముందు అతనికి ఎంత ఎక్కువ శిక్షణ దొరికితే, బాప్తిస్మం తర్వాత అంతెక్కువగా సంఘంలో ఇతరులతో మంచి సంబంధాలను కలిగివుంటాడు.

16. మీతోపాటు బైబిలు అధ్యయనానికి ఇతర ప్రచారకులను ఆహ్వానిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?

16 మీ బైబిలు అధ్యయనానికి సంఘంలోని ఇతరులను, ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి తీసుకెళ్లండి. ఎందుకు? ఇంతకు ముందు చెప్పిన కారణాలతో పాటు, మీ విద్యార్థికి మీరు సహాయం చేయలేని రంగాల్లో ఇతర ప్రచారకులు సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, మీ విద్యార్థి పొగతాగడం మానుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడనుకోండి. అలాంటప్పుడు, బహుశా పొగతాగే అలవాటును మానుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమై, చివరికి ఆ బలహీనతను అధిగమించిన ఓ సహోదరుణ్ణి మీరు అధ్యయనానికి తీసుకెళ్లవచ్చు. ఆయన మీ విద్యార్థికి సరిగ్గా కావాల్సిన మంచి సలహాలను ఇవ్వొచ్చు. అనుభవంగల సహోదరుని ముందు అధ్యయనం చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే, ఆ సందర్భంలో ఆయన్నే బైబిలు అధ్యయనం చేయమని ఆహ్వానించండి. మీ బైబిలు అధ్యయనానికి వేరేవాళ్లను ఆహ్వానిస్తే, వాళ్ల అనుభవం నుండి మీ విద్యార్థి ప్రయోజనం పొందుతాడు. విద్యార్థి ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా వాళ్లకు సహాయం చేయడమే మన లక్ష్యమని గుర్తుంచుకోండి.

ఒక బైబిలు అధ్యయనాన్ని ఆపేయాలా వద్దా?

17-18. మీరు ఒక అధ్యయనాన్ని ఆపాలని నిర్ణయించుకున్నప్పుడు ఏ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి?

17 మీ విద్యార్థి తన జీవితంలో మార్పులు చేసుకోకపోతే, కొంతకాలం తర్వాత మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను అధ్యయనం ఆపాలా?’ ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు ఆ వ్యక్తి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొంతమంది ప్రగతి సాధించడానికి వేరే వాళ్లకన్నా ఎక్కువ సమయం తీసుకుంటారు. మీరిలా ప్రశ్నించుకోండి: ‘నా విద్యార్థి తన పరిస్థితికి తగ్గట్టు అభివృద్ధి సాధిస్తున్నాడా?’ ‘తను నేర్చుకునే విషయాలు “పాటిస్తున్నాడా?”’ (మత్త. 28:20) శిష్యుడవ్వడానికి ఒక విద్యార్థికి ఎక్కువకాలం పట్టవచ్చు, కానీ అతను తన జీవితంలో మెల్లమెల్లగా మార్పులు చేసుకోవాలి.

18 మనం కొంతకాలంగా అధ్యయనం చేస్తున్నా, ఒక విద్యార్థి ఆ అధ్యయనానికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే మనమేం చేయాలి? ఈ సన్నివేశాన్ని పరిశీలించండి: మీ విద్యార్థి బైబిలు బోధిస్తోంది పుస్తకం పూర్తి చేసి, దేవుని ప్రేమ అనే పుస్తకాన్ని మొదలుపెట్టినప్పటికీ అతను సంఘ కూటాలకు ఒక్కసారి కూడా హాజరవ్వలేదు; ఆఖరికి జ్ఞాపకార్థ ఆచరణకు కూడా హాజరవ్వలేదు! చిన్నచిన్న కారణాలకు అధ్యయనాన్ని వాయిదా వేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మొహమాటం లేకుండా విద్యార్థితో మాట్లాడాలి. *

19. బైబిలు అధ్యయనం పై మెప్పుదల చూపించని వ్యక్తితో మీరు ఏం మాట్లాడవచ్చు? మీరు ఏ విషయం గురించి ఆలోచించాలి?

19 మీరు ఇలా అడగడం ద్వారా మొదలుపెట్టవచ్చు: ‘యెహోవాసాక్షి అవ్వడానికి మీకున్న పెద్ద సవాలు ఏంటని మీకు అనిపిస్తుంది?’ విద్యార్థి ఇలా జవాబివ్వొచ్చు: ‘బైబిలు అధ్యయనం చేయడానికి నాకు అభ్యంతరం లేదు, కాకపోతే నేను ఎప్పటికీ యెహోవాసాక్షిని అవ్వను!’ కొంతకాలంగా అధ్యయనం చేసిన తర్వాత విద్యార్థి వైఖరి అలా ఉంటే, అధ్యయనం కొనసాగించడంలో ఏమైనా అర్థముందా? మరోవైపు, మీ విద్యార్థి మొట్టమొదటిసారి తను ఎందుకు వెనకాడుతున్నాడో చెప్పొచ్చు. ఉదాహరణకు, ఇంటింటి పరిచర్య చేయడం తనవల్ల కాదని అతను అనుకుంటుండవచ్చు. ఇప్పుడు అతని మనసులోని విషయాలు తెలుసుకున్నాక, అతనికి మీరు ఇంకా బాగా సహాయం చేయగలుగుతారు.

ప్రగతి సాధించని వాళ్లతో బైబిలు అధ్యయనం చేయడానికి సమయం వెచ్చించకండి (20వ పేరా చూడండి)

20. ఒక బైబిలు అధ్యయనాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అపొస్తలుల కార్యాలు 13:48 సహాయం చేస్తుందని ఎలా చెప్పవచ్చు?

20 విచారకరంగా, కొంతమంది బైబిలు విద్యార్థులు యెహెజ్కేలు కాలంలోని ఇశ్రాయేలీయుల్లా ఉన్నారు. అప్పటి ఇశ్రాయేలీయుల గురించి యెహోవా యెహెజ్కేలుకు ఇలా చెప్పాడు: “నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.” (యెహె. 33:32) మన విద్యార్థితో బైబిలు అధ్యయనం చేయడం ఆపేస్తామని చెప్పడం మనకు కష్టంగా ఉండవచ్చు. కానీ “కొంచెం సమయమే మిగిలి ఉంది.” (1 కొరిం. 7:29) ప్రగతి సాధించని బైబిలు అధ్యయనాల కోసం సమయం వెచ్చించే బదులు, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉందని చూపించేవాళ్ల కోసం వెదకాలి.—అపొస్తలుల కార్యాలు 13:48 చదవండి.

సహాయం కోసం ప్రార్థించే ఇతరులు మీ క్షేత్రంలో ఉండవచ్చు (20వ పేరా చూడండి)

21. 2020 వార్షిక వచనం ఏంటి? అది ఎందుకు సరైనది?

21 2020వ సంవత్సరంలో, శిష్యుల్ని చేసే మన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం మీద దృష్టి పెట్టేలా వార్షిక వచనం మనకు సహాయం చేస్తుంది. గలిలయ పర్వతం దగ్గర యేసు నిర్వహించిన చారిత్రాత్మక కూటంలో ఈ ముఖ్యమైన మాటలు ఉన్నాయి: ‘కాబట్టి, మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి, వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.’మత్త. 28:19.

శిష్యుల్ని చేసే మన నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడం మీద అలాగే మన బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయడం మీద దృష్టి పెట్టాలని నిశ్చయించుకుందాం (21వ పేరా చూడండి)

పాట 70 అర్హుల్ని వెదకండి

^ పేరా 5 ‘శిష్యుల్ని చేయమని’ 2020 వార్షిక వచనం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ ఆజ్ఞను యెహోవా సేవకులందరూ పాటించాలి. మన బైబిలు విద్యార్థులు క్రీస్తు శిష్యులయ్యేలా వాళ్ల హృదయాల్ని మనమెలా చేరుకోవచ్చు? వాళ్లు యెహోవాకు మరింత దగ్గరయ్యేలా మనమెలా సహాయం చేయవచ్చు? అనే ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం. అంతేకాదు, ఒక బైబిలు అధ్యయనాన్ని ఆపేయాలా వద్దా అని ఎలా నిర్ణయించుకోవచ్చో చర్చిస్తాం.

^ పేరా 18 JW బ్రాడ్‌కాస్టింగ్‌లో వచ్చిన, ప్రగతి సాధించని బైబిలు అధ్యయనాలు ఆపేయడం అనే వీడియో చూడండి.