కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 7

మన తండ్రైన యెహోవాను మనం ఎంతో ప్రేమిస్తాం

మన తండ్రైన యెహోవాను మనం ఎంతో ప్రేమిస్తాం

“దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం.”—1 యోహా. 4:19.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. మనం తన కుటుంబ సభ్యుల్లో ఒకరం అవ్వడానికి యెహోవా ఎందుకు ఏర్పాటు చేశాడు? ఆ ఏర్పాటు ఏంటి?

యెహోవా మనల్ని తన ఆరాధికుల కుటుంబంలో భాగమవ్వమని ఆహ్వానిస్తున్నాడు. అదెంత అద్భుతమైన ఆహ్వానమో కదా! ఆ కుటుంబ సభ్యులు తమను తాము దేవునికి సమర్పించుకున్నారు; ఆయన కుమారుని విమోచనా క్రయధనంపై విశ్వాసం ఉంచారు. మనది సంతోషకరమైన కుటుంబం. ఇప్పుడు మనం అర్థవంతమైన జీవితాన్ని ఆనందిస్తున్నాం; పరలోకంలో గానీ, భూమ్మీద గానీ శాశ్వతంగా జీవించే నిరీక్షణ ఉన్నందుకు మనం సంతోషిస్తున్నాం.

2 యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం తన కుటుంబ సభ్యుల్లో ఒకరం అవ్వడానికి ఓ ఏర్పాటు చేశాడు. కానీ ఆ ఏర్పాటు కోసం ఆయన చాలా గొప్ప త్యాగం చేయాల్సివచ్చింది. (యోహా. 3:16) దేవుడు మనల్ని “ఎంతో ఖరీదు పెట్టి కొన్నాడు.” (1 కొరిం. 6:20) విమోచనా క్రయధనం ద్వారా తనతో సన్నిహిత సంబంధం కలిగివుండడాన్ని యెహోవా సాధ్యపర్చాడు. విశ్వంలో అత్యంత గొప్ప వ్యక్తిని తండ్రి అని పిలిచే గౌరవం మనకు దక్కింది. అంతేకాదు, మనం ముందటి ఆర్టికల్‌లో పరిశీలించినట్టు యెహోవా లాంటి తండ్రి ఇంకెవ్వరూ లేరు.

3. మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? (“ యెహోవా నన్ను గమనిస్తాడా?” అనే బాక్సు కూడా చూడండి.)

3 ఒక బైబిలు రచయితలా, మనం ఇలా అడగవచ్చు: “యెహోవా నాకు చేసిన మంచి అంతటికీ నేను ఆయనకు ఏమి ఇవ్వను?” (కీర్త. 116:12) నిజానికి, మన పరలోక తండ్రి మనకు ఇచ్చినదాన్ని ఆయనకు ఎప్పుడూ తిరిగి చెల్లించలేం. కానీ, ఆయన ప్రేమను బట్టి మనం ఆయన్ని తిరిగి ప్రేమించగలం. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం.” (1 యోహా. 4:19) మన పరలోక తండ్రిని మనం ప్రేమిస్తున్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?

యెహోవాకు సన్నిహితంగా ఉండండి

మనం ఆయనకు ప్రార్థనలో సన్నిహితం అవ్వడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, ఆయన్ని ప్రేమించేలా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన పరలోక తండ్రైన యెహోవాను ఎంతో ప్రేమిస్తున్నామని చూపిస్తాం (4-14 పేరాలు చూడండి)

4. యాకోబు 4:8 ప్రకారం, యెహోవాకు సన్నిహితం అవ్వడానికి ఎందుకు కృషి చేయాలి?

4 మనం తనకు సన్నిహితంగా ఉండాలని, ఆయనతో మాట్లాడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (యాకోబు 4:8 చదవండి.) ఆయన మనల్ని ‘పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండమని’ ప్రోత్సహిస్తున్నాడు, మనం ఏ సమయంలో ప్రార్థించినా ఆయన వింటాడు. (రోమా. 12:12) మన ప్రార్థనలు వినలేనంత తీరిక గానీ, ఓపిక గానీ లేకుండా ఆయన ఎప్పుడూ ఉండడు. ఆయన వాక్యమైన బైబిల్ని, దాన్ని అర్థంచేసుకోవడానికి సహాయపడే ప్రచురణల్ని చదవడం ద్వారా మనం ఆయన చెప్పేది వింటాం. సంఘ కూటాల్లో జరిగే వాటిమీద శ్రద్ధ పెట్టడం ద్వారా కూడా ఆయన చెప్పేది వింటాం. మంచి సంభాషణ పిల్లలు తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుందో, క్రమంగా యెహోవాతో మాట్లాడడం మనం ఆయనకు సన్నిహితంగా ఉండడానికి సహాయం చేస్తుంది.

5వ పేరా చూడండి

5. మన ప్రార్థనల్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు?

5 యెహోవాకు మీరు చేసే ప్రార్థనలు ఎలా ఉంటున్నాయో ఆలోచించండి. ప్రార్థనలో ఆయన ముందు మన హృదయాల్ని కుమ్మరించమని యెహోవా కోరుతున్నాడు. (కీర్త. 62:8) మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా ప్రార్థనలు నామమాత్రంగా, మళ్లీమళ్లీ ప్రింట్‌ చేసిన సమాచారంలా ఉంటున్నాయా? లేదా, మనస్ఫూర్తిగా చేత్తో రాసిన ఉత్తరాల్లా ఉంటున్నాయా?’ యెహోవాను మీరు ఎంతో ప్రేమిస్తారనడంలో సందేహం లేదు; ఆయనతో మీ సంబంధాన్ని పటిష్ఠంగా ఉంచుకోవాలని మీరు కోరుకుంటారు. దానికోసం మీరు ఆయనకు క్రమంగా ప్రార్థించాలి. ప్రార్థనలో దాపరికం లేకుండా మీ భావాల్ని వ్యక్తం చేయండి. మీ సంతోషాల్ని, బాధల్ని ఆయనతో పంచుకోండి. సహాయం కోసం మీరు ఆయన్ని సమీపించవచ్చనే నమ్మకంతో ఉండండి.

6. మన పరలోక తండ్రికి సన్నిహితంగా ఉండాలంటే మనం ఏం చేయాలి?

6 మన పరలోక తండ్రికి సన్నిహితంగా ఉండాలంటే ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. మనం ఈ మాటలు రాసిన కీర్తనకర్తతో సమ్మతిస్తాం: “యెహోవా, నా దేవా, నువ్వు మా కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేశావు, మా విషయంలో నీకున్న ఆలోచనలు ఎన్నెన్నో; నీకు సాటి ఎవరూ లేరు; నేను వాటి గురించి వివరించి చెప్పాలని ప్రయత్నిస్తే, అవి నేను లెక్కించలేనన్ని ఉంటాయి!” (కీర్త. 40:5) మనం మన కృతజ్ఞతా భావాన్ని మనసులోనే ఉంచుకోము గానీ, యెహోవా పట్ల మన మెప్పుదలను మాటల్లో, చేతల్లో వ్యక్తం చేస్తాం. అలా చేస్తే మన చుట్టూ ఉన్న చాలామందికి మనం వేరుగా ఉంటాం. నేడు లోకంలో ఉన్న చాలామంది, దేవుడు తమకు చేసేవాటన్నిటి పట్ల మెప్పుదల చూపించట్లేదు. నిజానికి మనం ‘చివరి రోజుల్లో’ జీవిస్తున్నామని అనడానికి ఒక సూచన ఏమిటంటే, ప్రజలు కృతజ్ఞత లేనివాళ్లుగా ఉండడం. (2 తిమో. 3:1, 2) మనం ఎన్నడూ అలాంటి వైఖరిని అలవర్చుకోకూడదు!

7. మనం ఏం చేయాలని యెహోవా కోరుతున్నాడు? ఎందుకు?

7 తమ పిల్లలు కీచులాడుకోకుండా స్నేహితుల్లా కలిసివుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అదేవిధంగా, యెహోవా కూడా తన పిల్లలు స్నేహితుల్లా ఉండాలని కోరుకుంటున్నాడు. మనకు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మనం నిజ క్రైస్తవులమనే గుర్తింపునిస్తుంది. (యోహా. 13:35) మనం ఈ మాటలు రాసిన కీర్తనకర్తతో సమ్మతిస్తాం: “సహోదరులు ఐక్యంగా కలిసిమెలిసి జీవించడం ఎంత మంచిది! ఎంత మనోహరమైనది!” (కీర్త. 133:1) మన సహోదరసహోదరీలను ప్రేమించినప్పుడు మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఆయనకు చూపిస్తాం. (1 యోహా. 4:20) ‘ఒకరితో ఒకరు దయగా మెలుగుతూ, కనికరం చూపించే’ సహోదరసహోదరీలు ఉన్న కుటుంబంలో భాగంగా ఉండడం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా!—ఎఫె. 4:32.

విధేయత చూపించడం ద్వారా మీ ప్రేమను చూపించండి

8వ పేరా చూడండి

8. మొదటి యోహాను 5:3 ప్రకారం, మనం యెహోవాకు విధేయత చూపించడానికి ప్రధాన కారణం ఏంటి?

8 పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలని యెహోవా కోరుతున్నాడు. అంతేకాదు, మనం కూడా ఆయనకు లోబడాలని కోరుతున్నాడు. (ఎఫె. 6:1) ఆయన మన సృష్టికర్త, మన పోషకుడు, తల్లిదండ్రులందర్లోకి జ్ఞానవంతుడు కాబట్టి మన విధేయతకు అర్హుడు. కానీ మనం యెహోవాకు లోబడడానికి ప్రధాన కారణం, మనం ఆయన్ని ప్రేమించడం. (1 యోహాను 5:3 చదవండి.) యెహోవాకు విధేయత చూపించడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఆ విషయంలో మనల్ని బలవంతం చేయడు. యెహోవా మనకు స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చాడు, కాబట్టి మనం ఆయనమీద ప్రేమతో విధేయత చూపించాలని నిర్ణయించుకుంటే ఆయన సంతోషిస్తాడు.

9-10. దేవుని ప్రమాణాలను తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

9 తమ పిల్లలు సురక్షితంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకే వాళ్లు తమ పిల్లల ప్రయోజనం కోసం కొన్ని నియమాలు పెడతారు. పిల్లలు ఆ నియమాలను పాటించినప్పుడు వాళ్లు తమ తల్లిదండ్రుల మీద నమ్మకం, గౌరవం ఉన్నాయని చూపిస్తారు. కాబట్టి మన పరలోక తండ్రి ప్రమాణాలను తెలుసుకొని, వాటిని పాటించడం ఇంకెంత ప్రాముఖ్యమో ఆలోచించండి. మనం అలా చేస్తే, యెహోవాను ప్రేమిస్తున్నామని, గౌరవిస్తున్నామని చూపిస్తాం. అంతేకాదు మనం కూడా ప్రయోజనం పొందుతాం. (యెష. 48:17, 18) దానికి భిన్నంగా యెహోవాను, ఆయన ప్రమాణాలను తిరస్కరించేవాళ్లు చివరికి తమను తాము గాయపర్చుకుంటారు.—గల. 6:7, 8.

10 మనం యెహోవాకు ఇష్టమైన విధంగా జీవిస్తే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కలిగే హాని నుండి కాపాడబడతాం. మనకు ఏది మంచిదో యెహోవాకు తెలుసు. అమెరికాలో ఉంటున్న అరోరా అనే సహోదరి ఇలా అంటుంది: “యెహోవాకు విధేయత చూపిస్తే జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు.” అది మనందరి విషయంలో నిజం. యెహోవా ప్రేమగల నిర్దేశం నుండి మీరెలా ప్రయోజనం పొందారు?

11. ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?

11 ప్రార్థించడం వల్ల మనం ఎల్లవేళలా, కష్టమనిపించిన సందర్భాల్లో కూడా విధేయత చూపిస్తాం. కొన్నిసార్లు యెహోవాకు విధేయత చూపించడం మనకు కష్టం కావచ్చు, కానీ పాపం చేయడానికి మొగ్గుచూపే మనస్తత్వంతో మనం ఎప్పుడూ పోరాడుతూ ఉండాలి. కీర్తనకర్త దేవున్ని ఇలా అర్థించాడు: “నీకు లోబడాలనే కోరికను నాలో రేపు.” (కీర్త. 51:12) డెనిస్‌ అనే పయినీరు సహోదరి ఇలా చెప్తుంది, “యెహోవా ఆజ్ఞల్లో ఏదైనా పాటించడం నాకు కష్టంగా అనిపించినప్పుడు, సరైనది చేయడానికి బలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాను.” అలాంటి విన్నపాలకు యెహోవా ఎప్పుడూ జవాబిస్తాడనే నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు.—లూకా 11:9-13.

మన తండ్రిని ప్రేమించడం ఇతరులకు నేర్పించండి

12. ఎఫెసీయులు 5:1 ప్రకారం, మనం ఏం చేయాలి?

12 ఎఫెసీయులు 5:1 చదవండి. మనం ‘దేవునికి ప్రియమైన పిల్లలం’ కాబట్టి ఆయన్ని అనుకరించడానికి శాయశక్తులా కృషిచేస్తాం. ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ప్రేమగా, దయగా, క్షమించేవారిగా ఉండడం ద్వారా ఆయన లక్షణాలను అనుకరిస్తాం. దేవుడంటే తెలియనివాళ్లు మన మంచి ప్రవర్తన చూసి, ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలని కోరుకోవచ్చు. (1 పేతు. 2:12) యెహోవా మనతో వ్యవహరిస్తున్నట్టు క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించడానికి ప్రయత్నించాలి. వాళ్లు అలా చేస్తే, పిల్లలు తమంతట తాము మన ప్రేమగల తండ్రితో స్నేహాన్ని ఏర్పర్చుకోవచ్చు.

13వ పేరా చూడండి

13. మనకు ధైర్యం రావాలంటే వేటి మీద దృష్టి పెట్టాలి?

13 చిన్నపిల్లలు తమ తండ్రులను చూసి గర్వపడుతుంటారు, వాళ్ల గురించి ఇష్టంగా మాట్లాడతారు. అలాగే మన పరలోక తండ్రియైన యెహోవాను బట్టి మనం గర్వపడతాం, ఆయన గురించి ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడతాం. రాజైన దావీదులా మనం కూడా భావిస్తాం, ఆయనిలా అన్నాడు: “నేను యెహోవాను బట్టి గొప్పలు చెప్పుకుంటాను.” (కీర్త. 34:2) ఒకవేళ మనం బిడియస్థులమైతే అప్పుడేంటి? మనకు ధైర్యం ఎలా వస్తుంది? మనం యెహోవాను ఎంత సంతోషపెట్టవచ్చు, ఇతరులు ఆయన గురించి నేర్చుకుంటే ఎంత ప్రయోజనం పొందుతారు అనే వాటిమీద దృష్టి పెడితే మనకు ధైర్యం వస్తుంది. మనకు అవసరమైన ధైర్యాన్ని యెహోవా ఇస్తాడు. మొదటి శతాబ్దపు సహోదరులకు ధైర్యం రావడానికి ఆయన సహాయం చేశాడు. మనకూ సహాయం చేస్తాడు.—1 థెస్స. 2:2.

14. శిష్యులను చేసే పని ముఖ్యమని చెప్పడానికి కొన్ని కారణాలేమిటి?

14 యెహోవా పక్షపాతి కాడు. ఇతరుల నేపథ్యాన్ని పట్టించుకోకుండా మనం వాళ్ల మీద ప్రేమ చూపించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. (అపొ. 10:34, 35) ఇతరుల మీద ప్రేమ చూపించే ఒక శ్రేష్ఠమైన మార్గమేమిటంటే, వాళ్లకు మంచివార్త ప్రకటించడం. (మత్త. 28:19, 20) ఈ పని ఏం సాధిస్తుంది? మంచివార్త వినేవాళ్లు తమ జీవితాలను ఇప్పుడు మెరుగుపర్చుకోవచ్చు, భవిష్యత్తులో శాశ్వతంగా జీవించే నిరీక్షణను పొందవచ్చు.—1 తిమో. 4:16.

మన తండ్రిని ప్రేమిస్తూ సంతోషంగా ఉండండి

15-16. మనం సంతోషంగా ఉండడానికి కారణాలేమిటి?

15 యెహోవా ఒక ప్రేమగల తండ్రి, కాబట్టి తన కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. (యెష. 65:14) ఇప్పుడు కష్టాలు వచ్చినా మనం సంతోషంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, మన పరలోక తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడనే నమ్మకం మనకుంది. దేవుని వాక్యమైన బైబిల్లోని ఖచ్చితమైన జ్ఞానం మనకు ఉంది. (యిర్మీ. 15:16) యెహోవాను, ఆయన ఉన్నతమైన ప్రమాణాల్ని అలాగే ఒకరినొకరు ప్రేమించే ప్రజలతో రూపుదిద్దుకున్న ఒక విశేషమైన కుటుంబంలో మనం భాగం.—కీర్త. 106:4, 5.

16 భవిష్యత్తులో మన జీవితం ఇంకా మెరుగౌతుందనే ఖచ్చితమైన నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనం సంతోషంగా ఉండవచ్చు. త్వరలో యెహోవా తన రాజ్యం ద్వారా దుష్టత్వాన్ని అంతా తీసేసి భూమిని పరదైసులా మారుస్తాడు. చనిపోయినవాళ్లు తిరిగి బ్రతికించబడి తమ ప్రియమైనవాళ్లను మళ్లీ కలుస్తారనే అద్భుతమైన నిరీక్షణ కూడా మనకుంది. (యోహా. 5:28, 29) అదెంత సంతోషకరమైన క్షణమో కదా! అన్నిటికన్నా ముఖ్యంగా అటు పరలోకంలో, ఇటు భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరు త్వరలోనే మన ప్రేమగల తండ్రికి దక్కాల్సిన గౌరవాన్ని, స్తుతుల్ని, భక్తిని చెల్లిస్తారు.

పాట 12 యెహోవా గొప్ప దేవుడు

^ పేరా 5 మన తండ్రియైన యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని, మనల్ని తన ఆరాధికుల కుటుంబంలోకి తీసుకొచ్చాడని మనకు తెలుసు. అందుకే మనం కూడా ఆయన్ని ప్రేమిస్తాం. మన శ్రద్ధగల తండ్రిని ప్రేమిస్తున్నామని మనమెలా చూపించవచ్చు? మనం చేయగలిగే కొన్ని పనుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.