కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 26

“నా దగ్గరికి తిరిగిరండి”

“నా దగ్గరికి తిరిగిరండి”

“నా దగ్గరికి తిరిగిరండి, అప్పుడు నేను మీ దగ్గరికి తిరిగొస్తాను.”—మలా. 3:7.

పాట 102 ‘బలహీనులకు సహాయం చేయండి’

ఈ ఆర్టికల్‌లో . . . *

1. సంఘానికి దూరమైన వాళ్లు తిరిగొచ్చినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

మందలోని ప్రతీ గొర్రెను శ్రద్ధగా చూసుకునే మంచి కాపరితో యెహోవా తనను పోల్చుకున్నాడని ముందటి ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. అంతేకాదు, తన మందకు దూరమైన గొర్రెల కోసం ఆయన జాగ్రత్తగా వెదుకుతాడని అర్థం చేసుకున్నాం. తనను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయులకు యెహోవా ఈ ఆహ్వానం ఇచ్చాడు: “నా దగ్గరికి తిరిగిరండి, అప్పుడు నేను మీ దగ్గరికి తిరిగొస్తాను.” తనకు దూరమైన వాళ్ల విషయంలో ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదు. ఎందుకంటే, ఆయన ‘మార్పులేనివాడు.’ (మలా. 3:6, 7) అలాంటివాళ్లు ఎవరైనా తిరిగొచ్చినప్పుడు యెహోవా, దేవదూతలు ఎంతో సంతోషిస్తారని యేసు చెప్పాడు.—లూకా 15:10, 32.

2. ఈ ఆర్టికల్‌లో ఏయే విషయాలు పరిశీలిస్తాం?

2 ఈ ఆర్టికల్‌లో, యేసు చెప్పిన మూడు ఉదాహరణల్ని పరిశీలిస్తాం. సంఘానికి దూరమైన వాళ్లకు సహాయం చేయడం గురించి అవి మనకు ఏ పాఠాలు నేర్పిస్తాయో తెలుసుకుంటాం. అంతేకాదు, వాళ్లకు సహాయం చేయాలంటే మనకు ఏ ముఖ్యమైన లక్షణాలు అవసరమో గమనిస్తాం. ఆ పనిలో ఎంత ఆనందం ఉందో అర్థం చేసుకుంటాం.

పోగొట్టుకున్న వెండి నాణెం కోసం వెదకడం

3-4. లూకా 15:8-10 లో ప్రస్తావించబడిన స్త్రీ, పోయిన వెండి నాణెం కోసం ఎందుకంత జాగ్రత్తగా వెదికింది?

3 యెహోవా దగ్గరికి తిరిగి రావాలనుకునే వాళ్లను వెదకడానికి మనం చాలా కష్టపడాలి. విలువైన వెండి నాణెం పోగొట్టుకున్న ఒక స్త్రీ గురించిన ఉదాహరణను యేసు చెప్పాడు. ఆ ఉదాహరణ ముఖ్యంగా, దాన్ని వెదకడానికి ఆమె ఎంత కష్టపడిందో వివరిస్తుంది.—లూకా 15:8-10 చదవండి.

4 పోయిన నాణెం దొరికినప్పుడు ఆ స్త్రీకి ఎలా అనిపించిందో యేసు వర్ణించాడు. ఆయన కాలంలో ఇశ్రాయేలు స్త్రీకి పెళ్లి అయినప్పుడు, తల్లి ఆమెకు పది వెండి నాణేలు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. ఆ స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణెం అందులోనిదే అయ్యుండవచ్చు. అయితే అది ఇంట్లో, ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుందనుకొని, ఆమె దీపం వెలిగించి చుట్టూ వెదికింది. కానీ అది కనిపించలేదు. పోయిన ఆ చిన్న నాణేన్ని కనిపెట్టడానికి దీపం వెలుతురు సరిపోయి ఉండకపోవచ్చు. చివరికి, ఆమె చాలా జాగ్రత్తగా ఇల్లంతా ఊడ్చింది. అప్పుడు చెత్తలో ఉన్న వెండి నాణెంపై దీపం వెలుతురు పడి, అది మెరుస్తూ కనిపించింది. దాంతో ఆ స్త్రీ హాయిగా ఊపిరి పీల్చుకుంది! స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్లను పిలిచి, పోయిన తన వెండి నాణెం దొరికిందని సంతోషంగా చెప్పింది.

5. సంఘానికి దూరమైన వాళ్లను వెదకడానికి ఎందుకు కష్టపడాల్సి రావచ్చు?

5 ఏదైనా పోయిన వస్తువును వెదకడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని యేసు ఉదాహరణ తెలియజేస్తోంది. అదేవిధంగా, సంఘానికి దూరమైన వాళ్లను వెదకడానికి మనం చాలా కష్టపడాల్సి రావచ్చు. వాళ్లు మీటింగ్స్‌, ప్రీచింగ్‌ మానేసి చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. వాళ్లు కొత్త ప్రాంతానికి మారిపోయి ఉండవచ్చు, కొత్త ప్రాంతంలోని సహోదరులకు వాళ్లు తెలిసుండకపోవచ్చు. ప్రస్తుతం, కొంతమంది నిష్క్రియులు యెహోవా దగ్గరికి తిరిగి రావాలని చాలా ఆశతో ఎదురుచూస్తున్నారు. సత్యారాధకులందరితో కలిసి యెహోవాను సేవించాలని వాళ్లు కోరుకుంటున్నారు. అయితే, వాళ్లకు మన సహాయం అవసరం.

6. నిష్క్రియులను వెదికే పనిలో సంఘంలోని వాళ్లందరూ ఎలా పాల్గొనవచ్చు?

6 నిష్క్రియులను వెదికే పనిలో ఎవరెవరు పాల్గొనవచ్చు? సంఘంలోని అందరూ, అంటే వాళ్ల కుటుంబ సభ్యులు, సంఘపెద్దలు, పయినీర్లు, ప్రచారకులు వాళ్లను వెదకడంలో సహాయం చేయవచ్చు. మీ స్నేహితులు లేదా, బంధువులు ఎవరైనా నిష్క్రియులు అయ్యారా? ఇంటింటి పరిచర్యలో గానీ, బహిరంగ సాక్ష్యంలో గానీ నిష్క్రియులు ఎవరైనా మీకు కనిపించారా? ఒకవేళ కనిపించినప్పుడు వాళ్లు తమ అడ్రస్‌ను లేదా ఫోన్‌ నంబరును స్థానిక పెద్దలకు తెలియజేయడానికి ఇష్టపడితే, ఆ వివరాల్ని తీసుకుని పెద్దలకు అందజేయండి.

7. థామస్‌ అనే సంఘపెద్ద మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

7 యెహోవా దగ్గరికి తిరిగి రావాలనుకునేవాళ్లను వెదికే బాధ్యత ముఖ్యంగా సంఘపెద్దలకు ఉంది. మరి వాళ్లు దాన్ని ఎలా చేయవచ్చు? స్పెయిన్‌లో ఉంటున్న థామస్‌ * అనే సంఘపెద్ద ఏం చెప్తున్నాడో గమనించండి. 40 కన్నా ఎక్కువమంది నిష్క్రియులు సంఘానికి తిరిగి రావడానికి ఆయన సహాయం చేశాడు. థామస్‌ ఇలా చెప్తున్నాడు: “మొదట, నిష్క్రియులతో పరిచయం ఉన్న సహోదరసహోదరీలను, ‘వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసా’ అని అడుగుతాను. లేదా ప్రచారకుల్ని, ‘ఒకప్పుడు మీటింగ్‌కి వచ్చి ఇప్పుడు మానేసినవాళ్లు ఎవరైనా గుర్తున్నారా’ అని అడుగుతాను. నిష్క్రియులను వెదకడంలో సహాయం చేస్తున్నామనే సంతోషంతో, ఇలాంటి ప్రశ్నలకు చాలామంది ఉత్సాహంగా జవాబిస్తుంటారు. తర్వాత, నేను నిష్క్రియులను కలవడానికి వెళ్లినప్పుడు, వాళ్ల పిల్లల గురించి, బంధువుల గురించి అడుగుతుంటాను. ఎందుకంటే, వాళ్లు ఒకప్పుడు తమ పిల్లల్ని కూడా మీటింగ్స్‌కి తీసుకొచ్చి ఉండవచ్చు, ఆ పిల్లలు ప్రచారకులు కూడా అయ్యుండవచ్చు. ఈ వివరాలు తెలుసుకుంటే, యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా వాళ్ల పిల్లలకు కూడా సహాయం చేయగలుగుతాం.”

తప్పిపోయిన యెహోవా పిల్లల్ని తిరిగి తీసుకురండి

8. లూకా 15:17-24 లోని ఉదాహరణలో, పశ్చాత్తాపపడుతున్న కుమారునితో తండ్రి ఎలా ప్రవర్తించాడు?

8 నిష్క్రియులకు సహాయం చేయాలంటే మనకు ఏ లక్షణాలు ఉండాలి? యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉదాహరణ నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం. (లూకా 15:17-24 చదవండి.) ఆ కుమారుడు తప్పు తెలుసుకొని ఇంటికి తిరిగి రావడం గురించి యేసు ఆ ఉదాహరణలో వివరించాడు. ఆ ఉదాహరణలోని తండ్రి తన కుమారుణ్ణి చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లి, అతన్ని కౌగిలించుకున్నాడు. అలా, తన కుమారుడిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానని చూపించాడు. కానీ ఆ కుమారుడు, తాను చేసిన తప్పుకు ఎంతో కుమిలిపోతూ, ఆయనకు కుమారునిగా ఉండే అర్హత తనకు లేదని చెప్పాడు. ఆ మాటలు విన్న తండ్రికి, తన కుమారుడు ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది. కుమారుడు ఇంటికి తిరిగొచ్చినందుకు తనకెంత సంతోషంగా ఉందో అతను అర్థం చేసుకోవాలని తండ్రి కోరుకున్నాడు. అంతేకాదు, అతన్ని ఒక దాసునిగా కాదుగానీ, తనకెంతో ఇష్టమైన కుమారునిగా స్వీకరిస్తున్నానని చూపించాలనుకున్నాడు. అందుకే ఆయన ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు, పశ్చాత్తాపపడుతున్న కుమారునికి శ్రేష్ఠమైన బట్టలు వేయించాడు.

9. నిష్క్రియులకు సహాయం చేయాలంటే మనకు ఏ లక్షణాలు అవసరం? (“ తిరిగి రావాలనుకునే వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు” అనే బాక్సు చూడండి.)

9 యెహోవా ఆ ఉదాహరణలోని తండ్రి లాంటివాడు. ఆయన నిష్క్రియులైన మన సహోదరసహోదరీల్ని ప్రేమిస్తున్నాడు, వాళ్లు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. యెహోవాను అనుకరించడం ద్వారా, వాళ్లు తిరిగొచ్చేలా మనం సహాయం చేయవచ్చు. అలా చేయాలంటే మనకు ఓర్పు, సహానుభూతి, ప్రేమ ఉండాలి. ఆ లక్షణాలు ఎందుకు అవసరం? వాటిని ఎలా చూపించవచ్చు?

10. యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా ఒక వ్యక్తికి సహాయం చేయాలంటే ఓర్పు ఎందుకు అవసరం?

10 ఒక వ్యక్తి యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి సమయం పడుతుంది కాబట్టి, మనకు ఓర్పు అవసరం. పెద్దలు, సంఘంలోని ఇతరులు ఎన్నోసార్లు కలిసిన తర్వాతే తాము మళ్లీ సంఘానికి రావడం మొదలుపెట్టామని ఒకప్పుడు నిష్క్రియులుగా ఉన్న చాలామంది చెప్పారు. ఆసియాకు చెందిన న్యాన్సీ అనే సహోదరి ఇలా రాసింది: “నాతో సన్నిహితంగా ఉండే ఒక సహోదరి నాకు చాలా సహాయం చేసింది. ఆమె నన్ను చెల్లిలా చూసుకుంది. మేమిద్దరం కలిసి సంతోషంగా గడిపిన సందర్భాల్ని గుర్తుచేసింది. నేను ఏదైనా చెప్పినప్పుడు ఓపిగ్గా వింది, అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇచ్చింది. ఆమె నాకు నిజమైన స్నేహితురాలిగా ఉంటూ, ఏ సమయంలోనైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది.”

11. తోటి విశ్వాసుల వల్ల ఇబ్బందిపడిన వాళ్లను ఓదార్చాలంటే సహానుభూతి ఎందుకు అవసరం?

11 సహానుభూతి మంచి ఆయింట్‌మెంట్‌ లాంటిది. మనసుకు తగిలిన గాయాల్ని మాన్పడానికి అది బాగా సహాయం చేస్తుంది. సంఘంలోని ఒకవ్యక్తి వల్ల ఇబ్బందిపడిన కొంతమంది నిష్క్రియులు, ఎన్నో ఏళ్లు గడిచిపోయినా ఆ కోపాన్ని, బాధను మనసులోనే ఉంచుకొని ఉండవచ్చు. దాంతో వాళ్లు సంఘానికి తిరిగి రావడానికి ఇష్టపడకపోవచ్చు. కొంతమంది తమకు అన్యాయం జరిగిందని అనుకోవచ్చు. కాబట్టి వాళ్లు చెప్పేది వినడానికి, వాళ్లను అర్థం చేసుకోవడానికి ఎవరో ఒకరి సహాయం అవసరం. (యాకో. 1:19) ఒకప్పుడు నిష్క్రియురాలిగా ఉన్న మారీయ ఇలా చెప్తోంది: “నా బాధను వినడానికి, నన్ను ఓదార్చడానికి, నాకు మంచి సలహాలు ఇచ్చి సహాయం చేయడానికి ఎవరైనా ఉంటే బావుండు అనిపించింది.”

12. యెహోవా ప్రేమను తాడుతో ఎందుకు పోల్చవచ్చు?

12 తన ప్రజల పట్ల యెహోవాకున్న ప్రేమను బైబిలు ఒక తాడుతో పోలుస్తోంది. ఆ పోలిక ఎందుకు సరైనది? ఈ ఉదాహరణ పరిశీలించండి: మీరు అలలతో భీకరంగా ఉన్న సముద్రంలో మునిగిపోతున్నట్టు ఊహించుకోండి. సరిగ్గా అప్పుడే ఎవరో వచ్చి ఒక లైఫ్‌ జాకెట్‌ని మీ వైపు విసిరారు. నీటిలో మునిగిపోకుండా తేలుతూ ఉండేందుకు అది మీకు సహాయం చేస్తుంది. కానీ మీరు ప్రాణాలతో బయటపడడానికి అది సరిపోదు. ఎందుకంటే, నీళ్లు చల్లగా ఉన్నాయి, త్వరగా మీరొక లైఫ్‌ బోట్‌ దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి, ఎవరోఒకరు తాడు విసిరి మిమ్మల్ని లైఫ్‌ బోట్‌ దగ్గరకు లాగాలి. ఒక సందర్భంలో యెహోవా, తన నుండి దూరంగా వెళ్లిపోయిన ఇశ్రాయేలీయుల గురించి ఇలా చెప్పాడు: ‘నేను ప్రేమ అనే తాళ్లతో వాళ్లను నడిపిస్తూ వచ్చాను.’ (హోషే. 11:4) అవును, సంఘానికి దూరంగా ఉంటూ సమస్యల్లో, ఆందోళనలో మునిగిపోతున్న తన సేవకులకు సహాయం చేయాలని దేవుడు ఇప్పటికీ అనుకుంటున్నాడు. వాళ్ల పట్ల తనకున్న ప్రేమను, వాళ్లకు సహాయం చేయాలనే తన కోరికను వాళ్లు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే, తన ప్రేమను వాళ్లకు తెలియజేయడానికి యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు.

13. సహోదర ప్రేమ ఇతరుల్ని యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా చేయగలదని తెలియజేసే అనుభవం చెప్పండి.

13 యెహోవాతోపాటు మనందరం వాళ్లను ప్రేమిస్తున్నామని నిష్క్రియులకు గుర్తు చేస్తూ ఉండడం ప్రాముఖ్యం. ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన పాబ్లో, 30 కన్నా ఎక్కువ సంవత్సరాలు సంఘానికి దూరంగా ఉన్నాడు. ఆయనిలా చెప్తున్నాడు: “ఒకరోజు ఉదయం నేను బయటికి వెళ్లబోతుండగా, ఒక పెద్ద వయసు సహోదరి నన్ను కలిసి చాలా ప్రేమగా మాట్లాడింది. నేను దుఃఖాన్ని ఆపుకోలేక చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. నాతో మాట్లాడడానికి యెహోవాయే ఆమెను పంపించినట్టు అనిపించిందని ఆమెకు చెప్పాను. యెహోవా దగ్గరికి తిరిగి రావాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.”

బలహీనులను ప్రేమతో ప్రోత్సహించండి

14. లూకా 15:4, 5 ప్రకారం, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి ఏం చేశాడు?

14 మనం నిష్క్రియులకు సహాయం చేస్తూ, వాళ్లను ప్రోత్సహిస్తూ ఉండాలి. యేసు ఉదాహరణలోని తప్పిపోయిన కుమారునిలాగే, వాళ్లు కూడా తీవ్రమైన బాధతో కుమిలిపోతుండవచ్చు. అంతేకాదు, సాతాను లోక ప్రభావం వల్ల వాళ్లు ఆధ్యాత్మికంగా బలహీనపడి ఉంటారు. కాబట్టి యెహోవా మీదున్న విశ్వాసాన్ని బలపర్చుకునేలా మనం వాళ్లకు సహాయం చేయాలి. తప్పిపోయిన గొర్రె ఉదాహరణలో, కాపరి గొర్రెను తన భుజాలపై మోసుకొని మంద దగ్గరకు తీసుకెళ్లినట్టు యేసు చెప్పాడు. అప్పటికే కాపరి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి ఎంతో సమయాన్ని, శక్తిని ధారపోశాడు. అయితే ఆ గొర్రె, మంద దగ్గరికి రాలేనంత బలహీనంగా ఉందని గుర్తించినప్పుడు, దాన్ని భుజాల మీద మోసుకొని తీసుకెళ్లాడు.—లూకా 15:4, 5 చదవండి.

15. యెహోవా దగ్గరికి తిరిగి రావాలనుకునే బలహీనులకు మనం ఏవిధంగా సహాయం చేయవచ్చు? (“ ఒక అద్భుతమైన బ్రోషురు” అనే బాక్సు చూడండి.)

15 కొన్ని సమస్యల వల్ల నిష్క్రియులు యెహోవా దగ్గరికి తిరిగి రాలేకపోతుండవచ్చు. కాబట్టి మన సమయాన్ని, శక్తిని ధారపోసి వాళ్లకు సహాయం చేయాలి. అయితే యెహోవా పవిత్రశక్తి, ఆయన వాక్యం, ప్రచురణల సహాయంతో వాళ్లను తిరిగి ఆధ్యాత్మికంగా బలపర్చగలం. (రోమా. 15:1) ఏవిధంగా? ఎంతోకాలం నుండి సంఘపెద్దగా సేవచేస్తున్న ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “యెహోవా దగ్గరికి తిరిగి రావాలని నిర్ణయించుకునే చాలామందికి, మరోసారి స్టడీ ఇవ్వాల్సి వస్తుంది.” * కాబట్టి నిష్క్రియుల్లో ఎవరికైనా స్టడీ ఇవ్వమని పెద్దలు మిమ్మల్ని అడిగితే సంతోషంగా అంగీకరించండి. ఆ సంఘపెద్ద ఇంకా ఇలా అంటున్నాడు: “నిష్క్రియులు తమ మనసువిప్పి అన్నీ చెప్పుకోవాలంటే స్టడీ ఇస్తున్న ప్రచారకులు మంచి స్నేహితులుగా ఉండాలి.”

పరలోకంలో, భూమ్మీద సంతోషం

16. మనకు దేవదూతల సహాయం ఉంటుందని ఎలా చెప్పవచ్చు?

16 యెహోవా దగ్గరికి తిరిగి రావాలనుకునే నిష్క్రియులను వెదికే పనిలో దేవదూతలు సహాయం చేస్తున్నారని ఎన్నో అనుభవాలు రుజువు చేస్తున్నాయి. (ప్రక. 14:6) ఉదాహరణకు ఈక్వెడార్‌లో ఉంటున్న సిల్వియో అనే సహోదరుడు, సంఘానికి తిరిగి వెళ్లేలా సహాయం చేయమని పట్టుదలగా ప్రార్థించాడు. ఆయన అలా ప్రార్థిస్తుండగానే, ఇద్దరు సంఘపెద్దలు ఆయన ఇంటికి వెళ్లారు. అంతేకాదు, ఆయనకు అవసరమైన సహాయాన్ని అందించారు.

17. నిష్క్రియులను యెహోవా దగ్గరికి చేర్చినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?

17 ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాళ్లకు, యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా సహాయం చేయడం మనకెంతో సంతోషాన్నిస్తుంది. పయినీరుగా సేవచేస్తున్న సాల్వడార్‌ అనే సహోదరుడు, నిష్క్రియులను వెదకడంపై ప్రత్యేక దృష్టి పెడుతుంటాడు. ఆయనిలా చెప్తున్నాడు: “యెహోవా దగ్గరికి తిరిగొచ్చిన నిష్క్రియుల గురించి ఆలోచించినప్పుడు సంతోషంతో నా కళ్లు చెమ్మగిల్లుతాయి. తన విలువైన సేవకుల్లో ఒకర్ని సాతాను లోకం నుండి కాపాడడానికి యెహోవా నన్ను ఉపయోగించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.”—అపొ. 20:35.

18. మీరు యెహోవా ప్రజలతో సహవసించడం మానేసివుంటే ఏ నమ్మకంతో ఉండవచ్చు?

18 మీరు యెహోవా ప్రజలతో సహవసించడం మానేసివుంటే, మీమీద యెహోవాకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదనే నమ్మకంతో ఉండండి. మీరు తన దగ్గరికి తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి తిరిగి రావడానికి మీరు కాస్త కృషి చేయాలి. తప్పిపోయిన కుమారుని ఉదాహరణలోని తండ్రిలాగే, యెహోవా కూడా మీరు ఎప్పటికైనా తిరిగొస్తారని ఎదురు చూస్తున్నాడు. మీరు తిరిగొస్తే ఆయన మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తాడు.

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

^ పేరా 5 సంఘానికి దూరంగా ఉంటున్నవాళ్లు తన దగ్గరికి తిరిగిరావాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన, “నా దగ్గరికి తిరిగిరండి” అని ఆహ్వానిస్తున్నాడు. అలా రావాలనుకునేవాళ్లను ప్రోత్సహించడానికి మనం చాలా కృషి చేయాలి. వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగిరావడానికి మనం ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

^ పేరా 7 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 15 దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి పుస్తకంలోని కొన్ని అధ్యాయాలు ఉపయోగించి స్టడీ ఇవ్వడం ద్వారా నిష్క్రియులకు సహాయం చేయవచ్చు; యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని కొన్ని అధ్యాయాలను స్టడీ చేయడం ద్వారా కూడా కొంతమంది నిష్క్రియులు ప్రయోజనం పొందారు. వాళ్లకు స్టడీ చేయడానికి ఎవరు తగినవాళ్లో సంఘ సేవా కమిటీ నిర్ణయిస్తుంది.

^ పేరా 68 చిత్రాల వివరణ: యెహోవా దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్న ఒక సహోదరునికి ముగ్గురు సహోదరులు సహాయం చేస్తున్నారు. ఆయనతో తరచూ మాట్లాడుతూ, ఆయన మీద ప్రేమ చూపిస్తూ, ఆయన చెప్పేది శ్రద్ధగా వింటూ వాళ్లు ఆయనకు సహాయం చేస్తున్నారు.