కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 27

మీ గురించి మీరు ఎక్కువగా అంచనా వేసుకోకండి

మీ గురించి మీరు ఎక్కువగా అంచనా వేసుకోకండి

‘మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. బదులుగా మంచి వివేచన ఉందని చూపించేలా అంచనా వేసుకోవాలి.’—రోమా. 12:3.

పాట 130 క్షమిస్తూ ఉండండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. ఫిలిప్పీయులు 2:3 లో ఏ సలహా ఉంది. దాన్ని పాటించడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి?

మనందరం యెహోవా ప్రమాణాలకు వినయంగా లోబడతాం. ఎందుకంటే, మనకేది మంచిదో ఆయనకే బాగా తెలుసని మనం అర్థంచేసుకున్నాం. (ఎఫె. 4:22-24) వినయం ఉంటే, మన ఇష్టం కన్నా యెహోవా ఇష్టానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అంతేకాదు, ఇతరులను మనకన్నా గొప్పవాళ్లుగా చూస్తాం. దానివల్ల యెహోవాకు, తోటి విశ్వాసులకు మంచి స్నేహితులమౌతాం.—ఫిలిప్పీయులు 2:3 చదవండి.

2. అపొస్తలుడైన పౌలు ఏం గుర్తించాడు? ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే, లోకంలోని ప్రజల్లాగే మనం కూడా గర్విష్ఠులుగా, స్వార్థపరులుగా తయారయ్యే అవకాశం ఉంది. * మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవులపై అలాంటివాళ్ల ప్రభావం పడిందని తెలుస్తోంది. అందుకే అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న క్రైస్తవులకు ఇలా రాశాడు: ‘మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. బదులుగా మంచి వివేచన ఉందని చూపించేలా అంచనా వేసుకోవాలి.’ (రోమా. 12:3) మన గురించి మనకు ఓ అంచనా ఉండడం తప్పు కాదని పౌలు గుర్తించాడు. అయితే, మన గురించి మనం ఎక్కువగా అంచనా వేసుకోకుండా ఉండాలంటే వినయం అవసరం. మన జీవితానికి సంబంధించిన మూడు రంగాల్లో, మనల్ని మనం ఎక్కువగా అంచనా వేసుకోకుండా ఉండడానికి వినయం ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆ మూడు రంగాలు ఏంటంటే: (1) వివాహ జీవితం, (2) సంస్థలో మనకున్న బాధ్యతలు, (3) సోషల్‌ మీడియాను ఉపయోగించే తీరు.

వివాహ జీవితంలో వినయం చూపించండి

3. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు రావడం ఎందుకు సహజం? గొడవలు వచ్చినప్పుడు కొంతమంది భార్యాభర్తలు ఏం చేస్తారు?

3 భార్యాభర్తలు సంతోషంగా కలిసుండాలనే ఉద్దేశంతో యెహోవా వివాహ ఏర్పాటును చేశాడు. అయితే, వాళ్లు కూడా అపరిపూర్ణులే కాబట్టి, అభిప్రాయభేదాలు రావడం సహజమే. నిజానికి, పెళ్లయినవాళ్లకు కొన్నిరకాల “శ్రమలు” వస్తాయని పౌలు రాశాడు. (1 కొరిం. 7:28) కొంతమంది భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటారు, దాంతో తాము ఒకరికొకరం సరిపోమని అనుకుంటారు. ఒకవేళ లోకస్థుల ప్రభావం వాళ్లమీద పడితే, విడాకులు తీసుకోవడమే సరైనదనే ముగింపుకు వస్తారు. అలాంటివాళ్లు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటారు, విడాకులు తీసుకుంటేనే సంతోషంగా ఉండగలమని అనుకుంటారు.

4. మనం ఎలాంటి నిర్ణయానికి రాకూడదు?

4 వివాహ జీవితం సంతోషంగా లేనంత మాత్రాన విడిపోవాలనే నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే, లైంగిక పాపం అనే కారణాన్ని బట్టి కాకుండా, వేరే కారణంతో విడాకులు ఇవ్వకూడదని బైబిలు చెప్తుంది. (మత్త. 5:32) కాబట్టి పౌలు చెప్పినలాంటి “శ్రమలు” వచ్చినప్పుడు మనం గర్వంతో ఇలా ఆలోచించకూడదు: ‘నా భర్త/భార్య నన్ను పట్టించుకోవట్లేదు. నా మీద ప్రేమ చూపించట్లేదు. వేరే వ్యక్తి అయితే నన్ను ఇంకా బాగా చూసుకుంటారేమో.’ ఇలా ఆలోచించడం స్వార్థం చూసుకోవడం కాదంటారా! లోకమైతే ఇలా చెప్తుంది: ‘నీ మనసు చెప్పేది చేయి. నీ సంతోషం చూసుకో. అవసరమైతే విడాకులైనా తీసుకో.’ కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.” (ఫిలి. 2:4) భార్యాభర్తలు విడిపోవాలని కాదుగానీ, వాళ్లు జీవితాంతం కలిసుండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మత్త. 19:6) మీరు మీ ఇష్టానికన్నా, తన ఇష్టానికి మొదటి స్థానం ఇవ్వాలని యెహోవా ఆశిస్తున్నాడు.

5. ఎఫెసీయులు 5:33 ప్రకారం, భార్యాభర్తలు ఒకరితోఒకరు ఎలా ఉండాలి?

5 భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. (ఎఫెసీయులు 5:33 చదవండి.) తీసుకోవడం గురించి కాదుగానీ, ఇవ్వడం గురించే ఎక్కువగా ఆలోచించాలని బైబిలు చెప్తోంది. (అపొ. 20:35) భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి వినయం సహాయం చేస్తుంది. వినయం ఉన్నవాళ్లు, తమ సంతోషం కన్నా తమ వివాహజత సంతోషం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.—1 కొరిం. 10:24.

వినయం గల భార్యాభర్తలు గొడవపడరు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు (6వ పేరా చూడండి)

6. స్టీవెన్‌, స్టిఫనీ మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

6 వినయం ఉండడం వల్ల చాలామంది క్రైస్తవ దంపతులు తమ వివాహ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఉదాహరణకు, స్టీవెన్‌ అనే భర్త ఇలా చెప్తున్నాడు: “భార్యాభర్తలు ఎప్పుడూ, ముఖ్యంగా సమస్యలు వచ్చినప్పుడు ఒక టీమ్‌లా కలిసుండాలి. ‘నాకు ఏది మంచిది?’ అని ఆలోచించే బదులు, ‘మాకు ఏది మంచిది?’ అని ఆలోచించాలి.” స్టీవెన్‌ చెప్పింది కరెక్ట్‌ అని ఆయన భార్య స్టిఫనీ అంటోంది. ఆమె ఇలా చెప్పింది: “ప్రతీ చిన్న విషయానికి వాదించేవాళ్లతో కలిసుండాలని ఎవ్వరూ కోరుకోరు. మా ఇద్దరికీ ఏదైనా అభిప్రాయభేదం వచ్చినప్పుడు, అసలు సమస్య ఏంటో గుర్తిస్తాం. తర్వాత ప్రార్థిస్తాం, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మాట్లాడుకుంటాం. మేం ఒకరిమీద ఒకరం దాడి చేసుకోం గానీ, ఇద్దరం కలిసి సమస్య మీద దాడి చేస్తాం.” అవును, తమ కన్నా తమ వివాహ జతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే దంపతుల జీవితం సంతోషంగా సాగుతుంది.

యెహోవాను “ఎప్పుడూ వినయంగా” సేవించండి

7. సహోదరులు ఏదైనా నియామకం పొందినప్పుడు ఎలాంటి స్ఫూర్తి చూపించాలి?

7 యెహోవా సేవలో మనకు దొరికే ఏ అవకాశాన్నైనా గొప్ప గౌరవంగా భావిస్తాం. (కీర్త. 27:4; 84:10) సహోదరులు ఎవరైనా యెహోవా సేవ మరింత ఎక్కువగా చేయడానికి ముందుకొస్తుంటే అది మెచ్చుకోదగినది. నిజానికి బైబిలు కూడా ఇలా చెప్తోంది: “ఒక వ్యక్తి పర్యవేక్షకుడు అవ్వడానికి కృషిచేస్తుంటే, అతను మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.” (1 తిమో. 3:1) అయితే వాళ్లు ఏదైనా నియామకం పొందినప్పుడు, తమ గురించి తాము గొప్పగా అనుకోకూడదు. (లూకా 17:7-10) తోటివాళ్లకు వినయంగా సహాయం చేయడమే వాళ్ల లక్ష్యమై ఉండాలి.—2 కొరిం. 12:15.

8. దియొత్రెఫే, ఉజ్జియా, అబ్షాలోము ఉదాహరణలు ఏం చూపిస్తున్నాయి?

8 బైబిలు కాలాల్లోని కొందరు, తమ గురించి తాము ఎక్కువగా అంచనా వేసుకున్నారు. దియొత్రెఫే వినయం చూపించకుండా సంఘంలో “ప్రముఖుడిగా ఉండాలని” కోరుకున్నాడు. (3 యోహాను 9) ఉజ్జియా గర్వంగా ప్రవర్తించి యెహోవా తనకు అప్పగించని పనిని చేశాడు. (2 దిన. 26:16-21) అబ్షాలోము రాజు అవ్వాలనే కోరికతో, ప్రజల అభిమానాన్ని పొందడానికి కుయుక్తిగా ప్రవర్తించాడు. (2 సమూ. 15:2-6) సొంత మహిమ కోసం ప్రాకులాడేవాళ్లను యెహోవా ఇష్టపడడని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. (సామె. 25:27) గర్వంతో, అహంకారంతో ప్రవర్తించేవాళ్లు ఎప్పటికైనా నాశనమౌతారు.—సామె. 16:18.

9. యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

9 కానీ యేసు ఎలా ప్రవర్తించాడో పరిశీలించండి. “ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాసరే, దేవుని స్థానాన్ని చేజిక్కించుకోవాలనే, ఆయనతో సమానంగా ఉండాలనే ఆలోచన కూడా రానివ్వలేదు.” (ఫిలి. 2:6) దేవుని తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ, యేసు తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోలేదు. ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీ అందరిలో ఎవరు తక్కువవాడిలా నడుచుకుంటాడో అతనే గొప్పవాడు.” (లూకా 9:48) యేసులా వినయంగా ఉండే పయినీర్లతో, సంఘ పరిచారకులతో, పెద్దలతో, ప్రాంతీయ పర్యవేక్షకులతో కలిసి పనిచేయడం ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా! మనకు వినయం ఉంటే ఇతరులను మరింత ఎక్కువగా ప్రేమిస్తాం. ఆ ప్రేమే దేవుని సేవకుల గుర్తింపని యేసు చెప్పాడు.—యోహా. 13:35.

10. సంఘంలో ఉన్న సమస్యల్ని పెద్దలు పట్టించుకోవట్లేదని మీకు అనిపిస్తే ఏం చేయాలి?

10 సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పెద్దలు పట్టించుకోవట్లేదని మీకు అనిపిస్తే ఏం చేయాలి? వాటి గురించి ఫిర్యాదు చేసే బదులు, నాయకత్వం వహిస్తున్న వాళ్లకు మద్దతిస్తూ వినయం చూపించాలి. (హెబ్రీ. 13:17) కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను అనుకుంటున్న సమస్యలు నిజంగా అంత పెద్దవా? వాటిని సరిచేయడానికి ఇదే సరైన సమయమా? వాటిని సరిచేయాల్సిన బాధ్యత నాదా? నేను నిజంగా సంఘ ఐక్యత కోసం కృషి చేస్తున్నానా, లేక నా సొంత మహిమ కోసం ప్రాకులాడుతున్నానా?’

బాధ్యతల్లో ఉన్న సహోదరులకు సామర్థ్యాలతోపాటు, వినయం కూడా ఉండాలి (11వ పేరా చూడండి) *

11. ఎఫెసీయులు 4:2, 3 ప్రకారం, మనం వినయం చూపిస్తే సంఘం ఎలా ఉంటుంది?

11 మనకు ఎన్ని సామర్థ్యాలు ఉన్నా, మనం చూపించే వినయాన్నే యెహోవా ఎక్కువ ప్రాముఖ్యంగా ఎంచుతాడు. మనం సాధించే ఫలితాల కన్నా, మన మధ్య ఉండే ఐక్యతనే ఆయన ఎక్కువ ఇష్టపడతాడు. కాబట్టి యెహోవా సేవను వినయంగా చేయడానికి శాయశక్తులా కృషిచేయండి. అలా చేస్తే, సంఘం ఐక్యంగా ఉండడానికి సహాయం చేసినవాళ్లౌతారు. (ఎఫెసీయులు 4:2, 3 చదవండి.) పరిచర్యలో చురుగ్గా పాల్గొనండి. ఇతరుల పట్ల దయ చూపించే అవకాశాల కోసం వెదకండి. సంఘంలో బాధ్యతలు ఉన్నవాళ్లకే కాదు, బాధ్యతలు లేనివాళ్లకు కూడా ఆతిథ్యం ఇవ్వండి. (మత్త. 6:1-4; లూకా 14:12-14) మీరు వినయం చూపిస్తూ సహోదరసహోదరీలతో కలిసి పనిచేస్తే, వాళ్లు మీ సామర్థ్యాలతో పాటు మీ వినయాన్ని కూడా గమనిస్తారు.

సోషల్‌ మీడియా ఉపయోగించేటప్పుడు వినయం చూపించండి

12. స్నేహితుల్ని సంపాదించుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది? వివరించండి.

12 మనం స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతూ సంతోషించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 133:1) యేసుకు కూడా మంచి స్నేహితులు ఉండేవాళ్లు. (యోహా. 15:15) నిజమైన స్నేహితులు ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో బైబిలు చెప్తుంది. (సామె. 17:17; 18:24) ఇతరులతో కలవకుండా వేరుగా ఉండడం మంచిది కాదని కూడా అది చెప్తుంది. (సామె. 18:1) ఎక్కువమంది స్నేహితుల్ని సంపాదించుకోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి సోషల్‌ మీడియా సహాయం చేస్తుందని చాలామంది అనుకుంటారు. అయితే సోషల్‌ మీడియా ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

13. సోషల్‌ మీడియా వాడే కొంతమంది ఒంటరితనానికి, కృంగుదలకు ఎందుకు గురౌతారు?

13 కొంతమంది, సోషల్‌ మీడియాలో ఇతరులు పెట్టే కామెంట్లు, ఫోటోలు చూస్తూ ఎక్కువ సమయం గడుపుతారు. అలాంటివాళ్లు ఒంటరితనానికి, కృంగుదలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకంటే, తాము సంతోషంగా ఉన్నామని చూపించే ఫోటోలను మాత్రమే చాలామంది సోషల్‌ మీడియాలో పెడుతుంటారు. అంటే వాళ్లూ, వాళ్ల స్నేహితులూ దిగిన మంచి ఫోటోలు, వాళ్లు వెళ్లిన అందమైన ప్రదేశాల చిత్రాలు పెడతారు. వాటిని చూసిన వ్యక్తి, తను వాళ్లలా ఆనందంగా గడపలేకపోతున్నానని అనుకునే అవకాశం ఉంది. 19 ఏళ్ల సహోదరి ఇలా చెప్తోంది: “శని, ఆదివారాల్లో చక్కగా ఎంజాయ్‌ చేసేవాళ్ల ఫోటోలను చూసినప్పుడు నాకు అసూయగా అనిపించేది. అందరూ సంతోషంగా గడుపుతుంటే నేను మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని అనిపించేది.”

14. సోషల్‌ మీడియాను వాడే విషయంలో 1 పేతురు 3:8 ఎలాంటి సలహా ఇస్తోంది?

14 అయితే, సోషల్‌ మీడియా వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది పెట్టే కామెంట్లు, ఫోటోలు, వీడియోలు గొప్పలకు పోతున్నట్లు ఉంటాయని మీరు గమనించారా? ఇతరులను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే వాళ్లు అలాంటివి పెడతారు. కొంతమందైతే, వాళ్ల ఫోటోలకు లేదా వేరేవాళ్ల ఫోటోలకు దురుసుగా-అసభ్యకరంగా ఉండే కామెంట్లు పెడతారు. కానీ మనం సోషల్‌ మీడియాను ఆ విధంగా వాడం. ఎందుకంటే వినయంగా ఉండాలని, తోటివాళ్లను గౌరవించాలని బైబిలు చెప్తుంది.—1 పేతురు 3:8 చదవండి.

మీరు సోషల్‌ మీడియాలో పెట్టే ఫోటోలు గొప్పలు చెప్పుకుంటున్నట్టు ఉన్నాయా? లేక మీరు వినయస్థులని చూపిస్తున్నాయా? (15వ పేరా చూడండి)

15. ఇతరుల కన్నా గొప్పగా కనిపించాలనే స్ఫూర్తిని పెంచుకోకుండా ఉండడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

15 మీరు సోషల్‌ మీడియా వాడుతుంటే ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘నా కామెంట్లు, ఫోటోలు, వీడియోలు నేను గొప్పలు చెప్పుకుంటున్నట్టు ఉన్నాయా? ఇతరులు నన్ను చూసి అసూయపడేలా ఉన్నాయా?’ బైబిలు ఇలా చెప్తుంది: “లోకంలో ఉన్న ప్రతీదానికి, అంటే శరీరాశ, నేత్రాశ, వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం అనేవాటికి మూలం తండ్రి కాదు, లోకమే.” (1 యోహా. 2:16) ఒక బైబిలు అనువాదం, “వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం” అనే పదబంధాన్ని ‘ఇతరులకన్నా ప్రాముఖ్యంగా కనిపించాలని కోరుకోవడం’ అని అనువదించింది. ఇతరులు తమను ప్రాముఖ్యంగా ఎంచాలని, పొగడాలని క్రైస్తవులు అనుకోరు. బైబిలు ఇస్తున్న ఈ సలహాను వాళ్లు పాటిస్తారు: “అహంకారంతో ఎదుటివాళ్లలో పోటీతత్వాన్ని కలిగించకుండా, ఒకరి మీద ఒకరం ఈర్ష్య పడకుండా ఉందాం.” (గల. 5:26) లోకం మాయలో పడి గర్వాన్ని, ఇతరుల కన్నా గొప్పగా కనిపించాలనే స్ఫూర్తిని పెంచుకోకుండా ఉండేందుకు వినయం మనకు సహాయం చేస్తుంది.

‘మంచి వివేచన ఉందని చూపించండి’

16. మనం గర్వాన్ని ఎందుకు పెంచుకోకూడదు?

16 మనం వినయాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే గర్విష్ఠులకు “మంచి వివేచన” ఉండదు. (రోమా. 12:3) గర్విష్ఠులు గొడవలకు ముందుంటారు, అహంకారంగా ప్రవర్తిస్తారు. వాళ్ల ఆలోచనల వల్ల, పనుల వల్ల వాళ్లే కాదు, ఇతరులు కూడా ఇబ్బందిపడతారు. వాళ్లు తమ ఆలోచనా తీరును మార్చుకోకపోతే, సాతాను వాళ్ల మనసులకు గుడ్డితనం కలుగజేసి పాడుచేస్తాడు. (2 కొరిం. 4:4; 11:3) కానీ వినయం గల వ్యక్తికి మంచి వివేచన ఉంటుంది. ఇతరులు ఎన్నో విషయాల్లో తన కన్నా గొప్పవాళ్లని అతను గుర్తిస్తాడు. కాబట్టి అందరికన్నా తానే గొప్పవాడినని అనుకోడు. (ఫిలి. 2:3) అంతేకాదు, “దేవుడు గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు, కానీ వినయస్థులకు అపారదయను అనుగ్రహిస్తాడు” అని అతను గుర్తుంచుకుంటాడు. (1 పేతు. 5:5) వివేచన గలవాళ్లు, యెహోవాకు వ్యతిరేకంగా నిలబడాలని అనుకోరు.

17. వినయంగా ఉండాలంటే ఏం చేయాలి?

17 మనం వినయంగా ఉండాలంటే, ‘పాత వ్యక్తిత్వాన్ని దాని అలవాట్లతో సహా తీసిపారేసి, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించమని’ బైబిలు ఇస్తున్న సలహాను పాటించాలి. అందుకోసం చాలా కృషిచేయాలి. యేసు జీవితాన్ని అధ్యయనం చేయాలి, ఆయన అడుగుజాడల్లో నడవడానికి వీలైనంత ఎక్కువగా ప్రయత్నించాలి. (కొలొ. 3:9, 10; 1 పేతు. 2:21) అలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. మనం వినయాన్ని అలవర్చుకుంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది; సంఘం ఐక్యంగా ఉంటుంది. అంతేకాదు, సోషల్‌ మీడియాను మనల్ని మనం గొప్పగా చూపించుకోవడానికి ఉపయోగించం. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందుతాం.

పాట 117 మంచితనం అనే లక్షణం

^ పేరా 5 మనం జీవిస్తున్న లోకంలో ఎక్కువగా గర్విష్ఠులు, స్వార్థపరులే ఉన్నారు. మనం వాళ్లలా తయారవ్వకుండా జాగ్రత్తపడాలి. మన గురించి మనం ఎక్కువ అంచనా వేసుకోకుండా, వినయంగా ఉండాల్సిన మూడు రంగాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 2 పదాల వివరణ: గర్వం ఉన్న వ్యక్తి, ఇతరుల కన్నా తాను చాలా గొప్పవాడినని అనుకుంటాడు. అలాంటివాళ్లు స్వార్థపరులుగా ఉంటారు. కానీ వినయం ఉన్న వ్యక్తి నిస్వార్థంగా ఉంటాడు. వినయం ఉన్నవాళ్లలో గర్వం ఉండదు; అలాంటివాళ్లు ఇతరులకన్నా తామే గొప్పవాళ్లమని అనుకోరు.

^ పేరా 56 చిత్రాల వివరణ: ఒక సంఘపెద్ద సమావేశంలో ప్రసంగిస్తున్నాడు, నిర్మాణ పనిని పర్యవేక్షిస్తున్నాడు. అంతేకాదు పరిచర్యను ముందుండి నడిపించడంలో, రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడంలో సంతోషంగా పాల్గొంటున్నాడు.