కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 9

యెహోవా మీకు ఊరటను ఇవ్వనివ్వండి

యెహోవా మీకు ఊరటను ఇవ్వనివ్వండి

“ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నువ్వే నన్ను ఓదార్చావు, ఊరడించావు.”—కీర్త. 94:19.

పాట 44 ఒక దీనుడి ప్రార్థన

ఈ ఆర్టికల్‌లో . . . *

1. ఆందోళన ఎందుకు కలుగుతుంది? అది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

మీరు దేనిగురించైనా తీవ్రంగా ఆందోళనపడ్డారా? * బహుశా ఎవరైనా అన్న మాటల్ని బట్టో, చేసిన పనుల్ని బట్టో మీరు ఆందోళనపడి ఉండవచ్చు. లేదా మీ మాటల్ని బట్టి లేదా పనుల్ని బట్టి మీకు ఆందోళన కలిగివుండవచ్చు. ఉదాహరణకు, బహుశా మీరు చేసిన ఏదైనా తప్పుకు, యెహోవా మిమ్మల్ని ఎప్పుడూ క్షమించడని ఆందోళన పడుతుండవచ్చు. మీరు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కాబట్టి బహుశా మీకు విశ్వాసం లేదనో, మీరు చెడ్డవాళ్లనో అనుకుంటుండవచ్చు. కానీ అది నిజమేనా?

2. ఆందోళనపడడం విశ్వాస లోపం కాదని ఏ బైబిలు ఉదాహరణల్ని బట్టి చెప్పవచ్చు?

2 కొన్ని బైబిలు ఉదాహరణలు పరిశీలించండి. సమూయేలు ప్రవక్త తల్లియైన హన్నా ఎంతో విశ్వాసంగల స్త్రీ. అయినా, ఆమె కుటుంబంలో ఒకరు ఆమెతో దురుసుగా ప్రవర్తించినప్పుడు ఎంతో ఆందోళనపడింది. (1 సమూ. 1:7) అపొస్తలుడైన పౌలుకు బలమైన విశ్వాసం ఉంది. కానీ “సంఘాలన్నిటి గురించిన చింత” ఆయన్ని కలచివేస్తోందని చెప్పాడు. (2 కొరిం. 11:28) రాజైన దావీదుకు బలమైన విశ్వాసం ఉంది, యెహోవా ఆయన్ని ఎంతో ప్రేమించాడు. (అపొ. 13:22) అయినప్పటికీ, దావీదు తప్పులు చేశాడు. దానివల్ల ఆయన ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. (కీర్త. 38:4) యెహోవా వాళ్లందర్నీ ఓదార్చాడు, ఊరడించాడు. అయితే, ఆ ముగ్గురి ఉదాహరణల నుండి మనమేం నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

విశ్వాసురాలైన హన్నా నుండి ఏం నేర్చుకోవచ్చు?

3. ఇతరుల మాటలు మనకు ఎలా ఆందోళనను కలిగించవచ్చు?

3 ఇతరులు మనతో దురుసుగా లేదా నిర్దయగా మాట్లాడినప్పుడు మనకు ఆందోళన కలగవచ్చు. ముఖ్యంగా, దగ్గరి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అలా మాట్లాడితే ఇంకా బాధేస్తుంది. బహుశా వాళ్లతో ఉన్న బంధం తెగిపోయిందేమో అని మనం ఆందోళనపడొచ్చు. కొన్నిసార్లు మనల్ని బాధపెట్టినవాళ్లు అనాలోచితంగా మాట్లాడివుంటారు, వాళ్ల మాటలు కత్తిపోట్లలా అనిపించి ఉంటాయి. (సామె. 12:18) లేదా కొంతమంది కావాలనే తమ మాటల్ని తూటాల్లా వాడివుంటారు. ఒక యౌవన సహోదరి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఆమె ఇలా చెప్తుంది, “కొన్ని సంవత్సరాల క్రితం, నాకు మంచి స్నేహితురాలు అనుకున్న ఒకామె నా గురించి ఇంటర్నెట్‌లో పుకార్లు పుట్టించింది. నాకు చాలా బాధేసింది, దానిగురించి ఆందోళనపడ్డాను. ఆమె నన్ను ఎందుకు వెన్నుపోటు పొడిచిందో అస్సలు అర్థంకాలేదు.” మీరు ఒకవేళ దగ్గరి స్నేహితుల వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల బాధపడివుంటే, హన్నా నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

4. హన్నా ఎలాంటి కష్టమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది?

4 హన్నా కొన్ని కష్టమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమెకు చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. (1 సమూ. 1:2) ఇశ్రాయేలీయుల సంస్కృతిలో, పిల్లలు పుట్టని స్త్రీలను శపించబడినవాళ్లుగా చూసేవాళ్లు. దానివల్ల హన్నాకు చాలా అవమానంగా అనిపించేది. (ఆది. 30:1, 2) దానికి తోడు, ఆమె భర్తకు మరో భార్య ఉంది. ఆమె పేరు పెనిన్నా, ఆమెకు పిల్లలు ఉన్నారు. ఆమె హన్నా మీద అసూయతో ‘ఆమెను బాధపెట్టాలని ఎప్పుడూ దెప్పిపొడిచేది.’ (1 సమూ. 1:6) మొదట్లో, హన్నా తన పరిస్థితిని బట్టి బాగా కృంగిపోయింది. ఎంతగా అంటే, ఆమె “ఏడ్చేది, భోజనం కూడా చేసేది కాదు.” ఆమె హృదయం “ఎంతో దుఃఖంతో” నిండిపోయింది. (1 సమూ. 1:7, 10) మరి హన్నాకు ఓదార్పు ఎక్కడ దొరికింది?

5. ప్రార్థన హన్నాకు ఎలా సహాయం చేసింది?

5 హన్నా తన మనసులోని భావాల్ని యెహోవా ముందు కుమ్మరించింది. ఆమె ప్రార్థించిన తర్వాత, తన పరిస్థితిని ప్రధాన యాజకుడైన ఏలీకి వివరించింది. అప్పుడు ఆయన ఆమెతో ఇలా అన్నాడు, “క్షేమంగా వెళ్లు, ఇశ్రాయేలు దేవుడు నీ విన్నపాన్ని విని, నువ్వు కోరుకున్నదాన్ని నీకు అనుగ్రహించాలి.” దాని ఫలితం ఏంటి? హన్నా “తన దారిన వెళ్లిపోయింది, ఆమె భోజనం చేసింది, ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆమె ముఖం బాధగా కనిపించలేదు.” (1 సమూ. 1:17, 18) ప్రార్థన వల్ల హన్నా మనసు కుదుటపడింది.

ప్రాచీనకాల హన్నాలాగే, నేడు మనమెలా మనశ్శాంతిని తిరిగి పొంది, దాన్ని కాపాడుకోవచ్చు? (6-10 పేరాలు చూడండి)

6. హన్నా నుండి అలాగే ఫిలిప్పీయులు 4:6, 7 వచనాల నుండి ప్రార్థన గురించి మనం ఏం నేర్చుకోవచ్చు?

6 యెహోవాకు ప్రార్థిస్తూ ఉండడం ద్వారా మనశ్శాంతిని తిరిగి పొందవచ్చు. హన్నా తన పరలోక తండ్రితో చాలాసేపు మాట్లాడింది. (1 సమూ. 1:12) మనం కూడా మన ఆందోళనల్ని, భయాల్ని, బలహీనతల్ని యెహోవాకు చెప్పుకోవడానికి చాలాసేపు ప్రార్థించవచ్చు. మన ప్రార్థనలు కవితల్లా లేదా పూర్తి పొందికగా ఉండాల్సిన అవసరంలేదు. కొన్నిసార్లు బాధను చెప్పుకుంటున్నప్పుడు మనం ప్రార్థనలో ఏడుస్తుండవచ్చు. అయినప్పటికీ, యెహోవా మన ప్రార్థనలు వినడానికి ఎన్నడూ అలసిపోడు. ప్రార్థనలో మన సమస్యలు చెప్పుకోవడంతోపాటు ఫిలిప్పీయులు 4:6, 7 వచనాల్లో ఉన్న సలహాను గుర్తుంచుకోవాలి. (చదవండి.) మన ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెప్పాలని పౌలు నొక్కిచెప్పాడు. యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, జీవం అనే బహుమానం ఇచ్చినందుకు, అందమైన సృష్టిని చేసినందుకు, విశ్వసనీయ ప్రేమ చూపిస్తున్నందుకు, అద్భుతమైన నిరీక్షణ ఇచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. హన్నా నుండి మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు?

7. హన్నా, ఆమె భర్త క్రమంగా ఏం చేసేవాళ్లు?

7 హన్నాకు ఎన్ని సమస్యలు ఉన్నా భర్తతో కలిసి షిలోహులోని యెహోవా ఆరాధన స్థలానికి క్రమంగా వెళ్లేది. (1 సమూ. 1:1-5) ఆమె గుడారం దగ్గర ఉన్నప్పుడు, ఆమె ప్రార్థనకు యెహోవా జవాబిస్తాడనే నమ్మకాన్ని ప్రధాన యాజకుడైన ఏలీ వ్యక్తం చేస్తూ ఆమెను ప్రోత్సహించాడు. ఆ మాటలు హన్నాకు ఓదార్పునిచ్చాయి.—1 సమూ. 1:9, 17.

8. కూటాలు మనకెలా సహాయం చేస్తాయి? వివరించండి.

8 సంఘ కూటాలకు హాజరౌతూ ఉండడం ద్వారా తిరిగి మనశ్శాంతిని పొందవచ్చు. సాధారణంగా మన కూటాల్లో చేసే ప్రారంభ ప్రార్థనలో దేవుని పవిత్రశక్తి కోసం అడుగుతాం. శాంతి పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. (గల. 5:22) మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా కూటాలకు హాజరైతే, యెహోవా అలాగే మన సహోదరసహోదరీలు మనల్ని ప్రోత్సహించి మనకు సహాయం చేయగలుగుతారు. యెహోవా మనల్ని ఊరడించడానికి ప్రార్థన, కూటాలు ముఖ్యమైన మార్గాలు. (హెబ్రీ. 10:24, 25) హన్నా నుండి మనం నేర్చుకునే మరో పాఠాన్ని గమనించండి.

9. హన్నా పరిస్థితి మారిందా? కానీ మారింది ఏంటి?

9 హన్నా సమస్యలు వెంటనే తీరిపోలేదు. గుడారం దగ్గర నుండి ఇంటికి తిరిగొచ్చాక, ఆమె ఇంకా పెనిన్నాతో ఒకే ఇంట్లో ఉండాలి. అంతేకాదు, పెనిన్నా వైఖరి మారిందని బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి పెనిన్నా పోరు హన్నా ఇంకా భరిస్తూనే ఉండాలి. కానీ హన్నా మనశ్శాంతిని తిరిగి పొందింది, దాన్ని కాపాడుకుంది. ఒక్కసారి విషయాన్ని యెహోవాకు వదిలేశాక, ఆమె ఇక ఏమాత్రం బాధపడలేదని గుర్తుచేసుకోండి. యెహోవా తనను ఓదార్చేలా, ఊరడించేలా హన్నా అనుమతించింది. కొంతకాలం తర్వాత, యెహోవా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు, ఆమెకు పిల్లలు పుట్టారు!—1 సమూ. 1:19, 20; 2:21.

10. హన్నా అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

10 మన సమస్య తీరకపోయినా మనశ్శాంతిని తిరిగి పొందవచ్చు. మనం పట్టుదలగా ప్రార్థన చేసినప్పటికీ, క్రమంగా కూటాలకు వెళ్లినప్పటికీ కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉండవచ్చు. కానీ హన్నా నుండి నేర్చుకున్నట్టు, గాయపడిన మన హృదయాన్ని ఊరడించకుండా యెహోవాను ఏదీ ఆపలేదు. యెహోవా మనల్ని ఎన్నడూ మర్చిపోడు, పట్టుదలగా ముందుకు సాగితే ఆయన ఏదోక సమయంలో తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు.—హెబ్రీ. 11:6.

అపొస్తలుడైన పౌలు నుండి ఏం నేర్చుకోవచ్చు?

11. ఏయే కారణాల వల్ల పౌలు ఆందోళన పడివుంటాడు?

11 ఆందోళన పడడానికి పౌలుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఆయన తన సహోదరసహోదరీలను ప్రేమించాడు కాబట్టి వాళ్లు అనుభవించే కష్టాల గురించి ఆయన ఎంతో చింతించాడు. (2 కొరిం. 2:4; 11:28) అపొస్తలుడిగా తనకున్న నియామకంలో భాగంగా, ఆయన తరచూ వ్యతిరేకుల చేతుల్లో దెబ్బలు తిన్నాడు, జైల్లో వేయబడ్డాడు. కొన్నిసార్లు సరిపడా ఆహారం దొరకకపోవడం వంటి కష్టాల్ని కూడా ఎదుర్కొన్నాడు. (ఫిలి. 4:12) అంతేకాదు, తన జీవితంలో మూడు సందర్భాల్లో ఆయన ప్రయాణిస్తున్న ఓడ బద్దలైంది; ఆ తర్వాత ఆయన ఓడ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంత ఆందోళన పడివుంటాడో ఊహించండి. (2 కొరిం. 11:23-27) మరి పౌలు ఆందోళనను ఎలా తట్టుకోగలిగాడు?

12. దేనివల్ల పౌలు ఆందోళన తగ్గింది?

12 తన తోటి సహోదరసహోదరీలు కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు పౌలు ఆందోళనపడ్డాడు. కానీ వాళ్ల సమస్యలన్నిటినీ తానే పరిష్కరించాలని ప్రయత్నించలేదు. ఆయన అణకువ చూపించాడు. సంఘానికి సహాయం చేసేలా ఆయన ఇతరుల్ని ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు, ఆయన తిమోతి, తీతు వంటి నమ్మకస్థులకు బాధ్యతలు అప్పగించాడు. ఆ సహోదరులు చేసిన పని పౌలు ఆందోళనను తప్పకుండా తగ్గించి ఉంటుంది.—ఫిలి. 2:19, 20; తీతు 1:1, 4, 5.

అపొస్తలుడైన పౌలు ఉదాహరణ నుండి నేర్చుకున్నట్టు, ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవ్వకూడదంటే మనం ఏం చేయవచ్చు? (13-15 పేరాలు చూడండి)

13. పెద్దలు పౌలును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

13 ఇతరుల సహాయం అడగండి. పౌలులాగే, నేడు ఎంతోమంది ప్రేమగల సంఘపెద్దలు, సంఘంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ల విషయంలో ఆందోళనపడతారు. కానీ సంఘంలో వాళ్లందరికీ ఒక్క సంఘపెద్దే సహాయం చేయలేడు. అణకువగల సంఘపెద్ద తనకున్న బాధ్యతల్ని అర్హులైన సహోదరులతో పంచుకుంటాడు, దేవుని మందపట్ల శ్రద్ధ తీసుకునేలా యౌవన సహోదరులకు శిక్షణ ఇస్తాడు.—2 తిమో. 2:2.

14. పౌలు దేనిగురించి ఆందోళనపడలేదు? ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

14 మీకు ఓదార్పు అవసరమని గుర్తించండి. పౌలు వినయస్థుడు, కాబట్టి తన స్నేహితుల ప్రోత్సాహం తనకు అవసరమని గుర్తించాడు, దాన్ని పొందాడు కూడా. స్నేహితులు తనను ఓదార్చారంటే, తానొక బలహీనుడని ప్రజలు అనుకుంటారేమోనని పౌలు ఎన్నడూ ఆలోచించలేదు. ఫిలేమోనుకు రాస్తూ పౌలు ఇలా చెప్పాడు: “నీ ప్రేమ గురించి విన్నప్పుడు నాకెంతో ఆనందం, ఊరట కలిగాయి.” (ఫిలే. 7) కష్టకాలాల్లో తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిన చాలామంది తోటి పనివాళ్ల పేర్లను పౌలు ప్రస్తావించాడు. (కొలొ. 4:7-11) మనకు ప్రోత్సాహం అవసరమని వినయంగా గుర్తించినప్పుడు, మన సహోదరసహోదరీలు సంతోషంగా మనకు కావాల్సిన మద్దతును ఇస్తారు.

15. ఆందోళన కలిగించే పరిస్థితిలో ఓదార్పు పొందడానికి పౌలు ఏం చేశాడు?

15 దేవుని వాక్యంపై ఆధారపడండి. లేఖనాలు తనకు ఓదార్పునిస్తాయని పౌలుకు తెలుసు. (రోమా. 15:4) తనకు వచ్చే ఏ కష్టాన్నైనా తట్టుకోవడానికి అవి సహాయం చేస్తాయి. (2 తిమో. 3:15, 16) రోములో రెండోసారి చెరసాలలో ఉన్నప్పుడు పౌలుకు తన మరణం దగ్గరపడిందని అనిపించింది. అలాంటి కష్టమైన పరిస్థితిలో పౌలు ఏం చేశాడు? తిమోతిని తన దగ్గరకు త్వరగా రమ్మని చెప్తూ, వచ్చేటప్పుడు “గ్రంథపు చుట్టల్ని” తీసుకొని రమ్మన్నాడు. (2 తిమో. 4:6, 7, 9, 13) ఎందుకు? బహుశా అవి హీబ్రూ లేఖన భాగాలు ఉన్న గ్రంథపు చుట్టలు అయ్యుంటాయి. పౌలు తన వ్యక్తిగత అధ్యయనం కోసం వాటిని తెమ్మని ఉంటాడు. పౌలులాగే దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేస్తే, మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా యెహోవా లేఖనాల్ని ఉపయోగించి మనల్ని ఊరడిస్తాడు.

దావీదు రాజు నుండి ఏం నేర్చుకోవచ్చు?

దావీదు రాజులాగే, ఏదైనా ఘోరమైన తప్పు చేస్తే మనకు సహాయం చేసేదేమిటి? (16-19 పేరాలు చూడండి)

16. దావీదు ఘోరమైన తప్పు చేసినప్పుడు ఎలా భావించాడు?

16 దావీదు చాలా పెద్ద తప్పు చేశాడు. ఆయన బత్షెబతో వ్యభిచారం చేశాడు, ఆమె భర్తను చంపించడానికి పన్నాగం పన్నాడు, కొంతకాలం వరకు ఆ తప్పుల్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. (2 సమూ. 12:9) మొదట్లో, దావీదు తన మనస్సాక్షి చెప్పేది పట్టించుకోలేదు. ఫలితంగా, ఆయనకు దేవునితో ఉన్న సంబంధం దెబ్బతినడమే కాకుండా మానసికంగా, భౌతికంగా ఎంతో కృంగిపోయాడు. (కీర్త. 32:3, 4) తాను చేసిన ఆ ఘోరమైన తప్పు వల్ల కలిగిన ఆందోళన నుండి దావీదు ఎలా బయటపడగలిగాడు? మనం ఏదైనా ఘోరమైన తప్పు చేస్తే మనకేం సహాయం చేస్తుంది?

17. కీర్తన 51:1-4⁠లో ఉన్న ఏ మాటల్ని బట్టి, దావీదు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడ్డాడని చెప్పవచ్చు?

17 క్షమాపణ కోసం ప్రార్థించండి. దావీదు ఆ తర్వాత యెహోవాకు ప్రార్థించాడు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి, తన పాపాల్ని ఒప్పుకున్నాడు. (కీర్తన 51:1-4 చదవండి.) దానివల్ల ఆయన మనశ్శాంతిని, సంతోషాన్ని తిరిగి పొందగలిగాడు. (కీర్త. 32:1, 2, 4, 5) ఒకవేళ మీరు ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకండి. బదులుగా, ప్రార్థనలో మీ పాపాన్ని యెహోవా ముందు దాపరికం లేకుండా ఒప్పుకోండి. అప్పుడు మీరు ఉపశమనం పొందుతారు, అపరాధ భావాల వల్ల కలిగే ఆందోళన నుండి బయటపడగలుగుతారు. కానీ మీరు యెహోవాతో ఉన్న స్నేహాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే, ప్రార్థనతో పాటు ఇంకో పని కూడా చేయాలి.

18. క్రమశిక్షణకు దావీదు ఎలా స్పందించాడు?

18 క్రమశిక్షణను అంగీకరించండి. దావీదు పాపాన్ని బయటపెట్టడానికి యెహోవా నాతాను ప్రవక్తను పంపించాడు. అప్పుడు దావీదు తన తప్పును సమర్థించుకోవడానికి గానీ, దాని గంభీరతను తగ్గించడానికి గానీ ప్రయత్నించలేదు. ఆయన బత్షెబ భర్తకు మాత్రమే కాదుగానీ, యెహోవాకు వ్యతిరేకంగా కూడా పాపం చేశాడని వెంటనే ఒప్పుకున్నాడు. యెహోవా ఇచ్చే క్రమశిక్షణను దావీదు అంగీకరించాడు, యెహోవా ఆయన్ని క్షమించాడు. (2 సమూ. 12:10-14) మనం ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, యెహోవా నియమించిన కాపరులతో మాట్లాడాలి. (యాకో. 5:14, 15) అంతేకాదు, మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు. మనం ఎంత త్వరగా క్రమశిక్షణను అంగీకరించి, దాన్ని పాటిస్తే అంత త్వరగా మనశ్శాంతిని, సంతోషాన్ని తిరిగి పొందగలుగుతాం.

19. మనం ఏమని నిశ్చయించుకోవాలి?

19 చేసిన తప్పును మళ్లీ చేయకూడదని నిశ్చయించుకోండి. చేసిన పాపాల్ని మళ్లీ చేయకూడదంటే, యెహోవా సహాయం తనకు అవసరమని దావీదు రాజుకు తెలుసు. (కీర్త. 51:7, 10, 12) యెహోవా క్షమాపణ పొందిన తర్వాత, దావీదు తన మనసులోకి తప్పుడు ఆలోచనలు రానివ్వకూడదని నిశ్చయించుకున్నాడు. ఫలితంగా, ఆయన మనశ్శాంతిని తిరిగి పొందాడు.

20. యెహోవా క్షమాపణ పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

20 క్షమాపణ కోసం యెహోవాకు ప్రార్థించడం ద్వారా, క్రమశిక్షణను అంగీకరించడం ద్వారా, చేసిన తప్పుల్ని మళ్లీ చేయకూడదని గట్టిగా నిశ్చయించుకోవడం ద్వారా యెహోవా క్షమాపణ పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపిస్తాం. మనం ఆ పనులు చేసినప్పుడు, మనశ్శాంతిని తిరిగి పొందుతాం. ఘోరమైన తప్పు చేసిన జేమ్స్‌ అనే సహోదరుడు ఆ విషయం నిజమని గుర్తించాడు. ఆయనిలా అన్నాడు: “సంఘపెద్దల దగ్గర నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, నా భుజాల మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. నా మనశ్శాంతిని తిరిగి పొందగలిగాను.” “విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నలిగిన మనస్సుగలవాళ్లను ఆయన కాపాడతాడు” అని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా!—కీర్త. 34:18.

21. యెహోవా మనల్ని ఊరడించేలా ఎలా అనుమతించవచ్చు?

21 ఈ చివరి రోజులు ముగింపుకు వస్తున్న కొద్దీ, మన ఆందోళనలు ఇంకా ఎక్కువ అవ్వవచ్చు. మీకు ఆందోళనగా అనిపించినప్పుడు, యెహోవా సహాయం తీసుకోవడానికి ఆలస్యం చేయకండి. బైబిల్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి. హన్నా, పౌలు, దావీదు ఉదాహరణల నుండి నేర్చుకోండి. మీకు దేనివల్ల ఆందోళన కలుగుతుందో గుర్తించడానికి సహాయం చేయమని మీ పరలోక తండ్రిని అడగండి. (కీర్త. 139:23) మీ భారమంతా, ముఖ్యంగా మీ శక్తికి మించినవి, మీరు మోయలేనివి ఆయనపై వేయండి. మీరు అలాచేస్తే, యెహోవాకు ఇలా పాడిన కీర్తనకర్తలా ఉంటారు: “ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నువ్వే నన్ను ఓదార్చావు, ఊరడించావు.”—కీర్త. 94:19.

పాట 4 “యెహోవా నా కాపరి”

^ పేరా 5 మనకు ఎదురయ్యే సమస్యల్ని బట్టి మనందరం ఏదోక సమయంలో ఆందోళనకు గురై ఉంటాం. ఆందోళనతో బాధపడిన ముగ్గురు ప్రాచీనకాల దేవుని సేవకుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాళ్లలో ప్రతీ ఒక్కర్నీ యెహోవా ఎలా ఓదార్చాడో, ఊరడించాడో కూడా పరిశీలిస్తాం.

^ పేరా 1 పదాల వివరణ: ఆందోళన అంటే భయంగా అనిపించడం లేదా దేనిగురించైనా చింతించడం. ఆర్థిక చింతల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, లేదా మరితర సమస్యల వల్ల మనకు ఆందోళన కలగవచ్చు. అంతేకాదు, మనం గతంలో చేసిన తప్పుల గురించి లేదా భవిష్యత్తులో మనకు ఎదురవ్వగల సవాళ్ల గురించి ఆలోచించినప్పుడు ఆందోళన కలగవచ్చు.