కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 17

“నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను”

“నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను”

“నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటన్నిటినీ నేను మీకు తెలియజేశాను.”—యోహా. 15:15.

పాట 13 క్రీస్తు మన ఆదర్శం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనం ఎవరికైనా దగ్గరి స్నేహితులం అవ్వాలంటే ఏం చేయాలి?

సాధారణంగా మనం ఎవరికైనా దగ్గరి స్నేహితులం అవ్వాలంటే ముందు వాళ్లతో కలిసి సమయం గడపాలి. ఆ తర్వాత ఒకరితో ఒకరం మాట్లాడుకోవాలి, ఆలోచనల్ని-అనుభవాల్ని పంచుకోవాలి. అయితే యేసుకు దగ్గరి స్నేహితులం అయ్యే విషయంలో మనకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిలో కొన్నేంటి?

2. మనకు ఎదురయ్యే మొదటి సవాలు ఏంటి?

2 మొదటి సవాలు ఏంటంటే, మనం యేసును నేరుగా కలవలేదు. మొదటి శతాబ్దంలోని చాలామంది క్రైస్తవులు కూడా ఇదే సవాలు ఎదుర్కొన్నారు. దీనిగురించి అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “మీరు ఆయన్ని ఎప్పుడూ చూడలేదు, అయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఆయన్ని చూడట్లేదు, అయినా ఆయన మీద విశ్వాసం చూపిస్తున్నారు.” (1 పేతు. 1:8) కాబట్టి యేసును నేరుగా కలవకపోయినా, ఆయనకు దగ్గరవ్వడం సాధ్యమే.

3. మనకు ఎదురయ్యే రెండో సవాలు ఏంటి?

3 రెండో సవాలు, మనం యేసుతో మాట్లాడలేం. ప్రార్థనలో మనం యెహోవాతో మాట్లాడతాం. మన విన్నపాలన్నిటినీ యేసు పేరున చెప్తాం అనేది వాస్తవమే గానీ, నేరుగా యేసుతో మాత్రం మాట్లాడం. నిజానికి, మనం తనకు ప్రార్థించాలని యేసు కోరుకోవడం లేదు. ఎందుకంటే, ప్రార్థన ఒక విధంగా ఆరాధన లాంటిది; మనం ఆరాధించాల్సింది యెహోవాను మాత్రమే. (మత్త. 4:10) అయినప్పటికీ, మనం యేసును ప్రేమిస్తున్నామని చూపించవచ్చు.

4. మూడో సవాలు ఏంటి? ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 మూడో సవాలు, యేసు పరలోకంలో ఉంటాడు కాబట్టి మనం ఆయనతో కలిసి సమయం గడపడం వీలుకాదు. అయినప్పటికీ, మనం ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడం సాధ్యమే. యేసుతో ఉన్న స్నేహాన్ని బలపర్చుకోవడానికి మనం చేయాల్సిన నాలుగు పనులేంటో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. దానికన్నా ముందు, అసలు క్రీస్తుకు దగ్గరి స్నేహితులు అవ్వడం ఎందుకు అవసరమో తెలుసుకుందాం.

యేసుకు స్నేహితులు అవ్వడం ఎందుకు అవసరం?

5. మనం యేసుకు స్నేహితులుగా ఉండడం ఎందుకు తప్పనిసరి? (“ యేసుకు స్నేహితులమైతే యెహోవాకు కూడా స్నేహితులమౌతాం”; “ యేసు పట్ల సరైన అభిప్రాయం” బాక్సులు చూడండి.)

5 యెహోవాతో దగ్గర సంబంధం కలిగివుండాలంటే, యేసుకు స్నేహితులుగా ఉండడం తప్పనిసరి. దానికిగల రెండు కారణాల్ని పరిశీలిద్దాం. మొదటిది, యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు; ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు.” (యోహా. 16:27) ఆయనింకా ఇలా అన్నాడు: “నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.” (యోహా. 14:6) ద్వారం లేని భవనం లోపలికి వెళ్లడం ఎలాగైతే అసాధ్యమో, యేసుతో దగ్గరి సంబంధం లేకుండా యెహోవాకు స్నేహితులు అవ్వడం కూడా అసాధ్యం. ఒక సందర్భంలో స్వయంగా యేసే తనను తాను ‘గొర్రెలు వెళ్లే ద్వారంతో’ పోల్చుకున్నాడు. (యోహా. 10:7) రెండవది, యేసు తన తండ్రి లక్షణాల్ని పరిపూర్ణంగా చూపించాడు. యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.” (యోహా. 14:9) కాబట్టి యెహోవా గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం, యేసు జీవితాన్ని అధ్యయనం చేయడం. యేసు గురించి తెలుసుకునే కొద్దీ, మనకు ఆయనపై ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఆయన మీద ప్రేమ పెరిగే కొద్దీ, ఆయన తండ్రి మీద కూడా ప్రేమ పెరుగుతూ ఉంటుంది.

6. మనం యేసుకు స్నేహితులుగా ఉండడానికి ఇంకో కారణం ఏంటి? వివరించండి.

6 మన ప్రార్థనలకు జవాబులు పొందాలంటే, యేసుకు స్నేహితులుగా ఉండడం తప్పనిసరి. అంటే మన ప్రార్థనల చివర్లో “యేసు పేరున అడుగుతున్నాం” అని చెప్పడమే కాదు; యెహోవా మన ప్రార్థనలకు జవాబిచ్చే విషయంలో యేసును ఎలా ఉపయోగించుకుంటున్నాడో కూడా గుర్తించాలి. యేసు తన అపొస్తలులకు ఇలా చెప్పాడు: “నా పేరున మీరు ఏది అడిగినా నేను అది చేస్తాను.” (యోహా. 14:13) మన ప్రార్థనలు వినేది, జవాబిచ్చేది యెహోవాయే. అయితే ఆయన తన నిర్ణయాల్ని అమలు చేసే అధికారాన్ని యేసుకు ఇచ్చాడు. (మత్త. 28:18) కాబట్టి, యెహోవా మన ప్రార్థనలకు జవాబిచ్చే ముందు, మనం యేసు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించామో లేదో చూస్తాడు. ఉదాహరణకు యేసు ఈ ఉపదేశమిచ్చాడు: “మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమిస్తే, మీ పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు; మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమించకపోతే, మీ పరలోక తండ్రి కూడా మీ పాపాల్ని క్షమించడు.” (మత్త. 6:14, 15) యెహోవా, యేసు మనతో వ్యవహరిస్తున్నట్టే, మనం కూడా ఇతరులతో వ్యవహరించడం ఎంత ప్రాముఖ్యమో కదా!

7. యేసు అర్పించిన బలి నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?

7 యేసు అర్పించిన బలి నుండి ప్రయోజనం పొందాలంటే, ఆయనకు స్నేహితులుగా ఉండడం తప్పనిసరి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? యేసు తన ‘స్నేహితుల కోసం ప్రాణం పెడతానని’ చెప్పాడు. (యోహా. 15:13) యేసు భూమ్మీదికి రావడానికి ముందు జీవించిన నమ్మకమైన సేవకులు కూడా యేసును తెలుసుకోవాలి, ప్రేమించాలి. అంటే అబ్రాహాము, శారా, మోషే, రాహాబు లాంటివాళ్లు కూడా పునరుత్థానమైన తర్వాత యేసుకు స్నేహితులు అవ్వాలి. అప్పుడే వాళ్లు శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటారు.—యోహా. 17:3; అపొ. 24:15; హెబ్రీ. 11:8-12, 24-26, 31.

8-9. యోహాను 15:4, 5 వచనాల ప్రకారం, మనం యేసుకు స్నేహితులుగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

8 రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించి, బోధించే విషయంలో యేసుతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం మనకు ఉంది. యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఇతరులకు బోధించాడు. ఆయన పరలోకానికి వెళ్లినప్పటి నుండి, సంఘానికి శిరస్సుగా ఉంటూ ప్రకటనా పనిని, బోధనా పనిని నిర్దేశిస్తున్నాడు. వీలైనంత ఎక్కువమందికి తన గురించి, తన తండ్రి గురించి చెప్పడానికి మీరు చేస్తున్న కృషిని ఆయన చూస్తున్నాడు, దాన్ని విలువైనదిగా ఎంచుతున్నాడు. నిజానికి యెహోవా, యేసు సహాయం ఉంటేనే మనం ప్రకటనా పనిని పూర్తి స్థాయిలో చేయగలం.—యోహాను 15:4, 5 చదవండి.

9 యెహోవాను సంతోషపెట్టాలంటే, మనకు యేసు మీద ప్రేమ ఉండాలని, ఆ ప్రేమను కాపాడుకోవాలని బైబిలు ఖచ్చితంగా చెప్తోంది. కాబట్టి యేసుకు స్నేహితులుగా ఉండడానికి మనం చేయాల్సిన నాలుగు పనులేంటో పరిశీలిద్దాం.

యేసుకు స్నేహితులం అవ్వాలంటే ఏం చేయాలి?

మనం యేసుకు స్నేహితులం అవ్వాలంటే (1) యేసు గురించి తెలుసుకోవాలి, (2) యేసులా ఆలోచించాలి, ప్రవర్తించాలి, (3) క్రీస్తు సహోదరులకు మద్దతివ్వాలి, (4) యెహోవా సంస్థ చేసే ఏర్పాట్లకు మద్దతివ్వాలి (10-14 పేరాలు చూడండి)

 *

10. యేసుకు స్నేహితులుగా ఉండడానికి మనం చేయాల్సిన మొదటి పని ఏంటి?

10 (1) యేసు గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను చదవాలి. యేసు జీవితానికి సంబంధించిన బైబిలు వృత్తాంతాల గురించి లోతుగా ఆలోచించినప్పుడు, ప్రజలతో యేసు వ్యవహరించిన విధానాన్ని బట్టి మనకు ఆయన మీద ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ఉదాహరణకు, ఆయన యజమాని స్థానంలో ఉన్నప్పటికీ తన శిష్యుల్ని దాసులుగా చూడలేదు. బదులుగా తన మనసులోని ఆలోచనల్ని, భావాల్ని వాళ్లతో పంచుకున్నాడు. (యోహా. 15:15) తన శిష్యులు బాధపడినప్పుడు ఆయన కూడా బాధపడ్డాడు, వాళ్లతో కలిసి ఏడ్చాడు. (యోహా. 11:32-36) తన సందేశాన్ని అంగీకరించిన వాళ్లందర్నీ యేసు తన స్నేహితుల్లా చూశాడని ఆయన శత్రువులు కూడా చెప్పారు. (మత్త. 11:19) యేసు తన శిష్యులతో వ్యవహరించినట్టే మనం కూడా ఇతరులతో వ్యవహరిస్తే వాళ్లతో మంచి సంబంధం కలిగివుంటాం; తృప్తిగా, సంతోషంగా జీవిస్తాం. అంతేకాదు క్రీస్తు పట్ల మనకున్న ప్రేమ, గౌరవం మరింత పెరుగుతాయి.

11. యేసుకు స్నేహితులుగా ఉండడానికి మనం చేయాల్సిన రెండో పని ఏంటి? అది ఎందుకు ముఖ్యమైంది?

11 (2) యేసులా ఆలోచించాలి, ప్రవర్తించాలి. యేసు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఆయన ఆలోచనా విధానాన్ని ఎంత ఎక్కువ అనుకరిస్తే, ఆయనతో మనకున్న స్నేహం అంత ఎక్కువ బలపడుతుంది. (1 కొరిం. 2:16) మనం యేసును ఎలా అనుకరించవచ్చు? ఒక ఉదాహరణ గమనించండి. యేసు ఎక్కువగా ఇతరులకు సహాయం చేయడం గురించే ఆలోచించాడు గానీ, తన సంతోషం చూసుకోలేదు. (మత్త. 20:28; రోమా. 15:1-3) ఆయన అలా ఆలోచించాడు కాబట్టే త్యాగాలు చేయగలిగాడు, క్షమించగలిగాడు. ఇతరులు తన గురించి తప్పుగా మాట్లాడినా నొచ్చుకోలేదు. (యోహా. 1:46, 47) అంతేకాదు ప్రజలు ఎప్పుడో చేసిన పొరపాట్లను మనసులో పెట్టుకుని, వాళ్లు ఇక ఎప్పటికీ మారరనే ముగింపుకు రాలేదు. (1 తిమో. 1:12-14) యేసు ఇలా అన్నాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:35) మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: “నేను యేసును ఆదర్శంగా తీసుకుంటూ, సహోదరసహోదరీలతో సమాధానంగా ఉండడానికి చేయగలిగినదంతా చేస్తున్నానా?”

12. యేసుకు స్నేహితులుగా ఉండడానికి మనం చేయాల్సిన మూడో పని ఏంటి? దాన్ని మనం ఎలా చేయవచ్చు?

12 (3) క్రీస్తు సహోదరులకు మద్దతివ్వాలి. మనం అభిషిక్త సహోదరుల కోసం చేసేవాటిని, తన కోసం చేసినవాటిలా యేసు భావిస్తాడు. (మత్త. 25:34-40) మనం అభిషిక్తులకు మద్దతివ్వగల అత్యంత ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే, యేసు మనకు అప్పగించిన ప్రకటనా పనిలో-శిష్యుల్ని చేసే పనిలో వీలైనంత ఎక్కువగా పాల్గొనడం. (మత్త. 28:19, 20; అపొ. 10:42) క్రీస్తు సహోదరులు ‘వేరే గొర్రెల’ సహాయంతో మాత్రమే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని పూర్తి స్థాయిలో చేయగలరు. (యోహా. 10:16) మీరు వేరే గొర్రెలైతే, ప్రకటనా పనిలో పాల్గొన్న ప్రతీసారి మీరు క్రీస్తు సహోదరుల పట్ల మాత్రమే కాదు, యేసు పట్ల కూడా ప్రేమ చూపించినవాళ్లు అవుతారు.

13. లూకా 16:9 లో ఉన్న యేసు సలహాను మనమెలా పాటించవచ్చు?

13 రాజ్యపనికి డబ్బును విరాళంగా ఇవ్వడం ద్వారా కూడా ఆ పనిని నిర్దేశిస్తున్న యెహోవాకు, యేసుకు స్నేహితులం అవ్వవచ్చు. (లూకా 16:9 చదవండి.) ఉదాహరణకు మనం ప్రపంచవ్యాప్త పని కోసం విరాళం ఇవ్వవచ్చు. ఆ విరాళం మారుమూల ప్రాంతాల్లో ప్రకటనా పని చేయడానికి, సత్యారాధనకు ఉపయోగపడే భవనాల్ని నిర్మించడానికి-వాటిని మంచి స్థితిలో ఉంచడానికి, ఏదైనా విపత్తులో నష్టపోయినవాళ్లను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. మన స్థానిక సంఘ ఖర్చుల కోసం కూడా విరాళం ఇవ్వవచ్చు. అంతేకాదు అవసరంలో ఉన్నారని మనం గుర్తించిన వాళ్లకు కూడా ఆర్థిక సహాయం చేయవచ్చు. (సామె. 19:17) ఇవన్నీ చేయడం ద్వారా మనం క్రీస్తు సహోదరులకు మద్దతివ్వవచ్చు.

14. ఎఫెసీయులు 4:15, 16 ప్రకారం యేసుకు స్నేహితులుగా ఉండడానికి చేయాల్సిన నాలుగో పని ఏంటి?

14 (4) యెహోవా సంస్థ చేసే ఏర్పాట్లకు మద్దతివ్వాలి. మనల్ని చూసుకోవడానికి నియమించిన సహోదరులకు మద్దతిచ్చినప్పుడు, సంఘానికి శిరస్సైన యేసుకు దగ్గరి స్నేహితులం అవుతాం. (ఎఫెసీయులు 4:15, 16 చదవండి.) ఉదాహరణకు, ప్రస్తుతం మన రాజ్యమందిరాలన్నిటినీ వీలైనంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకోసం కొన్ని సంఘాల్ని వేరే సంఘాలతో కలపడం, టెరిటరీ సరిహద్దుల్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు వల్ల విరాళంగా వచ్చిన డబ్బును చాలావరకు ఆదా చేయగలిగాం. అదే సమయంలో, కొంతమంది ప్రచారకులు మారిన పరిస్థితులకు అలవాటుపడాల్సి వచ్చింది. ఆ నమ్మకమైన ప్రచారకులు చాలా సంవత్సరాలుగా ఒకే సంఘంలో ఉంటూ, అందులో ఉన్న సహోదర సహోదరీలకు చాలా దగ్గరై ఉండవచ్చు. కానీ ఇప్పుడు వాళ్లు వేరే సంఘానికి వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ వాళ్లు సంస్థ చేసిన ఏర్పాట్లకు నమ్మకంగా మద్దతివ్వడం చూసి యేసు చాలా సంతోషిస్తున్నాడు.

ఎప్పటికీ యేసుకు స్నేహితులుగాఉండొచ్చు

15. భవిష్యత్తులో యేసుతో మనకున్న స్నేహం ఎలా బలపడుతుంది?

15 పవిత్రశక్తితో అభిషేకించబడిన వాళ్లకు ఎప్పటికీ యేసుతో కలిసివుంటూ దేవుని రాజ్యంలో ఆయనతో కలిసి పరిపాలించే అవకాశం ఉంది. అప్పుడు వాళ్లు యేసుతో ఉంటారు. అంటే ఆయన్ని చూస్తారు, ఆయనతో మాట్లాడతారు, ఆయనతో సమయం గడుపుతారు. (యోహా. 14:2, 3) పరదైసు భూమ్మీద జీవించేవాళ్లు కూడా యేసు ప్రేమను, శ్రద్ధను రుచిచూస్తారు. వాళ్లు యేసును కళ్లారా చూడలేకపోయినా యెహోవా, యేసు ఏర్పాటు చేసిన జీవితాన్ని ఆనందిస్తూ యేసుతో తమకున్న స్నేహాన్ని బలపర్చుకుంటూ ఉంటారు.—యెష. 9:6, 7.

16. యేసుకు స్నేహితులం అవ్వడం వల్ల ఎలాంటి దీవెనలు పొందుతాం?

16 తనతో స్నేహం చేయమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించినప్పుడు మనం ఎన్నో దీవెనలు పొందుతాం. ఉదాహరణకు ఇప్పుడు ఆయన ప్రేమను, మద్దతును ఆనందిస్తున్నాం. శాశ్వతకాలం జీవించే నిరీక్షణ పొందాం. అన్నిటికన్నా ముఖ్యంగా, యేసు తండ్రైన యెహోవాతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగివున్నాం; యేసుకు స్నేహితులం అవ్వడం వల్ల మనం పొందగలిగే అత్యంత విలువైన ఆశీర్వాదం అదే. నిజంగా, యేసుకు స్నేహితులం అవ్వడం మనకు దొరికిన గొప్ప అవకాశం.

పాట 17 “నాకు ఇష్టమే”

^ పేరా 5 అపొస్తలులకు కొన్ని సంవత్సరాలపాటు యేసుతో నేరుగా మాట్లాడే, కలిసి పనిచేసే అవకాశం దొరికింది. దానివల్ల వాళ్లు ఆయనకు మంచి స్నేహితులయ్యారు. మనం కూడా తన స్నేహితులు అవ్వాలని యేసు కోరుకుంటున్నాడు. అయితే అపొస్తలులు చేసినంత తేలిగ్గా మనం యేసుతో స్నేహం చేయలేం, మనకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లు ఏంటో, వాటిని అధిగమించి యేసుకు దగ్గరి స్నేహితులం ఎలా అవ్వవచ్చో, ఆ స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

^ పేరా 56 చిత్రాల వివరణ: (1) కుటుంబ ఆరాధనలో యేసు జీవితం గురించి, పరిచర్య గురించి అధ్యయనం చేయవచ్చు. (2) సంఘంలో సహోదర సహోదరీలతో సమాధానంగా ఉండడానికి కృషిచేయవచ్చు. (3) పరిచర్యలో వీలైనంత ఎక్కువగా పాల్గొనడం ద్వారా క్రీస్తు సహోదరులకు మద్దతివ్వవచ్చు. (4) మన సంఘాన్ని వేరే సంఘంతో కలిపినప్పుడు, సంఘపెద్దలు తీసుకునే నిర్ణయాలకు లోబడవచ్చు.