కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 8

ఈర్ష్యతో పోరాడుతూ శాంతిని నెలకొల్పండి

ఈర్ష్యతో పోరాడుతూ శాంతిని నెలకొల్పండి

“ఇతరులతో శాంతిగా ఉండడానికి, ఒకరినొకరం బలపర్చుకోవడానికి చేయగలిగినదంతా చేద్దాం.”—రోమా. 14:19.

పాట 113 మనకు అనుగ్రహించబడిన శాంతి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. ఈర్ష్య యోసేపు కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపించింది?

యాకోబు తన కొడుకులందర్నీ ప్రేమించాడు, కానీ తన 17 ఏళ్ల కొడుకు యోసేపు అంటే ఆయనకు ప్రత్యేకమైన మమకారం. దానికి యోసేపు అన్నలు ఎలా స్పందించారు? వాళ్లు యోసేపును చూసి ఈర్ష్యపడ్డారు; దానివల్ల అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. కానీ ఇందులో యోసేపు తప్పేమీ లేదు. అయినా సరే వాళ్లు యోసేపును దాసునిగా అమ్మేసి, ఒక క్రూర జంతువు తన ముద్దుల కొడుకును చంపేసిందని తమ తండ్రితో అబద్ధమాడారు. ఈర్ష్య వల్ల వాళ్లు తమ కుటుంబ శాంతికి భంగం కలిగించారు, వాళ్ల నాన్న గుండె బద్దలు చేశారు.—ఆది. 37:3, 4, 27-34.

2. గలతీయులు 5:19-21 ప్రకారం ఈర్ష్య ఎందుకు ప్రమాదకరమైనది?

2 లేఖనాల్లో, ఈర్ష్య * మరణానికి దారితీసే “శరీర కార్యాల” చిట్టాలో ఒకటిగా పేర్కొనబడింది. దానివల్ల ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అర్హత కోల్పోతాడు. (గలతీయులు 5:19-21 చదవండి.) ఈర్ష్య తరచూ శత్రుత్వానికి, గొడవలకు, విపరీతమైన కోపం వంటి విషపూరితమైన లక్షణాలకు దారితీస్తుంది.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

3 ఈర్ష్య సంబంధాలను ఎలా పాడుచేయగలదో, కుటుంబంలో శాంతిని ఎలా తీసేయగలదో యోసేపు అన్నల ఉదాహరణ చూపిస్తోంది. యోసేపు అన్నలు చేసినట్టు మనం ఎప్పుడూ చేయకపోయినా మనందరికీ అపరిపూర్ణమైన, మోసపూరితమైన హృదయం ఉంది. (యిర్మీ. 17:9) అందుకే మనం కొన్నిసార్లు ఇతరుల మీద ఈర్ష్య పడే ప్రమాదముంది. ఏ కారణాల వల్ల మన హృదయంలో ఈర్ష్య వేళ్లూనుకునే అవకాశముందో గుర్తించడానికి బైబిల్లోని కొన్ని హెచ్చరికా ఉదాహరణల్ని పరిశీలిద్దాం. ఆ తర్వాత ఈర్ష్య అనే లక్షణంతో పోరాడడానికి, శాంతిని నెలకొల్పడానికి మనం చేయాల్సిన కొన్ని పనుల్ని పరిశీలిద్దాం.

ఈర్ష్యకు కారణాలేమిటి?

4. ఇస్సాకును చూసి ఫిలిష్తీయులు ఎందుకు ఈర్ష్యపడ్డారు?

4 ధనవంతుల్ని చూసినప్పుడు. ఇస్సాకు ధనవంతుడు. ఆయన సంపదను చూసి ఫిలిష్తీయులు ఆయనపై ఈర్ష్యపడ్డారు. (ఆది. 26:12-14) ఇస్సాకు పశువులు తాగడానికి నీళ్లు లేకుండా వాళ్లు బావుల్ని పూడ్చేశారు. (ఆది. 26:15, 16, 27) ఫిలిష్తీయుల్లా నేడు కూడా కొంతమంది తమకన్నా ధనవంతుల్ని చూస్తే ఈర్ష్యపడుతుంటారు. వాళ్లు అవతలివాళ్లది తమకు కావాలని కోరుకోవడమే కాదు వాళ్లకున్నది వాళ్లకు దక్కకుండా కూడా చేయాలనుకుంటారు.

5. మతనాయకులు యేసు మీద ఎందుకు ఈర్ష్యపడ్డారు?

5 ఇతరులు ఎవరినైనా ఇష్టపడినప్పుడు. సామాన్య ప్రజలు యేసును చాలా ఇష్టపడడం చూసి యూదా మతనాయకులు ఆయనమీద ఈర్ష్యపడ్డారు. (మత్త. 7:28, 29) యేసు దేవుని ప్రతినిధి, ఆయన సత్యాన్ని బోధిస్తున్నాడు. అయినా సరే మతనాయకులు యేసును అప్రతిష్ఠపాలు చేయడానికి ఆయన గురించి హానికరమైన అబద్ధాలు, పుకార్లు వ్యాప్తిచేశారు. (మార్కు 15:10; యోహా. 11:47, 48; 12:12, 13, 19) ఈ వృత్తాంతం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక వ్యక్తికి ఉన్న మంచి లక్షణాలనుబట్టి సంఘంలోని సహోదరసహోదరీలు అతన్ని ఇష్టపడితే, అది చూసి మనం ఈర్ష్యపడకుండా జాగ్రత్తపడాలి. దానికి బదులు ఆ సహోదరసహోదరీల్ని ఆదర్శంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.—1 కొరిం. 11:1; 3 యోహా. 11.

6. దియొత్రెఫే ఈర్ష్యపడ్డాడని ఎలా చూపించాడు?

6 ఒకవ్యక్తి సేవావకాశాలు పొందినప్పుడు. మొదటి శతాబ్దంలో దియొత్రెఫే సంఘంలో నాయకత్వం వహించేవాళ్లను చూసి ఈర్ష్యపడ్డాడు. సంఘంలో అందర్లోకి తాను ‘ప్రముఖుడిగా’ ఉండాలని కోరుకున్నాడు. అందుకే అపొస్తలుడైన యోహాను పేరును, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న సహోదరుల పేరును పాడుచేయడానికి వాళ్ల గురించి హానికరమైన పుకార్లు వ్యాప్తిచేశాడు. (3 యోహా. 9, 10) మనం దియొత్రెఫే అంత దిగజారకపోయినా, మనం కోరుకున్న సేవావకాశం తోటి క్రైస్తవుడికి వస్తే అతన్ని చూసి మనం కూడా ఈర్ష్యపడే అవకాశముంది. ముఖ్యంగా మనం ఆ సేవావకాశానికి అర్హులమని లేదా దాన్ని అతనికన్నా మెరుగ్గా చేయగలమని అనుకున్నప్పుడు ఈర్ష్యపడే అవకాశముంది.

మన హృదయం నేల లాంటిది, మన మంచి లక్షణాలు అందమైన పూలలాంటివి. కానీ ఈర్ష్య విషపూరితమైన కలుపు మొక్కలాంటిది. ప్రేమ, కనికరం, దయ వంటి మంచి లక్షణాలను పెరగనివ్వకుండా ఈర్ష్య అణచివేస్తుంది (7వ పేరా చూడండి)

7. ఈర్ష్య మనపై ఎలాంటి ప్రభావం చూపించగలదు?

7 ఈర్ష్య అనేది విషపూరితమైన కలుపు మొక్క లాంటిది. ఒక్కసారి అది హృదయంలో మొలకెత్తిందంటే దాన్ని నాశనం చేయడం కష్టం. అసూయ, గర్వం, స్వార్థం వంటి చెడు లక్షణాలు కూడా ఈర్ష్యను పెంచవచ్చు. ప్రేమ, కనికరం, దయ వంటి మంచి లక్షణాలను వృద్ధికాకుండా ఈర్ష్య అణచివేస్తుంది. మన హృదయంలో ఈర్ష్య మొలకెత్తిందని గమనించిన వెంటనే దాన్ని పెరికివేయాలి. ఈర్ష్యతో మనమెలా పోరాడవచ్చు?

వినయాన్ని, సంతృప్తిని అలవర్చుకోండి

కలుపుమొక్క లాంటి ఈర్ష్యతో మనం ఎలా పోరాడవచ్చు? దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం ఈర్ష్యను పెరికివేసి, దాని స్థానంలో వినయాన్ని, సంతృప్తిని అలవర్చుకోవాలి (8-9 పేరాలు చూడండి)

8. ఈర్ష్యతో పోరాడడానికి మనకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

8 వినయాన్ని, సంతృప్తిని అలవర్చుకోవడం ద్వారా మనం ఈర్ష్యతో పోరాడవచ్చు. మన హృదయం నిండా ఆ మంచి లక్షణాలు ఉంటే ఈర్ష్య వృద్ధి చెందదు. వినయం మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకోకుండా సహాయం చేస్తుంది. అందరిలోకి తానే అర్హుడినని వినయస్థుడు అనుకోడు. (గల. 6:3, 4) సంతృప్తిగా ఉండే వ్యక్తి తనకున్న దాంతో తృప్తిపడతాడు, ఇతరులతో పోల్చుకోడు. (1 తిమో. 6:7, 8) వినయం, సంతృప్తి కలిగిన వ్యక్తి వేరేవాళ్లు మంచిదేదైనా పొందినప్పుడు వాళ్లతోపాటు సంతోషిస్తాడు.

9. గలతీయులు 5:16 అలాగే ఫిలిప్పీయులు 2:3, 4 ప్రకారం పవిత్రశక్తి ఏం చేయడానికి మనకు సహాయం చేస్తుంది?

9 ఈర్ష్య అనే లక్షణాన్ని వదిలించుకోవాలంటే దేవుని పవిత్రశక్తి సహాయం మనకు అవసరం. అంతేకాదు మనం వినయం, సంతృప్తిని అలవర్చుకోవాలి. (గలతీయులు 5:16; ఫిలిప్పీయులు 2:3, 4 చదవండి.) మన లోతైన ఆలోచనలను, ఉద్దేశాలను పరిశీలించుకోవడానికి యెహోవా పవిత్రశక్తి మనకు సహాయం చేయగలదు. దేవుని సహాయంతో మనం హానికరమైన ఆలోచనల, భావాల స్థానంలో ప్రోత్సాహకరమైన వాటిని నింపుకోవచ్చు. (కీర్త. 26:2; 51:10) ఈర్ష్యకు నడిపించే పరిస్థితితో విజయవంతంగా పోరాడిన మోషే, పౌలు ఉదాహరణలను పరిశీలించండి.

ఒక యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి, పాలెంలో ఇద్దరు వ్యక్తులు ప్రవచిస్తున్నారని మోషేకు, యెహోషువకు చెప్పాడు. అప్పుడు, ఆ ఇద్దర్నీ ఆపమని యెహోషువ మోషేను అడుగుతాడు, కానీ మోషే దానికి అంగీకరించడు. బదులుగా, యెహోవా తన పవిత్రశక్తిని ఆ ఇద్దరి మీద ఉంచినందుకు తనకు సంతోషంగా ఉందని మోషే చెప్తాడు. (10వ పేరా చూడండి)

10. మోషేకు ఎలాంటి పరీక్ష ఎదురైంది? (ముఖచిత్రం చూడండి.)

10 మోషేకు దేవుని ప్రజల మీద ఎంతో అధికారం ఉండింది. కానీ ఆ అధికారం తనకే సొంతమని ఆయన అనుకోలేదు. ఉదాహరణకు, ఒక సందర్భంలో యెహోవా మోషే దగ్గర నుండి కొంత పవిత్రశక్తిని తీసి ప్రత్యక్ష గుడారం దగ్గరున్న ఇశ్రాయేలీయుల పెద్దల గుంపుకు ఇచ్చాడు. అది జరిగిన కొంతకాలానికే, ప్రత్యక్ష గుడారం దగ్గర లేని ఇద్దరు పెద్దలు పవిత్రశక్తిని పొంది ప్రవక్తల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారని మోషే విన్నాడు. ఆ ఇద్దరు పెద్దల్ని ఆపమని యెహోషువ మోషేని అడిగినప్పుడు ఆయన ఎలా స్పందించాడు? ఆ ఇద్దరు మనుషులు యెహోవా అనుగ్రహం పొందడం చూసి మోషే ఈర్ష్య పడలేదు. బదులుగా, వాళ్లు కూడా ప్రవచిస్తున్నందుకు ఆయన వినయంగా వాళ్లతో కలిసి సంతోషించాడు. (సంఖ్యా. 11:24-29) మోషే నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

క్రైస్తవ పెద్దలు మోషేలా వినయంగా ఎలా ఉండవచ్చు? (11-12 పేరాలు చూడండి) *

11. పెద్దలు మోషేను ఎలా అనుకరించవచ్చు?

11 మీరు సంఘ పెద్దయితే, మీరు ఎంతో ఇష్టపడే ఒక సేవావకాశాన్ని నిర్వహించడానికి వేరేవాళ్లకు శిక్షణ ఇవ్వమని మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? ఉదాహరణకు, ప్రతీవారం కావలికోట అధ్యయనాన్ని నిర్వహించే సేవావకాశాన్ని మీరు ఇష్టపడుతుండవచ్చు. కానీ మీరు మోషేలా వినయస్థులైతే, ఆ సేవావకాశాన్ని తర్వాతి కాలంలో నిర్వహించేలా మరో సహోదరునికి శిక్షణ ఇవ్వమని అడిగితే మీరు చిన్నతనంగా భావించరు. దానికి బదులు మీరు సంతోషంగా మీ సహోదరునికి సహాయం చేస్తారు.

12. నేడు చాలామంది క్రైస్తవులు సంతృప్తిని, వినయాన్ని ఎలా చూపిస్తున్నారు?

12 చాలామంది వృద్ధ సహోదరులు ఎదుర్కొంటున్న మరో పరిస్థితిని పరిశీలించండి. వాళ్లు కొన్ని దశాబ్దాలపాటు పెద్దల సభ సమన్వయకర్తగా సేవచేశారు. కానీ వాళ్లకు 80 ఏళ్లు రాగానే ఆ నియామకం నుండి తప్పుకుంటారు. 70 ఏళ్లకు చేరుకున్న ప్రాంతీయ పర్యవేక్షకులు వినయంగా తమ సేవావకాశం నుండి తప్పుకుని మరో రకమైన సేవా నియామకాన్ని స్వీకరించారు. అంతేకాదు, ఇటీవలి కాలాల్లో, ప్రపంచవ్యాప్తంగా చాలామంది బెతెల్‌ కుటుంబ సభ్యులు క్షేత్ర నియామకాల్ని స్వీకరించారు. నమ్మకమైన ఈ సహోదరసహోదరీలు ఒకప్పుడు తాము చేసిన నియామకం ఇప్పుడు వేరేవాళ్లు చేయడం చూసి వాళ్ల మీద కోపం పెట్టుకోరు.

13. పన్నెండుమంది అపొస్తలులపై పౌలు ఎందుకు ఈర్ష్య పడుండేవాడు?

13 సంతృప్తి, వినయం అలవర్చుకున్న వాళ్లలో మరో ఉదాహరణ అపొస్తలుడైన పౌలు. ఆయన ఈర్ష్య వృద్ధి చెందడానికి అనుమతించలేదు. పౌలు పరిచర్యలో చాలా కష్టపడ్డాడు. కానీ ఆయన వినయంగా ఇలా చెప్పాడు: ‘నేను అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి. అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు.’ (1 కొరిం. 15:9, 10) యేసు పరిచర్య చేసే సమయంలో 12 మంది అపొస్తలులు ఆయన్ని అనుసరించారు. కానీ యేసు చనిపోయి, పునరుత్థానమైన తర్వాత పౌలు క్రైస్తవుడు అయ్యాడు. ఆయన ఆ తర్వాత ‘అన్యజనులకు అపొస్తలుడిగా’ నియమించబడ్డాడు, కానీ ఆయన 12 మంది అపొస్తలుల్లో ఒకడిగా ఉండడానికి అర్హుడు కాలేదు. (రోమా. 11:13; అపొ. 1:21-26) ఆయన ఆ 12 మందిని చూసి, వాళ్లు యేసుతో కలిసి సమయం గడిపినందుకు వాళ్ల మీద ఈర్ష్య పడకుండా పౌలు తనకు అప్పగించినదానితో సంతృప్తిపడ్డాడు.

14. మనం సంతృప్తిగా, వినయంగా ఉంటే ఏం చేస్తాం?

14 మనం సంతృప్తిగా, వినయంగా ఉంటే పౌలులా ఉంటాం; యెహోవా వేరేవాళ్లకు ఇచ్చిన అధికారాన్ని గౌరవిస్తాం. (అపొ. 21:20-26) క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహించడానికి యెహోవా పెద్దల్ని నియమించాడు. వాళ్లలో అపరిపూర్ణతలున్నా యెహోవా వాళ్లను ‘మనుషుల్లో వరాలుగా’ పరిగణిస్తాడు. (ఎఫె. 4:8, 11) మనం నియమిత పెద్దలకు గౌరవం చూపిస్తూ, వాళ్ల నిర్దేశాల్ని వినయంగా పాటిస్తే, మనం యెహోవాకు దగ్గరగా ఉంటాం; తోటి క్రైస్తవులతో శాంతియుతంగా ఉంటాం.

‘శాంతిగా ఉండడానికి చేయగలిగినదంతా చేయండి’

15. మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది?

15 మనం ఇతరుల్ని చూసి లేదా ఇతరులు మనల్ని చూసి ఈర్ష్య పడితే ఒకరితో ఒకరం శాంతిగా మెలగలేం. మన హృదయం నుండి ఈర్ష్యను పెరికివేసుకోవాలి; ఇతరుల్లో ఈర్ష్యా భావాలను కలిగించకూడదు. ‘ఇతరులతో శాంతిగా ఉండడానికి, ఒకరినొకరం బలపర్చుకోవడానికి చేయగలిగినదంతా చేయమనే’ యెహోవా ఆజ్ఞకు లోబడాలంటే మనం ఆ ముఖ్యమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. (రోమా. 14:19) ఇతరులు ఈర్ష్యతో పోరాడడానికి మనమెలా సహాయం చేయవచ్చు? మనం శాంతిని ఎలా నెలకొల్పవచ్చు?

16. ఈర్ష్యను ఎదిరించడానికి ఇతరులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

16 మన వైఖరి, మన పనులు ఇతరుల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మనకున్న వాటిని ‘గొప్పగా చూపించుకోవాలని’ ఈ లోకం కోరుకుంటుంది. (1 యోహా. 2:16) కానీ అది ఈర్ష్యకు దారి తీస్తుంది. మనకున్న వాటిగురించి, మనం కొనాలనుకుంటున్న వాటిగురించి అదేపనిగా మాట్లాడకపోవడం ద్వారా ఇతరుల్లో ఈర్ష్యను కలిగించకుండా ఉండవచ్చు. మరో విధానమేమిటంటే, సంఘంలో మనకున్న సేవావకాశాల విషయంలో అణకువగా ఉండడం ద్వారా ఈర్ష్యను ప్రోత్సహించకుండా ఉండవచ్చు. మనకున్న సేవావకాశం వైపు ఇతరుల అవధానం మళ్లిస్తే, ఈర్ష్యకు తావిచ్చిన వాళ్లమౌతాం. దానికి బదులు, ఇతరులపట్ల నిజమైన వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పుడు, వాళ్లు చేసే మంచిని గ్రహించినప్పుడు, ఉన్నవాటితో తృప్తిగా ఉండడానికి వాళ్లకు సహాయం చేస్తాం; సంఘంలో ఐక్యతను, శాంతిని ప్రోత్సహిస్తాం.

17. యోసేపు అన్నలు ఏం చేయగలిగారు? ఎందుకు?

17 ఈర్ష్యకు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో మనం విజేతలం కావొచ్చు! యోసేపు అన్నల ఉదాహరణను మళ్లీ పరిశీలించండి. యోసేపుతో అన్యాయంగా వ్యవహరించిన చాలా సంవత్సరాల తర్వాత వాళ్లు అతన్ని ఐగుప్తులో కలిశారు. యోసేపు తానెవరో అన్నలకు చెప్పడానికి ముందు వాళ్లు మారారో లేదో పరీక్షించాడు. వాళ్లకు భోజనం ఏర్పాటు చేస్తూ మిగతావాళ్ల కన్నా తన తమ్ముడైన బెన్యామీనుకు ఎక్కువ ఆహారం పెట్టాడు. (ఆది. 43:33, 34) అయినప్పటికీ వాళ్ల అన్నలు బెన్యామీను మీద ఈర్ష్యపడినట్టు ఎలాంటి ఛాయలు కనిపించలేదు. బదులుగా వాళ్లు తమ తమ్ముడి మీద, తమ తండ్రి యాకోబు మీద నిజమైన శ్రద్ధ చూపించారు. (ఆది. 44:30-34) యోసేపు అన్నలు ఈర్ష్య పడడం ఆపేశారు కాబట్టి వాళ్లు తమ కుటుంబంలో శాంతిని తిరిగి నెలకొల్పగలిగారు. (ఆది. 45:4, 15) అదేవిధంగా, ఈర్ష్యకు సంబంధించిన ఎలాంటి ఆలోచనలనైనా మనం పెరికివేసుకుంటే మన కుటుంబం, మన సంఘం శాంతియుతంగా ఉండేందుకు సహాయం చేసినవాళ్లమౌతాం.

18. యాకోబు 3:17, 18 ప్రకారం, శాంతియుత వాతావరణం కల్పిస్తే ఏం జరుగుతుంది?

18 మనం ఈర్ష్యతో పోరాడాలని, శాంతిగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు. ఈ రెండు పనులు చేయడానికి మనం చాలా కష్టపడాలి. మనం ఈ ఆర్టికల్‌లో చర్చించుకున్నట్టు, మనకు ఈర్ష్యపడే తత్వం ఉంది. (యాకో. 4:5) మన చుట్టూ ఉన్న లోకం కూడా ఈర్ష్యను ప్రేరేపిస్తుంది. కానీ మనం వినయాన్ని, సంతృప్తిని, మెప్పుదలను అలవర్చుకుంటే ఈర్ష్యకు తావివ్వం. బదులుగా, నీతి ఫలం వృద్ధి అయ్యే శాంతియుత వాతావరణం కల్పించినవాళ్లమౌతాం.—యాకోబు 3:17, 18 చదవండి.

పాట 130 క్షమిస్తూ ఉండండి

^ పేరా 5 యెహోవా సంస్థ శాంతికరమైనది. కానీ ఈర్ష్య అనే భావాలకు మనం తావిస్తే ఆ శాంతి దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్‌లో ఈర్ష్యకు కారణాలేమిటో తెలుసుకుంటాం. ఈ హానికరమైన లక్షణాన్ని ఎలా ఎదిరించవచ్చో, శాంతిని ఎలా నెలకొల్పవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 2 పదాల వివరణ: బైబిల్లో వివరించబడిన దాని ప్రకారం, ఈర్ష్య ఉంటే ఒక వ్యక్తి ఇతరులకు ఉన్నదాన్ని ఆశించడమే కాదు, అది వాళ్లకు దక్కకుండా చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు.

^ పేరా 61 చిత్రాల వివరణ: పెద్దల సభ కూటంలో, కావలికోట అధ్యయనం నిర్వహించేలా ఒక యౌవన పెద్దకు శిక్షణ ఇవ్వమని, అప్పటివరకు దాన్ని నిర్వహించే ఒక వృద్ధ సహోదరున్ని అడిగారు. ఆ వృద్ధ సహోదరునికి తన నియామకమంటే ఇష్టమైనా పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మద్దతిస్తూ యౌవన సహోదరునికి అవసరమైన సలహాలు ఇస్తున్నాడు, అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాడు.