కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 25

‘నేనే స్వయంగా నా గొర్రెల కోసం వెదుకుతాను’

‘నేనే స్వయంగా నా గొర్రెల కోసం వెదుకుతాను’

“నేనే స్వయంగా నా గొర్రెల కోసం వెదికి, వాటి బాగోగులు చూసుకుంటాను.”—యెహె. 34:11.

పాట 105 “దేవుడు ప్రేమ”

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా తనను పాలిచ్చే తల్లితో ఎందుకు పోల్చుకున్నాడు?

యెషయా ప్రవక్త రోజుల్లో యెహోవా ఈ ప్రశ్న అడిగాడు: “స్త్రీ, పాలుతాగే తన చంటిబిడ్డను మర్చిపోతుందా?” తర్వాత, ఆయన తన ప్రజలకు ఇలా చెప్పాడు: “వాళ్లయినా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను ఎన్నడూ మర్చిపోను.” (యెష. 49:15) ఈ సందర్భంలో యెహోవా తనను ఒక తల్లితో పోల్చుకున్నాడు. అలాంటి పోలిక బైబిల్లో చాలా తక్కువసార్లు కనిపిస్తుంది. ఆయన తన సేవకుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేయడానికి, తల్లీబిడ్డల మధ్య ఉండే బంధాన్ని ఉపయోగించాడు. జాస్మిన్‌ అనే సహోదరి ఇలా అంది: “బిడ్డకు పాలిచ్చినప్పుడు, తల్లికి ఆ బిడ్డతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది, అది శాశ్వతంగా ఉంటుంది.” ఈ మాటలు నిజమని చాలామంది తల్లులు ఒప్పుకుంటారు.

2. నిష్క్రియుల్ని చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

2 తన సేవకులు ఎవరైనా పరిచర్య చేయడం, మీటింగ్స్‌కి రావడం మానేస్తే యెహోవా దాన్ని గమనిస్తాడు. ప్రతీ సంవత్సరం తన సేవకుల్లో కొన్ని వేలమంది నిష్క్రియులు * అవ్వడం చూసి యెహోవా ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి.

3. యెహోవా ఏం కోరుకుంటున్నాడు?

3 నిష్క్రియులుగా మారిన చాలామంది సహోదరసహోదరీలు సంఘానికి తిరిగొస్తారు. వాళ్లు అలా వచ్చినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. వాళ్లు తిరిగి రావాలని యెహోవా కోరుకుంటున్నాడు, మన కోరిక కూడా అదే. (1 పేతు. 2:25) వాళ్లు తిరిగి రావడానికి మనమెలా సహాయం చేయవచ్చు? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు, అసలు కొంతమంది పరిచర్యకు వెళ్లడం, మీటింగ్స్‌కు రావడం ఎందుకు మానేస్తారో పరిశీలిద్దాం.

కొంతమంది యెహోవాను సేవించడం ఎందుకు మానేస్తారు?

4. ఉద్యోగం వల్ల కొంతమంది దేవునికి ఎలా దూరమౌతారు?

4 కొంతమంది తమ జీవితంలో ఉద్యోగానికే మొదటి స్థానం ఇస్తారు. ఆసియాలో ఉంటున్న హంగ్‌ * అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నా సమయాన్ని, శక్తిని ఎక్కువగా ఉద్యోగం కోసమే ఉపయోగించేవాడిని. నా దగ్గర ఎక్కువ డబ్బుంటే, యెహోవా సేవను బాగా చేయవచ్చని తెలివితక్కువగా ఆలోచించాను. కాబట్టి ఎక్కువ గంటలు పనిచేశాను. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మీటింగ్స్‌ మానేసేవాడిని, కొంతకాలానికి పూర్తిగా మానేశాను. సాతాను ఈ లోకంలో ఉన్నవాటిని ఉపయోగించి, ప్రజల్ని మెల్లమెల్లగా దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు.”

5. ఒక సహోదరి సంఘానికి ఎలా దూరమైంది?

5 కొంతమంది సహోదరసహోదరీలు ఎన్నో రకాల సమస్యలతో సతమతమౌతున్నారు. బ్రిటన్‌లో జీవిస్తున్న ఆన్‌ అనే సహోదరికి ఐదుగురు పిల్లలు. ఆమె ఇలా చెప్తుంది: “మా చిన్నబ్బాయి చాలా రకాల లోపాలతో పుట్టాడు. కొంతకాలానికి మా చిన్నమ్మాయి బహిష్కరించబడింది, పెద్దబ్బాయికి మానసిక సమస్యలు మొదలయ్యాయి. నేనెంత కృంగిపోయానంటే మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్లడం ఆపేశాను. అలా చాలాకాలంపాటు సంఘానికి దూరమయ్యాను.” ఆన్‌ కుటుంబాన్ని, ఆమెలాంటి సమస్యలు అనుభవిస్తున్న ఇతరుల్ని చూసినప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది.

6. కొలొస్సయులు 3:13 లో ఉన్న సూత్రాన్ని పాటించకపోవడం వల్ల ఒక వ్యక్తి సంఘానికి ఎలా దూరమవ్వవచ్చు?

6 కొలొస్సయులు 3:13 చదవండి. తోటి విశ్వాసుల మాటల వల్ల, పనుల వల్ల కొంతమంది ఇబ్బందిపడ్డారు. అవును, సహోదరసహోదరీల మీద “ఫిర్యాదు చేయడానికి” కొన్నిసార్లు సరైన కారణాలు ఉండవచ్చని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అన్యాయానికి గురై ఉండవచ్చు. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే, మనం వాళ్లమీద కోపం పెంచుకునే అవకాశం ఉంది. తోటి విశ్వాసుల మీద కోపం పెంచుకునే వ్యక్తి మెల్లమెల్లగా సంఘానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాకు చెందిన పాబ్లో అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన తప్పు చేశాడని సంఘంలో ఒకరు అబద్ధం చెప్పారు. దాన్ని పెద్దలు కూడా నమ్మడంతో, ఆయనకున్న సేవావకాశాల్ని కోల్పోయాడు. మరి పాబ్లో ఎలా స్పందించాడు? ఆయనిలా అన్నాడు: “నాకు కోపం వచ్చి, మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్లడం మెల్లమెల్లగా మానేశాను.”

7. మనస్సాక్షి బాధపెట్టడం వల్ల ఒక వ్యక్తి సంఘానికి ఎలా దూరమవ్వవచ్చు?

7 గతంలో చేసిన తప్పును బట్టి ఒక వ్యక్తి మనస్సాక్షి అతన్ని ఎంతోకాలంగా బాధపెడుతుండవచ్చు. దేవుని ప్రేమ పొందే అర్హత తనకు లేదని అతను అనుకుంటుండవచ్చు. పశ్చాత్తాపపడిన తర్వాత, కరుణ చూపించబడిన తర్వాత కూడా తనకు దేవుని ప్రజలతో కలిసుండే అర్హత లేదని అతను అనుకోవచ్చు. ఫ్రాన్సిస్‌ అనే సహోదరుడు అలానే అనుకున్నాడు. ఆయనిలా చెప్తున్నాడు: “లైంగిక పాపం చేసినందుకు పెద్దలు నన్ను గద్దించారు. ఆ తర్వాత కూడా మీటింగ్స్‌కి వెళ్తుండేవాడిని కానీ, కృంగుదలకు లోనవ్వడం వల్ల యెహోవా ప్రజల మధ్య ఉండడానికి నేను తగినవాడిని కాదనుకున్నాను. నా మనస్సాక్షి ఇంకా బాధపెడుతూ ఉండడం వల్ల, యెహోవా నన్ను క్షమించలేదని అనిపించింది. కొంతకాలానికి ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి వెళ్లడం పూర్తిగా ఆపేశాను.” ఇప్పటిదాకా చర్చించుకున్న లాంటి సమస్యలు అనుభవిస్తున్న వాళ్లను చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంది? వాళ్లు పడుతున్న బాధను మీరు అర్థం చేసుకుంటారా? మరి ముఖ్యంగా, వాళ్లను చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

యెహోవా తన గొర్రెల్ని ప్రేమిస్తున్నాడు

ఇశ్రాయేలు కాలంలోని ఒక కాపరి తప్పిపోయిన గొర్రెను శ్రద్ధగా చూసుకుంటున్నాడు (8-9 పేరాలు చూడండి) *

8. సంఘానికి దూరమైన తన సేవకుల్ని యెహోవా మర్చిపోతాడా? వివరించండి.

8 సంఘానికి దూరమైన తన సేవకుల్ని, ఒకప్పుడు వాళ్లు చేసిన సేవను యెహోవా మర్చిపోడు. (హెబ్రీ. 6:10) ఆయనకు తన ప్రజల మీదున్న శ్రద్ధను యెషయా ఇలా చక్కగా వర్ణించాడు: “గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు. గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు, వాటిని తన గుండెల మీద మోస్తాడు.” (యెష. 40:11) తన మంద నుండి ఒక గొర్రె దూరమైనప్పుడు గొప్ప కాపరి అయిన యెహోవాకు ఎలా అనిపిస్తుంది? దానికి జవాబు యేసు తన శిష్యుల్ని అడిగిన ఈ ప్రశ్నల్లో ఉంది: “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే, అతను మిగతా 99 గొర్రెల్ని కొండల మీదే విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్లడా? అది దొరికినప్పుడు, తప్పిపోని మిగతా 99 గొర్రెల విషయంలో కన్నా ఆ గొర్రె విషయంలో ఎక్కువ సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”—మత్త. 18:12, 13.

9. బైబిలు కాలాల్లో ఒక మంచి కాపరి తన గొర్రెల్ని ఎలా చూసుకునేవాడు? (ముఖచిత్రం చూడండి.)

9 యెహోవాను గొర్రెల కాపరితో పోల్చడం సరైనదే. ఎందుకంటే బైబిలు కాలాల్లో, ఒక మంచి కాపరి తన గొర్రెల్ని చాలా శ్రద్ధగా చూసుకునేవాడు. ఉదాహరణకు దావీదు తన గొర్రెల్ని కాపాడుకోవడానికి సింహంతో, ఎలుగుబంటితో పోరాడాడు. (1 సమూ. 17:34, 35) ఒక్క గొర్రె తప్పిపోయినా మంచి కాపరికి వెంటనే తెలిసిపోతుంది. (యోహా. 10:3, 14) అతను తన 99 గొర్రెల్ని దొడ్డిలో ఉంచి లేదా తోటి కాపరులకు అప్పజెప్పి, తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ ఉదాహరణను ఉపయోగించి యేసు ఒక విలువైన సత్యాన్ని బోధించాడు: “ఈ చిన్నవాళ్లలో ఒక్కరు కూడా నాశనమవ్వడం పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టంలేదు.”—మత్త. 18:14.

ఇశ్రాయేలు కాలంలోని ఒక కాపరి తప్పిపోయిన గొర్రెను శ్రద్ధగా చూసుకుంటున్నాడు (9వ పేరా చూడండి)

యెహోవా తన గొర్రెల్ని వెదుకుతాడు

10. యెహెజ్కేలు 34:11-16 ప్రకారం, తప్పిపోయిన తన గొర్రెల గురించి యెహోవా ఏమని మాటిచ్చాడు?

10 యెహోవా మనలో ప్రతీ ఒక్కర్ని ప్రేమిస్తాడు; తన మంద నుండి దూరంగా వెళ్లిపోయిన ‘చిన్నవాళ్లను’ కూడా ఆయన ప్రేమిస్తాడు. తప్పిపోయిన తన గొర్రెల్ని వెదుకుతానని, ఆధ్యాత్మికంగా బలపడేలా వాటికి సహాయం చేస్తానని యెహోవా తన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మాటిచ్చాడు. అంతేకాదు, వాటిని కాపాడడానికి ఏమేం చేస్తాడో కూడా ఆయన వివరించాడు. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఇశ్రాయేలు కాలంలోని కాపరి కూడా అలాంటి పనులే చేసేవాడు. (యెహెజ్కేలు 34:11-16 చదవండి.) మొదటిగా కాపరి, తప్పిపోయిన గొర్రెను వెదుకుతాడు; దానికోసం చాలా సమయం, శక్తి అవసరం. రెండోదిగా, అది కనిపించాక దాన్ని మంద దగ్గరకు తీసుకొస్తాడు. మూడవదిగా, ఒకవేళ అది గాయపడి ఉంటే దాని గాయాలకు కట్టు కడతాడు, ఎత్తుకుంటాడు; ఒకవేళ నీరసించిపోయి ఉంటే దానికి ఆహారం పెడతాడు. అలా కాపరి ఆ గొర్రె పట్ల ఎంతో ప్రేమ, శ్రద్ధ చూపిస్తాడు. “దేవుని మందను” కాసే పెద్దలు కూడా, సంఘానికి దూరమైన వాళ్లకు సహాయం చేయడానికి ఇలాంటి పనులే చేయాల్సి ఉంటుంది. (1 పేతు. 5:2, 3) పెద్దలు అలాంటివాళ్ల కోసం వెదకాలి, సంఘానికి తిరిగి రావడానికి సహాయం చేయాలి, ప్రేమ చూపిస్తూ ఆధ్యాత్మిక మద్దతివ్వాలి. *

11. మంచి కాపరి ఏ విషయాన్ని అర్థం చేసుకుంటాడు?

11 ఒక మంచి కాపరి, గొర్రెలు తప్పిపోయే అవకాశం ఉంటుందని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఏదైనా గొర్రె తప్పిపోయినప్పుడు, దానితో కఠినంగా వ్యవహరించడు. కొంతకాలంపాటు తన సేవలో చురుగ్గా పాల్గొనని తన సేవకులతో యెహోవా ఎలా వ్యవహరించాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

12. యెహోవా యోనా మీద ప్రేమ, శ్రద్ధ ఎలా చూపించాడు?

12 యోనా ప్రవక్త, యెహోవా తనకు అప్పగించిన పనిని చేయకుండా నీనెవెకు దూరంగా పారిపోయాడు. అప్పుడు యెహోవా అతని మీద ఆశలు వదులుకోలేదు. ఒక మంచి కాపరిలాగే యెహోవా యోనాను కాపాడాడు, తన పనిని చేయడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చాడు. (యోనా 2:7; 3:1, 2) తర్వాత ఒక సొరచెట్టును ఉపయోగించి, మనిషి ప్రాణం ఎంత విలువైనదో అతను అర్థం చేసుకునేలా సహాయం చేశాడు. (యోనా 4:10, 11) దీన్నుండి ఏం నేర్చుకోవచ్చు? సంఘపెద్దలు నిష్క్రియులైన ప్రచారకుల మీద ఆశలు వదులుకోకూడదు. బదులుగా, వాళ్లు సంఘానికి ఎందుకు దూరమయ్యారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగొచ్చినప్పుడు, పెద్దలు వాళ్ల మీద ప్రేమ, శ్రద్ధ చూపిస్తూ ఉండాలి.

13. 73వ కీర్తన రాసిన వ్యక్తితో యెహోవా వ్యవహరించిన తీరు నుండి ఏం నేర్చుకోవచ్చు?

13 73వ కీర్తన రాసిన వ్యక్తి, దుష్టులు వర్ధిల్లడం చూసి చాలా నిరుత్సాహపడ్డాడు. అసలు దేవుని సేవ చేయడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని సందేహపడ్డాడు. (కీర్త. 73:12, 13, 16) అప్పుడు యెహోవా ఎలా స్పందించాడు? ఆయన ఆ కీర్తనకర్తను గద్దించలేదు. బదులుగా, అతని మాటల్ని బైబిల్లో రాయించాడు. చివరికి, యెహోవా స్నేహితునిగా ఉండడం కన్నా గొప్ప విషయం జీవితంలో ఇంకేదీ లేదని ఆ కీర్తనకర్త గ్రహించాడు. (కీర్త. 73:23, 24, 26, 28) దీన్నుండి ఏం నేర్చుకోవచ్చు? యెహోవాను సేవించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని సందేహించే వాళ్లను సంఘపెద్దలు విమర్శించకూడదు. బదులుగా, వాళ్లు ఎందుకలా మాట్లాడుతున్నారో, ప్రవర్తిస్తున్నారో అర్థంచేసుకోవాలి. అప్పుడే లేఖనాలు ఉపయోగించి వాళ్లను ప్రోత్సహించగలుగుతారు.

14. ఏలీయాకు సహాయం ఎందుకు అవసరం? యెహోవా అతనికి ఏ విధంగా సహాయం చేశాడు?

14 ఏలీయా ప్రవక్త యెజెబెలు రాణికి భయపడి పారిపోయాడు. (1 రాజు. 19:1-3) యెహోవా ప్రవక్తల్లో అతను మాత్రమే మిగిలాడని, అతని శ్రమంతా వృథా అయిపోయిందని ఏలీయా అనుకున్నాడు. అంతేకాదు, చనిపోవాలని కోరుకునేంతగా నిరాశలో మునిగిపోయాడు. (1 రాజు. 19:4, 10) అయితే యెహోవా ఏలీయాను గద్దించలేదు. బదులుగా, అతను ఒంటరివాడు కాదని ధైర్యం చెప్పాడు, తన శక్తి మీద నమ్మకం ఉంచమని ప్రోత్సహించాడు, అతను చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని హామీ ఇచ్చాడు. యెహోవా ఏలీయా ఆందోళనలన్నిటినీ దయగా విని, అతనికి కొత్త నియామకాలు ఇచ్చాడు. (1 రాజు. 19:11-16, 18) దీన్నుండి ఏం నేర్చుకోవచ్చు? మనందరం, ముఖ్యంగా సంఘపెద్దలు దేవుని మందతో దయతో వ్యవహరించాలి. ఒక నిష్క్రియుడు కోపంగా మాట్లాడుతున్నా, లేదా దేవుని కరుణ పొందే అర్హత తనకు లేదన్నట్టు మాట్లాడుతున్నా సంఘపెద్దలు అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత, యెహోవాకు అతను ఎంతో విలువైనవాడనే నమ్మకాన్ని కలిగిస్తారు.

నిష్క్రియుల విషయంలో మన బాధ్యత ఏంటి?

15. యోహాను 6:39 ప్రకారం, యేసు తన తండ్రి గొర్రెల్ని ఎలా చూశాడని చెప్పవచ్చు?

15 తన మందకు దూరమైన వాళ్లను మనం ఎలా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు? దీనికి జవాబు తెలుసుకోవడానికి యేసు ఆదర్శాన్ని పరిశీలించాలి. యెహోవా తన గొర్రెలన్నిటినీ విలువైనవాటిగా చూస్తాడని యేసుకు తెలుసు. అందుకే, ‘ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెలన్నిటినీ’ తిరిగి యెహోవా దగ్గరకు తీసుకురావడానికి ఆయన తీవ్రంగా కృషిచేశాడు. (మత్త. 15:24; లూకా 19:9, 10) అంతేకాదు యేసు ఒక మంచి కాపరి కాబట్టి, యెహోవా గొర్రెల్లో ఏ ఒక్కదాన్నీ పోగొట్టుకోకుండా ఉండేందుకు ఆయన చేయగలిగినదంతా చేశాడు.యోహాను 6:39 చదవండి.

16-17. సంఘానికి దూరమైన వాళ్లకు సహాయం చేసే బాధ్యతను పెద్దలు ఎలా చూడాలి? (“ సంఘానికి దూరమైనవాళ్ల భావాలు” అనే బాక్సు చూడండి.)

16 అపొస్తలుడైన పౌలు యేసును ఆదర్శంగా తీసుకోమని ఎఫెసు సంఘపెద్దల్ని ప్రోత్సహించాడు. పౌలు వాళ్లకిలా చెప్పాడు: “బలహీనంగా ఉన్నవాళ్లకు సహాయం చేయాలని, ప్రభువైన యేసు చెప్పిన మాటలు మనసులో ఉంచుకోవాలని అన్ని విషయాల్లో మీకు చూపించాను. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: ‘తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.’” (అపొ. 20:17, 35) అవును, యెహోవా ప్రజల్ని శ్రద్ధగా చూసుకోవాల్సిన ప్రత్యేకమైన బాధ్యత నేడున్న సంఘపెద్దలకు ఉంది. స్పెయిన్‌లో సంఘపెద్దగా సేవచేస్తున్న సాల్వడార్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “సంఘానికి దూరమైన గొర్రెల విషయంలో యెహోవాకున్న శ్రద్ధ గురించి ఆలోచించినప్పుడు, వాళ్లకు ఎలాగైనా సహాయం చేయాలనిపిస్తుంది. నేను వాళ్లను శ్రద్ధగా చూసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడని నాకు తెలుసు.”

17 ఈ ఆర్టికల్‌లో పరిశీలించిన నిష్క్రియులందరికీ సహోదరసహోదరీలు చేసిన సహాయం వల్ల, వాళ్లు యెహోవా దగ్గరకు తిరిగొచ్చారు. సంఘానికి దూరమైన ఇంకెంతోమంది కూడా అలా తిరిగిరావాలని మనం కోరుకుంటున్నాం. వాళ్లు తిరిగిరావడానికి మనం ఇంకా ఎలా సహాయం చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో వివరంగా పరిశీలిస్తాం.

పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!

^ పేరా 5 యెహోవాను ఎన్నో ఏళ్లపాటు నమ్మకంగా సేవించిన కొంతమంది సంఘానికి ఎందుకు దూరమౌతారు? వాళ్లను చూసినప్పుడు యెహోవాకు ఏమనిపిస్తుంది? వీటికి జవాబుల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. బైబిలు కాలాల్లోని కొందరు, కొంతకాలంపాటు యెహోవా సేవలో చురుగ్గా పాల్గొనలేదు. వాళ్లకు యెహోవా సహాయం చేసిన తీరు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 2 పదాల వివరణ: ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువకాలంపాటు, సంఘంతో కలిసి పరిచర్యలో పాల్గొనని ప్రచారకుల్ని నిష్క్రియులు అంటారు. నిష్క్రియులు అయినప్పటికీ, వాళ్లు ఇంకా మన సహోదరసహోదరీలే. మనం వాళ్లను ప్రేమిస్తాం.

^ పేరా 4 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 10 సంఘపెద్దలు ఈ మూడు పనుల్ని ఏయే విధాలుగా చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుంటాం.

^ పేరా 60 చిత్రాల వివరణ: ఇశ్రాయేలులోని ఒక కాపరి, తప్పిపోయిన గొర్రె కోసం ఆత్రంగా వెదుకుతున్నాడు. అది తిరిగి మంద దగ్గరికి రావడానికి సహాయం చేస్తున్నాడు. పెద్దలు కూడా సంఘానికి దూరమైన వాళ్లకు అలాంటి సహాయమే చేస్తారు.

^ పేరా 64 చిత్రాల వివరణ: సంఘానికి దూరమైన ఒక సహోదరి బస్సులో కూర్చొని, సంతోషంగా బహిరంగ సాక్ష్యంలో పాల్గొంటున్న ఇద్దరు సాక్షుల్ని చూస్తోంది.