కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 14

ఉత్తరదిక్కు నుండి వచ్చే దాడి!

ఉత్తరదిక్కు నుండి వచ్చే దాడి!

‘ఒక జనం నా దేశం మీదికి వచ్చింది.’—యోవే. 1:6.

పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది

ఈ ఆర్టికల్‌లో . . . *

1. సహోదరుడు రస్సెల్‌, ఆయన సహచరులు బైబిల్ని అధ్యయనం చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగించారు? దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

వంద కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, సహోదరుడు సి. టి. రస్సెల్‌, అతని సహచరులు అలాగే ఇంకొంతమంది క్రమంగా కలుసుకొని బైబిల్ని అధ్యయనం చేసేవాళ్లు. యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి, చనిపోయినవాళ్ల స్థితి గురించి, విమోచన క్రయధనం గురించి బైబిలు నిజంగా ఏం బోధిస్తుందో తెలుసుకోవాలని వాళ్లు అనుకున్నారు. అందుకోసం ఒక సులువైన పద్ధతిని ఉపయోగించారు. వాళ్లలో ఒకరు ఒక ప్రశ్న వేసేవాళ్లు, తర్వాత అందరూ కలిసి దానికి సంబంధించిన లేఖనాలన్నిటినీ పరిశోధించేవాళ్లు. చివర్లో, తాము చేసిన పరిశోధన నుండి ఏం నేర్చుకున్నారో రాసుకునేవాళ్లు. బైబిల్లో ఉన్న ఎన్నో ప్రాథమిక సత్యాలను అర్థం చేసుకునేలా యెహోవా వాళ్లకు సహాయం చేశాడు. ఆ సత్యాల్ని నేటికీ మనం ఎంతో విలువైనవిగా చూస్తున్నాం.

2. కొన్నిసార్లు బైబిలు ప్రవచనాల్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది?

2 అయితే కొంతకాలానికే వాళ్లకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, ఒక బైబిలు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం కన్నా ఒక బైబిలు ప్రవచనాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే బైబిలు ప్రవచనాలు తరచూ అవి నెరవేరుతున్నప్పుడు లేదా నెరవేరిన తర్వాత అర్థమౌతాయి. అంతేకాదు, ఒక ప్రవచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దాని సందర్భాన్ని కూడా పరిశీలించాలి. అలా కాకుండా ప్రవచనంలోని ఒక్క భాగం మీదే మనసుపెట్టి, మిగతా వివరాల్ని పట్టించుకోకపోతే దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. యోవేలు పుస్తకంలోని ఒక ప్రవచనం విషయంలో అదే జరిగిందని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవచనాన్ని మళ్లీ పరిశీలించి, మన అవగాహనలో మార్పు ఎందుకు అవసరమో తెలుసుకుందాం.

3-4. యోవేలు 2:7-9 వచనాల్లో ఉన్న ప్రవచనాన్ని ఇప్పటివరకు మనం ఎలా అర్థం చేసుకున్నాం?

3 యోవేలు 2:7-9 చదవండి. ఒక మిడతల దండు ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేస్తుందని యోవేలు ప్రవచించాడు. ఆ మిడతల పళ్లు సింహం పళ్లలా, దవడలు సింహం దవడల్లా ఉన్నాయి. ఆ తిండిబోతు మిడతలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న చెట్లన్నిటినీ తినేస్తాయి. (యోవే. 1:4, 6) ఈ ప్రవచనం యెహోవా ప్రజల్ని సూచిస్తుందని, ఆ మిడతల దండును ఆపడం ఎంత అసాధ్యమో యెహోవా ప్రజల ప్రకటనా పనిని ఆపడం కూడా అంతే అసాధ్యమని ఇప్పటివరకు అనుకున్నాం. ఈ ప్రకటనా పని ‘దేశాన్ని’ లేదా మతనాయకుల చేతుల్లో ఉన్న ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని అనుకున్నాం. *

4 ఒకవేళ యోవేలు 2:7-9 వచనాల్ని మాత్రమే చదివితే పైన చెప్పబడిన వివరణ సరైనదేనని మనకు అనిపించవచ్చు. కానీ ఆ ప్రవచన సందర్భాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, మన అవగాహనను మార్చుకోవాలని గుర్తిస్తాం. దానికి గల నాలుగు కారణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

అవగాహనలో మార్పుకు నాలుగు కారణాలు

5-6. (ఎ) యోవేలు 2:20 పరిశీలించినప్పుడు ఏ ప్రశ్న తలెత్తుతుంది? (బి) యోవేలు 2:25 పరిశీలించినప్పుడు ఏ ప్రశ్న తలెత్తుతుంది?

5 మొదటిగా, మిడతల దండు గురించి యెహోవా ఏమని మాటిచ్చాడో గమనించండి: “నేను ఉత్తరం నుండి వచ్చే అతన్ని [మిడతల్ని] మీకు దూరంగా వెళ్లగొడతాను.” (యోవే. 2:20) ఒకవేళ ఆ మిడతలు ప్రకటించమని, శిష్యుల్ని చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడే యెహోవాసాక్షుల్ని సూచిస్తుంటే యెహోవా వాళ్లను వెళ్లగొడతానని ఎందుకు అంటాడు? (యెహె. 33:7-9; మత్త. 28:19, 20) నిజానికి యెహోవా తన నమ్మకమైన సేవకుల్ని కాదుగానీ, తన ప్రజల్ని వ్యతిరేకిస్తున్న వాళ్లను లేదా వ్యతిరేకిస్తున్న దాన్ని వెళ్లగొడతాడు.

6 రెండో కారణం తెలుసుకోవడానికి యోవేలు 2:25 పరిశీలించండి. అక్కడ యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను మీ మీదికి పంపిన నా గొప్ప సైన్యం, అంటే మిడతల దండు, రెక్కల్లేని మిడతలు, తిండిబోతు మిడతలు, నాశనకరమైన మిడతలు తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్లీ ఇస్తాను.” మిడతల దాడివల్ల కోల్పోయిన పంటను ‘మళ్లీ ఇస్తానని’ యెహోవా మాటివ్వడం గమనించారా? ఒకవేళ మిడతలు రాజ్య సందేశాన్ని ప్రకటించే యెహోవా ప్రజల్ని సూచిస్తుంటే, వాళ్ల సందేశం నష్టాన్ని కలిగించినట్టు అవుతుంది. నిజానికి ప్రాణాల్ని కాపాడే ఆ సందేశం, దుష్టుల్లో కొంతమందిని పశ్చాత్తాపపడేలా కదిలిస్తుంది. (యెహె. 33:8, 19) దీన్నిబట్టి ఆ సందేశం నష్టం కలిగించేది కాదని అర్థమౌతుంది.

7. యోవేలు 2:28, 29 వచనాల్లోని “ఆ తర్వాత” అనే మాట నుండి ఏం అర్థం చేసుకోవచ్చు?

7 యోవేలు 2:28, 29 చదవండి. మూడో కారణం తెలుసుకోవడానికి ఆ ప్రవచనంలోని సంఘటనలు జరిగే క్రమాన్ని పరిశీలించండి. యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఆ తర్వాత, నేను నా పవిత్రశక్తిని . . . కుమ్మరిస్తాను.” అంటే మిడతలు వాటి పనిని పూర్తి చేసిన తర్వాతే అది జరుగుతుంది. ఒకవేళ మిడతలు దేవుని రాజ్య ప్రచారకుల్ని సూచిస్తుంటే, యెహోవా తన పవిత్రశక్తిని వాళ్లు ప్రకటనా పనిని పూర్తిచేసిన తర్వాత ఎందుకు కుమ్మరిస్తాడు? నిజానికి దేవుని పవిత్రశక్తి సహాయం లేకపోతే, ఇన్నేళ్లుగా వ్యతిరేకత ఎదురైనా, నిషేధం ఉన్నా వాళ్లు ప్రకటనా పనిని కొనసాగించగలిగేవాళ్లు కాదు.

సహోదరుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, నాయకత్వం వహించిన ఇతర అభిషిక్త క్రైస్తవులు ఈ దుష్టలోకంపై దేవుని తీర్పుల్ని ధైర్యంగా ప్రకటించారు (8వ పేరా చూడండి)

8. ప్రకటన 9:1-11 వచనాల్లో ఉన్న మిడతలు ఎవర్ని సూచిస్తున్నాయి? (ముఖచిత్రం చూడండి.)

8 ప్రకటన 9:1-11 చదవండి. ఇప్పుడు నాలుగో కారణాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథంలో కూడా మిడతల దండుకు సంబంధించిన ఒక ప్రవచనం ఉంది. అందుకే యోవేలు ప్రవచనంలో ఉన్న మిడతల దండు గురించిన తెగులు కూడా ప్రకటనా పనిని సూచిస్తుందని అనుకున్నాం. ప్రకటన గ్రంథంలో ప్రవచించబడిన మిడతల ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయి, “వాటి తలల మీద బంగారు కిరీటాల లాంటివి ఉన్నాయి.” (ప్రక. 9:7) అవి, ‘నొసళ్ల మీద దేవుని ముద్రలేని ప్రజలను [దేవుని శత్రువులను]’ ఐదు నెలలపాటు, అంటే సగటున ఒక మిడత జీవించినంత కాలంపాటు హింసిస్తాయి. (ప్రక. 9:4, 5) ఈ ప్రవచనం యెహోవా అభిషిక్త సేవకుల గురించి చెప్తోంది. వాళ్లు ఈ దుష్టలోకం మీద దేవుని తీర్పుల్ని ధైర్యంగా ప్రకటిస్తారు, ఆ తీర్పులు లోకానికి మద్దతిచ్చేవాళ్లను ఇబ్బంది పెడతాయి.

9. యోవేలు చూసిన మిడతలకు, యోహాను చూసిన మిడతలకు మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటి?

9 ప్రకటన గ్రంథంలోని ప్రవచనానికి, యోవేలు పుస్తకంలోని ప్రవచనానికి మధ్య పోలికలు ఉన్న మాట వాస్తవమే. అయితే వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి. అవేంటంటే: యోవేలు ప్రవచనంలోని మిడతలు చెట్లన్నిటినీ నాశనం చేశాయి. (యోవే. 1:4, 6, 7) కానీ యోహాను చూసిన దర్శనంలో, చెట్లకు హాని చేయవద్దనే ఆజ్ఞ మిడతలకు ఇవ్వబడింది. (ప్రక. 9:4) యోవేలు చూసిన మిడతలు ఉత్తరం నుండి వచ్చాయి. (యోవే. 2:20) కానీ యోహాను చూసిన మిడతలు అగాధం నుండి వచ్చాయి. (ప్రక. 9:2, 3) యోవేలు ప్రవచనంలోని మిడతలు వెళ్లగొట్టబడ్డాయి. అయితే ప్రకటన గ్రంథంలోని మిడతలు వెళ్లగొట్టబడలేదు గానీ వాటి పనిని పూర్తి చేసేలా అనుమతించబడ్డాయి, అంతేకాదు వాటిని బట్టి యెహోవా సంతోషించలేదని బైబిలు చెప్పట్లేదు.—“ మిడతల గురించిన ప్రవచనాలు—ముఖ్యమైన తేడాలు” అనే బాక్సు చూడండి.

10. యోవేలు పుస్తకంలోని మిడతలు, ప్రకటన గ్రంథంలో ఉన్న మిడతలు వేర్వేరు విషయాల్ని సూచిస్తున్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటి?

10 ఈ ముఖ్యమైన తేడాల్ని బట్టి, ఈ రెండు ప్రవచనాలకు ఒకదానితో ఒకటి సంబంధం లేదని అర్థమౌతుంది. అంటే యోవేలు పుస్తకంలోని “మిడతలు,” ప్రకటన గ్రంథంలో ఉన్న “మిడతలు” వేర్వేరు విషయాల్ని సూచిస్తున్నాయా? అవును. బైబిల్లో, వేర్వేరు విషయాలను సూచించడానికి ఒకే జీవిని ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, ప్రకటన 5:5 లో “యూదా గోత్రపు సింహం” అని యేసు పిలవబడ్డాడు. అయితే, 1 పేతురు 5:8 లో “గర్జించే సింహం” అని అపవాది పిలవబడ్డాడు. ఇప్పటివరకు మనం చర్చించిన వాటినిబట్టి యోవేలు ప్రవచనం నిజంగా దేన్ని సూచిస్తుందో అర్థం చేసుకోవడం అవసరమని తెలుస్తోంది. ఇంతకీ అది దేన్ని సూచిస్తోంది?

ఆ ప్రవచనం అర్థం ఏంటి?

11. మిడతలు ఎవర్ని సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి యోవేలు 1:6; 2:1, 8, 11 వచనాలు ఎలా సహాయం చేస్తాయి?

11 యోవేలు ప్రవచన సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, అది ఒక సైన్యం చేసే దాడి గురించి చెప్తోందని అర్థమౌతుంది. (యోవే. 1:6; 2:1, 8, 11) తనకు లోబడని ఇశ్రాయేలీయుల్ని శిక్షించడానికి ఒక ‘గొప్ప సైన్యాన్ని’ (బబులోను సైన్యాన్ని) ఉపయోగించుకుంటానని యెహోవా చెప్పాడు. (యోవే. 2:25) ఆ సైన్యాన్ని ‘ఉత్తరం నుండి వచ్చే అతను’ అని వర్ణించడం సరైనదే. ఎందుకంటే బబులోనీయులు ఉత్తరం నుండి వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేస్తారు. (యోవే. 2:20) ఆ సైన్యం ఒక క్రమపద్ధతిలో వెళ్లే మిడతల దండుతో పోల్చబడింది. బబులోను సైన్యాన్ని సూచించే ఆ మిడతల దండు గురించి యోవేలు ఇలా చెప్పాడు: “ప్రతీ ఒక్కటి తన దారిలో సాగిపోతుంది. . . . అవి నగరంలోకి దూసుకొస్తాయి, ప్రాకారాల మీద పరుగెత్తుతాయి. ఇళ్ల మీదికి ఎక్కుతాయి, దొంగ దూరినట్టు కిటికీల గుండా దూరతాయి.” (యోవే. 2:8, 9) మీరు దాన్ని ఊహించుకోగలరా? ఎటు చూసినా సైనికులే, దాక్కోవడానికి ఎక్కడా స్థలం లేదు. బబులోను సైన్యం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు!

12. మిడతల గురించి యోవేలు పుస్తకంలో ఉన్న ప్రవచనం ఎలా నెరవేరింది?

12 క్రీ.పూ. 607 లో బబులోనీయులు (లేదా కల్దీయులు) యెరూషలేము నగరంపై మిడతల్లా దాడి చేశారు. బైబిలు ఇలా చెప్తుంది: “కల్దీయుల రాజు . . . వాళ్ల యౌవనుల్ని కత్తితో చంపాడు; అతను యువకుల మీద గానీ, యువతుల మీద గానీ, ముసలివాళ్ల మీద గానీ, అనారోగ్యంగా ఉన్నవాళ్ల మీద గానీ కనికరం చూపించలేదు. దేవుడు ప్రతీది అతని చేతికి అప్పగించాడు. . . . అతను సత్యదేవుని మందిరాన్ని తగలబెట్టాడు, యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టాడు, దాని పటిష్ఠమైన బురుజులన్నిటినీ అగ్నితో కాల్చేసి, విలువైన ప్రతీదాన్ని నాశనం చేశాడు.” (2 దిన. 36:17, 19) బబులోనీయులు నాశనం చేసిన ఇశ్రాయేలును చూసి ప్రజలు ఇలా అన్నారు: “ఇది మనుషులు గానీ జంతువులు గానీ లేని పాడుబడ్డ భూమి, ఇది కల్దీయుల చేతికి అప్పగించబడింది.”—యిర్మీ. 32:43.

13. యిర్మీయా 16:16, 18 వచనాల అర్థాన్ని వివరించండి.

13 యోవేలు ప్రవచించిన 200 సంవత్సరాల తర్వాత, యెహోవా యిర్మీయాను ఉపయోగించుకుని ఈ దాడి గురించి ఇంకో విషయాన్ని ప్రవచించాడు. చెడ్డ పనులు చేసిన ఇశ్రాయేలీయుల కోసం సైనికులు జాగ్రత్తగా వెతుకుతారని, వాళ్లందర్నీ పట్టుకుంటారని ఆయన చెప్పాడు. “‘నేను చాలామంది జాలరుల్ని పిలిపిస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు, ‘వాళ్లు వాళ్లను వెదికి పట్టుకుంటారు. ఆ తర్వాత నేను చాలామంది వేటగాళ్లను పిలిపిస్తాను, వాళ్లు ప్రతీ పర్వతం మీద, ప్రతీ కొండ మీద, బండల సందుల్లో వాళ్లను వేటాడతారు. . . . వాళ్ల అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి వాళ్లను తగినవిధంగా శిక్షిస్తాను.’” పశ్చాత్తాపం చూపించని ఇశ్రాయేలీయులు మహాసముద్రాల్లో, అడవుల్లో దాక్కున్నా బబులోను సైనికులు వాళ్లను పట్టుకుంటారు.—యిర్మీ. 16:16, 18.

ఒక మంచివార్త!

14. యోవేలు 2:28, 29 వచనాలు ఎప్పుడు నెరవేరాయి?

14 సంతోషకరంగా, యోవేలు ఒక మంచివార్త కూడా చెప్తున్నాడు. దేశం మళ్లీ ఫలవంతంగా తయారౌతుంది. (యోవే. 2:23-26) ఆ తర్వాత, ఆధ్యాత్మిక ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉండే ఒక సమయం వస్తుంది. యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను నా పవిత్రశక్తిని అన్నిరకాల ప్రజల మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు, కూతుళ్లు ప్రవచిస్తారు, . . . నా దాసులు, దాసురాళ్ల మీద కూడా నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను.” (యోవే. 2:28, 29) అయితే, ఇశ్రాయేలీయుల్ని బబులోను నుండి వాళ్ల స్వదేశానికి తీసుకొచ్చిన వెంటనే దేవుడు వాళ్లపై పవిత్రశక్తిని కుమ్మరించలేదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అంటే క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున ఆయన తన పవిత్రశక్తిని కుమ్మరించాడు. అది మనకెలా తెలుసు?

15. యోవేలు 2:28 లో ఉన్న ఏ పదాల్ని పేతురు మార్చి చెప్పాడని అపొస్తలుల కార్యాలు 2:16, 17 చూపిస్తున్నాయి? అది దేన్ని సూచించింది?

15 పవిత్రశక్తి ప్రేరణతో అపొస్తలుడైన పేతురు యోవేలు 2:28, 29 లో ఉన్న మాటల్ని పెంతెకొస్తు రోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటనకు అన్వయించాడు. ఆ రోజు ఉదయం దాదాపు తొమ్మిది గంటలకు అద్భుతరీతిలో పవిత్రశక్తి కుమ్మరించబడింది. దాన్ని పొందినవాళ్లు “దేవుని శక్తివంతమైన కార్యాల గురించి మాట్లాడడం” మొదలుపెట్టారు. (అపొ. 2:11) పేతురు పవిత్రశక్తి ప్రేరణతో యోవేలు ప్రవచనంలోని కొన్ని పదాల్ని కాస్త మార్చి చెప్పాడు. ఆ మార్పు ఏంటో మీరు గమనించారా? (అపొస్తలుల కార్యాలు 2:16, 17 చదవండి.) పేతురు ఆ ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నప్పుడు, “ఆ తర్వాత” అనే బదులు “చివరి రోజుల్లో” అన్నాడు. ఈ సందర్భంలో అవి, యూదా వ్యవస్థ చివరి రోజుల్ని సూచిస్తున్నాయి. ఆ రోజుల్లో దేవుడు “అన్నిరకాల ప్రజల మీద” తన పవిత్రశక్తిని కుమ్మరిస్తాడు. ఈ లేఖనంలోని వివరాల్ని బట్టి, యోవేలు ప్రవచనం నెరవేరడానికి కొంత సమయం పట్టిందని తెలుస్తోంది.

16. దేవుని పవిత్రశక్తి సహాయంతో మొదటి శతాబ్దంలో ప్రకటనా పని ఎలా జరిగింది? మన కాలంలో ఎలా జరుగుతోంది?

16 మొదటి శతాబ్దంలో క్రైస్తవుల మీద దేవుడు పవిత్రశక్తిని కుమ్మరించిన తర్వాతే వాళ్లు ప్రకటనా పనిని విస్తృత స్థాయిలో చేశారు. అపొస్తలుడైన పౌలు దాదాపు క్రీ.శ. 61 లో కొలొస్సయులకు ఉత్తరం రాసే సమయానికి ప్రకటనా పని ఎంత విస్తృతంగా జరిగిందంటే, ‘మంచివార్త భూమంతటా ప్రకటించబడిందని’ ఆయన చెప్పగలిగాడు. (కొలొ. 1:23) పౌలు ఉపయోగించిన “భూమంతటా” అనే పదం అప్పటి ప్రజలకు తెలిసిన ప్రపంచాన్ని మాత్రమే సూచించింది. అయితే యెహోవా పవిత్రశక్తి సహాయం వల్ల మనకాలంలో ప్రకటనా పని మరింత విస్తృతంగా జరుగుతోంది. ఇప్పుడు రాజ్య సందేశం “భూమి అంచుల వరకు” వ్యాపించింది.—అపొ. 13:47; “ నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను” అనే బాక్సు చూడండి.

అవగాహనలో వచ్చిన మార్పు ఏంటి?

17. మిడతల గురించిన యోవేలు ప్రవచనానికి సంబంధించి మన అవగాహనలో ఎలాంటి మార్పు వచ్చింది?

17 మార్పు ఏంటి? యోవేలు 2:7-9 లో ఉన్న ప్రవచనాన్ని ఇప్పుడు మనం మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఆ వచనాలు, మనం ఉత్సాహంగా చేసే ప్రకటనా పనిని కాదుగానీ, క్రీ.పూ. 607 లో యెరూషలేము మీద బబులోను సైనికులు చేసిన దాడిని సూచిస్తున్నాయి.

18. ఏ విషయంలో మార్పు రాలేదు?

18 ఏ విషయంలో మార్పు రాలేదు? యెహోవా ప్రజలు వీలైన ప్రతీ పద్ధతిని ఉపయోగిస్తూ, ప్రతీచోట మంచివార్త ప్రకటిస్తూనే ఉంటారు. (మత్త. 24:14) ప్రభుత్వాలు పెట్టే ఎలాంటి ఆంక్షలూ మన ప్రకటనా పనిని ఆపలేవు. యెహోవా ఆశీర్వాదం వల్ల మనం ఇంతకుముందు కన్నా ఎక్కువ ఉత్సాహంగా, ధైర్యంగా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తున్నాం. బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకోవడానికి మనం వినయంగా యెహోవా మీద ఆధారపడుతూనే ఉంటాం. ఎందుకంటే సరైన సమయం వచ్చినప్పుడు “సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా” ఆయన మనకు సహాయం చేస్తాడని మనం నమ్ముతున్నాం!—యోహా. 16:13.

పాట 97 దేవుని మాట వల్లే జీవిస్తాం

^ పేరా 5 యోవేలు 1, 2 అధ్యాయాల్లో ఉన్న ప్రవచనం ఆధునిక కాలంలో జరుగుతున్న ప్రకటనా పనికి సంబంధించినదని చాలా సంవత్సరాలపాటు నమ్ముతూ వచ్చాం. అయితే ఈ అధ్యాయాల్లోని ప్రవచనం విషయంలో మన అవగాహనలో మార్పు అవసరమని తెలుస్తుంది. దానికి నాలుగు కారణాలు ఉన్నాయి. వాటిని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 3 ఉదాహరణకు 2009, ఏప్రిల్‌ 15, కావలికోట పత్రికలోని “యెహోవా జ్ఞానం గురించి సృష్టి నుండి తెలుసుకోవచ్చు” అనే ఆర్టికల్‌లో 14-16 పేరాలు చూడండి.